వాణి నారాణి

పాత్రలు

పినవీరభద్రుడు – కథానాయకుడు, ఆంధ్రకవిపుంగవుడు
పెదవీరభద్రుడు – పినవీరభద్రుని అన్నగారు
గాదిరాజు – పినవీర,పెదవీరభద్రుల తండ్రి
నాగాంబిక – పినవీర,పెదవీరభద్రుల తల్లి
భారతీతీర్థస్వామి – విజయనగరరాజ్యప్రభువు
చిల్లర వెన్నయామత్యుడు – గాదిరాజ,వీరభద్రాదుల గురువు
సింగన – వ్రాయసకాడు
మదాలస – విజయనగరాస్థాననర్తకి
మణిప్రభ – మదాలస సేవిక

ఇంకను మంత్రి, సేవికలు, సదస్యులు, పురోహితుడు, బ్రాహ్మణులు మున్నగువారు.

మొదటి దృశ్యము

(సమయం: మధ్యాహ్నం 3గంటలు. స్థలం: విజయనగరసమ్రాట్టు సాళువ నరసింహరాయల సాహితీ సభామండపం. నేపథ్యంలో వందిమాగధులు జయగీతికలు, ఆ తర్వాత వేదవిప్రులు ‘ధ్రువం తే’ అను మంత్రమును చదువుచుండగా, మంత్రికవిపండితులతో గూడిన సభామందిరాన్ని అతడు ప్రవేశించి సింహాసనాసీను డౌతాడు.)

వంది
మాగధులు:

విజయనగరసామ్రాజ్యాధీశ్వర, రాజాధిరాజ, రాజపరమేశ్వర! జయము! జయము!
నిఖిలదక్షిణాపథభూభారధౌరేయ, మేదినీవరాహబిరుదాంక! జయము!జయము!
దుర్వారగర్వితారివిదళనకరవాల, కటారిసాళువబిరుదాంక! జయము! జయము!
పాండురయశోగండూషితనిర్జరాపగాకాండ, గుండయనరసింహభూమండలాఖండల! జయము! జయము!

వేదవిప్రులు:

ధ్రు॒వం తే॒ రాజా॒ వరు॑ణో ధ్రు॒వం దే॒వో బృహస్ప॒తిః॑| ధ్రు॒వం త॒ ఇన్ద్ర॑శ్చా॒గ్నిశ్చ॑ రా॒ష్ట్రం ధా॑రయతాం ధ్రు॒వమ్||

రాయలు:

మంత్రిసత్తములు, కవిసత్తములు, వేదమూర్తులైన బ్రాహ్మణోత్తములతో బ్రశస్తమైన ఈ సభకు నమస్కారము. మా పరిపాలనలో మీ సుఖసంపదలకు లోటు లేదు కదా!

మంత్రి:

పంచపాండవుల మెండైన దండితనంబునకు నిండైన మూర్తులై, ఐవరగండులని యఖండకీర్తిని వహించి, దానశౌండులై, కవిపండితపక్షపాతులైన తమరి పాలనలో సుఖసంపదలకు లోటేమి యుండును మహారాజా!

ఒక
సదస్యుడు:

అందుకే కదా,

యః పంచశాఖశాఖాభి ర్జిత్వా పంచామరద్రుమాన్!
పంచఘంటానినాదోఽభూత్ పంచఘంటానినాదనాత్||
సత్య సత్త్వేషు సంధాన రూప లావణ్య ధీగుణైః|
జిత్వా యః పాణ్డవాన్ పంచ ప్రాపదైవరగండతామ్||

అని పంచామరద్రుమములదాతృత్వమును కుంచించు తమరి వదాన్యతను, పంచపాండవుల గుణపరంపరను నిరసించు తమరి సత్యసంధతను, దోస్సత్త్వాన్ని, శరసంధానచాతుర్యాన్ని, రూపసంపదను, ధీశక్తిని కవులు ప్రస్తుతించుచున్నారు.

రాయలు:

ఆప్తులారా! నాకు వయసు మీరుచున్నది. ఆదినుండియు సంగ్రామక్రీడాసక్తమైన నా మేనున క్రమముగా శక్తి సన్నగిల్లుచున్నది. అది సన్నగిల్లిన కొలది నాకు పురాణేతిహాసశ్రవణ మందు, సాహితీవనవిహరణమందు ఆసక్తి మిన్న యగుచున్నది. వాపీకూపతటాక దేవాయతనపురవన నిర్మాణాది పుణ్యకార్యము లెన్నో నేనింతవఱకు చేసితిని. కాని వీని కన్నింటికంటెను ప్రశస్తమైనది, శాశ్వతమైనది కావ్యము.

ఆదట సప్తసంతతుల యందును నొక్కొక కాలమందు వి
చ్ఛేదము గల్గు నాఱిటికిఁ, జెప్ప విపర్యయ మేయుగంబునన్
లేదు కవిత్వసంతతికి, నిక్కము తత్కవితావిలాసమున్
జాదులు నిష్టదైవము ప్రసాదము నౌ హరికీర్తనంబునన్.

నామది నిరతము భారత
రామాయణకథలఁ బ్రేమ రంజిలు, నందున్
జైమినిభారత మనఁగా
భూమి నపూర్వము పురాణముల గణియింపన్.

ఆ పురాణంబు గనఁ దెనుఁ గయ్యెనేనిఁ,
జెప్పనేర్చిన కవియుఁ బ్రసిద్ధుఁడేనిఁ,
దెనుఁగు నుడికారమున మించు గనియెనేని,
కుందనము కమ్మవలచిన చంద మగును.

అందుచేత, ఈ చరమదశలో ఆంధ్రీకృతజైమినిభారతమును కృతిగా గొని తరింపవలెనని నాకున్నది. కాని ఇందులో ఒక క్లేశ మున్నది. నెలరోజులలో దసరా నవరాత్రులు ఆరంభ మగుచున్నవి. ఈ స్వల్పవ్యవధిలో ఐదువేల శ్లోకములకు పైబడిన ఆ గ్రంథమును మూలానుసారముగా, రసనిర్భరముగా, పాఠకశ్రోతృహృదయాహ్లాదకరముగాఁ దెనిగించి నవరాత్రి ఉత్సవములలో నాకర్పింపగల కవితల్లజు డెవ్వడా యని చూచుచున్నాను.

ఒక కవి:

(లేచి) మహారాజా! మేము కవుల మగుమాట నిజమే. కాని ఈ గడువు లోపల ఇంతటి ఉద్గ్రంథాన్ని అనువదించడం అంత సులభం కాదనుటలో వితథ్యం లేదని నా అభిప్రాయము.

రెండవ
కవి:

దానితో నేనూ అంగీకరిస్తాను. కాని, ఈ విషయమై ప్రభువులకు చింత అవసరం లేదని నా అభిప్రాయం. మీకు విధేయులూ, విజయనగరరాజ్య శ్రేయస్కరులైన నాయకపరంపరలో పిల్లలమఱ్ఱి పెదవీరభద్రుల వారున్నారు గదా! వారి సోదరుడు పినవీరభద్రకవి, ఆ గ్రంథము నిప్పుడిప్పుడే అనువదింప నుద్యుక్తుడైనాడని నేను విన్నాను. ఈ కార్యమును నిర్వహించుటకు ఆ మహాకవీంద్రుని కంటె సమర్థులు వేరొకరు లేరని నాభావన.

తాతయుఁ, దండ్రియు, నగ్ర
భ్రాతయునుం దాను భువనభాసురకృతిని
ర్మాతలు, పిల్లలమఱి వి
ఖ్యాతునిఁ బినవీరుఁ బోలఁగలరే సుకవుల్.

అమృతాంశుమండలం బాలవాలము గాఁగ
            మొలిచె నొక్కటి జగన్మోహనముగ,
చిగురించె విలయసింధుగత కైతవడింభ
            శయనీయవరపలాశములతోడ,
పితృదేవతలకు నంచితసత్త్రశాలయై
            చెట్టుగట్టెను గయాక్షేత్రసీమ,
నిలువ నీడయ్యె నిందీవరప్రియకళా
            కోటీరునకు భోగికుండలునకు,

మఱ్ఱి మాత్రంబె పిల్లలమఱ్ఱి పేరు
పేరువలెఁ గాదు శారదాపీఠకంబు
వారిలోపలఁ బినవీరు వాక్యసరణి
సరసులకు నెన్నఁ గర్ణరసాయనంబు.

మూడవ
కవి:

ఔను మహారాజా! సుధామధురమగు వాగలంకారవైదుష్యముచే నతడు మున్నుగ అవతారదర్పణము, నారదీయపురాణము, మాఘమాహాత్మ్యము, మానసోల్లాసము రచించినాడు. ఇటీవల శృంగారశాకుంతలమను సుందరప్రబంధమును రచించి చిల్లర వెన్నయామాత్యుల కంకితము చేసినాడు. కాళిదాసు శాకుంతలము వలె ఈ శాకుంతలమును అనర్ఘరసాలవాలమై యున్నదని విన్నాను.

అల్లన విచ్చు చెంగలువలందురజంబును కప్పురంబు పైఁ
జల్లఁగఁ జల్లనై వలచు సౌరభముల్ వెదచల్లు భావముల్
పల్లవహస్త చన్నుఁగవపయ్యెద జీబుగఁ దోఁచు భాతిగాఁ
బిల్లలమఱ్ఱి వీరన యభిజ్ఞఁడు చెప్పఁగ నేర్చుఁ గబ్బముల్.

కావున దూరమున నున్నను మీ మనోరథము నెఱింగినవాని వలె జైమినిభారతాశ్వమేధపర్వమును రచింప నుద్యుక్తుడైన ఆ మహాకవిని రప్పించి ఆతనికీ పురాణరచనాభారము నప్పగించిన చక్కగా నుండునని ఇచ్చటి కవిపండితుల వాక్యముగా నేను మీకు విన్నవించు కొనుచున్నాను.

ఏరీతి నెఱిఁగెనో పిన
వీరన దేవరతలంపు విఖ్యాతముగాఁ
బేరును బెట్టిదియును దన
పేరుగ రచియింపఁ బూనెఁ బేశలఫణితిన్.

రాయలు:

సభ కిది అంగీకార్యమేనా?

సభ:

అవశ్యము మహారాజా! ఇంత స్వల్పవ్యవధిలో అంతటి బృహత్తరపురాణానువాదము చేయ గల సమర్థుడు పినవీరభద్రు డనుటలో సందియము లేదు. కాని అతడిప్పుడు వెన్నయామాత్యుని కొలువులో సోమరాజుపల్లెలో నున్నాడు. సత్వరమే మీయాస్థానమునకు రప్పించి ఈ కార్యమును నిర్దేశించిన మీ గడువు లోగా నతడు గ్రంథమును పూర్తి చేయగలడని మాకు పరిపూర్ణ విశ్వాసమున్నది.

రాయలు:

అట్లే కానిండు. పినవీరభద్రుని వెంటనే సాదరముగా నాయాస్థానమునకు బిలువ బంచెదను.

రెండవ దృశ్యము

(స్థలం: పిల్లలమఱ్ఱి గ్రామం. సందర్భం: పిల్లలమఱ్ఱి గాదిరాజు, నాగాంబ దంపతుల యొక్క కవల పిల్లలు పెదవీరభద్రుడు, పినవీరభద్రుల ఉపనయనాంతాశీర్వచనఘట్టము.)

గాది:

కుమారులారా, మీ ఉపనయనమందలి చివరిఘట్టము వేదమూర్తులైన శ్రోత్రియుల ఆశీర్వాదము. మౌంజీపలాశదండధారులైన మీరిట తూర్పుముఖముగా పీటలపై కూర్చుండుడు. (వటువు లట్లే కూర్చుందురు)

వేదవిప్రులారా! చిరంజీవులకు మీ అనర్ఘమైన ఆశీర్వాదం అనుగ్రహించండి.

బ్రాహ్మణులు:

(రత్నకంబళముపై కూర్చొని రెండు వర్గములుగా నేర్పడి ఒకవర్గం ఒక వాక్యాన్ని పఠిస్తే రెండవవర్గం తరువాతి వాక్యాన్ని పఠిస్తూ క్రింది మంత్రములను చదువుతారు. చిట్టచివరి ‘శతమానం భవతి’ అను వాక్యమును అందఱు కలిసి చదువుతారు.)

మే॒ధా దే॒వీ జు॒షమా॑ణా న॒ ఆగా᳚ద్వి॒శ్వాచీ॑ భ॒ద్రా సు॑మన॒స్యమా॑నా|
త్వయా॒ జుష్టా॑ ను॒దమా॑నా దు॒రుక్తా᳚ న్బృ॒హద్వ॑దేమ వి॒దధే॑ సు॒వీరాః᳚|
త్వయా॒ జుష్ట॑ ఋ॒షిర్భ॑వతి దేవి॒ త్వయా॒ బ్రహ్మా॑గ॒త శ్రీ॑రు॒త త్వయా᳚|
త్వయా॒ జుష్ట॑శ్చి॒త్రం వి॑న్దతే వసు॒ సా నో॑ జుషస్వ॒ ద్రవి॑ణో-నమేధే|
మే॒ధాం మ॒ ఇన్ద్రో॑ దదాతు మే॒ధాం దే॒వీ సర॑స్వతీ|
మే॒ధాం మే॑ అ॒శ్వినా॑ వు॒భా వాధ॑త్తాం॒ పుష్క॑రస్రజా|
అ॒ప్స॒రాసు॑ చ॒ యా మే॒ధా గ॑న్ధర్వేషు॑ చ యన్మనః॑ |
దై᳚వీం మే॒ధా సర॑స్వతీ॒ సామాం᳚ మే॒ధా సురభి॑ ర్జుషతా॒గ్॒౦ స్వాహా᳚|
ఆమాం᳚ మే॒ధా సు॒రభి॑ ర్వి॒శ్వరూ॑పా॒ హిర॑ణ్యవర్ణా॒ జగ॑తీ జగ॒మ్యా|
ఊర్జ॑స్వతీ॒ పయ॑సా॒ పిన్వ॑మానా సామాం᳚ మే॒ధా సు॒ప్రతీ॑కా జుషన్తామ్|
మయి॑ మే॒ధాం మయి॑ ప్ర॒జాం మయ్య॒గ్ని స్తేజో॑ దధాతు॒ మయి॑ మే॒ధాం మయి॑ ప్ర॒జాం మయీన్ద్ర॑ ఇన్ద్రి॒యం ద॑ధాతు॒ మయి॑ మే॒ధాం మయి॑ ప్ర॒జాం మయి॒ సూర్యో॒ భ్రాజో॑ దధాతు|

శ॒తమా॑నం భవతి శ॒తాయుః॒ పురు॑ష శ్శ॒తేన్ద్రి॑య॒ ఆయు॑ష్యే॒వేన్ద్రి॒యే ప్రతి॑తిష్ఠతి||

(ఆశీర్వచనగద్యములు: ఒక బ్రాహ్మణవర్గము గద్యమును చెప్పగా రెండవవర్గము తథాస్తు అనును. తథాస్తు అన్న వర్గము తదుపరి గద్యమును చెప్పగా, ముందటి వర్గము తథాస్తు అనును.)

ఇమౌ బ్రహ్మచారిణౌ మధురకంఠస్వరాధీత ఋగ్యజుస్సామాథర్వణ సంహితా బ్రాహ్మణ వేద వేదాఙ్గ సకలవిద్యాపారఙ్గతౌ భూయాస్తా మితి భవన్తః శ్రీమన్తో మహాన్తోఽను గృహ్ణన్తు|| తథాస్తు||

అనయో ర్బ్రహ్మచారిణోః ప్రణవశ్రద్ధామేధాప్రజ్ఞా ధారణాసిద్ధి ర్భూయాదితి భవన్తః శ్రీమన్తో మహాన్తోఽను గృహ్ణన్తు|| తథాస్తు||

అనయో ర్బ్రహ్మచారిణోః అనవద్యగద్యపద్యహృద్యవరవిద్యావైశద్యబుద్ధి ర్భూయాదితి భవన్తః శ్రీమన్తో మహాన్తోఽను గృహ్ణన్తు|| తథాస్తు||

అనయో ర్బ్రహ్మచారిణో శ్శమ దమ తప శ్శౌచ శాన్తి జ్ఞానార్జ వాస్తిక్యాది నిత్యాత్మగుణసమృద్ధి ర్భూయాదితి భవన్తః శ్రీమన్తో మహాన్తోఽను గృహ్ణన్తు|| తథాస్తు||

గాది:

(ఆశీర్వచనానంతరమున) కుమారులారా! ఈ బ్రాహ్మణోత్తములకు పాదాభివందనం చేసి, తాంబూలదక్షిణలను ప్రదానం చేయండి.

(వటువు లట్లు చేయగా విప్రులు ‘దీర్ఘాయుష్మాన్ భవ’ అని వటువులను దీవించి నిష్క్రమిస్తారు.)

వటువులారా! మీకింక గురుకులవాసము చేయవలసిన సమయము వచ్చినది. శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీభారతీతీర్థస్వామివారు కరుణాళువులై నాకుపదేశించిన వీరభద్రమంత్ర ప్రభావఫలముగా మీరు కవలలుగా జన్మించితిరి.

పూర్వోదంతప్రదర్శనము

(స్థలం: పిల్లలమఱ్ఱి గ్రామం. పిల్లమఱ్ఱి గాదిరాజు, అతని భార్య నాగాంబ చెన్నకేశవాలయములో భారతీతీర్థులస్వామివారి ఆధ్వర్యవమున జరుగుచున్న శతరుద్రయాగమును వీక్షించుటకు వచ్చి, స్వామివారిని దర్శించుకుంటారు. నేపథ్యంలో క్రమముగా సన్నగిల్లుచున్న ఎలుగుతో ఈ క్రింది రెండు మంత్రములు వినిపించుచుండును. భారతీతీర్థులవారు రుద్రాక్షమాలాలంకృతులై, కృష్ణాజినముపై ఆసీనులై ఉంటారు)

నమో॑ రు॒ద్రేభ్యో॒ యే᳚ఽన్తరి॑క్షే॒ యేషాం॒ వాత॒ ఇష॑వ॒ స్తేభ్యో॒ దశ॒ప్రాచీ॒ర్దశ॑ దక్షి॒ణాదశ॑ ప్ర॒తీచీ॒ ర్దశోదీ॑చీ॒ర్దశో॒ర్ధ్వా స్తేభ్యో॒ నమ॒స్తేనో॑మృడయన్తు॒ తేయం ద్వి॒ష్మో యశ్చ॑నో॑ ద్వేష్టి॒ తం వో॒ జమ్భే॑దధామి॒స్వాహా᳚| రుద్రాయేదం నమమ||

నమో॑ రు॒ద్రేభ్యో॒ యే ది॒వి యేషాం ᳚వ॒ర్‌॒షమిష॑వ స్తేభ్యో॒దశ॒ప్రాచీ॒ర్దశ॑ దక్షి॒ణాదశ॑ ప్ర॒తీచీ॒ ర్దశోదీ॑చీ॒ర్దశో॒ర్ధ్వా స్తేభ్యో॒ నమ॒స్తేనో॑మృడయన్తు॒ తేయం ద్వి॒ష్మో యశ్చ॑నో॑ ద్వేష్టి॒ తం వో॒ జమ్భే॑దధామి॒స్వాహా᳚| రుద్రాయేదం నమమ||

గాది:

అభివాదయే కాశ్య పావత్స రాసిత త్రయార్షేయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రః, ఆపస్తంబసూత్రః, యజుశ్శాఖాధ్యాయీ గాదిరాజశర్మా అహమస్మి భోః||

(అని గోత్రప్రవర పఠించి పత్నీసహితముగా సాష్టాంగప్రణామము చేయును.)

భారతి:

శుభమస్తు. గాదిరాజశర్మా! మీ దంపతులు కుశలమే కదా! మీయందఱి ఆస్తికత, వస్త్వర్థ శ్రమప్రదానము వల్లనే ఈ సవనము కాకతీయచక్రవర్తులు సాక్షాత్కైలాససంకాశముగా నిర్మించిన ఈ యీశ్వరాలయప్రాంగణములో చక్కగా సాగుచున్నది. దీనికి ముఖ్యముగా మీకుటుంబ సహకారము కడు శ్లాఘనీయముగా నున్నది.

గాది:

అంతయు మీయనుగ్రహము. మీరిచ్చటికి వేంచేసి మీ యాధ్వర్యవమున దీనిని నడిపించుట మా పిల్లలమఱ్ఱివాసుల అదృష్టము. మీ మహత్త్వము జగద్విదితము. ఇట్టి మహత్తును మా గ్రామములో ప్రత్యక్షముగా దర్శింపగల్గుట మా అదృష్టము.

భారతి:

శర్మా! మీరేదో కార్యార్థులై వచ్చినట్లు నాకుఁ దోఁచుచున్నది.

గాది:

అవును స్వామీ! మాదాంపత్యలత ఇంకను ఫలోన్ముఖము కాలేదు. మీ ఆశీర్వాదబలముచే అది ఫలోన్ముఖ మగునను ఆశతో మీ అనుగ్రహార్థులమై వచ్చినాము.

భారతి:

నా యుపాస్యదేవత యైన శారదాదేవి అనుగ్రహమువలన మీమనోరథమును ముందుగానే గ్రహించినాను. ఐనను మీనోట వినుటకు ముచ్చటపడి అడిగినాను. శర్మా! నీవు వీరభద్రయంత్ర ప్రతిష్ఠ చేసికొని, ఆయంత్రాంతర్గతమైన మూలమంత్రము నొక వత్సరమాత్రము నిష్ఠతో లక్షసార్లు జపించిన, వీరభద్రుని కరుణవల్ల మీకు సత్సంతానప్రాప్తి యగునని నాకుఁ దోఁచుచున్నది. రేపు ఉదయం రెండవయామం లోపల స్నానసంధ్యాదికములను ముగించుకొని శుచివై నిష్ఠతో నాకడకు రమ్ము. నేను ఆయంత్రప్రతిష్ఠావిధానమును, మంత్రోపాసనవిధానమును ఉపదేశింతును. ఈ ఉపాసన మీకభీష్టఫలప్రదమగు నని నావిశ్వాసము.

గాది:

మహాప్రసాదము యతీంద్రా! ఈ క్షణమునుండే నామనస్సును సంయమించుకొని, మీ యుపదేశ గ్రహణోన్ముఖ మగునట్లు వర్తింతును.

(అని దంపతులు రెండుసార్లు సాష్టాంగదండప్రణామము లాచరింతురు.)

భారతి:

మంచిది. పోయిరండు. వీరభద్రానుగ్రహప్రాప్తిరస్తు! మనోరథసిద్ధిరస్తు!

పూర్వోదంతప్రదర్శనము సమాప్తము

గాది:

అందుచేత మీభవిష్యద్విద్యాపథనిర్దేశమునకు ఆమహానుభావులే సమర్థులు. మీ యిర్వురి నిక వారి సన్నిధానమునకు గొనిపోయి అందుకై అర్థింతును.

వటువులు:

నాన్నగారూ! అంతకంటె కావలసిన దేమున్నది? మీ నిర్ణయమే మాకు సర్వదా శిరోధార్యమూ, శ్రేయస్కరమైనది కదా!

మూడవ దృశ్యము

(స్థలం: భారతీతీర్థుల ఆశ్రమం. వటువులతో గాదిరాజు స్వామివారిని సేవిస్తుంటాడు. నేపథ్యంలో క్రమముగా సన్నగిల్లుచున్న ఎలుగుతో ఈక్రింది మంత్రము వినిపించుచుండును.

ఓం భ॒ద్రం కర్ణే॑భి శ్శ్రుణు॒యామ॑దేవాః| భ॒ద్రం ప॑శ్యేమా॒క్షభి॒ ర్యజ॑త్రాః| స్థి॒రైరఙ్గై ᳚స్తుష్టు॒వాగ్౦ స॑స్త॒నూభిః॑| వ్యశే॑మ దే॒వహి॑తం॒ యదాయుః॑| స్వ॒స్తి న॒ ఇన్ద్రో॑ వృ॒ద్ధశ్ర॑వాః| స్వ॒స్తినః॑ పూ॒షా వి॒శ్వవే॑దాః| స్వ॒స్తి న॒స్తార్క్ష్యో॒ అరి॑ష్టనేమిః| స్వ॒స్తి నో॒ బృహ॒స్పతి॑ ర్దధాతు| ఓం శాన్తి॒ శాన్తి॒శ్శాన్తిః॑|)

గాది:

యతీంద్రులకు గాదిరాజు సవినయసాష్టాంగప్రణామము (గాదిరాజూ, పుత్రులూ సాష్టాంగదండ ప్రణామం చేస్తారు.)

భారతి:

శుభమస్తు! ఈబాలురేనా వీరభద్రోపాసనవల్ల నీకుటంబతరువున చిగురించిన పల్లవములు?

గాది:

ఔను స్వామీ. తమరొసంగిన మంత్రప్రభావంవల్ల విరిసిన చిన్నారిపూవులు వీరే. వీరభద్రమంత్ర ప్రభావంవల్ల జన్మించిన ఈ కవలల కిర్వురికి వీరభద్రనామమే ఉంచి, జ్యేష్ఠుని పెదవీరభద్రా యని, కనిష్ఠుని పినవీరభద్రా యని పిలుస్తుంటాము.

భారతి:

ఔను. నాకు గుర్తుంది. వీరు జన్మించిన దినమందే మహోత్సాహంతో వీరి జన్మకుండలులతో గూడ నీవు నాకంపిన సమాచారం గుర్తుండనే ఉన్నది. కవలలైనా వీరిర్వురి జనన కాలంలో 40 విగడియల తేడా ఉన్నట్లుగా నాకు గుర్తుంది.

గాది:

ఎనిమిది యేండ్ల క్రింద పంపిన ఈయల్పమైన విషయం ఇంతస్పష్టంగా మీ స్మృతిపథంలో ఉండటం అద్భుతమైన మీధారణాశక్తికి నిదర్శనము. ఇది మా అదృష్టఫలం.

భారతి:

కవలల జననసమయంలో సామాన్యంగా అంత యెడముండదు. ఈవిషయమే నాదృష్టి నాకర్షించింది. ఈకాలవ్యత్యాసంవల్ల వీరి జన్మనక్షత్రంలో, రాశిలో, గ్రహకూటమిలో కూడ తేడాలు వచ్చినాయి. ఇద్దరూ ప్రతిభావంతులైన ఉత్తమజాతకులే. అందులో సందేహం లేదు. కాని పెద్దవాని జాతకంలో క్షత్రియతత్త్వాన్ని ప్రతిబింబించే లక్షణాలున్నవి. చిన్నవాని జాతకంలో ఉత్తమకళాస్రష్టయగు లక్షణము లున్నవి. ఇద్దరును రాజపూజితులై చిరకీర్తినంద గల లక్షణ ములు కన్పట్టుచున్నవి.

గాది:

నేను పుట్టగానే జననసమయము, జననకుండలులను గుర్తించితినే కాని ఇంతవఱకు వీరి భవిష్యద్వృత్తము లెట్లుండునో విచారించినవాడను గాదు. మీరు పరిశీలించి ఈవిషయము నింతగా వివరించినందులకు ధన్యుడ నగుచున్నాను.

భారతి:

సందేహము లేదు. ఇర్వురూ ఉత్తమజాతకులనే స్పష్టంగా చెప్పగలను. ఇప్పుడు వీరిని ఇక్కడకు పిలుచుకొని రావడానికి కారణం?

గాది:

మొన్ననే వీరి ఉపనయనము జరిగినది. వీరికి గురుకులవాసము చేయు సమయము వచ్చినది. అందుచేత మీ ఆశ్రమమునందుండి, మీయొక్కయు, మీ ఆశ్రమమునందలి పండితోత్తముల యొక్కయు శుశ్రూష చేసి సుశిక్షితులు కావలె నను ఆశయంతో వీరి నిచ్చటకు గొనివచ్చినాను. వీరిపై మీ అనుగ్రహకటాక్షమును బరపిన కృతార్థుడ నౌదును.

భారతి:

జాతకములు చూడ వీరిర్వురు గనిలో దీసిన వజ్రములవలె నున్నారు. వీరిని సుశిక్షుతులను జేసిన సానబెట్టిన వజ్రములవలె ప్రకాశింతురనుటలో సందేహము లేదు. ఐతే ఉపాకర్మ తర్వాత గాని వీరికి వేదాభ్యాస మారంభించుటకు వీలు లేదు. ఈలోపల వీరి శిక్షణము సంస్కృతాభ్యాస ముతో ఆరంభమగును.

గాది:

మహాప్రసాదము. వీరభద్రమంత్రోపదేశాదిగ మీరు నాయందు కనబఱచుచున్న దయాభిమాన ములకు మిక్కిలి కృతజ్ఞుడను.

భారతి:

ఐతే ఒకవిషయం. వీరి జాతకానుసారం వీరుత్తరోత్తర రాణింపగల విద్యలు వీరికి గరపుట సమంజసము. అందుచేత పెద్దవానిని సంస్కృతసాహిత్యముతో బాటు, ధనురర్థధర్మశాస్త్రాదు లందు ప్రవీణుని జేయుట తగును. చిన్నవానిని సర్వసాహిత్యాలంకారశాస్త్రాలలోను, వేదవేదాంగ ములందును నిష్ణాతుని జేయుట తగును. సంస్కృతముతో బాటు తెనుగు సాహి త్యమునందును నితని ప్రవీణుని జేయుట శారదాదేవికి ద్విగుణితప్రమోదమును గూర్పగలదు.

గాది:

అంతయు మీదయ. వీరిని మీహస్తగతము చేయుచున్నాను. వీరికి తగిన బుద్ధులు గరపి సుశిక్షుతులను జేయు బాధ్యత మీకప్పగించుచున్నాను.

భారతి:

పెద్దవానికి దుర్గామంత్రోపాసన శ్రేయస్కరము. చిన్నవానికి సరస్వతీమంత్రోపాసన సర్వసామర్థ్యసంప్రదముగా నాకుఁ దోఁచుచున్నది. (బాలకుల నుద్దేశించి) పిల్లలూ! మీకీ నిర్ణయ మిష్టమే కదా? మీపితరులను విడిచి ఆశ్రమవాసక్లేశమును సహించి ఈమంత్రముల నుపాసించుచు విద్యాసముపార్జన చేయుటకు మీరు సిద్ధమే కదా?

వటువులు:

సర్వము మీయనుగ్రహమే. మీరేది విధించిన దానిని మేము నిర్వర్తింతుము.

భారతి:

గాదిరాజశర్మా! ఈబాలకులు ఆశ్రమపద్ధతుల కలవాటుపడునంతవరకు నీవును కొన్ని దినములు మాయాశ్రమములో నుండి పొమ్ము.

గాది:

మీ యాదరణకు కృతజ్ఞుడను. అట్లే చేసెదను.

నాల్గవ దృశ్యము

(విద్య పూర్తి చేసికొని వీరభద్రు లిర్వురు పిల్లలమఱ్ఱికి తిరిగి వస్తారు)

నాగాంబ:

నాయనలారా! విద్య పూర్తి ఐనదా? బుద్ధిమంతులై తిరిగి వచ్చినారా?

గాది:

భారతీతీర్థులు క్షేమంగా ఉన్నారా? వారుపదేశించిన మంత్రప్రభావం వల్ల మీకు విద్యలన్నీ కరతలామలకమైనవా?

పెదవీరన:

స్వామివారు బాగున్నారు నాన్నా? మీకూ, అమ్మకూ ఆశీర్వచనాక్షతలు పంపినారు.

(స్వామివారి అక్షతలీయగా గాదిరాజు వానిని కన్నుల కద్దుకొనుచు స్వీకరించును.)

పినవీరన:

స్వామివారుపదేశించిన సరస్వతీమంత్రప్రభావం వల్ల సకలసాహిత్యాలంకారవిద్యలూ, వేదవేదాంగవిజ్ఞానమూ నాకలవడింది. వారి ఆశ్రమంలో ఉండడం సాక్షాత్తుగా వ్యాసాశ్రమంలో ఉన్న అనుభూతినే కలిగించింది.

అర్థి న్మామకమానసాబ్జమున నధ్యాసీనుఁ గావించి సం
ప్రార్థింతున్ యతిసార్వభౌముఁ, బరమబ్రహ్మానుసంధాత, నా
నార్థాలంకృతబంధురశ్రుతిరహస్యజ్ఞాత, శ్రీభారతీ
తీర్థశ్రీచరణంబు, నుల్లసితముక్తిప్రేయసీవల్లభున్.

గాది:

ఇంత చక్కని కవిత్వ మల్లడం నేర్చుకొన్నావా నాయనా శ్రీచరణుల కరుణ చేత?

పినవీరన:

అంతా స్వామివారుపదేశించిన సరస్వతీమంత్రమహిమ. ఆ దేవి కటాక్షం లేనిదే నానోట ఒక్క పద్యచరణమైనా పలుకదు. నా భావసౌరభంలో ఏమైన న్యూనతలుంటే ఆ దేవి శ్రవణావతంసామోదమే ఆ లోపాలను పూరిస్తుంది.

పొసఁగ న్నేఁ గృతిఁ జెప్పఁగాఁ బరిమళంబు ల్చాల కొక్కొక్కచోఁ
గొస రొక్కించుక గల్గె నేనియును సంకోచంబు గాకుండ నా
రసి యచ్చోటికి నిచ్చుచుండు పరిపూర్ణత్వంబు వాగ్దేవి యిం
పెసలారం దన విభ్రమశ్రవణకల్హారోదయామోదముల్.

ఆ దేవి అనుగ్రహం వల్లనే ఆశ్రమంలో ఉండగానే ‘అవతారదర్పణ’మనే గ్రంథాన్ని పూర్తి చేసినాను.

నాగాంబ:

పెదవీరనా? నీవూ ఏమైన గ్రంథాలు వ్రాసినావా?

పెదవీరన:

లేదమ్మా! నాకు తమ్మునిలాగున కవితాకౌశల్యం అలవడ లేదు. నేను కొన్ని చిన్నచిన్న ముక్తకాలూ, ఖండికలనూ వ్రాయగలను కానీ తమ్మునివలె మహాకావ్యనిర్మాణశక్తి నాకు కలుగలేదు.

గాది:

నీ బుద్ధి సాహిత్యవిద్యలలో గాక క్షాత్రవిద్యలలో చక్కగా ప్రసరిస్తుందని స్వాములవారు సెలవిచ్చినారు. నీవట్టి విద్యలపై కొంత పట్టును సాధించినావా?

పెదవీరన:

అవును నాన్నా? స్వామివారు అద్భుతమైన పరబుద్ధిగ్రహణపారీణులు. వారు నా విషయంలో చెప్పిన మాట నిజమే. నేను దుర్గామంత్రము నుపాసించి, ధనుర్వేద, ధర్మశాస్త్ర, అర్థశాస్త్ర, గజాశ్వశాస్త్రములందు పాండిత్యము గడించినాను. యజుర్వేదమును, అథర్వవేదమును, సాహిత్యశాస్త్రమును కూడ అభ్యసించినాను.

గాది:

ఐతే నీవు విజయనగరమున ప్రౌఢదేవరాయలకొల్వులో ప్రవేశింప దగినవాడవు. రాజసేవయే నీ సామర్థ్యమును ప్రకాశింపజేయ సమర్థమైనదని నాకనిపించుచున్నది.

నాగాంబ:

రాజసేవ అసిధారావ్రతము వంటిది. రాజుల కలిమిలేములపై, ఇష్టానిష్టములపై సేవకుల మనుగడ ఆధారపడుతుంది. ఇట్టిదానికి వీనిని ప్రేరేపింపదగునా?

గాది:

అది నిజమే కాని, విజయనగర మహాసామ్రాజ్యమిప్పుడు ఉచ్చదశలో నున్నది. రాజసేవనము శ్రేయస్కరమనియే తోచుచున్నది.

పెదవీరన:

నాకూ అట్లే తోస్తున్నది నాన్నా! అందుచేత విజయనగరము లోనో, చంద్రగిరి లోనో, పెనుగొండ లోనో రాజుకొలువులో ప్రవేశించుటకు యత్నిస్తాను.

గాది:

పినవీరన, నీసంగతేమిటి? నీవూ విజయనగర మేగి ప్రభువులవారి ఆస్థానకవులలో స్థానం సంపాదించుకొంటావా?

పినవీరన:

అది సులభం కాదు నాన్నా! ఆ ఆస్థానంలో గౌడడిండిమభట్టు వంటి ఉద్దండపండిత కవులున్నారు. ప్రాథమికులకా సాహిత్యకూటమిలో ప్రవేశం దుర్లభం. శ్రీనాథుని వంటి మహాకవియే

కుల్లా యుంచితిఁ, గోకఁ జుట్టితి, మహాకూర్పాసముం దొడ్గితిన్,
వెల్లుల్లిం దిలపిష్టమున్ మెసవితన్ విశ్వస్త వడ్డింపఁగా,
చల్లాయంబలిఁ ద్రాగితిన్, రుచులు దోసంబంచుఁ బోనాడితిన్,
తల్లీ! కన్నడరాజ్యలక్ష్మీ! దయలేదా, నేను శ్రీనాథుఁడన్

అని రాజదర్శనము లభింపక ఎన్నో ఇడుముల బడిన విషయం మనకు తెలిసినదే. ఇట్టి శ్రీనాథుఁడే తర్వాత అచ్చటి ముత్యాలశాలలో కనకాభిషేకం చేయించుకొన్నాడని కూడ తెలుసు. అందుచేత ముందే కొన్ని ఉత్తమకావ్యాలు వ్రాసి వాసికెక్కిన గాని రాజాస్థానంలో ప్రవేశించడం సాధ్యం కాదు. అందుచే నేనింటిపట్టుననే ఉండి కొన్ని కావ్యాలు వ్రాస్తాను. సాహితీపోషకులైన అధికారుల సభల్లో పాల్గొని నా సామర్థ్యాన్ని నిరూపించుకొంటాను. సరస్వతీ కటాక్షముంటే ఆతర్వాత విజయనగర రాజాస్థానప్రవేశం కలుగనే కలుగుతుందని నా విశ్వాసం.

నాగాంబ:

మంచిమాటనే అన్నావు నాయనా! పెదవీరన విజయనగరానికి వెళితే నీవైన ఇంటిపట్టున ఉంటే మాకూ సంతోషంగానే ఉంటుంది.

గాది:

అమ్మ మాట నిజమే నాయనా! ఐనా నీ విద్య, నీ సరస్వతీమంత్రోపాసన వమ్ము కారాదు. నీవు శ్రమించి కావ్యరచన చేసి అసమానప్రతిభాన్వితుడవైన కవీశ్వరునిగా ప్రతిభాసించవలె ననియే నా కోరిక. ఈ మార్గంలో నీవు నిర్విరామంగా కృషి చేయగలవు.

పినవీరన:

మీ ఆశీర్వాదముంటే అన్నీ సిద్ధిస్తాయి నాన్నా!

ఐదవ దృశ్యము

(స్థలం: పిల్లమఱ్ఱి. పినవీరభద్రుని గృహం. సమయం: వసంతపంచమి, ఉదయం 10 గంటలు. పెదవీరన సాళువ నరసింహరాయల చేతికింద ఉద్యోగమును వహిస్తూ ప్రసిద్ధుడై ఉంటాడు. అతడిప్పుడు పిల్లలమఱ్ఱిలో తల్లిదండ్రులను సేవిస్తుంటాడు. పినవీరన పూజాగృహంలో సరస్వతీపూజ చేస్తుంటాడు.

ఓం ప్రణో॑ దే॒వీ సర॑స్వతీ వాజే॑భిర్వా॒జినీ॑వతీ| ధీనామ॑వి॒త్ర్య॑వతు||
యస్త్వా॑దేవి సరస్వత్యుపబ్రూ॒తే ధనే॑ హి॒తే| ఇన్ద్రం॒ న వృ॑త్రతూర్యే᳚||
త్వం దే॑వి సరస్వ॒త్యవా॒ వా॑జేషు వాజిని| రదా᳚ పూ॒షేవ॑ నః స॒నిమ్||
ఉ॒త స్యా నః॒ సర॑స్వతీ ఘో॒రా హిర॑ణ్యవర్తినిః| వృ॒త్ర॒ఘ్నీ వ॑ష్టి సుష్టు॒తిమ్||
యస్యా᳚ అన॒న్తో అహ్రు॑తస్త్వే॒ష శ్చ॑రి॑ష్ణుర॑ర్ణ॒వః| అమ॒శ్చర॑తి॒రోరు॑వత్||
సా నో॒ విశ్వా॒ అతి॒ ద్విషః॒ స్వసౄ᳚ ర॒న్యా ఋ॒తావ॑రీ| అత॒న్నహే᳚వ॒సూర్యః॑||
ఉ॒త నః॑ ప్రి॒యా ప్రి॒యాసు॑ స॒ప్తస్వ॑సా॒ సుజు॑ష్టా| సర॑స్వతీ॒ స్తోమ్యా᳚భూత్||
ఆ॒ప॒ప్రుషీ॒ పార్థి॑వాన్యు॒రు రజో᳚ అ॒న్తరి॑క్షమ్| సర॑స్వతీ ని॒దస్పా᳚తు||
త్రి॒ష॒ధస్థా᳚ సప్తధా᳚తుః॒ పఞ్చ॑ జా॒తా వ॒ర్ధయ॑న్తీ| వాజే᳚ వాజే॒ హవ్యా᳚భూత్||
దే॒వీం వాచ॑మజనయన్త దే॒వాః| తాం వి॒శ్వరూ॑పాః ప॒శవో॑ వదన్తి||
సానో॑ మం॒ద్రేష॒మూర్జం॒ దుహా॑నా| ధే॒నుర్వాగ॒స్మానుప॒ సుష్టు॒ తైతు॑||
చ॒త్వారి॒ వాక్పరి॑మితా ప॒దాని| తాని॑ విదుర్బ్రాహ్మ॒ణా యే మ॑నీ॒షిణః॑||
గుహా॒ త్రీణి॒ నిహి॑తా॒ నేఙ్గ॑యన్తి| తు॒రీయం వా॒చో మ॑ను॒ష్యా᳚వదన్తి||
ఉ॒త త్వః॒పశ్య॒న్న ద॑దర్శ॒ వాచ॑ము॒త త్వః॑ శృ॒ణ్వన్న శృ॑ణోత్యేనామ్||
ఉ॒తో త్వస్మై తన్వం వి స॑స్త్రే జా॒యేవ॒ పత్యు॑ రుశ॒తీ సువాసాః᳚||
అమ్బి॑తమే॒ నదీ᳚తమే॒ దేవి॒తమే॒ సర॑స్వతి|అ॒ప్ర॒శ॒స్తా ఇ॑వ స్మసి॒ ప్రశ॑స్తిమమ్బ నస్కృధి||
పా॒వ॒కా నః॒ సర॑స్వతీ॒ వాజే᳚భి ర్వా॒జినీ᳚వతీ| య॒జ్ఞం వ॑ష్టు ధి॒యావ॑సుః||
ఆ నో᳚ ది॒వో బృ॑హ॒తః పర్వ॑తా॒దా సర॑స్వతీ యజ॒తా గ॑న్తు య॒జ్ఞమ్|
హవం॑ దే॒వీ జు॑జుషా॒ణా ఘృ॒తాచీ᳚ శ॒గ్మాం నో॒వాచ॑ముశ॒తీ శృ॑ణోతు||

అతడు చదివే సరస్వతీసూక్తం గాదిరాజు, పెదవీరన మాట్లాడుకొను నప్పుడు నేపథ్యంలో సన్నగా వినిపిస్తూ, వారి మాటలు ముగియగనే పూజామందిరదృశ్యం కనపడి, శేషించిన సరస్వతీ సూక్తం స్పష్టంగా వినపడును.)

గాదిరాజు:

నాయనా పెదవీరనా! కుటుంబమంతా క్షేమమే కదా! విజయనగరరాజ్యం అప్రతిహతంగా వర్ధిల్లుచున్నది కదా!

పెదవీరన:

మీదయవల్ల అందఱూ క్షేమమే నాన్నగారూ! నేను ముందు ఎక్కువగా చంద్రగిరిలో నుంటిని. సాళువ నరసింహరాయల అధికారానికి అదియే కేంద్రమై ఉండెను. నేను రాజసేవలో ప్రవేశించిన నాటినుండి విజయనగరములో అనేకపరిణామములు కల్గినవి. ప్రౌఢదేవరాయల అనంతరము ఆయన కుమారుడు మల్లికార్జునరాయలు ఆతర్వాత విరూపాక్షరాయలు చక్రవర్తు లైనారు.

గాది:

ప్రౌఢదేవరాయలు గొప్ప సాహిత్యపోషకుడు, స్వయంగా గొప్ప గ్రంథనిర్మాత. శ్రీనాథునికి కనకాభిషేకం జరిగింది ఆయన కొలువులోనే. అటువంటి గొప్ప చక్రవర్తి గతించడం నిజంగా మన దురదృష్టపరిపాకమే.

పెదవీరన:

ఔను నాన్నా! కాని ఆయన వారసులను గుఱించి అంత గొప్పగా చెప్పలేము. వారి పాలనలో సామ్రాజ్యం ఒడిదుడుకులకు లోనైంది. సాళువ నరసింహరాయలవంటి సమర్థులైన నాయకులు లేకుంటే రాజ్యమింకా ఛిన్నాభిన్న మయ్యేదే.

గాది:

సాళువ నరసింహరాయల ప్రతాపాన్ని గుఱించి విన్నాను. ఆయన నాశ్రయించడం నీకు మేలే చేసింది.

పెదవీరన:

అందుచేతనే మల్లికార్జునరాయలవారు వారిని చిత్తూరు, ఆర్కాటు, వెల్లూరు వంటి మండలాలకు పాలకునిగా నియమించి, మహామండలేశ్వరపదవి నిచ్చినారు. వారి ప్రభావం విజయనగరరాజ్య నిర్వహణలో నానాటికి అభివృద్ధి చెంది ఇప్పుడు వారు విరూపాక్షరాయల వారికి ప్రధానసేనాపతు లైనారు. అందుచే వారిప్పుడు విజయనగరం లోనే ఉన్నారు. వారు పురోగమించిన కొలది వారి విశ్వాసపాత్రులలో నేనూ వారికి అండగా నుండి, ఇప్పుడు 70 వేల అధికారుల కధిపతి నైనాను.

గాది:

చాలా మంచి విషయం నాయనా! శ్రీచరణులు భారతీతీర్థులు నీ గుఱించి చెప్పిన విషయాలన్నీ యథార్థమైనవి. విజయనగరం నేను చూడలేదు. అది చాలా సుసంపన్నమైన నగరమని విన్నాను.

పెదవీరన:

ఆ! ఇప్పుడు నా స్థావరం అదే. అంత సుసంపన్నమైన నగరం భారతంలో మఱెక్కడా లేదని చెప్పవచ్చు. ఐశ్వర్యంలో అలకాపురి వలె, వైభవంలో అమరావతి వలె ఉంటుందంటే అతిశయోక్తి కాదు. విజయనగరాస్థానం కళావిదులకు, పండితకవులకు ఇంద్రసభ సుధర్మవలె అత్యంతవైభవోపేతం గాను, ఆకర్షణీయం గాను ఉంటుంది. ఆ ఆస్థానంలో ప్రవేశం లభించడం ఎంతో ప్రతిభావంతులైన కవిపండితులకు దప్ప ఇతరులకు సాధ్యం కాదు. నాకు తెలుసు తమ్ముడు ఇంతవఱకు చాలా కావ్యాలు వ్రాసి ఈ ప్రాంతాలలో చాలా ప్రసిద్ధుడైనాడని. వానికి విజయనగర సంస్థానప్రవేశం లభించడం ఉభయతారకంగా ఉంటుందని నా విశ్వాసం. ఇది జరిగితే బాగుండును.

గాది:

ఎంత సమర్థుడైనా కాలం కర్మం కలిసిరావాలి కదా! వాడు నిత్యం సరస్వతీ ఉపాసన చేస్తూ తన పురోభివృద్ధినంతా ఆమె చేతులలోనే పెట్టినాడు. ఆమె కరుణావిశేషం చేతనే ఇన్ని కావ్యాలు వ్రాసి మంచికవిగా కీర్తి దెచ్చుకొన్నాడు. ఇకముందు కూడ ఆ మహాసరస్వతియే అతని పథాన్ని నిర్దేశిస్తుందని నానమ్మకం. నీవు విజయనగరంలో మంచి అధికారంలో ఉన్నావు కనుక నీకు వీలైనంత సాయం నీవూ చేయి.

పెదవీరన:

తప్పకుండా నేను చేసేది చేస్తాను కాని, ప్రవేశం ఇతర పండితులపైన ఆధారపడి ఉంటుంది. వారిలో చాలామందికి గొప్ప పాండిత్యముంది కాని కొండంత మత్సరం కూడ ఉంది. అందుచేత వారికి శిరోధార్యమైన కవితాప్రతిభ ఉన్నవారే నెగ్గుకొని రాగలరు. ఈ విషయంలో తమ్మునికి తగినంత సామర్థ్య మున్నదనుటలో సందేహం లేదు. అందుచేత వానికి ప్రవేశం కలుగుతుందనే నాకు ధైర్యమున్నది.

(అభ్యంతరమందిరము లోని పూజాగృహదృశ్యము. పినవీరభద్రుడు చదువుచున్న సరస్వతీ సూక్తం ముగుస్తుంది. ఆ తర్వాత ఈ క్రింది పద్యములను చదువుతాడు.)

*అబ్జతారాంకితంబగు జ్యోతిషం బిందు
        హారమై యెవతె కింపారుచుండు
సంగీతసాహిత్యసారంబె కర్ణికా
        యుగళమై యేకాంత కొనరుచుండు
మాత్రాక్షరాత్మకమంజువృత్తంబు లే
        యింతికిం గాజులై యెసఁగుచుండు
బహువిధాలంకారపాకరీతులె రంగు
        టలరులై యేదేవి కలరుచుండు

*నట్టి యాగమత్రయవళి, నబ్జభభవుని
రాణి, వాణిఁ, బుస్తకపాణిఁ, బ్రస్తుతింతు
నాదుజిహ్వాగ్రమున సదా నాట్య మాడి
మధురకవితలఁ బల్కింపు మనుచుఁ గోరి.

*వాణి! నీదయారసదృష్టివర్షధారఁ
బ్లావితము గాని హృత్‌క్షేత్రవరమునందు
ఉద్భవించునె నవభావనోద్భిదములు?
ఒదవునే నవకావ్యఫలోద్గమములు?

విద్యాదాత్రీ! మంజులగాత్రీ! బ్రాహ్మీ! నీకటాక్షమునకై నిరంతరము తపించు భక్తుడను. ఆ కటాక్ష బలముచేతనే ఇంతవఱకు అవతారదర్పణము, నారదీయపురాణము, మాఘమాహాత్మ్యము, మానసోల్లాససారము, పురుషార్థసుధానిధి యను గ్రంథముల రచించితిని. ఈ గ్రంథములవల్ల కొంతప్రశస్తి వచ్చినది. కాలప్రవాహములో ఈగ్రంథము లెన్ని నిలుచునో తెలియజాలను. రసవత్తరమైన ఇతివృత్తముతో చిరకాలము నిలిచియుండు కావ్యము నొక దానిని వ్రాయవలె నను కుతూహలము కలుగుచున్నది. నీ కరుణారసపూరితకటాక్షమే ఇట్టి ఇతివృత్తము నేదో యొకటి సూచించునని నమ్ముకొన్నాను. అంతయు నీ దయ. కదలించేది నీవు. కదలెడివాడను నేను.

(అని ప్రార్థించి కన్నులు మూసికొని సరస్వతీమంత్రమును జపించుచుండును. అంతలో పెదవీరభద్రుడు, గాదిరాజు కూర్చున్న బాహ్యమందిరం లోనికి ఒకవార్తాహరుడు ప్రవేశించును.)

వార్తా:

దండా లయ్యోరూ! పినవీరభద్రయ్య యిల్లిదేనా?

గాది:

ఔను. ఎవరు నీవు?

వార్తా:

అయ్యోరూ! నేను సోమరాజుపల్లె నుండి వస్తుండా. మా అయ్యోరు పినవీరభద్రయ్యకు సమాచారం బంపిండు.

పెదవీరన:

ఏదీ ఏం సమాచారం. ఆ తాటాకుపత్రం నాకీయి. చూస్తాను. (వార్తాహరుడు పత్రము నీయగా మనసులో చదివికొని సంతోషంతో వికసితవదను డగును.)

గాది:

ఆ పత్రంలో ఏమున్నది వీరా?

పెదవీరన:

చాలా శుభవార్త నాన్నా. మీరే చదువండి. సోమరాజుపల్లెలో చిల్లరవెన్నయమంత్రి తమ్మునికై దసరానవరాత్రుల కవిపండితగోష్ఠికి రమ్మని సాదరంగా ఆహ్వానం పంపినాడు.

గాది:

(సమాచారపత్రమును చదివి) మంచి అవకాశం వీరా! పంటరెడ్ల మంత్రులుగా నుండి చిల్లర వంశీకులు మంచి సంపన్నులు, రాజకీయధురంధరులూ ఐనారు. వారిలో వెన్నయమంత్రి నిత్యశంకరార్చనానిరతుడై, దానధర్మాలు, తటాకవనాదినిర్మాణాలూ చేసి ప్రసిద్ధుడైనాడు. ముఖ్యంగా అతడు కవిపండితపక్షపాతియై, నవరాత్రులకు పండితవర్యుల నాహ్వానించి, వారికి భూరిసన్మానదక్షిణల నిచ్చే వదాన్యుడని విన్నాం. ఇట్టి గోష్ఠికి సన్మానార్థం పినవీరుణ్ణి ఆహ్వానించడం నాకత్యంత ఆనందదాయకంగా ఉంది.

పెదవీరన:

(ఉత్సాహంతో పూజామందిరానికి పరుగెత్తి) తమ్ముడూ! ఇదిగో నీకొక సువార్త. ఈ పత్రాన్ని చదువు. (పినవీరనకు పత్రము నీయగా అతడు ప్రకాశముగా చదువును.)

“అవతారదర్పణ, మానసోల్లాససారాది అనేకసత్కవితావిలసితములైన గ్రంథములను వ్రాసి శ్రీనాథకవిసార్వభౌములకు నిజమైన వారసు లనిపించుకొనుచున్న బ్రహ్మశ్రీ పినవీరభద్ర కవిపుంగవుల సన్నిధికి చిల్లరవెన్నయమంత్రి సప్రణామముగాఁ బంపుకొను సందేశములు…

ఉభయకుశలోపరి… ఆర్యా! మీయశశ్చంద్రిక మాసోమరాజుపల్లిపేరులో గల సోమున కలం కారమై నిత్యమును భాసిల్లుచున్నది. అందుచేత మిమ్ములను త్వరలో జరుగబోవు దసరా నవరాత్రములకు సాదరముగా నాహ్వానించి సత్కరింప దలచి ఈసమాచారము పంపుకొను చున్నాను. మీరిందున కంగీకరించిన నాసమక్షమునకు రప్పించుకొనుటకు సకాలములో శకటా దులను పంపింతును. మీయంగీకారమును ఈవేగువాని వెంబడి పంపిన కృతజ్ఞుడ నౌదును.

చిత్తగింపవలెను.
ఇట్లు భవదీయుడు
చిల్లర వెన్నయమంత్రి”

పినవీరన:

(సంతోషముతో ఆ పత్రమును దీసికొని బాహ్యగృహమునకు వచ్చి) ఓరి వేగూ! మంచి సందేశమునే తెచ్చినావు. మంత్రులవారు బాగున్నారా? నవరాత్రులకై సోమరాజుపల్లికి వచ్చుటకు నాకు సమ్మతమే అని మంత్రులకు తెలుపు. నేను నా అంగీకారాన్ని పత్రముఖంగా తెలుపుతాను. దానిని తీసికొని పోయి మంత్రిగారి కీయి (అని పత్రమును వ్రాసి యిచ్చును.)

గాది:

వేగూ! అన్నము తిన్నావా? కొంచెమాగితే అమ్మగారు నీకు అన్నం పెడతారు. సుష్ఠుగా తిని ఈనాడిక్కడనే ఉండి విశ్రాంతి తీసికొని రేపు తిరిగి వెళ్లవచ్చు.

వార్తా:

దండం అయ్యోరూ! అట్లాగే చేస్తాను.

గాది:

పినవీరా! ఇది సంతోషకరమైన వార్త. వెన్నయమంత్రి సహృదయుడు, సంస్కారవంతుడు, సాహిత్యప్రియుడు, వదాన్యుడూ అని విన్నాను. నవరాత్రిగోష్ఠుల సందర్భంగా ఆయన ఏమైన కావ్యరచన కాదేశిస్తే కాదనకు.

పినవీరన:

అట్లాగే నాన్నా! అట్టి ఆదేశాన్ని నిర్వర్తించే సామర్థ్యం ప్రసాదింపుమని సరస్వతీదేవిని ప్రార్థిస్తూనే ఉంటాను.

పెదవీరన:

సందేహం లేదు. నీవందుకు తప్పక సమర్థుడవే.

ఆఱవ దృశ్యము

(స్థలం: సోమరాజుపల్లెలో వెన్నయామాత్యుని ఆస్థానం లోని నవరాత్రి పండితసభ. పినవీరభద్రునితో పాటు ఇంకొక ఐదుగురు కవిపండితులు సమావేశమై ఉంటారు. నేపథ్యంలో:

ఓం నమ॒స్సద॑సే॒ నమ॒స్సద॑స॒స్పత॑యే॒ నమ॒స్సఖీ॑నాం పురో॒గాణాం॒చక్షు॑షే॒ నమో॑ ది॒వే నమః॑ పృథి॒వ్యై | సప్ర॑థ స॒భాం మే॑గోపాయ| యే చ॒ సభ్యా᳚ స్సభా॒సదః॑| తానిం॑ద్రి॒యావ॑తః కురు| సర్వ॑మాయు॒ రుపా॑సతామ్|

అను మంత్రం వినిపిస్తుండగా వెన్నయమంత్రి సభాసీను డౌతాడు.)

వెన్న:

సభాసదులకు నమస్కారము. పవిత్రమైన దసరా నవరాత్రుల సందర్భంగా సాహిత్యగోష్ఠిని నిర్వహించుటకు మన మిక్కడ సమావేశమైనాము. మా ఆహ్వానాన్ని అంగీకరించి అనేక కమనీయకావ్యకర్తలు, బ్రాహ్మీవరప్రసాదులు, ఐన శ్రీపినవీరనగారు ఈసభ నలంకరించడం ఈనాటి విశేషం. విశిష్టాతిథులుగా విచ్చేసిన వారికి ప్రాముఖ్యమిస్తూ ఈ సభ సాగుతుంది.

పినవీరన:

అమాత్యుల ఆదరణకు కృతజ్ఞుడను.

కౌండిన్యాన్వయసింధుచంద్ర, విమతక్ష్మాపాలకామాత్యవే
దండానీకమృగేంద్ర, చంద్రవదనాతారుణ్యకందర్ప, శ్రీ
ఖండక్షోదవిపాండునిర్మలయశోగంగాజలక్షాళితా
జాండాఘోరకలంక, శంకరనివాసాహార్యధైర్యోన్నతా!

*భోజునట్టుల నీయాంధ్రభూమియందుఁ
గవులపాలిటఁ గల్పవృక్షంబ వగుచు
నిరతకావ్యవనవిహారనిరతిమీఱఁ
దనరు వెన్నయామాత్య! నీకొనరు జయము.

వెన్న:

ఆహా అద్భుతం మీ ఆశుకవనం.

ఒకటవ
సదస్యుడు :

పినవీరనగారూ! ఒకశిథిలకావ్యంలో నాయకుని ఔన్నత్యాన్ని వర్ణించే పద్యంలో ‘ఊరక గెల్వరె ధీరు లుర్వరన్’ అనే దళం మాత్రం మిగిలింది. మిగితా పద్యం ఎట్లుండేదో అనే సంశయం నన్ను పీడిస్తూనే ఉంది.

పినవీరన:

ఇట్లు చెప్పిన సరిపోవునేమో!

*పుడిసిటఁ బట్టి కుంభజుఁడు పొంగు సముద్రము నెల్లఁ ద్రాగెఁ , దా
నొడలిని బాసియు న్మరుఁడు నుర్వర లోకుల నెల్ల గెల్చె, నే
పడవయు లేక వాయుజుఁ డపారజలాకర మెల్ల దాఁటెఁ, దా
ముడిగిన నేమి శస్త్రతతు లూరక గెల్వరె ధీరు లుర్వరన్.

అందఱు:

భేష్! భేష్! (చప్పట్లు చఱతురు.)

రెండవ
సదస్యుడు:

‘చంద్రుఁడు గూర్చె వేడిమిని, శైత్యము గూర్చెను భానుఁ డింతికిన్’ ఈ వాక్యం అనుభవవిరుద్ధంగా ఉంది. దీని సమన్వయ మెట్లంటారు వీరనగారూ?

పినవీరన:

పాప మాయింతి కాంతుని కౌఁగిలింతను బాసి మనజాలదేమో!

*చంద్రిక మోహమున్ బెనుపఁ జక్కగఁ గాంతునిఁ గౌఁగిలించి ని
స్తంద్రత నున్నరాత్రులను, తద్విభుఁ డేఁగగఁ గార్యవర్తియై
సాంద్రతరోపగూహనము సంధిలకున్న పవళ్లయందునన్
చంద్రుఁడు గూర్చె వేఁడిమిని, శైత్యము గూర్చెను భానుఁ డింతికిన్.

అందఱు:

ఆహాహా! పరమాద్భుతం. శృంగారం గంగవలె పొంగిపొర్లుతున్నది మీవర్ణనలో…

మూడవ
సదస్యుడు:

కేవలవైయాకరణి కవితాకన్యకకు జనకుని వంటివాడని, అందుచేత ఆమెకు వరణీయుడు గాదని అంటారు. ఇటీవల ఒక సుప్రసిద్ధవైయాకరణిని ఆశువుగా పద్యం చెప్పమంటే, కర్త, కర్మ, క్రియ అనే పదాలతో అతని ప్రయత్నం అంతమైంది.

పినవీరన:

*కర్త యొనరించు కార్యలక్ష్యంబుకతన
కర్మనిర్ణయ మొనరించుఁ గమలభవుఁడు
దుష్టకర్మము వారింప నిష్టమున్న
సత్క్రియలె చేయుమా ప్రతిక్షణమునందు.

అని కాబోలు అతని ఉద్దేశ్యం.

అందఱు:

ఆహా! ఎంత సమయస్ఫూర్తి!

ఒకటవ
సదస్యుడు:

బిల్హణచరిత్రలో రాత్రివేళ సమాగమానికి దత్తరించుచున్న నాథుని సరసురాలైన యామినీపుర్ణతిలక అందంగా ఈ శ్లోకంలో మందలిస్తుంది.

జాగర్తి లోకో, జ్వలతి ప్రదీపః| సఖీజనః పశ్యతి కౌతుకేన|
ముహూర్తమాత్రం కురు కాన్త ధైర్యం| బుభుక్షితః కిం ద్వికరేణ భుఙ్త్కే||

దీనికి సమమైన పద్యం మీ కుసుమపేశలమైన శైలిలో వినాలని కుతూహలంగా ఉంది.

పినవీరన:

వినండి:

*జనులిట నింక మేల్కొనియె సందడి చేతురు, దీపమాలికల్
మినమినవెల్గుచుండెను, సమీపమునన్ సఖు లుత్సుకంబునం
గనుచును నుండ్రి నాథ! క్షణకాలము నిల్వుము; రెండుచేతులం
దినరుగదా క్షుధార్తు లతితీవ్రతరంబగు క్షుత్తు గల్గినన్.

అందఱు:

(చప్పట్లు చఱచి) అద్భుతం! ఎంత కోమలమైన మందలింపు!

ఒకటవ సదస్యుడు:

అనుకూలురాలైన సతిగల బిల్హణుని విధమిట్లుండగా, ఇంకను అనుకూలింపని శకుంతలను చూస్తూ, ఆమెపై మూగే షట్పదాన్ని చూచి దుష్యంతు డీలాగున ఈర్ష్యాగ్రస్తు డౌతాడు:

చలాపాఙ్గాం దృష్టిం స్పృశసి బహుశో వేపథుమతీం
రహస్యాఖ్యాయీవ స్వనసి మృదు కర్ణాన్తికచరః|
కరం వ్యాధున్నవత్యాః పిబసి రతిసర్వస్వమధరం
వయం తత్త్వాన్వేషణా న్మధుకర హతా స్త్వం ఖలు కృతీ||

పినవీరన:

కాళిదాసుది సరసమైన సందర్భోచితమైన వర్ణన. వినండి:

వనితం జంచదపాంగఁ జేసి కనుఁగ్రేవన్ ముట్టుచుం జేరి మం
తనముం జెప్పెడుభంగి నొయ్యఁ జెవిచెంతన్ మ్రోయుచున్ మెల్లమె
ల్లన మోవిన్ రతిసౌఖ్యసంపదలు కొల్ల్లల్గొంటి ధన్యుండ వీ
వనఘా తుమ్మెద, నేను జిక్కితిని దత్త్వాన్వేషముం జేయుచున్.

వెన్నయ:

ఆహాహా! ఎంత చక్కటి పద్యం! భావం లోపించకుండా, గంగాతరంగిణి వంటి ధారతో, కోమలపదసంచయనంతో సాగిన ఈ అనుసృజన అత్యద్భుతం. నా కత్యంత ప్రీతిపాత్ర మైనది భారతం. అందులో ఎంతో ఇంపైనది శకుంతలాదుష్యంతుల చరిత్రం. పినవీరభద్రా! నాకీ చరిత్రాన్ని ప్రబంధంగా వ్రాసి యిచ్చిన కృతార్థుడ నగుదును.

కలదు చాలంగఁ బ్రేమ నీవలన నాకు
వేడ్క నడిగెదఁ గవులెల్ల వేడ్కపడఁగ
షట్సహస్రకులోద్భవసచివులందు
సుకృతిగాఁ జేయు నాకొక సుకృతిఁ జేసి

ప్రఖ్యాతంబన, మిశ్రబంధ మన, నుత్పాద్యం బనంగాఁ, ద్రిధా
వ్యాఖ్యాతం బగువస్తువందు మఱి యధ్యాహారముం జేయఁగాఁ,
బ్రఖ్యాతం బితివృత్తమైన కృతి చెప్ప న్వక్తకున్ శ్రోతకున్
విఖ్యాతిం గలిగించుఁ బుణ్యమహిమన్ విశ్వంభరామండలిన్.

సరపువ్వులుగ మాలకరి పెక్కుతెఱఁగుల
            విరుల నెత్తులుగఁ గావించినట్లు,
కర్పూరకస్తూరికావస్తువితతిచే
            శ్రీఖండచర్చ వాసించినట్టు,
లొడికంబుగా గందవొడికి నానాసూన
            పరిమళంబులు గూడఁబఱచినట్లు,
సరఘలు వివిధపుష్పమరందలవములు
            గొనివచ్చి తేనియఁ గూర్చినట్లు,

భారతప్రోక్తకథ మూలకారణముగఁ
గాళిదాసుని నాటకక్రమము కొంత
తావకోక్తికి నభినవశ్రీ వహింపఁ
గూర్మిఁ గృతిసేయు నాకు శాకుంతలంబు.

పినవీరన:

మహాప్రసాదము వెన్నయామాత్యా! అవతారదర్పణాద్యనేకకృతులు రచించిన పిదప ఆ భారతీదేవి తదుపరి సంకల్పమేమో యని చింతించుచుంటిని. మీ సౌహార్దముచే అట్టికృతికి ఆవిర్భావముహూర్త మిప్పుడు వాటిల్లినది.

*మించుచు వ్యాసధీలత సుమించిన దివ్యశకుంతలాకథా
భ్యంచితపుష్పమంజరి సువాసితముం బొనరించి కాళిదా
సాంచితనాటకీయకవనైకసుగంధముతోడ నింకఁ గా
వించెద నొక్కకావ్యమును, బ్రీతిగ నిచ్చెద నీకు వెన్నయా!

వెన్నయ:

పినవీరభద్రకవీంద్రా! సభామధ్యస్థమైన యీ స్వర్ణపీఠము నలంకరింపుడు. (అని సాదరముగా గొనిపోయి స్వర్ణపీఠముపై నుంచి బంగారుశాలువ గప్పి, సుగంధపుష్పాదులతో బూజించి, జాంబూనదాంబరాభరణములు, సదక్షిణాకకర్పూరతాంబూలము లొసంగును. ఇట్లు సత్కరించునపుడు నేపథ్యంలో మంగళవాద్యాలు మ్రోగుచుండగా, ఈ క్రింది మంత్రములు పఠింపబడును.)

ఓం వాసో॑ దదాతి| స॒ర్వ॒దే॒వ॒ త్యం॑ వై వాసః॑| సర్వా॑ ఏ॒వ దే॒వతాః᳚ప్రీణాతి| –(వస్త్రాదు లొసంగునప్పుడు చెప్పునది)

ఓం గ॒న్ధ॒ద్వా॒రాం దు॑రాధ॒ర్షాం॒ ని॒త్య పు॑ష్టాం కరీ॑షిణీ᳚మ్| ఈ॒శ్వరీగ్॑౦ సర్వ॑ భూతా॒నాం॒ తామి॒హోప॑హ్వయే॒శ్రియమ్| — (గంధాదు లొసంగునప్పుడు చెప్పునది)

ఓం ఆయ॑నే తే॒ ప॒రాయ॑ణే॒ దూర్వా᳚ రోహన్తు పు॒ష్పిణీః|᳚ హ్ర॒దాశ్చ॑ పు॒ణ్డరీ᳚కాణి సము॒ద్రస్య॑గృ॒హా ఇ॒మే| — (పుష్పాదు లొసంగునప్పుడు చెప్పునది)

ఓం వసూ॑నాం ప॒విత్ర॑మ॒సీత్యా॑హ| ప్రా॒ణా వై వస॑వః| తేషాం॒ వా ఏ॒తద్భా॑గధేయ॑మ్| యత్ప॒విత్ర॑మ్| తేభ్య॑ ఏ॒వైన॑ త్కరోతి| — (స్వర్ణాదు లొసంగునప్పుడు చెప్పునది)

ఓం వేదా॒హమే॒తం పురు॑షం మ॒హాన్త᳚మ్| ఆ॒ది॒త్యవ॑ర్ణం॒ తమ॑స॒స్తు పా॒రే| సర్వా॑ణి రూ॒పాణి॑ వి॒చిత్య॒ ధీరః॑| నామా॑ని కృ॒త్వాఽభి॒వద॒న్య॒దాఽఽస్తే|᳚ ధా॒తా పు॒రస్తా॒ద్యము॑ దాజ॒హార॑| శ॒క్రః ప్రవి॒ద్వాన్ ప్ర॒దిశ॒శ్చత॑స్రః| తమే॒వం వి॒ద్వా న॒మృత॑ ఇ॒హ భ॑వతి| నాన్యః పన్థా॒ అయ॑నాయ విద్యతే| య॒జ్ఞేన॑ య॒జ్ఞమ॑యజన్త దే॒వాః| తాని॒ ధర్మా॑ణి ప్రథ॒మాన్యా॑సన్న్| తేహ॒ నాకం॑ మహి॒మా న॑స్సచన్తే| యత్ర॒ పూర్వే॑ సా॒ధ్యాస్సన్తి॑ దే॒వాః | పర్యా᳚ప్త్యా॒ అన॑న్తరాయాయ॒ సర్వ॑ స్తోమోఽతిరా॒త్ర ఉ॑త్త॒మ మహ॑ర్భవతి॒ సర్వ॒స్యాప్త్యై॒ సర్వ॑స్య॒ జిత్యై॒ సర్వ॑మే॒వ తేనా᳚ప్నోతి॒ సర్వం॑ జయతి|| — (తామ్బూలదక్షిణాదు లొసంగునప్పుడు చెప్పునది)

ఏడవ దృశ్యము

(స్థలము: వెన్నయమంత్రి ఆస్థానం. పినవీరభద్రుడు శాకున్తలాన్ని వెన్నయకు అంకితమిచ్చే ఘట్టం. పినవీరభద్రుడు, ఇంకా కొంతమంది పండితులు, పురోహితుడు, ఉద్యోగులు సభయందు ఆసీనులై ఉండగా వెన్నయ వచ్చి సభామధ్యమున అర్హాసనమున కూర్చుండును.)

వందులు:

(వెన్నయ వచ్చుచుండగా) జయము వెన్నయామాత్యులకు. జయము కౌండిన్యసగోత్ర పవిత్రులకు. జయము శివారాధనతత్పరులకు. జయము నిరత వితరణ కల్పతరుకల్పులకు.

పురోహితుడు:

నేడు సుదినము. సుధామధురమైన శైలిలో శృంగారశాకున్తలమును రచించిన మహాకవి శ్రీ పినవీరభద్రులవారు అమాత్యులవారికి తమ కావ్యకన్యాదానమును చేయు సుముహూర్తము.

వెన్నయ:

(పినవీరనతో) కవిచంద్రా! కల్యాణమునకు ముందు మీకావ్యకన్యక హేలావిలాసములు శ్రోత్రముతో విని మనోనేత్రముతో దర్శింప నీ సభ ఉవ్విళ్ళూరుచున్నది.

పినవీరన:

సభకు నమస్కారము. ఈ హేలాప్రదర్శనమునకు ముందుగా కాబోయే వరుని యొక్క గుణగణాల నొక పద్యంలో చెప్పి, వారి సంతతసంపత్సమృద్ధికై శ్రియఃపతిని ప్రార్థిస్తాను.

కూర్చుండు వయసునఁ గూర్చుండ నేర్చెను
            ననుదినత్యాగసింహాసనమునఁ
గొంకక నడ నేర్చుకొనుచుండి నడ నేర్చెఁ
            బలుకంగ వేదోక్తధర్మసరణి
మాటలాడఁగ నేర్చునాటినుండియు నేర్చెఁ
            బలుకంగ హితసత్యభాషణములు
చదువంగ వ్రాయంగ సరవి నేర్చిన నాఁడె
            నేర్చెను గార్యంబు నిర్వహింప

వినయమున కాకరంబు, వివేకమునకు
సీమ, జన్మస్థలంబు దాక్షిణ్యమునకు,
నాలవాలంబు విద్యల, కరయ మూర్తి
మరుఁడు, చిల్లరవెన్నయామాత్యవరుఁడు.

శ్రీవత్సాంకుఁడు, భక్తవత్సలుఁడు, లక్ష్మీప్రాణనాథుండు, రా
జీవాక్షుండు, సమస్తభూతభువనక్షేమంకరానేకరూ
పావిర్భావుఁడు, వాసుదేవుఁ డనుకంపావాసుఁడై దానవి
ద్యావిఖ్యాతుని మంత్రి వెన్నని నితాంతశ్రీయుతుం జేయుతన్.

ఒకపండితుడు:

బాగుంది! మంచి వరుడే దొరికినాడు. ఇట్టి వరుణ్ణి శ్రీయుతుని జేయడం శ్రియఃపతికి గాక ఇంకెవరికి సాధ్యం? అందుకే కావ్యం శ్రియఃపతి గుణసంకీర్తనంతో ఆరంభమైంది.

పినవీరన:

కథానాయకుడైన దుష్యంతుడు…

విశ్వసన్నుతశాశ్వతైశ్వర్యపర్యాయ
            కుటిలకుండలిరాజకుండలుండు
దిగిభశుండాకాండదీర్ఘబాహాదండ
            మానితాఖిలమహీమండలుండు
జనసన్నుతానన్యసామ్రాజ్యవైభవ
            శ్లాఘాకలితపాకశాసనుండు
కులశిలోచ్చయసానుకోణస్థలన్యస్త
            శస్తవిక్రమజయశాసనుండు

భాసమానమనీషాంబుజాసనుండు
సకలదేశావనీపాలమకుటనూత్న
రత్నరారజ్యదంఘ్రినీరజయుగుండు
శంబరారాతినిభుఁడు దుష్యంతవిభుఁడు.

వెన్నయ:

ఆహా! ఏమి వర్ణన! శ్రీనాథుని నలమహారాజువర్ణనకు దీటై, ఏతల్లక్షణసమన్వితుడైన దుష్యంతుడు నలరాజప్రతిమానుడనే ధ్వని స్ఫురిస్తూ ఉన్నది.

పినవీరన:

కణ్వాశ్రమంలో తొట్టతొలుత దుష్యంతుడు గాంచిన శకుంతల…

చంచత్పల్లవకోమలాంగుళికరన్, సంపూర్ణచంద్రానన
న్నంచచ్చందనగంధి, గంధగజయానం, జక్రవాకస్తనిన్,
కించిన్మధ్యఁ, దటిల్లతావిలసితాంగిం, బద్మపత్రాక్షి, వీ
క్షించెన్ రాజు శకుంతలన్, మధుకరశ్రేణీలసత్కుంతలన్.

వెన్నయ:

ఈ వర్ణన మొక్కటే చాలు ఆమె ఆశ్రమకన్య వేషంలో ఉన్నను యథార్థముగా అప్సరః కాంత యనుటకు, దుష్యంతునికి తగిన యోషారత్న మనుటకు.

పురోహితుడు:

అమాత్యులు మన్నింపవలె. కావ్యకన్యాదానముహూర్తము సమీపించుచున్నది.

పినవీరన:

ఇంకొక రెండు విషయాలను సంగ్రహంగా చెప్పి ముహూర్తమునకు సకాలంలో ముగిస్తాను. శాకుంతలంలో అత్యంతమధురమైనదీ, కరుణరసనిర్భరమైనదీ శకుంతల కణ్వాశ్రమమును వీడి భర్త యింటి కేగే ఘట్టం. అప్పుడు పెంచిన ప్రేమను త్రెంచుకొనలేని కణ్వు డచ్చటి తరులతాదుల పరికిస్తూ పలికే మాటలివి.

అల పెఱుంగక తావకాలవాలములకు
            నెమ్మితో నిరవొంద నీరువోసి,
క్రమవృద్ధిఁ బొందు మార్గంబు లారసివచ్చి
            పూఁటపూఁటకుఁ జాలఁ బ్రోదిచేసి,
ప్రేమాతిరేకత ప్రియమండనమునకుఁ
            జిగురాకుఁ గొనగోరఁ జిదుమ వెఱచి,
పరిపాటి నల్లన ప్రసవోద్గమంబైన
            సఖులుఁ దానును మహోత్సవ మొనర్చి,

తల్లియై పెంచె మిమ్ము నీ తలిరుబోఁడి
అత్తవారింటి కరిగెడు నాలతాంగి
క్షితిరుహములార! పుష్పితలతికలార!
అనుమతింతురు గాక కల్యాణయాత్ర.

వెన్నయ:

ఆహా! రసోదంచితమైన పదసంచయనంతో సాగిన ఈ వర్ణన కరుణరసాకరమై ఉన్నది.

పినవీరన:

జనకుని ఆశ్రమమునకు దూరమగుచున్న సంతాపము, భర్తను జేరబోవుచున్న సంతోషము మిళితమైన శకున్తల మానసస్థితి:

జనకుఁ డుండెడు ననుష్ఠానవేదికఁ జూచుఁ,
            జూచి క్రమ్మఱఁ బోయి చూడవచ్చు,
స్నానార్థనియమిత జలజాకరముఁ జూచుఁ,
            జూచి క్రమ్మఱఁ బోయి చూడవచ్చు,
నిజహస్తపోషిత కుజవల్లికలు చూచుఁ,
            జూచి క్రమ్మఱఁ బోయి చూడవచ్చుఁ,
గుంజకోటరకుటీక్రోడవీథులు చూచుఁ,
            జూచి క్రమ్మఱఁ బోయి చూడవచ్చుఁ

దండ్రిఁ బాయంగ లేని సంతాపజలము,
నత్తవారింటి కేఁగెడు హర్షజలము,
గోరువెచ్చన పాలిండ్లకొనలు దడుప
నెడపఁ దడపనఁ బయ్యెదఁ దుడిచికొనుచు.

(అందఱు చప్పట్లు చఱచి హర్షింతురు.)

వెన్నయ:

అద్భుతము, పరమాద్భుతము కవీంద్రా! మీ వర్ణన ఆ శకున్తలామూర్తిని సాక్షాత్తుగా మా సమక్షమున నిల్పినది.

పురోహితుడు:

పినవీరభద్రులవారూ! గ్రంథముతో ముందుకు రండి.

(మంగళవాద్యములు మ్రోగుచుండగా, తాళపత్రగ్రంథప్రతిని, మఱియు పుష్పఫలచందన తాంబూలాదులను ఉంచిన వెండి పళ్ళెరమును పట్టుకొని రమణి యను బ్రాహ్మణసువాసిని తన వెంట రాగా, పినవీరన వెన్నయామాత్యుని పీఠము ముందుకు వచ్చి, అతని ముఖమున కుంకుమ బొట్టును పెట్టి, స్రక్పుష్పచందనాదులతో అలంకరించి ‘ఇదం శృంగారశాకున్తలాఖ్యం కావ్యం కౌణ్డిన్యసగోత్రోద్భవాయ చిల్లరవెన్నయామాత్యశేఖరాయ తుభ్యమహం సంప్రదదే నమమ. సర్వ శోభనమస్తు’ అని చెప్పుచు గ్రంథము నతని దోసిటిలోనుంచి అతని తలపై అక్షతలుంచును. అట్లతడు చేయుచుండగా పురోహితుడు ఈక్రింది మంత్రమును చదువును.

అ॒స్మిన్వసు॒ వస॑వో ధారయ॒త్విన్ద్రః॑ పూ॒షా వరు॑ణో మి॒త్రో అ॒గ్నిః| ఇ॒మమా॑ది॒త్యా ఉ॒త విశ్వే॑̍ చ దే॒వాఉత్త॑రస్మి॒గ్౦ జ్యోతి॑షి ధారయన్తు| అ॒స్య దే॑వాః ప్ర॒దిశి॒ జ్యోతి॑రస్తు॒ సూర్యో᳚ అ॒గ్నిరు॒త వా॒ హిర॑ణ్యమ్| స॒పత్నా᳚అ॒స్మదధ॑రే భవన్తూత్త॒మం నాక॒మధి॑ రోహయే॒మమ్| యేనేన్ద్రా॑య స॒మభ॑రః॒ పాయాం᳚స్యుత్త॒మేన॒ బ్రహ్మ॑ణా జాతవేదః| తేన॒ త్వమ॑గ్న ఇ॒హ వ॑ర్ధయే॒మం స॑జా॒తానాం॒ శ్రైష్ఠ్య॒ ఆధే᳚హ్యేనమ్| ఏషాం᳚ య॒జ్ఞము॒త వర్చో॑ దదే॒ఽహం రా॒యస్పోష॑ము॒త చి॒త్తాన్య॑గ్నే| స॒పత్నా᳚ అ॒స్మదధ॑రే భవన్తూత్త॒మం నాక॒మధి॑ రోహయే॒మమ్|| శ॒తమా॑నం భవతి శ॒తాయుః॒ పురు॑ష శ్శ॒తేన్ద్రి॑య॒ ఆయు॑ష్యే॒వేన్ద్రి॒యే ప్రతి॑తిష్ఠతి||)

వెన్నయ:

(సంతోషముతో గ్రంథమును గ్రహించి) ఈనాడు నా జీవితమున అత్యంతపర్వదినము. ఇంతటి సుందరకావ్యకన్యావరణభాగ్యము కల్గుట నా పురాకృత పుణ్యఫలము, కవివర్యుల కరుణాఫలము.

*అలశకుంతలం గనుగొన్న యప్పు డెట్టి
హర్షమునఁ దేలెనో కణ్వుఁ డట్టి యద్వి
తీయ హర్షలహరిలోనఁ దేలుచుంటి
నీదుశాకుంతలముఁ గొని నేను సుకవి!

(తన ఆసనమును చూపుచు) వీరభద్రకవీంద్రా! ఈ యాసనము నలంకరింపుడు.

పినవీరన:

ఏమి అమాత్యవర్యా! తమ యాసనమునా? దాని నధిష్ఠించుటకు నాకేమి అర్హత యున్నది? రాజకార్యధురంధరత్వము, అధికారప్రాభవము నాకు లేదే!

వెన్నయ:

అట్లనకుడు కవివర్యా! నేను కేవలము మంత్రిని మాత్రమే. మీరో సాహిత్యసామ్రాజ్యసార్వ భౌములు. మీ అర్హత కిది చిన్నపీఠమే. ఇంతకంటె ఉన్నతపీఠాన్ని అర్పించలేని అశక్తుడను.

పినవీరన:

అట్లనకుడు అమాత్యవర్యా! మీ ఆప్యాయనమే ఈ పీఠము నున్నతము జేయుచున్నది.(అనుచు ఆయాసనమునందు గూర్చుండును.)

వెన్నయ:

మంగళవాద్యములు పాడనీ! రమణీ! అర్చనసామగ్రి నందింపుము. (అనుచు రమణి అర్చనసామగ్రి నందీయగా, పురోహితుడు 6వ దృశ్యములో నిచ్చిన మంత్రములను చదువు చుండగా, పినవీరనకు శాలువ గప్పి, అర్చించి, ఘనదక్షిణతో సన్మానించును.)

వెన్నయ:

పినవీరనకవీంద్రా! ఇకనుండి మా సోమరాజుపల్లెలోనే ఉండి, మా ఆస్థానమును మీ కవితా సరస్వతికి ఆలయము గావింపుడు!

పినవీరన:

మీ ఆదరణకు కృజ్ఞుడను. మీరు కోరినట్లు కొంతకాల మిచ్చటనే ఉండెదను.

సదస్యులు:

జయము పినవీరనమహాకవులకు జయము! జయము వెన్నయమంత్రివరులకు జయము! (అని జయధ్వానములు చేతురు.)

ఎనిమిదవ దృశ్యము

(కాలం: 11 నెలల తర్వాత. స్థలం: సోమరాజుపల్లెలో పినవీరనగృహంలోని పూజామందిరం. అతడు భైరవమూర్తియైన ఈశ్వరుని, ఆ తర్వాత సరస్వతిని క్రింది స్తోత్రములు పఠించి పూజిస్తుంటాడు.)

ఓం నమస్తే భైరవాయ బ్రహ్మవిష్ణుశివాత్మనే|
నమస్త్రైలోక్యవన్ద్యాయ వరదాయ వరాత్మనే||

అనేకాయుధయుక్తాయ అనేకసురసేవినే|
అనేకగుణయుక్తాయ మహాదేవాయ తే నమః||

నమస్తే రుద్రరూపాయ మహావీరాయ తే నమః|
నమోఽస్త్వనన్తవీర్యాయ మహాఘోరాయ తేనమః||

(పై శ్లోకముములు చదువుచూ ఘంటానాదముతో భైరవునికి హారతి నిచ్చి, నిష్ఠతో కనులు మూసికొని ఈక్రింది వచనములతో ప్రార్థించును.)

బిట్రగుంటనివాసా! వేదవేద్యస్వరూపా! భైరవా! స్వామీ! శరణు! శరణు! నేనొక నవ్యకావ్య మును వ్రాయ సంకల్పించుచున్నాను. కాని ఎంత చింతించినను ఇతివృత్తము తోచకున్నది. నీ దయావిశేషమున నొక ఉత్తమ ఇతివృత్తమును తోపజేయుము స్వామీ!

(పై వచనములతో ప్రార్థించి, అట్లే నిమీలితనేత్రుడై కొంతసేపుండి, ఆ తర్వాత ఏదో స్ఫురించినట్లు ముఖమును వికసింపజేసి, కనులు తెఱచి, ఈ వచనములు చెప్పును.)

ఆహా! భక్తవరదుండైన భైరవుని ప్రసాదము. జైమిని యనియు, శ్రీకృష్ణపరమాత్మ యనియు రెండునామములు స్ఫురింపజేసినాడు. జైమినీయగ్రంథము లనేకము లున్నను, వానిలో శ్రీకృష్ణ పారమ్యమును బోధించునది జైమినీయభారతమొక్కటే. దీని ఇతివృత్తము వ్యాసభారతమున కంటె భిన్నమై, అందలి ఆశ్వమేధపర్వము వీరరసప్రధానమయ్యు, శ్రీకృష్ణశక్తి నుద్బోధించు నుత్తమభాగము. దీనినే ఆంధ్రీకరింపుమని ఈ స్ఫురణ కర్థము కాబోలు. అదియే ఆచరించెదను.

*వ్యాసుని భారతంబు రసభాసురరీతిని నాంధ్రమందునన్
వ్రాసిరి నన్నయాదికవిరాజలు; కాని స్పృశింపరైరి యు
ద్భాసితజైమినీయమగు భారతమున్, రచియింతు రమ్యగా
థాసముపేతమై తనరు తత్కృతి నేను తెనుంగునందునన్.

ఈ యత్నము నాసాంతము నిర్విఘ్నముగా కొనసాగింపుమని బ్రాహ్మీదేవిని ప్రార్థింతును.

కలావిలాసాన్మకరన్దబిన్దు ముద్రాం వినిద్రే హృదయారవిన్దే|
యా కల్పయన్తీ రమతే కవీనాం, దేవీం నమస్యామి సరస్వతీం తామ్||

చతుర్ముఖముఖామ్భోజ కలహంసవధూ ర్మమ|
మానసే రమతాం నిత్యం సర్వశుక్లా సరస్వతీ||
సరస్వతి నమ స్తుభ్యం వరదే భక్తవత్సలే|
కావ్యారంభం కరిష్యామి సిద్ధి ర్భవతు మే సదా!

(అని చదివి ఘంటానాదయుక్తముగా సరస్వతీదేవికి హారతి నిచ్చును. తరువాత జైమినిభారత తాళపత్రప్రతిని ప్రక్కనుంచుకొని, గంటముతో తాటియాకుపై దాని కనువాదమును వ్రాయుచు, వ్రాయు విషయమును ప్రకాశముగా నిట్లు చదువును.)

వ. అభ్యుదయం బాకల్పంబుగా నా కల్పింపం బూనిన జైమినిభారతంబునకుం గథావతారిక యెట్టి దనిన, నట్లు జనమేజయమహీశక్రుండు చక్రియాగంబు నిర్వక్రతం గావించిన యనంత రంబ సుఖాసీనుండై జైమినిం గనుంగొని మహాత్మా! సకలకలుషలతికాలవిత్రం బైన కురు క్షేత్రంబునం దజాతశత్రుండగు ధర్మపుత్త్రుండు ధార్తరాష్ట్రబలంబు నష్టాదశవాసరంబులు ధూళిధూసరంబు గావించి శాశ్వతైశ్వర్యధుర్యుండై విశ్వజగన్నుతంబుగా నశ్వమేధం బేవిధంబున నాచరించె నెఱింగింపు మనుటయు నమ్మునివల్లభుండు జనవల్లభున కిట్లనియె.

(అంతలో అలజడి. గృహావరణము లోనికి ఎవరో ప్రవేశించిన సందడి. ఆ సందడికి పినవీరన గ్రంథరచనను విరమించి, తలవాకిటి కడకు వచ్చి చూడగా ఇద్దరు రాజభటులు చక్కని నగిషీ చేసిన పెట్టె నొకదానిని తీసికొని వచ్చినట్లు కనిపిస్తారు.)

మొ.భటుడు:

అయ్యగారికి నమస్కారము. ఇదేకదా పినవీరభద్రులవారి యిల్లు?

పినవీరన:

ఔను. ఆ పినవీరనను నేనే.

రెం.భటుడు:

అయ్యగారూ! మేము విజయనగరాధీశ్వరులు శ్రీశ్రీశ్రీ సాళువనరసింహరాయలవారు పంపగా వచ్చినాము. వారు మిమ్మల్ని వెంటనే విజయనగరానికి తీసికొని రావలసిందిగా శాసించినారు.

పినవీరన:

ప్రభువుల శాసనమునకు కారణ మేమిటో? నాకు భయము గానే ఉన్నది. లోనికి రండు. వివరములు సెలవిండు. (భటు లిర్వురు పినవీరనతో లోని కేగి అర్హాసనాసీను లగుదురు)

మొ.భటుడు:

మీకు భయ మక్కఱ లేదు. శిక్షించుటకు గాదు సత్కరించుటకే ప్రభువులవారు ఈ యేర్పాటు చేసినారు. కానుకలు గూడ పంపినారు.

రెం.భటుడు:

ఇదిగో కానుకలు, ప్రభువులు తమరికి వ్రాసిన ఉత్తరం. (అని ఉత్తరముతో బాటు, పెట్టెలోనుండి జరీశాలువ, వజ్రకంకణము తీసి పినవీరన కిచ్చును.)

పినవీరన:

ప్రభువుల దయకు ధన్యుడను. (అని చెప్పి, పంపిన ఉత్తరమును ప్రకాశముగా చదువును.)

“గీర్వాణాంధ్రభాషాకోవిదులు, కవితల్లజులైన బ్రహ్మశ్రీ పినవీరభద్రులవారి సన్నిధికి మహారాజాధి రాజ, రాజపరమేశ్వర, ఐవరగండ, మేదినీవరాహ, కటారి సాళువాది బిరుదాంకిత సాళువ నరసింహరాయలు సవినయముగా బంపుకొను సమాచారము. మీరు మేము పంపిన భటులతో వెంటనే విజయనగరమునకు వేంచేయగలరు. విషయములు సమక్షములో వివరింపబడును.

ఇట్లు సవరాహముద్రాంకితముగా,
సాళువ నరసింహరాయలు
విజయనగరసామ్రాజ్యాధీశ్వరులు.”

(అట్లు చదివి) ప్రభువులు సగౌరవముగ ఆహ్వానపత్రమును పంపిరి గాని, ఆహ్వానకారణమును తెలుపలేదు. ఇదంతయు నాశ్రేయోర్థమే అగుగాక యని భారతీదేవిని ప్రార్థింతును. కాని నేనిప్పుడు వెన్నయామాత్యుల పోష్యవర్గములో నున్నాను. వారి అనుజ్ఞను తీసికొని, మంచి ముహూర్తమును చూచుకొని మీతోపాటే విజయనగరమునకు వత్తును.

భటులు:

మంచిదయ్యగారూ. అట్లే చేయండి. కాని ప్రభువులు మిమ్మల్ని వెంటనే ఆలస్యం చేయకుండా తీసుకరమ్మన్నారు. గుర్తుంచుకోండి.

పినవీరన:

నాకు తెలుసు. చక్రవర్తి శాసనం అవిలంఘనీయమైనదని. రేపు ప్రయాణానికి అనువైన గడియలు చూచి బయలు దేరుదాము. నేడే నేను వెన్నయమంత్రికి విషయం విన్నవించి సెలవు తీసుకొంటాను.

తొమ్మిదవదృశ్యము

(స్థలం: సాళువనరసింహరాయల ఆస్థానం. పినవీరన, ఇతర పండితులు, పెదవీరనాది అధికారులు, సంగీతనాట్యవిద్యానిపుణలైన నర్తకీమణులు సమావేశమై ఉంటారు.)

వందులు:

(రాయలు సభకు విచ్చేయుచుండగా ఈ క్రింది జయవచనములు పల్కుదురు.)

జయజయ రాజాధిరాజ రాజపరమేశ్వర విజయనగరాధీశ్వర!
జయజయ కర్ణాటాంధ్రమహీమండలాఖండల, గుండయ నరసింహభూవర!
జయజయ ధరావరాహ కటారి సాళువాది బిరుదాంక, సురుచిరరూపశశాంక!
జయజయ నిర్జితాఖిలవైరినృపాలవర, కవిపండితవర్గకృపాకర! జయము! జయము!

రాయలు:

సభకు నమస్కారము. ఈనాడు విజయనగర సాహితీసామ్రాజ్యమున కొక పర్వదినము. నేడు పినవీరభద్రులవారిని సాదరముగా నాహ్వానింప మనము సమావేశమైనాము. వారు మా పరివారములో ముఖ్యులైన పెదవీరభద్రులవారికి అనుజు లగుట ఇంకను విశేషము. (పినవీరభద్రుని చూస్తూ) పినవీరభద్రకవీంద్రా! మీరుండవలసిన స్థానమది కాదు. నా చెంత నున్న ఈ సువర్ణాసనము నలంకరించండి.

పినవీరన:

ప్రభువుల యాదరణ అసామాన్యము. (అనుచు ఆస్వర్ణపీఠమున నాసీనుడగును.)

రాయలు:

కవీంద్రా! మీరు అవతారదర్పణ, మానసోల్లాస, శాకున్తలాద్యనేకకావ్యముల రచించి లబ్ధప్రతిష్ఠులైనారని నేనెఱుగుదును. మీ శాకున్తలము శకుంతల వలెనే అత్యంతసుందరసుకుమార మైనదని ప్రశస్తి గాంచినది. శాకున్తలానంతరము మీరింకేమైన కావ్యముల వ్రాయబూనినారా?

పినవీరన:

ప్రభువులు నాకావ్యముల నింతగా నెఱుగుట నాకాశ్చర్యానందములు గొల్పుచున్నవి. శాకున్తలము పిదప జైమినీయభారతమును యథామూలముగా తెనుగులో వ్రాయవలెనను కొనుచున్నాను.

రాయలు:

ఈసమాచారము మాయాస్థానములోని పండితుల కెట్లో తెలిసినట్లున్నది. ఈ సంగతినే చూచాయగా వారు నాతో అన్నారు. నాకును జైమినిభారతము ప్రియమైన కావ్యము. వీరరస భరిత మయ్యు, శ్రీకృష్ణపరమాత్ముని పారమ్యము నెత్తిచూపు కావ్యమది. వ్యాసభారతమున కన్న భిన్నమైన ఆఖ్యానముల కాలవాల మగుట అందలి విశేషము.

పినవీరన:

ప్రభువులు నా మనము నెఱింగినట్లే మాట్లాడుచున్నారు.

◊స్తుత్యముఁ, గలికల్మషరా
హిత్యము, నాఖ్యాయికావిహిత బీజచతు
స్సీత్యము, వసుదేవసుతౌ
న్నత్యాఖ్యానము నగుచుఁ దనర్చును నదియున్.

రాయలు:

సత్యము వచించితిరి కవివర్యా! అందును అశ్వమేధపర్వము ధర్మరాజానుజులు శ్రీ కృష్ణుని సాహాయ్యముతో యజ్ఞాశ్వరక్షణకై చేసిన యుద్ధపరంపరను వర్ణించున దగుట క్షాత్రధర్మస్థుడ నగు నాకు మిక్కిలి ప్రీతికరము. అందుచేత మీరు రచింప దలపెట్టిన జైమినీయమునందు అశ్వ మేధపర్వము నాంధ్రీకరించి నాకంకిత మొనర్ప నర్థించుచున్నాను.

*చాలగౌరవము గలదు సత్కవీంద్ర
నీ కవిత్వమునందున నాకుఁ గాన
జైమినీయంబు రచియించి సాళ్వవంశ
కీర్తి సుస్థిరం బగునట్లు కృతిగ నిమ్ము.

పినవీరన:

*కవి తలంచిన దదియె; తత్కావ్యకన్యఁ
గొనఁ దలంచిన భూపతి గోరునదియు
నదియె; ఇంతకంటెను భవ్యమైనయట్టి
బాంధవము గల్గునే యిలఁ బార్థివేంద్ర!

కావున మీ నియోగమును తప్పక నిర్వర్తింతును. అనుగ్రహింపుడు.

రాయలు:

కాని ఇందులో ఒక క్లేశమున్నది. త్వరలో, అనగా మూడు వారములలో వచ్చు నవరాత్రి ఉత్సవములలో ఈకృతి నాకంకితము కావలెను. ఇంత స్వల్పవ్యవధిలో నింతటి బృహత్కావ్యమును రచించుటకు మీరే సమర్థులని మిమ్మిటకు రప్పించితిని.

పినవీరన:

నాసామర్థ్యము పట్ల మీకు గల విశ్వాసమునకు కృతజ్ఞుడను. సరస్వతీప్రసాదమున్న ఇది సాధ్యమగు కార్యమే. అందుచే ఆ భారతీదేవిపై భారము వేసి ఇందుకై కడంగుదును.

*అమ్మ! భారతీదేవి! నీయందు భార
ముంచి స్వీకరించుచు నుంటి నుర్వరాధ
రప్రతిమమగు నీకావ్యరచనభరము;
నిర్వహింపఁగ నిద్దాని నీవె దిక్కు!

రాయలు:

పినవీరభద్రా! మీ రంగీకరించినందులకు నాడెంద మానందకందళితమైనది. నిర్వహింప మీరొక్కరే సమర్థులని దీనిని మీకప్పగించుచున్నాను. పురోహితవర్యా! నర్తకీ మదాలసా! కవిగారిని సన్మానించుటకు సిద్ధము కండి.

(మంగళవాద్యములు మ్రోగుచుండగా, మదాలస వయ్యారంగా సువర్ణపాత్రలలో నుంచిన వస్త్రాభరణాదిపూజాద్రవ్యము లందించుచుండగా, పురోహితుడు 6వదృశ్యములో నిచ్చిన మంత్రములను సందర్భోచితముగా చదువుచుండగా నరసింహరాయలు పినవీరభద్రుని సన్మానించును. అనంతరము…)

సదస్యులు:

కవికోవిదులు పినవీరభద్రులకు జై! పినవీరభద్రులకు జై!
ప్రభుపుంగవులు సాళువ నరసింహరాయలకు జై| నరసింహరాయలకు జై!

పినవీరన:

ప్రభువుల ఆదరణ అమోఘము. సర్వేశ్వరుడు మీకు సంతతసంపత్ప్రదుడౌగాక!

రాయలు:

ఇంకను ముగియలేదు కవీంద్రా! మా ఆస్థాననర్తకి మదాలస నృత్యము లోనే కాదు, సాహిత్యములోనూ చక్కని ప్రతిభ గలది. మీసాహిత్యసామర్థ్యమును స్ఫుటీకరించు గీతము నామె రచించినది. ఆగీతార్థము నామె నటించి యిప్పుడు మిమ్మానందింపజేయును.

(మదాలస నుద్దేశించి) మదాలసా! ఆరంభించు నీ నృత్యనీరాజనమును.

మదాలస:

చిత్తము ప్రభూ. (ఈక్రింది గీతమును మోహనరాగములో పాడుచు నాట్యము చేయును.)

పల్లవి:
స్వాగతము కవీంద్రా, యిదె స్వాగతము సుధీంద్రా,
సుందర కవితా విభవా, సంక్రందనగురు ప్రతిభా (స్వాగతము)
అనుపల్లవి:
కాశ్యపవంశసుధాకర, కవితాకాంతావర
వాణీపూజనతత్పర, వందితసాధుపరంపర (స్వాగతము)
చరణం:
మానసోల్లాస శాకున్తలాది కావ్య రచనచణ పినవీరనా
సూరిజనబృంద వందిత, సుందర వాగ్విభవానందిత బుధజన,
అసదృశసద్గుణమణిగణ, అసమాంధ్రగీర్వాణవాగ్భూషణ,
వేదవేదాంగశాస్త్రనిపుణ, విశ్రుతకీర్తివిభూషణ పినవీరనా (స్వాగతము)
ధప గరి సగ ధప సరిగ స గ సా, ధ ప గా గ రి ప గ రి స ధ సా
సస రిరి గప ధఫ సస ధ ప పగ రిరి ప గ రి స ధసా
స రి గ ప ధ స ధ ప గ రి ప గ రి స ధ సా
సస రిరి గరి గప గప ధస ధప గరి మా గరి సధ సా
తటక ఝణుతాం తక ఝణుతాం తకిటతక ఝణుతాం
తత్త త్తధికణ తక ఝణు తాం ఝణుతాం తత్త త్తధికణ తక ఝణుతాం
తకతరి కుకుందన కిటతకధీం తకతరి కుకుందన కిటతకధీం
తకతరి కుకుందన కిటతటక ధీం (స్వాగతము)

(నాట్యాంతమున మదాలస పినవీరపదములపై తల వాల్చి అభివాదము చేయును. అప్పుడు వారి చూపులు కలియును. ఆసక్తితో చూపులు గలుపుచు పినవీరన తన మెడలోని పూలదండ నామె కంఠమునం దుంచును. అనురాగస్ఫోరకమైన చూపులతో నామె ఆ దండను స్వీకరించును.)

పదవదృశ్యము

(స్థలం: విజయనగరం, మధ్యాహ్నానంతరం సింగరాజు అను వ్రాయసకాడు పాడుతూ వస్తాడు.)

సింగన:

తాటియాకుల పైన నీటుగా గంటంబు
దడదడా గుఱ్ఱాలు దౌడు తీసిన యట్లు
ఉరకలెత్తింపనా, ఉరువడిం జెక్కనా
ముత్యాలచేరువలె ముద్దుముద్దుగ వ్రాలు.
నాల్గుచేతులతోడ నరజాతి కర్మంబు
ఫాలతలముల వ్రాయు బ్రహ్మదేవుండేని
పంతగించుచు రాఁగ వ్రాయసపుఁ బనిలోన
చిత్తుగా నోడించు సింగనను నేఁగాన? (పాటగా పాడును.)

రాజాధిరాజులు సాళువనరసింహరాయప్రభువులు వారి ప్రధానమంత్రుల ద్వారా నన్ను పిన వీరనమహాకవుల నంటిపెట్టుకొని ఉండి, వారు వ్రాస్తున్న జైమినిభారతమునకు వ్రాయసకానిగా నుండుమని నియమించిరి. ఈ కావ్యరచనావిశేషములను అనుదినము ప్రధానమంత్రులద్వారా తమకు నివేదింపుమని ఆజ్ఞాపించిరి. అట్లే చేసెదను గాక! ఇదిగో ఇదే పెదవీరభద్రులవారి యిల్లు. పినవీరభద్రులును ఇందే యున్నారట! వారిని దర్శించుకొందును.

(తలుపు దట్టును. పెదవీరన తలుపు దీయును.) అయ్యగారూ! పినవీరభద్రులవారిక్కడనే ఉన్నారా?

పెదవీరన:

ఆ! నీవు సింగనవు గదా! మాతమ్మునితో నీకు పని యేమి?

సింగన:

ప్రధానమంత్రులవారు నన్ను పినవీరనగారు వ్రాస్తున్న జైమినిభారతానికి వ్రాయసకానిగా నియమించి పంపినారు. వారి నంటిపెట్టుకొని ఉండి, వారు చెప్పినదంతా తు.చ. తప్పకుండా వ్రాయమన్నారు.

పెదవీరన:

సరే మంచిదే! కాలం స్వల్పంగా ఉంది కనుక నీసహాయం అవసరమే! తమ్ముడూ! ఇలా రా. ఈ రాయసకానిని చూడు. (పినవీరన వచ్చును.)

సింగన:

దండాలు కవిరాజులకు. నన్ను ప్రధానమంత్రులవారు మీకు రాయసకానిగా నియమించి పంపి నారు. మీరు చెప్పే పద్యాలకు చక్కని ప్రతులు వ్రాస్తూ అన్నివేళలా అందుబాటులో ఉండ మన్నారు.

పినవీరన:

సరే మంచిది. నేనిప్పుడే రచనారంభం చేస్తున్నాను. నీవు సకాలానికే వచ్చినావు. ఇదిగో ఇట్లా సరస్వతీసన్నిధిలోనికి వచ్చి కూర్చో. (సింగన, పినవీరన సరస్వతీసన్నిధిలో కూర్చుందురు. సింగన తాటియాకులకట్ట విప్పుకొని, గంటముతో సన్నద్ధు డగును.)

సరస్వతి నమస్తుభ్యం వరదే భక్తవత్సలే|
కావ్యారంభం కరిష్యామి సిద్ధి ర్భవతు మే సదా||

సింగనా! నీవు సిద్ధమేనా? ముందుగా మహారాజులవారి వంశవర్ణనతో ఆరంభిస్తాను.

శార్ఙ్గబాణాసనజ్యావల్లరీజాత
            బంధుర కిణగణోద్భాసితంబు
లీలోపధానవేళా లాలితశ్రీ క
            బరిపుష్పవాసనా భాసురంబు
నభసంగమాన్వయనాథ వాహనరాజ
            కంధరాస్ఫాలన కర్కశంబు
పాంచజన్యోద్భూత పాండుచ్ఛవిచ్ఛటా
            చంద్రికారస ముహుః క్షాళితంబు

దానవారాతి దక్షిణేతరకరంబు
రాజితంబుగ వెలయించె రాజకులము
కైరవాప్తుండు దనకుఁ బక్షంబుగాఁగఁ
గువలయానందకరలక్ష్మిఁ గొమరు మిగిలి.

ఉడుపతి వంశకర్త మహిమోన్నతి కెయ్యది మేర, నాఁడు పా
ల్కడలి జనించినప్పుడు దళంబుగ నంటిన మేనిజిడ్డు వోఁ
గడుగుకొనంగ నబ్బెనని కా శివు నౌదలయేటఁ బాదముల్
దడఁబడ నోలలాడుచు హళాహళిగా పడి నీఁదులాడెడిన్.

ఆవంశంబున నుద్భవించె నహితక్ష్మాధీశ కోటీర కో
టీవిన్యస్త వినూత్నరత్న రుచివాటీ విస్ఫుర త్పాదరా
జీవద్వంద్వుఁడు గుండశౌరి జయలక్ష్మీ కంధరా బంధుర
గ్రైవేయాంతర పద్మరాగసఖ దోఃఖడ్గ ప్రతాపార్కుఁడై.

సింగనా! ఏమి ఇబ్బంది లేదుగదా! అంతా వ్రాసినావు గదా!

సింగన:

అంతా స్పష్టంగానే ఉంది. వ్రాసినాను.

(ఇంతలో మదాలస చేటిక మణిప్రభ ప్రవేశించును)

సింగన:

(ఉత్కంఠతో) ఏమే మణిప్రభా నీవెందు కొచ్చావే ఇక్కడికి?

మణి:

(నిర్లక్ష్యంగా) ఎక్కడ చూచినా నీవే ఉండావే! నీకొఱకు రాలేదులే. పినవీరయ్యగారి కొఱకొచ్చానులే.

మణి:

(సవినయంగా) అయ్యగారికి దండాలు. నేను మదాలసమ్మగారి సేవికను. ఏదో సాహిత్యవిషయమంట. మిమ్మల్ని అడగాలంట. మీకు వీలైతే రమ్మని కబురంపినారు.

పినవీరన:

సింగనా! ఇక ఈరోజుకు చాలు. ఈ మదాలస విషయమేమిటో తేల్చుకొని వస్తాను.

సింగన:

(మదాలస పిలుపులో ఏదో అంతరార్థం ఉందన్న భావం నటిస్తూ) అట్లే అయ్యగారూ!

(సింగన తాళపత్రాదులను సర్దుకొని నిష్క్రమించును. పినవీరన మణిప్రభతో నిష్క్రమించును.)

పదకొండవ దృశ్యము

(స్థలం: సుందరమైన చిత్రపట, పుష్పమాలికా, యవనికాది నానాలంకారశోభితమైన మదాలస గృహం. మొదట వేషభాషలలో, అభినయంలో మదాలస పినవీరనపై అనురాగపూర్ణయైనట్లు నటిస్తుంది. కాని తదుపరి అతనికి తనయందు గౌరవపూర్ణమైన ఆసక్తి మాత్రమే ఉందని గ్రహించి, తదనుగుణంగా తన నడవడిలో మార్పును ప్రదర్శిస్తుంది.)

మదాలస:

స్వాగతం కవీంద్రులకు. మీ రాకచే నాగృహం పావనమైంది. రండి. సుఖాసీనులు కండి.

పినవీరన:

(కూర్చొని) శుభమస్తు. రాజాస్థానంలో నీ నాట్యం నేత్రపర్వంగా ఉండింది. నీకు సాహిత్యంలోగల పాటవం నీపాట ద్వారా విదితమైంది. అది ప్రౌఢంగాను, మధురంగాను ఉన్నది.

మదాలస:

నాట్యంలో ఏదోకొంత పాండిత్యం సంపాదించినాను, నా సాహిత్యపరిచయం మీప్రతిభ ముందు సూర్యుని ముందుంచిన చిఱుదీపం వంటిది.

పినవీరన:

చింతింపఁ బనిలేదు. ఇప్పటికే పుష్కలంగా ఉన్న నీభాషాజ్ఞానం మఱికొంత పెంపుచేసికొని రచనాభ్యాసం చేస్తే నీవూ ప్రకాశింపగలవు.

మదాలస:

ఇటీవల నేనొక పదాన్ని వ్రాసినాను. మీకు దానిని చూపించి బాగోగులను తెలుసుకుందామని మిమ్ముల నిక్కడికి ఆహ్వానించినాను.

పినవీరన:

ఏదీ చూపు.

మదాలస:

ఇదిగో చూడండి. (తాను వ్రాసిన తాళపత్రము నీయగా పినవీరన చదువుకొనును.)

పినవీరన:

ఈ పదసాహిత్యం నా పద్యసాహిత్యానికంటె భిన్నమైనది. పద్యం సందర్భోచిత పదసంచయనం ద్వారా, లయ ద్వారా, రసోత్పత్తి ద్వారా భావుకుని మనస్సును మధురలోకాలలో విహరింపజేసేది. పదం సంగీతానుకూలమైన మృదుపదసంచయనంతో, తదనుగుణంగా నటియించి నప్పుడు నయనానందమును, రసస్ఫూర్తి ద్వారా మానసికానందమును కలిగించేది. ఈ లక్షణాలు నీపదంలో ఉన్నవనుటలో సందేహం లేదు. కాని నటిస్తే గాని దాని పరిపూర్ణమైన కళాత్మతను దర్శింపలేము.

మదాలస:

ఐన నటియించి చూపమంటారా?

పినవీరన:

కానిమ్ము.

మదాలస:

(మణిప్రభతో) మణిప్రభా! ఈ వీణను పలికిస్తూ ఉండు. ఈలోపల నేను ఆహార్యాన్ని మార్చుకుంటాను.

(మణిప్రభ వీణ వాయించుచుండగా, నాట్యాహార్యముతో ప్రవేశించి తాను వ్రాసిన క్రింది పదమును నాట్యానుకూలగమకములతో కాపీరాగములో పాడుచు శృంగారరసపూర్ణమైన అభినయంతో నాట్యము చేయును.)

పల్లవి:
త్వర యేలరా సామి, తరుణి గన వేలరా
తొలియామమే యింకఁ దొలఁగలేదుర సామి
అనుపల్లవి:
కలువకన్నియ నింకఁ గలసియుండెర రాజు
జిలుగువెన్నెల యింక వెలుగుచుండెర మింట (త్వర)
చరణం:
సౌరభంబును జిల్కు సంపెఁగలు మల్లికలు
చల్లియుంచిన పాన్పు శయనింప రమ్మనెర
ఆమోదమును గ్రమ్ము నగరుధూపపు చాలు
సామోదముగఁ గూడి శయనించి పొమ్మనెర (త్వర)
చరణం:
నింగిలోఁ జూడరా నెనరార నెలరాజు
కరములందునఁ దాల్చి కమ్మకమ్మనిసుధలు
వలపించి మురిపించి తెలిరిక్కకన్నియల
వెన్నెలలతోఁటలో విహరించు జతగూడి (త్వర)
చరణం:
వలచివచ్చినకాంత పంచ నుండినవేళ
తొలఁగిపోవఁగఁ జాల తొందరించుట యేల
వలపుగొంటివొ యేమొ పరకాంతలందునం
దెలుపరా నిజమింకఁ దేనెపలుకులు మాని (త్వర)
చరణం:
ఇచ్చకంబులతోడఁ బుచ్చకుర కాలంబు
వచ్చి చేరినకాంత వలపు గైకొనర
మచ్చికలు మీరంగ వెచ్చనౌ కౌఁగిళులఁ
బుచ్చరా యీరేయి పోవ నీకేల (త్వర)
పినవీరన:

అద్భుతం మదాలసా! అతికోమలమైన పదములతో హృదయంగమములైన భావములతో నీవు వ్రాసిన పదమునకు నీనాట్యము పరిపూర్ణమూర్తిత్వమును కల్పించినది. సాక్షాత్తుగా నీలో నా యుపాస్యదేవతయైన సర్వకళాస్వరూపిణి యైన సరస్వతీదేవిమూర్తినే సందర్శించినాను. ఇట్టి యపూర్వానుభవసంధాత్రి వైన నీకు కేలు మోడ్చి నమస్కరించుచున్నాను.

మదాలస:

(తనలో) ఆహా! ఎంత గౌరవనీయుడు? ఈతడు బహుసమ్మోహనకరమైన నా బాహ్యరూపమునకు అనురక్తుడు గాక భక్తితో నాలోని కళాసరస్వతిని దర్శించి, ఆరాధించుచున్నాడు. నేను సైతము సుందరుడైన ఈతని యంతరంగమునందలి కళాసరస్వతి నట్లే ఆరాధించెదను, గౌరవించెదను. (ప్రకాశముగా) అపచారము! అపచారము! మీవంటి మహాకవులు నాకు కేలు మోడ్ప రాదు. మీ వైదుష్యము ముందు నాయాట గడ్డిపరక వంటిది.

పినవీరన:

కాదు మదాలసా! నేను నిజముగా నీలో సరస్వతినే దర్శించినాను. కామముతో గాక ఈ పూజ్యభావముతోనే నిన్ను నే నవలోకించుచున్నాను. నేను చేయు ధ్యానమునకంటె సులభముగ ఈ రూపమున నా యుపాస్యదేవతను దర్శింపగల్గుట నాకమితానందమును గలిగించుచున్నది.

మదాలస:

(భక్తితో) అంతయు వైదుష్యపరిణతమైన మీ యూహలోనే ఉన్నది స్వామీ! నేను మాత్రము మామూలుగనే నటించినాను.

పినవీరన:

నీవేమి చేసితివో కాని నాకు మాత్రము సరస్వతీసాక్షాత్కారము కల్గినది.

మదాలస:

(భక్తిభావముతో) అట్లైన అనుదినమును మీకై ఆడెదను స్వామీ! ఆజ్ఞ యిండు.

పినవీరన:

అట్లే యగు గాక. నీ నాట్యమూర్తిలో నాపరదేవతను దర్శించుటకు ప్రతిదినమును ప్రతీక్షించుచుందును.

పన్నెండవ దృశ్యము

(దుర్గాష్టమి సందర్భంలో మొగలిపూవులను కోసికొనుటకై మణిప్రభ తోటకు వస్తుంది. తదర్థమే సింగన కూడ వస్తాడు.)

సింగన:

ఏమే మణీ! నీవెందుకొచ్చినట్టు?

మణిప్రభ:

మఱి నీవెందు కొచ్చినట్టు?

సింగన:

కేతకుల గోసికొందామని. మఱి నీవు?

మణిప్రభ:

కేతకుల గోసి యిత్తామని.

సింగన:

ఎవరికే నీ ప్రియునికా!

మణిప్రభ:

గంటందప్ప కత్తి పట్టలేని నీవంటి అల్పబుద్ధులకు.

సింగన:

ఏమే నన్ను వఠ్ఠి అల్పబుద్ధి అంటున్నావా?

మణిప్రభ:

కాదు. అనల్పమైన అల్పబుద్ధి అంటున్నాను.

సింగన:

నాసామర్థ్యం తెలియని ఒఠ్ఠి మూర్ఖురాలవు. కవుల కావ్యాలు రాసీ రాసీ నాకూ కవిత్వం అబ్బింది. చూడు

తాటాకువంటి చెక్కిలిదానా
గంటంబువంటి నాసికదానా

మణిప్రభ:

అబ్బో! అబ్బో! అద్భుతం. నీ బుఱ్ఱ ఎప్పుడూ తాటాకులూ, గంటాలలోనే ఉంటుందని తెలిసిపోయింది. అంతమాత్రం కవిత్వం నేనూ చెప్పగలనులే.

సింగన:

ఏదీ చెప్పు.

కోతివంటి కోమలాంగుడవే
కోరికోరి చేరు కుసుమాస్త్రుడవే

సింగన:

ఏమే, నన్ను కోతి అంటున్నావా?

మణిప్రభ:

కుసుమాస్త్రుడని కూడా అన్నానుగదా!

సింగన:

కోతి కుసుమాస్త్రు డెట్లౌతాడే?

మణిప్రభ:

కుసుమాస్త్రుడే పరకాయప్రవేశం చేసి నీ బొందిలో దూరితే అచ్చం కోతిలాగే ఉంటాడని దీని అర్థం.

సింగన:

అంటే కుసుమాస్త్రుడు కోతి ఔతాడు గాని నేను గానని అన్నావన్నమాట. బ్రతికిపోయావు. లేకుంటేనా?

మణిప్రభ:

లేకుంటే?

సింగన:

నేనూ చెప్పేవాణ్ణి
సురసుందరాంగివి నీవే,
చుప్పనాతి చెల్లెల వీవే – అని.

మణిప్రభ:

ఒహో! ఓహో! నాకు దీటైన కవివర్యుడవే నీవూ.

సింగన:

ఐతే కలిసి హయిగా పాడుకుందాం రా!

(సవిలాసముగా సాభినయముగా పాడుకొందురు)

సింగన:

“తాటాకువంటి చెక్కిలిదానా
గంటంబువంటి నాసికదానా”

మణిప్రభ:

“కోతివంటి కోమలాంగుడా
కోరికోరి నిన్నె చేరితిరా”

సింగన:

“సంకువంటి కంఠముదానా
కంకివంటి పిక్కలదానా”

మణిప్రభ:

“తప్పెటవంటి ఫాలమువాడా
చప్పిడి గాని ముక్కులవాడా”

సింగన:

“ఊడలవంటి జడగలదానా
తొండమువంటి తొడగలదానా”

మణిప్రభ:

“ఎంతమంచి కవిచంద్రుడవో
వంతలన్ని తీరు నీకౌఁగిటిలో”

సింగన:

“కోతి వన్న నేమి కోమలాంగీ నీవు
కౌఁగిలింప నిన్ను కనిపించు స్వర్గాలు”

మణిప్రభ:

“మొగలితోటలోన మొలిచె వసంతంబు
కౌఁగిలించి నిన్నె కంటి సుఖాంతంబు.”

సింగన:

ఏమే మణీ! మఱి పినవీరనగారు మీ అమ్మగారింటికి రోజూ వస్తున్నారా?

మణిప్రభ:

నీకు తెలియని దేముంది. రోజూ నీవు ఆయన పద్యాలు వ్రాయడానికి పోతున్నావుగా!

సింగన:

పోతున్నాను గాని, ఒకటి రెండు పద్యాలు రాయగానే నన్ను ఇంటితోవ పట్టిస్తున్నాడు. ఇప్పటికి 120 పద్యాలు మాత్రమే నా తాటాకులలో పడ్డాయి. మఱి దసరా నాటికి ఆ భారతం ఎట్లా ముగుస్తుందా, రాజుగారికి ఎట్లా అంకితమౌతుందా అని నాకు చింత పట్టుకొన్నది. ఆయన కేమో ఏ చీకూచింతా లేదు. ఆ రెండు మూడు పద్యాలు చెప్పేసి సరస్వతీదర్శనం చేసికోవాలంటూ మీ యింటికే వస్తాడు.

మణిప్రభ:

అది నిజమే. రోజూ పినవీరనగారు మా యింటికి వస్తారు. మా యింట్లో చాలా సేపుంటారు. మా అమ్మగారు వారిని చాలా ఆదరించి, గౌరవించి, పరవశంతో వారి ముందు నాట్యం చేస్తుంది. వారు తన్మయత్వంతో దానిని చూస్తూ ఉండిపోతారు.

సింగన:

అంతేనా, మఱింకేమైనా వారి మధ్య …

మణిప్రభ:

ఛీ! ఛీ! అపచారం! అట్టిదేమీ లేదు. మా అమ్మగారి నాట్యమూర్తిలో వారు సాక్షాత్తు సరస్వతినే చూస్తారంట. అందుచేత వారికి భక్తిభావమే కాని మఱింకేమీ లేదు. అమ్మగారు కూడ వారిని చూస్తే సాక్షాత్తు బ్రహ్మదేవుడినే చూచినట్లు తృప్తి పడుతుంది. వారిని చాలా గౌరవిస్తుంది.

సింగన:

ఇద్దఱూ గొప్పవారే. వారిది అమలినమైన భారతీబ్రహ్మలబాంధవ్య మన్నమాట. ఐతే ఏం? లోకం పోకడ లోకానిది. రాయసకానిగా నాకు విజయనగరంలోని కవిపండితులతో మంచి పరిచయం ఉంది. కలిసినప్పుడల్లా పినవీరనగారినీ, వారు వ్రాసే కావ్యాన్నీ గుఱించి వారు నన్నడుగుతుంటారు. పినవీరనగారి కాలమంతా మీ అమ్మగారి కాలియందెలరవళికే అంకితమైందని వారి అభిప్రాయం. వీరి సంబంధాన్ని గుఱించి ఏవో వింతవింత ఊహలు!

మణిప్రభ:

లోక మేమమనుకున్నా వారిది మాత్రం పవిత్రబంధమే. అంతమాత్రం చెప్పగలను.

సింగన:

అంతేకాదు. పండితులలో కొంత అసహనం కూడ మొదలైంది. కావ్యరచన కుంటినడకగా సాగుతున్నదని తెలియగానే, మొదట పినవీరనగారే ఈ కావ్యరచనకు తగినవారని అన్న పండితు లిప్పుడు తమను కాదని ఆయనకు అప్పగించడం వల్లనే ఇట్లు జరుగుతున్నదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మణిప్రభ:

పినవీరనగారు మహాసరస్వతి ఉపాసకులు. ఆ దేవీకటాక్షమే వారిని కాపాడుతుందని అనుకుందాం. నీవు రాకుంటే నేనెప్పుడో పూలు కోసికొని అదృశ్యమయ్యేదానిని. నీవల్ల ఇంత ఆలస్యమైంది. నీకూ నేను కొన్ని పూలు కోసి పెడతాను. తీసికొని మనదారిన మనం పోదాం.

సింగన:

మంచిది. మొగలి ముండ్లు నాటించుకొనే ప్రమాదాన్ని నాకు తప్పిస్తున్నావు. ఎంతైనా మొగలి పూలు కోయడంలో నీవు గడుసరివి కదా! (కోసిన పూవుల నిర్వురు తీసికొని నిష్క్రమింతురు.)

పదమూడవదృశ్యము

(స్థలం: పెదవీరనగృహం. సమయం:మహానవమినాటి ఉదయం)

పెదవీరన:

తమ్ముడూ! రేపే విజయదశమి. నీవు జైమినిభారతాన్ని అంకితం చేయవలసిన దినం. నేను అధికారవశాత్తు అన్యప్రాంతమున కేగుటవల్ల ఆగ్రంథరచన ఎంత పూర్తియైనదో తెలిసికొనక పోతిని. కాని ప్రధానమంత్రులద్వారా నాకు తెలిసిన సమాచారం అది పూర్తి కాలేదనే.

పినవీరన:

అది మంత్రిగారి కెట్లా తెలుసు?

పెదవీరన:

ఆ రాయసకా డున్నాడే. వాడు రోజూ కావ్యపరిస్థితి ప్రధానమంత్రికి తెలుపుతున్నాడు. ప్రధానమంత్రి ఆ విషయాన్ని ప్రభువులకు నివేదిస్తున్నాడట.

పినవీరన:

అంటే ప్రభువులకు ఈ గ్రంథంలో స్వల్పభాగమే పూర్తయిందని తెలుసన్నమాట.

పెదవీరన:

ప్రభువులకే కాదు. ఇతర పండితులకు గూడ తెలుసునట. ఆ రాయసంగాడు వట్టి వదరుబోతు. వాని నోట్లో నూలగింజైనా నిలువదు. వాని ద్వారా పండితులకూ తెలిసినట్లుంది. అదెట్లున్నను, ఱేపు ప్రభువులకు గనుక గ్రంథ మంకిత మీయకపోతే అది ప్రభుధిక్కారం కింద పరిగణింపబడుతుంది. అది జరిగితే పడే శిక్ష నీవూహించుకొనవచ్చు.

పినవీరన:

గడ్డు సమస్యయే ఎదురైంది. (కొంచెం సేపు నిమీలితనేత్రుడై సమాధిలో నుండి…) అన్నయ్యా! చింతింపవలసిన అవసరం లేదు. ఆ తల్లి సరస్వతీకృప వల్ల అంతా సరిగానే జరుగుతుందని అనిపిస్తూ ఉన్నది. పూజామందిరాన్ని అలికి, ముగ్గులు పెట్టించి, మామిడి తోరణాలు,తులసీపుష్ప తోరణాలు కట్టించి సర్వసన్నద్ధం చేయించండి. మన ఇంట్లో రెండే గంటము లున్నవి కదా! మఱొక పది గంటములను, ఒక పెద్దబుట్టెడు సరళమైన తాళపత్రాలను తెప్పించండి. ఆవునేయితో అఖండంగా వెలిగే పది పెద్దపెద్ద దీపపు సెమ్మెలను పూజామందిరంలో పెట్టించండి. రాత్రివఱకు ఈ ఏర్పాటులన్నీ చేయిస్తే మిగిలిన విషయం నేను చూచుకొంటాను.

పెదవీరన:

ఏమో తమ్ముడూ! ఇంతవఱకు పదవ భాగమైనా పూర్తిగాని కావ్యం పూజామందిర మిట్లు సన్నద్ధం చేసి పూజలు చేస్తే హఠాత్తుగా పూర్తవుతుందా? ఇదంతా నాకు అనుమానాస్పదంగానే ఉంది. గత్యంతరం లేదు గనుక నీవు కోరినవన్నీ తు.చ. తప్పకుండా చేయించి పూజామందిరాన్ని సిద్ధం చేయిస్తాను.

పినవీరన:

ఆ… ఇంకొక నియమం. అన్నీ సిద్ధమైన తర్వాత నేను పూజామందిరంలో ప్రవేశించి తలుపులు మూసికొని సమాధిలో కూర్చుంటాను. ఎవ్వరూ తలుపులు తీయరాదు, లోపల ఏమి జరుగుతున్నదని దర్శింపరాదు, పరామర్శింపరాదు.

పెదవీరన:

అట్లే జరుగును గాక!

పదునాల్గవదృశ్యము

(స్థలం: మదాలసగృహం. సమయం: ఉదయం 12గంటలు. మహానవమి నాడు మదాలస సరస్వతి ఎదుట వీణాదివాద్యములను, చిఱుగజ్జెలను, నూత్ననాట్యాహార్యము నుంచి పూజించుచు దర్బారికానడ రాగములో క్రిందిపాట పాడుచుండును.)

పల్లవి:
సరసిజాసనురాణి జ్ఞానసంవాసినీ
దీవింపవే నన్ను దివ్యసన్నుత! వాణి!
అనుపల్లవి:
కళలెల్ల కుసుమింపఁ గడగంటిచూపులో
నెలవైన గీర్వాణి! నిరతంబు నినుఁ గొల్తు (సరసిజాసను)
చరణం 1:
నీపాదమంజీరనినదంబె రవళింప
నాపాదమంజీరనాదంబులోన
నీపల్కుతేనియలె నిండారి ప్రవహింప
నాపల్కుగమిలోన, నాపాటలోన (సరసిజాసను)
చరణం 2:
నీనాట్యమునఁ గ్రాలు నిస్తులంబగు హేల
నానాట్యమున కొసఁగ నవ్యచైతన్యంబు
నీవల్లకీజాత నిరుపమక్వణనంబు
నావల్లకికిఁ గూర్ప నవ్యమాధుర్యంబు (సరసిజాసను)
చరణం 3:
మందారకుందేందుచందనశ్వేతమై
అందమగు నీరూపు నానందముగఁ గొల్తు
సుందరోజ్జ్వల భావబృందంబులే నీకు
మందిరంబుగఁ జేసి మనఁగాను మది నెంతు (సరసిజాసను)
చరణం4:
నాగానమును నీకు నైవేద్యముగఁ జేసి
నాగజ్జియల నీకు నవఘంటికలఁ జేసి
నానాట్యమున నీకు నారాత్రికముఁ జేసి
ఆనందముగ నిన్ను నారాధనము సేతు (సరసిజాసను)

(అనుచు పాడి, భక్తితో సరస్వతికి హారతి నిచ్చును. ఇంతలో మణిప్రభ ప్రవేశించును.)

మదాలస:

ఏమే మణిప్రభా! సమయానికే, సరిగా ప్రసాదం పంచే సమయానికే వచ్చావు. బాగున్నావా? నిన్న రాలేదేం?

మణిప్రభ:

ఇంటినిండా బంధువు లొచ్చారు. వారి సేవకే సరిపోయింది నిన్నంతా. ఈరోజు తీరించుకొని వచ్చా.

మదాలస:

సరే. ఈ దేవీప్రసాదం తీసికో (సరస్వతీప్రసాదమును మణిప్రభ కిచ్చును.)

మణిప్రభ:

(కన్నుల కద్దుకొని ప్రసాదమును గ్రహిస్తూ) అమ్మగారూ! రేపేకదా విజయదశమి. రేపే పినవీరనగారు ప్రభువులవారికి తమ కావ్యాన్ని అంకితం చేసే రోజు.

మదాలస:

నీకెందుకే ఆ కథ! కవిగారు, ప్రభువులూ ఆ విషయం చూచుకుంటారు. ఆ సమయంలో రాజా స్థానంలో పినవీరనగారికి నాట్యనీరాజనం సమర్పింపవలసిందని నాకూ పిలుపు వచ్చింది.

మణిప్రభ:

కాదమ్మగారూ! పినవీరనగారింకా కావ్యమే రాయలేదంట. ఇంతవఱకు రాసింది పిసరంతే నంట. ఈ సంగతి రాయసం సింగన నాకు మొన్న చెప్పాడు. ఆ మాట విన్నప్పటినుండి నాకు బుగులు బుగులు పట్టుకుంది. రేపు గనుక రాజుగారికి అంకిత మీయకపోతే ఆ బాపనయ్య కెట్టి గట్టిశిక్ష పడుతుందో అని నాకొక్కటే బుగులు!

మదాలస:

ఔనే! అదీ నిజమే! ఒప్పందం ప్రకారం రేపటి సభలో గ్రంథాన్ని అంకిత మీయకుంటే అది ప్రభుధిక్కార మౌతుంది. దానికి కఠినశిక్షే పడుతుంది. రోజూ నా నాట్యాన్ని చూస్తూ కాలం గడిపే కవిగారు ఇంటికి వెళ్లిన తర్వాత కావ్యాన్ని వ్రాస్తున్నారని నేననుకొన్నాను. కాని పరిస్థితి ఇంత విషమంగా ఉందని నేనూహించలేదు. దీనికి పరోక్షంగా నేనే కారణ మయ్యానేమో అనే శంక నన్నిపుడు పీడిస్తున్నది. నాచెంత అంతకాలం గడపకుంటే ఇంట్లో కూర్చొని నిష్ఠగా కావ్యం వ్రాసికొనేవారేమో అనిపిస్తున్నది. (సరస్వతి వైపు తిరిగి) అమ్మా! చదువులతల్లీ! పినవీరన గారిని అనుగ్రహింపుము తల్లీ! వారికే ఆపత్తూ రాకుండ కాపాడుము తల్లీ!

(ఇంతలో పినవీరన ప్రవేశించును. మదాలసామణిప్రభలు లేచి నిల్చొని సాభివాదముగా నతని నాహ్వానింతురు.)

మదాలస:

కవిచంద్రులకు నమస్కారము. ఆసీనులు కండు.

పినవీరన:

శుభమస్తు.

మదాలస:

కవిగారూ! రేపే కదా మీకావ్యసమర్పణమహోత్సవము. కావ్యము సిద్ధముగా నున్నదా?

పినవీరన:

కొంత పూర్తి యైనది. కావలసినది తొంబదిపాళ్లున్నది.

మదాలస:

మఱి ఇంత నిశ్చింతగా ఉన్నారేమి? ఇంట్లో నిష్ఠగా కూర్చొని వ్రాయవచ్చును కదా! ఇచ్చట కాలవ్యయం చేయడం ఈ సందర్భంలో ఉచితమేనా?

పినవీరన:

కాదు, ఔను కూడ. నా ఉపాస్యదేవతయైన వాణియే ఱేపటిలోగా కావ్యమునంతా పూర్తి చేయిస్తుందని ఆ తల్లినే ఇప్పుడు ఉపాసిస్తున్నాను. ఐనా మనస్సు తగినంత స్థిరంగా ఉండుట లేదు. అద్భుతమైన నీ నాట్యపాండితితో సరస్వతీస్తుతిప్రధానమైన ఒక్క నాట్యం నీవు చేస్తే దానిని చూచి ఆ దేవీస్వరూపాన్ని మనస్సులో స్థిరంగా నిల్పుకొని ఉపాసిస్తే ఫలితం చేకూరుతుందని ఇచ్చటికి వచ్చినాను. నా అభ్యర్థనను తిరస్కరింపవు గదా!

మదాలస:

ఎంతమాట స్వామీ! ఇంతవఱకు నా చెంత గడపుట చేతనే మీ కావ్యరచన కుంటుపడిందని చింతించుచుంటిని. ఈ నాట్యప్రదర్శనము చేత కార్య మనుకూలించు నన్నచో అంతకంటెను నాకు కావలసిన దేమున్నది? తప్పక మీ యభ్యర్థన నంగీకరింతును. (మణిప్రభతో) మణిప్రభా! ఇదిగో వీణ. దీనిని పలికిస్తూ ఉండు. ఈలోపల నేను ఆహార్యం మార్చుకొని నాట్యమునకు సిద్ధమౌతాను.

(అని పలికి నిష్క్రమించి, నాట్యాహార్యముతో ప్రవేశించును. ఆమె ప్రవేశించు వఱకు మణిప్రభ వీణపై ఆమె నటింపబోవు గీతమును పలికించుచుండును. అట్లు ప్రవేశించి ఆమె ఈ క్రింది పాటకు నటింప నారంభించును. పినవీరన సావధానముగా దానిని చూచుచుండును. ఈపాటను హిందోళరాగములో నాట్యమున కనుకూలమైన గమకములతో పాడవలెను.)

పల్లవి:
చిన్తయామి శ్రీకరీం శ్రీసరస్వతీం
బ్రహ్మలోకవాసినీం భారతీం
అనుపల్లవి:
సూరివారశోకభారదూరిణీం
కీరపుస్తకాక్షహారధారిణీం (చిన్తయామి)
చరణం 1:
మందారధవళమంజులగాత్రీం
ఇందీవరసమసుందరనేత్రీం
వందారుసుజనవాంఛితదాత్రీం
మందాత్మగతతమశ్చయహర్త్రీం (చిన్తయామి)
చరణం 2:
వందేఽహ మంబుజభవదయితే
వందేఽహ మద్భుతగుణకలితే
వందేఽహమఖిలామరవినుతే
వందేఽహమతులదయాసహితే (చిన్తయామి)

పినవీరన:

అద్భుతము మదాలసా! నీ నాట్యమూర్తిలో ఆ మహాసరస్వతిని తనివితీర దర్శించుకొన్నాను. నీ మేలు మఱవరానిది. ఇక అచంచలమైన అవధానముతో ఆ దేవిని ఉపాసించి తెలవాఱులోగా కావ్యమును పూర్తి చేసెదను. నీ సాహాయ్యమున కెంతో ఋణగ్రస్తుడ నైనాను.

మదాలస:

నేను చేసిన దేమియు లేదు స్వామీ! ఐనను మీకిది ప్రయోజనకరమైన అంతకంటెను సార్థకత నా నాట్యమునకు లేదు. సరస్వతి సర్వవిధముల మీకు సహకరించును గాక.

పినవీరన:

మంచిది. ఇక పోయి వత్తును. రేపు రాజాస్థానములో కలిసికొందాం.

పదునైదవ దృశ్యము

(సమయం: మహానవమినాటి రాత్రి; స్థలం: పినవీరభద్రుని పూజాగృహం. మందిరంలో దేదీప్యమానంగా సెమ్మెలు వెలుగుతుంటాయి. తాళపత్రములు, గంటములు, సమస్తపూజాద్రవ్యములు సిద్ధంగా ఉంటాయి. పినవీరన శుచియై, సరస్వతీదేవి నర్చించి, తెరతీయు సమయమునకు క్రింది మంత్రములతో ఘంటానాదయుక్తముగా హారతి నిచ్చుచుండును.)

దే॒వీం వాచ॑మజనయన్త దే॒వాః| తాం వి॒శ్వరూ॑పాః ప॒శవో॑ వదన్తి||
సానో॑ మం॒ద్రేష॒మూర్జం॒ దుహా॑నా| ధే॒నుర్వాగ॒స్మానుప॒ సుష్టు॒ తైతు॑||
చ॒త్వారి॒ వాక్పరి॑మితా ప॒దాని| తాని॑ విదుర్బ్రాహ్మ॒ణా యే మ॑నీ॒షిణః॑||
గుహా॒ త్రీణి॒ నిహి॑తా॒ నేఙ్గ॑యన్తి| తు॒రీయం వా॒చో మ॑ను॒ష్యా᳚వదన్తి||
ఉ॒త త్వః॒పశ్య॒న్న ద॑దర్శ॒ వాచ॑ము॒త త్వః॑ శృ॒ణ్వన్న శృ॑ణోత్యేనామ్||
ఉ॒తో త్వస్మై తన్వం వి స॑స్త్రే జా॒యేవ॒ పత్యు॑ రుశ॒తీ సువాసాః᳚||
అమ్బి॑తమే॒ నదీ᳚తమే॒ దేవి॒తమే॒ సర॑స్వతి|అ॒ప్ర॒శ॒స్తా ఇ॑వ స్మసి॒ ప్రశ॑స్తిమమ్బ నస్కృధి||
పా॒వ॒కా నః॒ సర॑స్వతీ॒ వాజే᳚భి ర్వా॒జినీ᳚వతీ| య॒జ్ఞం వ॑ష్టు ధి॒యావ॑సుః||
ఆ నో᳚ ది॒వో బృ॑హ॒తః పర్వ॑తా॒దా సర॑స్వతీ యజ॒తా గ॑న్తు య॒జ్ఞమ్|
హవం॑ దే॒వీ జు॑జుషా॒ణా ఘృ॒తాచీ᳚ శ॒గ్మాం నో॒వాచ॑ముశ॒తీ శృ॑ణోతు||

(సరస్వతికి సాష్టాంగదండప్రణామము చేసి, అనంతరము పద్మాసనస్థుడై , నిమీలితనేత్రుడై, క్రింది దండకమును, పద్యమును, శ్లోకమును పరవశముతో పఠించును.)

*జయజయ శుకవల్లకీపుస్తకాక్షావళీపాణి గీర్వాణి కల్యాణి మందార కుందేందు నీహార నీకాశ శుభ్రాంగ విభ్రాజితే, పంకజాతాభపాదాన్వితే, స్నిగ్ధ రంభాప్రకాండ ప్రతీకాశ రమ్యోరుయుగ్మా న్వితే, శూన్యవాదాత్మ మధ్యాన్వితే, హోమధూమావళీతుల్య రోమావళీధామజాలాన్వితే, పుష్ప గుచ్ఛోపమోరోజ శోభాన్వితే, బంధుజీవోప మోష్ఠాన్వితే, కుందదన్తాన్వితే, పద్మనేత్రాన్వితే, దర్పణప్రఖ్య గండస్థల ప్రస్ఫురత్కర్ణికారత్నబింబాన్వితే, అంబుభృన్నీల వాలాన్వితే, సర్వ విద్యాత్మికే, సర్వమంత్రాత్మికే, సర్వయంత్రాత్మికే, సర్వభాషాత్మికే, సర్వబృందారకస్తుత్య రూపే, దయాసింధురూపే, శతానందజాయే, సదాశ్లాఘనీయే, సతాం సేవనీయే, భజే శారదాంబే, భజే శారదాంబే, భజే త్వాం భజే.

ప్రణవపీఠమున మంత్రపరంపరలు గొల్వ
            నుండు నేదేవి పేరోలగంబు
భావజ్ఞులకుఁ బరాపశ్యంతి మధ్యమా
            వైఖరు లేదేవి వర్ణసరణి
జపహార కీర పుస్తక విపంచిసమంచి
            తంబు లేదేవి హస్తాంబుజములు
కుందేందు మందార కందళీ బృందంబు
            చంద మేదేవి యానందమూర్తి

కాంచె నేదేవి కాంచనగర్భ చతుర
పూర్వదంత కవాట విస్ఫుట మనోజ్ఞ
చంద్రకాంత శిరోగృహస్థల విహార
మమ్మహాదేవి వాగ్దేవి నభినుతింతు.

యా దేవీ సర్వభూతేషు శిక్షారూపేణ సంస్థితా|
నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై, నమో నమః||

గీర్వాణి! కల్యాణి| నాకావ్యసంపూరణభారము నెల్లను నీహస్తగతము చేయుచున్నాను. నిన్నే నమ్ముకొని యున్నాను. పాల ముంచిన నీట ముంచిన నీకరుణయే బ్రాహ్మీ! నీకరుణయే!

(అని ప్రార్థించిన పిదప పూజామందిరకవాటములు మూయును. ఆకవాటముల వెనుకనుండి ‘ఓం శ్రీం హ్రీం సరస్వత్యై నమః’ అను మంత్రపఠనము క్రమక్రమముగా క్షీణించుచున్న స్వరముతో ఒక నిముసము పాటు వినిపించును. తదుపరి నిశ్శబ్దము. ఆతర్వాత పూజామందిరము మునుపటి కంటె పెక్కురెట్లు ప్రకాశవంతమైనట్లు తలుపు సందులనుండి బయటికివచ్చు వెలుతురుద్వారా తోచును. అంతలో పలుగంటము లొకే సారి తాళపత్రములపై వ్రాయుచున్న సవ్వడి నిరంతరముగా వినిపించుచుండును.)

పెదవీరన:

అంతయు ఆశ్చర్యముగా నున్నది. పూజామందిరము మునుపటికంటె శతధా ప్రకాశవంత మైనట్లున్నది. గంటముల సవ్వడి నిరంతరముగా వినిపించుచున్నది. పెనుకొండపైనుండి ఉరువడిగా దుముకు నిర్ఝరిణీనిరంతరనిర్హ్రాదమువలె ఈ శబ్దము వినిపించుచున్నది. కానిమ్ము. దీని కంతరాయము కలిగింపను. రాత్రియంతయు నిట్లే జరుగునేమో! కొంతసేపు నిదురించి లేచి మఱల పరిశీలింతును.

(అని శయ్యాగతు డగును. గంటముల సవ్వడి నిరాఘాటముగ సాగుచునే యుండును. ఇంతలో నేపథ్యమున ప్రాతఃకాలపు కుక్కుటారవము విన్పడును. పెదవీరన మేలు కొని, పూజామందిరము వైపు నడచును. అట్లు నడచి…)

ఈ గంటపుమ్రోత ఇంకను సాగుచునే యున్నది. ఇది యేమి వింతయో తెలిసికొన మన ముబలాట పడుచున్నది. తలుపు దట్టను, తెఱువను గాని, తలుపుసందు నుండి ఈవింతను రహస్యముగా వీక్షింతును (అని తలుపుసందు నుండి చూచును.)

(లోపలినుండి మధురాతిమధురమైన స్త్రీకంఠస్వరములో — “అహో భావుకః పశ్యతి! తతో విరమే!” అని వినపడి, పూజామందిరప్రకాశము క్షీణించును. గంటపు సవ్వడి పూర్తిగా అణగిపోవును.)

పినవీరన:

(పరవశముతో ఈక్రింది పద్యమును చదువును.)

*ఎంతదయాసముద్రవొ మహేశ్వరి, బ్రహ్మహృదీశ్వరీ! జలే
జాంతరపత్త్రకాంతమృదులారుణపాణులఁ బూని గంటముల్
సాంతముఁ జేసితీవు సరసంబుగ జైమినిభారతంబు, ని
న్నెంతగఁ గొల్చినం గొదువయే కద శారద! భక్తసారదా!

(పెదవీరన తమ్ముడూ! అని తలుపు దట్టును. పినవీరన తలుపు దీయును)

పెదవీరన:

తమ్ముడూ! నాది తప్పైనది. నాది తప్పైనది. నేను తలుపు సందులోనుండి ఉత్కంఠ నాపుకొనలేక చూచినాను. అంతయు మాయమైనది. గంటము చప్పుడు లేదు. కన్నులు మిఱుమిట్లు గొల్పుచున్న ఆ కాంతియు లేదు. అంతయు నశించినది. అంతయు నశించినది. నన్ను క్షమించు తమ్ముడూ! నన్ను క్షమించు.

పినవీరన:

చింతింపకు డన్నగారూ! అదృష్టవశమున ఆ సమయమునకు అనువాద మంతయు ముగిసినది. చిట్టచివర ఫలశ్రుతి వంటి భాగము మాత్రమే కొంత మిగిలినది. ఆ స్వల్పబాగము నిప్పుడే పూర్తి చేతును. కృతిభర్త విషయ మీఫలశ్రుతిలో చేర్చవలసినది నేను గనుక బ్రాహ్మీదేవి ఆ భాగమును మిగిలించినది.

ఆసమయంబున ధర్మజ!
నే సోమకులంబునను జనించి కుటిలులన్
శాసించి ధరణిపాలన
చేసెదఁ దగ సాళ్వనారసింహుఁడ నగుచున్

అని శ్రీకృష్ణుడే కలికాలములో ధర్మసంరక్షణకై సాళువనరసింహరాయప్రభువులుగా నవతరింతు నని పలికినట్లు ఫలశ్రుతి నేను వ్రాయవలసి యున్నది గనుక నిటువంటి కొన్ని పద్యములు దప్ప మిగిలిన కావ్యము నంతయు భారతి పూర్తి చేసినది.

పెదవీరన:

తమ్ముడూ! నీవు మహానుభావుడవు. సరస్వతీవరప్రసాదుడవు.

పినవీరన:

అంతయు ఆ మహాసరస్వతీప్రసాదము. మనము నిమిత్తమాత్రులము.

పదునారవదృశ్యము

(సమయం: విజయదశమి మధ్యాహ్నం. స్థలం: కవులు, పండితులు, వేదవిప్రులు, పురోహితుడు, నర్తకులు, వాద్యసంగీతకారులు, అధికారులు ఉన్న సాళువ నరసింహరాయల సభామంటపం. కాని వీరభద్రసోదరు లింకను సభకు వచ్చియుండరు. వందులు మొదటి దృశ్యములో నిచ్చిన బిరుదులను చదువుచుండగా సాళువనరసింహరాయలు రాజసముగా సింహాసనాసీను డగును.)

రాయలు:

సభకు నమస్కారము. సర్వజనానందప్రదముగా జరుగుచున్న నవరాత్రి ఉత్సవములు ఈ నాటితో ముగియును. ఆ ఉత్సవములలో అతిముఖ్యమైనది నేటి పండితసభ. వ్యక్తిగతంగా నిది అత్యంతపర్వదినం నాకు. పినవీరభద్రులవారు… (అనుచు సభను తేఱిపాఱ జూచి, అచ్చట పినవీరభద్రుడు లేకుండుట గమనించి, మాట మార్చి…) ఏమి ఇంకా సభకు రాలేదా?

మంత్రి:

వారింకా రాలేదు. ప్రభువుల కీరోజు వారు జైమినిభారతము నంకితము చేయవలెను గదా! మఱింకా ఎందుకు రాలేదో?

ఒక
పండితుడు:

నిన్నటివఱకు ఆ గ్రంథం పూర్తి కాలేదని వ్రాయసం సింగన సమాచారం. అదే కారణమేమో!

మంత్రి:

అది మాకూ తెలుసు. కాని మహాప్రతిభులైన పినవీరనగారు చక్రవర్తులకు ఇచ్చిన మాట దాటరని మా నమ్మకం. అట్టి ప్రమాదమే జరిగితే అది అత్యంతదండనార్హమైన ప్రభుధిక్కార మౌతుందని వారికి తెలిసే ఉంటుంది.

మఱొక
పండితుడు:

వారు సభకు వస్తే కాని విషయం తెలియదు గదా! ఐనా నిన్నటివఱకూ వ్రాయని గ్రంథం ఒక్కపూటలో వ్రాసి తేవడానికి మానవమాత్రులకు సాధ్యమా? అందుకే ముఖం చాటేసినారేమో!

(ఇంతలో వీరభద్రసోదరు లిర్వురు సభాప్రవేశము చేతురు. పెదవీరభద్రుని చేతిలో నొక బంగారు తాపిన నగిషీ చెక్కిన మంజూషిక ఉండును.)

పినవీరన:

చక్రవర్తులకు, సభకు నమస్కారము. గొప్ప అపచారము జరిగినది. దారిలో అనూహ్యపరిస్థితులవల్ల మా రాక ఆలస్యమైనది. ప్రభువులు, సభాసదులు మమ్ము క్షమింపవలెనని అర్థించు చున్నాము.

రాయలు:

మీరు మహాకవులు. ‘నిరంకుశాః కవయః’ అన్న సూక్తిని యథార్థము చేసినారు. మీరు క్షమింప నర్థింపవలసిన అవసరము లేదు. మేము క్షమింప నవసరము లేదు.

పినవీరన:

ప్రభువుల ఔదార్యమునకు కృతజ్ఞులము.

మంత్రి:

ఈనాటి కార్యమున కంతయు సిద్ధమే కదా! కావ్యకన్య సర్వశోభాలంకృతయై మీతో వచ్చినది కదా!

పినవీరన:

సందేహము లేదు అమాత్యవర్యా! భవ్యాలంకృతకావ్యకన్యాసహితునిగానే వచ్చినాను.

మంత్రి:

నిన్నటి సాయంతనము వఱకు స్వల్పభాగమైన పూర్తి కాలేదని విన్నాను. ఒక్కరాత్రిలో సర్వము ముగించి తెచ్చినారా?

పినవీరన:

ఔను అమాత్యవర్యా! ఒక్కరాత్రిలో నంతయు ముగించి తెచ్చినాను.

రాయలు:

మీకావ్యములో ఎన్ని ఆశ్వాసము లున్నవి? ఎన్ని పద్యము లున్నవి?

పినవీరన:

ఉద్వాహమునకు ముందే వధూటికావగుంఠనమును తొలగింపమంటారా మహారాజా? ఇంతమాత్రము చెప్పగలను. నిన్నటిరాత్రి పన్నెండువందలకంటెను అధికముగా పద్యములు చేరినవి. అంతకు ముందు దాదాపుగా రెండువందల పద్యము లుండినవి.

రాయలు:

ఇన్ని పద్యములు, గంటకు వంద కెక్కుడు పద్యములు నిద్రాహారములు మాని ఒక్క రాత్రిలో వ్రాయుట సాధ్యమా మహాకవీ?

పినవీరన:

అది సాధ్యము కనుకనే కావ్యము సమాప్తమైనది.

రాయలు:

ఎంత ఆశ్చర్యము! ఎంత సామర్థ్యము! ఇతఃపూర్వ మిట్టి కవితాశక్తి అశ్రుతము. (సభ నుద్దేశించి) సభలోని పండితవర్యుల అభిప్రాయమేమి? మీకిది అసాధారణముగా దోచుచున్నదా?

ఒక
పండితుడు:

ఇది అసాధారణ సామర్థ్యమే. ఏదో మహాదేవతోపాసనశక్తి ఉంటే కాని ఇట్టిది సాధ్యం కాదు. పూర్వము కాళిదాసాదులకు దేవతాప్రసాదం వల్ల ఇట్టి శక్తి కలిగిందని విన్నాము.

మఱొక
పండితుడు:

దేవీప్రసాదసిద్ధులు కోటి కొకరుండవచ్చును గాని పినవీరనగారి కిట్టి ఉపాసనాబల మున్నదా? అది తెలియదు. ఎవరో వ్రాసిన గ్రంథమునకు తాము వ్రాసిన అవతారిక, ఆశ్వాసాంత పద్యముల ముసుగు తొడిగి తమ కావ్యమని అమ్ముకొనే కవిబ్రువులు తఱచుగా నున్నారు.

పినవీరన:

(రోషముతో) ఏమన్నారు? నేనట్టి కవిబ్రువుడ నని మీ అభిప్రాయమా? వాణి నారాణి. ఔను – వాణి నారాణి. నా ఉపాస్యదేవత. నా మనోమందిరమే ఆమె ప్రాసాదం. నా కవితాసామర్థ్యం ఆ దేవి ప్రసాదమే.

పండితులు:

(కోపముతో) ఎంత గర్వం? ఎంత గర్వం? సర్వవిద్యాధిదేవత, సర్వమంత్రాధిదేవత, పరమేష్ఠిపత్ని, పరమపావని ఈయన రాణియా? ఇట్టి ప్రలాపములు ఆ మహాసరస్వతిని ప్రధాన దేవతగా నర్చించు ఈ నవరాత్రి పర్వమునందా? మహారాజుల మహాసభ యందా? ఇది మహాపరాధము. మహాపచారము. నింద్యాతినింద్యము, అవద్యము, శిక్షార్హము.

రాయలు:

పినవీరనా! ఈ ఆక్షేపణకు నీవేమందువు? నీ ఔద్ధత్యమునకు శిక్ష ననుభవించెదవా, (వ్యంగ్యంగా) లేక రక్షింపుమని నీ రాణిని ఆశ్రయింతువా?

పినవీరన:

(ఒక క్షణంసేపు సరస్వతిని మనసులో ధ్యానించుకొని) మహారాజా! సభామందిరాంతమున నొక తెరను గట్టింపుడు. నేను నారాణి నాశ్రయించెదను. ఆమెయే మీకు యథార్థము దెలుపును.

రాయలు:

అట్లే కానిండు.

(సేవకులు సభామందిరాంతమున నొక తెరను గట్టుదురు. ఆ తెర యెదుట నేలపై నిష్ఠతో గూర్చుండి పినవీరన ఈక్రింది పద్యములను చదువును.)

ప్రణవపీఠమున మంత్రపరంపరలు గొల్వ
            నుండు నేదేవి పేరోలగంబు
భావజ్ఞులకుఁ బరాపశ్యంతి మధ్యమా
            వైఖరు లేదేవి వర్ణసరణి
జపహార కీర పుస్తక విపంచిసమంచి
            తంబు లేదేవి హస్తాంబుజములు
కుందేందు మందార కందళీ బృందంబు
            చంద మేదేవి యానందమూర్తి

కాంచె నేదేవి కాంచనగర్భ చతుర
పూర్వదంత కవాట విస్ఫుట మనోజ్ఞ
చంద్రకాంత శిరోగృహస్థల విహార
మమ్మహాదేవి వాగ్దేవి నభినుతింతు.

*వాణి! మత్సాహితీరాజ్ఞి! నేనమలిన
మానసాభోగమున ని న్ననూనభక్తి
గొలుతు నేని,యథార్థంబుఁ బలుకు మమ్మ!
సంశయము దీఱునట్టులీ సభకుఁ ద్వరగ.

(అంతట తెర వెనుక మెఱుపు నిశ్చలమై నిలిచినట్లు మహాప్రకాశము కలుగును. గౌరాంగి యగు నొక స్త్రీయొక్క కుడిచేయి తెర లోనుండి సభకు గన్పడి స్వర్ణకంకణములు ఘల్లుఘల్లుమన ‘బాఢమ్’, ‘బాఢమ్’, ‘తత్సత్యమ్’, ‘తత్సత్యమేవ’ అను మాటలు విన్పడును. అప్పుడు రాజుతో గూడ సదస్యు లందఱు ఆశ్చర్యచకితులై, నిల్చొని శారదాదేవి నిట్లు స్తుతింతురు.)

సువక్షోజకుమ్భాం సుధాపూర్ణకుంభాం, ప్రసాదావలమ్బాం ప్రపుణ్యావలంబామ్|
సదాస్యేన్దుబిమ్బాం సదానోష్ఠబింబాం, భజే శారదామ్బామజస్రం మదంబామ్||
కటాక్షే దయార్ద్రాం కరే జ్ఞానముద్రాం, కలాభిర్వినిద్రాం కలాపైః సుభద్రామ్‌|
పురస్త్రీం వినిద్రాం పురస్తుఙ్గభద్రాం, భజే శారదామ్బామజస్రం మదంబామ్ ||
లలామాఙ్కఫాలాం లసద్గానలోలాం, స్వభక్తైకపాలాం యశఃశ్రీకపోలామ్‌ |
కరే త్వక్షమాలాం కనత్పత్త్రలోలాం, భజే శారదామ్బామజస్రం మదంబామ్||
సుసీమన్తవేణీం దృశా నిర్జితైణీం, రమత్కీరవాణీం నమద్వజ్రపాణీమ్‌|
సుధామన్థరాస్యాం ముదా చిన్త్యవేణీం, భజే శారదామ్బామజస్రం మదంబామ్||
సుశాన్తాం సుదేహాం దృగన్తే కచాన్తాం, లసత్సల్లతాఙ్గీమనన్తామచిన్త్యామ్‌ |
స్మృతాం తాపసైః సర్గపూర్వస్థితాం తాం, భజే శారదామ్బామజస్రం మదంబామ్||
కురఙ్గే తురఙ్గే మృగేన్ద్రే ఖగేన్ద్రే, మరాలే మదేభే మహోక్షేఽధిరూఢామ్‌|
మహత్యాం నవమ్యాం సదా సామరూపాం, భజే శారదామ్బామజస్రం మదంబామ్||
జ్వలత్కాన్తివహ్నిం జగన్మోహనాఙ్గీం, భజే మానసామ్భోజసుభ్రాన్తభృఙ్గీమ్‌|
నిజస్తోత్రసంగీతనృత్యప్రభాఙ్గీమ్‌, భజే శారదామ్బామజస్రం మదంబామ్||
భవామ్భోజనేత్రాజసమ్పూజ్యమానాం, లసన్మన్దహాసప్రభావక్త్రచిహ్నామ్‌ |
చలచ్చఞ్చలాచారుతాటఙ్కకర్ణాం, భజే శారదామ్బామజస్రం మదంబామ్||

(ఈ స్తోత్రమును చదివిన పిమ్మట అందఱు యథాస్థానముల నాసీను లగుదురు. తర్వాత…)

రాయలు:

పినవీరభద్రకవీంద్రా! నీ మహిమ అమోఘము.

*ఎంత మహానుభావుఁడవొ, ఎంతగ నిన్ను విరించికాంత నే
త్రాంతవిలోకనోత్కటదయారససేచనఁ దన్పెనో కవీ!
ఇంతటి కావ్యకల్పనసమేధితశక్తియు, నింతపాండితిం
గాంతుమె యెందు నేనియును, కారణజన్ముఁడ వీవు వీరనా!

నీ పుణ్యమున మాకందఱికిని సువర్ణకటకసుందరమైన సరస్వతీకరదర్శనము, ఆమె గళధ్వని విను మహాభాగ్యము కల్గినది. నీభాగ్య మపారము. నీకు శిరసా వందనము చేయుచున్నాను.

పినవీరన:

సర్వము సరస్వతీప్రసాదము!

పురోహితుడు:

మహాకవీ! కావ్యార్పణమునకు శుభముహూర్త మాసన్నమైనది. సన్నద్ధులు కండు.

(పెదవీరన గ్రంథపేటిక గొనుచు రాఁగా, మదాలస స్రక్పుష్పఫలచందనతాంబూలాదుల నొక బంగరుపళ్లెరమందిడుకొని రాఁగా, మంగళవాద్యములు మ్రోగుచుండగా పినవీరన నరసింహ రాయలమెడలో పుష్పస్రజమును వేసి, శాలువను గప్పి, ముఖమున కుంకుమ నుంచి, మదాలస కొనివచ్చిన పన్నీటిని చిలికి, నూత్నవస్త్రపుష్పఫలాదులతో గ్రంథపేటికను బంగరుపళ్లెరంబులో నుంచి, ‘శ్రీమన్మహారాజాయ రాజపరమేశ్వరాయ కర్ణాటకాంధ్రాధీశ్వరాయ సాళువకులమండ నాయ శ్రీశ్రీశ్రీ నరసింహరాయప్రభువర్యాయ ఆంధ్రీకృత జైమినీయభారతపురాణ మిదం తుభ్య మహం సంప్రదదే నమమ. సర్వశోభనమస్తు’ అని ఆపళ్లెరంబు నారాజుచేతిలో నుంచి అక్షతలు శిరముపై జల్లును. అట్లు చేయుచుండ పురోహితాదివేదవిప్రులు 7వ దృశ్యములో నిచ్చిన ‘అస్మి న్వసు — ప్రతి తిష్ఠతి’ అను మంత్రమును చదువుదురు. అట్లంకిత మొనరించి రాజును గూర్చి పినవీరన ఈక్రింది పద్యములు చదువును.)

శ్రీమందిర నయన సుధా
ధామాన్వయతిలక, ధైర్యధరణీధర, ది
క్సీమాధిక జయధాటీ
సామజహయసుభటరంహ సాళ్వనృసింహా!

*సాళువవంశభూషణ, లసత్కవిపండితవర్గతోషణా!
మేలగుప్రోడవంచుఁ, గలిమిం బలిమిం గలవాఁడవంచు నెం
తో లలి నిన్నుఁ జేరెను మదుజ్జ్వలచిత్తసరోజజాతయౌ
నీ లలితంపుఁగావ్యరమ, యీమె చిరం బొనరించు నీప్రథన్.

రాయలు:

*ఏమన వచ్చును సుకవీ!
మామకభాగ్యము, త్వదీయమంజులకన్యా
కాముకతామహితమయిన
నామనమునఁ బూచె సౌఖ్యనవనందనమే!

మహాకవీ! ఈసువర్ణాసనము నలంకరింపుడు. (పినవీరన అట్లే చేయును.) మదాలసా! సత్కార సామగ్రిని గొని రమ్ము. మంగళవాద్యములు మ్రోగనీ!

(ఉక్తప్రకారము జరుగును. పురోహితాది విప్రవరులు 6వదృశ్యములో నిచ్చిన మంత్రములను సందర్భోచితముగా చదువుచుండగా నరసింహరాయలు పినవీరభద్రుని సన్మానించును. అనంతరము…)

సదస్యులు:

కవిచంద్రులు పినవీరభద్రులకు జై! పినవీరభద్రులకు జై!
నృపచంద్రులు నరసింహరాయలకు జై| నరసింహరాయలకు జై!

పినవీరన:

ప్రభువుల ఆదరణ అమోఘము.

◊శ్రీలావణ్య పయోనిధి త్రివళివీచీమధ్య రోమావళి
వ్యాళానల్ప సుఖైకతల్పుఁడు జగద్వ్యాపారలీలావతా
రాలంకారవిహారి శౌరి సదయుండై నారసింహక్షమా
పాలాగ్రేసర! నిన్నజస్రము నదభ్రశ్రీయుతుం జేయుతన్.

రాయలు:

మదాలసా! ఈ శుభసందర్భములో కవిచంద్రులకు నీ నృత్యనీరాజనమును సమర్పింపుము.

మదాలస:

చిత్తము ప్రభూ.

(ఈ క్రింది పాటను ఆరభిరాగములో పాడుచు నాట్యము చేయును.)

పల్లవి:
మధురము మధురము నీకవనము
రంభాధరమధు మధురము నీకవనము
అనుపల్లవి:
పలుకుల చెలువకు చెలువగు రవణము
పలుకులఁ దేనియ లొలికెడు కవనము (మధురము)
చరణం 1:
మవ్వపు పదముల పువ్వుల నొలికెడు
మధురసవాహిని , మంజుల మతులం (మధురము)
తాం తకిట తకతక ధిమి రి స ని ధ
తకఝణు స రి మ గ రి ధ స రి మ ప
తఝణు స రి మ గ రి త ఝం ఝం తకిట
ధిత్తాం కిట ధ ప మ గ రి తధీం ఝణుతాం
మవ్వపు పదముల పువ్వుల నొలికెడు
మధురసవాహిని, మంజుల మతులం (మధురము)
చరణం 2:
సుందరమై సురసుందరి సంస్మితనిభమై
మందారంబుల మకరందంబున కెనయై
ఆస్వాదింపఁగ నమృతంబునకుం దులయై
మది కింపొసగును మృదు మధురంబై (మధురము)
చరణం 3:
తకిట ధిమిత తకతక ధిమి ధీంతక
తకధిత తోంతక తోంతక తకధిత ధిరణా
సుప్రసన్నభావశోభితంబు
రమ్యశబ్ద రాజి రాజితంబు
తక ధిక తోం తక తోం తక ధిరణా
తకధిక తకధిత తోంతక తోంతక ధిరణా
శ్రావ్య పద్య గద్య సంయుతంబు
చంద్ర కాంతి తుల్యసౌఖ్యదంబు (మధురము)

(అని నాట్యము చేసి పినవీరనకు పాదాభివందనము చేయును. నేపథ్యంలో క్రింది శ్లోకములు వినిపించుచుండఁగా యవనిక పతిత మగును.)

*వీరభద్రకవీంద్రస్య, చారుకీర్తివిలాసినీ|
నృత్యతాత్సతతం విశ్వ, నృత్యరంగస్థలే భృశమ్||

జయంతి తే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః ।
నాస్తి తేషాం యశఃకాయే జరామరణజం భయమ్‌||


అనుబంధము – ‘వాణి నారాణి’ ఐతిహ్యము

  1. ఈనాటికకు మూలమైన ‘వాణి నారాణి’ అను వచనమునకు సంబంధించిన ఐతిహ్యము డా.జి.వి. సుబ్రహ్మణ్యంగారి ‘పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి’ యను పరిశోధనగ్రంథములో నిట్లున్నది:

    ‘సాళువ నరసింహరాయలు జైమినిభారతమునురచించుట కొకగడువును నిర్ణయించెను. భోగ లాలసుఁడైన పినవీరభద్రకవి, అన్నగా రెన్నిసారులు ప్రబోధించినను వినక, గడువు రేపటికి ముగియు నను నంతవఱకు కావ్యరచనమును జేపట్టక విలాసముగా దిరుగుచుండెను. తెల్లవారినచో రాజాస్థాన మున కావ్య మంకిత మీయవలెను. ఆనాఁటి రాత్రి పినవీరన తన గదిని గోమయముచే నలికించి, రంగ వల్లులు తీర్పించి, యావునేయితో దీపము పెట్టి, తలుపులు బంధించి, తాటియాకులను ముందుంచు కొని సరస్వతీధ్యానమగ్నుఁడై కూర్చుండెను. వాణి ప్రసన్నయై, శతఘంటములతో కావ్యరచనమును నిర్వహించుచుండెను. సహస్రసూర్యులకాంతి మిరిమిట్లు గొల్పుచు గదియంతయు నిండిపోయెను. పినవీరన యన్న తలుపుసందులనుండి వెలికివచ్చు నాకాంతిని చూచెను. బ్రాహ్మణసంతర్పణమున నొక్కసారిగాఁ బూరీలు నమలునప్పు డయ్యెడి చప్పుడులవలె తాళపత్రములపై గంటముల చప్పుడు వినవచ్చుచుండెను. పెదవీరన యాయద్భుతమును గాంచ నెంచి తలుపుసందులగుండ గదిలోనికిఁ జూచెను. సరస్వతి ‘బావగారు వచ్చి’రని పినవీరనకుఁ జెప్పుచు నంతట నదృశ్యమయ్యెను. వాణి వ్రాయగా మిగిలిన స్వల్పభాగము పినవీరన పూరించి, మఱునాఁ డాకావ్యమును రాజసభకుఁ గొని పోయెను.

    క్రిందటి రాత్రి వఱకును గావ్యమునకు పినవీరభద్రుఁడు శ్రీకారము చుట్టలేదని రాజునకును, సభికులకును దెలియును. ఒకరాత్రిలో నాశువుగ నైనను అంతటి మహాకావ్యమును వ్రాయుట దుర్లభమని సభికు లభియోగము దెచ్చిరఁట. అప్పుడు పినవీరభద్రకవి ‘వాణి నారాణి’ యనియు, తన కది యసాధ్యము కాదనియు వారికి బదులు చెప్పెనఁట! జగదారాధ్య యైన వాగ్దేవి నహంకరించి, ‘రాణి’ యని పినవీరభద్రుఁడు నిందించె నని పండితు లధిక్షేపించిరి. అందులకు పినవీరన ‘సభలో తెర వేయించినచో వాణియే మీకు సాక్ష్య మిచ్చు’ నని పలికెను. రాజు తెర గట్టించెను. సరస్వతి తన స్వర్ణకంకణహస్తమును తెరపైఁ జూపి ‘ఔను, ఔను’ అని చెప్పి సభికుల నాశ్చర్యమున ముంచెనఁట!’

    (ఈ కథ నేను స్కూలులో చదువుకొనునప్పుడు 7వతరగతి తెలుగు ఉపవాచకములోగూడ నుండెను.)

  2. సూచన: 41వ పేజీలోని ‘ఇందీవరసమసుందరనేత్రీం’ అన్న వాక్యంలో ‘నేత్రీ’శబ్దం ‘నేత్రా’ అని ఉండాలని పాణినీయవ్యాకరణ మున్నను, ముగ్ధబోధవ్యాకరణం ‘నేత్ర’శబ్దమును అంగాదులలో చేర్చుటచేత, ‘నేత్రీ’ అను వికల్పరూపం కూడ సాధువే యని బ్రహ్మశ్రీ వజ్ఝల చినసీతారామస్వామిశస్త్రులవారు వారి ‘బాలవ్యాకరణోద్ద్యోతము’లో తెల్పినారు. ‘సరోజదళనేత్రి హిమగిరిపుత్రి’ అని శ్యామశాస్త్రి కీర్తన కూడ ఉన్నది.
  3. * ఈ గుర్తు గల పద్యములు ఈ నాటకకర్త వ్రాసినవి. ఈగుర్తు లేని పద్యములు పినవీరభద్రుని శృంగారశాకున్తలమునుండియో, జైమినిభారతమునుండియో గ్రహింపబడినవి. ‘కుల్లా యుంచితి’ అను పద్యము శ్రీనాథుని చాటువు. గీతము లన్నియు ఈనాటకకర్త వ్రాసినవే. ‘సువక్షోజకుమ్భాం’ అను శారదాస్తోత్రము శ్రీజగద్గురు ఆదిశంకరాచార్యకృతము. ‘జయంతి తే…’ అను శ్లోకము భర్తృ హరి సుభాషితములలోనిది. ‘యః పఞ్చశాఖాభిర్జిత్వా’ అను శ్లోకము దేవులపల్లి తామ్రశాసనము లోనిది. ఈశాసనవిషయమును తమ పరిశోధనవ్యాసం ద్వారా తెలియజేసిన శ్రీఏల్చూరి మురళీధరరావుగారికి నాకృతజ్ఞతలు.
  4. ◊ఇవి ప్రస్తుతసందర్భానుసారంగా కొంచెం మార్చబడ్డ పినవీరన జైమినిభారతంలోని పద్యములు.