నాకు నచ్చిన పద్యం: పల్లవడోలలో పసిబాలుడు

ఈ నెల తెలుగువాళ్ళ తొలిపండగ ఉగాది వస్తోంది. వసంతశోభతో కొత్త సంవత్సరం అరుదెంచే సమయం.

పేరంటమునకేగు పిన్నబాలిక వాలుజడ మల్లెమొగ్గ కన్పడినయంత
వంగిన వేపకొమ్మం గావిచిగురీన పజ్జ యీనెకుఁ బూఁత పట్టినంత
ఒక దినాన హఠాత్తుగా జికిలి కూహుకుహువు ప్రొద్దెక్కి దూరపు గోననుండి
సాగి వినవచ్చినంత వసంత మరుగుదెంచెనను మధురోహ స్ఫురించె లోన

అంటారు విశ్వనాథ. పిన్నబాలిక వాలుజడలో మల్లెమొగ్గ, వేపకొమ్మకు పట్టిన కొత్తపూత, గాలిలో సాగివచ్చే కోకిల కుహుకుహు గానం – ఇవేవీ నాకంతగా అనుభవంలో ఉన్న విషయాలు కావు. ఇలా కావ్యాలలో చదవడం తప్ప, వసంత ఋతువంటే ఎలా ఉంటుందో నాకు తెలీదు. వసంతం అనే ఏముంది, ఏ ఋతువైనా అంతే! ఇతర దేశాల సంగతి నాకు తెలియదు కాని, భారతదేశపు నవనాగరికులకు నెలలు మారడమంటే కేలండర్లో పేజీలు తిప్పడమే. ప్రకృతిలో తెలిసే మార్పులు మహా అయితే మూడు – ఎండ, వాన, చలి. అందుకే కావ్యాలలో ఋతువర్ణనలు, ఏవో తెలియని లోకాలకు తలుపులు తెరుస్తాయి. స్వప్నప్రపంచంలో ఓలలాడిస్తాయి. అలా మనసుని ఉయ్యాలలూపే పద్యంతో కొత్తయేటికి స్వాగతం పలుకుదాం:

మ. అలరుంగైదువుజోదు కూర్మిసయిదోడై మాధవశ్రీతపః
       ఫలమై యాడు మరుత్కుమారు బ్రియమొప్పం దేనె నీరార్చి లే
       దెలిపూజొంపపు బొత్తులన్ బొదిగి ధాత్రీజాతముల్ జోల వా
       డె లసత్పల్లవడోల నుంచి కలకంఠీనాదగీతంబులన్

ఇది రామరాజభూషణుడు రచించిన వసుచరిత్రలోని ఒక అందమైన పద్యం. కొన్ని కావ్యాలను కథ కోసమో, ఉత్కంఠగా సాగే కథనం కోసమో, సంక్లిష్ట పాత్రచిత్రణ కోసమో, మనసుని పట్టి కుదిపే రసభావాల కోసమో చదవకూడదు. వాటిలోని భాషాసౌందర్యాన్ని, వర్ణనావైభవాన్ని, కల్పనాచాతుర్యాన్ని ఆస్వాదించడం కోసం మాత్రమే చదవాలి. అలాంటి కావ్యాలలో ప్రథమస్థానంలో నిలిచేది వసుచరిత్ర. గిరికా వసురాజుల పరిచయం, ప్రణయం, పరిణయం అనే మూడే మూడు అంశాలతో ఆరు ఆశ్వాసాల ప్రబంధాన్ని రచించి, అందులో తన సంగీత సాహిత్య పరిజ్ఞానమంతటినీ నిబంధించాడు భట్టుమూర్తి. ప్రబంధోచితమైన వర్ణనలను శ్లేషబంధుర సుందరంగా అందించాడు. అందులో భాగమే వసంతకాల వర్ణన. వసుచరిత్రలో వసంతవర్ణన అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది ఆపాతమధురమైన ‘లలనా జనాపాంగ వలనావసదనంగ’ అనే పద్యం. అలాగే మరొకటి, సంగీతజ్ఞులకు ఆలోచనామృతమైన అరిగా పంచమ మేవగించి’ అనే పద్యం. నాకు మాత్రం ఆ రెంటికన్నా కూడా పై పద్యమే యిష్టం. వసంతమనగానే మనకు కావ్యాలలో కనిపించే సామగ్రి – మన్మథుడు, చిగురాకులు, మల్లెపూలు, పిల్లగాలులు, కోకిల కలకూజితాలూ మొదలైనవి. ఈ పద్యంలో కూడా అవే కనిపిస్తాయి. అయితే, మరెక్కడా కనిపించని ఒక సుకుమార పదచిత్రంలో ఒదిగిపోయి కొత్తగా కనిపిస్తాయి. అదీ దీని ప్రత్యేకత. పాండిత్యప్రభతో మిరిమిట్లు గొలిపే యీ కవిలో దాగిన సున్నితహృదయం ఈ పద్యంలో దర్శనమిచ్చింది నాకు.

అలరు కైదువు జోదు – పూలు ఆయుధంగా కలిగిన యోధుడు, అంటే మన్మథుడు. కూర్మిసయిదోడు – చెలిమికాడు. మాధవశ్రీ తపః ఫలము – వసంతలక్ష్మి నోములపంట.

హేమంతశిశిరాలలో వణికించిన చలిగాడ్పు వసంతం రాగానే హాయిగా సుతిమెత్తగా తాకేసరికి మనసులు జల్లుమనక మానవు. అందుకే మధుమాస మలయమారుతం మన్మథునికి సయిదోడు. సయిదోడు అంటే స్నేహితుడనే కాక తోడబుట్టినవాడు అనే అర్థం కూడా ఉంది. ఇద్దరూ కనిపించకుండా మెల్లమెల్లగా అల్లరి చేసేవారే కదా మరి! అతనిలానే ఇతను కూడా ‘అతనుడే’. ఇద్దరూ మధుమాసంలోనే చెట్టాపట్టాలు వేసుకు తమ విహారాన్ని సాగిస్తారు. అందుకే ఈ మరుత్కుమారుడు (అంటే చిరుగాలి అనే పిల్లవాడు) వసంతలక్ష్మి నోములపంట అంటున్నాడీ కవి. మాధవశ్రీ తపఃఫలమై – దీన్ని మరొకలా కూడా అర్థం చేసుకోవచ్చు. మాధవుడు అంటే విష్ణుమూర్తి. శ్రీ అంటే లక్ష్మీదేవి. లక్ష్మీనారాయణుల నోములపంట – మన్మథుడు. అందుకే మన్మథునికీ మధుమాస సమీరానికీ అంతటి దోస్తీ!

ఆ పిల్లవాడేమో అల్లరివాడు, ఎప్పుడూ ఇటూ అటూ ఆడుతూనే ఉంటాడు. కానీ వసంతానికి అతడు ముద్దులబాలుడు. అందుకే వాడిని మురిపెంగా జోలపాడి బజ్జో పెట్టాలన్న తాపత్రయం. ఆ సన్నివేశాన్ని చాలా అందంగా మన ముందుంచాడు భట్టుమూర్తి. వసంతశోభ అంతా పచ్చదనంతో మిసమిసలాడే చెట్లలోనే కనిపిస్తుంది. అందుకే వాటి రూపంలోనే తన బాబుకి అన్ని సపర్యలూ చేస్తోంది వసంతం. ఏమిటా సపర్యలు అంటే:

ప్రియము ఒప్పన్ – ఎంతో ప్రేమగా. తేనె నీరార్చి – పూదేనెతో స్నానమాడించి. లే తెలి పూ జొంపపు పొత్తులన్ పొదిగి – లేత తెలతెల్లని పూపొదల పొత్తిళ్ళతో కప్పి. ధాత్రీజాతముల్ – భూమినుండి పుట్టినవి, చెట్లు. లసత్ పల్లవ డోలన్ ఉంచి – సొంపైన చిగురాకుల ఊయలలో పడుకోబెట్టి. కలకంఠీనాద గీతమ్ములన్ – కోయిలలు పాడే పాటలతో. జోల పాడె – జోల పాడాయి.

చిరుగాలి అనే ఆ చిన్నవాడిని చెట్లు పూలతేనెలతో జలకమాడించాయి. తెల్లని మల్లెపూపొదలు అనే పొత్తిళ్ళతో కప్పి, సొంపైన చిగురాకుల ఊయలలో పడుకోబెట్టి ఊపుతున్నాయి. కోకిలగానాలతో జోలలు పాడుతున్నాయి.

అదీ కవి గీసిన దృశ్యం! కవిత్వంలో ప్రధానాంశాలు రెండు. ఒకటి దర్శనం, మరొకటి వర్ణనం. అందరికీ కనిపించని దానిని భావనానేత్రంతో చూడగలడటం దర్శనశక్తి. ఈ పద్యంలో ప్రస్ఫుటంగా ద్యోతకమయ్యేది అదే. కనిపించని గాలిని ఒక పసిబాలుని రూపంలో దర్శించాడు కవి. మలయానిలానికి మూర్తిమత్వాన్ని కల్పించిన కవులు చాలామందే ఉన్నారు. మన్మథుని పేర అచ్చువేసి వదిలిన ఆంబోతులా విహరిస్తోంది కోడెగాడ్పు అని వర్ణిస్తాడు కవికర్ణరసాయన కర్త. తెలతెలవారుతూ ఉంటే వచ్చి, సెజ్జలపై పడి ఉన్న వాడినపూలని చిమ్మిపోయే పరిచారిక ఆకృతిలో ప్రభాతవాయువులని దర్శించాడు రామకృష్ణకవి. శేషేంద్ర తన ఋతుఘోషలో, ‘శిశిర వ్రతాచార జీర్ణ మారుతమూర్తి అలరుగిన్నెల గందమలదుకొనియె’ అని వసంతంలో గాలి గ్రంథసాంగునిగా మారిన వైనాన్ని చిత్రించారు. ఇలా ప్రాచీనాధునిక కవిత్వంలో అనేక రకాల వర్ణనలు కనిపిస్తాయి. అయితే యివన్నీ చాలా వరకూ శృంగారభావనా సంబంధమైనవే. గాలిని పసిబాలుని రూపంలో దర్శించి అతన్ని చెట్లు మాతృప్రేమతో సాకినట్లు చిత్రించిన వర్ణన మరింకెక్కడా నాకు కనిపించలేదు. గాలికి ఊగే చిగురాకులను, ఆ గాలినే ఊపే ఊయలలుగా ఊహించడం భలే ముచ్చటైన భావన కదూ!