ఇది మరీ బావుంది

కనబడే దాన్ని కాదనటంలో
వాడికి వాడే సాటి
మా కళ్ళజోడూ లాల్చీగాడు
నా మొగుడు. ఉన్నట్టుండి వక్కాణించాడు
మొన్న ఉగాది నాడు పొద్దున్నే
మరో గంటలో కవి సమ్మేళనం…
“అసలు చలనం అనేది లేదు!”
నా కవిత చదవటానికి
పెదాల రంగూ గాజుల రంగూ
చీరా రైకల రంగుతో సరిచూసుకుంటూ
ఆడాళ్ళూ మొగాళ్ళూ
అన్ని వయసుల వాళ్ళూ చప్పట్లు కొట్టే
తెలుగు చలన చిత్ర సంభాషణ మల్లే
రాత్రి తెలిసిందిలే ఆ సంగతన్దామనుకుని కూడా
మర్యాదకన్నానుగానీ మనసు పెట్టి కాదు –
“ఎలాగో వివరిస్తావా? కుతూహలంగా ఉంది!”

మా వాడు గొంతు సవరించుకోలేదు
జుత్తు సవరించుకోలేదు
ముక్కు మీంచి జారిపోతున్న
కళ్ళజోడుని సైతం సవరించుకోలేదు.
“చలనంలో ఉన్న వస్తువేదైనా సరే!
తను చేరవలసిన దూరంలో
సగం ముందు ప్రయాణించాలి.
ఆ సగంలో సగం దూరం అంతకంటే ముందు
ఆ సగంలో సగం దానికంటేముందు.
ఈ వరసన ఈ సగాలు చలనాన్ని
అరరరలుగా తరిగేసి
అసలు లేకుండా చేసేస్తాయి.”

దూరాన్ని కాలంలో దూర్చేసి
కాలాన్ని దూరంలో చుట్టేసి
అంకెలతో రెంటినీ కుట్టేసి
గుక్క తిప్పుకోకుండా చెప్పేసి-
“దీన్నే అంటారు జీనో పారడాక్సని
దీంతో తత్త్వ వేత్త జీనో
ప్రపంచాన్ని తత్తర బిత్తర చేసేశాడు ”
అంటూ ముగించాడు
సూత్రాలూ, సమీకరణాలూ
పుస్తకాల్లోంచి పుక్కిటిలోకి తెచ్చుకుని
ప్రతి పరీక్షలోనూ
ప్రథముడుగా వచ్చిన మా మేధావి.

మనసు కెక్కిందో లేదో
గుండెల్లో నాటింది.
యుగ యుగాలుగా
జగ జగాలుగా
ఏ యానమయినా
సగసగాలుగా
విరిగి
సగ సగ సగ సగాలు గా
విరిగి
స స గ గ స స గ గాలు గా
విరిగి
ఆరంభించిన చోటే
అంతమౌతుందనీ
అది తీరం చేరని
తీరని కోరిక లాంటిదేనని –

కవి చూపుని ఏదీ తప్పించుకోలేదు.
అంతుపట్టని నిజమూ అందమైన అబద్ధమూ
అద్దంలో ముద్దు పెట్టుకుంటున్నట్టుగా ఉన్న
జీనో మాటల్లో గూడు కట్టుకున్న
గూఢార్థం గుప్ఫుమని తట్టింది
జీనో
చలనం గురించి చెప్పినట్టనిపిస్తున్నా
సంచలనం గురించి చెప్పాడనీ
జీనో
గమనం గురించి చెప్పినట్టనిపిస్తున్నా
కవనం గురించి చెప్పాడనీ.

“యాంత్రికమైనదేదీ చరమాన్ని చేరలేదు
దూరం సమస్యే కాదు
కదిలేది ప్రతిదీ కడ దాకా పోదు
ముందుకి వెళ్తున్నట్టున్నా
ముంగిట్లోనే ఉంటుంది
గోపెమ్మ కృష్ణుణ్ణి
పరిగెత్తి పట్టుకుని కట్టేసిందంటే
చలనం వల్ల కాదు –
అమ్మకడుపులో రేగిన
సంచలనం వల్ల!
తన వేగం వల్ల కాదు –
తల్లి పేగు ఉద్వేగం వల్ల!
ప్రాసలూ యతులూ
పద్యాన్ని తయారు చేస్తాయేమో గానీ
పాఠకుడి దగ్గరకు పట్టుకుపోలేవు
జీనో నీకు జోహార్లు!
ఏ రోట్లో రుబ్బావో పప్పు
లేని ఒట్టి పొట్టు
మహా కమ్మగా వేశావ్
నోట్లోకి పోకుండా
ప్లేట్లోనే ఉండిపోయే పెసరట్టు!”

…నేను ఇంకా వేదిక దిగనే లేదు
“ఇది మరీ బావుంది తహతహా!”
మా కళ్ళజోడూ లాల్చీ గాడు
రెండు కళ్ళల్లోనూ రెండు నీటి చుక్కలు
నన్ను గట్టిగా కావులించేసుకున్నాడు.
నేను సిగ్గు పడాలేనూ
సిగ్గు నటించా లేనూ, అయినా
నా మాటలు నా బుగ్గల్లోంచి పొంగి
నా పెదాల చీరా రైకల
గాజుల రంగులో కలిసిపోయాయి.
“ఇది మరీ బావుంది!”


[క్రీస్తు పూర్వం నాటి ‘జీనో పారడాక్స్’ ఎన్నో భాషల్లో కవితలకు ప్రేరణ అయింది. యథాలాపంగా చూసినా ఇంటర్నెట్లో – రాయల్ ఫిలసాఫికల్ సొసైటీ వారి పత్రిక ‘థింక్’ సమ్మర్ 2013 సంచికలో వచ్చిన కవితతో పాటు ఆరేడు ఇంగ్లీష్ కవితల్ని చూడవచ్చు. తెలుగులో వచ్చినది నా ఎరికలో, ఈమాటలో వచ్చిన మాధవ్ మాౘవరం రచన ఒక్కటే. ఆ రచన నుంచి కొన్ని వాక్యాలు ప్రస్తుత రచనలో వాడుకున్నాను. శ్రీ మాౘవరంకి కృతజ్ఞలతో. — తఃతః]