నేపథ్య సంగీతం

రాలే
పువ్వుకి,
టప్ మని
పుల్ల
విరుపు.

బస్కీ తీసే
ఊసరవెల్లి మీద,
పచ్చ ఒంటి
గొల్ల భామ
ధుమ ధుమ.

గాల్లో తూనీగ
తుళ్ళింతకి,
ఇళ్ళకి మళ్ళిన
అడవి బాతుల
హళాహళి.

పగటి ఎండ
పసిడి తాచు
పడగ దించి
పాకుతుంటే
తాడి తలపై

చల్ల గాలి పెట్టె
హార్మోనియము,
దూరాన తోపులో
చింత చిగురు
గగురు తాళమూను.