వైజ్ఞానిక రంగంలో తెలుగులోకి అనువాదాలు చెయ్యటంలో సాధక బాధకాలు

సంగ్రహం

వైజ్ఞానిక, సాంకేతిక రంగాలలో ఉన్న ఇంగ్లీషుని తెలుగులోకి మార్చటంలో ఉన్న సమస్యలని, వాటి పరిష్కార మార్గాలని అభివర్ణించటం జరిగింది. తెలుగులోకి అనువదించబడ్డ పాఠ్యాంశంలో తెలుగు నుడికారం ఉట్టిపడాలంటే తెలుగు వాడకంలో దొర్లే ఇంగ్లీషు తత్సమాలు 25శాతం మించకుండా ఉంటే బాగుంటుందని ప్రతిపాదించటం జరిగింది. ఈ గమ్యాన్ని చేరుకోవటం కష్టమేమీ కాదు. మొదట, ఇంగ్లీషు మాటలని యథాతథంగా పెద్ద ఎత్తున గుచ్చెత్తి వాడెయ్యకుండా, సాధ్యమైనంత వరకు ఉన్న తెలుగు మాటలని వాడటానికి ప్రయత్నం చెయ్యటం. రెండు, సమానార్థకమైన తెలుగు మాట లేకపోయినా, వెనువెంటనే స్పురించకపోయినా ఇంగ్లీషు తత్సమాలని వాడటం కంటె తెలుగు ఉచ్చారణకి లొంగే తద్భవాలని వాడటం. మూడు, సందర్భానికి సరిపోయే భావస్పోరకమైన తెలుగు మాటలని అవసర రీత్యా సృష్టించి వాడటం. నాలుగు, ఇంగ్లీషు వాడుకలో స్థిరపడిపోయిన దుర్నామాలని యథాతథంగా తెలుగులోకి దింపేసుకోకుండా జాగ్రత పడటం. చివరగా, ఈ ప్రయత్నాలన్నీ విఫలమైన సందర్భాలలో ఇంగ్లీషు మాటలని తెలుగు లిపిలో రాయటం. (ముద్రణకి వీలయినప్పుడు, పక్కని కుండలీకరణాలలో ఇంగ్లీషు లిపిలో చూపించటం.) ఈ సూచనలన్నీ ఆచరణయోగ్యాలేనని స్వానుభవం చెబుతోంది.

1. ప్రవేశిక

ఆధునిక వాణిజ్య, వ్యాపార, వైజ్ఞానిక, సాంకేతిక రంగాలలో విస్తారంగా వాడుకలో ఉన్న ఇంగ్లీషుని సరళమైన, భావస్పోరకమైన, దేశీ నుడికారంతో ఉట్టిపడే తెలుగులోకి మార్చటంలో ఉన్న కష్టసుఖాలని విశ్లేషించి, ఆచరణయోగ్యమైన సలహాలు ఉత్పాదించాలనే కోరిక ఈ వ్యాసానికి ప్రేరణ కారణం. అనువాదకుడు సాంకేతిక, వైజ్ఞానిక రంగాలలో అనుభవజ్ఞుడనిన్నీ, అతని మాతృభాష తెలుగనిన్నీ అనుకుందాం. ‘అంతా ఇంగ్లీషు నేర్చేసుకుంటే పోలేదా? అపారమైన ఇంగ్లీషు వైజ్ఞానిక సాహిత్యాన్ని తెలుగులోకి దింపటానికి ప్రయత్నించటం అవివేకం కాదా?’ వంటి ప్రశ్నల మీద తర్జనభర్జనలు జరపడానికి ఇది వేదిక కాదు, సమయమూ కాదు.

ముందుగా కొన్ని నిర్వచనాలతో మొదలుపెడదాం. ఒక భాషనుండి మరొక భాషలోకి తర్జుమా (డెరివేషన్, derivation) చెయ్యడానికి రెండు పద్ధతులు ఉన్నాయి: అనువాదం (ట్రాన్స్‌లేషన్, translation), అనుకరణ (ఎడాప్టేషన్, adaptation). ఈ అనుకరణలనే ‘స్వేచ్ఛానువాదాలు’ అనటం కూడ కద్దు. కవిత్రయం తెలిగించిన ఆంధ్ర మహాభారతం సంస్కృత మూలానికి అనుకరణ. ఏనుగు లక్ష్మణకవి తెలిగించిన నీతి శతకం సంస్కృత మూలానికి అనువాదం. అనుకరణ చేసేటప్పుడు మూలానికి మార్పులు, చేర్పులు చేసే వెసులుబాటు ఉంటుంది.

వైజ్ఞానిక, సాంకేతిక, వాణిజ్య, వ్యాపార రంగాలలో ఇంగ్లీషు నుండి ఇతర భాషలలోకి తర్జుమా చెయ్యవలసిన అవసరం తరచు వస్తూనే ఉంటుంది. పాఠ్య పుస్తకాలు, ఉపకరణాలు ఎలా వాడుకోవాలో తెలియజేసే కైపొత్తాలు (handbooks), కల్పనా సాహిత్యం, మనోవికాసక గ్రంథాలు, జనరంజక విజ్ఞానం, మొదలైన వాటిని ఏ ముక్కకాముక్క అనువదించకపోయినా పరవాలేదు – అనుకరణ సరిపోతుంది. కాని ఆర్ధిక విషయాలు, లావాదేవీలకి సంబంధించినవి, ఆస్తి హక్కులకి సంబంధించిన దస్తావేజుల వంటి రూఢి పత్రాలు, వగైరాలు అనుకరిస్తే సరిపోదు – వాటిని అనువదించాలి. ఇలా అనువాదాలకి, అనుసరణలకి మధ్య తేడాలు ఉన్నాయని గుర్తించి, రాత సౌకర్యం కొరకు ఈ రెండు ప్రక్రియలనీ గుత్తగుచ్చి అనువాదాలనే అందాం. అవసరం వచ్చినప్పుడు తేడాని గుర్తిస్తూ మాట్లాడుకోవచ్చు.

మన జీవితాలలో మూడు రకాల అనువాదాల అవసరం కనబడుతుంది: (1) తీరుబడిగా మూల గ్రంథాన్ని చదివి, జీర్ణం చేసుకుని, అనువాదం తయారు చేసి, దానిని బిగుతుగా తిరగ రాయటం, (2) ఒక గడువుని చేరుకోవాలనే తొందరలో మూల గ్రంథాన్ని చదువుతూ, త్వరగా అనువాదాన్ని తయారు చెయ్యటం. (పత్రికా విలేఖరులు తరచుగా ఎదుర్కునే సమస్య ఇది,) (3) ఒక వ్యక్తి ఇంగ్లీషులో మాట్లాడుతూ ఉంటే, అదే సమయంలో దానిని తెలుగులో చెప్పటం. ప్రస్తుతం ఇక్కడ ప్రస్తావన మొదటి అంశానికే పరిమితం.

1.1 దేశ, కాల, సంస్కృతులని పరిరక్షించటం

ఇరవై ఒకటవ శతాబ్దంలో ఈ ప్రపంచం సమతలంగా మారుతోందని ఉత్ప్రేక్షిస్తున్నారు. ఇక్కడ ‘సమతలం’ అంటే దేశకాల పరిస్థితుల వల్ల కాని, ఆర్ధిక భేదాల వల్ల కాని, రాజకీయ సిద్ధాంత ధోరణులవల్ల కాని బాహ్యంగా ప్రస్పుటమయే అడ్డుగోడలని పగులగొట్టి ప్రపంచం అన్ని చోట్లా ఒకేలా కనిపిస్తోందని భాష్యం చెప్పుకోవచ్చు. ఎన్ని అడ్డు గోడలని ఛేదించినా మాట్లాడే మాట, రాసే రాత అనే గోడ ఇంకా బలంగానే ఉందని చెప్పడానికి రెండు ఉదాహరణలు: (1) సెల్ ఫోను సౌకర్యం ప్రపంచమంతటా పాకిపోయింది. మంగలి, చాకలి, కమ్మరి, కుమ్మరి, సర్వులూ వాడుతూన్న పరికరం ఇది. వీరందరికీ ఇంగ్లీషు రావాలంటే ఎలా? ఈ పరికరాన్ని వాడుకునే విధివిధానాలు వారికి తెలుగులో చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇంగ్లీషు మోజులో పడిపోయిన వారికి ఆ అవసరం కనబడక పోయినా నోకియా వాడికి కనబడింది. (2) తెలుగువాళ్లు తండోపతండాలుగా విమానాలలో ప్రయాణాలు చేస్తున్నారు. వీరిలో తెలుగు తప్ప మరొక భాషతో వెసులుబాటు లేని వాళ్లు ఉంటూనే ఉన్నారు. వీరు విమానంలో కక్కసు దొడ్లోకి వెళ్ళి అక్కడ పాయిఖానా వసతులని వాడుకోవటం తెలియక వాటిని పాడు చేస్తున్నారు. మన మీద అభిమానం కొద్దీ కాకపోయినా వాడి విమానం శుభ్రంగా ఉండాలని ఎమిరేట్స్ విమానం కంపెనీ కక్కసు ఎలా వాడుకోవాలో తెలుగులో (తమిళంలో లేదు, మళయాళంలో లేదు, మరాఠీలో లేదు) సూచనలు రాసేరు. ఇంగ్లీషుని తెలుగులోకి మార్చి రాయవలసిన అవసరం నోకియా వాడికీ, ఎమిరేట్స్ వాడికీ కనబడింది.

ఇంగ్లీషుని తెలుగులోకి మార్చే సందర్భాలలో కొన్ని సాంస్కృతికమైన ఇబ్బందులు కూడ ఉంటాయి. ఉదాహరణకి ఇంగ్లీషులో, ‘మై మదర్, యువర్ మదర్’ అన్న పదబంధాలు ఉన్నాయి. వీటిని తెలుగులోకి అనువదించేటప్పుడు యడాగమసంధితో ‘నాయమ్మ, నీయమ్మ’ అని అనువదిస్తే నీచ్యార్థం ధ్వనించే అవకాశం ఉంది. మూలంలో బహువచనం లేకపోయినా, తెలుగు నుడికారానికి తల ఒగ్గి, వీటిని ‘మా అమ్మ, మీ అమ్మ’ అని మార్చితేనే బాగుంటుంది.

అమెరికాలో బేస్‌బాల్ బహుళ జనాదరణ పొందిన ఆట. అమెరికావారు మాట్లాడే భాషలో ఈ ఆటకి సంబంధించిన ఉపమానాలు, రూపకాలు అనేకం. వాటిని యథాతథంగా ఇంగ్లీషులోనే ఉంచినా, భావం తెలుగువారికి అర్థం కాదు – ఆటతో పరిచయం లేకపోవటం వల్ల. ఉదాహరణకి, హి హిట్ ఎ హోమ్ రన్ (He hit a home run) అంటే వాడి ప్రయత్నం బాగా ఫలించింది, అని అర్థం. ఎ బాల్ పార్క్ ఫిగర్ (a ball park figure) అంటే అంచనా, లేదా సుమారుగా చెప్పినది. గో టు బేట్ ఫర్ సమ్‌వన్ (go to bat for someone) అంటే మరొకరి తరఫున వకాల్తా పుచ్చుకుని సమర్ధించటం అని కాని, మరొకరికి చేయూత ఇవ్వటం అని కాని అర్థం. వీటిని సమానార్థకాలైన ఏ క్రికెట్ పరిభాషలోనో అనువదించాలి లేదా నేను పైన ఉదహరించిన మాదిరి తెలుగు నుడికారంతో అనువదించాలి.

అదే విధంగా తేదీ, నెలా రాసే పద్ధతి ప్రపంచం అంతా ఒకే ఒరవడిలో లేదు. వీటిని మనకి అలవాటైన రీతిలో రాసుకోవాలి. మూలంలో ఉన్న కొలమానాలని మెట్రిక్ పద్ధతిలోకి మార్చి రాయాలి. మిలియన్లని, బిలియన్లని లక్షలు, కోట్లు అని మార్చటమే కాకుండా సున్నలని గుంపులా విడగొట్టి, కామాలు పెట్టే తీరులో తేడాని గమనించాలి. (ఒక మిలియనుని 1,000,000 అని రాస్తారు కాని పదిలక్షలని 10,00,000 అని రాయాలి.) డాలర్లని రూపాయలలోకి మార్చి చూపదలుచుకుంటే వాటి మారకపు విలువ కూడ ఇస్తే వ్యాసం కాలదోషానికి గురి కాదు. ఈ విషయాలు ప్రధానాంశాలు కాకపోయినా ఇటువంటి జాగ్రతలు పాటిస్తే అనువాదం రాణిస్తుంది, రక్తి కడుతుంది.

2. ఇంగ్లీషు, తెలుగు భాషల పరిణతిలో పోలికలు

ఇంగ్లీషు నుండి తెలుగులోకి అనువాదం చేసే ప్రక్రియ మీద మన దృష్టి సారించినంతసేపూ, ఈ రెండు భాషలు ప్రస్తుతం అవి ఉన్న స్థితికి ఎలా చేరుకున్నాయో ఒక సారి సమీక్షించటం ఉపయుక్తం. మొదట్లో ఉత్తర జెర్మనీ, నెదర్లాండు దేశాలలో ప్రజలు ఇంగ్లండు వలస వచ్చినప్పుడు వారితో సంబంధితమైన భాషలని కొన్నింటిని తీసుకు వచ్చారు. ఆ కలగాపులగం భాషని పాత ఇంగ్లీషు (Olde English) అనీ ఏంగ్లో-సేక్సన్ (Anglo-Saxon) అనీ అనే వారు. ఈ ఏంగ్లో సేక్సన్ మీద రెండు శక్తుల ప్రభావం బాగా పడింది. సా. శ. 8, 9 శతాబ్దాలలో స్కేండినేవియా (ఇప్పటి నార్వే, స్వీడన్, ఫిన్లండ్) నుండి ఉప్పెనలా కొంతమంది వచ్చి పడ్డారు. తరువాత ఫ్రాన్సు కోస్తా ప్రాంతానికి చెందిన నార్మండీ నుండి మరికొంతమంది వచ్చి స్థిరపడ్డారు. ఈ ఊపులో ఇంగ్లీషులోకి తొంబతొంబలుగా ఫ్రెంచి మాటలు వచ్చి కలిసేయి. ఇప్పటికీ ఇంగ్లీషులో ఫ్రెంచి మాటలు దరిదాపు 25 శాతం ఉంటాయి. తరువాత ఐరోపాలో ఉద్భవించిన పునర్వికాసం వల్ల ఇంగ్లీషులో ఇబ్బడిముబ్బడిగా లేటిన్, గ్రీకు మాటలు వచ్చి చేరాయి. అందుకనే వైజ్ఞానిక, సాంకేతిక రంగాలలో వాడే ఇంగ్లీషుకి లేటిన్, గ్రీకు వాసనలు బాగా అంటుకున్నాయి. దీనికి తోడు వలస రాజ్యాధిపత్యం వల్ల ప్రపంచ భాషలలో మాటలు ఎన్నో కలిసిపోయి ఇంగ్లీషు ఒక ప్రతిదేయ (బారోయింగ్, borrowing) భాషగా వర్ధిల్లి ప్రపంచ భాషగా అవతరించింది.

తెలుగు దక్షిణ-మధ్య భారతంలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్‌లో వినిపించే ద్రావిడ భాష. సా. శ. 2011లో, వేసిన అంచనా ప్రకారం భారతదేశంలో 8.3 కోట్ల ప్రజలు తెలుగు మాట్లాడుతున్నారు. ప్రపంచ భాషలలో అత్యధికులు మాట్లాడే భాషల జాబితాలో తెలుగుది పదమూడవ స్థానం. కనీసం ఆరవ శతాబ్దపు శాసనాల నుండి తెలుగు లిఖిత రూపంలో కనిపిస్తోంది. ఆదికావ్యంగా ప్రశస్తి పొందిన నన్నయ తెలుగు భారతం పదకొండవ శతాబ్దానికి చెందింది. ఈ సమాచారాన్ని బట్టి ఆధునిక తెలుగు, ఆధునిక ఇంగ్లీషు సమాతరంగా ఎదిగేయని అనుకోవచ్చు.

ఫ్రెంచి, లేటిన్, గ్రీకు భాషలలోని మాటలు ఇంగ్లీషులో చేరినట్లే సంస్కృతం, ఇంగ్లీషు భాషలనుండి తెలుగులోకి పదజాలం విపరీతంగా వచ్చింది. తెలుగు మీద సోదర భాషల ప్రభావం ఉన్నా సంస్కృతం ప్రభావం అత్యధికం: సంస్కృతాన్ని తెలుగు లిపిలో రాసే సౌలభ్యం కోసం ఒత్తక్షరాలు తెలుగులో వచ్చి చేరాయి. కనుక ఇంగ్లీషుకి లాగే తెలుగుకి కూడ పరభాషలని తనలో ఇముడ్చుకునే శక్తి ఉంది. ఈ లక్షణాన్ని చూసే హాల్డేను (Haldane) తెలుగుని రాజభాష చెయ్యాలంటూ కితాబు ఇచ్చేడు.

అయినప్పటికీ వాక్య నిర్మాణంలో తెలుగుది ద్రావిడ భాషా సంప్రదాయమే. తెలుగు వాక్యంలో కర్త-కర్మ-క్రియ ఆ వరుసలో వస్తాయి. తెలుగు నామవాచకాలు వచనాన్ని బట్టీ, లింగాన్ని బట్టీ, విభక్తిని బట్టీ ద్రావిడ భాషా సంప్రదాయానుసారం రూపాంతరం చెందుతాయి.