అనుబంధము: శార్దూలవిక్రీడితములోని మార్పులతో క్రొత్త వృత్తములు

శార్దూలవిక్రీడితములోని మార్పులతో క్రొత్త వృత్తములు

U U U I I U I U I I I U U U I U U I U – శార్దూలవిక్రీడితము
IIU U U I I U I U I I I U U U I U U I U – కేసరి
U U U U I U U I I I U U U I U U I U – కాంచీ
U U U I I U I U I I I U U I U U I U U – శుభాంగి
U U U I I U I U I I I U U III U III U – మేఘ
U U U I I U I U I I I U IIU I IIU I U – నీహార
U U U I I U I U I I I U III U III U U – త్రినగ
IIU U I I U I U I I I U III U III U U – ఆశ
U U U U U I I I I I I U U U I U U I U – వంచిత
U U U U U I I I I I I U U I U U I U U – పుష్పదామ
IIU U I I U I U I I I U U U I U U I U – మత్తేభవిక్రీడితము
IIU U I I U I U I I I U IIU I U U I U – చిలుకపలుకు
U IIU I I U I U I I I U U U I U U I U – మనోజ్ఞ ,కళావతి, శ్రీలలితా
U U III I U I U I I I U U U I U U I U – స్పంద
U U U U U I U I I I U U U I U U I U – నంద
U U U I I III U I I I U U U I U U I U – సద్రత్నమాల
U U U I I U I III I I U U U I U U I U – లోల
U U U I I U I U U I U U U I U U I U – పాలేఱు
U U U I I U I U I U U U U I U U I U – లాలిత్య
U U U I I U I U I I I IIU U I U U I U – దీర్ఘ
IIIIU I I U I U I I I UII U I U U I U – ప్రేమలత

కేసరి –
ఇందులో శార్దూలవిక్రీడితపు పాదము ముందు రెండు లఘువులను లాక్షణికుడు ఉంచెను. ఈ వృత్తమును పంతుల లక్ష్మీనారాయణ శాస్త్రిగారు కల్పించిరి. ఇది పాదమునకు 21 అక్షరములు గల ప్రకృతి ఛందమునకు చెందినది. పండ్రెండవ అక్షరము యతి. క్రింద నా ఉదాహరణ-

కేసరి- స-త-జ-భ-య-ర-ర, యతి (1, 12)
21 ప్రకృతి 597348

వని బూగుత్తుల్ వికసించెఁ గంటి – వరమై ముక్తావళీరూపమై
ఘనరాగమ్ముల్ వినిపించెదన్ సు-కరమై రమ్యస్వరాచ్ఛాదమై
కన వేగన్ బూరుషకేసరీ న-గవులన్ బీయూష మీయంగ రా
తను వూఁగున్ దూఁగును మానసమ్ము – దరి రా యోగంపు వేళాయెఁగా

పై వృత్తములో శార్దూలవిక్రీడితమునకు గణములు మాత్రమేకాక యతి ప్రాసలు కూడ చెల్లును. ఆ శార్దూలవిక్రీడితమును క్రింద ఇచ్చుచున్నాను-

పూగుత్తుల్ వికసించెఁ గంటివరమై – ముక్తావళీరూపమై
రాగమ్ముల్ వినిపించెదన్ సుకరమై – రమ్యస్వరాచ్ఛాదమై
వేగన్ బూరుషకేసరీ నగవులన్ – బీయూష మీయంగ రా
యూఁగున్ దూఁగును మానసమ్ము – దరి రా యోగంపు వేళాయెఁగా

ఈ గర్భకవితలో మాతృక కేసరి, తనయ శార్దూలవిక్రీడితము.

కాంచీ –
పట్వర్ధన్ గారి ఛందోరచన పుటలను తిరగవేస్తుంటే కనబడినది కాంచీవృత్తము. శార్దూలవిక్రీడితములో మదటి మ-గణము తఱువాతి IIUI పంచమాత్రకు బదులు UIU పంచమాత్రను ఉంచిన మనకు కాంచీ లభించును. రెంటికి మొత్తము మాత్రలు, లయ ఒక్కటే. కావున కాంచీ శార్దూలవిక్రీడితపు ఒక చిన్న మార్పు మాత్రమే. కాంచీ అనగా కంచి అను నగరము, అంతేకాక మొల నూలు అని కూడ అర్థము. క్రింద నా ఉదాహరణములు-

కాంచీ – మ/ర/భ/య/ర/ర, యతి (1, 12)
18 ధృతి 74641

కామాక్షీ ఫుల్ల రాజీవనయనా – కాంచీపురాధీశ్వరీ
ప్రేమన్ జూడంగ రా జీవనయనా – ప్రేమాంబుధీ యీశ్వరీ
కామారిప్రేమి భాస్వత్సునయనా – కౌమారి సర్వేశ్వరీ
శ్యామాంగీ చంద్రసూర్యాంశనయనా – సానంద రాజేశ్వరీ

దీనికి రెండు యతులతో క్రింద ఉదాహరణలు-

కాంచీ – మ/ర/భ/య/ర/ర, యతి (1, 7, 12)

పొంగెన్ గాదా హృదిన్ – మోహమయమై – మోదంపు రాగాబ్ధులే
రంగుల్ నిండెన్ మదిన్ – రాగమయమై – రంజిల్లు చిత్రమ్ములే
సంగీత మ్మీ యెదన్ – సాంద్రతరమౌ – సౌందర్య దీపమ్ములే
రంగా రంగా యనన్ – రమ్యతరమై – రాణించు రూపమ్ములే

ఏమో పుట్టానుగా – నెందుకొఱకో – యీ భూమిపై వ్యర్థమై
యేమేమో చేయఁగా – నెంచితిఁ గదా – యీడేర లేదేమియున్
ప్రేమోద్యానమ్ములోఁ – బ్రీతిలత నే – వీక్షించ లేదెక్కడన్
స్వామీ పిల్పించుకో – వమ్ము బ్రదుకున్ – త్వత్పాదపద్మమ్ములన్

మొదటి నాలుగు గురువుల తఱువాత లగమును తొలగించిన మనకు మందాక్రాంతపు గతి లభించును.

శుభాంగి –
శార్దూలవిక్రీడితపు గతి తప్పకుండ ఇంకొక మార్పును కూడ చేయవచ్చును. అది ఏమనగా చివరి రెండు పంచమాత్రలైన త-గణములకు బదులుగా రెండు పంచమాత్రలైన ర-గణముల నుంచుట. దీనికి శుభాంగి అని నామకరణము చేసినాను.

శుభాంగి- మ/స/జ/స/ర/ర/గ, యతి (1, 13)
19 అతిధృతి 75609

అమ్మా, నమ్మితినిన్నుఁ, బాయకను నా – యాశలన్ దీర్చుమా, దీ-
పమ్మై వెల్గుచు నంధకారమునుఁ బా-పంగ వేగమ్ము రా, జ్ఞా-
న మ్మీయన్ బదముల్ ముదమ్ముగ సదా – నా కొసంగన్, శుభాంగీ,
నెమ్మిన్ నాపయి జూపు నీదు కరుణన్, – నిర్వికల్పా సుధాంశా

మేఘ –
శార్దూల లేక మత్తేభ విక్రీడితము నందలి గణములలో చివరి రెండు త-గణములను ఇతర పంచమాత్రలుగా చేసి విక్రీడితపు నడకను కల్పించ వీలగును. పంచమాత్రలు ఎనిమిది. అవి – UUI, UIU, IUU, UIII, IUII, IIUI, IIIU, IIIII. అందులో IUU, IUII ఎదురు నడకతో నడచును. ఐదు లఘువులు పంచమాత్ర ఐనను, త-గణమువలె గమనము నొసగదు. కావున ఇక మిగిలినవి- UUI, UIU, UIII, IIUI, IIIU. రెండు త-గణములకు బదులు రెండు భలము లున్న వృత్తమును మేఘ అని పిలువ దలచాను.

మేఘ- మ-స-జ-స-భ-జ-స, యతి (1, 13)
21 ప్రకృతి 976729

నీలాకాశము నిండె మేఘములతో – నెమ్మదిగ సాగె నవియున్
కాలేభమ్ము లనంగఁ దోచె ఘన ఘీం-కారముల ఘర్జనలు హా
చీలెన్ నింగియు కాంతిపుంజములతోఁ – జిల్లు లయెనో గగనముల్
రాలెన్ నేలకు పెద్ద పెద్ద చినుకుల్ – రమ్యముగ నాడె నెమలుల్

నీహార –
రెండు త-గణములకు బదులు రెండు సలము లున్న వృత్తమును నీహార అని పిలువ దలచాను.

నీహార- మ/స/జ/స/స/న/ర, యతి (1, 13)
21 ప్రకృతి 767833

దాహ మ్మంచును వచ్చెఁ బాంథు డొకఁ డా – దహియించు వడగాలిలో
గేహ మ్మందు వసించుచుండు రమణిన్ – గృపతోడ జల మిమ్మనన్
నీహారమ్మును బోలు నీటి నొసగన్ – నెఱ త్రాగి కను లెత్తగా
మోహాలోకము గల్గె, నీరు బడె, హా – భువిపైనఁ జిఱు ధారలై
(ఇది సప్తశతిలోని ఒక గాథ)

త్రినగ –
రెండు త-గణములకు బదులు రెండు న-గము లున్న వృత్తమును త్రినగ అని పిలువ దలచాను. ప్రక్కప్రక్కన వచ్చు మూడు నగములను అందముగా నుపయోగించుటకు అవకాశము గలదు ఈ వృత్తములో.

త్రినగ- మ-స-జ-స-న-భ-య, యతి (1, 13)
21 ప్రకృతి 489305

శ్రీరాగమ్మునుఁ బాడవా స్వరములే – చిరముగా సిరులవన్, నీ-
వే రాగమ్మునుఁ బాడినన్ వరములై – హృదయ సంపద లగున్, రా-
వా రాగేశ్వరి రమ్య వర్ణములతో – వఱలు సంబరముతో, సం-
ధ్యారాగమ్ముల దాచుకొన్న సకియా – త్వరగ రా మెఱపువోలెన్

చివరి పద్యమును ఏనుగుతలతో (మత్తేభవిక్రీడితపు పూర్వార్ధముతో) చేద్దామా? దీనికి ఆశ అని పేరుంచినాను.

ఆశ- స-భ-ర-న-భ-భ-జ-గ, యతి (1, 14)
22 ఆకృతి 1535668

సరసమ్మైన వసంతవేళ యిదెగా – సరసంపు విరు లింపుగా
విరబూసెన్ వనమందు సుందరముగా – విరసాలు మఱి చాలు, నీ-
వరుదెంచన్ మన మెల్లఁ బొంగు వఱదై – హరుసాల మురిపాలతో
ధర రాలన్ మునుపే నవాశ కళికల్ – ద్వరగాను ననుఁ జేరరా

వంచిత, పుష్పదామ –
ఛందోఽనుశాసనము చదువుతుంటే వంచిత అనే వృత్తము కన్నులకు కనబడినది. వంచితకు గణములు- మ/త/న/స/త/త/గ. రెండవ, మూడవ గణములు తప్పిస్తే మిగిలినవి శార్దూలవిక్రీడితపు గణములే. స/జ గణములకు బదులు త/న గణములు. స, జ లకు IIUIUI. ఇందులో మొదటి రెండు లఘువులను ఒక గురువు చేసి, రెండవ గురువును రెండు లఘువులు చేసినప్పుడు మనకు త, న లు వస్తాయి. కావున ఇది శార్దూలవిక్రీడితపు double mutant!

వంచిత- మ/త/న/స/త/త/గ, యతి (1, 6, 13)
19 అతిధృతి 149473

రావా నన్ గానన్ – రసమయ హృదయా – రాజీవనేత్రా దరిన్
జీవానందమ్మై చిఱునగవులతోఁ – జేరంగ రమ్మో హరీ
భావోద్రేకమ్ముల్ భవమునఁ గలుగున్ – బాలన్ ననున్ ముంచ రా
జీవమ్మీవే వం-చితగ నను ధరన్ – జేయంగ నీకిచ్ఛయా

పై వంచిత వృత్తములో త-త-గ కు బదులు ర-ర-గ ఉంచినయెడల పుష్పదామ అను వృత్తము లభించును.

పుష్పదామ- మ/త/న/స/ర/ర/గ, యతి (1, 6, 13)
19 అతిధృతి 75745

వాసంతమ్మందున్ – బ్రతి లత కొనలో – వర్ణ సంపత్తు నిండెన్
వాసమ్మే జూడన్ – భ్రమరములకు నా – పత్ర పుష్పాల డోలల్
నా సంకల్పమ్ముల్ – నవరస పదముల్ – నర్మ గీతాలు నీకే
మోసాలన్ నిల్తున్ – ముదము విరియఁగా – పుష్పదామమ్ము వేతున్

ఛందస్సులో ఒక సమస్య ఇంకను సంపూర్ణముగా తీరలేదు అని నా ఉద్దేశ్యము. మందాక్రాంతమునకు స్రగ్ధరకు సామ్యము గలదు. మందాక్రాంతమును స్రగ్ధరలో గర్భితము చేయవచ్చును. కాని ఈ వృత్తము ఈ విధముగా సంస్కృతములో వచ్చినదని నేను నమ్మను. మందాక్రాంతము శార్దూలవిక్రీడితమునుండి పుట్టినదని నా భావన. పైన చెప్పిన శార్దూలవిక్రీడితపు ఒక పరిణామమైన పుష్పదామము మందాక్రాంతపు మాతృక! దీనికి నిరూపణగా క్రింద నా ఉదాహరణ-

పుష్పదామ-

వాదా లేలా, నీ – వదనము గనఁగన్ – వంద విశ్వాలు వెల్గెన్
బోధించన్ రావా, – బుధులు పొగడఁగన్ – మోదవేదమ్ము లెన్నో
నాదశ్రీలన్ నే – నవత చెలఁగగన్ – నర్మిలిన్ బాడుచుందున్
పోదున్ నీకై యీ – భువనతలిని నేన్ – పుష్పదామమ్ముతోడన్

పుష్పదామమునకు మూడు భాగములు గలవు- అవి (1) ఐదు గురువులు, (2) ఆఱు లఘువులు, ఒక గురువు, (3) ర/ర/గ లున్న భాగము. ఇందులో మొదటి భాగములో ఒక గురువు, రెండవ భాగములో ఒక లఘువును తీసిన, మనకు మందాక్రాంతము లభించును. అట్లు చేయగా వచ్చిన మందాక్రాంతము క్రింద ఇవ్వబడినది-

మందాక్రాంత-

వాదా లేలా – వదనము గనన్ – వంద విశ్వాలు వెల్గెన్
బోధించన్ రా, – బుధులు పొగడన్ – మోదవేదమ్ము లెన్నో
నాదశ్రీలన్ – నవత చెలగన్ – నర్మిలిన్ బాడుచుందున్
పోదున్ నీకై – భువనతలి నేన్ – పుష్పదామమ్ముతోడన్

చిలుకపలుకు –
పద్యములలో గురువులు ఎక్కువగా నుండిన యెడల, పద్యమునకు గాంభీర్యము కలుగును. కాని గురువులు ఎక్కువగా నున్న పదములను వాడుటకు పాండిత్యము ఉండాలి. అందుకే ఆంధ్ర మహాభారతములో కూడ శార్దూలవిక్రీడితములకన్న మత్తేభవిక్రీడితములు ఎక్కువ. లఘువులు ఎక్కువగా నుండిన యెడల పద్యమునకు లాలిత్యము, సౌకుమార్యము, సౌందర్యము అబ్బును. అందు వలననే చంపక మఱియు ఉత్పలమాలలు వ్రాయుట సులభము. ఇవి కవుల గ్రంథములలో కూడ విరివిగా నున్నవి. ఈ రోజు మత్తేభవిక్రీడితములోని యతి స్థానమైన గురువును రెండు లఘువులుగా మార్చి ఒక క్రొత్త వృత్తమును మీకు ఇస్తున్నాను. ఇది కూడ లక్షణ గ్రంథాలలో కనబడదు. దీనికి చిలుకపలుకు అని నామకరణము చేసినాను. ఏ గులాబి వంటి వృత్తాలకో తప్ప, వృత్తముల పేరులు సామాన్యముగా సంస్కృతములో మాత్రమే గలవు. ఈ చిలుకపలుకు బహుశా ఆ కొఱతను తగ్గిస్తుందేమో. యతి స్థానము పదునాలుగవ అక్షరము. తెలుగు సాహిత్యములో (బహుశా) మొదటి చిలుక పలుకును వినండి.

చిలుకపలుకు- స/భ/ర/న/భ/ర/ర యతి (1, 14) [IIUUIIUIUIIIU] [IIUIUUIU]
21 ప్రకృతి 2097152

చిలుకా యొంటరిగా మనస్సు నిలిచెన్ – శిలయై విరాగాబ్ధిలో,
పలుకో లేఖయొ లేదు, నిర్దయుఁ డీ – బలహీననుం జూడడే,
వెలుఁగుల్ నింపుచు నింపు సొంపు లిడఁ, గం-పిల దేహమ్ము, నా దరిన్,
లలితాస్యుం డిటు వచ్చి మెచ్చి వర మా-లల నిచ్చునా, జెప్పవే!

మనోజ్ఞ, కలా(ళా)వతి, శ్రీలలితా –
కొన్ని కారణాల వలన ఈ వృత్తమును మూడు మారులు మూడు పేరులతో వ్రాసినాను! అవి మనోజ్ఞ, కలా(ళా)వతి, శ్రీలలితా. ఇందులో శా.వి.లోని రెండవ గురువు రెండు లఘువులుగా చేయబడినవి.

మనోజ్ఞ – భ/భ/ర/న/మ/య/లగ, యతి (1, 14)
20 కృతి 298679

భారతి, సార్థకమైన మంచి చదువుల్ – భారమ్ము లేకుండ స-
ద్ధారగ నీయుమ, పూజ సేతు నిను ని-త్యమ్మున్ మదిన్ భక్తితోఁ
బ్రేరణ లిమ్ము నిరంతరమ్ము విలస-త్ప్రేమార్ద్ర భావమ్ముతో
సారమతిన్ సుమనోజ్ఞ కావ్యరచనా – సంసిద్ధికై శ్రీమతీ

కళావతి – భ/భ/ర/న/మ/య/లగ, యతి (1, 14)
20 కృతి 298629

కానగ రమ్ము కళావతీ కవితతోఁ – గారుణ్యవారాంనిధీ
వానగ రమ్ము వరద్యుతీ నవతతో – వాక్శుద్ధి నీయంగఁ జి-
ద్వీణగ రమ్ము ప్రియంవదా సొబగుతో – వేవేగ మీటంగ నా
ప్రాణము గమ్ము సరస్వతీ శుభవతీ – రాకేందురశ్మిస్మితా

మానసవీణను మీటవా మమతతో – మాధుర్య మందాకినీ
తేనెల నూరెడు తెల్గు పల్కు స్వరముల్ – తీదీపిగాఁ బాడవా
తానము దప్పక నాడెదన్ గతులతోఁ – దాధింతతా యంచు నేన్
ధ్యానముఁ జేసెద నీదు నామము సదా – దైవమ్ముగా నెంచుచున్

చల్లని వెన్నెలలో నిశాఘడియలో – జాబిల్లి జాలమ్ములో
మల్లెల తావులలో నదీతటములో – మందానిలస్పర్శలో
నల్లని నీడలలో నగంపు నిగలో – నక్షత్ర దృచ్ఛక్తిలో
నుల్లపు వాంఛలలో నురంపు దడలో – నో ప్రేయసీ వేగ రా

వెన్నెల కాచిన వేళలో నయనముల్ – ప్రేమాద్రమౌ వేళలో
పున్నమి పండిన వేళలోఁ గుసుమముల్ – పుష్పించు యీ వేళలో
వన్నెల రాతిరి వేళలో హృదయముల్ – వాంఛించు యీ వేళలో
సన్నగ మాటల బల్క నీ ఘడియలో – సంగాతి రావేలకో

శ్రీలలితా – భ/భ/ర/న/మ/య/లగ, యతి (1, 14)
20 కృతి 298679

శ్రీలలితా లలితాననా పశుపతి-ప్రేమాలయా పాలయాం
కాళి కళామయి కామదాయి వరదా – కామాక్షి దాక్షాయణీ
వ్యాళధరప్రియ వారిజానన శివ-ప్రాణేశ్వరీ పార్వతీ
చాల నుతింతు నిన్ను నిర్మలమతీ – సచ్ఛీలసమ్మోహినీ

మానసమా కలలోనఁ గంటినిగదా – మందాకినీతీరమున్
యానము సేయగ నొక్క నౌక సుఖమున్ – హ్లాదమ్ము నీయంగ స-
ద్గానము వింటిని రాగముల రసమై – కర్ణమ్ములన్ గమ్మగా
నా నిదురో నిముసాన మాయమయెనే – నా స్వర్గ మెందున్నదో

కోకిల యెందుకె నీవు కొమ్మల సదా – గొంతెత్తి పాడేవు నా
వాకిలి ముందు రసాల వృక్షమున – భావానంద మందించగా
నాకది వద్దు మదీయ మానసములో – నాదమ్ము గల్గించునే
చీకటిఁ బాపునె లేని నాదు ప్రియన్ – జిత్రమ్ముగాఁ జూపునే

రాగమయీ యనురాగపూర్ణ సరితా – రాగాలఁ బాడంగ రా
యోగములో సురభోగ మందనగునా – యోగార్థచింతామణీ
భోగములోఁ జిరయోగ మందనగునా – భోగార్థకల్పద్రుమా
వేగము జెప్పుము యోగభోగముల కే – భేదమ్ము లేదందువా

కూ యని గోయిల పాడెఁ గొమ్మల నెదో – క్రొంగ్రొత్త రాగమ్ములన్
దీయగఁ దీయగఁ బాటఁ బాడఁగ మదిన్ – దేనెల్ స్రవించున్ గదా
హాయిగ హాయగ మాటలాడుము ప్రియా – యానంద ముప్పొంగఁగా
మాయని మాయల జీవితమ్ము భువిలో – మారున్ విచిత్రమ్ముగా

ఇలా ప్రయోగము చేసినప్పుడు ఇందులో శార్దూలవిక్రీడితపు గాంభీర్యము తగ్గినదనే చెప్పాలి. అంతే కాక కొద్దిగా ఉత్పలమాల నడక కూడ ముందు భాగములో చేరినది. పున్నాగ, నందన వృత్తాలలో కూడ మాలావిక్రీడితాల నడకలు ఉన్నాయి. అది మాత్రమే కాదు, ఈ శ్రీలలితావృత్తములో పున్నాగవృత్తము కూడ గర్భితమై ఉన్నది. ఇది చివరి పద్యములో మనకు కనబడుతుంది. ఆ పద్యము –

శ్రీలలితా –

కూ యని గోయిల పాడెఁ గొమ్మల నెదో – క్రొంగ్రొత్త రాగమ్ములన్
దీయగఁ దీయగఁ బాటఁ బాడఁగ మదిన్ – దేనెల్ స్రవించున్ గదా
హాయిగ హాయిగ మాటలాడుము ప్రియా – యానంద ముప్పొంగఁగా
మాయని మాయల జీవితమ్ము భువిలో – మారున్ విచిత్రమ్ముగా

పున్నాగ –

కోయిల పాడెఁ గొమ్మల నెదో – క్రొంగ్రొత్త రాగమ్ములన్
దీయగఁ బాటఁ బాడఁగ మదిన్ – దేనెల్ స్రవించున్ గదా
హాయిగ మాటలాడుము ప్రియా – యానంద ముప్పొంగఁగా
మాయల జీవితమ్ము భువిలో – మారున్ విచిత్రమ్ముగా

మాతృక – శ్రీలలితా, తనయ – పున్నాగ

స్పంద-
శార్దూలవిక్రీడితములోని మూడవ అక్షరమైన గురువును రెండు లఘువులుగా చేసినప్పుడు జనించిన వృత్తము స్పంద.

స్పంద- త/న/ర/న/మ/య/లగ, యతి (1, 14)
20 కృతి 298685

చూడన్ వదనము డెందమందుఁ గలిగెన్ – సొంపైన భావమ్ము నా
కాడన్ ముదముగ డెందమందుఁ గలిగెన్ – కౌతూహల మ్మెంతయో
పాడన్ బదములు డెందమందుఁ గలిగెన్ – స్పందమ్ము లందమ్ముగా
రాఁడా రసమయ రాత్రిలోన రహితో – రంజించ రాగాప్తుఁడున్

నంద –
శార్దూలవిక్రీడితములోని నాలుగు, ఐదు అక్షరములైన లఘువులను ఒకగురువుగా చేసి చూద్దామా? దీనికి నంద అని పేరు పెట్టినాను.

నంద – మ/త/భ/య/ర/ర, యతి (1, 12)
18 ధృతి 74657

రాజీవాక్షా వేగ రమ్యతరమౌ – రాత్రిం జరించంగ రా
నా జీవానన్ నాథ నవ్వుఁ జిలుకన్ – నందమ్ము నీయంగ రా
వ్యాజ మ్మేలా నాకు వద్దు కలతల్ – వ్యంగ్యమ్ముఁ జాలించరా
రాజిల్లంగన్ రంగ రంగు లిడగన్ – రాగాబ్ధిఁ దేలించరా

అందమైన ఈ నంద వృత్తములో ఐదవ, ఆఱవ అక్షరములను తొలగించినయెడల వచ్చు పద్యపు గమనము మందాక్రాంతవలె నుండును. ఇట్టి గమనము గల జాతి పద్యములకు నేను మందాకిని అని పేరు పెట్టాను.

మందాకిని –
రాజీవాక్షా – రమ్యతరమౌ – రాత్రిం జరించంగ రా
నా జీవానన్ – నవ్వుఁ జిలుకన్ – నందమ్ము నీయంగ రా
వ్యాజ మ్మేలా – వద్దు కలతల్ – వ్యంగ్యమ్ముఁ జాలించరా
రాజిల్లంగన్ – రంగు లిడగన్ – రాగాబ్ధిఁ దేలించరా

సద్రత్నమాల –
శార్దూలవిక్రీడితములోని ఆఱవ అక్షరమైన గురువును రెండు లఘువులుగా మార్చినప్పుడు సద్రత్నమాల అను వృత్తము లభించును. దీనిని హేమచంద్రుడు తన ఛందోనుశాసనములో పేర్కొనెను.

సద్రత్నమాల- మ/న/స/న/మ/య/లగ, యతి (1, 6, 14)
20 కృతి 298745

జ్ఞానోపార్జన – జగతిఁ జాలు, ధనముల్, – సద్రత్నమాలల్ వృథా,
సానందమ్ముగ – సతత మిత్తుఁ బదముల్ – సత్పద్యమాలల్ హరీ,
యీ నా మానస – మిరవు నీకు గుడియై, – హృన్నాయకా ప్రేమతోఁ
బ్రాణ మ్మిత్తును – బ్రణయమూర్తి దరి రా – ప్రత్యక్ష దైవమ్ముగా!

లోల –
శార్దూలవిక్రీడితములోని ఎనిమిదవ అక్షరమైన గురువును రెండు లఘువులుగా చేసినప్పుడు లభించిన వృత్తమును లోల అని పిలువ దలచాను.

లోల- మ-స-న-న-మ-య-లగ, యతి (1, 14)
20 కృతి 298969

ఆకాశమ్మున నందముగ వెలిగెఁగా – నానంద తారావళుల్
రాకన్ ముంగిట రాకకయి నిలిచితిన్ – రా కంటి తారా దరిన్
లోకమ్మంతయు నీరవమయె మనసో – లోలాయమాన మ్మయెన్
నీకై నే నిట వేఁచితిని రజనిలో – నేత్రమ్ము నిండంగ రా

పాలేఱు –
శార్దూలవిక్రీడితములోని తొమ్మిది, పది అక్షరములైన లఘువులను ఒకగురువుగా చేసి చూద్దామా? దీనికి పాలేఱు (క్షీరనది) అని పేరు పెట్టినాను.

పాలేఱు – మ/స/య/య/ర/ర, యతి (1, 12)
18 ధృతి 74329

గాన మ్మిత్తును నీకు కంఠమ్ముతో – గానాబ్ధి నీవే గదా
పాన మ్మిత్తును నీకు నా మోవితోఁ – బాలేఱు నీవే గదా
దాన మ్మిత్తును నీకు నా సర్వమున్ – ధ్యానమ్ము నీవే గదా
ప్రాణ మ్మిత్తును నీకు ప్రాణేశ్వరా – ప్రాణాలు నీవే గదా

లాలిత్య –
శార్దూలవిక్రీడితములోని పదవ, పదునొకండవ లఘువులను ఒక గురువుగా చేసిన వృత్తమునకు లాలిత్య మని పేరు పెట్టినాను.

లాలిత్య – మ/స/జ/మ/ర/ర, యతి (1, 12)
18 ధృతి 74073

తల్లీ, నా మది నిల్చి గావుమా, – త్వత్పాదమ్ములన్ భక్తితో
నుల్ల మ్మందున నెప్డు బూచు బూలన్ – సోత్సాహినై గొల్తు నేన్
సల్లాలిత్యము నింపుమా పదాలన్ – సౌందర్య మొప్పారఁగా
జల్లై చిల్కు భవత్కృపాసుధన్ స-చ్ఛందోంబుధీ, భారతీ

దీర్ఘ –
శార్దూలవిక్రీడితములోని పండ్రెండవ అక్షరమైన గురువును రెండు లఘువులు చేసిన మనకు దొరకు వృత్తము దీర్ఘ.

దీర్ఘ – మ-స-జ-న-య-య-లగ, యతి (1, 14)
20 కృతి 302937

రాధన్ గానఁగ రమ్ము, దుర్భరము సఖ, – రాత్రుల్ సుదీర్ఘమ్ము, లీ
బాధల్ తాళఁగఁ జాల, బంది నయితిని, – వాదమ్ము లింకేలరా,
మోద మ్మీయర, మోహనా, మధురముగ – మూన్నాళ్ళు నా కీ భువిన్
మోదమ్మే గద ముఖ్య వేదము, వరద, – మోమెల్లఁ గన్నాయెరా

ప్రేమలత –
శార్దూలవిక్రీడితములోని మొదటి రెండు గురువులను లఘువులుగా చేసి, యతి స్థానపు గురువును రెండు లఘువులుగా చేసినప్పుడు జనించిన వృత్తము ప్రేమలత. దీనిని ఒక త్రిభంగిగా వ్రాయ వీలగును. క్రింద ఒక ఉదాహరణము –

ప్రేమలత – న/జ/జ/భ/జ/జ/త/గ, ప్రాసయతి (1, 6, 15)
22 ఆకృతి 1236336

కవనములా – నవరాగ భావనములా – జవమైన నిస్వనములా
కవనములా – నవచిత్ర శోభనములా – యువరాగ గుంభనములా
కవనములా – నవజీవ చేతనములా – కవిరాజ కేతనములా
కవనములా – నవలోక వాహనములా – భువనైక మోహనములా

జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ...