గీతులు – అనుబంధం 3

ఉత్సాహగీతి-1 – యతి లేక ప్రాసయతి బేసి పాదములకు ఐదవ గణముతో, సరి పాదములకు నాలుగవ గణముతో
బేసి పాదములు – (ఉత్సహ పాదము) సూ/సూ/సూ/సూ – సూ/సూ/ఇం, 7-64
సరి పాదములు – (తేటగీతి పాదము) సూ/ఇం/ఇం – సూ/సూ, 5-26

1) ప్రేమ యొక్క ధేనువైన – బ్రేమ పాలు ద్రాగితిన్
ప్రేమ వాయువులను నేను – బీల్చినాను
ప్రేమ యొక్క వేణువైన – బ్రేమగీతిఁ నూదితిన్
ప్రేమ దైవమైన మిగుల – వేఁడినాను

2) ప్రేమతోడ నన్ను బిలుచు – ప్రేమమూర్తి నీవెగా
రా మదీయ మానసమున – రసము చింద
ఆమని యిల నెల్ల వేళ – యందపు సెల నీవెగా
మోముపైన ముద్దు లిడుము – ముదము పొంద

3) ఆలయమ్ము చెంత భిక్ష – నడుగుచుంటి వాని నే
నాలకించంగ వాఁడు రాఁ-డాయె ముందు
కాలమెల్ల నిట్లు జగతి – గడచిపోవుచుండెఁగా
రాలు నా పండుటాకులా – రాలిపోదు

ఉత్సాహగీతి-2 – యతి లేక ప్రాసయతి బేసి పాదములకు ఐదవ గణముతో, సరి పాదములకు నాలుగవ గణముతో
బేసి పాదములు – (ఉత్సాహ పాదము) సూ/సూ/సూ/సూ – సూ/సూ/ఇం, 7-64
సరి పాదములు – (ఆటవెలది బేసి పాదము) సూ/సూ/సూ – ఇం/ఇం, 5-8

1) చూడు నింగిలోన శశిని – సోయగముల నిండఁగా
చూడు తారకలను – సొంపుల దండగా
చూడు నీదు నిండు మూర్తి – శోభతో మనస్సులో
నేఁడు నిండు వెలుఁగు – నిలుచుఁ దమస్సులో

2) అందమైన చందమామ – యాకసన వెలిఁగెఁగా
సుందర సఖు డిందుఁ – జొక్కిలం జెలఁగెఁగా
మంద మారుతమ్ము వీచి – మత్తు తావిఁ జల్లెఁగా
మందహాస మలర – మనసు రంజిల్లెఁగా

3) మోహన యనఁ దెలియకుండ – మోహమందుఁ బడితిఁగా
నూహలు బలు లేచె – నుత్సాహ గీతిగా
వాహినియయె భావములు ప్ర-వాహ మందుఁ నూగితిన్
దేహమందు క్రొత్త – దీప్తితో వెలిఁగితిన్

4) శిశిరఋతువులోన నిలుచు – చెట్టువోలె నుంటిఁగా
దిశల వెలుఁగు తగ్గెఁ – దిమిరమ్ము హెచ్చెఁగా
కృశితమయ్యె నాశ లెల్లఁ – కృపను జూపవేలకో
వశము జేసికొమ్ము – వసుధపై నను నీవు

లీలాషట్పద – యతి లేక ప్రాసయతి నాలుగవ గణముతో
బేసి పాదములు – సూ/సూ/సూ – సూ/సూ/సూ, 6-64
సరి పాదములు – సూ/సూ/సూ – సూ/సూ, 5-32

1) నింగిఁ జలువఱేఁడు – రంగు లిడెను నేఁడు
శృంగమందుఁ జూడు – సిరుల మంచు
చెంగలువల తావి – భృంగములకు నీవి
రంగఁ డూఁదుఁ గ్రోవి – రహిని ముంచు

2) ఆలమందఁ గాఁచు – బాలికలను దోఁచు
కూళల నిటె వ్రేఁచు – కోమలుండు
లీల మాటలాడు – చాల మేలమాడు
మాలఁ దాల్చు ఱేఁడు – మాధవుండు

3) రంగు లెన్నొ నిండి – రాగ మయ్యె రజని
పొంగిపోయి దివ్య – భోగ మాయె
రంగ తప్పకుండ – రయము చూడు, విమల
సంగ మీయ రమ్ము – సరస నేఁడు

4) పరుగు దీసె నదుల – స్వరపు ఝరులఁ జూడు
విరగబూసె తరులు – విరుల సిరుల
మరుడ నంటి నిన్ను – వరద యంటి నిజము
మరులు గొంటి నేను – మఱుగుచుంటి

నర్తకి గీతి – యతి లేక ప్రాసయతి నాలుగవ గణముతో
బేసి పాదములు – సూ/సూ/సూ – సూ/సూ/సూ, 6-64
సరి పాదములు – సూ/సూ/సూ – సూ/సూ, 5-32

1) మనసునందు నీవె – కనులయందు నీవె
స్వనములందు నీవె – వనజ నయన
నిను దలంచె మనసు – నిను దలంచె తనువు
నను దలంచి రార – వనజ నయన

2) చెరువులోని చేప – చిందులాడె మురిసి
అరుణకాంతిలోన – నతిగ మెఱిసి
సరసియందుఁ జూడ – విరిగఁ దోచె నదియు
తరువు లేని చోట – విరియు కదిలె

3) నీల వర్ణ మదియు – నేలనుండి కనఁగ
కాల వర్ణ మదియు – గగనమందు
వేల తార లిచ్చు – వెలుఁగు మినుకు లెల్ల
నేలఁ గనఁగ, లేదు – నింగియందు

అళిగీతి – యతి లేక ప్రాసయతి మూడవ గణముతో
బేసి పాదములు – ఇం/ఇం – సూ/సూ/సూ, 5-29
సరి పాదములు – ఇం/ఇం – సూ/సూ, 4-13

1) శశిబింబ మది నింగి – చారు కాంతి నుండె
స్పృశియించ హృది యెంచఁ – బ్రేమ నిండె
కృశమధ్య నయియుంటిఁ – గృష్ణ నిన్ను దల్చి
నిశిలోన హృదయమ్ము – నిన్ను బిల్చె

2) వలపులో నెకిమీఁడు – వాఁడు పూల వీడు
తలపులోఁ గవిరాజు – తరుణి జోడు
మలుపులో నున్నాఁడు – మధురమోహనుండు
పిలువఁగా వచ్చు నా – ప్రేమికుండు

3) వారిజాసను రాణి – వరవిపంచి మీటు
వారిజాక్షుని రాణి – వరము లిచ్చు
మారరిపువు పత్ని – మహిని జీవ మొసఁగు
వారు బ్రోచెద రెప్డు – వఱలి వెలయ

4) సుమరాశి యళిగీతి – సోలి వినుచు నూఁగె
కమనీయమగు వేళ – గాలి యూఁగె
విమల రాగమ్ములో – వేయి సడులు లేచె
రమణీయ ఋతువులో – రమణి వేఁచె

5) చెలువమే నిండఁగా – శిలయు పాడు నేఁడు
నెలరాజు నిండఁగా – నెలఁత యాడు
అళిపాళి కేశమ్ము – లలర విరులు జారె
చెలి పాడె నళిగీతి – సెలలు పారె

6) వీణపై వేవేగ – వ్రేళ్లతోడ మీటి
తానమ్ము పాడు నా – తరుణమందు
గానమందాకినిన్ – గడుముదమ్ము నిండ
స్నానమ్ము జేసితిన్ – సంతసాన

ఆటగీతి లేక సరసగీతి – యతి లేక ప్రాసయతి మూడవ గణముతో
బేసి పాదములు – సూ/ఇం – ఇం/సూ/సూ, 5-26
సరి పాదములు – సూ/ఇం – ఇం/సూ, 4-10

1) ఈ వసంతమ్ము – హృదయమ్ము నలర జేసెఁ
బ్రోవులై పూలు – భూమిపై నిండె
రా వినఁగ నాదు – రమ్యమౌ యాటగీతి
ఈ వలపుమేడ – యిదె నిన్ను బిల్చె

2) కమలములు బూచె – కమలాకరమ్ములందు
విమల శుక్రుండు – వినువీథియందు
భ్రమరములు గ్రోలె – వనజాళి మధుర మధువు
లమలమయ మాయె – నరుణాంశ వధువు

3) మనసులో నున్న – మమతలు తక్కువాయె
మనసులో బాధ – మఱి యెక్కువాయె
తనువులో నున్న – దపనయుఁ దగ్గకుండె
వినుము మనసిందు – విరహాన నుండె

4) కెంజెలువమందు – కిటికీకిఁ గ్రిందఁ బాట
రంజిలం జేసె – రమ్యమై నన్ను
కంజలోచనా – కామాగ్ని గాల్చె నన్ను
సంజలో నిట్లు – చాలించు వేఁట

5) స్వరము వాయించు – సౌందర్య జగతియందు
మురళి మ్రోయించు – మోదముం జిలుక
పరుగు లిడు నవ్య – భావాలు మనసునందు
తరగ లుప్పొంగి – తాళమై పలుక

6) చూడు తారకల్ – సొబగుతో వెలిఁగెఁ గాంతి
నేడు మాయింట – నెలఱేఁడు విరిసె
పాడె నా వాణి – పగడాల వీణ తంతి
నాడె నెమలి తా – నందాల మురిసె

7) తెల్ల పిల్లిలా – తేట వెన్నెలగ రావె
మెల్లమెల్లగా – మేఘాల రావె
కల్వ పూరేకు – కనుల మూయంగ రావె
చల్లఁగా నిద్ర – స్పర్శించి పోవె

8) కలరవమ్ములఁ – గల్గించె పులుగు లెందు
తొలగె చీకట్ల – దుప్పట్ల తెరలు
కలల పొగమంచు – కరిగె లేవెలుఁగులందు
నలరె నుషరాణి – యాకాశమందు

9) మనసు మనసుతో – మాటాడె “ఆర్యు ఓకె?”
తనువులో శక్తి – తరగగాఁ బ్రాకె
చినుకులై ప్రేమ – చిందెఁగా “హ్యాప్పి” యంచు
క్షణములోఁ జేరె – గగనంపు టంచు

10) పాడ వేలకో – ప్రణయంపు ప్రథమగీతి
మూఁడు భువనాలు – ముగ్ధమై పోవ
ఆడ వేలకో – యందాల నటనరీతి
ఏడు లోకమ్ము – లేకమై పోవ

11) ముదముతోఁ బాడు – మోహన మధురగీతి
పదము లన్నియుఁ – బరవశ మ్మవఁగ
వెదురు గ్రోవితో – వినిపించు సరసగీతి
మదియు మాయలో – మఱచి పోవంగ

తేనెగీతి – బేసి పాదములకు యతి లేక ప్రాసయతి నాలుగవ గణముతో
బేసి పాదములు – సూ/ఇం/ఇం – సూ/సూ, 5-26
సరి పాదములు – సూ/ఇం /ఇం, 3-2

1) ఎన్ని మంత్రముల్ జదివిన – నేమి ఫలము
నిన్ను జూడంగఁ గాలేదు
ఎన్ని తేనెగీతులఁ బాడ – నేమి ఫలము
నిన్ను తృప్తి పఱచలేను

2) చూడు మావైపు వినువీథి – సోయగాలు
చూడు మీవైపు మేఘాలు
చూడు మావైపు గగనాన – సూర్యకాంతి
చూడు మీవైపు హరివిల్లు

3) వెలసె గగనాన నీ సంధ్య – వేఁగుఁజుక్క
వెలిగె రాణిగా రమ్యమై
వెలసె మనసులో నీ సంధ్యఁ – దలఁపు చుక్క
వెలిగె డెంద మానందమై

4) మఱచిపోవలె ననుకొంటి – మనసులోన
మఱచిపోలేను నే నిన్ను
తెరువు వేరనుకొంటి నే – నిరువురకును
తెరువు నీదియే నాదాయె

ఆటవెలఁది – 5-8 / 5-32 సూ/సూ/సూ – ఇం/ఇం
సూ/సూ/సూ – సూ/సూ

1) ఆటవెలఁది యాడె – నందమ్ము నిండఁగా
నీటుగాను జూపె – నిగ్గు లెన్నొ
తేటగీతిఁ బాడెఁ – దియ్యఁగా నయముగా
మేటియైన రవము – మేడ నిండె
నాట్యరాణి – బేసి పాదములకు యతి లేక ప్రాసయతి నాలుగవ గణముతో, సరి పాదములకు యతి లేక ప్రాసయతి మూడవ గణముతో
బేసి పాదములు – సూ/సూ/సూ – ఇం/ఇం, 5-8
సరి పాదములు – సూ/సూ – ఇం/ఇం, 4-4

1) రమ్ము నాట్యరాణి – రమణీయ రాగిణీ
రమ్ము వేగ – రజతాద్రి యోగినీ
రమ్ము గానగంగ – రసభంగలోలినీ
రమ్ము సరస – రత్నాంగి మాలినీ

2) అలల కడలిపైన – నందాల నావలో
గలరవాన – గమ్మఁగా బాడనా
లలితలలితమైన – లాస్యంపు భావాల
చలనములకుఁ – జక్కఁగా నాడనా

3) నీవు రాక నాకు – నిదురయే లేదురా
నీవు లేక – నిదురయే రాదురా
జీవమున్న కూడ – చేవయే లేదురా
నీవు లేక – నేనిందు లేనురా

4) చందనమ్ము వద్దు – స్వర్ణహారము వద్దు
నందనమున – నవ పుష్పములు వద్దు
యిందురశ్మిలోని – యింపుసొంపులు వద్దు
ముందు వచ్చి – మోవి కిమ్మొక ముద్దు

సుషమగీతి – యతి లేక ప్రాసయతి మూడవ గణముతో
బేసి పాదములు – సూ/ఇం – సూ/ఇం/ఇం, 5-6
సరి పాదములు – సూ/ఇం – సూ/ఇం, 4-6

1) పగలు రేతిరి – పనుల తొందర ముంచఁగా
సగము కాలము – జారిపోయెను
మిగులు కాలము – మేను వాల్చఁ దలంచఁగా
రగులు నీ హృది – రగిలి యారును

2) జగము మాయయా – జగము మిథ్యయా చిత్తమా
జగము సత్యమా – జగము నిత్యమా
సొగయు యెదలోన – సొగసు నింపఁగా సాధ్యమా
మిగులు బూది నా – మేన నలఁదనా

3) మఱల వచ్చె నీ – మధుర రజనిలో వెన్నెల
మఱల వచ్చె నా – మౌన తారలే
మఱల తెచ్చె నా – మధుర గంధమున్ క్రొన్నన
మఱల రానిదో – మఱలి రానిదో …

4) ఏమి పాడనో – శ్యామవేళలోఁ జెప్పవా
ప్రేమగీతమే – స్వామి యుండఁగా
ఏమి యాటలో – శ్యామవేళలోఁ జెప్పవా
ప్రేమనాట్యమే – స్వామి యుండఁగా

5) ననల కోరిక – నవ్వి విరియుట యందమై
మనసు కోరిక – మమత విరియుట
కనుల కోరిక – కాంచి మురియుట సుందరున్
తనువు కోరిక – తపన తీరుట

6) సుషమగీతమ్ముఁ – జొక్కి పాడనా మధురమై
యసమరీతిలో – నాడి చూపనా
రసము లొలుకఁగా – రాత్రివేళలో రమ్యమై
పసిఁడి వెన్నెలన్ – బాల నీయనా

రాసగీతి * – బేసి పాదములకు యతి లేక ప్రాసయతి మూడవ గణముతో
బేసి పాదములు – సూ/సూ – సూ/సూ, 4-16
సరి పాదములు – సూ/సూ/సూ, 3-8

1) రాసగీతి – రాత్రివేళ
నాసతోడఁ బాడు
లాస మాడు – రాసలీల
హాసరుచుల నాడు

2) హరికి పేరు – హర్ష మగును
సిరికి నిరవు వాఁడు
సరస నుండ – సరస మగును
సురవములకు వీడు

3) ఆననమ్ము – సూనమైన
రాణఁ దావి వెడలు
మానసమ్ము – వీణయైన
గాన మగును దడలు

4) సింధువందు – బిందు వొకటి
చింది యాడుచుండె
బిందువు లగు – సింధువుగను
ముందు సాగుచుండు

అరుణగీతి లేక సూర్యకాంతి లేక మిలనము – బేసి పాదములకు యతి లేక ప్రాసయతి మూడవ గణముతో
బేసి పాదములు – సూ/సూ – సూ/సూ, 4-16
సరి పాదములు – సూ/సూ/ఇం, 3-4

1) నీలమైన – నింగిలోన
బాలచంద్రుఁ గన రార
చాలుచాలు – జాల మింక
పాలు ద్రాగి పడుకోర

2) చక్కనమ్మ – సన్నగిల్లె
జిక్కిపోయె నాంచారు
ఎక్కడుండె – నెడఁద యకట
చెక్కిలిపయి కన్నీరు

3) అరుణరాగ – మవని నిండె
నరుణగీతి పాడనా
తరుణ హృదియుఁ – దపన మండె
దరుణి నిన్ను వేడనా

4) సుందరమగు – సూర్యకాంతి
వంద విరులు వికసించె
మందపవన-మందుఁ దేలి
వంద సిరులఁ బ్రకటించె

5) సుమము లుండు – సొబగు తోట
భ్రమరభరితమై యొప్పు
మమత లుండు – మనసు నిక్క
మమృతభరితమై యొప్పు

6) సుందరమగు – సూర్యకాంతి
చిందె నుదయవేళలో
నందమైన – యబ్జముల సు-
గంధ మెగసె గాలిలో

7) కనులలోని – గాంతి నీవె
మనసులోని శాంతి రా
తనువులోని – దాప మీవె
వనిత నీకు కోపమా

8) కవిని నేను – గవిత నీవు
కవిత నల్లుదాము రా
నవత నిండు – నడకతోడ
భువిని దివిని గలుపఁగా

9) బాధ లేని – బ్రదుకు లేదు
గాథ లుండు తరచఁగా
వీథి వీథి – వెదకుచుంటి
నాథుఁ డెవరు బ్రదుకులో

10) గగనమందుఁ – గఠిన శిలగ
మిగిలె శశియు నడిరేయి
సగము రేయి – సాఁగిపోయె
సుగము లేని దీ రేయి

11) విన్నవింతుఁ – జిన్న యాస
కన్న నీవు వినుమయ్య
నిన్ను జూడ – నెన్నుచుందు
కన్నె మనము గనుమయ్య

12) లలితమైన – లతలు పూచె
లలిత వనమునన్
పిలువఁ డేల – వలపుతోడ
కలల ఱేఁడు నన్
తలుపువద్ద – నిలిచియుంటి
తళమళమ్ముతో
తలపు లన్ని – మెలిక లయెను
మిలనవేళలో

13) వెలుగులేని – విశ్వమందు
నలుపు తెలుపయెన్
కలత నిదుర – గనుల మూయ
గలలు కఱువయెన్
వలపులేని – బ్రదుకునందు
వలలు బిగువయెన్
జెలిమిలేని – జీవితమున
శిలయె చెలియయెన్

14) ప్రేమలేని – హృదయమందు
స్వామి లేదుగా
స్వామిలేని – జగములోన
నేమి లేదుగా
ప్రేమ వాణి – విశ్వమందు
స్వామి పల్కునే
ప్రేమ పేరు – స్వామి యౌను
స్వామి ప్రేమయే

నందగీతి – యతి లేక ప్రాసయతి మూడవ గణముతో
బేసి పాదములు – ఇం/ఇం – ఇం/సూ, 4-9
సరి పాదములు – ఇం/ఇం – సూ/సూ, 4-13

1) జాబిల్లి వెలుఁగులోఁ – జలి వేయుచుండె
నా బుల్లి పాపాయి – నవ్వుచుండె
డాబాయె స్వర్గంపు – టద్దాల దారి
పూబంతు లాడంగ – పులకఁ జేరి

2) రజతంపు గిన్నెలో – రత్నాల దివ్వె
వ్రజమందు కృష్ణుండు – రమణ నవ్వె
సృజియించు నవమైన – సృష్టిగా నాట
భుజియించు మీఁగడల్ – ముద్దు నోట

3) సాగర తీరము – సైకతమయము
ఆగని యలలకు – నడ్డు కట్ట
సాగుచునుండెను – జవనము రయము
ప్రోగులు నిండెను – పూల బుట్ట
(జవనము=గుఱ్ఱము)

4) నవ నందగీతమ్ము – నయముగాఁ బాడ
భువనైకరూపుండు – ముదము నాడ
నవరాగ రసపూర్ణ – నాదమ్ము మ్రోఁగె
కవనమ్ము మది లేచెఁ – గాల మాఁగె

కనకాంగి లేక అనామిక – బేసి పాదములకు యతి లేక ప్రాసయతి మూడవ గణముతో
బేసి పాదములు – ఇం/ఇం – ఇం/సూ, 4-9
సరి పాదములు – ఇం/ఇం/సూ, 3-5

1) కలలోన వత్తువే – కనకాంగి నీవు
యిలలోన ననుజూడ రావు
లలితాంగి రావేల – లాలించ నన్ను
కలలౌను నిజముగాఁ జెన్ను

2) కలహంస నవనాట్య – కళతోడ రమ్ము
కలరవమ్ముల మోద మిమ్ము
శిలలోన చలనమ్ము – శీఘ్రమ్ము వచ్చుఁ
దులలేని యానంద మిచ్చు

3) రాగాల కంపనన్ – రావేల దరికి
భోగాల యమృతమ్ము జిలికి
తూఁగుటుయ్యెల పిల్చెఁ – దూఁగ రావేల
రాగిణీ పాడవా జోల

4) ఆనంద తీరాల – కటువైపు నుంటి
నే నిన్ను రా వేగ యంటి
సానంద గీతాలఁ – జక్కఁగాఁ బాడు
నే నాట్య మాడెదన్ నేఁడు

5) మనసులో నగ్గి నన్ – మసిజేయ మున్ను
వనజాక్షి చూడుమా నన్ను
యెనలేని యాశతో – నెగురుదా మిపుడు
మనమింక సుఖజీవు లెపుడు

6) ప్రేమాగ్ని శిఖలలో – వేఁగాను నేను
కామాగ్ని మండించె నన్ను
మోము జూపించవా – మోహినీ యిందు
యీ మంగళాహ్నమ్మునందు

7) నీటిలో మునిగాను – నేనీఁద జాల
నేఁటితో నారు నీ జ్వాల
చోటు నీవీయవా – సుదతి నీ ప్రక్క
యాటాడ కగు గుండె ముక్క

7) ఓ యనామిక యెట్టు – లుద్భవించితివి
నా యీ మనస్సులో నేఁడు
ఓ యనామిక నీవు – రాయంచవోలె
నా యీ సరస్సులో నీఁదు
ఓ యనామిక నాదు – యుల్లమ్ములోన
మాయమ్ము గాకుండ నుండు
ఓ యనామిక నీకు – నుంగర మ్మొకటి
వేయంగ నెంచితిన్ రమ్ము

8) ఎందాక పోదాము – ఎందాక చెప్పు
ఎందాక ఎందాక చెప్పు
అందాక ఆకాశ – మందాక మనము
అందుండు మేఘాల దాక
అందాక నక్షత్ర – హారాల దాక
అందాక హరివిల్లు దాక
అందాక నవకాంతి – యాకరమ్ములకు
అందాక సృష్ట్యాది వఱకు

9) చిన్నారి యేడ్చెఁగాఁ – జింద కన్నీళ్లు
అన్నమ్ముకై యింటఁ జూడు
కన్నీరు తుడువరా – కరముతో నీవు
కన్నయ్య తినిపించు బువ్వ
సన్న బియ్యము వద్దు – శాకమ్ము వద్దు
యిన్ని గింజలు చాలు మాకు
చిన్న పాకయు పాత – చీర యొక్కటియు
దున్న నొక్కెకరమ్ము చాలు

రేయెండ లేక నెలరేక – యతి లేక ప్రాసయతి మూడవ గణముతో
బేసి పాదములు – ఇం/ఇం – ఇం/సూ, 4-9
సరి పాదములు – ఇం/ఇం – ఇం, 3-1

1) మల్లియ తావియో – మనసులో – మమత
తెల్లని రేయెండ – దీప్తియో
చల్లని మృదువైన – స్పర్శయో – బ్రమత
జల్లుగా వర్షించు – జ్ఞప్తియో

2) నడురాత్రి నెలరాజు – నగవుతో – నన్ను
గడు శోభలన్ బిల్చెఁ – గవ్వించి
నిడుదయౌ రాత్రిలో – నిక్కమై – నిన్ను
విడలేను లలి దివ్వె – వెల్గించి

3) చెంత రాకుండఁగా – శిలయైతిఁ – జింతఁ
బంత మెందుల కిట్లు – పాలించు
భ్రాంతితో నిండె నీ – బ్రదుకంత – వంత
శాంతి లేదిది నీవు – చాలించు

4) కలలకు నెలవులా – కామినీ – కనులు
చెలువపు శిల్పమై – చేర రా
మిలమిల తారలా – మింటిలో – మణులు
సెలవలె నమృతమ్ము – చిమ్మ రా

5) తలతును నిన్ను నేఁ – దపనలోఁ – దడిసి
పిలుతును నిన్ను నే – బ్రేమతో
వలపుల రాణి నీ-వందును – వడిసి
కులుకుచు ముందు రా – కూర్మితో

6) నీవున్న చోటులోఁ – బూవులే పూయు
రావే వసంతాల – రాగిణీ
నీవాడు మాటలో – నెలరేక రాలు
రావే నిరీక్షింతు – రాక నేన్
నీ వన్నె నవ్వులో – నెఱయుఁ గావ్యాలు
రావేల గీతాల రాగమై
నా విశ్వమోహినీ- భావాల మూర్తి
రా వింత పద్యాల – రచనకై

7) రాముఁడు రవికుల – సోముఁడు వాఁడు
భీముఁడు భండన – భీముఁడై
కాముఁడు దేవికిఁ – గాముని దండ్రి
వ్యోమము నిండిన – దేముఁడై
భూమికి నొడయఁడు – కోమల వరుఁడు
శ్యామల వర్ణుఁడు – దాముఁడై
నా మనమందున – స్వామియు నిండె
ధీమతిఁ గొల్తును – బ్రేమతో

చెలిమిగీతి – యతి లేక ప్రాసయతి మూడవ గణముతో
బేసి పాదములు – సూ/ఇం – సూ/ఇం, 4-6
సరి పాదములు – సూ/ఇం – ఇం/సూ/సూ, 5-26

1) కనులు కలియఁగా – తనువు విరియఁగా
మనసు మురియఁగా – మౌన మింకేల బేల
కలలు కలియఁగా – తలఁపు విరియఁగా
పలుకు మురియఁగా – పాడు సిగ్గేల చాల

2) వలపు కలియఁగా – చెలిమి విరియఁగా
కలిమి మురియఁగా – కనుల నీళ్లేల బాల
ముదము కలియఁగా – పదము విరియఁగా
హృదులు మురియఁగా – నిట్లు చింతింతు వేల

3) మట్టి నాడఁగ – చిట్టి బుడుతలు
చెట్టు కొమ్మల – చిలిపిగాఁ పిట్ట పాడె
గుట్టఁ గూడిరి – కోమలాంగులు
పట్ట పగలున – వన్నెగా పటము లాడె

4) నీల గిరులపై – నీల మేఘముల్
నీల సరితపై – నిండుగా నలల సడులు
చాల ముదములో – తాళ రాగముల్
నీల మోహనా – నిను గాంచ నెడఁద ముడులు

కలువ గీతి – బేసి పాదములకు యతి లేక ప్రాసయతి మూడవ గణముతో
బేసి పాదములు – సూ/ఇం – సూ/ఇం, 4-6
సరి పాదములు – సూ/ఇం/ఇం, 3-2

1) చల్ల గాలిలో – సంధ్యవేళలో
నుల్ల మలరఁగా డోలలో
మెల్లమెల్లఁగా – మేను మఱువఁగా
త్రుళ్లి యూఁగ రా హరువుగా

2) తెలుఁగుతోటలోఁ – దెల్ల పువ్వుగా
వెలుఁగుబాటలో దివ్వెగా
లలిత లలితమై – లలన నవ్వఁగా
గళము విప్ప రా పాడఁగా

3) సంద్రమందలి – సడుల పొంగులు
చంద్రసోదరి సొంపులో
మంద్ర గానపు – మధుర రవములు
ఆంధ్ర భాషకు వంపులో

4) మనసు పలికిన – మౌన రాగము
వినఁగ వేఁచుచు నుంటివో
కనులు వ్రాసిన – కావ్య గాథను
గనులఁ జదువఁగ నుంటివో

5) నీవె నాకెల్ల – నీవె నా యెల్ల
నీవె యుల్లంపు దీప్తివై
భావమందుండు – భాషయందుండు
రావమై రమ్ము రక్తివై

6) కలువ గీతిని – చలువ మిన్నయు
బిలుపు లంచును దలఁచెనో
వెలుఁగు వెన్నెల – విరఁగబూయఁగఁ
గలువ డెందము వలచెనో

విరులసరము – (విలోమ సీసము) యతి లేక ప్రాసయతి ప్రతి అర్ధ పాదములో మూడవ గణముతో
బేసి పాదములు – సూ/సూ – ఇం/ఇం, 4-4
సరి పాదములు – ఇం/ఇం – ఇం/ఇం, 4-1

1) నీవు లేక – నిముసమ్ము యుగమాయె
నీవు రా ననుఁ జూడ – నిముసమే యుగమౌను
నీవు లేక – నెలరాజు వలదురా
నీవు రా ననుఁ జూడ – నెలరాజు నీవెరా
నీవు లేక – నిదురయే రాదురా
నీవు రా ననుఁ జూడ – నిదురయే వద్దురా
నీవు లేక – నృత్య గీతము లేల
నీవు రా ననుఁ జూడ – నృతినాడు హృదయమ్ము

2) ఎన్ని రంగు – లీనింగిలో నేఁడు
వన్నెతో నలరారె – వర్ణచిత్రమువోలె
ఎన్ని మబ్బు – లీనింగిలో నేఁడు
కన్నె కందోయిలో – కారుకాటుకవోలె
ఎన్ని పులుఁగు – లీనింగిలో నేఁడు
చెన్నుగా నమ్ములా – చేరి యెగిరేనుగా
ఇన్ని వన్నె – లిట్టు లీ విధముగా
నెన్న నాలేఖకుం – డెవ్వరో చిత్రించె

3) సరసమయము – చారుహాసము నీది
మురిసె నా డెందమ్ము – పురి విప్పు నెమలిలా
విరుల సరము – ప్రియ నేను జూడఁగా
హరుసంపు గంధమ్ము – వ్యాపించె మనసులో
సిరుల పాట – శ్రీరాగ మాలించ
ఝరివోలె పారెనే – స్వరరాగ సుధలిందు
యిరవు నాది – యిఁక నొక్క స్వర్గమ్మె
కురిపించు నందమ్ము – గుడివోలె నమలమ్ము

పై పద్యమును తీసికొని రెండేసి గణములను వెనుకనుండి వ్రాస్తే అది సీసమవుతుంది –

పురి విప్పు నెమలిలా – మురిసె నా డెందమ్ము
చారుహాసము నీది – సరసమయము
వ్యాపించె మనసులో – హరుసంపు గంధమ్ము
ప్రియ నేను జూడఁగా – విరుల సరము
స్వరరాగ సుధలిందు – ఝరివోలె పారెనే
శ్రీరాగ మాలించ – సిరుల పాట
గుడివోలె నమలమ్ము – కురిపించు నందమ్ము
యిఁక నొక్క స్వర్గమ్మె – యిరవు నాది

మోహనగీతి * – యతి లేక ప్రాసయతి మూడవ గణముతో
బేసి పాదములు – ఇం/ఇం – ఇం/ఇం, 4-1
సరి పాదములు – ఇం/ఇం – ఇం/సూ, 4-9

1) పులకించి పాడితి – మోహన గీతిని
తిలకించ రా నను – దేహము పిలిచె
కలిగించు మోదముఁ – గలికికి వేగము
వెలిగించు దీపము – ప్రియముగ హృదిని

2) స్వరముల నేటితో – పలుపలు రాగముల్
చెరలుచుఁ బాడఁగాఁ – జిందును సుధలు
కరుగును వెన్నయై – కలలకు వన్నెయై
వఱలును డెందమ్ము – పరవశమొంది

3) అనిశమ్ము వెదుకఁగా – నవనిపై బలు చోట్ల
కనుగొంటిఁ గనుగొంటి – కమలాక్షు నేను
కనరాఁడు నింగిలోఁ – గనరాఁడు జలధిలో
కనుగొంటి హృదిలోన – గరివేల్పు నేను

సాంగత్యము * – బేసి పాదములకు యతి లేక ప్రాసయతి మూడవ గణముతో
బేసి పాదములు – ఇం/ఇం – ఇం/ఇం, 4-1
సరి పాదములు – ఇం/ఇం/సూ, 3-5

1) నను జూడుమని జెప్పు – నారీమణీ నీవు
మనసార నరలోక మణికి
ఘనుఁడైన ఘన శ్యాముఁ – డనఘునికిఁ దెలుపు
చనువుగా నాయొక్క యునికి

2) వినుమమ్మ వినుమమ్మ – వివరించి చెప్పెదన్
వనజాక్షి వెతలన్ని నీకు
మనసేలకో నేఁడు – మండెఁగా వ్యధతోడ
దనుజారియే దిక్కు నాకు

3) కన్నెత్తి చూడవా – కాంతితో నింపవా
చెన్నుగా బ్రదుకులో నేఁడు
వెన్నెలల్ గురిపించు – వేణువుల్ మ్రోగించు
పున్నమిన్ మఱువ నీ నాఁడు

4) వన్నెలన్ జిందించు – వర్ణముల్ బలికించు
సన్నుతిన్ నా నాల్క నాడు
తిన్నగా సరియైన – దెన్నులన్ దెఱిపించి
యెన్నగా నాకుండు తోడు

5) కొండపై నీ యింటఁ – గ్రొంగ్రొత్త దృశ్యాలు
మెండు యందాల రాజిల్లు
మండు యీ లోయలో – మట్టి గోడల మధ్య
మండువా నిజము నా యిల్లు

6) నిండు పున్నమి రోజు – నెలరాజు జల్లు నా
పండు వెన్నెల కొండపైన
నిండు పున్నమి రోజు – నెలరాజు జల్లు నా
పండు వెన్నెల లోయలోన

7) నీ వాస మా కొండ – నా వాస మీ లోయ
మోవి నే ముద్దాడు టెట్లు
నీవేమొ దిగిరావు – నేనెక్కఁగా లేను
యా వేయి యెత్తైన మెట్లు

8) ఈ విధంబున నుండ – జీవిత సాంగత్య
మే విధంబున గల్గు మనకు
భావలోకములోని – బాంధవ్య మాయెఁగాఁ
ద్రోవ లేదికమీద మనకు

9) సొంపుల వానవై – సొబగులసోనవై
వంపుల రూపమై రమ్ము
కెంపుల చెంప నా – కింపుగఁ దోచెఁగా
చంపక వేగమే రమ్ము

10) చల్లని గాలిలో – చైత్రపు రాత్రిలో
నుల్లము లూఁగఁగా రమ్ము
తెల్లని కాంతితోఁ – దీర్చిన ధాత్రిలో
నల్లని నీడయే యిమ్ము

11) చందురుఁ జూడంగ – సంద్రము పొంగంగ
డెందము దడలెత్తె రంగ
పందెము వద్దయ్య – పంతము చాలయ్య
ముందర రావయ్య దొంగ

ఏల * – బేసి పాదములకు యతి లేక ప్రాసయతి మూడవ గణముతో
బేసి పాదములు – ఇం/ఇం – ఇం/ఇం, 4-1
సరి పాదములు – ఇం/సూ/ఇం, 3-3

1) నిను జూడ మనసాయె – నీరేజ లోచనా
నను జూడ నీకు యోచనా
కన రమ్ము రజనిలోఁ – గను మూసి స్వర్గమ్ము
కనిపింప జేతు నను నమ్ము

2) రావేల రసపూర్ణ – రాత్రిలో నేకాంగి
వేవేల తార లా నింగి
నావీణ నవరాగ – నాదమ్ము మోదమ్ము
జీవమ్ము నొసఁగు యోగమ్ము

3) వెలుఁగులో నింపరా – ప్రేమలో తడుపరా
అలలుగా పొంగు కడలిరా
కలలలో రమ్మురా – కౌగిళ్ల నిమ్మురా
నెలఁతపై సుధలఁ జిమ్మరా

షట్పదగా –
4) మందమ్ము పవనమ్ము
మందమ్ము గానమ్ము
మందమ్ము నీదు గమనమ్ము
అందమ్ము ముఖమందు
అందమ్ము తనువందు
అందమ్ము నీవు నాకెందు

5) ఉదయించ కో సూర్య
మదిలోన చీకట్లు
వ్యధలోన మునిఁగి నేనుంటి
ఇది కాళ రాత్రియే
ఇది వ్యాళ నిలయమే
ముదమిందు శూన్యమౌనంటి

6) హరి నిన్ను దలఁతు నే
హరుని యా గుడిలోన
హరిహరుల్ వేఱు కారెప్డు
హర నిన్ను దలఁతు నే
హరి యుండు గుడిలోన
హరహరుల్ వేఱు కారెప్డు

ద్విపదగా –

1) ఏల నాపైన నీ-కేల కరుణ రాదు
బాలగోపాల సచ్ఛీల

2) యామినీవేళలో – నా మనస్సేలకో
స్వామినే దలచె నీనాఁడు

3) రసరాత్రు లేలకో – రాగమ్ము లేలకో
రసరాజ్ఞి నీవు లేకుండ

4) తళతళ లాడు యీ – దర్పణ మ్మేలకో
వెలవెలబోయె నీనాఁడు

5) మౌన రాగము పాడె – మనసు నాదేలకో
మౌనమే గాన మీనాఁడు

6) ఇంపగు నీ గాన – కంపనల్ విన నిందు
కంపించె హృదయ మీనాఁడు

7) క్షరము లక్షరము లో – సర్వేశ్వరా నీదు
కరముల సృష్టి లీలలా

8) ఒంటరిగా మింట – నొక తార యుదయించె
జంట కనబడ లేదెందు

9) జాతకమ్ములు మన – పాతకమ్ముల దెల్పు
భూతద్ద మాయె నేలకో

10) గ్రహము నాపైన నా-గ్రహ మొనర్చునె, యను-
గ్రహ మొసంగునె, యెఱుగు టెట్లు

11) నక్షత్రముల మధ్య – నడచునా పెళ్లిళ్లు
నక్షత్ర మేల పెళ్లికి

12) నక్షత్రపు జనన – నక్షత్ర మేమియో
నక్షత్రమా మనకు రక్ష

13) ఆశ్లేష నీవు సం-శ్లేషమున కడ్డు
విశ్లేషణమ్ము లేలకే

14) మూల తారా నన్ను – మూల జేర్చితివి పూ-
మాల నా చేత వాడెనే

15) నీల తారా నాకు – మేలు దారిని జూపు
చాల ప్రేమించితి జెలిని

16) మంగళగ్రహ దోష – మాపాదనము సేయ
మంగళసూత్రమే లేదు

17) దూరాన శుక్రుడు, – చేరువ చంద్రుడు,
వీరలు హితులొ, పగతురో

సొబగుల సోన * – బేసి పాదములకు యతి లేక ప్రాసయతి మూడవ గణముతో
బేసి పాదములు – ఇం/ఇం – ఇం/ఇం, 4-1
సరి పాదములు – ఇం/ఇం/ఇం, 3-1

1) సుందరీ సొబగుల – సోనలోఁ దడువనా
యందమై పాడనా యాడనా
బిందువుల్ జేర్చి యా – సింధువై పారనా
నంద మింపార నే నవ్వనా

2) మల్లెలన్ గోసి నే – మాలలే యల్లినా
నుల్లమ్ము పొంగ నే త్రుళ్ళినా
గల్లుగ ల్లంచు రా – యొళ్లు కళ్లాయె రా
చల్లగా జూడ వేళాయెరా

3) వేణు వూదంగ రా – వీణ మీటంగ రా
గానస్వర సుధలఁ జల్ల రా
తేనె నిచ్చెదను రా – తీయఁగా తీయఁగా
మేని నిచ్చెదను రా హాయిగా

4) సొంపుల వానవై – సొబగులసోనవై
వంపుల రూపమై రా చెలీ
కెంపుల చెంప నా – కింపుగఁ దోచెఁగా
చంపక వేగమే రా సకీ

5) చల్లని గాలిలో – చైత్రపు రాత్రిలో
నుల్లము లూఁగఁగా నుందమా
తెల్లని కాంతితోఁ – దీర్చిన ధాత్రిలో
నల్లని నీడయే బంధమా

6) చందురుఁ జూడంగ – సంద్రము పొంగంగ
డెందము దడలెత్తె రంగయ్య
పందెము వద్దయ్య – పంతము చాలయ్య
ముందర వేవేగ రావయ్య

షట్పదగా –

7) కనులు మీనాక్షివి
తనువు కామాక్షిది
మనసు విశాలాక్షిదే గదా
స్వనము సద్గాత్రిది
ధనము శ్రీనేత్రిది
జనను లా దేవీమణులె నాకు

8) పాడవే కోకిలా
పాడవే కిలకిలా
పాడవే సొబగుల సోనగా
పాడవే నా గుండె
మేడలో దీపమై
నీడ లేకను వెల్గువానగా

9) మోజు తీరెనొ నీకు
రోజులే గడచెనా
రాజ నీ వదనమ్ము జూపవా
గాజు గుండెర నాది
గాజు బగులనీకు
గాజు ముక్కలు మళ్ళి యతుకునా

10) రంగని సాంగత్య
మంగన గోరంగ
ఖంగున డెందమ్ము మ్రోఁగెఁగా
బొంగెను గీతమ్ము
చెంగున నాట్యమ్ము
రంగముపై యాడఁ దోఁచెఁగా

గీతిక * – సరి పాదములలో యతి లేక ప్రాసయతి మూడవ గణముతో
బేసి పాదములు – ఇం/సూ/ఇం, 3-3
సరి పాదములు – ఇం/ఇం – సూ/ఇం, 4-9

1) వ్రజములో నేఁడు పండుగ
రజనిలో చంద్రుండు – ప్రజ్వలించఁగ
ప్రజలలో నోటి నిండుగ
సృజనగా గీతికల్ – హృదులు నిండఁగ

2) సుందరుం డూఁద మురళితో
చిందులే యెందెందు – చిత్ర సరళితో
అందమౌ రాసకేళిలో
మంద్రమౌ స్వరములే – మధుర వేళలో

3) సుమముతో రంగవల్లులే
యమరు నీ మనసులో – నమరవల్లిగా
హిమముతో స్ఫటికవల్లులే
యిముడు నీ మనసులో – హేమవల్లిగా

4) ఏ రాగ గీతి పాడ నే
నో రాగ రంజనీ – యుల్లసించంగా
గారాముతోడ నీకు నే
శ్రీరాగమును బాడి – చేర రమ్మందు

5) ఆమని చల్ల గాలిలో
నామది పూచెను – నందవనములో
కోమలమైన గీతిలో
గోముగ మఱచితిఁ – గొద్దికొద్దిగా

6) కెరటమ్ము లెందుఁ జూడఁగా
చిరుగాలి వీచంగ – చిందు నీటితో
నురియంగ నుప్పు నాల్కపై,
సరసమ్ము నిజముగా – సంద్ర తీరమ్ము

7) గీతులఁ బాడెదను నేను
ప్రీతితో బ్రేమతోఁ – బ్రియముగా సఖా
ప్రాతఃసమయము, వెలుఁగుల
చైతన్యము కలిఁగె, – జగతి శోభిలెన్

8) ఎన్నాళ్లు కనఁగ వేచితి
నన్నేల చూడవు – నగుచు నో హరీ
పన్నీట ముంచ రమ్మిట
కన్నీళ్లు తుడువు నా – కలలు నిజమగున్

9) భృంగమై యెగిరి పోవనా
నింగిలో రంగులై – నిలిచి పోవనా
గంగయై పొంగి పోవనా
భంగమై నదములో – పారి పోవనా

10) ముదముతో నాట్య మాడనా
పదములన్ బాడి నే – బరవశించనా
పెదవులన్ ముద్దు లీయనా
యెదురుగా నీకు నా – హృదయ ముంచనా

11) కంటితో మాట లాడనా
మింటిలో తారతో – మేళ మాడనా
గంటలా పాట పాడనా
మంటలో శలభమై – మాడిపోవనా

12) మాలగా గళము నింపనా
గాలిలో బూవునై – గంధ మలఁదనా
తేలులా నిన్ను కుట్టనా
తాళమై గుండెలో – దడను లేపనా

13) వ్రాసితి నేను నీకయి
భాసురముగ నొక – ప్రణయ గీతిక
రా సరసా నీవు నాకయి
నా సరసను వేగ – నంద మూర్తిగ

14) నను జూడు మమ్మ మా యమ్మ
నిను జూడ మనసాయె నమ్మ
రావమ్మ
కనులారఁ గాన నే దల్తు
మనసార నిన్నెప్డు దల్తు
నినె గొల్తు
వినవేల వేగ సంగతుల
నెనరాని యీ బ్రదుకు వెతల
నా కతల
కొనియాడుచుంటి సద్భక్తి
నిను దల్లి, యీయుమ శక్తి
భవముక్తి

15) అతఁడు- కలలోన గంటి కలకంఠి
లలితాంగి నిను గోరుచుంటి
రమ్మంటి
ఆమె- పిలిచితి రమ్ము నాకిమ్ము
లలితాంగ జీవమ్ము, తెమ్ము
మోదమ్ము
అతఁడు-వలలోని చేప యీ నేను
విలవిల లాడెడు మేను
నీకేను
ఆమె-మిలమిల మెఱిసె ధ్రువతార
వలపుల బ్రదుకున దార
నీవేర

కందగీతి – సరి పాదములలో యతి లేక ప్రాసయతి నాలుగవ గణమునకు
బేసి పాదములు – సూ/ఇం/ఇం, 3-2
సరి పాదములు – సూ/ఇం/ఇం – సూ/సూ, 5-26

1) రమ్ము రమ్మని బిలిచితి
కమ్మనౌ మాట బలుకంగఁ – గలికి నేడు
యిమ్ము యిమ్మని జెప్పితి
సొమ్ములౌ నీదు నిండైన సోయగమ్ము

2) సొగసు జిమ్ముచు వెలుఁగుఁగా
గగన వీథిలోఁ దారలు – గడు ముదాన
సొగసు జిమ్ముచు వెలుఁగుమా
నగుచు నా యింట నెప్పుడు – నాదు పాప

3) ఎపుడు వచ్చునో యామని
యెపుడు పూయునో బూవులు – హృదయ మలర
యెపుడు చిగురించుఁ జెట్టులు
యెపుడు పాడునో కోకిల – లింపుగాను

4) ఎదయు పిడికిలి పూవుగా
ముదముతో కొన్ని వేళల – మురిసిపోవు
నెదయు పిడికిలి పూవుగా
వ్యధలతో కొన్ని వేళల – వాడిపోవు

వెన్నెల లేక జ్యోతి –
బేసి పాదములు – ఇం/ఇం/ఇం, 3-1
సరి పాదములు – ఇం/ఇం/సూ , 3-5

1) గగనాన వెలుగొందు తారకా
మగరాయఁ డెటు వెళ్లె నెఱుఁగ
సగమైన నిశిలోన నేనిందు
సగమైతి వానికై కరుగ
నిగనిగల్ చాలించు వెన్నెలా
పగబట్టె నీరీతి వాఁడు
వగలోన నలిగేను రేయిలో
మొగమైన చూపంగ రాఁడు

2) తలచుచున్ జూడంగ శశి నేను
వలరాయఁడే నా కళ్ల బడెను
అలలుగా మోహమ్ము లేవంగ
వలలలో నీ చేప బడెను
ఇలపైన జూడంగ లేకున్న
కలలె నాకికమీద బాగు
తెలియంగలేని యీ భావనల్
సుడివోలె మనసులో దాఁగు

3) ప్రతిరోజు నింగిలో సూర్యుఁడు
ప్రతిరోజు పగలె యీ ధాత్రి
ప్రతిరోజు నింగిలో చంద్రుఁడు
ప్రతిరోజు తారలే రాత్రి
ప్రతిరోజు దినములో చాకిరి
ప్రతిరోజు పడకపై నిద్ర
ప్రతిరోజు నిను జూడ కోరిక
ప్రతిరోజు యడియాస ముద్ర

4) అనిపించె నిను దల్వ రాదంచు
మనసు దల్వంగ నీ రూపు
అనిపించె నిను జూడ రాదంచు
కనులు వేచుచునుండు చూపు
అనిపించె వినరాదు నిన్నంచు
వినిపించుకోలేదు చెవులు
అనిపించె ప్రేమించరాదంచు
ననల మీ తనువందు రగులు

5) స్వయముగా ప్రేమతో వ్రాసితిన్
బ్రియతమా చదువవా లేఖ
నయముగా తేనెతో పాలతో
భయము సంకోచమే లేక
హొయలతో వలపు పుష్పించఁగా
బ్రియములౌ కవితలన్ జూడు
హయముపై రా వచ్చి ప్రీతితో
లయల యీ గీతికన్ బాడు

6) అందాల పాపాయి కర్ణాల
విందుగా కోకిలా పాడు
అందాల పాపాయి నేత్రాల
ముందుగా శిఖి నాట్యమాడు
అందాల పాపాయి నగుమోము
కందించు వెన్నెలా నవ్వు
అందాల పాపాయి పసిబుగ్గ
లందుంచు పవనమా పువ్వు

7) వీచకే పవనమా తీయఁగా
పూచకే క్రొన్ననా నీవు
కాచకే వెన్నెలా హాయిగా
దోచకే తారకా నన్ను

8) కంటివి స్వర్గాల నా నాఁడు
యంటివి యందాలె యంచు
నుంటివి మఱచి న న్నీనాఁడు
మంటల నే నార్ప జాల

9) వ్రేలితో బెదరించి చంపకే
కాలమా కస్సుబు స్సనకు
కాలితో నన్నిట్లు తన్నకే
జాలి లేదాయెనా నీకు

10) మోదమా వెళ్లిపో నను వీడి
ఖేదమా నేనుంటి వాడి
నాదమా శోక గీతిక పాడు
నాదు ప్రియు డిచట లేఁడు

11) రవివర్మ గీచెనో చిత్రమ్ము
రవికాంతి చెక్కిళ్ల సొమ్ము
కవి వ్రాసె వర్ణనా గీతమ్ము
నవ భావముల నెల్ల జిమ్ము

12) గంధమున్ బూయనా ప్రీతితో
నందమై పాడనా గీతి
విందు వడ్డించనా చేతితో
డెందమున్ వెల్గగా జ్యోతి

జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ...