ఎం. వీ. విందుడు

అమృతరావు తిరిగి ఆనందుడయ్యాడు. అమందానందుడయ్యాడు. ఆపైన మందస్మిత వదనార విందుడయ్యాడు.

పాపం అమృతరావు ఇదివరలో అనగా ఇక్ష్వాకుల కాలంలో అంటే పెళ్లి కాకముందు ఎం. వీ. విందుడుగానే ఉండేవాడు. మందస్మిత మేమిటి, అట్టహాస వదనార విందుడై ఏ. వీ. విందుడుగా కూడా వుండేవాడు, ఆ కాలంలో. మొహంలో చిరునవ్వు చెరగనిచ్చేవాడు కాదు. ‘నవ్వు రాజిల్లెడి మోమువాడు’ అని బిరుదు పొందేడు. అంతే కాదు నవ్వును కూడా అంటురోగంలా వ్యాపింప జేసేవాడు. ప్రతీ ఘటనకీ నవ్వుతూ ఒక పాట పాడేవాడు. అలా నవ్వుతూ పాడుతూ పెళ్ళిళ్ళల్లో పన్నీరులా ‘హాస్యరసంబు పై జల్లెడువాడు’ అని కూడా కీర్తి పొందాడు.

‘కాలం ఖర్మం కలిసి రాకపోతే మొగాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి’ అనే ధర్మ సూత్రం ఒకటి ఉంది. అన్ని ధర్మ సూత్రాల లాగానే ఇది కూడా పెడచెవిని పెడతారు పురుషాధములు. పురుషోత్తములు ‘భజ గోవిందం భజ గోవిందం’ అని పాడుకుంటూ శ్రీ శంకరాచార్యుల బాట పడతారు. కైవల్య ప్రాప్తి చెందుతారు. అయితే వీరు అతి కొందరు. పెళ్లి అయిన తరువాత ఎందరికో జ్ఞానోదయమై యోగీశ్వరులు, మునీశ్వరులు గా మారి ‘అంతా భార్యేచ్ఛ’ అని వేదాంతం వల్లిస్తూ తామరాకుపై నీటి బొట్టు లాగా తమ జాడని కప్పిపెట్టుకుంటూ గడిపేస్తారు. ఈ ఎందరిలో కొందరు లౌక్యులు రెండడుగులు ముందుకు వేసి ‘అన్య దైవమూ కొలువా నీదు పాదమూ విడువా’ అని రాగాలాపన చేస్తూ భార్య కొంగు పట్టుకొని తమ విధేయత చాటుకుంటూ కాలం గడిపేస్తారు.

కొంతమంది పురుషాధమాధములు ఉంటారు. వీరిని రావణాసురుడు, హిరణ్యకశిపుడు ఇత్యాది పేర్లతో పిలుస్తారు. వీరి ఇళ్లలో ఘోర యుద్ధాలు జరుగుతాయి. వాటి ఫలితం పక్కవాటాల వాళ్ళు అనుభవిస్తారు. ‘నీ బుర్ర పగలకొడతాను’ అని శపథం చేస్తాడు ఈయన. ‘నీ కింత విషం పెడతాను’ అని ప్రతిశపథం చేస్తుంది ఆమె. బుర్రలూ పగలవు, విషాలు తినరు కానీ పక్కవాళ్ళకి తల నొప్పి మిగులుతుంది. వీరి మధ్యలో కొందరు అజ్ఞానులు ఉంటారు. వీరు కొంత కాలం యోగీశ్వరులై ‘అంతా భార్యేచ్ఛ’ అనుకుంటూ (ముఖ్యంగా పెళ్ళైన కొత్తలో) గడుపుతారు. కొంత కాలం తరువాత కొద్దిగా జ్ఞానం కలుగుతుంది. అసురులవుతారు. మరి కొంత కాలం గడుస్తుంది. పూర్తిగా జ్ఞానవంతులు అవుతారు. అజ్ఞానం తొలిగి పోతుంది. లౌక్యులయిపోయి ‘అన్యదైవమూ కొలువా…’ అని పాడుకుంటూ భార్య కొంగు పట్టుకు తిరుగుతారు. మరో మార్గం లేదు. ఇది యుగ యుగాలుగా నడుస్తున్నది.

అమృతరావు కూడా అట్టహాసంగా అట్టహాసంతోనే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి ఫోటోలలో కూడా పాపం నవ్వుతూనే పడ్డాడు. పెళ్లి చేసుకొని వెంటనే ఆరాధనని తీసుకొచ్చి కాపురం పెట్టేశాడు హైదరాబాదులో నవ్వుతూనే. పెళ్ళైన కొత్త కొత్తలో అమృతరావుకి భార్యపైన ప్రేమతో బాటు కడివెడు జాలి కూడా ఉండేది. పాపం, తనను నమ్మి, వాళ్ళ వాళ్ళందరిని వదిలి వచ్చింది అని. వెఱ్ఱి కుంక, పిచ్చి వెధవ అయిన వాడునూ, నూతనసతీప్రణయావేశంలో ఉన్నవాడునూ అయిన మొగుడికి తెలియదు, పెళ్ళాం ఎప్పుడూ మొగుడిని నమ్మదు అని. కేవలం నమ్మినట్టు నటిస్తుంది అని తెలుసుకోలేడు. ఈ నటనలో సావిత్రి, మీనాకుమారి, సోఫియా లారెన్ మొదలైనవారు దిగదుడుపే. పెళ్ళైన కొత్తలో వెఱ్ఱి మొగుడికి భార్య ఇలియానా లాగానో, నిత్యామీనన్ లాగానో కనిపిస్తుంది. ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో’ తన అదృష్టం కొద్ది తనింట్లోకి వచ్చింది అని అబ్బుర పడతాడు. ఆవిడ ముఖం వికసించిన పద్మం లాగా కనిపిస్తుంది. చీకటి పడిన తరువాత ఆమె ముఖం మీద వాలే దోమలని చూసి తుమ్మెదలని భ్రమపడతాడు కూడానూ. మేఘాలు ఆవిడ ముంగురులలోనే ఉండాలి కానీ ఆవిడ కన్నుల్లో కాపురం పెట్టనివ్వను అని ప్రతిజ్ఞ చేస్తాడు. ‘మలయానిల లాలనలో పదే పదే పరవశమై గానమేలు ఎలకోయిల గళ మధురిమ’ ఆమె స్వరంలో వినిపిస్తుంది. ఆమె కదలికలలో, మేఘనాదంతో పరవశమైన నెమలి నాట్యం అగుపిస్తుంది. ‘కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే’ అని వాగ్దానం చేసేస్తాడు. అంతటితో ఆగకుండా ఆపైన అడక్కుండా కూడా తీసేసుకో అని హృదయ బీరువా, ఇనుప బీరువా రెంటివీ తాళాలిస్తాడు. ఈ మైకంలో భార్య చేసిన వంట కూడా లేలేత మావి చిగురు తినే కోయిల లాగానే ఆరగిస్తాడు. ఇది మొగుడి జీవితంలో ప్రథమాధ్యాయం. హృదయంలో స్థానమిస్తే, గుండెల్లో నిద్ర పోతారు అని తెలియని వసంతకాలం అది.

అందరి మొగుళ్ళ లాగానే అమృతరావు కూడా భార్యారాధనాపర్వం యధావిధంగా శాస్త్రోక్తంగా నిర్వర్తించాడు. పాటల్లో తన ప్రణయాన్ని చిలికించాడు. ఆరాధన కూడా పాటకు పాట నేర్చుకుంది. ‘ముదితల్ నేర్వగరాని విద్య కలదే అమ్మూ’ అన్నది గోముగా. అమృతరావు ఏ. ఏ. కే. హెచ్. విందుడు, అంటే అమందానంద కందళిత హృదయారవిందుడయిన రోజులవి. అదృష్టవశాత్తూ ఇంగ్లీషు అక్షరాలకు కరువు రాకముందే పర్వం పూర్తయింది, తర్వాత ద్వితీయాధ్యాయం మొదలైంది. అలా మొదలైన కొన్ని రోజులకు, అమృతరావు ప్రథమాధ్యాయపు జమాఖర్చులు చూసుకున్నాడు. బేంకు బాలెన్స్ బేరీజు వేసుకున్నాడు. ఔరా, ఔరౌరా! అనుకున్నాడు. పెళ్ళికి ముందు రెండు ఏళ్లు కష్టపడి, ఇంట్లో నింపిన సామానుతో బాటు రూ.48వేలు బేంకులో కూడా నింపాడు. ఎందుకైనా మంచిదని పెళ్ళికోసం త్రిఫ్ట్ సొసైటీలో రూ.25వేలు అప్పుచ్చుకున్నాడు. పెళ్ళికి 25వేల500, కాపురం పెట్టటానికి, ఇంటి సామాన్ల కోసం ఇంకో 10వేల500 ఖర్చు చేశాడు. గృహ లక్ష్మి గృహప్రవేశం చేసేటప్పటికి బేంకులో ఉన్న రూ.37వేలు, పెళ్లి పురాణం ద్వితీయాధ్యాయానికి వచ్చేటప్పటికి రూ.10వేలకి కొంచెం తక్కువుగా రూపాంతరం చెందింది. ఘట్టిగా నిశ్వసించాడు. ఎందుకైనా మంచిదని, గృహాధిదేవత చూడకుండా మౌనాశ్రువులు కార్చేడు. ద్వితీయాధ్యాయం ప్రథమ భాగంలోనే ఉన్నాడు కాబట్టి ఆరాధనని ఏమైనా అనడానికి హృదయం ఒప్పుకోలేదు. డైరీ అనబడు గృహ ఖర్చుల నమోదు పుస్తకం తీసి విశ్లేషించాడు.

ఆశ్చర్యంగా ఈ నాలుగు నెలల్లోను సగటున రోజుకో సిగరెట్టు పాకెట్ తక్కువ అయినట్టు ఆశ్చర్య వదనార విందుడైన అమృతరావు గుర్తించాడు. నెలకి చేసుకునే రెండు మందు పార్టీల ఖర్చు కనబడలేదు. అనగా తన ఖర్చులో నెలకి సుమారు రూ.1500 దాకా ఆదా అయిందని సంభ్రమాశ్చర్యాలతో సంతసించాడు. చేతికి వచ్చిన రూ.35వేల500లో ఇంటికి పంపిన రూ.7వేల500 మైనస్ చేసి, ఆదా అయిన రూ.1500 ప్లస్ చేసి, ఈక్వల్‌టూ రూ.29వేల500 అని కని పెట్టాడు. ఇదికాక బేంకు లోంచి తీసినది సగటున నెలకి రూ.6,750 ప్లస్ చేసి రూ.36,250 అని నిర్ధారణకి వచ్చాడు. ఇదంతా ఖర్చు అయిందా? అని ఆశ్చర్య పడ్డాడు, చకితుడయ్యాడు, విభ్రమానికి గురి అయ్యాడు. ఈ పధ్ధతి మారాలి అని తీర్మానించుకున్నాడు.

తీర్మానమయితే చేసుకున్నాడు కానీ అమలు చేయడమెట్లో అర్ధం కాలేదు. ఇంటి అద్దె లేదు. తండ్రి సంపాదించి ఇచ్చిన ఫ్లాట్ లోనే ఉంటున్నాడు. పి.యఫ్., ఇన్స్యూరెన్స్, ఇతర సేవింగ్స్ అన్నీ జీతంలోనే కట్టేస్తున్నాడు. మిగిలినదే చేతికి వస్తుంది. తండ్రికి పంపినది, ఆయన కూడా తన పేరునే మదుపు పెడుతున్నారు. ఇంకా ఆదా చేయాల్సిన అవసరం లేకపోయినా, ఖర్చు అదుపు తప్పుతోందేమో నని భయపడ్డాడు. భార్యామణికి సున్నితంగా, సవివరంగా ‘ఆర్ధిక విషయాలు – గృహిణి పాత్ర’ అనే విషయంపై తత్వబోధ చేద్దామనుకున్నాడు. కానీ ఆమె ప్రతిస్పందన ఎలా ఉంటుందో అని అనుమానపడ్డాడు. ‘బృందావనమది మన ఇద్దరిది’ అని పాడిన నోటితోనే ‘తెలుసుకొనవె యువతి ఇలా నడుచుకొనవె యువతీ’ అని ఎలా చెప్పాలా అని మథనపడ్డాడు. కాలం గడిచిన కొద్దీ ఆమెకు ఆర్థిక అవగాహన కలుగుతుందేమోనని సరి పెట్టుకుందామనుకున్నాడు కానీ అప్పటికే కాలాతీతమవుతుందేమో నని భయపడ్డాడు. పోనీ అన్యాపదేశంగా ‘రావోయి చందమామ మా ఖర్చు తెలుసుకొనుమా’ అని పాడుదామనుకున్నాడు కానీ ఆమె, తిరిగి ఏం పాడుతుందో అని అనుమానం వచ్చింది. ఆడువారితో అంత్యాక్షరి అందులోనూ ఆరాధనతో! అమృతరావు ఆపదను శంకించి ఆగిపోయాడు.

ఆర్ధిక విశ్లేషణలో కొన్ని నగ్నసత్యాలు కూడా బైటపడ్డాయి. వారానికి మూడు సినిమాలు, నాలుగు హోటల్ బిల్లులు కూడా కనిపించాయి. పెళ్ళిలో అన్ని చీరలు పెట్టినా, పెళ్ళైన వెంటనే ఇన్ని చీరలు, డ్రెస్సులు కొనడంలో అంతరార్థం అర్థం కాలేదు. పెట్రోల్ ఖర్చు కూడా రెట్టింపు అయినదని గ్రహించాడు. ఈ హైదరాబాదులో ఇన్ని హోటల్స్ ఎందుకో, అన్ని సినిమా హాళ్ళు ఎందుకో అని విచారించాడు. తమకి ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ భాషాజ్ఞానం ఉండడం తప్పేమోనని ఆవేదన చెందాడు. మలయాళం, మరాఠి రానందుకు సంతోషించాడు. ఈ సినిమాలు కూడా వారానికో కొత్తది రావడం ఏమిటో అని కోప్పడ్డాడు. ఒకటో రెండో భాషలు తప్ప మిగతా వాటిని నిరాదరించాలేమోననే ఊహ కూడా వచ్చింది. పెళ్ళైన తరువాత కూడా ఇంత హోటల్ బిల్ ఆశ్చర్యకరంగానే ఉందని మరోమారు ఆశ్చర్యపడ్డాడు. ఏమైనా ప్రజాస్వామ్య పద్ధతిలో భార్యతో మంతనాలు జరపి నిర్ణయాలు తీసుకోవాలి అనుకున్నాడు. లేకపోతే రెండు మూడు నెలల తరువాత, ‘ధర్మం చెయి బాబూ పదివేలు ధర్మం చెయి బాబూ’ అని తండ్రి ముందు చేయి జాపాలేమోనని భయపడ్డాడు. కాకపొతే ఏదో ఒక సేవింగ్స్ ఖాతా ఆపెయ్యాలేమోనని కూడా విచారించాడు.

ఈ విధంగా అమృతరావు ఆలోచనా సాగర మథనం చేస్తుండగానే ‘బాలనురా మదనా, చిలుకల వలె గోర్వంకల వలెనూ కులుకగా తోచునురా మదనా’ అని ఆరాధన వచ్చి పాడేటప్పటికి అమృతరావు ఆనందోత్సాహ వదనార విందుడై తన జమా ఖర్చుల డైరీ మూసేసి ‘రాగ సుధారస పానము జేసి రాజిల్ల’టానికి ఆరాధనని సినిమాకి తీసుకెళ్ళాడు. ఇలా ఆరాధనాంతరావంతరాలలో ఈ ధనఋణసాగరమథనం పూర్తికాకుండానే పెళ్లి పురాణం ద్వితీయాధ్యాయం, ఉత్తరార్థం లోకి వచ్చేశాడు. బేంకు బేలన్సు ఇంకా కిందకు వెళ్ళిపోయింది. త్వరలో నిర్ణయాలు తీసుకోకపోతే, సిగ్గు విడిచి తండ్రి ముందు మోకరించాల్సిన పరిస్థితి కనుచూపు మేరలో కనిపించింది. ఏదో విధంగా చర్చలు మొదలు పెట్టాలి అనుకున్నాడు. ఒకరోజు ధైర్యం చేశాడు.

“కిందటి నెల నాలుగు మాట్లు పిజ్జా తెప్పించాము. అన్నిటికన్నా కొత్తపేట బేకరీలోదే బాగుందేమో కదా అరూ” (యథాలాపం.)

“నాకు అబిడ్స్ నుంచి తెప్పించినదే బాగుంది అమ్మూ.” (నిశ్చితం.)

“అయినా భోజనం బదులు పిజ్జా అన్ని మాట్లు తింటే ఆరోగ్యం చెడిపోతుందట, అరూ.” (సంశయం.)

“రాళ్ళు హరాయించుకునే వయసు మనది. మరేం ఫరవాలేదు, అమ్మూ” (నిశ్చితం.)

“ఏమైనా అరూ, ఇంటి భోజనం కన్నా ఏదీ బాగుండదు” (తెగింపు.)

“నేను చేసే వంట కన్నా ఏదైనా ఫరవాలేదు” (నిశ్చితం.)

“ప్రయత్నిస్తే నువ్వు వంట బాగానే చెయ్యగలవు. మొన్న బిర్యానీ బాగా చేశావు.” (పిచికాస్త్రం.)

“అన్ని మాట్లు చేస్తే ఒక్క మాటు కుదిరింది. అయినా మీరు అర్ధాకలితో పడుకోవడం నాకు ఇష్టం లేదు. ” (బ్రహ్మాస్త్రం!)

అమ్మూకి ఏం చెప్పాలో తోచలేదు. కానీ మొహంలో దరహాసం కొంచెం ధర తగ్గింది. అట్టహాసం అర్థహాసంగా మారి ఏ.వీ. విందుడి అర్థం మారింది.

ప్రయాణంలో మొదటి అడుగు ఎప్పుడూ కష్టంగానే ఉంటుందని సమాధానపడ్డాడు అమృతరావు. ద్వితీయ విఘ్నం ఉండకూడదుట అని శాస్త్రం గుర్తుకు తెచ్చుకున్నాడు. పునఃప్రయత్నం చెయ్యాల్సిందేనని తీర్మానించుకున్నాడు. తీర్మానాలే మిగులుతాయేమో అని సందేహపడ్డాడు. అయినా ప్రయత్న లోపం ఉండకూడదని మళ్ళీ తీర్మానించుకున్నాడు. ఒక ఆదివారం మేటనీ చూసి, టాంక్‌బండ్ మీద చాట్ తిని, ఇంటికి వచ్చేటప్పుడు పిజ్జా తెచ్చుకున్న రోజున మళ్ళీ ఉపక్రమించాడు.

“ఈ నెలలో ఇది ఐదో మాటు పిజ్జా తెచ్చుకోవడం. పక్క పదార్ధాలతో కలసి రూ.650 అయింది. అసలు పిజ్జాకన్నా దిబ్బరొట్టి చేసుకుంటే మంచిది. పదో వంతు మాత్రమే ఖర్చు అవుతుంది. శాస్త్రీయము, రుచికరము, ఆరోగ్యానికి రక్ష కూడాను.” చర్చ మొదలు పెట్టేడు అమ్మూ.

“ఆదా మాట నిజమే కానీ పిజ్జా బజారులో దొరుకుతుంది ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు. దిబ్బ రొట్టి ‘స్వగృహా’లో ఆర్డర్ చెయ్యాలి కనీసం ఒక రోజు ముందు. వాళ్ళు కూడా రెండు వందలు తీసుకుంటారు, చట్నీకి అదనం. ఆరోగ్యం గురించి నాకు తెలియదు కానీ పిజ్జా కన్నా రుచికరం అన్నది నేనొప్పుకోను. ఇంట్లో చేయను, దిబ్బ రొట్టి చేయడం నాకు చేతకాదు.” ఖరాఖండీగా చెప్పేసింది అరూ.

“దిబ్…”

“అయినా, ఇత్తడి సిబ్బె, పళ్ళెం కావాలి, అవి మన దగ్గర లేవు. పళ్ళెం మీద బొగ్గులు కావాలి. బొగ్గుల పొగతో కిచెన్ పెయింట్ నాశనమవుతుంది. స్మోక్ డిటెక్టర్ కుయ్యోమంటుంది. దాన్ని ఆపటం నాకు చేతకాదు.” కొనసాగించింది అరూ.

“అబ్జెక్షన్ యువర్ ఆనర్, కిచెన్లో చిమ్నీ ఉంది. దానికో ఎగ్జాస్ట్ ఫాన్ ఉంది. పొగ ప్రాబ్లం కాదు. బొగ్గులు అవసరం లేకుండా కూడా దిబ్బ రొట్టి చేయవచ్చు” అడ్డు తగిలాడు అమ్మూ.

“పిజ్జా తినడం నాగరికుల లక్షణం. పక్కింటి సిన్హా ఆంటీ వారానికి రెండు మాట్లు తెప్పిస్తుంది. ఎదురింటి నిలువు నామాల శ్రీనివాస అయ్యంగారు గారు కూడా బేకరీలలో కూర్చుని బర్గర్, పిజ్జా తినడం మనం చూశాం. మీ ఆఫీసులో కూడా బర్గర్స్, పేస్త్రీలు ఇస్తారు కానీ దిబ్బ రొట్టి ముక్కలు ఇవ్వరు. తోటి సావేయిర్లలో మనం తల ఎత్తుకు తిరగాలంటే పిజ్జాలు, బర్గర్స్ తినాల్సిందే!” జడ్జిమెంట్ ఇచ్చేసింది అరూ.

ఎప్పటి లాగానే అమ్మూ నిరుత్తరుడయ్యాడు. దరహాసం మరింత ధర తగ్గింది. అర్థం అర్థార్థం అయింది. ఇలా అయితే ఎన్ని వేలు కావాలో అని విందుడికి భయమూ వేసింది.

పట్టు వదలని విక్రమార్కుడి లాగా ఇంకో మూడు మాట్లు ప్రయత్నించాడు అమ్మూ. రెండు మాట్లు అమ్మూ దరహాసం ఇంకా ఇంకా చిన్నబోయింది. మూడో మాటు దరహాసం పూర్తిగా మాయమయింది. ‘ఆవకాయ మనదైనా గోంగూర పచ్చడి స్వగృహా ఫుడ్స్ దేలే’ అనుకున్నాడు. ఇంట్లో వండిన ‘గుత్తి వంకాయ కూర కలుపుకొని పాతిక ముద్దలు పీకే’ అనుభవం తనకి మృగ్యం అని విచారించాడు అమ్మూ. సోక్రటీసులను ఇలా తయారు చేస్తారా అని కూడా ఆశ్చర్యపడ్డాడు. అలా ఆశ్చర్యపడుతూ విచారిస్తూనే రెండేళ్లు గడిచిపోయాయి పాపం అమ్మూకి. అదృష్టవశాత్తు జీతం పెరగడంతో తండ్రి ముందు చేయి జాపాల్సిన అవసరం కలగలేదు. కానీ ఏ. వీ. విందుడు ఏమీ లేని విందుడయాడు, ఆపైన అమావాస్య చంద్రుడయాడు. గొంతు శృతి తప్పింది. పాట మూగపోయింది.