మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్

సి. పి. బ్రౌన్ (1798 – 1884)

ఆరుద్ర ఆయన్ని ‘బ్రౌన్, సాహిత్య క్రౌన్‌’ అన్నారు. జి. ఎన్‌. రెడ్డి, ‘బహుభాషా దక్షిణ నాయకుడైనా తెలుగు భాషను పట్టమహిషిగా వరించిన ధీరోదాత్తుడు,’ అని ఆలంకారికంగా ప్రశంసించారు. ఇంకా అది చాలక, ‘ఆంధ్రుల అదృష్టం కొద్దీ అవతరించిన మహనీయుడు, ఆంధ్రులకు సర్వదా ఆరాధ్యుడు,’ అని కూడా అన్నారు. ఇలా బ్రౌన్‌ని పొగిడిన వాళ్ళ పేర్లు జాబితా వేయడానికి ఈ వ్యాసం చాలదు. బ్రౌన్‌ జీవిత కాలంలో ఆయన దగ్గర పనిచేసిన పండితులు ఆయన్ని ఇంతకన్నా పెద్ద మాటల్లో పొగిడారు. ఈవాళ మనకు తెలుగుదేశంలో బ్రౌన్‌ పేరుతో అకాడెమీలు, పురస్కారాలు తరుచుగా కనపడుతున్నాయి. ఆయనకి వర్తమాన కాలంలో ఆరాధకులు కొల్లలుగా వున్నారు. ఈ మధ్యే బ్రౌణ్య విజయం అనే పేరుతో ఒక నాటకం ప్రదర్శింపబడింది. అందులో బ్రౌన్‌ని ఒక మహారాజులాగా కీర్తిస్తారు. ఒక ఊదారంగు సూటు వేసుకుని పునర్జన్మ ఎత్తిన బ్రౌన్ ఈ నాటకంలో ‌తెలుగువాళ్ళతో స్వచ్ఛమైన తెలుగులో అనర్గళంగా మాట్లాడతాడు.

ఇప్పుడు ఈ వ్యాసం ఉద్దేశం ఈ ఆరాధకుల జాబితాకి మా పేర్లు కలుపుకోవడం కాదు. బ్రౌన్‌ ఎవరు? ఏ పరిస్థితుల్లో తెలుగు దేశానికి వచ్చాడు? ఆయన చేసిన పని ఏమిటి? ఆయన దగ్గర పండితులు, అంత పండితులు కానివాళ్ళు ఏ పరిస్థితుల్లో ఎలాంటి పని చేశారు? బ్రౌన్‌ చేసిన పని తెలుగుకి ఎంత వరకు ఉపయోగపడింది? దానివల్ల అన్నీ లాభాలేనా, నష్టాలేమయినా జరిగాయా? ఈ విషయాల్ని సవిమర్శకంగా పరిశీలించి సాధ్యమయినంత బాధ్యతాయుతంగా కొన్ని ఆలోచనలు ప్రతిపాదించడం ఈ వ్యాసంలో మేము తలపెట్టిన పని.

19వ శతాబ్ది: తెలుగు కవిపండితుల స్థితిగతులు

అచ్చాఫీసులటంచు హూణుల కుపాధ్యాయత్వమంచున్ మఱిన్
వెచ్చంబిచ్చెడి బచ్చుటిండులకడన్ వేదాంతమంచున్ మహో
ద్యచ్చారిత్రులు పండితుల్ మెలఁగఁగా నయ్యెంగదా! పొట్టకై
చచ్చున్ గాలమువచ్చె గౌరవము నాశంబయ్యెఁ గామేశ్వరీ
– (కా. శ. 10-22)

చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారు ఇరవయ్యవశతాబ్ది మొదటిరోజుల్లో (కామేశ్వరీ శతకము, 1934: 3వ ముద్రణ) తెలుగు పండితుల స్థితిని వర్ణిస్తూ చెప్పిన పద్యమిది. అప్పటికొక 50ఏళ్ళ ముందునుంచే కవులకీ పండితులకీ ఆదరణ తగ్గిపోయింది. పెద్ద రాజ్యాలు గతించిన తరువాత వాటికి అవశేషాలుగా ఈ కాలంలో బ్రిటిష్ ప్రభుత్వ ప్రభావం ప్రత్యక్షంగా లేని ప్రాంతాలు తెలుగుదేశంలో కొన్ని ఉండేవి. బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పర్మనెంట్ సెటిల్మెంట్ ఫలితంగా డబ్బుపెట్టి పరగణాలు కొనుక్కుని వాటిమీద ప్రభుత్వానికి గుత్తగా కొంత పన్ను చెల్లించే ఏర్పాటు చేసుకున్న కొత్త జమీందార్లు స్వయంగా సైన్యశక్తి, నిజమైన రాజ్యాధికారం లేకపోయినా, పూర్వపు రాజుల మల్లే పెద్ద పెద్ద బిరుదులు తగిలించుకుని రాజులుగా చలామణి అయ్యేవారు. వీళ్ళకి ఈ రకమైన రాజగౌరవం కల్పించిన వాళ్ళల్లో పండితులు, కవులు ముఖ్యులు. సంస్కృతంలో భోజుడు, తెలుగులో కృష్ణదేవరాయలు – వీళ్ళని గురించి తాము కల్పించుకున్న ఊహలను చాలామంది పండితులు, కవులు జమీందారులకి కట్టబెట్టారు. ఉత్తరాన బొబ్బిలి నుంచి విజయనగరం మీదుగా పిఠాపురం, నూజివీడు, వనపర్తి, గద్వాల, ఉర్లాం మొదలైన ప్రాంతాల వెలమ జమీందార్లు; ముక్త్యాల, మొదలైన ప్రాంతాల కమ్మ జమీందార్లు; రాజమండ్రి, సామర్లకోట మొదలైన ప్రాంతాల బ్రాహ్మణ జమీందార్లు; ఏలూరులో మోతే వారి వంటి వైశ్య జమీందార్లు (ఎస్. వీరబ్రహ్మ కవి, 1930; తూమాటి దోణప్ప, 1969). ఇలా కొంత హెచ్చుతగ్గులుగా జమీందారీతనం చలాయిస్తున్న వాళ్ళని ఆశ్రయించుకొని, వాళ్లని పొగిడీ వాళ్ల పోషణ పొందీ తమ పాండిత్యాన్ని, కవిత్వాన్ని నిలబెట్టుకున్న వాళ్ళు చాలా మంది దాదాపు 20వ శతాబ్దపు మధ్యకాలం వరకు ఉండేవారు. అయితే ఈ జమిందార్ల ప్రాభవాన్ని దాటి మిగతా ఆంధ్రప్రాంతంలో, అంటే బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యక్షంగా పరిపాలించే ప్రాంతంలో, పండితులకి కవులకి ఆదరణ దాదాపుగా ఉండేది కాదు.

ఎవరో ఒకరు పోషిస్తే తప్ప పండితులు తమ పని సక్రమంగా చేసుకోలేని స్థితి ఒక్క భారతదేశంలోనే కాదు, నాగరికమైన ప్రతిదేశంలోను ఉన్నట్టు కనిపిస్తుంది. రాజులో, రాజుల్లాంటి జమీందార్లో, దేవాలయాల వంటి సంస్థలో లేదా ఇతర వృత్తుల్లో డబ్బులు సంపాదించుకున్నవాళ్ళో పండితుల్ని కవుల్ని ఆదరించాలి. రాజుల అవసరం కవులకి పండితులకి, కవుల పండితుల అవసరం రాజులకి, చాలా కాలం పాటు భారతదేశంలో ఉన్నా ఈ రెండు వర్గాలలోను ఎవరి అవసరం ఎవరికెక్కువ ఉంది అన్న విషయం సూక్ష్మంగా చూస్తే కాని తెలియదు. మనకి తేలికగా తెలిసిన సమాచారమంతా కవులు తమ పుస్తకాలలో తమ కృతిని పుచ్చుకున్న పోషకుడి గురించి రాసిన వర్ణన పద్యాల్లోనే దొరుకుతుంది. తమ కృతికర్తను గురించి, ఆ కృతికర్త తమని ఫలానా కావ్యం కృతిగా ఇవ్వమన్న సందర్భాన్ని గురించి వివరంగా అందంగా కవులు చెప్పిన పద్యాలివి. కానీ ఇవన్నీ కవులు చెప్పుకున్న పద్యాలే అని మనం గుర్తుంచుకోవాలి. కృతికర్త కవితో అన్న మాటలు కూడా కవి రాస్తున్న భాషలోనే వుంటాయి. ఇందుకు మనకు తెలిసిన మొట్టమొదటి ఉదాహరణ నన్నయ. నన్నయ భాషలో రాజరాజనరేంద్రుడు మామూలు మాటల్లో పట్టనంత గొప్పవాడు.

రాజకులైకభూషణుడు, రాజమనోహరు, డన్యరాజతే
జోజయశాలిశౌర్యుడు, విశుద్దయశశ్శరదిందు చంద్రికా
రాజితసర్వలోకు, డపరాజితభూరిభుజాకృపాణధా
రాజలశాంతశాత్రవపరాగుడు రాజమహేంద్రుడున్నతిన్
– (ఆదిపర్వము, 1.3)

కానీ చరిత్రలో చూస్తే రాజరాజనరేంద్రుడు ఎన్నో యుద్ధాలు జయించినవాడిలా, ఎంతో గొప్ప సామ్రాజ్యాన్ని పాలించినవాడిలా కనిపించడు. రాజరాజనరేంద్రుడు చాలాసార్లు యుద్ధాల్లో ఓడిపోయి తన మామగారి ఆశ్రయాన్ని పొందిన బలహీనమైన రాజు. కానీ నన్నయ కవిత్వానికొచ్చిన గౌరవం వల్ల, ఆయన మాటల బలం వల్ల, ఆయన వర్ణించిన రాజే మనసుల్లో చెరగకుండా ఉన్నాడు.

ఇంకా ముందుకు వెళ్ళి చూస్తే కవులు తమ కావ్యాలకు రాసిన అవతారిక పద్యాలలో మరి కొన్ని విశేషాలు దొరుకుతాయి. తరచుగా కనిపించేవి కవినే రాజు పిలిపించి, తనకు ఫలానా పుస్తకం కావాలని అడిగి తాంబూలమిచ్చిన సందర్భాలు. ఇది కాక కవి ఒక పుస్తకం రాయడం మొదలుపెడితే ఆ పుస్తకాన్ని తనకి అంకితం ఇమ్మని రాజు అడిగిన సందర్భాలు కొన్ని. కవి తన పుస్తకాన్ని మొదలుపెడితే కాబోయే కృతికర్తకి స్నేహితుడో, చుట్టమో అయిన ఆయన ఆ ఫలానా పుస్తకాన్ని తన వాళ్ళకి అంకితం ఇమ్మని అడిగిన సందర్భాలు మరికొన్ని. వీటి ఆధారంగా రాజుకి కవి అవసరం కొన్నిసార్లు, కవికి రాజు అవసరం ఎక్కువసార్లు ఉండేదని అనిపిస్తుంది. ఈ పద్యాలన్నింటిలోను అనివార్యంగా వుండే కృతిభర్త వర్ణనలు ఒక అలవాటుతో కూడిన పడికట్టు పదాలతో అందమైన అతిశయోక్తులతో నిండివుంటాయి. వీటిని యదార్థాలుగా గ్రహించడం ఆధునిక తెలుగు విమర్శకులు తప్ప ఎవరూ చెయ్యరు.

ఈ పరిస్థితులు మారి ఎలా వర్ణించినా ఎవరూ అంకితం పుచ్చుకోని రోజులు, కవులు పండితులు ఏదో ఒక ఆదరణ కోసం వెతుకులాడే రోజులు, దాదాపుగా పందొమ్మిదో శతాబ్దం ఆదికాలం నాటికల్లా వచ్చాయి. కొన్ని వందల సంవత్సరాల చరిత్రని క్లుప్తంగా ముగించి పందొమ్మిదో శతాబ్దపు చివరి రోజులకి వచ్చేసరికి తెలుగుదేశంలో తూర్పు ఇండియా కుంఫిణీ వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. వాళ్ళకు భాష రాదు, రాచ మర్యాదలు తెలియవు. కవుల పుస్తకాలు అంకితం పుచ్చుకోవడంతో వచ్చే కీర్తివల్ల రాచరికాన్ని నిలబెట్టుకునే అవసరం వాళ్ళకి లేదు. అయినా అప్పటి పరిస్థితులని గమనించి వాళ్ళు కూడా రాచరికపు మెప్పులు పొందడానికి ప్రయత్నం చేసిన దాఖలాలు లేకపోలేదు. వ్యాపారపు కుంఫిణీ అల్లా కుంఫిణీ బహద్దరవడం, కుంఫిణీవారు దేవాలయాల పూజలకి లాంఛనాలు పంపడం, కుంఫిణీ పేరుతో దేవాలయాల్లో పూజలు చేయడం ఈ అలవాటు వల్లే జరిగింది. కాని దీనిలో కుంఫిణీ అవసరాలకన్నా వాళ్ళని ఆశ్రయించుకున్న పండితుల అవసరాలు, పూజారుల అవసరాలే ఎక్కువ బలమయినవి. ఈ పరిస్థితుల వ్యత్యాసం వల్ల, ఆదరణ లేని పండితుల్లో వచ్చిన దైన్యం బలంగా కనపడడం మొదలైంది ఈ కాలంలోనే. చదువుకు రాణింపు లేకపోవడంతో చదువుకోవడం, పుస్తకాలు రాయడం తప్ప వేరొక పని చెయ్యలేక ఈ వర్గం క్రమక్రమంగా కుంగిపోయింది. వాళ్ళ ఆత్మ విశ్వాసం దెబ్బతినిపోయింది. చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారు చెప్పిన పై పద్యం ఈ పరిస్థితికి యదార్థ వర్ణన.

[20వ శతాబ్దపు మధ్యభాగంలో కూడా ఈ ఆత్మన్యూనతా భావం కొనసాగింది. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పనిచేసిన కూల్డ్రేకి (Oswald Couldrey) నిజానికి ఏ సాహిత్యంలోను చెప్పుకోదగ్గ ప్రవేశం లేదు. రాజమండ్రి కాలేజి ప్రిన్సిపాలుగా వచ్చి అప్పటి తెలుగు కవుల్ని చేరదీయటం మొదలుపెట్టాడు. అతను మెచ్చుకోగానే తెలుగు కవులు ఉబ్బిపోయేవారు.

గురుడు కూల్డ్రే ఎండేమియాన్ అన్నాడే / నిన్నే నిన్నేనే — అని బాపిరాజు తన గురించి పాట రాసుకున్నాడు. అప్పుడే ఆంధ్రా అర్నాల్డులు, ఆంధ్రా కీట్సులు బయలుదేరారు. ఇది చూసే దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారు, “అడవిబాపడి పేరు పడలే దదింకాను పడుతుంది దొరలలోఁ బడినయపుడు” అని ఆంధ్రకళలు అన్న చాటువులో వేళాకోళంగా రాశారు.

దామెర్ల రాముణ్ణి సీమలో మెచ్చారు యెంకిపాటలు నింగి కెక్కుచుండె
వంగవాసి ఛటర్జి నింగిలీషు కజిన్సు మెచ్చి గ్రంథాల్వ్రాసి యచ్చువేసె
కవుతరయ్యకుమాళ్లు ఖండాంతరంబులఁ గొప్ప గొప్పోళ్లంచుఁ గోలపుట్టె
అడవిబాపడిపేరు పడలే దదింకాను పడుతుంది దొరలలోఁ బడినయపుడు

కళలు పుట్టెను తెలుగులగడ్డలోన
ననుచు “క్రిటికులు” ఘోషింతు రౌను గాని
మనకు మాత్రము గంపింపమానెనేమొ
రామనగరీనరేంద్ర! శ్రీరామచంద్ర! – (ఆంధ్రరత్న గోపాలకృష్ణుని చాటువులు
, 1933, పు. 24)]

దీనితో పాటే అల్పమైన స్ఫర్ధలు, అర్థం లేని అహంభావాలు, నువ్వు శుంఠవంటే నువ్వు శుంఠవని తిట్టుకోవడాలు, పండితులలో బయట పడడం మొదలయ్యింది. సంస్కృతానికి పాండిత్య గౌరవం ఎక్కువగా వుందనే భ్రమతో సంస్కృత పండితులు విర్రవీగుతుండగా, తెలుగు పండితులు సంస్కృతమంత జటిలంగా తెలుగు రాయడం గొప్ప అనుకోవడం మొదలు పెట్టారు. ఈ తెలుగు సంస్కృతాల వైరుధ్యంలో తెలుగు ఇంకా క్షీణించి పోయింది. గీర్వాణం బలుస్తోంది అని సంస్కృతాన్ని వేళాకోళం చేయడానికి తెలుగు పండితులు వాడే మాటలో గీర్వాణం (సంస్కృతం) అనే మాటకి గర్వం అనే అర్థం రావడానికి ఇదే కారణం. పాండిత్యం అంటే సంస్కృత వ్యాకరణంలో పాండిత్యమే. తెలుగు వ్యాకరణం వచ్చిన వారు పండితులు అనే గౌరవానికి తగరు. తెలుగులో కవులున్నారు కానీ పండితులు లేరు. జమిందారులు చేరదీసిన పండితులందరూ సంస్కృత పండితులే. జమిందారులకు పుస్తకాలు అంకితమిచ్చిన తెలుగు కవులలో చాలామంది సంస్కృతంలో పండితులే.

అప్పట్లో చదువు ఎలా వుండేది? చిన్నపిల్లలు చదువుకోడానికి వీధిబడులు ఉండేవి. వీటిలో చదువుకోడానికి కూడా ఎక్కువగా రాతకోతల అవసరమున్న కులాలవాళ్ళు మాత్రమే వెళ్ళేవాళ్ళు. తెలుగుదేశంలో చదువుకోనివాళ్ళే ఎక్కువమంది. అంటే అక్షరాలు రానివాళ్ళు. అయితే అక్షరాలు రానివాళ్ళందరూ అజ్ఞానులు కారు. మనిషి నేర్చుకోవలసిన జ్ఞానమంతా పుస్తకాల ద్వారా వచ్చే పద్ధతి ఆ కాలంలో లేదు. అంచేత అక్షరజ్ఞానం లేకపోయినా వాళ్ళకి తెలిసిన సంగతులు, వచ్చిన పాటలు, చెప్పగల కథలు; శాస్త్ర, భౌగోళిక విషయాలు, మనం ఊహించగల దానికన్నా ఎక్కువగా వివిధ వృత్తుల వారికి తెలిసుండేవి. కంసాలికి బంగారమూ వెండీ ఎలా కరగపోయాలి, ఎలా సాపు చేయాలి, ఎలా తిప్పి వాటిని నగలుగా చేయాలి అన్న విషయంలో శాస్త్రజ్ఞానం ఉండేది. అలాగే వ్యవసాయం చేసుకునే రైతుకి భూమిని గురించి, భూసారాన్ని గురించి, పంటల గురించి చక్కటి పరిజ్ఞానం వుండేది. ఈ రకమైన విద్య మౌఖికంగా నేర్చుకునేది, ఆపైన అనుభవంలో వృద్ధి పొందేది. జనాభాలో కొద్ది మందికి మాత్రమే రాయడం, చదవడంతో అవసరం వుండేది. చదువే జీవనాధారంగా వుండే కుటుంబాల వాళ్ళు వీధిబళ్ళలో, ఇసకలో వేళ్ళతో అక్షరాలు దిద్ది నేర్చుకుని ఒక క్రమంలో భాషలో సామర్ధ్యం సంపాదించేవారని పెద్ద వయసువాళ్ళు రాసుకున్న ఆత్మకథల (ఉదా: విస్సా అప్పారావు, అయ్యదేవర కాళేశ్వరరావు) ద్వారా తెలుస్తుంది.

[పంతొమ్మిదవ శతాబ్దపు తొలినాళ్లలో చదువుల గురించి మంచి సమాచారం వెన్నెలకంటి సుబ్బారావు మద్రాసు స్కూలు కమిటీ వారికి ఇచ్చిన రిపోర్టులో చూడవచ్చు. Appendix to The First Report of the Madras School Book Society for the Year 1823 (1823: 43-C), Reprinted in: Row, 1873; చూ. ఈ రిపోర్టుకి తెలుగు అనువాదం, ఆరుద్ర (1990, పే. 91)]

మొదట్లో అక్షరాలు, తరువాత శబ్దాలు, ఆ తరువాత బాలరామాయణం, క్రమంగా ప్రబంధాలు – ఆ తరువాత సంస్కృత కావ్యాలు, ఆపైన వాళ్ళ అభిరుచినిబట్టి శాస్త్ర గ్రంథాలు ఒక క్రమంలో నేర్పేవాళ్ళు. ఆ తరువాత ఏ శాస్త్రమైనా సరే బాగా పాఠం చెప్పగలరని పేరున్న గురువుల్ని వెతుక్కుంటూ శిష్యులు వెళ్ళేవారు (చూ: చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి, 1934, 1958). అలాంటి గురువులని వెతుక్కుంటూ వెళ్ళిన శిష్యులు వారాలు చేసుకుని, పొట్ట గడుపుకుంటూ గురువుగారి వద్ద శాస్త్రాలు నేర్చుకునేవారు. ఈ వ్యవస్థ కూడా క్రమక్రమంగా నీరసించిపోయే పరిస్థితి అప్పటికి దాపురించింది.

తెలుగు సాహిత్యంలో పందొమ్మిదవ శతాబ్దం అంధయుగం అనడం పరిపాటి. ఆ శతాబ్దపు సాహిత్యం మీద ప్రత్యేకమైన కృషి చేసినవారు యండమూరి సత్యనారాయణరావుగారు. ఆయన రాసిన ఉషఃకిరణాలు (1960) చెప్పుకోదగ్గ ప్రచారానికి రాలేదు కానీ ఆయన కృషిని మెచ్చుకోవడానికి ఆ పుస్తకం చదవడం అవసరం. ఆయన మాటల్లో: “19వ శతాబ్ది తెలుగు వాఙ్మయమును వర్ణించువారిలో హెచ్చుమంది ఇది యొక క్షీణయుగము లేక అంధయుగమనియే నుడివియున్నారు. అంతవరకు తెలుగుసాహిత్యములో తీరుతెన్నులు దిద్దుకున్న ప్రబంధ కావ్యములు, పురాణములు, శతకములు, యక్షగానములు మొదలైనవి ఈ కాలములో పరస్పర ప్రతిబింబములుగాను ఉపజ్ఞావిహీనములుగాను భావశూన్యములు గాను ఉన్నవని వీరి అభిప్రాయము.

బ్రౌన్ తెలుగుదేశం లోకి ప్రవేశించేటప్పటికి పరిస్థితి ఇది.