నాకు నచ్చిన పద్యం: కీర్తికి దిక్కెవరు?

నేరుపు బ్రహ్మ జేరె నిజనిర్మలతేజము సూర్యు జేరె నా
కారము కాము జేరె నధికంబగు లక్ష్మి యనంతు జేరె గం
భీరత వార్ధి జేరె గలపెంపు కులాద్రుల జేరె గీర్తి దా
… …

అనగనగా ఒక భీముడు. పేరుకు తగ్గట్టుగానే అతను భీమపరాక్రముడు. అరివీర భయంకరుడు. తన కత్తితో పిడుగును సైతం నరికిన పరాక్రమం అతనిది. అతని చేతనున్నది ఆషామాషీ కత్తి కాదు! కాలకూటవిషపు ముద్దని తన మూడవకన్ను అనే కొలిమిలో కాల్చిపెట్టి, వాసుకి కోరలనే పట్టకార్లతో పట్టి, ఒక దిగ్దంతి తలపై పెట్టి, పిడుగుల సమూహమనే సమ్మెటతో కొట్టి, స్వయంగా ఆ లయకారుడైన శివుడే కమ్మరిగా తయారుచేసినదేమో అన్నంత భయంకరంగా ఉండే ఖడ్గం అది. అంతటి ఖడ్గాన్ని ధరించిన ఆ చేయి యింకెంత భీకరంగా ఉంటుందో ఊహించుకోవలసినదే! ఇతను (కళింగ)విజయనగర రాజులైన పూసపాటివారికి పూర్వీకుడట. తండ్రి దేవవర్మ, తల్లి మైలమదేవి. తల్లి పేరు మీద యితను మైలమ భీమునిగా ప్రసిద్ధి చెందాడు. ఈ భీముని గూర్చి మరొక భీముడు చెప్పినదే పై పద్యం. ఆ పద్యం చెప్పిన కవి భీముడు, వేములవాడ భీమకవి. మైలమ భీముని కత్తి ఎంత పదునైనదో, భీమకవి పలుకు అంత పదును! భీమకవి గూర్చి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇతను సాక్షాత్తు భీమేశ్వరుని అవతారమని కొందరి నమ్మకం. శాపానుగ్రహ దక్షుడని ప్రతీతి. “వచియింతు వేములవాడ భీముని భంగి ఉద్దండ లీల ఒక్కొక్కమాటు,” అని చాటిన శ్రీనాథునికి స్ఫూర్తినిచ్చిన కవులలో అగ్రగణ్యుడు భీమకవి. అయితే యితను రచించిన గ్రంథాలేవీ ప్రస్తుతం లభ్యం కావటం లేదు. కొన్ని గ్రంథాలకు కర్త యితనో కాదో కచ్చితంగా తెలియలేదు. దాదాపు నలభై చాటుపద్యాలు మాత్రం యితని పేర తరతరాలుగా ప్రచారంలో ఉన్నాయి. అందులో సుమారు ఇరవై పద్యాలు మైలమ భీముని గురించినవే. మైలమ భీముని కత్తి తయారీ గూర్చి పైన వివరించిన వర్ణన గల “గరళపుముద్ద లోహ మవగాఢ మహాశనికోట్లు సమ్మెటల్,” పద్యం కూడా భీమకవిదే. శ్రీశ్రీ ఖడ్గసృష్టికి ప్రేరణ ఆ పద్యమే. అది అలా ఉంచి, ఇక మనం ప్రస్తుత పద్యం వైపు చూపు తిప్పుదాం.

ఇది మైలమ భీముని గొప్పదనాన్ని వర్ణించే పద్యం. కవులు రాజుల ప్రాపు కోసం వారిని ఘనంగా కీర్తించడం సాధారణ విషయమే. కాని యిక్కడున్న విశేషం ఏమిటంటే, యిది మైలమ భీముడు గతించినప్పుడు చెప్పిన పద్యం. అంచేత యీ పద్యంలో కవికి మైలమ భీమునితో ఉన్న అనుబంధం ద్యోతకమవుతుంది. ఇది కేవలం ముఖస్తుతికి చెప్పిన పద్యం కాదన్న మాట. సాధారణంగా మనిషి చనిపోయినప్పుడు అతని పాంచభౌతికమైన దేహం పంచభూతాలలో కలిసిపోతుందని అంటారు. అంటే, శరీరంలోని గాలి గాలిలో, నీరు నీటిలో, అలా అన్నీ కలిసిపోతాయని. అయితే, మైలమ భీముని ఆశ్రయించిన అభౌతికమైన గుణాలు అతని మరణానంతరం ఏమయ్యాయన్న విషయాన్ని కవి యిక్కడ చెపుతున్నాడు. అతని నేరుపు బ్రహ్మను చేరిందట. అతని నిర్మలమైన తేజస్సు సూర్యుని చేరింది. ఆకారము (అంటే రూపసౌందర్యం) మన్మథుని చేరింది. అధికమైన అతని సంపద అనంతుని (అంటే విష్ణుమూర్తిని) చేరుకుంది. గంభీరత సముద్రాన్ని చేరింది. కలపెంపు, అంటే అసలైన గౌరవం, మహత్త్వం, కులపర్వతాలను చేరింది. ఇక్కడ ఆయా గుణాలు నిజంగా ఆయా వ్యక్తులనూ వస్తువులనూ చేరాయని కాదు. అవి అంతటి గొప్పదనం కలిగినవి అన్నది వ్యంగ్యార్థం. బ్రహ్మ సర్వసృష్టి కర్త. అందువల్ల అతనికన్నా ప్రజ్ఞావంతులు ఎవరుంటారు? అంతటి నేర్పు మైలమ భీమునికి ఉన్నదని భావం. అలాగే మైలమ భీముడు ప్రకాశంలో సూర్యుడు, సౌందర్యంలో మన్మథుడు, సంపదలో విష్ణువు, గాంభీర్యంలో సముద్రం, ఔన్నత్యంలో కులపర్వతాలు – అంత గొప్పవాడని. ఆ గొప్పదనాన్ని నేరుగా చెప్పకుండా వక్రోక్తి ద్వారా ధ్వనింపజేశాడు కవి. ఇందులో “అధికంబగు లక్ష్మి” అనడంలో నాకు మళ్ళా మరొక అంతరార్థం స్ఫురిస్తోంది. అధికం అంటే మిక్కిలి అనే అర్థమే కాకుండా, మిగిలిన అనే అర్థం కూడా వస్తుంది. అంటే, తన వద్దనున్న సంపదనంతా దానధర్మాలకు వినియోగించగా, ఇంకా మిగిలి ఉన్న సంపద విష్ణువుని చేరిందనే అర్థం కూడా వస్తుందన్న మాట. ఇది మైలమ భీముని దానగుణాన్నీ, అతని సంపద ఆధిక్యాన్నీ కూడా మరింతగా ధ్వనింపజేస్తోంది. ఈ ధ్వనిభేదాలేమిటన్నది అలంకారశాస్త్ర ప్రవీణులకు వదిలిపెట్టి, మనం ముందుకు సాగుదాం.

ఎంత చమత్కారంగా ధ్వని మార్గంలో వర్ణించినా, వరసగా బ్రహ్మ జేరె, సూర్యు జేరె, అంటూ చెప్పుకుంటూ పోతే అది చాకలిపద్దులా (ఈమాట యిప్పుడు చాలామందికి తెలియకపోవచ్చు, laundry list అంటే బాగా అర్థమవుతుంది!) అనిపించే ప్రమాదం ఉంది. దాన్ని పరిహరించేందుకు కవులు ప్రయోగించే ఒకానొక రచనాశిల్పం ఏమిటంటే, పద్యమంతా ఒక రీతిలో కొనసాగించి చిట్టచివర, దానికి భిన్నమైన మరొక భావాన్ని చటుకున్న మెరిపించడం. ఈ పద్యంలో కవి దీనినే అనుసరించాడు. చివరగా ‘కీర్తి’ని ప్రస్తావించాడు. దాని గతి ఏమయ్యిందో ఆఖరు పాదంలో చెప్పాడు. అసలు చమత్కారమంతా అందులోనే ఉంది. అందుకే ఆ చివరి పాదాన్ని ఇంతవరకూ గోప్యంగా ఉంచాను! పద్యం పూర్తిగా క్రింద యిస్తున్నాను మళ్ళీ చదవి ఆస్వాదించండి:

ఉ. నేరుపు బ్రహ్మ జేరె నిజనిర్మలతేజము సూర్యు జేరె నా
       కారము కాము జేరె నధికంబగు లక్ష్మి యనంతు జేరె గం
       భీరత వార్ధి జేరె గలపెంపు కులాద్రుల జేరె గీర్తి దా
       నూరట లేక త్రిమ్మరుచు నున్నది మైలమభీము డీల్గినన్

మైలమభీముడు చనిపోయాక (ఈల్గుట అంటే చనిపోవడం), అతని గుణాలన్నిటికీ మరొక ఆశ్రయమేదో ఒకటి దొరికింది. కాని అతని కీర్తికి మాత్రం ఎలాంటి ఆశ్రయం దొరకలేదట. ఏ దిక్కూ లేని కీర్తి అన్ని దిక్కులూ అలా తిరుగుతూనే ఉందట. భలే! ఇలా అనడంలో, మైలమ భీముని కీర్తికి సమానమైనది ఏదీ లేదన్న విషయమూ, అతని కీర్తి లోకమంతటా వ్యాపించిందన్న విషయమూ చక్కగా ధ్వనించడం లేదూ! ఇహ యింతకన్నా దీని గురించి చెప్పాల్సింది ఏముంది! భీమకవి వాక్కుకు రెండువైపులా పదునే.

ఇలాంటి చక్కని చాటువులెన్నో కేవలం ప్రజల నోళ్ళ ద్వారా తరతరాలు ప్రచారం పొంది తెలుగువారి సంస్కృతిలో భాగమైపోయాయి. పందొమ్మిదవ శతాబ్దం వరకూ ఈ చాటుసంప్రదాయం కొనసాగిన దాఖలాలున్నాయి. ఆ తర్వాత యిది ఆగిపోయింది. చాటుపద్యాలు పుస్తక సంకలనాలకు పరిమితమైపోయాయి. పుస్తకాలకెక్కక కాలగర్భంలో కలిసిపోయిన పద్యాలెన్నో! చాటుపద్య సంప్రదాయంలో రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఒకటి పద్యాల పుట్టుక. రెండు వాటి వ్యాప్తి. ఒక సందర్భానికి స్పందించి, అందంగా, చమత్కారబంధురంగా, ఆశువుగా పద్యం చెప్పగలగడం చాటువు పుట్టుకకి అవసరం. అలా పుట్టిన పద్యాన్ని నలుగురూ చెప్పుకొంటూ, వింటూ, దాని చుట్టూ కమ్మని కథలల్లుతూ, తోచిన మార్పులూ చేర్పులూ చేస్తూ, తరతరాలకు అందించడం వ్యాప్తికి కారణం. చాటుపద్య సంప్రదాయం కొనసాగాలంటే ఈ రెండు అంశాలూ ముఖ్యమే. బహుశా ఆధునికయుగంలో ఈ రెండిటినీ కూడా కోల్పోయామేమో! పద్యాలలో చాటువులు, పాటలలో జానపదగేయాలు, మాటలలో సామెతలు – ఈ మూడింటికి చాలా సామ్యాలు కనిపిస్తాయి. ఏదో ఒక సందర్భానికి తగ్గట్టు ఆశువుగా పుట్టేవే యీ మూడూను. ప్రజల రసనలే వీటికి ప్రసారసాధనాలు. మూడింటిలోనూ సామాజికజీవితం అంతోయింతో ప్రతిఫలిస్తూ ఉంటుంది. సాధారణంగా వీటికి కర్త ఒకరని చెప్పలేం. మార్పులూచేర్పులతో అనేక రూపాలలో యివి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ సామ్యాలను పరిశీలిస్తే, వీటన్నిటి వెనకా ఒకే సాంస్కృతిక అంశమేదో ఉండి ఉండవచ్చునని నాకు అనిపిస్తుంది. అది ఏదైనా, ఈ మూడు సంప్రదాయాలూ ఒకేసారి అంతరించడం, సంస్కృతిలో మౌలికమైన మార్పుని సూచిస్తుందనడంలో సందేహం లేదు.

‘క్రొత్తపాతల మేలికలయిక క్రొమ్మెరుంగులు జిమ్మగా’ అన్నట్టుగా, ప్రాచీనమైన యీ చాటువులో కనిపించే యిలాంటి అభివ్యక్తే ఒక ఆధునిక కవితలో కూడా కనిపించి మనల్ని మురిపిస్తుంది. అదేమిటో సహృదయులైన పాఠకుల ఆలోచనకే వదిలిపెడుతున్నాను!