కంద పద్యగాథ – 2

పరిచయము

ఇంతకు ముందు కంద పద్యము సంస్కృతములోని ఆర్యా లేక ప్రాకృతమునందలి గాథనుండి జనించిన తీరు, కంద పద్యములోని భేదములు, విభిన్న రీతులలో నుండు కంద పద్యములనుగుఱించి చర్చించినాను. ప్రస్తుత వ్యాసములో కంద పద్యపు నడక, సుందరమైన కందపద్యమును రచించు విధానము, కందముతో గర్భ, బంధ కవిత్వములు, కంద పద్యముతో క్రొత్త పోకడలు, కంద పద్య నిర్మాణ సూత్రములను అనుసరించి అదే విధముగా నూతన ఛందోబంధములను కల్పించు అవకాశములు మున్నగువాటిని చర్చించబోవుచున్నాను.

వివిధ గతులలో కందపద్యము

కందము చతుర్మాత్రాబద్ధమైనను, దానిని వివిధ గతులతో వ్రాయుటకు వీలగును. కంద పద్యమును త్ర్యస్ర, చతురస్ర, ఖండ, మిశ్ర గతులలో కూడ వ్రాయుటకు వీలగును. నాలుగు, ఆఱు మాత్రలతో నిండినవి తప్ప మిగిలినవి మనకు అలవాటు పడిన కందమువలె నుండదు. అయినను క్రింద ఈ గతులతో నా ఉదాహరణములను ఇచ్చుచున్నాను.

త్ర్యస్ర గతి (మూడు మాత్రలు) –
చూడఁ దలఁచినాను సకియ
పాడఁ దలఁచినాను చెలియ – పదము నొకటి నే
నాడఁ దలఁచియుంటి నతివ
నేఁడు వదల నిన్ను మగువ – నిజ మిదొకటియే.

(చూడఁ / దలఁచి/నాను / సకియ / పాడఁ /దలఁచి/నాను / చెలియ / పదము / నొకటి / నే
నాడఁ / దలఁచి/యుంటి / నతివ / నేఁడు / వదల / నిన్ను / మగువ / నిజ మి/దొకటి/యే)

ఇలా వ్రాస్తే కంద పద్యపు లక్షణములన్నియు ఉన్నను, ఇది ఉత్సాహవలె ధ్వనిస్తుంది కాని కందమువలె కాదు.

చతురస్ర గతి (నాలుగు మాత్రలు) –
మందము మందము పవనము
సుందరి వేచితి వనమునఁ – జూడగ నిన్నున్
వందల విరులను మాలగ
నందము లలరఁగ రచింతు – నప్సర నీకున్

ఖండ గతి (ఐదు మాత్రలు) –
లేచినవి భావములు నినుఁ
జూచి నిముసమున శుభమను-చు మనసు పలికెన్
వేచినది యీ మనసు నినుఁ
జూచి హరుసమున దడబడు-చుఁ బిలువఁ దలఁచెన్.

(లేచినవి / భావములు / నినుఁ జూచి / నిముసమున / శుభమనుచు / మనసు పలి/కెన్
వేచినది / యీ మనసు / నినుఁ జూచి / హరుసమున / దడబడుచుఁ / బిలువఁ దలఁ/చెన్)

ఇది నిజముగా కంద పద్యము అని అనిపించుకొనదు.

ఆఱు మాత్రలతో –
కోరికలే నేఁడు విరిసెఁ
దారకలే నేఁడు మురిసెఁ – దరళతతోడన్
జేరఁగ రా నీవు చెలియ
మారునితో మాట కలియ – మక్కువతోడన్.

దీని చదువుచున్నప్పుడు సాఫీగా కంద పద్యమువలె నున్నది.

మిశ్రగతి (మూడు, నాలుగు మాత్రలు) –
దేవి యననా వనజ నే-
త్రా వలపు విరులను గొనుము – రాతిరి యిపుడున్
భావి మనకున్ విమల గా-
త్రా వఱలు సొబగుగ నిజము – తప్పక నెపుడున్.

(దేవి యననా / వనజ నేత్రా / వలపు విరులను / గొనుము రాతిరి
భావి మనకున్ / విమల గాత్రా / వఱలు సొబగుగ / నిజము తప్పక)

సరి పాదములలోని చివరి మాత్రలు తప్పించి, మిగిలినది మత్తకోకిలవలె ధ్వనిస్తుంది కాని కందములా కాదు.

మిశ్రగతి (ఐదు, నాలుగు, మూడు మాత్రల కూడిక) –
గోపెమ్మ వెదకెఁ గృష్ణునిఁ
బాపము కనరాఁడు వెళ్లె – వాఁడెక్కడికో
కోపమ్ము మీఱ నుడివెను
నీ పనిఁ బట్టెదను చూడు – నేఁ గన్నయ్యా

దీని నడక ఒక చక్కని కంద పద్యపు నడకతో సరిపోవును.

కంద పద్యములలో పదముల విఱుపులు

కంద పద్యము చతుర్మాత్రా గణములతో నిర్మితమైనవి. కంద పద్యమును ‘నోరూరగఁ జవులు పుట్ట నుడివెడి’ విధానమును తెలిసికొనినచో అందమైన కంద పద్యములను వ్రాయ వీలగును. ఆ ప్రయత్నమే ఇప్పుడు చెప్పబోయే నా పరిశోధన. నేను శతకందసౌరభము వ్రాసేటప్పుడు, నా మొదటి ప్రతిని వారి మొదటి అభిప్రాయములకోసము శ్రీ వేలూరి వేంకటేశ్వరరావుగారికి పంపినాను. వారు దానిని చదివిన పిదప, ఒక రెండు చోటులలో పద్యముల నడక అంత సంతృప్తికరముగా లేదని చెప్పి, కంద పద్యముల నడక సుమతి శతకములోని (సుశ) పద్యాలవలె ఉంటే బాగుంటుందన్నారు. అప్పటికి ఆ నా శతకమును ముగించినను, వారి సలహా నా మెదడులో అలాగే ఉండినది. ఇప్పుడు కంద పద్యముపైన వ్రాసే వ్యాసములో దానిని పునః పరిశీలించవలయుననే కోరిక జనించినది. సుమతి శతకము మాత్రమే కాక, కవి చౌడప్ప శతకమును (చౌశ) కూడ ఈ పరిశీలనలో భాగముగా ఎన్నుకొన్నాను. ఎందుకంటే, కంద పద్యములను వ్రాయుటలో తన నేర్పునుగుఱించి తానే ఇలాగంటాడు చౌడప్ప.

ముందటి దినముల లోనం
గందమునకు సోమయాజి – ఘనుఁడందురు నేఁ
డందఱు నిను ఘనుఁ డందురు
డందురు కందమునకుఁ గుందవరపు – కవి చౌడప్పా (చౌశ-12)

అంటే తిక్కన తఱువాత కంద పద్యములను అల్లుటలో తనకు సాటి మఱెవ్వరు లేరనే ధీమా చౌడప్పకు ఉండినది.

ఈ పరిశోధనలోని ముఖ్యాంశము కంద పద్యములో ప్రతి పాదములోని పదములలోని మాత్రల సంఖ్య ఏ విధముగా ఉండునన్నదే. కందము చతుర్మాత్రలతో నిండినదైనను, అందులోని పదములు కూడ ఎల్లప్పుడు చతుర్మాత్రలతో నిండి ఉండునా లేక ఇతర విధములుగా నుండునో అన్నదే ఇందులోని కీలకము. ఇట్టి పరిశోధనను ఇతర వృత్తములకు, జాత్యుపజాతులకు కూడ చేయ వచ్చును. ఉదాహరణకు, క్రింద సుమతి శతకమునుండి ఒక పద్యము, కవి చౌడప్ప శతకమునుండి ఒక పద్యమును ఇచ్చాను. ఇందులో చౌడప్ప పద్యములో రెండవ పాదమునుండి మూడవ పాదమునకు అతివిపులత్వము (పదము చొచ్చుకొని పోవుట), మూడవ పాదమునుండి నాలుగవ పాదమునకు విపులత్వము (పదము చొచ్చుకొని పోవుట) గలదు. ఈ విపులత్వమును ‘=’ గుర్తుతో చూపినాను.

ఎప్పుడు సంపద కలిగిన (4-4-4)
నప్పుడు బంధువులు వత్తు – రది యెట్లన్నన్ (4-5-3) (2-6)
దెప్పలుగఁ జెఱువు నిండినఁ (5-3-4)
గప్పలు పదివేలు చేరుఁ – గదరా సుమతీ (4-2-3-3) (4-4) (సుశ-19)

పాండవు లిడుములఁ బడరే (4-4-4)
మాండవ్యుఁడు కొఱుతఁ బడఁడె – మహిఁ బ్రాకృత మె- (6-3-3) (2-4-2=)
వ్వండోపు మీఱి చనఁగ న- (5-3-3-1=)
ఖండితయశ కుందవరపు – కవి చౌడప్పా (3-2-3-3) (2-6) (చౌశ-72)


పట్టిక 3. చౌడప్ప కందము

ఇట్లు చేసినప్పుడు లభించిన ఫలితములను మూడవ పట్టికలో చూడ వీలగును. ఐదు మాత్రలనగా ‘రామునికి’ లాటి పంచమాత్రల పదములైనా కావచ్చును లేక ‘పనిఁ జేయు’ లాటి 2-3 మాత్రల పదముల చేరికగా కూడ నుండవచ్చును. అదే విధముగా ఆఱు మాత్రలనగా “రాగమయీ” లాటి ఒకే పదము లేక “పనిఁ జేసిన” లాటి రెండు పదముల కూడికగా నుండవచ్చును. “నిన్ను గోరి” వంటి పదములు బేసి పాదములలో ఆఱు మాత్రలుగా పరిగణించినను, సరి పాదములలో 3-3 మాత్రలుగ మాత్రమే పరిగణించబడినవి. దీనికి కారణము చర్చలో విదితమగును. ఈ పరిశోధన ఫలితములు మూడు విధములుగా విభజించబడినవి:

  1. కుఱుచ పాదములు, అనగా మొదటి, మూడవ పాదములు,
  2. నిడుద పాదములలో మొదటి 12 మాత్రలు (యతి స్థానమునకు ముందుండు గణములు),
  3. నిడుద పాదములలో చివరి 8 మాత్రలు (యతి స్థానమునకు తఱువాతి రెండు మాత్రా గణములు).

చౌడప్ప శతకములో చివరి పాదము గ్రహించబడలేదు, ఎందుకనగా ఈ శతకములోని మకుటము, కుందవరపు కవి చౌడప్పా, మొదటి 12 మాత్రలలో చివరి ఆఱు మాత్రలు కూడ (కుందవరపు). అందువలన చివరి పాదములో మొదటి ఆఱు మాత్రలలో మాత్రమే వైవిధ్యము గలదు. సుమతి శతకములో చివరి పాదములోని చివరి 8 మాత్రలను కూడ గ్రహించలేదు, ఎందుకనగా అందులో మకుటమైన – సుమతీ, నాలుగు మాత్రల పదము, దానికి ముందున్న పదము కూడ తప్పక నాలుగు మాత్రల పదముగా నుండవలయును. ఈ ఉపోద్ఘాతముతో ఫలితములను ఇప్పుడు పరిశీలిద్దామా?