ఆకుపాట – వాసుదేవ్ కవిత్వం

వచన కవిత్వ ప్రక్రియ మొదలయ్యాక, కవితా శిల్పం నిర్లక్ష్యానికి గురవ్వడం తఱచుగా కనిపిస్తున్నదే. “కాదేదీ కవితకనర్హం” అన్న శ్రీశ్రీ మాటలను శిరోధార్యంగా భావించే వారెందరో, సౌకర్యవంతంగా ఆ మరుసటి పాదంలోనే ఉన్న “ఔనౌను శిల్ప మనర్ఘం” అనడాన్ని మాత్రం విస్మరిస్తారు. ఆకుపాట కవితలు, ముఖ్యంగా ఓ పుస్తకంగా మన చేతుల్లో పడ్డప్పుడు, ఒకదాని వెనుక ఒకటిగా అన్నింటినీ ఏకధాటిగా చదువుతున్నప్పుడు, పాఠకులను ఆకర్షించే విషయం కవితారూప శిల్పం. రూపపరంగా కవితలన్నీ ఒకేలా ఉండడం, ఇలా ఒక్కసారిగా చదివేటప్పుడు గొప్ప సౌలభ్యాన్నిస్తుంది. ముఖ్యంగా ఇతివృత్తాలు (లేదా కవితా వస్తువులు), భావాల్లో స్పష్టమైన మార్పులు కవిత కవితకీ కనిపించడం వల్ల రూపం అదనపు ఆకర్షణై పఠనం వేగంగా సాగుతుంది. వ్యాకరణం గురించి మాత్రం మరో నాలుగు మాటలు చెప్పాలి.

ఇస్మాయిల్, ‘రాత్రి వచ్చిన రహస్యపు వాన’లో, ధనియాలతిప్ప అనే కవితను ఇలా వ్రాస్తారు:

“అంతా ఒక తెల్ల కాగితం.
అందులో ఒక మూలగా
ఒక అడ్డు గీతా
ఒక నిలువు గీతా
తెరచాప ఎత్తిన పడవ
కిందిది నదీ
పైది ఆకాశమూ
కావొచ్చు.”

కవిత ఇంతే. ఈ ఎనిమిది పాదాలే. ఒక వాక్యానికీ మరో వాక్యానికీ విడిగా చదివినప్పుడు పెద్దగా పొంతనేమీ కనపడదు. కానీ, కవిత పూర్తి చేసేసరికి మాత్రం కవితలో ప్రస్తావించబడని నదీతీరంలో చేతులు కట్టుకు నిలబడి, కవితలో ఆవిష్కృతమైన దృశ్యాన్ని చూస్తూంటాం. అదీ ఈ కవితలోని సౌందర్యం. కవిత మొత్తంలో ఎక్కడా ఏ విరామ చిహ్నమూ కనపడదు. అలా అని ఏ విధమైన అస్పష్టతకూ కవిత తావివ్వదు. కవిత్వంలో స్పష్టత, క్లుప్తత, స్వేచ్ఛ అనే మూడు అద్భుతమైన లక్షణాలకు, ఏ కాలంలోనైనా తిరుగులేని ఉదాహరణగా నిలబడగల కవిత ఇది. ఇక్కడ స్వేచ్ఛ అనేది పాఠకుల ఊహాపరిథికి సంబంధించినదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

కవిత్వంలో స్పష్టత, క్లుప్తత అన్ని వేళల్లోనూ అభిలషణీయమే కానీ తేలిగ్గా సాధ్యపడేవి మాత్రం కావు. క్లుప్తత మనం ఎంచుకున్న కవితా వస్తువుకు నప్పదు అనుకున్నప్పుడు భావసాంద్రత మీద దృష్టి నుంచాలి. అలాగే స్పష్టత విషయంలోనూ విరామచిహ్నాల సాయం తీసుకోవడం నేరమనిపించుకోదు. కవిత్వంలో అవేమీ నిషిద్ధాలు కావు. ఈ మాట ఎందుకు చెప్పవలసి వస్తోందంటే, వచన కవిత్వం వ్రాస్తున్న వారిలో చాలా మందికి, పాదాల విరుపే అన్ని బాధ్యతలనూ నిర్వహిస్తుందన్న గుడ్డి నమ్మకమొకటి బలంగా ఉంటుంది. అది నిజం కాదు. ఒక్కోసారి బలమైన ప్రతీక లేదా పదబంధం చేసేపనిని కామా, లేదా ఫుల్‌స్టాప్ చేస్తుందనడం అతిశయోక్తి కాదు. కవి సందర్భానుసారంగా వీటిని వాడకపోతే, కవిత రాణించక, ఇది అస్పష్టతా/ అన్వయదోషమా అనే ప్రమాదకరమైన ఆలోచన పాఠకులలో తలెత్తగలదు.

ఆకుపాట కవి కామా వాడటంలో ఎంచేతనో తటపటాయించి ఆగిపోవడం చాలా చోట్ల కనపడుతుంది. వేళ్ళ మీద లెక్కబెట్టగల్గిన సంఖ్యలో మాత్రమే వీటి వాడకం ఉంది. అడపాదడపా ఎలిప్సిస్ (…) అయినా వాడారేమో కానీ, కామా, ఫుల్‌స్టాప్ పెట్టగలిగిన వీలూ, పెట్టవలసిన అవసరం ఉన్న చోట్ల కూడా రెంటినీ నిర్లక్ష్యం చేశారు. అది కవిత్వంలోని అస్పష్టతగా చాలా చోట్ల నిరాశపరచింది.

వ్యాసంలో మొదట ప్రస్తావించినట్టు, కవితలను పుస్తకంగా చదివితే కలిగే లాభమేమిటో ఈ సందర్భం మరోసారి ఋజువు చేస్తుంది. ఏమంటే, ఆఖరు కవితల వద్దకొచ్చేసరికి, పాఠకులకు అప్రయత్నంగానే విరుపు ఎక్కడ ఉండాలో తెలిసి వస్తుంది. అంటే, ఈ దశలో కవి శైలి పాఠకులకు అర్థమవుతుంది. అతని ముద్రను గమనించగల్గిన మెలకువ ఏర్పడుతుంది. దీనిని పఠితల ప్రతిభగానే గుర్తించడం అవసరం.

అభ్యుదయ కవిత్వం వ్రాసినప్పుడు ఎంత నవ్యమైన ప్రతీకలతో, నిజాయితీని ప్రకటిస్తూ సాగిందో, అంతే నవ్యతతో, ఆర్ద్రతతో అనుభూతి కవిత్వాన్నీ వెలిగించిందీ సంపుటి. జీవితంలో మైలురాళ్ళుగా నిలబడ్డ కొన్ని సందర్భాలను గుర్తుచేసుకుంటూ, ఆనాటి అనుభవాలను వల్లె వేసుకుంటూ —

“ఈ అనుభూతులంతే,
వెన్నెల్నీ జేబులో పెట్టుకోనీయవు
వర్షాన్నీ తాగనీయవు”

అంటాడీ కవి. ఇవి రెండూ తేలిగ్గా, మామూలుగా అనిపించే రెండు మంచి ప్రతీకలు, మంచి వాక్యాలు. వెన్నెల, వర్షం రెండూ ‘తడి’ గుర్తులు. ఈనాటి వెన్నెలను రేపటికి దాచుకుని అనుభవించడం అయ్యే పని కాదు. అలాగే వర్షం కూడా. అంటే, ‘ఆ క్షణంలో’ నిలబడగల్గితేనే వాటి సౌందర్యం ఇనుమడిస్తుందన్నమాట. జీవితమూ అంతే, అనుభవాలూ అంతే. అంతా మన చుట్టూ ఉన్నట్టే ఉంటుంది. కానీ, ఆవేశపడి ముందస్తుగా ఖర్చుపెట్టుకోలేం, ఆశపడి అంతా దాచుకోనూలేము. అనుభవించగలం, అంతే.

అలాగే, ప్రేమ కవిత్వానికి సంబంధించి కూడా, ఈ కవిది ఓ ప్రత్యేకమైన సంతకం. “కారణం లేకుండా ప్రేమించలేను/ ప్రేమే కారణమైనప్పుడు” అంటూ తన ప్రేమ సిద్ధాంతాన్ని కూడా కవిత్వంలో పొందుపరిచారు. “ప్రేమను ప్రేమించిన ప్రేమ, ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమిస్తుంది” అన్నారు కదా, అలాంటి ప్రేమ నిస్సందేహంగా గెలుస్తుంది కూడానూ.

“నువ్వున్న క్షణం/కాలంపై పచ్చబొట్టు” –(కాలంలో ఆమె, గాలంలో నేను, పు:106),

“కాలం తాళం తీసి మరీ లాక్కుంటానా
నీ చిరునవ్వుతో ఆ రాత్రిని వెలిగించుకుంటాను
నువ్వూ.. నేనూ, ఆ ద్వీపం”
–(నువ్వూ, నేనూ..ఓ ద్వీపం, పు: 65)

-లాంటి చక్కటి చిక్కటి కవిత్వముంది ఈ సంపుటిలో.

మరొక ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ సంపుటిలో ఎక్కువ భాగం ప్రథమపురుషలో సాగేవే. ‘నేను’ తఱచుగా కనపడ్డ ఓ పదం. అలాగే ప్రణయ కవిత్వం వ్రాసినప్పుడు పదాల విషయంలో పాటించని పొదుపు, గంభీరమైన విషయాల వద్దకొచ్చేసరికి కనపడి ఓ కొత్త అనుభూతినిస్తుంది. ఉదాహరణకు, మరణం గురించి వ్రాస్తూ,

“కొంచం తులసి తీర్థం, కొన్ని కన్నీళ్ళు
ఓ మరణం ఖర్చు
గుండెడు దుఃఖం, గుప్పెడు వెలితి
ఓ బంధం ఖరీదు;

ఓ ఉల్కలానో, పండుటాకులానో
పుటుక్కున పోయే ప్రాణం
వెళ్ళొస్తానని చెప్పదు.
” –(ఇత్తెఫాక్, పు:84)

ఆత్మీయుల మరణం ఎవ్వరికైనా మిగిల్చేది ఇలాంటి వేదననే. ఆ సార్వజనీయమైన కోణం కవితలో చక్కగా ప్రతిఫలించింది. ఇలాంటి వేదనలు లేదా వ్యక్తిచైతన్యాన్ని విశ్వచైతన్యంతో సంవదింపజేసే సాహిత్యసాధనా ప్రక్రియలు (సాధారణీకరణము, సామాజికీకరణము మరియు స్వాత్మీయీకరణము) విశ్వజనీనం కాబట్టి, ఆ భావాలను ఒడిసిపట్టుకున్న కవిత్వంలో ఏనాడైనా ప్రాణం తొణికిసలాడుతుంది.

తీవ్రతరమైన ఆవేశాలను కూడా లలితమైన పదాల్లో వ్యక్తీకరించగల్గిన నేర్పును వ్యక్తిత్వ ఛాయగా కవిత్వంలో విడిచిపెడుతూ, సమాజంలోని బురదను క్షాళించే ఇందుపగింజల వంటి ఖండికలకు కవిత్వంలో సముచిత స్థానమిస్తూ, అత్యంత నవీనమైన బింబకల్పనా విథానంతోనూ, సహృదయపాఠకులను అలరించే శయ్యావిశేషాలతోనూ, ఈ తరపు కవిత్వానికి ఓ బలమైన ప్రతిధ్వనిగా వినపడే రచన చేశారు వాసుదేవ్.

ఎంత చెప్పినా, ఎన్ని గమనికలు వ్రాసినా, ఇవన్నీ ఒక ఒక సంపుటిని ఉదాహరణగా తీసుకుని కవి తత్వాన్నీ లేదా మొత్తంగా కవిత్వాన్నీ మరింత విస్తృతంగా, ఉదాత్తభావజాలంతో అర్థం చేసుకునే ప్రయత్నమే తప్ప వేరొకటి కాదు. కవిత్వానికి తూకపు రాళ్ళు శాస్త్రాలు కావు, అనాదిగా మనం నమ్ముతున్న నియమాలూ కావు. ఒక్కో కవితా చదివాక, అది మనకంటూ మిగిల్చే అనుభవాల సాంద్రతే కవిత్వ విలువకు గీటురాయి.

[ఆకుపాట – వాసుదేవ్ కవితా సంకలం. జె.వి. పబ్లిషర్స్ ప్రచురణ, పే. 118. 2014. ఈపుస్తకం కినిగె ద్వారా, ప్రతులు అన్ని పుస్తకాల దుకాణాల్లోనూ లభ్యం.]

మానస చామర్తి

రచయిత మానస చామర్తి గురించి: ఇంజనీరింగ్ (కంప్యూటర్స్) 2005లో పూర్తి చేసి ఐ.టి. రంగంలో ఉద్యోగం. ప్రస్తుత నివాసం బెంగలూరు. మధుమానసం అన్న బ్లాగ్ ఉంది వీరికి. అలతి అలతి పదాలతో లోతైన కవిత చెప్పగల వీరు కవిత్వంలోను, సాహిత్యవిమర్శలోను తనదైన గొంతు వినిపిస్తున్నారు. ...