ఒక శతాబ్దకాలంలో భూపరిణామక్రమం: భూచక్రం

మధురాంతకం నరేంద్రగారి రచనల నుండి ఎప్పుడూ స్రవించే సందర్భోచితమైన వ్యంగ్యం, ప్రతీకలతో కూడిన వివరణలు, అప్పుడప్పుడూ మృదువైన హాస్యాన్ని ఆశిస్తూ భూచక్రం నవల చదవడం మొదలు పెడితే ఎవరూ నిరాశ చెందరు. పైగా ఈ సారి నరేంద్రగారు తీసుకొన్న అంశం ‘భూమి.’ భూమికి ముడివేసి ఈ నవల కొన్ని కాలాలనూ, కొన్ని సామాజిక మార్పులనూ, భూమి మీద ఆధార పడినవారి ప్రవృత్తులలో వివిధ దశలలో వచ్చే మార్పులను అత్యంత సాంద్రంగా గ్రంథస్తం చేసింది. భూమిపై యాజమాన్యం దాని మీద శ్రమించి అనుబంధం పెంచుకొన్న వారి కంటే, ఇతరులకు ఎలా హక్కుభుక్తం అవుతూ వచ్చిందో సోదాహరణంగా వివరించిందీ నవల.


భూచక్రం (2014). వెల రూ.120
రచన: మధురాంతకం నరేంద్ర
అలకనంద పబ్లిషర్స్, విజయవాడ

భూమి మీద ఆయాచితంగా వచ్చే ఆదాయం, భూదాహం మనిషిని దయారహితంగానూ, బంధరహితంగానూ ఎలా తయారు చేస్తుందో నరేంద్ర అత్యంతగా శ్రద్ధగా, తనదైన శైలిలో రాశారు. ఒకప్పుడు ఉపయోగ విలువను మాత్రమే కలిగి ఉన్న సహజ వస్తువు భూమి, ఇప్పుడు పక్కా వినియోగ వస్తువుగా మారి ఆక్రమణలకూ, అధికార దాహానికీ గురౌతున్న క్రమాన్ని ఒక దశ నుండి, సూక్ష్మమైన వివరం కూడా పొల్లు పోకుండా నవలగా మలిచారు.

ఈ కధ తిరుపతిని కేంద్రంగా తీసుకొని రాసినా వస్తువు స్థలాతీతమైనది. పాత్రలు కాలాతీతమైనవి. ఈ కధలో అంతఃసూత్రంగా రచయిత ప్రతిపాదించిన చలనాలు, కధా వస్తువూ సార్వజనీనమైనవి. ఈ నవలలో రచయిత కధ చెప్పరు. కధలోని సహాయక పాత్రల (ముఖ్య పాత్రలు కానివి) సంభాషణల ద్వారా కధను ఊహించుకోవటానికి పాఠకులకు ఒకటి కంటే ఎక్కువ అవకాశాలు ఇస్తారు. యదార్థ ఊహాగానానికి దగ్గరగా ఒక అవకాశం మాత్రం ఉంచి కొద్దిగా సహాయం చేస్తారు. అలాంటి అవకాశాన్ని తీసుకొని నేను ఊహించిన ఈ కధ క్లుప్తంగా చెప్పాలంటే… ఆ కథ ఇదీ:

వంద సంవత్సరాల క్రితం తిరుపతి చుట్టు పక్కల మఠాల స్వాధీనంలో ఉన్న కొంత భూమికి పరదేశి కౌలుదారుగా ఉంటాడు. వ్యవసాయపనులలో తనకు చేదోడు వాదోడుగా ఉంటుందని విధవరాలైన యిలవరిశిని పరదేశి చేరదీస్తాడు. అప్పటి మఠాధిపతి మహంతు సుభోధ యోగదాసు కళ్ళల్లో యిలవరిశి పడిందని గ్రహించి ఆమెను ఎరగా వేసి తన కౌలుదారీతనాన్ని నిలుపుకొంటాడు పరదేశి. అయితే పరదేశి పెట్టే హింసను భరించలేక పారిపోయిన యిలవరిశి కొద్ది కాలం తరువాత వడివేలురెడ్డిని తీసుకొని తిరిగి వస్తుంది. పరదేశిని తరిమేసి సుభోధ యోగదాసు వడివేలు రెడ్డికి అదే భూమిని కౌలుకి ఇస్తాడు. అలా ఇప్పించటంలో యిలవరిశి పాత్ర కూడా ఉంటుందని మనకు అర్ధం అవుతుంది. అధికార మార్పిడులు జరిగి మఠాధిపతిగా మహంతు ప్రతిభోధ హరిదాసు వస్తాడు. అవే రాజకీయాలు పునరావృతం అయ్యి వడివేలు రెడ్డి యిలవరిశికి నామమాత్రం భర్తగా మిగిలి పోతాడు. అయితే వడివేలురెడ్డి లౌక్యుడు. మఠాధిపతుల మధ్య వచ్చే కోర్టు తగాదాల వలన మఠాల ఆస్తులు అమ్మరావాల్సిన పరిస్థితిని ఆసరాగా తీసుకొని సొంత భూమి కొంత సంపాదించుకోగలుగుతాడు. యిలవరిశికి పుట్టిన పిల్లల్లో చిన్నవాడు రాజమన్నార్ రెడ్డి తన పోలికలతో ఉన్నాడని నమ్మి మఠాధిపతి ప్రతిభోధ హరిదాసు వారికిచ్చిన కౌలు భూమి అంతా రాజమన్నార్ రెడ్డికి రాసి ఇచ్చేస్తాడు. అప్పటి వరకు ఆ భూమిలో చెమట కారుస్తున్న మిగిలిన ఇద్దరు అన్నలను తొక్కివేసి రాజమన్నార్ రెడ్డి ఆ భూమికి ఆసామి అవుతాడు. కాళహస్తి నుండి వచ్చిన మణిని చేరదీసి తిరుపతి నడిబొడ్డున ఇల్లు కట్టి అందులో ఆమెతో రెండో కాపురం పెడతాడు రాజమన్నార్ రెడ్డి. మణికి ఇల్లు రాయకుండానే రెడ్డికి అకాల మరణం సంభవించటంతో మణి తమ్ముడు దొంగ పత్రాలు సృష్టించి ఆ ఇంటిని ఆక్రమిస్తాడు. ఆ ఇంటిమీద రాజమన్నార్ రెడ్డి చిన్నల్లుడు జగన్నాధ రెడ్డి కోర్టుకు వెళతాడు. భార్య నుండి వచ్చిన భూమిని ఇళ్ళ స్థలాలుగా మార్చి అమ్మగా వచ్చిన డబ్బుని జగన్నాధ రెడ్డి గుర్రపు పందేలకు తగలేసి హటాత్తుగా చనిపోతాడు. అతని చిన్న అల్లుడు అమిత్ రెడ్డి రంగంలోకి దిగే సరికి మణి తమ్ముడి స్వాధీనంలో ఉన్న ఇల్లు మాత్రం మిగిలి ఉంటుంది. శేషారెడ్డి అనే బ్రోకర్ ద్వారా ఆ ఇంటిని అమ్మే ప్రయత్నాలు అమిత్ రెడ్డి మొదలు పెట్టటంతో కధ ప్రారంభమవుతుంది.

ఈ నవలలో ప్రధానం అని చెప్పుకోదగ్గది శేషారెడ్డి పాత్రే. మూడు తరాలకు లింక్ అయి ఉన్న శేషారెడ్డి చేత భూమికి సంబంధించిన చాలా విషయాలు చెప్పిస్తాడు రచయిత. శేషారెడ్డికి బ్రోకర్ వృత్తి ద్వారా ఆదాయం సంపాదించటం కంటే లోక పరిశీలన అంటే ఇష్టం. “వుప్పూ పులుసు తినే మనిషి కదా! ఈ వూర్లో అయినా యే వూర్లో అయినా ఆస్తుల కతంటే మాత్రం రంకు బొంకుల పురాణమే,” అంటాడు ఒకచోట. మనుషుల ప్రవర్తనలోని వైరుధ్యాలను రాగద్వేషాలకు అతీతంగా స్పందిస్తూ ఉంటాడు. పెద్ద బ్రోకర్ బలరామిరెడ్డి బదులు శేషారెడ్డిని ప్రజలు కొట్టినపుడు అతని మీద పాఠకులకు సానుభూతి కలుగుతుంది. అసలు నేరస్థుడు బలరామిరెడ్డిని తెర నుండి తొలిగించి పాఠకుల సానుభూతి ఇళ్ళ స్థలాలు కోల్పోయిన పేదప్రజలమీద ఉండాలో, పేద బ్రోకర్ శేషారెడ్డి మీద ఉండాలో తేల్చుకోలేని సందిగ్ధతలోకి పాఠకులను నెట్టి తమాషా చూస్తారు రచయిత. అయితే సానుభూతి పొందే అవకాశం ఇంకే ఇతర పాత్రకు ఉండదు. జగన్నాధ రెడ్డి భార్య పావనమ్మ మీద సాధారణ పాఠకులలో నిశ్శబ్దంగా అల్లుకొని వస్తున్న సహానుభూతిని కూడా చివరలో నిర్దాక్షిణ్యంగా కత్తిరించి వేస్తారు. ఆయన ఖండింపుకు తట్టుకొని పావనమ్మ మీద సానుభూతి మిగుల్చుకొన్న పాఠకుడు విశాలహృదయుడే అవ్వాలి.

నరేంద్ర తన రచనల ద్వారా తనను తాను రుజువు చేసుకొనే ప్రయత్నం చేయరు. తను చెప్పిన విషయాలను స్వీకరించిన విధానంలో పాఠకులను తమను తాము రుజువు చేసుకోమని సవాల్ విసిరి ఊరుకొంటారు. నవలలో పాత్రలు యదేచ్ఛగా రచయిత పరిచిన కధా ఆవరణలో ఏ కట్టడి లేకుండా ప్రవర్తిస్తుంటాయి. ప్రత్యేకించి ఈ నవలలో భూమి చుట్టూ నడిచిన రాజకీయాలే పాత్రలు. ఆ రాజకీయాలను మాటలలో పెట్టటానికే పాత్రలను సృష్టించారేమో అనిపిస్తుంది. ఇందులో ఏ పాత్ర ఆదర్శపు కొలతలలో ఇమడదు. నవలలో పాత్రలు, పాఠకులకు పాత్రలమీద ఉండే తలపోతలకు అందకుండా వెక్కిరిస్తుంటాయి. పాత్రల అంతరంగ చిత్రణ చేసే పని రచయిత తీసుకోరు. పాత్రల చిత్రీకరణ వాటిని గమనిస్తున్న సమూహాల చేత పరోక్ష పద్ధతిలో చేయిస్తారు.

ఆయన సృష్టించే సన్నివేశాలు నాటక దృశ్యాల లాగా ఖచ్చితమైన కొలతలతో ఉంటాయి. సన్నివేశాల మొదలు, కొనసాగింపు, ముగింపు — ఈ మూడింటిని ఆయన పదునైన నైపుణ్యంతో సరైన ఆకారం వచ్చేటట్లు కత్తిరించుకొంటారు. ఒక సన్నివేశంలోని తప్పిపోయిన వివరానికి తరువాత సన్నివేశంలో అనువుగా వివరించే ప్రతిభ కనపరుస్తారు. నవలలో ఏ పాత్ర మీద సానుభూతి నీడ పడకుండా ఎలా జాగ్రత్త తీసుకోంటారో అలాగే తన ప్రవర్తనకు సంబంధించిన విశ్లేషణ ఇవ్వటానికి ఏ పాత్రకూ అనుమతి ఇవ్వరు రచయిత. ఇక్కడ కూడా ఒక్క మినహాయింపు యిలవరిశికి ఇస్తారు. పురుష పాత్రల పట్ల అవలంబించిన నిర్దయ ఆయన స్త్రీ పాత్రల మీద వహించినట్టుగా కనిపించదు.

శతాబ్ద కాలంనుండి స్త్రీ ఉద్యమం వేస్తున్న ప్రశ్న చదువురాని రైతు స్త్రీ యిలవరిశి నోటి నుండి వినిపిస్తుంది.

“ఆకిలంటే యెట్లుండునో నీకు తెల్సునా? సొంతం అమ్మానాయిన బలవంతంగా పెళ్ళి జేసి ఆడబిడ్డ గొంతెట్ల గోస్తారో తెల్సునా? ఆ మొగుడనే కిరాతకుడు మూడు దినాల్లోనే నరకమెట్ల జూపిస్తాడో అది తెల్సునా నీకు? మొగుడ్నిడిచేసిన ఆడదని వూళ్ళో వాళ్ళంతా యెట్ల చంపుకొని తింటారో తెల్సునా? యెవడో ముక్కుమొహం తెలవని మొగోడ్ని నమ్మి ఊరొదిలి పెట్టి పోయే అగత్యమెట్ల వస్తిందో దెల్సునారా నీకు? మానావరిగా నేలలో మొగోడి మాదిరిగా కష్టపడే ఆడదాని కష్టాన్ని ఎవరు లెక్కగడతారు నాయినా?”

ఇదే ధోరణి పావనమ్మ పాత్రలో కూడా ప్రస్ఫుటమవుతుంది.

వ్యవసాయ భూమి రియల్ ఎస్టేట్‌గా మారే ముందు దశను రచయిత జాగ్రత్తగా పట్టుకొని వస్తారు. భూముల స్థలీకరణకు మానవ ప్రతిఘటన బలహీనమైన ఈ అవస్థలో రోసిరెడ్డి ఒక ప్రశ్న వేస్తాడు. “మడుసులంతా ఈ మాదిరి కొంపలు గట్టుకొనేదానికి కయ్యలు, కాలువలు గావాలంటే కుదిరితిందా? నేలుండేది దున్నిపంట చేసేదానికా? కడగాలేసి గోడల్లేపే దానికా?” చెరువులు, దొరువులు ముయ్యబడి, వ్యవసాయం నిరుపయోగమై, సాగు భూములన్నీ జనావాసాలుగా మారుతున్న ఈ సందర్భంలో రేయింబవళ్ళు పొలాల్లో ఊపిరి తీసుకొనే రోసిరెడ్డి ప్రశ్న ఎంతో సందర్భోచితమైనది.

మానవ ప్రవృత్తి అతను బ్రతుకుతున్న సమాజంలో అతడు ఏ రకమైన సమూహానికి చెందుతాడో అనే దాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. రాజమన్నార్ రెడ్డికి గానీ, జగన్నాధ రెడ్డికి కానీ అయాచితంగా వచ్చిన భూసంపద వారిని కుటుంబం పట్ల బాధ్యతారాహిత్యాన్ని, తమ స్త్రీల పట్ల కఠిన ఆధిపత్యాన్ని నేర్పిస్తుంది. భూమితో బాటు ఆడదాన్ని కూడా కమాడిటీగా పరిగణించే ప్రవృత్తికి ఇక్కడే పునాది వేయబడుతుంది. ఈ సందర్భంగా వ్యాఖ్యానం తిరుపాలరెడ్డి నోటి నుండి వస్తుంది: “చూడబోతే మనుషులకు గుణం వాళ్ళ నాయినల నుండి వచ్చేటట్లు లేదు. అదేందో ఈ నేలలోంచే వస్తా ఉండాది.”

భూమిలో చెమటను ఇంకించిన వారికి దానితో అనుభవం సహజాతి సహజంగా ఉంటుంది. భూమిపై ఆధిపత్యం కలవారి తత్వం వేరుగా ఉంటుంది. రచయిత ఈ తేడాని పాఠకుల ముందు పరిచారు. యిలవరిశి, రోసిరెడ్డి మొదటి వర్గానికి చెందితే రాజమన్నార్ రెడ్డి, జనార్ధన రెడ్డి రెండో వర్గానికి ప్రతినిధులు. “యే సబీ మేరా కమాయి. మేరా జమాన్… మేరా… నాదీ… నాదే… నాదే నాదే!” అని వికటాట్టహాసం చేసిన యోగదాసు కానీ, “నేను దీన్నొదిలి పెట్టేది లేదు. నేనొక వేళ చస్తే దీన్ని కూడా నాతో యెత్తుకొని పోతానంతే” అన్న రాజమన్నార్ రెడ్డి కానీ ఆ భూమిని కట్టుకొని పోలేరని వారి మరణం ద్వారా రచయిత ఆంతర్యమైన వ్యాఖ్యానం చేశారు. ఇక్కడ టాల్ స్టాయ్ ‘ఆరడుగుల నేల’ గుర్తుకు వస్తుంది.

నరేంద్రగారి రచనల్లో ఉండే వర్ణనల, ప్రతీకల సుసంపన్నత గురించి మాట్లాడకుండా ఉండలేము. వాటికి ఆయన ఇచ్చే ప్రాముఖ్యత ఎంతగా ఉంటుందంటే ఒక్కోసారి ఆ దృశ్య వర్ణనలు కూడా కధలో పాత్ర పోషణ చేసి చాలా విషయాలు చెబుతాయి. కధ మూడ్ ధ్వనించే ప్రతీకలను ఈయన ఈ నవలలో కూడా అలవోకగా ఉపయోగించారు. ఈ రచనలో ఒకే దృశ్యం సందర్భాన్ని బట్టి రకరకాలుగా వర్ణించబడుతుంది. ఉదాహరణకు తిరుపతి పైకి వెళ్ళే కొండదారి ఒక్కోసారి ‘పెద్ద వాత’ లాగా కనబడుతుంది. ఇంకొకసారి ‘వింతజంతువు అస్థిపంజరం’ లాగా ఉంటుంది. ఒక చోట ‘ఏపుగా పెరిగిన ఎర్ర పూల చెట్లలాగా’ కనబడుతుంది. ప్రతీకలు వాడటంలో ఆయన సున్నితత్వం కంటే సజీవత్వానికి ఎక్కువ గౌరవం ఇస్తారు. ఇలాంటి దృశ్యమానమైన వర్ణనలు చేయగలిగిన రచయితలు మనకు చాలా తక్కువగా ఉన్నారు.

నరేంద్రగారి రచనలనుండి పాఠకులకు అందే బాహ్యరూపంతో బాటు లోపలి దృశ్యం కూడా ఆసక్తి కరంగా ఉంటుంది. ఈ నవలలో కూడా ఆయన స్పర్శించ దలిచిన పర్యావరణ అంశానికి సంబంధించిన పునాది వేప చెట్టు పుట్టుక నుండి వేసుకొంటూ వచ్చారు. అక్కడక్కడ పాములు, తొండలు, ఉడతలు, గబ్బిలాలు, పావురాళ్ళ గూళ్ళ గురించి ఆయన ప్రస్తావన, చివరకు వేప చెట్టు మరణంతో ఆయన కధలో అంతర్లీనంగా చెప్పదలుచుకొన్న రెండో ముఖ్యమైన సంగతి గోచరమవుతుంది. మనిషి భూదాహానికి బలై పోయిన వేప చెట్టు ఇచ్చిన చివరి వీడ్కోలు హృదయాన్ని పిండి వేస్తుంది. వస్తువులో, శిల్పంలో, భాషలో, వివిధ పాత్రలు మాట్లాడిన యాసలో ఎంతో అక్కర చూపించి తీసుకొని వచ్చిన ఈ పుస్తకం అట్ట మాత్రం నవలలోని గాంభీర్యాన్ని ప్రతిబింబించటం లేదు. పాఠకుడు రచయిత హృదయాన్ని పూర్తిగా చేజిక్కించుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న విషయాల పట్ల కూడా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది.

మనం జీవిస్తున్న ఇంటి కాళ్ళ క్రింద ఉన్న భూమి ఇప్పుడు అంకణాల లెక్కన, అడుగుల లెక్కన బంగారంతో సమానంగా వెల కట్టబడి ఉండొచ్చు. కానీ ఒకప్పుడు అది లక్షల విత్తనాలను తనలో మొలిపించిన ఘనమైన తల్లి అయి ఉంటుంది. లక్షలాది జీవ రేణువులను పాలించిన ఆది అవ్వ అయి ఉంటుంది. సుఖ సంతోషాలను, దుఃఖాలను, సంఘర్షణలను చూసిన మూగ సాక్ష్యం అయి ఉంటుంది. ఎన్నో జీవించిన క్షణాలను మోస్తున్న కాలగర్భ అయి ఉంటుంది.