నాకు నచ్చిన పద్యం: అలముకొన్న అదృశ్యాంజనం

సీ. దినవారిరాశి మాపను మౌని గ్రోలంగ
                   నడుగున గనుపట్టు నసలనంగ
      గ్రుంకుమెట్టడవి దార్కొనిన సంధ్యావహ్ని
                   బొడమిన దట్టంపు బొగ యనంగ
      దన మణి పడిపోవ ధరణీతలంబున
                   నెమకంగ వచ్చిన నింగి యనగ
      నల చుక్కలనియెడి వలరాజు గెలుపు వ్రాల్
                   దెలియ బూసిన మషీలేపమనగ

తే. వృద్ధవారవిలాసినీవిసరమునకు
     నపలితంకరణౌషధం బనగ జార
     నలినముఖుల కదృశ్యాంజనంబనంగ
     అంధకారంబు జగమెల్ల నాక్రమించె

ఆ మధ్య రైలు ప్రయాణం చేస్తూ ఉంటే గుర్తుకువచ్చింది యీ పద్యం! వేగంగా పరుగులు తీసే జీవితపు రైలుబండిని నిలవరించి, నెమ్మదింప జేసి, కొన్ని గంటలపాటు ఎక్కడకీ కదలనీయకుండా మనల్ని కూర్చోబెట్టి, మనం పట్టించుకోని మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసే అవకాశాన్ని కల్పిస్తుంది రైలు ప్రయాణం. అయినప్పటికీ, తమతో ఎక్కడికి వెళ్ళినా వెంటవచ్చే నెట్టు పెట్టుకొని యే ఫేసుబుక్కునో చూస్తూ కూర్చునే వాళ్ళను రైలుబండి కాదు కదా ఆ భగవంతుడు కూడా యేమీ చెయ్యలేడు! అదృష్టవశాత్తూ అలాంటి వాటికింకా నేను పూర్తిగా అలవాటుపడక కాస్త వెనకబడి ఉన్నాను కాబట్టి, ఆ రైలు ప్రయాణంలో కిటికీలోంచి కనిపించే ప్రకృతిని చూస్తూ కూర్చున్నాను. అంతలో పొద్దు వాలింది. ఎదురుగా ఎఱ్ఱని ఆకాశం. ఆ ఎఱ్ఱదనంలోనే ఎన్నెన్ని చాయలో! మెల్లమెల్లగా ఆ ఎఱ్ఱదనపు వెలుగు తగ్గి మధ్యమధ్య నల్లనల్లగా చీకట్లు క్రమ్ముకోసాగాయి. కొంతసేపటికి అంతటా బూడిదలా చీకటి. అలా క్రమక్రమంగా సంధ్యాకాంతులలో ముసిరే చీకటిని చూస్తూ ఉంటే, ‘క్రుంకుమెట్టడవి దార్కొనిన సంధ్యావహ్ని పొడమిన దట్టంపు బొగ’లా చీకటి అలముకుందన్న తిమ్మనగారి వర్ణన గుర్తుకువచ్చింది. జాజ్వల్యమానంగా వెలిగే పడమటి ఆకాశాన్ని చూస్తే నిజంగా ఒక పెద్ద అడవి అంటుకున్నట్టే అనిపించింది. అలా రాజుకున్న దావాగ్ని కొద్దికొద్దిగా తగ్గుతూ దానినుండి దట్టమైన పొగ క్రమ్మినట్టే అనిపించింది ఆ దృశ్యాన్ని చూస్తే! నంది తిమ్మనగారి దర్శనశక్తికి ఒకసారి మనసులోనే ఏటికోళ్ళు పలికాను.

కావ్యాలలో వర్ణనలు సినిమాలలో పాటల్లాంటివి. బిగువుతో సాగిపోయే కథాగమనంలో కాస్తంత ఆటవిడుపునిస్తాయవి. పాత సినిమాల్లో పాటలయితే చాలావరకూ కథాగమనంలో భాగంగా సందర్భానికి తగ్గట్టు వస్తూ ఉండేవి. కొత్త సినిమాల్లో పెద్దగా వాటికి కథతో సంబంధం ఉండదు. అలాగే నన్నయ్య, తిక్కనలాంటి పురాణకవుల కాలంలో చాలావరకూ వర్ణనలు కథలో భాగంగానే ఉండేవి. నన్నెచోడునితో మొదలైన ప్రబంధ ధోరణిలో అష్టాదశవర్ణనల ప్రాధాన్యం పెరిగి, ప్రబంధయుగంలో వెలసిన కావ్యాలలో కథతో ఏమాత్రం సంబంధం లేకుండా విస్తృతంగా సాగే వర్ణనలు చోటుచేసుకున్నాయి. ఎలా అయితే పాటలను సినిమాతో సంబంధం లేకుండా, విడిగా వాటిలో వినిపించే సంగీతాన్నీ సాహిత్యాన్నీ, కనిపించే అందాలనీ ఆస్వాదిస్తామో, అలాగే వర్ణనలను కావ్యకథతో సంబంధం లేకుండా విడిగా చదువుకుంటూ వాటిలో కల్పనలనూ, అలంకారాలనూ, చమత్కారాలనూ ఆస్వాదించవచ్చు. పారిజాతాపహరణ కావ్యంలోని యీ పద్యంకూడా అలాంటిదే. అంచేత, కథా సందర్భం జోలికి వెళ్ళకుండా సరాసరి పద్యంలోకి ప్రవేశిద్దాం.

అంధకారం జగమంతా ఆక్రమించింది. ఆక్రమించడం అంటే క్రమక్రమంగా వ్యాపించడం. అలా క్రమేపీ అలుముకున్న చీకటి ఎలా ఉందో ఆరు అద్భుతమైన పోలికలతో వివరిస్తున్నాడు కవి.

దిన వారిరాశిన్ – పగలనే సముద్రాన్ని, మాపు అను మౌని – సాయంకాలమనే ముని, గ్రోలంగన్ – త్రాగెయ్యగా, అడుగున కనుపట్టు – అడుగున కనిపించే, అసలు అనంగ – బురదేమో అన్నట్టుగా ఉంది. అగస్త్యుడు సముద్రాన్ని ఒక్క పుడిసిలితో పట్టి తాగేసిన పురాణకథని యిక్కడ ప్రస్తావిస్తించారు తిమ్మనగారు. నిలవనీటి అడుగున ఉండే బురద కొంచెం నల్లనల్లగా ఉంటుంది కాబట్టి, ప్రపంచమంతా వ్యాపిస్తున్న చీకటికి బురదతో పోలిక చెప్పారు. అంతగా వ్యాపించి ఉన్నదంటే అది ఏ చిన్న నీటికొలనో అవ్వడానికి వీలు లేదు కదా. అంచేత అది సముద్రపు బురద. ఇక కవిగారి ఊహ అలా అలా అల్లుకుంటూ అగస్త్యుని దాకా వెళ్ళింది!

క్రుంకుమెట్ట అడవిన్ – క్రుంకు మెట్ట అంటే సూర్యుడు క్రుంకే పర్వతం, పశ్చిమాద్రి. ఆ పడమటి కనుమలలో ఉన్న అడవిలో, తార్కొనిన – వ్యాపించిన, సంధ్యావహ్నిన్ – సాయంకాలమనే అగ్నినుండి, పొడమిన – పుట్టిన, దట్టంపు పొగ యనంగ – దట్టమైన పొగ అన్నట్టుగా ఉంది. ఈ పద్యంలో చెప్పిన మిగతా పోలికలన్నీ సాయంసంధ్యని చూడకుండానే, కవి కేవలం తన కల్పనా చాతుర్యంతో చెప్పగల పోలికలు. కాని ఈ పోలిక మాత్రం అలా కాదు. సంధ్యాకాంతులలో చీకట్లు ముసిరే దృశ్యాన్ని కళ్ళారా చూస్తూ, అందులో లీనమైన ఒక యోగస్థితిలో మాత్రమే హృదయంలో తళుక్కున మెరిసే ఊహ యిది!

సరే సూర్యాస్తమయం అయిపోయింది. లోకమంతటా చీకటి మరింత దట్టంగా వ్యాపిస్తోంది. అది ఎలా ఉన్నదంటే, తన మణి పడిపోవ ధరణీతలంబున – విలువైన తన మణి భూమ్మీద పడిపోతే, నెమకంగ వచ్చిన నింగి యనగ – వెదకడానికి కిందకి దిగి వచ్చిన ఆకాశమేమో అన్నట్టుగా ఉంది. ఆకాశంలో మెరిసే మణి, తరణి. సూర్యుడికి ద్యుమణి, నభోమణి అనే పేర్లున్నాయి. అస్తమించే సూర్యుడు నేల రాలిపోతున్నట్టుగానే ఉంటాడు కదా. అంచేత, కిందపడిపోయిన తన మణిని వెతకడానికి ఆకాశమే నేలకు దిగి వచ్చిందేమో అన్నట్టుగా ఉందట చీకటి. నల్లని ఆకాశం నేలంతా వ్యాపించినట్టు ఉందన్న మాట!

‘అల చుక్కలనియెడి వలరాజు గెలుపు వ్రాల్ తెలియన్ పూసిన మషీలేపము అనగ.’ చీకటి నేల మీదనే కాదు ఆకాశమంతటా కూడా వ్యాపించింది. మెల్ల మెల్లగా నల్లని ఆకాశంలో చుక్కలు మెరుస్తూ కనిపించసాగాయి. ఆకాశంలో అలుముకున్న చీకటి ఎలా ఉందో యీ పాదంలో వర్ణిస్తున్నారు తిమ్మనగారు. ఆకాశంలో కనిపించే చుక్కలు, మన్మథుని గెలుపు వ్రాలు. అంటే మన్మథుని విజయానికి గుర్తుగా చెక్కించిన శాసనం. అది స్పష్టంగా తెలియడానికై పూసిన మసిపూతలా ఉందట చీకటి. శాసనంలో వ్రాసినది స్పష్టంగా తెలియడానికి మసిపూత పూయడమేమిటి? దీని వెనక బోలెడు చరిత్ర ఉంది! రాతి పలకలపై చెక్కబడిన వ్రాతలకు ప్రతులు తీసే ఒక ప్రక్రియ Stone Rubbing. కాగితాన్ని శిలాఫలకం మీద పెట్టి, రాతిలో ఏర్పడ్డ గంటుల్లో కాగితాన్ని నొక్కుతారు. అలా అచ్చు తీసిన కాగితంపైన బొగ్గుతో చేసిన లేపనాన్ని పైపైన పూస్తారు. అప్పుడు, కాగితమంతా నల్లగా అయి, గంటు పడిన భాగాలు తెల్లగా స్పష్టంగా కనిపిస్తాయి. ఇది ప్రాచీన కాలంనుండీ ప్రయోగంలో ఉంది. చైనీయులు దీనికి ఆద్యులని చరిత్రకారులు చెపుతారు. ముద్రణకి ఇదే మూలం. పురావస్తు పరిశోధకులు పాత శాసనాలను స్పష్టంగా చదివేందుకు కూడా ఇలాంటి ప్రక్రియను ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడ తిమ్మనగారు ప్రస్తావించినది ఇలాంటి ప్రక్రియే అయి ఉండాలి. బహుశా ఆ కాలంలో శాసనాల మీద నేరుగా ఇలాంటి లేపనాన్ని పూసేవారేమో, వాటిపై వ్రాతలు స్పష్టంగా కనిపించేందుకు. మన్మథుడు రాత్రి సమయంలోనే కదా విజయయాత్ర చేస్తాడు. అంచేత అతని విజయాన్ని చాటిచెప్పేవి నక్షత్రాలే. నక్షత్రాలు దట్టమైన చీకట్లో మరింతగా మెరుస్తాయి. అంచేత చుక్కల రాతలు మరింత స్పష్టంగా కనిపించడానికి పూసిన మసిపూతలా చీకటి ఉందని తిమ్మనగారి కల్పన. ఈ కవిగారి కల్పనాశక్తికి హద్దూ ఆపూ ఉందా అనిపించడం లేదూ!

చీకటి మరింత చిక్కబడింది. మన్మథుడు వచ్చాడు కాబట్టి వారవనితలూ జారవనితలూ కూడా వచ్చి చేరారు! కవిగారి చమత్కారం చూడండి. ‘వృద్ధ వారవిలాసినీ విసరమునకు అపలితంకరణ ఔషధంబు అనగ’ ఉందట చీకటి. పలితకేశం అంటే నెరిసిన జుట్టు. పలితంకరణం అంటే జుట్టు పండిపోవడం. అపలితంకరణం అంటే కేశాలకు నల్లదనం రావడం. అపలితంకరణ ఔషధం అంటే, అలా నల్లబడేందుకు వాడే మందు, అంటే ఇప్పటి భాషలో hair dye. ఇది ఎప్పటినుండో ఉందన్న మాట! చీకటి – జుత్తుకు పూసుకునే నల్లరంగులా ఉందంటున్నాడు కవి. ఎవరికి యీ నల్లరంగు? వృద్ధ వారవిలాసినీ విసరమునకు. అంటే వయసు పైబడుతున్న వేశ్యల సమూహానికి (వృద్ధలవుతున్నా వారి విలాసాలు తగ్గలేదు కాబోలు!). వారి నెరసిన కురులూ పైబడే వయసూ విటులకు కనిపించకుండా చీకటి అలుముకుందని భావం. వారవనితలకు అలా ఉపయోగపడిన అంధకారం, జారవనితలకు మరో విధంగా ఉపయోగపడింది. రాత్రి రహస్యంగా తమ ప్రియులను కలవడానికి సంకేత స్థలాలకు వెళ్ళే జార నలినముఖులకు అదృశ్యాంజనంలా పని చేసిందట చీకటి. వశీకరణ, మాయం కావడం, దూరదృష్టి – ఇలాంటి రకరకాల శక్తులు మంత్రించిన కాటుకతో (దీన్నే అంజనం అంటారు) వచ్చేవని కథలు. చీకటి అలాంటి అదృశ్యాంజనంలా పనిచేస్తోందట. చీకటిని కాటుకగా, మంత్రకజ్జలంగా పోల్చడం ప్రాచీన ఆధునిక కవిత్వంలో చాలాచోట్ల కనిపిస్తుంది. ప్రాచీన కవిత్వంలో అది యిలా ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం ఉపయోగపడితే, ఆధునిక కవిత్వంలో మార్మికత కోసం ప్రయోగించబడింది. రహస్యంగా ప్రియలను కలవడానికి సంకేతస్థలాలకు వెళ్ళే శృంగారనాయికలను అభిసారికలు అంటారు. వీరిలో రెండు రకాలు. తెల్లచీర గట్టుకొని, మల్లెపూలు పెట్టుకొని, తెల్లని వెన్నెల్లో కలిసిపోయి వెళ్ళేవారు జ్యోత్స్నాభిసారికలు. నల్లని చీర కట్టుకొని, కాటుక పెట్టుకొని, జుత్తు విరబూసుకొని చీకట్లో కలిసిపోయి రహస్యస్థలాలని చేరుకొనేవారు తమోభిసారికలు. అలాంటి తమోభిసారికలకు చీకటి అదృశ్యాంజనమే.

అదీ నంది తిమ్మనగారి తమోవర్ణనం. పురాణకథా ప్రస్తావన, సూక్ష్మదృష్టి, అద్భుతావహమైన ఉత్ప్రేక్ష, శృంగారపరమైన పోలికలు – యివన్నీ ప్రబంధ వర్ణనలలో కనిపించే రకరకాల అంశాలు. అవన్నీ ఒకే పద్యంలో మనకిక్కడ దర్శనమిస్తాయి. నంది తిమ్మనగారి వర్ణనానైపుణ్యానికి అవధి లేదు. ఎంత సున్నితంగా ఉంటాయో అంత విపరీతంగానూ ఉంటాయి. చంద్రుణ్ణి – కలువపూల చక్కలిగింత అని చెప్పగలడు, ‘చరమాద్రి దావాగ్ని సంప్లుష్ట సురసారభేయీ కరీషైక పిండము’ అనీ అనగలడు!