మనుషులెందుమూలంగా జీవిస్తారు?

చలి కాలం మొదలౌతూ ఉంది. ఉన్న ఒక్క చిరిగిపోయిన కోటు వేసుకుని సైమన్ ఎప్పటిలాగానే మాట్రియోనా కన్నా ముందు లేచి క్రితం రోజు ఊర్లో భూస్వాములు ఇచ్చిన బూట్లకి చిన్న చిన్న మరమ్మత్తులు చేస్తున్నాడు. ఇక్కడో మేకూ అక్కడో కుట్టూ వేస్తున్న చప్పుళ్ళు అప్పుడప్పుడు వినిపిస్తున్నాయి గుడిసెలో. పని చేస్తున్నాడన్న మాటే గానీ సైమన్ మనసు ఇంకెక్కడో ఉంది. గుడిసె అద్దె కట్టాలి నెలాఖర్లోగా. రోజు రోజుకీ వచ్చే మరమ్మత్తు పనులతో కడుపు నింపుకోవడమే కష్టంగా ఉంది. అన్నింటికన్నా ముందు రాబోయే చలికాలానికో కోటు అత్యంతావసరం. అది లేకపోతే క్రితం ఏడు ఎంత చావుకొచ్చిందో? చప్పుళ్ళకి మాట్రియోనా లేచినట్టుంది. కాలకృత్యాలయ్యేక కాస్త వేడిగా తాగడానికి ఏదో పట్టుకొచ్చింది సైమన్ దగ్గిరకి. పని ఆపి అది తాగుతూ మాట్రియోనా కేసి చూసేడు సైమన్.

“నిన్న రాత్రి చెప్పినది గుర్తుందా? ఈ రోజు ఊళ్ళొకెళ్ళి గొర్రె చర్మం కొంటానన్నావు కదా? నేనిప్పటిదాకా దాచిన మూడు రూబుళ్ళు ఇస్తాను. మధ్యాహ్నం బయల్దేరి వెళ్తే సాయంకాలానికి వచ్చేయవచ్చు.” అన్నది మాట్రియోనా.

“ఇదిగో, ఈ రెండు బూట్ల పని అయిపోగానే స్నానం చేసి బయల్దేరుతున్నాను.”

“దారిలో తొందరపడి నీ దుకాణం దగ్గిరకెళ్ళి డబ్బులు తాగుడుకి తగలేయకు మరి. క్రితం ఏడు కోటు లేక ఎంత అనుభవించామో గుర్తుంది కదా?”

“సరే, సరే. ఊళ్ళొ బాకీలు అయిదు రూబుళ్ళ చిల్లర రావాలి. అవీ, మనదగ్గిరున్నదీ కలిపితే ఎనిమిది రూబుళ్ళవుతుంది. మంచి గొర్రె చర్మం దొరుకుతుంది ఆ డబ్బులకి.”

మధ్యాహ్నం తిండి తిని ఊతానికో కర్ర పట్టుకుని బయల్దేరబోయేడు సైమన్. గుమ్మం దాటుతూంటే మాట్రియోనా వెనకనే వచ్చి తను తొడుక్కున్న గుడ్డకోటూ, ఇంకో పాత టోపీ ఇచ్చి చెప్పింది మళ్ళీ,

“ఇవి కూడా వేసుకో వచ్చే సరికి చలి ఎక్కువగా ఉండొచ్చు. సారా దుకాణం వేపు వెళ్ళకు సుమా!”

మాట్రియోనా ఇచ్చినవి పైన వేసుకుని నడక సాగించేడు సైమన్. ఊళ్ళోకొచ్చి ఒక రైతు గురించి వాకబు చేసేడు. కానీ రైతు ఇంట్లో లేడు. వాళ్ళావిడ చెప్పడం బట్టి, తన దగ్గిర డబ్బులుంటే ఇచ్చుండేదే కనీ ఒక్క కోపెక్ కూడా లేదుట. వచ్చే వారం లోపుల సైమన్ డబ్బు పువ్వుల్లో పెట్టి ఇప్పిస్తానని మాటిచ్చి తలుపేసుకుంది ఆవిడ. సైమన్ రెండో ఇంటికెళ్ళేసరికి అక్కడున్న రైతు, ‘దేముడి మీద ప్రమాణం, నాదగ్గిర ఈ ఇరవై కోపెక్ లకి మించి ఇంకేమీ లేదు,’ అని అవే ఇచ్చాడు ఒకసారి ఎప్పుడో తన చెప్పులు సరిచేసి కుట్టినందుకు. దానితో పాటు ఇంకో చెప్పుల జత ఇచ్చేడు సరిచేయమని.

రావాల్సిన అయిదు రూబుళ్ళలో వెనక్కి వచ్చింది ఇరవై కోపెక్కులు. వీటితో గొర్రె చర్మం కాదు కదా, గొర్రె తోక బొచ్చు కూడా రాదు. ఇంతదాకా వచ్చాక ఉత్తి చేతుల్తో పోవడమేనా? పోనీ అప్పు మీద చర్మం కొంటే? సైమన్ గొర్రె చర్మాలు అమ్మే ఆయన్ని అప్పు ఇస్తాడేమో అని అడిగేడు. “బాకీలు వసూలు చేసుకోవడం ఎంత కష్టమో మాకూ తెలుసు. డబ్బులు తీసుకురా, తర్వాత నీ ఇష్టం వచ్చినది కొనుక్కుందూగానీ,” అని బయటకి పంపించేడు ఆయన.

సైమన్‌ని బాగా నిరాశ ఆవరించింది. రైతు ఇచ్చిన ఇరవై కోపెక్కులని వోడ్కా తాగడానికి తగలేసి వెనక్కి ఇంటికి బయల్దేరేడు. అయితే ఇంతా కష్టపడి ఈ ప్రయాణంలో సైమన్ చేసినదేమిటంటే ఇరవై కోపెక్కుల బాకీ వసూలు చేసుకోవడమూ, మాట్రియోనా తిడుతుందని తెల్సినా ఇరవై కోపెక్కులే కదా అని వాటిని తాగి తగలేయడమూ, రైతు ఇచ్చిన చెప్పులు పట్టుకురావడమూను. వోడ్కా రక్తంలోకి దిగింది కాబోలు, పైకే గొణుగడం మొదలెట్టాడు వెనక్కి ఇంటికి వెళ్ళే దారిలో.

II

“నాకు వెచ్చగానే ఉంది,” పైకే అనుకున్నాడు నడుస్తూ సైమన్.

“నాకు సరైన కోటు లేకపోయినా. నేనేమీ పట్టించుకోను, గొర్రె చర్మం లేకపోయినా కోటు లేకపోయినా నేను బతగ్గలను. ఇంటావిడ సాధిస్తుంది కోటు కొనుక్కోలేకపోయాం అనీ, ఎంత సిగ్గుచేటూ అనీనూ. తెచ్చిన బూట్లకి పని వెంఠనే చేసి ఇవ్వాలా? డబ్బులు అడిగితే మాత్రం రేపు, మాపు అని తిప్పుతున్నాడీయన. ఆగాగు. నువ్వు ఊళ్ళోకెళ్ళి రావల్సిన బాకీ డబ్బులు తేకపోతే చర్మం వలుస్తాను అంటుందా? అనకపోతే అదృష్టమే. అయినా ఇదేంటీ? వీడికి పని చేసిపెట్టినందుకు ఇప్పుడో ఇరవై అప్పుడో ఇరవై కోపెక్కులూ ఇస్తాడా? ఇరవై కోపెక్కులతో ఏం చేయగలను? వోడ్కా తాగ్గలను అంతేనా? ఎంతో కష్టంగా ఉందిట నాకు డబ్బులు ఇవ్వడానికి ఈయనకి. అయితే అవ్వొచ్చుగాక. నీకైతే భూమి ఉంది, పశువులూ, పాడీ, సొంతంగా పండించుకున్న గోధుమలూ, జొన్నలూ ఉన్నాయ్, మరి నాకో? ప్రతీ గింజ కొనుక్కావాల్సిందే. పని ఉన్నా లేకపోయినా తినడానికి వారానికి మూడు రూబుళ్ళు రొట్టెలకే పోతోంది. ఇంటికెళ్ళేసరికి పొయ్యలో పిల్లి లేవదే? పిండి అయిపోయింది, ఏదీ ఇంకో రూబుల్ తే అని అడుగుతోంది. నాకున్న బాకీ నువ్వు తీర్చకపోతే నేనెక్కడ చచ్చేది?”

ఈ సరికి సైమన్ ఊరి చివర మలుపులో గుడి దగ్గిరకొచ్చేడు. తలెత్తి పైకి చూసేసరికి గుడి దగ్గిర ఏదో తెల్లగా కనిపించింది. కళ్ళు చికిలించి చూసేడు.

“అక్కడ తెల్లటి రాయి ఏమీ లేదే ముందు? ఎద్దా? ఎద్దులాగా కూడా లేదు, మనిషి తలలాగా కనిపిస్తూంటే? అయినా ఈ సమయంలో అక్కడ మనిషి ఏం చేస్తూ ఉంటాడు?” దగ్గిరకొచ్చేసరికి సరిగ్గా కనిపించింది ఈ తెలుపు ఏమిటో. నిజంగా మనిషే – బతికున్నవాడో, శవమో? దిగంబరంగా పడి ఉన్నాడు. సైమన్ కొద్దిగా వణికేడు.

“ఎవరో చంపేశారు వీడిని. ఇందులో తలదూరిస్తే నాకు తగులుకోవచ్చు” అనుకుంటూ తిరిగి నడక సాగించేడు. కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ ఓ సారి వెనక్కి చూశాడు. ఇప్పుడు అక్కడున్న మనిషి కాస్త లేచి నించుని సైమన్ కేసే చూస్తున్నట్టున్నాడు. సైమన్‌కి భయం మరీ ఎక్కువైంది.

“అతనెవరో? నేను వెళ్తే మీదపడి నన్ను చంపితే? అదీగాక ఆయనికి వంటిమీద బట్టలే లేవు. నాకెందుకు?” వడివడిగా అడుగులేస్తూ ముందుకెళ్ళిపోయేడు సైమన్.

సరిగ్గా పదీ ఇరవై అడుగులు వెళ్ళేసరికి సైమన్ అంతరాత్మ హెచ్చరించింది, “సైమన్! నువ్వేం చేస్తున్నావ్? దొంగలు దోచేసేంత డబ్బున్నవాడివైపోయావా నువ్వు? పాపం ఆ మనిషి చలిలో అలా సహాయం కోసం చూస్తున్నాడేమో? సిగ్గు, సిగ్గు!!”

సైమన్ వెనక్కి తిరిగి ఆ మనిషి దగ్గిరకెళ్ళాడు.

III

అతను యుక్త వయస్కుడే, దేహం మీద ఏమీ దెబ్బలున్నట్టు లేదు. మెల్లిగా కళ్ళు తెరిచి సైమన్ కేసి చూశాడు. ఆ ఒక్క చూపుతో సైమన్‌కి అతనంటే అభిమానం పుట్టుకొచ్చింది. చేతిలో ఉన్న రైతు ఇచ్చిన బూట్లు కింద పారేసి తన ఒంటిమీద పైనున్న గుడ్డ కోటు విప్పేడు సైమన్.

“ఇది తీరిగ్గా మాట్లాడుకునే సమయం కాదు, రా! ఈ కోటు తొడుక్కో,” అని సైమన్ అతడిని జబ్బలు పట్టుకుని పైకి లేపాడు. అతను లేవగానే కోటు కప్పాడు కానీ అతనికి చేతులు కోటులో ఎలాపెట్టాలో తెలియలేదు. సైమన్ కోటు తొడిగి చుట్టూ ఉన్న తాడు బిగించి కట్టేడు నడుము చుట్టూరా. రైతు మరమ్మత్తుకి ఇచ్చిన ఇచ్చిన బూట్లు అతని కాళ్లకిచ్చి చెప్పేడు:

“చీకటి పడుతోంది, నడవగలవా? అన్ని విషయాలూ తర్వాత చూసుకోవచ్చు” అతను లేచి కృతజ్ఞతతో సైమన్ కేసి చూశాడు.

“ఏమీ మాట్లాడవేం?” అడిగేడు సైమన్, “ఇదిగో ఈ కర్ర పుచ్చుకో నీరసంగా ఉంటే. తొందరగా నడిస్తే, చలి ముదిరే లోపుల ఇంటికెళ్ళిపోవచ్చు.” నడుస్తూంటే సైమన్ అడిగేడు,

“నువ్వెక్కడ వాడివి?”

“ఈ ప్రాంతాలకి చెందినవాడ్ని కాదు.”

“ఆ మాత్రం తెలుస్తోందిలే. ఈ ప్రాంతాల్లో ఉన్న జనం నాకు బాగా తెల్సినవాళ్ళే. ఆ గుడి దగ్గిరకి ఎలా వచ్చావ్?”

“ఇప్పుడు చెప్పలేను”

“ఎవరైనా కొట్టేరా?”

“లేదు, భగవంతుడే శిక్షించాడు.”

“అవునులే, భగవంతుడే జగత్ప్రభువు, కానీ నువ్వు రోజూ తిండీ, గుడ్డా, కొంపా అమర్చుకోవాలి కదా? ఎక్కడికెళ్దామనుకుంటున్నావు?”

“ఎక్కడైనా ఒక్కటే”

సైమన్‌కి ఆశ్చర్యం వేసింది. ఆగంతకుడు గౌరవంగా, బాగానే మాట్లాడుతున్నాడు. ఏమో ఎవరికెరుక, “సరే ఈ రోజుకి నువ్వు మా ఇంటికిరా. మిగతా విషయాలు తర్వాత చూద్దాం.” చెప్పేడు సైమన్. కానీ మనసులో మాట్రియోనా ఏమని సాధిస్తుందో అని మనసులో పీకుతూనే ఉంది. కానీ గుడి దగ్గర అతను చూసిన చూపు గుర్తుకి వచ్చి మనసు తేలికపడింది.