కొత్తపల్లి – పిల్లల పత్రిక సంపాదకుడు నారాయణ శర్మతో ముఖాముఖి

సరే, మళ్ళీ కొత్తపల్లి దగ్గరకు వద్దాం. ఇలా ఇంట్లో ఎన్ని కాపీలు వేసేవారు?

మొదట్లో పది కాపీలు వేశాం. ఒక్కో కాపీ ఏడెనిమిది రూపాయలు పడేది. సులభమే అనిపించాక, వాళ్ళకు వీళ్ళకు అంటూ కాపీల సంఖ్యని పెంచుకుంటూ పోయాం. అంతా తెలిసిన వాళ్ళే! ‘చందాలు కట్టిస్తే?’ అనుకున్నాం. చకచకా చందాదారులూ తయారయ్యారు. వాళ్ళూ‌ మనకు బాగా తెలిసినవాళ్ళే, మా చవక ప్రింటింగుని ఇష్టపడ్డవాళ్ళే! అంతలోనే దెబ్బ పడింది. మేం ‘ప్రకృతిబడి’ని వదిలిపెట్టాల్సి వచ్చింది! అప్పటివరకూ కథలూ, పాటలూ రాస్తూ, టైపు చేస్తూ, ఎడిట్ చేస్తూ ఉన్న పిల్లలంతా అకస్మాత్తుగా పరాయి వాళ్ళయ్యారు. ఏం చెయ్యాలి? వెంటనే ‘కథలు ఎక్కడి పిల్లలైనా రాయచ్చుగా’ అనుకున్నాం. వేరే వేరే బడుల పిల్లలు, వేరే వేరే ఊళ్ళ పిల్లలు కథలు రాయటం‌ మొదలు పెట్టారు. కొత్తపల్లి రచయితల పునాది అలా విస్తరించింది.

రాను రాను మాకు తెలీని కొత్తవాళ్ళు కూడా చందాదారుల లిస్టులో చేరటం మొదలైంది. ఈలోగా మా ఫార్మాటింగు వ్యవస్థ కూడా మెరుగయ్యింది. ‘ఇంటి ప్రింటింగు’ క్వాలిటీ మెరుగైంది. దానిలో సమస్యలూ తెలిశాయి. వాటిని దాటుకోవటమూ అలవడింది. ముఫ్ఫై రెండో సంచిక వచ్చేసరికి, ప్రతినెలా మూడువందల కాపీలు ‘ఇంట్లో’ ప్రింటు చేయాల్సి వచ్చింది. శ్రమ తెలిసింది. సుబ్బ ప్రతి నెలలోనూ వారం రోజులు నిద్రపోకుండా పని చేయాల్సి వచ్చింది. అంతలో మళ్ళీ సాయం కృపాకరరావుగారి రూపంలో ప్రత్యక్షమైంది. “ఇన్నిన్ని ప్రింటు చేశారు, చాలు. ప్రింటింగు మాకు ఇవ్వండి. ఆఫ్‌సెట్‌లో వేస్తాం, రెండు వేల కాపీలు. పుస్తకం వెలువరించే పని, పంపిణీ పని మీరు చూసుకోండి. డబ్బులకోసం తొందర పడకండి, నేను కొంచెం ఆగగలను.” అన్నారాయన. తటపటాయిస్తూనే ఆఫ్‌సెట్ ప్రింటింగులోకి దిగాం.

ఆఫ్‌సెట్ ప్రింటింగ్ ఖరీదు కదా! ఆర్థిక ఇబ్బందులు ఎదురవలేదా?

ఎప్పటికప్పుడు ప్రింటు పత్రికని ఆపేద్దాం అనిపించేది. మళ్ళీ ‘అది లేకపోతే కథలు రాసిన పిల్లలు, ముఖ్యంగా అల్పాదాయ వర్గాలవాళ్ళు, పల్లెల్లో వాళ్ళు, తమ కథల్ని తాము చూసుకోవడానికి కూడా వీలుకాదు కదా,’ అనిపించేది. ఆనంద్ తన సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో వచ్చిన జీతం లోంచే నాకు, సుబ్బకి జీతం ఇవ్వటం మొదలెట్టాడు. ఒకసారి మేమిద్దరం ‘కవర్’ అయ్యాక, ఇంక ‘సమస్యల్ని అధిగమించటం మా పనేగా?’ అని, ప్రింటు చేస్తూ పోయాం. ఎప్పటికప్పుడు మా అవసరాన్ని కనుక్కునే మిత్రులు డబ్బులు ఇస్తూ పోయారు. ఏ నెలైనా ఎవ్వరూ ఇవ్వకపోతే కృపాకరరావుగారికి అప్పుపెట్టాం!

అప్పు తీర్చే మార్గం? పుస్తకం ధర పెంచుకొని ఉండచ్చుగా?

2010లో చందమామ ధర 18రూపాయలుండేది. చందమామకూ కొత్తపల్లికీ పోలికెక్కడ గాని, దానికంటే ఎక్కువ ధర పెడితే ఎవ్వరూ కొనరని ఓ పిచ్చి నమ్మకం ఉండి, ధర పద్ధెనిమిది రూపాయలుగా నిర్ణయించాం. అప్పట్లో ప్రింటింగ్ చేసినందుకు కృపాకరరావుగారికి 13 రూపాయలు, రవాణాకు ఒక రూపాయి – వెరసి 14 రూపాయలు నేరుగా ప్రింటు ఖర్చే అయ్యేది. మరి పంపిణీ చేసిన వాళ్లకి? (వాళ్ళూ మా పిల్లలే, బడిలో చదివి పెద్దయి, పట్నాలలో చదువుకుంటున్నవాళ్ళు,) బొమ్మలు వేసినవాళ్లకి? (వాళ్ళు కూడా మా విద్యార్థులే, అయినా అంత ఇష్టంగా బొమ్మలు వేసిన వాళ్ల కనీస అవసరాలకి ఏ కొంచెం డబ్బులో ఇవ్వకపోతే ఎలాగ?) ఆఫీసు అద్దె, మా ఇంటి ఖర్చులు? అన్నీ కలిసి మోపెడయ్యేవి.

వాటిలో కొంత ఆనంద్ తన జీతం లోంచి మోసేవాడు. తెలిసిన మిత్రులు, పాత విద్యార్థులు ఆపైన కొంచెం కొంచెంగా ఇచ్చి కాపాడేవాళ్ళు. సంవత్సరాంతంలో హైదరాబాదు, విజయవాడల్లో జరిగే పుస్తక ప్రదర్శనల్లో కొంత స్టాకు అమ్మితే, కృపాకరరావుగారి అప్పు కొంత సర్దవీలయ్యేది.

అంత కష్టపడటం ఎందుకు? ప్రకటనలు తీసుకొని ఉండొచ్చుగా?

ప్రకటనలు పిల్లలకు ఏమంత మంచివి కాదు. వాటినుండి పిల్లల్ని పూర్తిగా ‘స్క్రీన్’ చేయటం వీలవ్వదులెండి గాని, కొత్తపల్లిని చదివేప్పుడు మటుకు ఎవ్వరికీ — పిల్లలకు గాని, పెద్దలకు గాని — ఇతర ఆలోచనలు రేకెత్తకూడదని మాకు గట్టిగా అనిపించేది. అందుకనే ఎంతకష్టమైనా మొదటినుండీ కొత్తపల్లివెబ్‌సైటులో గాని, ప్రింటుపత్రికలో గాని ప్రకటనలు స్వీకరించలేదు. ‘మంచి ప్రకటనలైతే…?’ అని కొందరన్నారు. అదీ పెద్దగా నచ్చలేదు. మెల్లగా ‘మంచివి’ పోయి, అవసరార్థం ‘ఏవైనా’ వచ్చేస్తాయని అనిపించేది.

అయినా కొత్తపల్లిలో ప్రకటనలు ఇచ్చేవాళ్ళు ఎవరు? వాళ్ళూ మిత్రులేగా? వాళ్ళు ఊరికే అయినా ఇస్తారు. ప్రకటనల ద్వారా అయితేనే ఇస్తామనే వాళ్ళు కారు. ఇలాంటి మంచి పని కోసం డబ్బులు వాళ్ళే ఇస్తారులే అని సర్దుకునేవాళ్లం.

కొత్తపల్లిని మొదలు పెట్టింది, నడిపిస్తున్నది లాభాపేక్షతో కాదు. పిల్లలు తమ భావనల్ని, తమలోని కథల్ని కాయితం మీదికి తేవాలని, వాళ్ళ కథల్ని చదివి మిగిలిన పిల్లలు స్ఫూర్తి పొంది, తామూ రాస్తారనీ, ఆ క్రమంలో వాళ్ళల్లో భాష బలపడుతుందని ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్న పని ఇది. అయినా పత్రిక మనుగడ కోసం అవసరం అయితే ముందు ముందు ‘మంచి’ ప్రకటనలు తీసుకోవాల్సొస్తుందేమో! అవి కూడా పిల్లలకి ఉపయోగిస్తాయి అనుకున్నప్పుడు.

ప్రస్తుతం ఎన్ని కాపీలు వేస్తున్నారు?

ప్రతినెలా ముద్రిస్తున్న కొత్తపల్లి ప్రతులు రెండువేలు. ‘రెండువేలు మాత్రమే!’ సాధారణంగా పత్రికలు ఎన్ని కాపీలు ముద్రించబడుతున్నాయో చెప్పవు. ఎంతమంది చేత చదవబడుతున్నాయో చెబుతాయి. సర్క్యులేషన్ అంకెల గారడీల ప్రపంచంలోకి కొత్తపల్లి రాదు.

కొత్తపల్లికి ఏ రకమైన సహాయాలు అందుతున్నాయి?

కొత్తపల్లికి విదేశీ నిధులు స్వీకరించే అవకాశం లేదు. పెద్ద పెద్ద మొత్తాలు, సంస్థాగత నిధులు కూడా కొత్తపల్లి తీసుకోలేదు. మాతృభాష ప్రాధాన్యం తెలిసిన వ్యక్తులు, ‘తమ పిల్లలకు మేలు జరిగింది,’ అని గుర్తించే తెలుగువాళ్ళు, ‘గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పిల్లలకు సాయం అవుతోంది కదా,’ అనుకునే సహృదయులు — ఇలాంటి వాళ్ళు మిత్రులుగా కొత్తపల్లికి సహాయం చేస్తున్నారు.

కొత్తపల్లికి ఇంకొక రకంగా అందే సహాయం పాత సంచికల పునర్మద్రణ కోసం వచ్చే ఆర్డర్లు.

కొత్తపల్లి పత్రికను 2011 జనవరి నుండి అంటే, ముఫ్ఫైమూడో సంచికనుండి ఆఫ్‌సెట్లో ముద్రిస్తూ వస్తున్నాం. అలా ముద్రించిన సంచికల్లో మొదటి పన్నెండూ (కొత్తపల్లి-33 నుండి కొత్తపల్లి-44 వరకు) పూర్తిగా అమ్ముడైపోయాయి. ప్రస్తుతం ఆ ప్రతులు స్టాకులో లేవు. వాటిని మళ్ళీ ఆఫ్‌సెట్లో ప్రింటు చేయటం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకని అడిగిన వాళ్లకు గతంలో మాదిరి ఇంక్‌జెట్ ప్రింటర్లలో ముద్రించి ఇచ్చే పని మొదలుపెట్టాం.

ఈ మధ్యే ఒక ప్రైవేట్ స్కూలు వాళ్ళు – వాళ్ళ పిల్లలు వేసవి సెలవల్లో చదువుకోవడం కోసం 2010వి ఒక ఆరు వందల పుస్తకాలు కావాలని అడిగితే ముద్రించి ఇచ్చాం. ప్రస్తుతం తిరుపతిలోని మిత్రులు దుర్గాప్రసాద్ గారి కోసం 2010వి ఆరువందలు, 2011వి మరో ఆరువందల పుస్తకాలు ‘ఇంట్లోనే’ ముద్రించి ఇచ్చే పనిలో ఉన్నాం. ఇలా ఒకటో సంచికనుండి 67వరకూ అడిగిన వారికి ‘ఇంట్లోనే’ ముద్రించి ఇవ్వడం కూడా కొత్తపల్లికి ఉన్న ఆదాయమార్గాలలో ఒకటి.

కొత్తపల్లి కోసం ఎవరెవరు కథలు రాస్తున్నారు? మీరు వాళ్లచేత కథలు ఎలా రాయిస్తారు?

పిల్లలు గాని, పెద్దవాళ్ళు గాని వాళ్ళంతట వాళ్ళే కథలు రాసి పంపిస్తున్నారు ప్రస్తుతం. మేము ఏదైనా బడికి వెళ్ళినప్పుడు అక్కడి పిల్లలతో కూర్చొని కథలు తయారు చేయటం, ఒకటి రెండు కథలు అక్కడే రాయిస్తూ కథలు రాయటంలో మెళకువలు కొద్ది కొద్దిగా చెప్పటం చేస్తున్నాం. అయితే ఎక్కువ మంది పిల్లలు తామే సొంతంగా కథలు రాసి పోస్టులో పంపుతున్నారు. కొందరు పెద్దవాళ్ళు ఇ-మెయిలు ద్వారా కథలు పంపుతున్నారు. కొత్తపల్లిలో పిల్లల రచనలకు ప్రాధాన్యం ఉంటుంది. అయితే పెద్దల రచనలూ కావాల్సిందే కదా! పిల్లలకు మంచి రచనల ఒరవడి నేర్పాల్సింది పెద్దలే.

పత్రికను 2008 నుండి నడిపిస్తున్నారు కదా! ఇప్పటికి 67 సంచికలు వెలువరించారు. మీకెలా అనిపిస్తున్నది?

బాగుంది. ’67పుస్తకాలు వచ్చేశాయా?’ అని సంతోషం కలుగుతుంది. తెలుగు పిల్లలు చదువుకోటానికి ఇన్ని కథలు ఒకేచోట ఉన్నాయి అని తృప్తిగా ఉంటుంది. ‘పిల్లల్ని పుస్తకాల ప్రపంచంలోకి అడుగుపెట్టించేందుకు కథలు మంచి సాధనాలు,’ అని మాకున్న నమ్మకానికి బలం చేకూరినట్లనిపిస్తుంది.

నారాయణ గారూ! మీరు ఐ.ఐ.టి లాంటి అత్యున్నత విద్యాసంస్థలో ఎమ్.టెక్ చదువుకుని పల్లె పిల్లలకి ఓ దశాబ్దం పైగా పాఠాలు చెప్పి ప్రస్తుతం ఈ పిల్లల పత్రికని ఎంతో శ్రమకోర్చి నడుపుతున్నారు. ఇలాంటి పనులు చేయడం వెనక మీ బాల్యం, కుటుంబ నేపథ్యాల స్ఫూర్తి ఉండే ఉంటుంది…

మా ఇంట్లో నేను రెండవ అబ్బాయినవ్వడం వల్ల నాకు చిన్నప్పటి నుండి ఓ రకమైన స్వేచ్ఛ లభించింది — మా అన్నయ్య చాలా వరకు కుటుంబ బాధ్యత తీసుకోవడం వల్ల. పెద్ద పెద్ద కాన్వెంట్లలో చదివించగలిగే స్థోమతు ఉన్నా కూడా మా నాన్నగారు చిన్నప్పుడు నన్ను తక్కువ ఖర్చుతో మధ్య తరగతి వాతావరణపు పాఠశాలల్లో చదివించారు. పిల్లలందరికీ తెలుగు పట్ల అభిమానాన్ని పెంపొందించాలనే ఆశయాన్ని తక్కువ ఖర్చుతో నెరవేర్చుకోగలం అన్న నమ్మకం ఇలాంటి వాతావరణంలో చదువుకోవడం వల్లనే నాకు కలిగి ఉంటుంది.

ఎడిటింగ్ నుంచి పుస్తకాలు పోస్ట్ చేసే వరకు అన్ని పనుల్లో మునిగిపోయి ఇంటి పనిని వదిలేసినా, ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా ఓర్చుకున్న నా భార్య సమత, మా పాప సత్యలక్ష్మి కూడా నా వెనక ఉన్నారు.

మళ్ళీ సమయం వస్తుందో రాదో, ఇప్పుడే చెప్తాను: కొత్తపల్లి ఇన్నాళ్ళపాటు కొనసాగగలిగిందంటే, దానికి ఎంతోమంది మిత్రుల సమిష్టి కృషే కారణం. వాళ్ళందరి సహకారం లేకపోతే ఈ పని ఇన్నాళ్ళు జరిగేదే కాదు. వీళ్ళంతా తమ తమ పనులు చేసుకుంటూ, పనిలో పనిగా కొత్తపల్లికీ పని చేస్తూ వచ్చారు.

సుబ్బరాజు ఐదేళ్ళకు పైగా కొత్తపల్లి నిర్వహణ బాధ్యతలు మోశాడు. ఆనంద్, లక్ష్మి(దేవి) కొత్తపల్లికోసం వెచ్చించినంత డబ్బులు, సమయం మరెవ్వరూ వెచ్చించలేదేమో. ఇప్పటికీ కొత్తపల్లి వెబ్సైటు నిర్మాతలు, ఓనర్లు వాళ్ళే. మొదట్లో చక్కని కామెంట్ల వ్యవస్థను రాసిపెట్టింది లీలక్క; సాయం చేస్తూ ఎదిగాడు మాబు; ఇన్నేళ్ళూ బొమ్మలు వేయటంలో చురుకైన పాత్ర వహించాడు అడవి రాముడు; ఇప్పటికీ బొమ్మలు వేసిపెడ్తున్నాడు వీరాంజనేయులు; టైపు సెటింగు సాయాలు చేసి పెట్టిన సుచరిత, లక్ష్మి, బలం లేకపోయినా వెనక నిలబడే అలివేలమ్మ; కొత్తపల్లి కోసం చిన్నప్పుడు టైపు చేసి, పెద్దయ్యాక ప్రతులు దుకాణాల్లో వేసి పెడుతున్న కేదార్; ఇప్పుడు రకరకాల బరువులు మోస్తున్న మంజునాధ్, మల్లికార్జున, వెనకనుండి నెట్టే రాధగారు; ప్రోత్సహించే శివబాబు, విజయలక్ష్మిగార్లు; సోమిరెడ్డిగారు; ఆపదల్లో ఆదుకున్న సత్య ఫౌండేషన్ వారు, ఏనెలకానెల ప్రింటు ఖర్చుల్ని అందించిన మిత్రులు; కొత్తపల్లిలో శీర్షికలు నడిపిస్తున్న పుస్తకం.నెట్ సౌమ్య, వివియస్ మూర్తిగారు; గతంలో పిల్లలు మెచ్చేట్లు శీర్షికలు నడిపి, చక్కని పేరు తెచ్చిపెట్టిన తెలుగు4కిడ్స్ లలితగారు, మాలతికృష్ణగారు, దేవి, లలితగీతాల వెంకట్రావుగారు — నేను తలచుకోవాల్సిన మిత్రుల పట్టిక ఇంకా చాలా ఉంది! మరి రచనలు చేసిన పిల్లలు, చదివి పెద్దయిన పిల్లలు — తలచుకున్నకొద్దీ వస్తూనే ఉన్నారు!

చివరగా ఏమైనా చెప్తారా?

కొత్తపల్లి ఒక సామూహిక ప్రయత్నం. సమూహం దీని పట్ల ఎంత ఉత్సాహంతో స్పందిస్తే అంత మంచి జరుగుతుంది. సామాజిక స్ఫూర్తికి అది ఓ ప్రతీక. ఇలాంటి మంచి ప్రయత్నాలను నిలపటం, వీటిలోని లోటుపాట్లను పూరించటం, చేయూతనివ్వడం అందరి బాధ్యత.

కొత్తపల్లి పత్రిక ఇ-మెయిల్:team@kottapalli.in
ఫోన్: 94901 80695.