అంపశయ్య: మరొకసారి కొత్తగా!

చైతన్య స్రవంతి శిల్పం

చైతన్య స్రవంతి ప్రసక్తి లేకుండా అంపశయ్య మీద చర్చ ఏ సందర్భం లోనూ పూర్తి కావడం అసాధ్యం. శిల్పం విషయంలో ఈ నవల మీద జరిగినంత చర్చ ఇంకే తెలుగు నవల మీదా జరగలేదేమో! ఈ నవల రాసిన నేపథ్యం గురించి నవీన్ ఇలా అంటారు: “ఈ నవల రాసిన కొత్తల్లో సీతారామారావు అనే కామర్స్ లెక్చరరుకు నేను రాస్తున్న నవలలోని కొన్ని భాగాల్ని చదవమని ఇచ్చాను. ఆయన ఆ పేజీలని చదివి ‘దీన్ని చైతన్యస్రవంతి శిల్పం అంటార’ని చెప్పి, జాయిస్ రాసిన యూలిసిస్ చదివావా? అని అడిగారాయన… అలాగే తెలుగులో బుచ్చిబాబు చైతన్యస్రవంతి పేరుతోనే ఒక కథ రాశాడు చదవండి,’ అన్నాడు. నేను వెంటనే ఆ పుస్తకాల్ని చదివాను. యూలిసిస్ చదివాను గాని పెద్దగా అర్ధం కాలేదు. మొత్తం మీద 1967లో అంపశయ్య నవల ఎవరినీ అనుకరించకుండా, నాకు తోచిన పద్ధతిలో రాసి పూర్తిచేశాను.”

అయినప్పటికీ, నవీన్‌కి మొదటి నుంచీ చైతన్య స్రవంతి విధానం మీద ఆసక్తి ఎక్కువగానే తోస్తుంది. సంప్రదాయ పద్ధతుల్లో కాకుండా చైతన్య స్రవంతి పద్ధతిలో రాయాలని నవీన్ తానూ ఎమ్మే చదివే రోజుల్లోనే అనుకున్నారట. ఈ నవల ప్రచురించిన సృజన పత్రిక ‘ప్రయోగాత్మక నవల’ అంటూ ప్రకటించడంతో పాఠకుల దృష్టిని వెంటనే ఆకర్షించింది. అప్పట్లోనే ఈ రచనా విధానాన్ని ప్రశంసిస్తూ, విమర్శిస్తూ అభిప్రాయాలు వెలువడ్డాయి.


అంపశయ్య – ప్రకటన
(సృజన పత్రిక, 1969.)

మినీ విమర్శ పేరుతో సృజనలో త్రిపురనేని మధుసూదన రావు వ్యక్తం చేసిన అభిప్రాయం తీవ్రమైనది: “ప్రయోగం ఒక పిచ్చి. ఏ పిచ్చి అయినా అభ్యుదయ వ్యతిరేకం. ఏదీ అందరికీ అర్థం కాని మాట నిజం. వీలైనంత ఎక్కువమందికి అర్థమయ్యేలా రాయడానికి ప్రయత్నించడం అభ్యుదయ రచయిత విధి. తాడితుల, పీడితుల పక్షాన శాస్త్రీయంగా నిలబడ్డ రచయితకి ప్రయోగ చాపల్యం ఉరితాడు. చైతన్య స్రవంతి, మనస్తత్వ శాస్త్రాన్ని సాహిత్యంతో సమన్వయింప చూసిన వికార మేధావుల కృత్రిమ కల్పన. అంపశయ్య ఆ కృత్రిమ వికార అనభ్యుదయానికి శిశువు. ఈ నవల లోని ప్రధాన అభ్యుదయ వాతావరణం 18 గంటల్లో అదీ చైతన్య స్రవంతిలో ఇమడటం అసాధ్యం! తాను చెప్పదల్చుకున్న ప్రధాన భావాన్ని జాగ్రత్తగా నిర్మించుకుని దాన్ని 18 గంటల్లో జరిగిందని వర్ణించడం చైతన్య స్రవంతి విధానానికి విరుద్ధం! అభ్యుదయ రచయితలు విధిగా బూర్జువా ప్రయోగాల సుడిగుండం నుంచి బయట పడితీరాలి. అంపశయ్య చైతన్య స్రవంతి ప్రయోగమూ కాదు, శాస్త్రీయమైన అభ్యుదయ దృక్పథం ప్రతిపాదించేదీ కాదు!”

దీనికి జవాబుగా కె. వెంకట నారాయణ సృజన తర్వాతి సంచికలో రాసిన మినీ ప్రశంస చూడండి: “ప్రయోగం ప్రతిదీ పిచ్చి కాదు. ప్రయోగం ప్రయోగం కొరకే పరిమితమై ప్రయోజన రహితమైనపుడు అది పిచ్చి. అంపశయ్య ప్రయోగాత్మకమైనదే కాదు, ప్రయోజనాత్మకమైన నవల కూడా! అంతే కాక నిలవ నీళ్లలా కుళ్ళిపోయిన తెలుగు కవిత్వాన్ని దిగంబర కవుల ప్రయోగాలు ఎలా కడిగి పారేశాయో, నవీన్ ప్రయోగం ఆ ప్రయోగాలతో సరిపోల్చదగింది. పిచ్చిగా కనిపించిన దిగంబర కవుల ప్రయోగాల్లోని ఆగ్రహం తెలుగు పాఠకులని నిద్ర లేపినట్లే అంపశయ్యలోని పిచ్చులూ భ్రమలూ, చైతన్య స్రవంతి టెక్నిక్, ఐడియలిజం… వీటి మాటున దాగిన విద్యావిధానం లోని డొల్లతనం, కుట్ర, నిష్ప్రయోజత ఇవన్నీ బలంగా పాఠకులకు కనిపిస్తూ నిద్ర లేపే ప్రయత్నం చేశాయి.”

అయితే పై రెండు అభిప్రాయాలకూ, చలసాని ప్రసాదరావు చక్కగా సమన్వయం కుదిర్చారు, రెండో ముద్రణకు రాసిన ముందు మాటలో: “పాశ్చాత్యులు ప్రాణం పోసి, ఘనంగా ప్రచారం చేసి పెద్ద పీట మీద నిలబెట్టిన చైతన్య స్రవంతి సిద్ధాంతం వాస్తవానికి వ్యక్తివాదానికి, అరాచక ధోరణులకూ పట్టం కట్టి మానసికమైన చీకటి గుహల్లో విహరింప జేసే ప్రయత్నం! అదొక శైలిగా ముందుకు వచ్చినపుడు తిరస్కరించ దగినదైంది. అంపశయ్య నవల్లో ప్రయోగశీలత కోసమని వస్తువుని బలిపెట్టడం జరగలేదు. పాఠకుడు స్వేచ్ఛగా రచనా సారాన్ని ఆస్వాదించుకుంటూ, చదువుకు పోగలిగేలా రచన ఉన్నాదా లేదా? అన్నదే ఆ శైలిలో రచయిత విజయాన్ని సాధించగలిగాడా లేదా అనే దానికి గీటు రాయి.”

పాఠకులు కూడా దీన్ని ఇలాగే స్వీకరించడం వల్లే నవల లోని ‘చదివించే లక్షణాన్ని’ పట్టుకున్నారు. చదువుతూ పోతుంటే కొంత సేపటికి రవిలో పాఠకుడు ప్రవేశించి రవిలో నుంచి యూనివర్సిటీని చూస్తూ రవిలో నుంచి ఆలోచిస్తూ సాగిపోతాడు కాబట్టి త్వరగానే అలవాటు పడి పోతాడు. ఒక కొత్త రచనా శైలిని తాను చదువుతున్నాననే భావన పాఠకుడికి కలగదు. బుచ్చిబాబు ఫెయిల్ ఐన చోట రావిశాస్త్రి (నవీన్ కూడా) సఫలమయ్యారని చలసాని అనడంలో కీలకం ఇదే. అదీ కాక నవల మొత్తం చైతన్య స్రవంతిగా సాగదు. మధ్య మధ్యలో దాని లోంచి బయటికి వచ్చి మామూలు కథ నడుస్తూ ఉంటుంది. అందువల్ల ఒక సుడిగుండంలో కొట్టుకు పోతున్న భావన పాఠకుడికి కలగదు.

నవీన్ తన నవలకు ఈ శిల్పం నప్పుతుంది కాబట్టి దీన్ని ఎంచుకున్నానని చెప్పినట్లు కనిపిస్తుంది కానీ మనోవిశ్లేషణ మీద ఆయనకు పట్టు, ఆసక్తి కూడా ఉన్నాయి. సృజనలో ఆయన 1967లో ‘దయానిధి మనస్తత్వ పరిశీలన,’ అనే విషయం మీద ఒక విశ్లేషణాత్మక వ్యాసం రాశారు. అంతటి ఆసక్తి ఉండటం వల్లే నవీన్ ఒక సగటు మనిషి మనస్తత్వాన్ని అంపశయ్యలో అంత గొప్పగా విశ్లేషిస్తూ పోయారనిపిస్తుంది. రవి మనస్తత్వంలో కనిపించే వైరుధ్యాలు, తనలో తాను కుంగిపోవడం, అసమర్థుడినని అంతరాత్మ దగ్గర ఒప్పేసుకుంటూ, అంతర్ముఖుడిగా కనిపిస్తూనే మరో వైపు తన ఆధిపత్యాన్ని నిరూపించుకోడానికి స్నేహితుల ముందు ప్రయత్నించడం, వొద్దు వొద్దనుకుంటూనే లైంగిక దృష్టితో ఆలోచించడం, ఆచారిలా పూజలు చేస్తేనైనా చదువు మీద శ్రద్ధ కలుగుతుందేమో అనుకోవడం, మళ్ళీ ఆ ఆలోచన మీద తనని తానే విమర్శించుకోవడం — ఇవన్నీ ప్రతి మనిషిలోనూ దాగుండే కోణాలే!

ఆలోచనా స్రవంతిని ఆపడం ఎవరి తరం?

రవి మానసిక విశ్లేషణ

ఈ నవలను మానసికశాస్త్ర కోణం లోంచి విశ్లేషించి చూపిన డాక్టర్ నిరంజన్ రెడ్డి వ్యాసంలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తాయి. నవీన్ ఈ నవలా నేపథ్యానికి మనోవిశ్లేషణకు చెందిన కొన్ని శాఖల్ని కూలంకషంగా అధ్యయనం చేసుంటారని డాక్టర్ రెడ్డి అభిప్రాయ పడ్డారు.

ఆచారి, రవి — ఈ ఇద్దరినీ రెండు విభిన్న మనస్తత్వాలు గల పాత్రలుగా పోలుస్తుంది ఈ వ్యాసం. రవికి వచ్చే కలల్ని సైతం డాక్టర్ రెడ్డి ఫ్రాయిడ్ కలల విశ్లేషణ ఆధారంగా విశ్లేషించారు. ఆయన మాటల్లోనే: “రవికి కలలో కనిపించిన శిఖరాలు అతను చేరుకోవలసిన గమ్యాలు, లక్ష్యాలు. అవి ఎంత ఎత్తుగా ఉన్నాయంటే వాటిని చేరుకోడానికి అతడెంతో శ్రమించాల్సి ఉంటుందనీ, కొండ చిలువలు పొంచి ఉన్న ప్రమాదాలకు సంకేతమనీ అర్థం చేసుకోవలసి ఉంటుంది. అలాగే రవి కలలో అందరి లాగే తను కూడా రత్తి పైకి రాయి విసరడం అతనిలోని అపరాథ భావనకు సంకేతం! సమస్యను ధైర్యంగా ఎదుర్కోకుండా, నైతికంగా పతనమై పోయి గుంపులో గోవిందయ్యగా మారిపోతున్నానని రవి తనను తాను శిక్షించుకోవడం కూడా ఈ కలలో రవి రత్తి మీద రాయిని విసరడం సూచిస్తుంది.”

అలాగే కలలో రవికి తల్లి ఎన్ని సార్లు కనిపించినా ఆమె అతనితో మాట్లాడదు. దీన్ని వ్యాస రచయిత ఫ్రాయిడ్ మనోవిశ్లేషణలో వివరించిన Id, Ego, Super Egoలను తీసుకుని విశ్లేషిస్తారు. మనిషిలో నీతి నిజాయితీ నడవడికల్ని ప్రశ్నించే సూపర్ ఇగోని అతని తల్లికి ప్రతీకగా వర్ణిస్తారు. అంటే తాను సరిగా చదవనందుకు శిక్షగా తల్లి (సూపర్ ఇగోగా) అతనితో మాట్లాడకుండా అతని శిక్షిస్తున్నట్లుగా రవి అమ్మ మౌనాన్ని అర్థం చేసుకుంటాడని మనం భావించాలి. టాయ్‌లెట్ల గోడల మీద అశ్లీలమైన రాతలు, తాళం వేస్తూ తీస్తూ ఆ శబ్దాన్ని ఇష్టపడటం, ట్యూబ్ లైట్ స్విచ్ ఆన్/ఆఫ్ చేయడం (ఇంకా చెప్పాలంటే టాప్ తిప్పి, వేగంగా నీళ్ళు రావడాన్ని రవి ఇష్టపడటం కూడా అని నా ఊహ) ఇవన్నీ రవి వయసు యువకుల్లో రేగే లైంగిక అశాంతిని అణిచేసుకోడానికి చేసే ప్రయత్నాలుగా వ్యాసకర్త వివరిస్తారు.

రవి, అతడి మిత్రులు, ‘మనం ఎంత చదివినా మనకసలు ఫస్ట్ క్లాస్ వస్తుందా? వచ్చినా మనం చేయబోయేది ఎల్డీసీ ఉజ్జోగమే కదా, అందుకే కష్టపడి తిరగడం వేస్ట్, జల్సాగా తిరగడమే బెటర్,’ అని ఆలోచించడాన్ని వ్యాస రచయిత ఈగో డిఫెన్స్ మెకానిజమ్‌గా వివరిస్తారు. నిజానికి రవి ఈ నవల్లో అనేక సార్లు (వేరే వారి మాటల ప్రభావం వల్లనైనా సరే) అలా ఆలోచిస్తాడు. అతనికి ఫస్ట్ క్లాస్ రాకపోవడానికి తను ప్రొఫెసర్ కులం కాక పోవడమే తప్ప తను చదవక పోవడం కాదని తన మీద తప్పు లేకుండా చూసుకోవాలని ప్రయత్నిస్తాడు. ఇది విద్యార్థుల్లో అనే కాదు, మనుషులందరిలోనూ ఉండే ధోరణే. తనకు జరిగే నష్టానికి, తన అసమర్థతకు ఎదుటి వాడిని బాధ్యుడిగా చేయడం!

రత్తి, రవి గత జీవితానికి సంబధించిన పాత్ర అయినా అతడి వర్తమానంలో ఆమె జ్ఞాపకాలు మానని పుండులా రేగుతూనే ఉంటాయి. రత్తి తను కోరుకున్న ప్రేమ దక్కకపోగా ఆమె మీద అత్యాచారం జరగడంతో ఆమె తనను తాను కసితో వేశ్యగా మార్చుకుంటుంది. ఆమెలో రేగిన అపరాథ భావనను Cognitive Dissonanceగా (తాను నమ్మిన విలువలు సరైనవి కాదు, వాటికి అర్థం లేదు అనుకున్నపుడు మనిషి అంతరంగంలో రేగే సంఘర్షణ) నిరంజన్ రెడ్డి వివరిస్తారు.

అంపశయ్య నవల మీద వచ్చిన విశ్లేషణల్లో ఇదొక మంచి విశ్లేషణ! అయితే రవి తరచూ ‘తానూ చనిపోతే?’ అన్న ఆలోచనను ఆశ్రయించి, దాని మీద ఎవరెవరు ఎలా స్పందిస్తారో ఉహించుకుని వేదన చెందడాన్ని మనస్తత్వశాస్త్రం ప్రకారం ఎలా విశ్లేషిస్తారో అన్న సందేహం వచ్చింది నాకు. అయితే ఈ సందేహానికి వ్యాసంలో వివరణ లేదు.

కథలో లోటుపాట్లు

రవి ఆర్థిక పరిస్థితి నవల్లో నవల మొత్తం మీద ఎన్నో సార్లు ప్రస్తావనకు వస్తుంది.అతని కష్టాలన్నీ అక్కడే మొదలుతాయి. రవి ఆలోచనలు, నిస్సహాయత, దుర్బలత్వం, మరో పక్క కొంత ఎగ్జిబిషనిజం (కిరణ్మయి విషయంలో, ఫ్రెండ్స్‌తో వాదించే విషయంలో) ఇవన్నీ రవిని ఒక మధ్య తరగతి యువకుడిగా చిత్రీకరిస్తాయి పాఠకుడి మదిలో. కానీ దూడను అమ్మితే తప్ప ఫీజు కట్టలేని దీనస్థితిలో ఉంటుంది అతని కుటుంబం. షావుకారు దగ్గర అప్పులు చేస్తూ నలిగిపోతూ ఉంటుంది. పల్లెల నుంచి అతి పేదరికంతో చదువుకోడానికి సిటీ వచ్చిన యువకుల్లో ఉండే తక్కువ భావం, ఒద్దిక రవిలో కనిపించవు. అలాగని అలాటి పేదరికం వల్ల వచ్చిన నిర్లక్ష్యమూ కనిపించదు. రవిలో కనిపించే ఈ అశక్తత కేవలం మధ్యతరగతిది. డబ్బులు చాలకపోవడం అనేది చాలామంది అనుభవించేదే. రవిలో కనిపించేవి ముమ్మూర్తులా మధ్యతరగతి లక్షణాలు. అందువల్ల రవిని మరీ డబ్బులేనివాడిగా చిత్రించడం, రచయిత స్వానుభవం లోంచి వచ్చిందైనా, అది పాఠకులకు ఒక పట్టాన కొరుకుడు పడదు. రవిని మరీ అంత దుర్భర నేపథ్యం నుంచి చూపడం అనవసరం అనిపిస్తుంది.

రత్తి ఒక బలమైన పాత్ర ఈ నవల్లో అయినప్పటికీ ఆమె పాత్ర కథకు ఏ విధంగానూ అవసరం లేనిది. నవల మొదట్లోనే రవిని వెంటాడుతాయి రత్తి జ్ఞాపకాలు, ఆమెకు జరిగిన అన్యాయం, పాఠకుల ఆలోచనల మీద కూడా రత్తి ప్రభావం చాలా ఉంటుంది. అయితే, రవికి కొంత సామాజిక స్పృహ ఉందని రచయిత చెప్తారు కాబట్టి దాన్ని రుజువు చేయడానికి రత్తిని ఆమెకు జరిగిన అన్యాయాన్ని రవి తల్చుకుని పదే పదే నలిగి పోవడాన్ని రచయిత వాడుకున్నారు తప్ప నిజానికి రత్తి లేక పోయినా కథ మామూలుగానే నడిచిపోయేది. రత్తి పాత్ర అలా ప్రేమాస్పదంగా ఉన్న స్థాయి నుంచి ఎలా దిగజారిపోయిందనేది కూడా కథకు ఏ మాత్రం సంబంధం లేని విషయమే. అదే విధంగా నవలలో రవిలో కలిగే లైంగిక అశాంతి ఏ అనుభవమూ లేని యువకుడికి కలిగేదిగా ఉంటుంది కానీ రత్తితో ఒకసారి లైంగికంగా కూడిన యువకుడిలో చెలరేగేదిగా కనిపించదు (అది అపరిపక్వమైన అనుభవం అయినప్పటికీ.) రవి ఆలోచనల ధోరణి, వాటిని నిర్భయంగా ఒప్పుకోలేని సంకోచం, ఇవి కూడా లైంగికబంధాన్ని అశ్లీలంగా భావించే మధ్యతరగతి భావాలనే పట్టిచూపుతాయి. ఇవి రవిలో తనను చూసుకున్న రచయిత అభిప్రాయాలే కానీ రవి పాత్రవి కావేమో అనిపిస్తుంది.

అంపశయ్యని మరి కొంత జాగ్రత్తగా పరిశీలిస్తే రవి అందరిలాగే సహజమైన భావోద్వేగాలు ఉన్న యువకుడిగా పరిచయమైనట్లు కనిపించినా, నిజానికి అతడు ఒక దుర్బలుడు. కార్యవాది కాడు. ఆ వయసు యువకుల్లో ఉండే తెగింపు రవిలో కనిపించదు. నలుగురిలో ఉన్నపుడు కొంత ఉత్సాహంగా ఉండే రవిలో ఒంటరిగా ఉన్నపుడు ఆ తత్వం అతని ఆలోచనల్లో కనిపించదు. నిరాశా నిస్పృహలతో కుంగిపోతుంటాడు. అతనికంటూ దృఢమైన కార్యాచరణ, ఆలోచన ఉండదు, ఆశయాలు, భావావేశాల ఒరవడి తప్ప.

అందువల్లనే రవి అంతరంగ ప్రవాహంగా ఆలోచనా తరంగాలతో అతన్ని ఆవిష్కరిస్తూ సాగే నవల్లో చివర్లో ఒక్కసారిగా వచ్చి పడ్డ విప్లవాత్మకమైన మలుపు పాఠకుడిని ఒక్క క్షణం అయోమయం లోకి తోస్తుంది. ఒక ఉద్వేగంతో రవితో మమేకమై నవల చదువుతున్న పాఠకుడికి ఈ మలుపు నాటకీయంగా అనిపిస్తుంది. వైయక్తికమైన ప్రయాణం ఉన్నట్టుండి సామాజికం అవుతుంది. నవల ముగింపు ఒక ముక్తాయింపుకు వచ్చి ఒక విజయంతో, అలా జరిగి తీరాలన్నట్లు అలా రాసేశారా రచయిత? అనిపిస్తుంది. ఈ ముగింపులో రచయిత కనిపిస్తాడు. వేణు ఆవేశంతో చేసే చర్చల భాషలో మిగతా నవలలో ఉన్న సహజత్వం పోయి నాటకీయత కనిపిస్తుంది. ఆ భాషలో, ఆ చర్చలో రచయితే కనిపిస్తాడు. ఇది ఇబ్బంది పెడుతుంది మనల్ని. రవి, వేణు ఆదర్శాలు మాట్లాడిన ప్రతీసారి రచయిత కనిపించడమూ మనకు తెలుస్తుంటుంది. రవి రమేశ్‌కు రత్తి గురించి వివరంగా చెప్పడంలో కూడా ఈ బలవంతం, రచయితది, కనిపిస్తుంది.

నవీన్ మాటల్లో చెప్పాలంటే ఈ నవల్లో విద్యార్థి జీవితమే కాదు, వారి కష్టాలే కాదు, ఒక సందేశం కూడా ఉంది. ఆయనేమంటారంటే: “ఈ నవల్లో నేను చెప్పదల్చుకున్న ఒక ముఖ్యాంశం ఉంది. 1960ల్లో ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ రెండుగా చీలిపోయాక వామపక్ష ఉద్యమం భారత దేశంలో బలహీన పడింది. వామ పక్షాలన్నీ ఐక్యం అయితే తప్ప సామ్రాజ్యవాద శక్తుల్ని ఎదుర్కోలేమన్న సందేశం అంపశయ్యలో ఉంది.” ఈ మాటనే ఆయన విద్యార్థుల మధ్య చర్చగా చూపిస్తారు. కానీ, ఈ సందేశం ఇవ్వడమనేది, నవలాక్రమంలో అంతగా అతికినట్టు కనిపించదు. “సాహిత్యానికి సాంఘిక ప్రయోజనం ఉండాలని బలంగా నమ్ముతాను,” అని అన్నారు రచయిత ముందుమాటలో. ఆ నియమమే ఆయనతో కొన్ని నవలకు అనవసరమైన సన్నివేశాలు కల్పించేలా చేసిందేమో.