గూడు

వొరే ఎంగటేశా
యాడుండాడ్రా మీ నాయన?
సారాయంగిడిలో ఉండాడేమో
బిన్నే పోయి తొడుకోన్రారా
ఇల్లు కొట్టేస్తా ఉండారు
బిగుసుకుని నిల్చుకోండారు
పెంకులు ఇప్పతా ఉండారని
పరుగిత్తుకొని బోయి పిల్సుకొనిరా

కూడు – కవి వైరముత్తు స్వరంలో

సాములూ సాములూ
గవర్మింట్టు సాములూ
సాలెగూడు తెంపేదానికి
చీటీ తీసుకొచ్చినేరా?
చీమని నలిపేదానికి
జీపెక్కొచ్చినేరా?
ఆరుగెజాలిల్లు కూలగొట్టను
ఆర్డరు తీసుకొచ్చినేరా?

మేక పొదుగుల్నుంచి
ఇసం కారినట్టు కలొచ్చింది
వంకనిండా నెత్తురు
పారతన్నట్టు కలొచ్చింది
ఏం బొయ్యే కాలమో
కల నిజిఁవైంది గద సాములూ
పిచిక గూటిమింద
పిడుగొచ్చి పడింది గదా సాములూ

కట్టెపుల్ల లేరుకున్రాను పొయినోడు
పెద్దోడు ఇంకా రాలేదు
బడికి పోయుండాది చిన్నబిడ్డ రాలేదు
ఒంటిదాన్ని ఇంటికాడే ఉండి
ఎసట్లో బియ్యం పోస్తావుంటే
నోటికి బియ్యం పోస్తామని
నోటీసు పట్టుకుని వచ్చినేరు
ఎగిసి తంతేనే పడిపొయ్యే గోడకి
గడ్డపారలు తెచ్చినేరేంటికి
గవర్మింటు దొరలారా

ఎన్నెన్ని కల్లేట్లు పడ్నేనో
నాపాట్లు కుక్కపడదు, నక్కపడదు
చిలికే కవ్వంపడదు, చీరనేసే మగ్గంపడదు
అన్ని అగసాట్లు పడినాను

ముందుగోడ ముక్కుపుడకమ్మి కట్టినాను
ఇత్తెడి బిందమ్మి ఎనకగోడ కట్టినాను
తలుపు కర్రకు ఏటున్నాది అమ్మేటికి?
గోతాముసంచీ కొనాకు సింపి
ఈ కోటకి ఏలాడించినాను

చీటీలుగట్టీ చిమిటీపనిజేసీ
పైకప్పుకి సగం పెంకులేసినాను
గూడు సెదిరిపోతే
పిట్టలకు ఏరే సెట్టుంటాది
ఉన్న ఈ ఒక్క ఇల్లూ కొట్టేస్తే
మాకేడయ్యా సాములూ దిక్కు?

అయ్యా సామీ,
ఐదేళ్ళకూ ఉంగరాలేసిన ఉజ్జోగి ఆసామీ!
మా ఆస్తిపాస్తులేందో
కళ్ళు బాగదెరిచి జూడు సామీ!

నీళ్ళు పటుకోను రేకు బిందొకిటి
ఇంటికంటే వయిసయిన చీపురొకటి
మాట్లూ నొక్కులూ సరిసమంగా ఉండే
చిల్లి చెంబులు నాలుగుండాయి
నామొగుడు తినేదానికి మాత్రం
ఇస్టీలు ప్లేటు ఒకటుండాది

పొండి సామీ పొండి
మీకు పున్యవుంటాది
మా కుక్కపిల్లని
ఈ పొద్దుగూడా నిదరపోనీండి సాములూ
నా పిచ్చిగాని సాములూ
ఎంత పొగిలి యేడ్సినా పేదోనిమాట మహరాజు ఇనుకుంటడా?
గరికపూస సుద్దులు చెప్తే కొడవలి ఇంటదా సాములూ?

కొట్టండి సామీ కొట్టండి
గోడలు పగలేయండి
కప్పు ఉన్నదాటునే పీకేయండి
తీగలంతా తెంపిపారేయండి
అద్దాలంగిట్లోకి ఏనుగు దూరినట్టు
ముందర ఎనకాల అంతా నేలమట్టం జేయండి
కడాన ఒకటిమాత్రం
మీ కాళ్ళుబట్టుకుని అడగతాను
సిగిరేట్టు తాగే మహరాజా
చెవులప్పగించి ఇను సామీ

పెరట్ల నా బిడ్డ మల్లెతీగ నాటుండాది
నీళ్ళుతాగిన తీగ ఇప్పుడిప్పుడే నవ్వతా ఉండాది
పేణంతో సమానంగ కాపాడిన తీగ సాములూ
పూలు పూసేదానికి వస్తావుంది
కొడవల్తో కొయ్యద్దు
గడ్డపార దింపి పెరకద్దు సాములూ

ఆసపడి నాటుకున్న తీగ సాములూ
అట్లనే వొదిలేయండి
నా కూతురు పెంచిన తీగ సాములూ
ఇంకెవురికన్నా ఇన్ని పూలు పూయినీయండి!


[మూలం: తమిళ కవి వైరముత్తు, తమిళుక్కు నిఱముండు – 1995 (తమిళానికి రంగుంది) కవితా సంపుటి నుంచి కూడు అన్న కవిత.]