జాషువా – పిరదౌసి

పిరదౌసికి బంగారు నాణాలు ఇస్తానని నిండు సభలో వాగ్దానం చేసి ఘజనీ వెండి నాణాలు ఇచ్చిన వార్తను వేగుల ద్వారా తెలుసుకున్న పిరదౌసి కుపితుడై రాజు గురించి వ్రాసిన ప్రతీ పద్యమూ అమూల్యమైనదే. పద్యానికో బంగారు నాణమేం భాగ్యం, ప్రతీ అక్షరానికీ కనకాభిషేకం చేయాలన్నంత గొప్పగా ఉంటాయవి. ఇక్కడ కూడా భావకవుల లక్షణమొకటి కనపడుతుంది జాషువాలో. తురుష్కభూపతి మాట తప్పి మనసు ముక్కలు చేశాక కూడా, ఈ గోడల మీది పద్యాలలో మనకు కనపడేది వేదనే తప్ప కసి కాదు. ఆ మాటకొస్తే, పిరదౌసిలో పరనిందాసక్తి కంటే స్వీయనిందాభిలాషే ఎక్కువ. మహీపతిని ఎన్ని మాటలన్నా, సంయమనం కోల్పోయి మాట్లాడినట్టు కనపడదు. అయితే, సుస్పష్టంగా అది భయం వల్ల కాదనీ, స్వభావరీత్యా మాత్రమే అనీ కూడా తెలుస్తుంది. అంత సున్నితత్వం, వేదన, స్వీయనిందాలక్షణం భావకవుల్లో మాత్రమే ఆశించగలం.

చిరముగ బానిసీని నభిషేక మొనర్చితి మల్లెపూవు ట
త్తరులొలికించి; మాయజలతారున రాదుగదా పసిండి, యో
కఱకు తురుష్కభూపతి! యఖండమహీవలయంబునందు, నా
శిరమున, బోసికొంటిని నశింపని దుఃఖపు టగ్నిఖండముల్.

అన్నపుడైనా, మసీదు గోడల మీద కనపడి రాజు ఆగ్రహాన్ని కళ్ళజూసిన ఈ క్రింది పద్యంలోనైనా, కరుకుదనం కనపడదు. ఆ కనపడకపోవడమే జాషువా ముద్ర. అదే అతని శైలి.

ముత్యముల కిక్కయైన సముద్రమునను
బెక్కుమాఱులు ముంకలు వేసినాఁడ;
భాగ్యహీనుఁడ ముత్యమ్ము వడయనయితి
వనధి నను మ్రింగ నోరు విచ్చినది తుదకు.

విశ్వనాథ సత్యనారాయణ — ఖండ కావ్యములు భావ ప్రథానములు. కావ్యమునందు ప్రతి పద్యమునందు భావముండవచ్చును. కాని కావ్యము సమిష్టి మీద రసాభిముఖముగా ఉండును. ఖండకావ్యములందు భావములు రస వ్యంజకములు కావచ్చును. కానీ ఖండకావ్యములు ప్రధానముగా ఒక భావమును ఆశ్రయించి ఉండును. అందుచేత దీనిని భావ కవిత్వమనవచ్చును, — అని ఈ ఖండకావ్యాలని నిర్వచించారు (ఆంధ్రవారపత్రిక, జనవరి 1938.) అదే విధంగా వెల్చేరు నారాయణరావు తన పుస్తకం, తెలుగులో కవితావిప్లవాల స్వరూప స్వభావాలులో ఇలా అంటారు: భావ కవిత్వంలో వస్తువుకి స్వతంత్ర అస్తిత్వం లేదు. అది కేవలం కవి వ్యక్తిగతంగా మనస్సులో ఊహించుకున్నది. ఆ వస్తువుకి పుట్టుక పౌరాణిక సమాజమూ కాదు. కవి నిర్మితమైన సాహిత్య ప్రపంచమూ కాదు. అది కేవలం వైయక్తికమైన కవి మనః ప్రపంచం (పుట 96.); ఒక్క మాటలో చెప్పాలంటే లిరిసిజమ్‌నీ కవిత్వాన్నీ అభిన్నంగా భావించడం భావకవిత్వం చేసిన పని. రమణీయ వస్తువే కవిత్వ యోగ్యమనీ లలిత పదజాలమే కవిత్వ భాష అనీ అనుకోవడం దీనికి స్థూలరూపం. కథలో కవిత్వం లేదనీ, సంఘటనలో కవిత్వం లేదనీ, అనుభూతిని వ్యక్తీకరించడంలోనే కవిత్వం ఉందనీ ఈ సిద్ధాంతపు అంతరార్థం (పుట 128.)

ఈ నిర్వచనాలకి లోబడినట్టే కనపడినా, భావకవి లక్షణాలు ఎంత స్ఫుటంగా చూపెట్టినా, జాషువా పూర్తిగా కథను విడిచి కవిత్వం వ్రాయాలనుకోలేదు. అదే కారణానికి, కథను రసవత్తరంగా నడిపిస్తూనే, అంటే, ఈ కవిత్వంలో కథకు సముచిత స్థానమిస్తూనే ఓ కవిగా తన విశ్వరూపాన్ని చూపేందుకు అనువుగా ఉన్న అడవి ప్రయాణాన్నీ (ద్వితీయాశ్వాసము), దైవికంగా తారసపడ్డ నిషాదునితో చర్చనూ, కొన్ని లోతైన ప్రతిపాదనలనూ (తృతీయాశ్వాసము) వీలైనంతగా విస్తరిస్తూ నిఖార్సయిన కవిత్వాన్ని ప్రతి పద్యంలోనూ చల్లుకుంటూ సాగిపోయాడు. కవి ఇక్కడ ప్రత్యేకించి చేసిన గమ్మత్తేమిటంటే విశృంఖలమైన అడవి దారి అందాలన్నీ అక్షరాల్లోకి అనువదించాడు. ఆ ప్రయత్నంలో, మౌనాన్నీ, శూన్యాన్నీ కూడా కవిత్వం చేయగలిగాడు.

నిజానికి ప్రకృతి వర్ణనలకు సంబంధించి చాలా మంది పాఠకులకు ఉండే ఇబ్బంది కవి దృష్టితో లోకాన్ని చూడలేకపోవడం; కవి వర్ణనలను అతిశయోక్తులని నమ్మడం. ఈ వైయక్తికమైన అనుభవాలని సార్వజనీనం చేసి ఒప్పింప జేసుకోవడానికి కవిలో నిజాయితీతో పాటు, పాఠకులను చనువుగా తన వెంట రమ్మని పిలవగల నేర్పు కూడా ఉండాలి. ఆ ఒడుపు ఈ కవిలో ఉంది. మననే కాదు, పరమేశ్వరుణ్ణి కూడా, ‘మొగమింత సూపు, మిటనెవ్వరులేరు పరాయులీశ్వరా!’ అని పిలవగల చాకచక్యం ఇతని కవిత్వాన్ని సహజంగా పఠితలకు దగ్గర చేస్తుంది.

అలాగే, మరొక పద్యంలో, మనం మామూలుగా మన మాట వినని లేదా మనం చెప్పిన పని చెయ్యని ఆత్మీయులతో, నీకు అన్నింటికీ తీరిక ఉంటుంది ఒక్క నా పనికి తప్ప! అని ఎలా నిష్ఠూరాలాడతామో అచ్చు అలాగే, పరమాత్ముని ఎలా నిగ్గదీస్తున్నాడో చూడండి.

ఆగడపు మబ్బుశయ్యల నపరశిఖరి
బుడుత చంద్రుడు నిద్దుర బోవుచుండె
ఈ చెఱువునీట నతని కుయ్యెలలు గట్టి
జోలవాడుచు నావంక చూడవేమి?

ఇలాంటి ఎత్తుగడలు కవిత్వాన్ని పఠితలకు తేలిగ్గా దగ్గర చేస్తాయి. సహజత్వాన్నీ సృజనాత్మకతనీ జమిలిగా తమలో ఇముడ్చుకుని ప్రత్యేకంగానూ నిలబడతాయి.

మూడవ ఆశ్వాసంలో నన్ను పూర్తిగా లోబరచుకున్న పద్యమొకటి ఉంది. పిరదౌసి, భార్యాపిల్లలతో సొంత ఊరైన తూసీకి భయంకరమైన అడవి మార్గాల గుండా ప్రయాణిస్తున్నాడు. ఓ వైపు రాజు సైన్యం ఎక్కడ తనను, తన పరివారాన్ని వెంబడించి వచ్చి చంపేస్తారో అన్న భయం. మరోవైపు, ఆ కారడవిలో, ఆ నడిరాత్రి వేళ ఎటువైపు నుండి ఏ క్రూరమృగం మీదపడి నెత్తురు తాగుతుందోనన్న భయం. ఇట్లాంటి ఓ సందర్భంలో, ఈ పథికుడికి భయం కలిగించిన ఓ సంఘటన వర్ణించాలంటే, ఏ కవి అయినా ఏం వర్ణిస్తాడు? ఆ రాత్రి కారుచీకట్లనో, ఓ సింహగర్జననో, భీకర అడవిమృగాల పోరాటాన్నో, గుర్రపు డెక్కల చప్పుడునో, దారి దొంగల క్రౌర్యాన్నో… అవునా? చిత్రంగా జాషువా ఆలోచనలు అక్కడ ఆగిపోలేదు. అదే ఆశ్చర్యం! జాషువా వర్ణన ఇదీ:

గొసరి నివ్వరి ధాన్యంబు కొఱికి నమలు
నెలుక మునిపంటిసవ్వడి కులికిపడుచు
త్రోవ గమియించు నాటి పాంథుల నదేమొ
అదరి బెదరించె నొక ఎండుటాకు కూడ.

వాళ్ళ మనఃస్థితిని ఊహించి, కల్పించి వర్ణించలేదు జాషువా. అది అనుభవించి వ్రాశాడు. అంత పరాభవభారం తోనూ, దైన్యం తోనూ, వల్లమాలిన భయం తోనూ ఓ తప్పనిసరి ప్రయాణం చేస్తోన్న బాటసారిని భయపెట్టడానికి ఒక్క ఎండుటాకు చాలు. ధాన్యం కొరికే చిట్టెలుక మునిపంటి సవ్వడే చాలు. దీన్నెరిగి వ్రాయగల్గినవాడే కవి! వర్ణనల్లోని ఈ ఔచిత్యమే జాషువాని సాధారణ కవుల నుండి ఎడంగా నిలబెట్టింది. నవయుగకవిచక్రవర్తి అని సాహిత్యప్రేమికులు కీర్తించేలా చేసింది.


పిరదౌసి ఓ పారశీక కవి. గజనీ మహమ్మదు కాలం లోని వాడు. ఆ కాలంలో అతని సామ్రాజ్యమంతటి లోనూ అగ్రగణ్యుడిగా పేరొందిన కవి. అతని గురించి జాషువా ఏమని కవిత్వం వ్రాసినట్టు? ఎందుకు వ్రాసినట్టు?

పిరదౌసి పాఠకులకు నచ్చడానికి కారణాలు స్పష్టంగానే ఉంటాయి, వాటిలో కొన్నింటిని ఈ వ్యాసం లోనే వివరించే ప్రయత్నమూ జరిగింది. అయితే, అసలు పిరదౌసి వంటి ఒక కథ జాషువాని ఆకర్షించడానికి కారణం ఆ కథలోని విషాదమేనా, ఆర్ద్రత మాత్రమేనా, మిగిలిన కవులందరి మాదిరిగా కేవలం ఈ విషయాలకేనా అతను ఆకర్షితుడైనది? అన్న దిశలో ఆలోచిస్తూ జాషువా వ్యక్తిగత జీవితాన్ని ఓ సారి పరిశీలిస్తే, మరొక కారణం కూడా కనపడుతుంది. జాషువా తొలిరచనల్లో రుక్మిణీ కళ్యాణం (1919), కుశలవోపాఖ్యానం (1922), ధ్రువ విజయం, కృష్ణనాడి (1925) మొదలైనవన్నీ ఉన్నాయి. ఈ ఇతివృత్తాలు హిందువుల పురాణ గాధలు కావడం వల్ల, క్రైస్తవ కుటుంబంలో పుట్టి అన్య మతాన్ని ప్రచారం చేస్తున్నాడన్న నెపం మీద తన కులం వారే అతన్ని వెలివేశారు. జాషువా కుమర్తె హేమలత లవణం మా నాన్నగారు పుస్తకంలో ఈ ఉదంతాన్ని వివరిస్తూ –

అప్పటికే వివాహితుడైన నాన్నగారు తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను కూడా విడిచి ఊరికి దూరంగా ఉండవలసి వచ్చింది. పగలంతా ఊరికి దూరంగా ఉన్న పాడు పడ్డ మసీదులో మకాము చేసి రాత్రి చీకటి చాటుగా వచ్చి తల్లి పెట్టిన భోజనం తిని మరలా మసీదు చేరుకునేవారు. అటు సంఘం నుండి, ఇటు స్వగృహం నుండి తరమబడ్డ నాన్నగారికి ప్రకృతి ఆత్మబంధువై, గురువుగా తల్లిగా స్నేహితుడిగా తోడు నిల్చింది. జంతువులు, పిట్టలు, కొండలు, కోనలు ఆయనకు మిత్రులు. అవే ఆయనకు కవితా వస్తువులు.

అని వ్రాస్తారు. అలా చూస్తే, పిరదౌసి, జాషువా ఇద్దరూ నమ్ముకున్నది కవిత్వాన్నే. మనస్సాక్షికి లోబడి కవిత్వాన్ని వ్రాసుకోవడం, చివరికి ఆ కవిత్వమే చిక్కులు కొనితెస్తే వెలికాబడి సంఘానికి దూరంగా జరగడం, అందువల్ల వేదనకు గురి కావడం ఇద్దరిలోనూ కనపడే సామ్యాలు. తమ జీవితాల్లోని ఈ సారూప్యతే జాషువాని కదిలించింది అనుకోవడనికీ, కావ్యరచనకు పురికొల్పిందనుకోవడానికీ కొంత ఆస్కారం ఉంది.

‘ఆకులందున అణగిమణగీ కవిత కోయిల పలుకవలెనోయ్,’ అని గురజాడ అన్నాడు కానీ, ఈ కవి కోకిల మాత్రం జీవితంలో అణగి ఉండటాన్ని ప్రశ్నించదలచినట్టే కనపడుతుంది. పిరదౌసిలో ప్రస్ఫుటంగా కనపడే భావకవుల లక్షణాలు గబ్బిలం దగ్గరికి వచ్చేసరికి అభ్యుదయవాదంలోకి మారడమూ అంతే స్పష్టంగా తెలుస్తుంది. జాషువా తానే స్వయంగా — జీవితం నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. నా గురువులు ఇద్దరు – పేదరికం; కులమతభేదం. ఒకటి నాకు సహనాన్ని నేర్పితే, రెండవది నాలో ఎదిరించే శక్తిని పెంచింది కానీ బానిసగా మార్చలేదు. దారిద్ర్యాన్ని, కులభేదాల్ని కూడా చీల్చి నేను మనిషిగా నిరూపించుకోదలచాను. వాటిపై నేను కత్తి గట్టాను. అయితే నా కత్తి కవిత. నా కత్తికి సంఘంపై ద్వేషం లేదు. దాని విధానంపై ద్వేషం, — అని చెప్పుకున్నాడు. ఇటువంటి తీర్మానం చేశాడు కనుకనే, అటుపైన మరింత సూటిగా, పదునుగా, కులప్రాతిపదిక మీద తనను చిన్నచూపు చూసిన వారినే లక్ష్యంగా చేసుకుని,

పంచములలోన మాదిగవాడను నేను
            పంచమీయులలో మాలవాడతండు
ఉభయులము క్రైస్తవ మతాన నొదిగినాము
            సోదరత గిట్టుబాటు కాలేదు మాకు
దేవుడొకడు; మాకు దేవళంబులు రెండు;
            దేశమొకటి; మాకు తెగలు రెండు;
మాటవరుసకొక్క మతమందుమే కాని
            కుల సమస్య వద్ద కుమ్ము దుమ్ము.

అని మన సంఘంలో ప్రతీ స్థాయిలోనూ కనపడే అనైకమత్యాన్ని గేలి చేశాడు. మనుష్యులుగా ఒకటిగా ఉండాల్సిన మనం, మతాలుగా, కులాలుగా, శాఖలుగా చీలిపోవడాన్ని తన కవిత్వంలో తూర్పాఱబట్టాడు. కనుక, అవసరమనుకుంటే ఎంత ఘాటుగా అయినా స్పందించగల లక్షణమొకటి జాషువాలో ఉందనీ, పిరదౌసి జాషువాలోని ఒక పార్శ్వాన్నే పాఠకలోకానికి చూపించిందనీ గమనించడం అవసరం.

‘రాజుల్ మత్తుల్ వారిసేవ నరకప్రాయంబు, వారిచ్చు నంభోజాక్షీ చతురంతయాన తురగీ భూషాదులాత్మవ్యథాబీజంబుల్,’ అన్న ధూర్జటి మాటలెంత నిష్ఠురసత్యాలో అనిపించక మానదు పిరదౌసి చదువుతున్నంతసేపూ. దురదృష్టవశాత్తూ అది తెలుసుకునేలోపే తన జీవితంలో అత్యంత విలువైన ముప్పైయేళ్ళు కోల్పోయాడతను. ఆ బాధే, ఆ వంచనకు గురైన వేదనే జాషువా కావ్యంలోని అక్షరమక్షరంలో ప్రతిఫలించి మననూ వెన్నాడుతుంది. విషాదాంతమైన ఒక కథను ఎంత బలంగా చెప్పే వీలుందో, అంత బలంగానూ చెప్పాడు జాషువా. లలితమైన వర్ణనలూ, తేనెలొలికే భాష, పట్టి కుదిపే కథనం, శబ్దకాఠిన్యమూ అన్వయ క్లిష్టతా లేని అపురూపమైన కవిత్వమూ జాషువా పిరదౌసిని ఏ కాలానికైనా అజరామరంగా నిలబెడతాయి. మహమ్మదు రాతి విగ్రహాల యందైనా ఉండగలడా అన్నది సందేహమే కానీ, ‘ప్రజల నాల్కల యందు’ ఈ సుకవి జీవించి తీరుతాడు.

(*వాల్మీకి చేసిన ఈ పోలికను చెప్పిన భైరవభట్ల కామేశ్వరరావు గారికి కృతజ్ఞతలు – మా.)

మానస చామర్తి

రచయిత మానస చామర్తి గురించి: ఇంజనీరింగ్ (కంప్యూటర్స్) 2005లో పూర్తి చేసి ఐ.టి. రంగంలో ఉద్యోగం. ప్రస్తుత నివాసం బెంగలూరు. మధుమానసం అన్న బ్లాగ్ ఉంది వీరికి. అలతి అలతి పదాలతో లోతైన కవిత చెప్పగల వీరు కవిత్వంలోను, సాహిత్యవిమర్శలోను తనదైన గొంతు వినిపిస్తున్నారు. ...