సమస్త సిద్ధాంతం అవసరమా?

ఉపోద్ఘాతం

ఈ విశ్వం యొక్క పుట్టుక, ఆకారం, జీవన సరళి, గిట్టుక, మొదలైన ప్రగాఢమైన విషయాలని తెలుగుతో కుస్తీపట్టటం అంటే పిల్లి తల గొరగటమే అని నన్ను ఆక్షేపించేవారు ఉన్నప్పటికీ, నేను ఇవే విషయాలు పదే పదే రాయటానికి కారణం ఉంది. నాకు కవితలు, కవిత్వాలు అల్లటం చేత కాదు. సంస్కృత శ్లోకాలని ఉదహరిస్తూ వ్యాసాలు రాయలేను. రాజకీయాలు, క్రికెట్, సినిమాలు నాకు బోధ పడవు. నాది ఏక దిశాత్మకమైన అభిరుచి. కాలక్షేపానికి ఏదో ఒక పని చెయ్యాలి కదా. పోనీ ఏ పొరుగింటి పిల్లినో పట్టుకుందామని ప్రయత్నిస్తే అది ‘పర్రు’ మనేసరికి నాకు భయం వేసింది. కనుక ఈ పని చేస్తున్నాను.

ఆ మధ్య, అంటే, దరిదాపు ఇరవై ఏళ్ల క్రితం, భారత దేశంలోని ఉన్నత పాఠశాల విద్యార్థి ఒకడు నాకు నాలుగు అర టావుల ఉత్తరం రాసేడు. మనకి తెలిసిన భౌతికశాస్త్రంలోని సూత్రాలన్నిటిని రంగరించి, అంతా ఒకే ఒక సూత్రంలో ఇమిడ్చేడుట! చూడటానికి చాల క్లిష్టంగా ఉందా గణిత సమీకరణం. అందులోని స్థిరాంకాలకి, చలన రాశులకి, రకరకాల విలువలు ఆపాదిస్తూ ఆ ఒక్క సమీకరణం నుండీ నాకు పరిచయం ఉన్న అనేక సూత్రాలని వెలికి తీసి చూపించేడు. నేను కూడ ఒక రామానుజన్‌ని ఆవిష్కరించబోతున్నానేమో అన్న ఆశతో ఆ కాగితాలని నా పక్క గదిలో ఉన్న మరొక భౌతిక శాస్త్ర ఆచార్యుడికి చూపించేను. నా చేతిలో ఉన్న కాగితాలు అందుకుని ఆయన విరగబడి నవ్వలేదు కాని తన బీరువాలోంచి ఒక పుస్తకం తీసి, ‘ఇది చదువు’ అని ఇచ్చేరు.

సిద్ధాంతాలు

ఈ చర్చ మొదలు పెట్టేముందు విజ్ఞాన శాస్త్రంలో సిద్ధాంతాల పాత్ర అర్థం చేసుకోవాలి. శాస్త్రీయ పరిభాషలో ‘సిద్ధాంతం’ అనేది ఒక నమూనా. నిజం అంతా మన అవగాహనలోకి రానప్పుడు, మనకి అర్థమైన మేరకే కొన్ని నిబంధనలని పాటిస్తూ నమూనా నిర్మించుకుంటాం. ఈ నమూనాకి భౌతికమైన అస్తిత్వం లేదు; అది స్వకపోల కల్పితం. సిద్ధాంతాలనేవి కేవలం మన ఊహాప్రపంచంలో కట్టుకున్న మేడలు. నమూనాలు, సిద్ధాంతాలు ఎన్నయినా నిర్మించుకోవచ్చు. వీటిల్లో కొన్ని నాసి రకం సిద్ధాంతాలు ఉంటాయి, కొన్ని మేలు రకం సిద్ధాంతాలు ఉంటాయి. శ్రేష్టమైన సిద్ధాంతాలకి కొన్ని మౌలికమైన లక్షణాలు ఉంటాయి. ఒకటి – సిద్ధాంతం తికమకలు లేకుండా, సరళంగా, అనవసరమైన స్థిరాంకాలు లేకుండా ఉండాలి; రెండు – మనం ప్రయోగాలలో గమనించే దృగ్విషయాలకి సిద్ధాంతాలు అనుగుణంగా ఉండాలి. అంటే, ప్రయోగ ఫలితానికే పై చెయ్యి. మూడు, ఒక సిద్ధాంతం భవిష్యత్తు గురించి తీర్మానం చేసినప్పుడు, ఆ తీర్మానం ప్రయోగం ద్వారా రుజువు చెయ్యటానికి అవకాశం ఉండాలి. అంటే సిద్ధాంత సౌధాలకి ప్రయోగాలు పునాదులుగా ఉండాలి.

ఉదాహరణకి, ఎంపెడక్లీస్ (Empedocles) సృష్టి అంతా భూమి, నీరు, గాలి, అగ్ని అనే నాలుగు భూతాలతో నిర్మించబడిందని లేవదీసిన ఒక సిద్ధాంతాన్ని గ్రీకు తత్త్వవేత్త అరిస్టాటిల్ (Aristotle) పరిపూర్ణంగా నమ్మేడు. ఈ సిద్ధాంతంలో క్లిష్టత లేదు; సులభంగా అర్థం అవుతుంది. కాని ఈ సిద్ధాంతం తీరుకీ, ప్రయోగాల తీరుకి మధ్య పొంతన కుదరలేదు. అంతే కాకుండా ఈ సిద్ధాంతం భవిష్యత్తు గురించి ఏ అంచనాలు వెయ్యలేకపోయింది. న్యూటన్ (Isaac Newton) లేవదీసిన గురుత్వాకర్షణ సిద్ధాంతం దీని కంటె మెరుగైనది. న్యూటన్ సిద్ధాంతం ప్రకారం వస్తువులు ఒకదానిని మరొకటి ఆకర్షించుకుంటాయి. ఎలా? ఆ ఆకర్షణ బలం ఆయా వస్తువుల గరిమ మీద అనులోమ అనుపాతంలోనూ, ఆ వస్తువుల మధ్య ఉన్న దూరపు వర్గుకి (distance squared) విలోమ అనుపాతంలోనూ ఆకర్షించుకుంటాయి. ఈ విషయాన్ని గణిత సమీకరణంలా రాయటానికి ఒకే ఒక అనుపాత స్థిరాంకం వాడితే సరిపోతుంది. అంతే. ఈ సూత్రాన్ని పట్టుకుని సాగదీసి ఈ భూమి మీద చలన ధర్మాలని నిర్ణయించవచ్చు, ఆకాశంలో గ్రహ గమనాలని నిర్దేశించవచ్చు, గ్రహణాల పట్టువిడుపులు ఏయేవేళలలో జరుగుతాయో లెక్కకట్టి చూపవచ్చు, తోకచుక్కలు ఎప్పుడు కనబడతాయో జోస్యం చెప్పవచ్చు. సిద్ధాంతపరంగా చెప్పినవన్నీ నిజమేనని ప్రయోగాల ద్వారా నిర్ధారించవచ్చు.

ఏ భౌతిక సిద్ధాంతమూ శాశ్వతం కాదు. సిద్ధాంతాలు ప్రతిపాదనలు మాత్రమే. అవి చెల్లినన్నాళ్లు చెల్లుతాయి. ఆ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ప్రయోగ ఫలితం కనబడిననాడు ఆ సిద్ధాంతం వీగిపోతుంది. అంటే ఏమిటన్న మాట? ఒక సిద్ధాంతం నిజమని మనం ఎప్పుడూ రుజువు చెయ్యలేము, కాని ఆ సిద్ధాంతం తప్పని రుజువు చెయ్యగలం. కనుక నమూనాలకి, సిద్ధాంతాలకి కూడ పుట్టుక, జీవితం, గిట్టుక ఉంటాయి. ఎంపెడక్లీస్ లేవదీసిన చతుర్భూత సిద్ధాంతం 2,000 సంవత్సరాలు ఎదురులేకుండా బతికింది – న్యూటన్ దానిని కూలదోసే దాకా. న్యూటన్ లేవదీసిన గురుత్వాకర్షణ సిద్ధాంతం 300 ఏళ్లపాటు రాజ్యం ఏలింది – ఐన్‌స్టైన్ (Albert Einstein) వచ్చి దానిని సవరించే దాకా. న్యూటన్ తరువాత ఎంపెడక్లీస్, అరిస్టాటిల్ ప్రభృతుల సిద్ధాంతాలు నామరూపాలు లేకుండా కాలగర్భంలో కలిసిపోయాయి. కాని ఐన్‌స్టైన్ ఎన్ని సవరింపులు చేసినా న్యూటన్ సిద్ధాంతాలు పూర్తిగా నశించిపోలేదు. ఎందువల్ల? మన దైనందిన కార్యక్రమాలలో న్యూటన్ సిద్ధాంతాలు చాలు. అవి అర్థం చేసుకోవటం తేలిక. వాటిని వాడటం తేలిక. కళాశాలలో చదువుకునే విద్యార్థులు కూడ అర్థం చేసుకుని వాడగలరు. కనుక ప్రతి చిన్న విషయానికీ ఐన్‌స్టైన్ అక్కరలేదు; గోటితో మీటగలిగేవాటికి గొడ్డలి ఎందుకు?

మరి అయితే ఐన్‌స్టైన్ సవరింపులు ఎప్పుడు అవసరమవుతాయి? విపరీతమైన గరిమ గల నక్షత్రాలు, క్షీరసాగరాలు, కాంతి వేగంతో తులతూగే పరమాణు రేణువులు మన నమూనాలో ఇరకవలసి వచ్చినప్పుడు న్యూటన్ సిద్ధాంతం పని చెయ్యదు. అప్పుడు ఐన్‌స్టైన్ కావాలి. విశ్వవిద్యాలయపు స్థాయికి చేరుకుంటే కాని ఐన్‌స్టైన్ అర్థం కాడు. అవన్నీ సంక్లిష్టమైన భావాలు, అదంతా సంక్లిష్టమైన గణితం.

పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఈ విశ్వంలో ఉన్న ప్రతి పదార్థాన్ని, ప్రతి బలాన్ని, ప్రతి ప్రవర్తనని ఒకే ఒక సిద్ధాంతంలో ఇమడ్చగలిగితే, ఒకే ఒక సూత్రంతో వర్ణించగలిగితే అదొక అందం. ముందస్తుగా, కాలగమనంతో పాటు ఈ విశ్వం ఎలా పరిణతి చెందుతోందో చెప్పే సిద్ధాంతాలు ఉన్నాయి. అవి ఈ రోజు ఈ విశ్వం ఎలాగుందో చెప్పగలిగితే రేపు ఈ విశ్వం ఎలాగుంటుందో చెప్పగలవు. రేపేమిటి? బిలియను సంవత్సరాల తరువాత ఈ విశ్వం ఎలా ఉంటుందో చెప్పగలవు ఈ సిద్ధాంతాలు. కాని, మొదట్లో ఈ విశ్వం ఎక్కడి నుండి వచ్చింది? ఎలా వచ్చింది? ఈ విశ్వం యొక్క ప్రాదుర్భావానికి కారకులు ఎవ్వరు? మొదలైన ప్రశ్నలకి తాత్త్వికులు సమాధానాలు చెప్పాలి కాని శాస్త్రవేత్తలు కాదు. తాత్త్వికులని అడిగితే వారేమంటారు? ఈ విశ్వాన్ని సర్వశక్తి సంపన్నుడైన భగవంతుడు సృష్టించేడు అంటారు. కావచ్చుగాక! ఇదంతా ఆ భగవంతుడి లీల అయినప్పటికీ ఈ లీల అసంబద్ధంగా కాకుండా చాల క్రమబద్ధంగా, నియమబద్ధంగా ఉన్నట్లు కనబడుతోంది కదా.

నీళ్లు పల్లమెరుగుతున్నాయి. వేడి వస్తువులు చల్లారుతున్నాయి. గ్రహాలు గతులు తప్పకుండా సంచరిస్తున్నాయి. దేవుడు ఈ సృష్టిని ఒక క్రమమైన పద్ధతిలోనే నడిపిస్తూన్నట్లు అనిపిస్తోంది కదా. కనుక దేవుడనేవాడు ఈ సృష్టిని జరిపినా ఆయన ఏదో ఆషామాషీగా చేసేసి ఉండడు; ఏదో ఒక క్రమ పద్ధతిలోనే చేసి ఉంటాడు. ఆ పద్ధతి ఏదో ఒకటి అయితే బాగుంటుంది కాని, పదిహేను పద్ధతులు, పాతిక మినహాయింపులు, పరక స్థిరాంకాలు ఉంటే అది దేవుడు చేసిన పనిలా ఉండదు, ఏదో కమిటీ చేసిన పనిలా ఉంటుంది.

ఒకే సిద్ధాంతం ఉండటంలో అందం

దేశానికి ఒక ప్రధాన మంత్రి ఉంటే బాగుంటుంది కాని దేశంలో ఉన్న కులాలు అన్నీ, ‘ఎవరి కులం వారి ప్రధాన మంత్రి వారికే’ అంటూ, కులానికొక ప్రధాన మంత్రి కావాలంటే ఏమి సబబు? అలాగే ఈ భౌతిక ప్రపంచంలో మనకి ద్యోతకమయే దృగ్విషయాలని అన్నిటిని ఒకే ఒక సిద్ధాంతంతో అభివర్ణించగలిగితే బాగుంటుందనేది శాస్త్రవేత్తల చిరకాల వాంఛ. దేవుడు అనేవాడు వివిధ రూపాలలో, అనేక పేర్లతో ఉన్నా దేవుడొక్కడే అనే సిద్ధాంతం కూడ ఇలాంటిదే.

భౌతిక శాస్త్రంలో ఈ భిన్నత్వంలో ఏకత్వం ఎలా సాధించేమో చిన్న ఉదాహరణతో మొదలు పెడతాను. మన పూర్వులు చలనం అనే దృగ్విషయాన్ని, వేడి అనే దృగ్విషయాన్ని గమనించేరు. చలనం, వేడి వేర్వేరు దృగ్విషయాలు అనుకున్నారు. నూటన్ చలన సూత్రాలు బహుళ జనాదరణ పొందిన తరువాత, ఒక వస్తువులోని బణువుల (molecule) చలనమే వేడిలా మనకి అనిపిస్తుందని అర్థం అయింది. అంటే చలనం, వేడి ఒకే దృగ్విషయానికి వివిధమైన బహిర్గత రూపాలు అని తెలిసింది. ఇదే విధంగా, శబ్దం అనే దృగ్విషయానికి కూడ బణువుల చలనమే కారణం అని అర్థం అయింది. ఇలా మన అనుభవ పరిధిలో ఉన్న ఎన్నో విషయాలని న్యూటన్ చలన సూత్రాలతో అర్థం చేసుకోవచ్చని తేలింది. కానీ, గురుత్వాకర్షణ అనే దృగ్విషయాన్ని చలన సూత్రాల ద్వారా అర్థం చేసుకోవటం సాధ్యం కాలేదు.

ఈ భౌతిక ప్రపంచంలో చలనం, శబ్దం, వేడి – ఇవే కాకుండా ఇంకో కోవకి చెందిన దృగ్విషయాలు ఉన్నాయి. వాటిని విద్యుత్‌తత్త్వం, అయస్కాంతతత్త్వం అందాం. ఆకాశంలో మెరిసే మెరుపు విద్యుత్‌తత్త్త్వానికి ఉదాహరణ. సూదంటురాయి ఎల్లప్పుడూ ఉత్తర ధ్రువం వైపు చూపటం అయస్కాంతతత్త్వానికి ఉదాహరణ. సా. శ. 1873లో మేక్స్‌వెల్ (James C Maxwell) ఈ రెండూ నిజానికి ఒకటేనని నిరూపించి దానికి విద్యుదయస్కాంత తత్త్వం (Electromagnetism) అని పేరు పెట్టేడు. ఇంతటితో భౌతిక శాస్త్రం మూడు సిద్ధాంతాల ముక్కాలి పీట మీద నిలబడింది: ఒకటి – న్యూటన్ చలన సూత్రాలు; రెండు – న్యూటన్ గురుత్వాకర్షణ సూత్రం; మూడు – మేక్స్‌వెల్ విద్యుదయస్కాంత సూత్రాలు.

పదార్థం అంటే ఏమిటి? అన్న ప్రశ్నకి సమాధానంగా సా. శ. 1900లో మరొక సూత్రం బయట పడింది. ఒక అణువులో ఉన్న ఎలక్ట్రానుల చలనం న్యూటన్ చలన సూత్రాలకి కట్టుబడి ఉండవనిన్నీ, అణుగర్భంలో ఉన్న ప్రక్రియలని వర్ణించటానికి కొత్త సిద్ధాంతం అవసరమనిన్నీ గుళిక సిద్ధాంతం (Quantum theory) రుజువు చేసింది. అంతే కాకుండా రెండు ఉదజని అణువులు, ఒక ఆమ్లజని అణువు సంయోగం చెంది నీటి బణువుగా ఎందుకు మారుతుందో ఈ కొత్త గుళిక సిద్ధాంతం వివరణ ఇచ్చింది. ఇచ్చి రసాయన శాస్త్రానికి పునాదులు దిట్టం చేసింది. కాని, ఇంకా వివరించవలసిన దృగ్విషయాలు ఉండిపోయాయి. ఉదాహరణకి ఒక ఎలక్ట్రాను మీద కాంతి పడ్డప్పుడు జరిగే సంకర్షణల సంగతి ఏమిటి? కాంతి అన్నా విద్యుదయస్కాంత తరంగాలు అన్నా ఒకటే కనుక విద్యుదయస్కాంత తరంగాలు ఎలక్ట్రాను మీద పడ్డప్పుడు జరిగే ప్రక్రియలని వర్ణించటం ఎలా? ఈ పని జరగాలంటే గుళిక శాస్త్రానికీ, మేక్స్‌వెల్ సూత్రాలకీ మధ్య పెళ్లి జరగాలి. దీనినే గుళికీకరించిన విద్యుదయస్కాంత సిద్ధాంతం అంటారు. అనాలి. కాని మన కర్మ కాలి దానికి ఇంగ్లీషులో, క్వాంటమ్ ఎలక్ట్రోడైనమిక్స్ (Quantum electrodynamics, QED) అని పేరు పెట్టేరు.

మొదట్లో ఈ సిద్ధాంతం కూడ బాలారిష్టాలని ఎదుర్కొంది. ఈ బాలారిష్టాలేమిటో కూలంకషంగా చర్చించటం చాల కష్టం. ఈ సమస్య మౌలికంగా చాల క్లిష్టమైనది. గణితంలోను, భౌతిక శాస్త్రంలోను పాండిత్యం ఉండి, నోబెల్ బహుమానాలు అందుకున్న హేమాహేమీలకే ఈ సమస్య ఏమిటో అర్థం అయి, పరిష్కార మార్గాలు దొరికేసరికి 20 సంవత్సరాలు పట్టింది. అటువంటి సమస్యని, దాన్ని పరిష్కరించే విధానాన్ని అందరికీ అర్థం అయేటట్లు -– అందులోనూ తెలుగులో — చెప్పటం చాల కష్టం. అయినా ప్రయత్నిస్తాను. నేను ఇచ్చే వివరణ, ఉపమానాలు సమస్యని అర్థం చేసుకోటానికి –- చంద్రశాఖాన్యాయంలా — మార్గదర్శకాలే కాని యదార్థ స్థితిగతులని వర్ణించటానికి కాదు. నేను ఇక్కడ చేసే ప్రయత్నం మునిగిపోతున్నవాడికి గడ్డి పరక అందించిన చందం అనుకొండి.

రెండు వస్తువుల మధ్య ఉండే ఆకర్షక శక్తి ఆయా వస్తువుల భారాలు పెరుగుతూన్న కొద్దీ పెరుగుతుంది, వాటి మధ్య దూరం పెరుగుతూన్న కొద్దీ తగ్గుతుంది. ఈ విషయాన్ని ఒక గణిత సమీకరణంగా రాసినప్పుడు అదొక భిన్నంలా కనిపిస్తుంది; లవంలో ఆ వస్తువుల గరిమలు, హారంలో వాటి మధ్య ఉండే దూరం యొక్క వర్గు ఉంటాయి. ఇప్పుడు ఈ వస్తువులని దగ్గరగా జరుపుకుంటూ వస్తే వాటి మధ్య దూరం తగ్గుతుంది కనుక, హారం విలువ తగ్గి భిన్నం విలువ పెరుగుతుంది. ఈ రెండు వస్తువులు ఒకదానిని మరొకటి ఢీకొన్నప్పుడు వాటి మధ్య దూరం సున్నకి చేరుకుంటే, ఆ భిన్నం విలువ అనంతం (infinity) అయిపోతుంది. లెక్కలలో కాని, భౌతిక శాస్త్రంలో కాని ఎంత పెద్ద సంఖ్యనయినా భరించగలం కాని ‘అనంతం’ వస్తే భరించలేము. అప్పుడు ఆ లెక్క ‘చేసేవాడి ముఖం మీద పేలిపోయింది’ అంటాం.

ఇటువంటి పరిస్థితి నుండి తప్పించుకోటానికి గణితంలో రకరకాల చిటకాలు వాడతారు. మౌలికంగా ఈ చిటకాలు అన్నీ చేసే పని ఒకటే, కళ్లు కప్పి మోసం చెయ్యటం! కాని మోసం అన్నా, కనికట్టు అన్నా మర్యాదగా ఉండదని వాటికి రకరకాల పేర్లు పెట్టి సమర్ధించుకుంటారు. ఈ పేర్లలో తరచుగా వినబడేవి నార్మలైజేషన్, రెగ్యులరైజేషన్ అనే మాటలు. పేలిపోతూన్న లెక్కని పేలిపోకుండా ఆపే ప్రయత్నాలు ఇవన్నీ. ఈ రకం మోసపు పద్ధతిని మనం తెలుగులో కిట్టించటం అంటాం. కళ్లు మూసుకుని పిల్లి పాలు తాగినట్లు లెక్కని ఇలా కిట్టిస్తే సిద్ధాంతం చెప్పే జోస్యానికి, ప్రయోగాల ఫలితాలకి మధ్య పొంతన కుదురుతోంది. లేకపోతే సిద్ధాంతం దారి సిద్ధాంతానిది, ప్రయోగం దారి ప్రయోగానిది. దీనికీ, మాంత్రికుడు చేసే మోసానికీ తేడా ఏమిటి? నిజానికి ఇలా మోసం చెయ్యటం మనస్పూర్తిగా మనకి ఇష్టం లేకపోయినా ఈ పద్ధతితో చేసిన లెక్కలతో నిర్మించిన సిద్ధాంతమే సరి అయినదని ప్రయోగాలు ఘోషిస్తున్నాయి. భౌతిక శాస్త్రపు భవనాలు ప్రయోగాలు అనే పునాదుల మీద లేవాలి కనుక అయిష్టంగానే అందరూ ఈ కిట్టింపు పద్ధతిని వాడటం మొదలు పెట్టేరు. సా. శ. 1900 ప్రాంతాలలో మింగుడు పడని గుళిక సిద్ధాంతాన్ని ఔషధం గుళిక మింగినట్లు ఎలా మింగేరో అలాగే ఈ కిట్టింపు పద్ధతిని మింగి శాస్త్రవేత్తలు ఎంతో ప్రగతి సాధించేరు.

వీటన్నిటినీ అధిగమించి ఈ సిద్ధాంతాన్ని ఒక దరికి చేర్చేసరికి తల ప్రాణం తోకకి వచ్చింది. సిద్ధాంతం వీగిపోకుండా నిలదొక్కుకుంది. ఎంత బాగా నిలదొక్కుకుందంటే -– ఒక్క గురుత్వాకర్షణని మినహాయిస్తే -– ఈ సిద్ధాంతానికి లొంగని భౌతిక ప్రక్రియ లేదంటే అది అతిశయోక్తి కాదు. అంటే, సమస్తాన్ని వర్ణించి చెప్పటానికి చివరికి రెండు సిద్ధాంతాలు మిగిలేయి. ఒకటి కాకపోయిన తరువాత రెండయితేనేమిటి? పదహారయితేనేమిటి? ప్రస్తుతం పరిస్థితి ఇలా ఉంది.

రెండు సిద్ధాంతాలు ఉంటే నష్టమేమిటి?

సృష్టి అంతటికీ ఒకే ఒక సిద్ధాంతం కావాలని మంకు పట్టు పట్టటంలోనూ విజ్ఞత లేదు. తల్లి గర్భంలోని పిల్ల భూపతనం అయినది మొదలు భవిష్యత్తు ఎలా ఉంటుందో జాతకం రాయగలం. కాని, భూపతనానికి ముందు ఏమి జరిగిందో చెప్పటానికి ఈ జాతకం పనిచెయ్యకపోవచ్చు. జనన ఘడియల తరువాత వర్తించే జాతక సిద్ధాంతం పిండానికి వర్తించాలని ఏముంది? రెండింటికి ఒకే సిద్ధాంతం ఉంటే బాగానే ఉండొచ్చు. అలా లేకపోయినంత మాత్రాన వచ్చే నష్టం కూడ ఏమీ లేదు.

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే విశ్వాన్నంతటినీ, సర్వకాల సర్వావస్థలకీ సరిపోయే విధంగా ఒకే ఒక సమస్త సిద్ధాంతంతో వర్ణించటం సుసాధ్యం కాదేమో. అటువంటి బృహత్ ప్రయత్నానికి బదులు విశ్వం యొక్క జీవిత కాలాన్ని దశల వారీగా విడగొట్టి ఏ దశకి నప్పిన విధంగా, విడివిడిగా, పిల్ల సిద్ధాంతాలని నిర్మించుకోవచ్చు కదా. చూడండి, పిల్లల రోగాలకో వైద్యుడు, ఆడవాళ్ల రోగాలకి మరొక వైద్యుడు, కంటి రోగాలకి మరొకడు ఉన్నట్లే అణుప్రమాణంలో ఉన్న విశ్వానికో సిద్ధాంతం, క్షీరసాగరాల ప్రమాణంలో ఉన్న విశ్వానికి మరొక సిద్ధాంతం, పుట్టిన తరువాత పెరుగుదలకి ఒక సిద్ధాంతం, పుట్టకపూర్వం పరిస్థితికి ఇంకొక సిద్ధాంతం –- ఇలా ఒక క్లిష్టమైన సమస్యని ముక్కలుగా చేసి అధ్యయనం చెయ్యవచ్చు. ఉదాహరణకి సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరిగే కక్ష్యని నిర్ణయించటానికి ఆయా నభోమూర్తుల గరిమలు, వాటి మధ్య ఉండే దూరాలు తెలిస్తే చాలు; సూర్యుడికి ఆ వెలుగు, వేడి ఎక్కడనుండి వచ్చేయి, గ్రహగర్భంలో జరిగే చైతన్య ప్రక్రియలు ఏమిటి మొదలైన విషయాల ప్రసక్తి అనవసరం.

ఈ కోణంతో ఆలోచించి, ఎలాగో ఒకలాగ సరిపెట్టుకుందామా అంటే అదీ వీలయేటట్లు లేదు. ఎందుకంటే, ఈ రోజుల్లో విశ్వాన్ని వర్ణించటానికి స్థూలంగా రెండు అసంపూర్ణమైన సిద్ధాంతాలు ఉన్నాయి: సాధారణ సాపేక్ష సిద్ధాంతం (Theory of General Relativity), గుళిక సిద్ధాంతం (Quantum Theory). సాధారణ సాపేక్ష సిద్ధాంతం గురుత్వాకర్షణ బలం అంటే ఏమిటో, భారీ ఎత్తున విశ్వం కట్టడి, లక్షణాలు ఎలా ఉంటాయో చెబుతుంది. ‘భారీ ఎత్తున’ అంటే ఈ సిద్ధాంతంలో దూరాలు ఒక కిలోమీటరు నుండి 10E+24 (అంటే, 1 తరువాత 24 సున్నలు) కిలోమీటర్లు వరకు ఉండొచ్చు. స్థూలంగా విచారిస్తే ఈ సిద్ధాంతంలో లొసుగులు లేవు. పోతే, గుళిక సిద్ధాంతం అణుప్రమాణంలో పని చేస్తుంది. అంటే, ఈ సిద్ధాంతంలో దూరాలు మీటరులో ట్రిలియనో వంతు ప్రమాణంలో ఉంటాయి. ట్రిలియను ఊహించుకోవటం కష్టం కనుక, గుళిక సిద్ధాంతం అణుప్రమాణపు పరిధిలోనే పనిచేస్తుందని చెప్పి ఊరుకుంటాను. ఈ సిద్ధాంతంలోను లొసుగులు లేవు. ఈ సిద్ధాంతం ఎంత జయప్రదం అయిందంటే, ఈ సిద్ధాంతం వల్లనే ట్రాన్సిస్టర్లు, కంప్యూటర్లు, లేౙర్లు, మొదలైన పరికరాలు నిర్మించటానికి వీలు పడింది.

దురదృష్టవశాత్తు ఈ రెండు సిద్ధాంతాలకీ మధ్య పొత్తు, పొంతనలు కుదరటం లేదు. ఈ రెండు సిద్ధాంతాలు ఒకే సారి నిజం కావటానికి వీలు లేదు. ఈ రెండు సిద్ధాంతాలని సంధానపరచి, మరొక సరికొత్త ఉమ్మడి సిద్ధాంతం లేవదియ్యవలసిన అవసరం ఎంతయినా ఉంది. ఈ ఉమ్మడి సిద్ధాంతానికి పేరు కూడ పెట్టేరు: గుళిక గురుత్వ సిద్ధాంతం లేదా గుళికీకరించబడ్డ గురుత్వ సిద్ధాంతం (క్వాంటమ్ థియరీ ఆఫ్ గ్రేవిటీ, Quantum Theory of Gravity). ఇటువంటి సిద్ధాంతం ప్రస్తుతం మన దగ్గర లేదు. ఉంటే బాగుండుననే కోరిక ఉంది. ఇటువంటి గుళిక గురుత్వ సిద్ధాంతానికి ఉండవలసిన హంగులు ఏమిటో మనకి స్థూలంగా తెలుసు. అటువంటి సిద్ధాంతం మనం నిర్మించగలిగితే దానివల్ల మనకి సమకూరే లాభాల జాబితా కూడ మన దగ్గర ఉంది. పెళ్లికి అంతా సిద్ధం; పెళ్లికూతురు దొరకడమే తరవాయి! అన్నట్లు ఉంది పరిస్థితి.

ఈ సమస్త సిద్ధాంతం దొరికిందని అనుకుందాం. అప్పుడు ఆ సిద్ధాంతం సమస్తాన్నీ వర్ణించి చెప్పగలగాలి. సమస్తమూ భవిష్యత్తులో ఎలా ప్రవర్తిస్తుందో చెప్పగలగాలి. ఆ సమస్తంలో మనమూ ఒక భాగమే. కనుక సమస్త సిద్ధాంతం అంటూ ఒకటి ఉంటే గింటే అది మన ప్రవర్తనని కూడా చెప్పగలుగుతుంది. అంటే, ఆ సమస్త సిద్ధాంతాన్నీ నిర్మించగలిగే తాహతు మనకి ఉందో లేదో అన్న మీమాంశకి సమాధానం ఆ సిద్ధాంతమే చెప్పాలి.

ఈ చక్రీయ తర్కం ఎలాగుందంటే — నా చిన్నతనంలో జరిగిన సంఘటన చెబుతాను. నేను అమెరికా చదువుకుందుకు వెళ్లిన కొత్తలోనే నాకు కంప్యూటర్లతో పరిచయం అయింది. ఆ కంప్యూటర్లు ఉపయోగించి జాతకాలు రాస్తే ఎలాగుంటుందోనన్న ఊహ మెరిసింది నా మదిలో. మా నాన్నగారు జాతకాలు చెప్పటంలో దిట్ట. అందుకని ఆయనని ఆశ్రయించి జాతకాలు రాయటం నేర్పమని అడిగేను. ఆయన గడియారం మీద వేళ చూసి, వేళ్లమీద ఏవేవో లెక్కలు చేసి, “నాయనా, నీ జాతకం ప్రకారం జాతక విద్య నీకు అబ్బదు. అనవసరంగా ఇటువంటి ప్రయోగాలతో కాలయాపన చెయ్యకుండా శ్రద్ధగా నీ చదువు నువ్వు చదువుకో,” అని నిరుత్సాహ పరచేరు. అదే విధంగా ఆ సమస్త సిద్ధాంతం నిర్మించగలిగే స్తోమత మానవ జాతికి ఉందో లేదో ఆ సమస్త సిద్ధాంతమే చెప్పాలి కాబోలు!

ప్రస్తుతం మన దగ్గర, అసమగ్రంగా, అసంపూర్ణంగా ఉన్న సిద్ధాంతాలతో పబ్బం గడిచిపోతోంది. ఎడారిలో ఎండమావిలా ఊరిస్తూన్న ఆ గుళిక గురుత్వ సిద్ధాంతం లేకపోయినంత మాత్రాన్న మన మనుగడకి వచ్చే ముప్పు ఏదీ కనబడటం లేదు. అటువంటప్పుడు అంతంత డబ్బు ఖర్చు పెట్టి ఎండమావి లాంటి ఆ సమస్త సిద్ధాంతం కోసం వెతకటం భాద్యతో కూడిన పనేనా అని సంశయం రావటం సహజం. కాని అదేమి చిత్రమో! చరిత్రలో ఎక్కడ చూసినా కుతూహలం అనేది మెదడులో ప్రవేశించిన తరువాత అది కుమ్మరి పురుగులా అలా గొలుకుతూనే ఉంటుంది. సందేహం నివృత్తి అయేవరకు బుర్రలో ఆ దురద తగ్గదు, దాహం తీరదు. ఆ దాహం తీరటానికి గమ్యం చేరుకోవటం ఎంత ముఖ్యమో ఈ ప్రయాణం కూడ అంతే ముఖ్యం.

ఈ సమస్త సిద్ధాంతం కోసం అహర్నిశలూ వేట మాత్రం జరుగుతోంది. ఈ వేటలో ఎక్కువ ఆశాజనకంగా ఉన్న సిద్ధాంతాల పేర్లు పోగుల సిద్ధాంతం (string theory), పొరల సిద్ధాంతం (M-Theory). వీటి గురించి విపులంగా ఈ చిరు వ్యాసంలో చర్చించటం సాధ్యం కాదు. అది మరొక వ్యాసంలో, మరెప్పుడో!