అక్షరమాలా పద్యములు

పరిచయము

వివిధ దైవ స్తోత్రములలో అక్షరమాలా స్తోత్రము ఒకటి. కొన్ని దేవతలపై అట్టి స్తోత్రములు గలవు. అద్రీశ జాధీశ అను పదములతో ప్రారంభమయ్యే మృత్యుంజయ స్తోత్రములో ప్రతి పంక్తి అ, ఆ, ఇ, ఈ ఇత్యాదులైన అక్షరములతో ప్రారంభమై క్ష-కారముతో అంతమవుతుంది. అక్షరములతో ప్రారంభించు పంక్తులకు బదులు అకారాది అక్షరములతో ప్రారంభమగు వృత్తములతో పద్యములను వ్రాయవలయుననే ఒక ఆలోచన నాకు కలిగినది. దాని ఫలితమే ఈ ప్రయత్నము. ఇందులో అ-కారమునుండి హ-కారము వఱకు ఒక్కొక్క అక్షరమునకు ఒక్కొక్క వృత్తము ఉన్నది. ౠ, ఌ, ఙ, ఞ, ణ, ళ అక్షరములు పరిగణించబడలేదు. ఎందుకనగా ఈ అక్షరములతో ప్రారంభమగు పదములు లేవు, ఉన్నను అవి చాల తక్కువ, అంతే కాక ఉపయోగములో లేవు. అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఋ, ఎ, ఏ, ఐ, ఒ, ఓ, ఔ, అం, క, క్ష, ఖ, గ, ఘ, చ, ఛ, జ, ఝ, ట, ఠ, డ, ఢ, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, య, ర, ఱ, ల, వ, స, ష, స, హ అక్షరములతో (ఏ గుణింతమైనను సరియే) ప్రారంభమగు వృత్తములను, జాత్యుపజాతులను నేను వాడినాను. ఈ మొత్తము 46 పద్యములు. ఇందులో ఐ, ఒ, థ, ఠ, ఱ అక్షరములతో ఏ వృత్తములు గాని, జాత్యుపజాతులు గాని లేవు. ఈ అక్షరములకు పద్యములను నేను సృష్టించినాను. వాడుకలో ఉండే పద్యములన్నిటికి చోటు నిచ్చుటకు ప్రయత్నించినాను. రెండు పద్యములు ఒకే అక్షరముతో ప్రారంభమయినప్పుడు (ఉదా. మత్తేభవిక్రీడితము, మత్తకోకిల) వాటి అన్య నామములను ఉపయోగించినాను (మత్తకోకిల – చర్చరీ, చంపకమాల – సరసీ, దుర్మిలా – ఘోటక, తోటక – ఛిత్తక). సీసపద్యమును షట్పదలో గర్భితము చేసినాను. సంస్కృత, తెలుగు భాషలనుండి మాత్రమే కాక కొన్ని పద్యములను ఇతర భాషలనుండి దిగుమతి చేసికొన్నాను (కన్నడమునుండి ఏల, ధవళము; మరాఠీనుండి ఓవి; హిందీనుండి ఝూలనా, డమరు). మొట్టమొదట అన్ని పద్యములకు ఉదాహరణములు ఇవ్వబడినవి. చివరి భాగములో అన్ని పద్యములకు యతి గణాదులను తెలిపియున్నాను. కొన్ని పద్యముల ఛందస్సు గుఱించి నా సూచనలను అంతములో నిచ్చినాను. పాఠకులకందఱికి నా ఈ చిన్ని ప్రయత్నము నచ్చుతుందని భావిస్తున్నాను.


1) అశ్వధాటి

శ్రీనందసూనుఁ గన – నానంద మయ్యె నొక – గానమ్ము లేచెను గదా
తేనెల్ స్రవించె నిఁకఁ – బానమ్ము సేయఁగను – వీనుల్ జలించెను గదా
వేణూరవమ్ములకు – వీణాస్వనమ్ములను – నేనిందుఁ గూర్చెదనుగా
తానాన తానతన – తానాన యంచుఁ జిఱు – ప్రాణమ్ముఁ జేర్చెదనుగా

2) ఆటవెలఁది

శ్రీసరస్వతీ వి-రించి హృదయరాణి
భాసురమ్ము చేయు – భవము వాణి
హాస మొలుకు దేవి – యనురాగముల తల్లి
ఆసపడెదఁ గరుణ – కమృతవల్లి

3) ఇంద్రవజ్ర[1]

రాజాధిరాజా – రవివంశతేజా
రాజీవనేత్రా – రమణీయగాత్రా
నా జీవధారా – నవజీవసారా
యీ జన్మ నీదే – యిహమంత నీదే

4) ఈశ –

జగదీశ్వరా మహేశా
నగజాపతీ గణేశా
త్రిగుణాత్మకా సురేశా
భగవత్స్వరూప యీశా

5) ఉత్పలమాల[2]

కూరిమి నిండె నీ నెలఁత – కోమలికిన్ నినుఁ గోరఁగా సఖా
నారికి గుండెలోఁ గొలువ – నామ మగున్ స్మరణమ్ముకై సదా
వారుచుఁ బండు నా వలపు – స్వామి కృపన్ మురిపమ్ములౌ గదా
భీరువు కండ రా యలర – ప్రేమమయా లలి పెంచఁగా హరీ

6) ఊర్వశి –

ప్రియతమా చూడ రా – ప్రేమతోఁ గూడ రా
భయముతో నుంటి నే – బాధలన్ బాప రా
హయముపై వచ్చి నన్ – హాయిలో ముంచ రా
శ్రయము నీవేగదా – శ్యామ నవ్వించ రా

7) ఋషభగజవిలసిత –

వేణువు మ్రోఁగుచుండెఁ – బ్రియముగ నవనవమై
ధేనువు లాఁగకుండెఁ – దిరుగుచు నటునిటులన్
మానస మూఁగుచుండె – మధురత కనుగతమై
హా నినుఁ జూడకుండ – హరుసము గలుఁగదుగా

8) ఎత్తుగీతి –

ఈ హృది చిన్న దిచట
నీ హృది పెద్ద దచట
రా హృత్కమలము విరియ
సౌహార్దపు సుధ కురియ

9) ఏల –

ఏల నీవిట్లు యీ – బేల నన్నిట వీడి
చాల సేపుంటి వీవేళ
మాలి రావేల నా – కేల బట్టంగ గో-
పాలకా వేగ మీవేళ

10) ఐశ్వర్య –

ఇల నాకు నైశ్వర్య – మెప్పు డీవే
వలరాజు తండ్రి నా-వైపు నీవే
యలరారు నా మన్కి – కర్థ మీవే
శిలయైన రూపంపు – జీవ మీవే

11) ఒయ్యారి –

తెలతెల మేఘము – తేలుచు నింగినిఁ దోఁచె
మెలమెల గాలియు – మృదువుగఁ జల్లగ వీచె
ఉలుకుచు భావము – లొయ్యార మొలుకుచు లేచె
పలుకవె బంగరు – భామరొ మనసిట వేఁచె

12) ఓవి –

కానంగ సూర్యుని నీ యుషస్సు
ఆనందమైనది నా మనస్సు
ఆ నందగోపాలుఁడే తపస్సు
ఈ నాకు లేదు తమస్సు

13) ఔపచ్ఛందసిక (పుష్పితాగ్ర) –

కమలనయన – కాలమాయె గాదా
కమలుచు నుంటిని – కళ్ల జూడ రాదా
భ్రమల వలకు – బాగ చిక్కికొంటిన్
విమలుని ప్రేమకు – వేగ వేఁగుచుంటిన్

14) అంబుదావళి –

గగనమ్ములోనన్ – గన నంబుదావళిన్
నగధారి నాకున్ – నగుమోముతో లలిన్
అగుపించెఁ గాదా – యలరంగ డెందముల్
జగమెల్ల వాఁడే – జనియించె నందముల్

15) కందము –

సుందర చిత్రము గీచెను
సందె వెలుఁగులందుఁ బ్రకృతి – జ్వలియించంగా
స్కందా వెదుకుచు వేఁగుచు
సుందరవల్లి యిట నిన్ను – జూడఁ దపించెన్

16) క్షమా –

వెలుఁగుచు మెఱయున్- విశ్వమం దందమై
బులకల నిడు నీ – భూమి నా తల్లిగాఁ
దలతును మదిలో – తథ్యమై నిత్యమున్
సలుపుదు నఘముల్ – చాల మన్నించుమా

17) ఖజన[3]

ఎందుకో మోసపో-యేను యీ రీతిగా – నిందువై చల్లఁగా – యిప్పుడే వాఁడు నా
ముందు రాఁడెందుకో – ముచ్చటల్ దీరఁగా – మోముపైఁ దీయగా – ముద్దిడన్ లేఁడుగా
సుందరుం డా హరిన్ – జూఁడగాఁ గోరితిన్ – సొంపులన్ జక్కఁగా – జూపఁగా నుంటిఁగా
నందగోపాల యా-నంద మీయంగ రా – నవ్వుతోఁ బువ్వులా – నన్నుఁ దాకంగ రా

18) గరుడరుతము –

గరుడరుతమ్ములన్ వినఁగ – కంజనేత్రుండు సం-
బరముగ నేఁగుదెంచెనని – బర్హిపింఛమ్ములన్
గరముల నుంచి వానిఁ గనఁ – గాంక్షతో నేఁగఁగా
వరదుఁడు గానరాఁడుగద – వంతలఁ గ్రుంగితిన్

19) ఘోటక[4]

కమలాక్ష ననున్ – గనికారముతోఁ – గనరా యిపుడే – కడు వేగముగా
అమలానన నీ – యమృతాంబుధిలో – నలగా ననుఁ జే-యర యందముగా
సుముఖమ్ముగ నీ – సురగానములో – శ్రుతిగీతమునై – సుఖ మొందెదరా
రమణీయముగా – రసరాసములో – రజనిన్ వ్రజమున్ – రవ మయ్యెదరా