మలయాళ ఛందస్సు – ఒక విహంగ వీక్షణము

పరిచయము

సుమారు మూడు కోట్లకన్న ఎక్కువ మంది భారతదేశములో మలయాళ భాషను మాట్లాడుతారు. భారతీయ భాషలలో దీని స్థానము తొమ్మిదవది. గడచిన సంవత్సరము దీనికి ప్రాచీన భాష హోదాను కూడ కేంద్ర ప్రభుత్వము ఇచ్చినది. కేరళ రాష్ట్రములో 90% కన్న ఎక్కువ మందికి ఇది మాతృభాష. ద్రావిడ భాషలలో ఇది అర్వాచీనమైనది. ఈ భాషాచరిత్రకు ఆధారములు సుమారు తొమ్మిదవ శతాబ్దమునుండి ఉన్నవి. మొట్టమొదట ఇది తమిళ భాష నుండి పుట్టినా, ఒక రెండు శతాబ్దములలో తనదైన ప్రత్యేకతను కలిగించుకొన్నది. మలయాళ భాష జనించక ముందు ఈ ప్రాంతము నుండి తమిళములో శిలప్పదికార రచయిత ఇళంగో అడిగళ్, సంస్కృతములో ఎన్నో గ్రంథములను, స్తోత్రములను రచించిన అద్వైతమత ప్రవక్త ఆది శంకరులు సుప్రసిద్ధులు.

తెలుగువారికి సంస్కృత ఛందస్సుతో ఎక్కువ పరిచయము, పటిమ గలదు. సోదరభాషయైన కన్నడములోని ఛందస్సు కూడ పరిచితమే. ఈ రెండు భాషలలో అక్కరల, రగడల వంటి బంధములు గలవు. అది మాత్రమే కాక కందములో, ఖ్యాత వృత్తములయిన మాలావిక్రీడితములలో వ్రాయబడిన కావ్యములు ఈ రెండు భాషలలో ఉన్నాయి. తమిళ ఛందస్సు ప్రత్యేకముగా మఱొక భిన్న రీతిలో పుట్టి పెరిగినది. చాల తక్కువ మంది తమిళ ఛందస్సులోని మెళకువలను ఎఱుగుదురు. మలయాళ ఛందస్సును గుఱించి నేనెఱిగినంతవఱకు ఒక్క ప్రస్తావన మాత్రమే గలదు. అది సర్వోత్తమరావు వ్రాసిన దాక్షిణాత్య దేశి ఛందోరీతులు పుస్తకములో 15 పుటలు. ఈ విషయములు కూడ ఒక సంక్షిప్త రూపములో నున్నవి. అంతేకాక అందులోగల ఛందోబంధములకు ఉదాహరణములు తక్కువ, తెలుగులో అసలు లేవు. కావున మలయాళ ఛందస్సులోని విశేషములను వివరిస్తూ వాటికి తెలుగులో ఉదాహరణములను ఇచ్చి, చివరకు వాటినుండి నేను క్రొత్తగా నేర్చుకొన్న విషయములను కూడ ఈ వ్యాసములో చర్చిస్తాను. ఈ కారణములవల్ల ఈ వ్యాసము తెలుగు పాఠక జనానికి అతి నూతనమైనది అని చెప్పడములో సందేహము లేదు.

మలయాళ సాహిత్యము

మలయాళ ఛందస్సును గుఱించి చర్చించడానికి ముందు మలయాళ సాహిత్యమును గూర్చి సంక్షిప్తముగా తెలిసికొనుట అవసరము. ఏ భాష చరిత్రైనా మొట్టమొదట పాటలు, గేయములు మొదలైన వాటితో ప్రారంభమవుతుంది. మలయాళ భాష దీనికి మినహాయింపు కాదు. కాళీపూజ చేయునప్పుడు పాణత్తోట్రం అనే పాటలను 6-9 శతాబ్ద కాలములలో పాడేవారని అంటారు. అట్టి ఒక పాట లేక పద్యము –

ఆదియే అఖిల నాథే అరిపొరుళాయ దేవీ
వేదియే విమలే విద్యే విణ్ణవర్ తోట్రుం పెణ్ణే
చోదితా ణుడిచ్చ పోలే సుందరత్తోడు కూడి
నీదియిల్ కథయు నీడేళి ఞరుళ్గ వాణీ

(ఇది సరస్వతిని స్తుతించుచు కావ్యారంభములో వ్రాసినది. అన్నిటికి ఆదియైన అఖిలనాయకీ, వస్తువు కునికియైన దేవీ, వేద రూపిణీ, విమలా, విద్యాస్వరూపిణీ, దేవతలు పొగడుదానా, సౌందర్యవంతమైన పదములతో నీతితో చెప్పునట్లు నన్ను ఆశీర్వదించు తల్లీ)

తమిళ సంస్కృతముల ప్రభావము ప్రారంభదశలో మలయాళము పైన ఎక్కువగా నుండినవి. అందువలన మణిప్రవాళము అను కొత్తదైన భాష గోచరించినది. మణిప్రవాళము పైన వ్రాయబడిన లక్షణగ్రంథము లీలాతిలకములో మొదటి సూత్రము ‘భాషా సంస్కృతయోగో మణిప్రవాళం.’ దేశభాష, సంస్కృతపు కూడికయే మణిప్రవాళము అని అర్థము. ఇక్కడ మణి అంటే మలయాళము, ప్రవాళము అంటే సంస్కృతము. మణిప్రవాళ భాషలో లీలాతిలకము నుండి వసంతతిలక వృత్తములో ఒక పద్యము –

వసంతతిలకము –
పొన్నోలయుం వళయుమారమువెన్ఱివెల్లా
మల్లాగయిల్ల కళభాషిణి భూషణాని
ఎల్లోర్కుమే రసకరం సతతం నిబద్ధం
సౌజన్య మెన్ఱిదు విభూషణమంగనానాం — (లీలాతిలకము 16)

(బంగారు కమ్మలు, గాజులు, హారములు ఇవన్నీ నగలే, అందులో సందేహము లేదు కలభాషిణీ, కాని అన్నిటికంటె మిన్నయైన విశేష ఆభరణము అందఱికి రసవంతమగునట్లు ఎప్పుడు సౌహార్ద భావంతో నుండడమే కదా!)

ఆరంభ కాలములో మణిప్రవాళ భాషలో ఉణ్ణియచ్చిచరితం, ఉణ్ణియడి చరితం, ఉణ్ణి చిరుదేవి చరితం, రామాయణము, భారతము వంటి చంపూకావ్యములు వ్రాయబడ్డాయి. మలయాళములో నేటికి కూడ చీరామకవి వ్రాసిన రామచరితం కావ్యమునే మొట్టమొదటి ఉత్తమ సాహిత్య గ్రంథముగా పరిగణిస్తారు. దీని కాలముపైన కూడ తర్జనభర్జనలు ఇంకా జరుగుతున్నాయి. కొందఱు ఇది 12వ శతాబ్దము నాటిదంటే మఱి కొందఱు ఇది 14వ శతాబ్దము నాటిదంటారు. 1814 పద్యములతో (పాట్టుగళ్ లేక పాటలు), 164 పరిచ్ఛేదములతో నుండే ఈ కావ్యములో ఎక్కువ పాలు తమిళమే, ఛందస్సు కూడ ద్రావిడ ఛందస్సే. రామచరితము నుండి ఒక ఉదాహరణము –

ద్రుతకాకళి –

వణ్ణమేలుం మరామరం కొండాన్
తణ్ణయాక్కి యకంపనన్ మెయ్యెల్లాం
ఎణ్ణిలాయిరం కూఱిడు మాఱుపోయ్
మణ్ణిల్ వీళవన్ మారుతి తళ్ళినాన్ — (రామచరితం, 21.2)

(ఇది యుద్ధ కాండ లోనిది. అకంపనుడనే రాక్షసుని హనుమంతుడు ఒక చెట్టుతో నేల కూల్చాడు.)

ముందే చెప్పినట్లు రామచరితము లోని భాష తమిళము, సంస్కృతము, మలయాళము కాదు. దక్షిణ కేరళలో నిరణం అను గ్రామములో 1350-1450 కాలములో మాధవ పణిక్కర్ (భగవద్గీత), శంకర పణిక్కర్ (భారతమాల), రామ పణిక్కర్ (రామాయణ, భారత, భాగవత, శివరాత్రీమాహాత్మ్యము) అనే ముగ్గురు కవులు జీవించారు. వీరు వ్రాసిన కావ్యములే పూర్తిగా మలయాళములో వ్రాయబడిన మొట్ట మొదటి కావ్యములు. వీరు బ్రాహ్మణ కులమునకు చెందకపోయినా, సంస్కృతములో వీరి భాషాపటిమ నంబూదిరి బ్రాహ్మణులకు ఏ మాత్రము తీసిపోదు. క్రింద ఒక రెండు పంక్తులు –

మేదినియిలెవనిన్ను వేదమూర్తియాయెణ్ణుం
బోధరూపనాం నినక్కు పూజ చెయ్దిడున్నదుం

(మేదినిలో నిన్ను వేదమూర్తిగా తలచి బోధరూపుడైన నీకు పూజ చేయుటయు…)

తఱువాత చెఱుస్సేరి (1446-1475) కృష్ణగాథను రచించెను. ఇది మలయాళములో ఒక మహోన్నత గ్రంథముగా పరిగణించబడినది. మలయాళ సాహిత్యములో పితృస్థానమును ఆక్రమించుకొన్న కవి తుంజత్తు ఎళుతచ్చన్ (1475-1575). ఇతడు ఆధ్యాత్మ రామాయణమును కిళిప్పాట్టుగా రచించెను, అనగా రామాయణ గాథను ఒక చిలుక నోటిలో చెప్పించెను. ఆధ్యాత్మరామాయణమునుండి ఒక పద్యము –

కేక –

కారణనాయ గణనాయకన్ బ్రహ్మాత్మకన్
కారుణ్యమూర్తి శివశక్తిసంభవన్ దేవన్
వారణముఖన్ మమ ప్రారబ్ధ విఘ్నఙ్గళె
వారణం చెయ్దీడువానావోళం వందియ్కున్నేన్ — (బాల, పంక్తులు 15-18)

(మూలకారణుడైన గణనాయకుని, బ్రహ్మస్వరూపుని, దయామూర్తిని, శివపార్వతులకు పుట్టిన దేవుని, గజముఖుని, నా ప్రారబ్ధముచే కలిగిన అడ్డంకులను పూర్తిగా తొలగించుమని ప్రార్థించుచున్నాను.)

17వ శతాబ్దములో ఆట్టకథలు (రామనాట్టం, కృష్ణనాట్టం) అవతరించాయి. ఇవి రామాయణ, భాగవత గాథలను నృత్యరూపములో చూపించునప్పుడు వ్రాసిన పాటలు. తఱువాత కుంజన్ నంబియార్ (1705-1770) ఓట్టన్ తుళ్ళల్ అని చిందులను ప్రవేశ పెట్టినాడు. ఇది ప్రదర్శనలకు కథకళిలా అనువైనది. మృదంగము, ఇడక్క వాద్యములు కూడ పాటలకు పక్కవాద్యములుగా నుండును. ఇది ఒక పురుషుని ఏకపాత్రాభినయము అని చెప్పవచ్చును. ఈ తుళ్ళల్ పదమునకు ఒక హాస్యరసపూరిత ఉదాహరణము –

అన్ననడ –

చెఱియ పప్పడం, వలియ పప్పడం
కుఱియ చోరుమ క్కఱియు మద్భుతం

(చిన్న అప్పడాలు, పెద్ద అప్పడాలు, అన్నము, మాంసపు కూర ఇవ్వన్నీ బాగు బాగు.)

19వ, 20వ శతాబ్దములో కుమారన్ ఆశాన్ వంటి కవులు మలయాళ సాహిత్యములో ఆంగ్ల భాషా ప్రభావము ననుసరించి నూతన మార్గములలో తీసికొని వెళ్లినారు. ఆశాన్ పద్యము నొకదానిని మత్తకోకిల వ్యాసములో తెలిపియున్నాను.

మలయాళ ఛందస్సు

కన్నడ, తెలుగు ఛందస్సులలో కాలపరిభ్రమణములో ఎక్కువ మార్పులు లేవు. కన్నడములో అంశ లేక ఉపగణములతో నిర్మించబడిన జాతులు కాలక్రమేణ మాత్రాగణ నిర్మితమైనవి. తెలుగు ఛందస్సులో గడచిన పది శతాబ్దులలో మార్పులు చాల తక్కువ. కాని మలయాళ ఛందస్సులో మనము ఛందశ్శాస్త్రము ఏ విధముగా ఒక ఘట్టమునుండి మఱొక ఘట్టమునకు చేరుతుందో అనే విషయాన్ని బాగుగా గమనించవచ్చును. మలయాళ ఛందస్సులో సంస్కృత వృత్తములు ఉన్నాయి, కాని అందులో కొన్ని సౌలభ్యము కోసము మాత్రావృత్తము లయ్యాయి. మలయాళ దేశి ఛందస్సు ప్రారంభ దశలో తమిళ ఛందస్సునుండి ఎన్నియో వృత్తములను గ్రహించుకొన్నది. కాలక్రమేణ అవి కూడ మార్పుకు లోనయ్యాయి. ఈ మార్పులకు ముఖ్య కారణము మలయాళములో పద్యములు పాటలు. అవి గానయోగ్యములు, తాళబద్ధములు. తమిళములో కూడ తేవారము, తిరుప్పుగళ్ లోని వృత్తములను నేడు కూడ విరివిగా పాడుతారు. కన్నడములో షట్పదలలో, సాంగత్యములలో కావ్యాలనే వ్రాసినారు. అవి గాన యోగ్యములు. కాని తెలుగులో నన్నయ నుండి విశ్వనాథ సత్యనారాయణ వఱకు పద్యములు చదువుటకు మాత్రమే వ్రాసినారు. దీనికి మినహాయింపులు బహుశా ద్విపద కావ్యములు, పోతన భాగవతము అని చెప్పవచ్చును. పాటలు, పద్యాలు తెలుగులో సమాంతరముగా నడిచాయి. అవి యక్షగానములలో మాత్రమే సంధించాయి. కాని యక్షగానములను తెలుగువాళ్లు నిర్లక్ష్యము చేసిన తీరును తలచుకొంటే కన్నీళ్లు రాక తప్పదు!

పాట – పద్యము

మలయాళములో పాటకు పద్యములకన్న ఎక్కువ ప్రాముఖ్యము. పాటకు, పద్యానికి మధ్య ఉండే వ్యత్యాసములేమి? రెంటికీ ఛందస్సు అవసరము. సామాన్యముగా పాటలను తాళబద్ధముగా పాడుకొనవచ్చును, అన్ని పద్యాలను పాడుకొనడానికి వీలయినా, అందులో కొన్నింటిని మాత్రమే తాళయుక్తముగా పాడుకొనవచ్చును. గణబద్ధముగా నుండి, యతిప్రాసలు సరిపోయిన పక్షములో పదములను ఏ విధముగానైనా సందర్భమునకు సరిపోయే విధముగా పద్యములలో ఎన్నుకోవచ్చును. కాని పాటలకు అలా కాదు. పదమునకు పదమునకు మధ్య విరామము పాటలోని తాళగణమునకు సరిపోయే విధముగా నుండాలి, లేక పోతే పాట వినడానికి సొంపుగా నుండదు. పద్యములో కనబడే పదములను ఒకే విధముగా మాత్రమే ఉచ్చరించ వీలగును. ఉదాహరణకు ఒక గురువు, ఒక లఘువు ఉండే నీవు అనే పదమును ఆ విధముగా మాత్రమే పలుకుటకు వీలవుతుంది. కాని అదే నీవు పదమును నీవూ లేక నీఽవూఽ అని తాళమునకు సరిపోయేటట్లు పొడిగించి పాటలో పలుక వచ్చును. అంటే లఘువు లఘువుగా మాత్రమే కాక గురువుగా (రెండు లఘువుల కాలము), ప్లుతముగా (మూడు లఘువుల కాలము), కాకపదాక్షరముగా (నాలుగు లఘువుల కాలము) పలుకవచ్చును. అదే విధముగా గురువును లఘువుగా కూడ పలుకవచ్చును, ఉదా. కలలో -> కలలొ. తమిళములో ఐ అక్షరమును అ-కారాంత లఘువుగా వాడుట పరిపాటి, ఉదా. కలైయే ఎన్ వాళ్కయిన్ దిశై మాట్రినాయ్ -> కలయే ఎన్ వాళ్కయిన్ దిశయ్ మాట్రినాయ్. తెలుగు, కన్నడ పద్యములలో పాదాంత విరామమును పాటించుట ఐచ్ఛికము. ద్విపదలకు, రగడలకు ఇది నియతమైనా, సీస, గీతాదులకు కూడ దీనిని పాటిస్తారు. కాని వృత్తములలో పాదాంత విరామమును పాటించకుండ ఉండడము మాత్రమే కాదు, అదొక పద్య శిల్పము అని కూడ కొందఱు భావిస్తారు. కాని పాటలలో ఇట్టి విరామమును తప్పనిసరిగా పాటిస్తారు. అప్పుడే పాట శ్రోతలకు అర్థవంతముగా ఉంటుంది. ఇలా పాట నియమములు వేఱు, పద్య నియమములు వేఱు. అందుకే యక్షగానములలో తప్ప తెలుగులో పాటలు, పద్యములు భిన్న మార్గాలలో ప్రయాణము చేశాయి. కాని మలయాళములో (తమిళములో కూడ) గానయోగ్య ఛందోబంధములకు పాదాంతయతి, పాదము మధ్యలో విరామము, తాళగణములకు సరిపోయేటట్లు పదముల ఎన్నిక, కొన్ని సమయములలో హ్రస్వములను దీర్ఘముగా నుచ్చరించుట సర్వసామాన్యము. అంతే కాక వారు చతుష్పదులకన్నా ద్విపదలను ఎక్కువగా ఎన్నుకొన్నారు.