స్పందన: భారతీయ కావ్యాల కాల-కర్తృనిర్ణయం

ఏల్చూరి మురళీధరరావుగారు నవంబర్ 2013 ఈమాటలో ప్రచురించిన కుమారసంభవంలో ‘లలితాస్యాంబురుహంబు’ పద్యవివాదం: స్థితిస్థాపన అన్న వ్యాసం ద్వారా కుమారసంభవం కావ్యం రాసిన కవి నిజంగా ఎవరు? అతని కాలం ఏది? అనే వాదనను మళ్ళీ తెరపైకి తెచ్చారు. ఇలాంటి కాల, కర్తృనిర్ణయాలపైన నా ఆక్షేపణలను ఈ వ్యాసంలో వివరిస్తాను.

ఇదే సంచికలో మోహనరావుగారు రాసిన వ్యాసంలో శాసనాల ద్వారా మనకు దొరుకుతున్న సమాచారాన్నీ, క్రీ.శ 1000-1600 మధ్య తెలుగు కావ్యరచనలో భాషా/ఛందశ్శాస్త్ర పరంగా జరిగిన మార్పుల్ని పరిశీలించారు. ఇప్పుడు నా దృష్టిలో మౌలికమైన ప్రశ్నకు వద్దాం.

మొదటగా ‘నన్నెచోడుడు కుమారసంభవం ఎప్పుడు వ్రాశాడు? ఆయన నన్నయకు పూర్వుడా తరువాతి వాడా?’ అన్న సమస్య మానవల్లి రామకృష్ణకవి, ‘నన్నెచోడుడు నన్నయకు పూర్వుడు,’ అన్న వాదన చేసిన తరువాత పెద్ద సమస్య అయ్యింది. దానిమీద గత 100 ఏళ్ళలో కొన్ని డజన్ల వ్యాసాలు[1] వచ్చాయి. వాటన్నటికీ పరాకాష్టగా అసలు నన్నెచోడుడు లేడు, ఆయన పుస్తకం లేదు, అదంతా మానవల్లి రామకృష్ణకవి చేసిన ‘కూటసృష్టి’ అని కొర్లపాటి శ్రీరామమూర్తి ఒక కొత్త వాదన చేశారు. ఈ వాదనలు, వాటి మంచి చెడ్డల గురించి ఆలోచనలు కొనసాగించే ముందు ఒక ప్రశ్న వేసుకోవాలి. ఏ పుస్తకం ఎవరు ఎప్పుడు రాశారు అన్న ప్రశ్న సాహిత్య చారిత్ర రాయడం అలవాటయిన 20వ శతాబ్దం తొలి రోజుల దాకా తెలుగులో ముఖ్య సమస్యల్లో ఒకటి కాలేదు. చరిత్రలో కాలం నిక్కచ్చిగా గీత గీసినట్టు నడుస్తుందనే ఒక దృక్పథం వల్ల కలిగిన ఫలితం ఇది. సాహిత్యం ఒక వస్తువని, దాన్ని సరళరేఖలో ముందు వెనకలుగా ఏర్పాటు చేసి దాని కథ చెప్పవచ్చనే కచ్చితమైన ఆలోచన మనకు 19వ శతాబ్ది చివరి రోజుల్లో పాశ్చాత్యులవల్ల సంక్రమించింది.

ఈ రకంగా రాసిన సాహిత్య చరిత్రలో ప్రతి పుస్తకం ఒక కర్త నుండి మొదలవుతుంది, ఒక కాలంలోనే రాయబడుతుంది, ఆ తరవాత రాయబడ్డ ప్రతికి నకళ్ళు తయారై, లేఖక దోషాలతో మనకు చేరుతుంది. ఈ మధ్యలో రకరకాల బుద్ధులున్నటువంటి లేఖకులు వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం మూల రచయిత ఉద్దేశించని కొన్ని భాగాలు చేరుస్తారు. వీటికి interpolations అని పేరు. ఈ పదాన్ని ‘ప్రక్షిప్తాలు’ అని అనువదించడం ఆధునిక తెలుగు విమర్శకుల అలవాటు. ఈ పద్ధతిలో మనం పుస్తక రచయితల గురించి వాళ్ళ కాలాన్ని గురించి నిర్విరామంగా వాదించుకుంటున్నాం.

ఇలాంటి చర్చలు ఇంగ్లీషు సాహిత్యంలో 19వ శతాబ్దంలో విపరీతంగా జరిగాయి. ఒకటి మెక్‌ఫర్సన్ (James Macpherson) అనే అతను ఓసియన్ (Ossian) అనే కవి రచించాడని చెప్తూ గేలిక్ భాషలో 1760లో ఒక ఇతిహాసాన్ని ప్రచురించాడు. ఈ ఇతిహాసం స్కాట్‌లాండ్‌లో గేలిక్ భాషలో ప్రాచీన కాలం నుంచి నోటిపాటగా గాయకులు పాడుతున్నారని, తను దాన్ని సంపాదించి ప్రచురిస్తున్నానని చెప్పాడు. అది మెక్‌ఫర్సన్ సృష్టించిన కావ్యం అని, అది నకిలీ కావ్యమని చాలా చర్చలు[2] జరిగాయి. అలాగే షేక్‌స్పియర్ నాటకాలు, ఆయనా లేక కాదు ఇంకా వేరెవరో రాశారా అనే చర్చ ఇంగ్లీషు సాహిత్యంలో అప్పుడప్పుడు తలెత్తుతూనే వుంటుంది.

తెలుగులో ఈ మధ్యే కన్యాశుల్కం అప్పారావుగారే రాశారా, మరెవరో రాశారా అన్న చర్చ కొన్నాళ్ళు కాలక్షేపంగా[3] కొనసాగింది. ఆధునిక కాలంలో చారిత్రకంగా బతికి వున్నారని మనకు తెలిసిన వ్యక్తులు సామూహికంగా కొన్ని రాజకీయ పత్రాలు తయారు చేస్తే ఆ పత్రాలలో ఎవరు ఏ భాగం రాశారు అన్న విషయం రాజకీయంగా ఆసక్తికరమైన ప్రశ్న అయ్యింది. అమెరికన్ రాజ్యాంగంలో ఆ రాజ్యానికి సంబంధించిన కాగితాలలో చాలామంది పాలుపంచుకున్నారు. అందులో జెఫర్సన్ రాసిన భాగమేమిటి, ఇతరులు రాసిన భాగాలేమిటి అన్న విషయాలను అతి సూక్ష్మమైన పద్ధతుల్లో పరిశీలించిన వాళ్ళు వున్నారు. వాళ్ళు కూడా వాక్య నిర్మాణంలో ప్రధానమైన పదాలను వదిలేసి అప్రధానమైన by, at, for, to, some ఇలాంటి మాటలు ఎవరు ఎక్కడ వాడతారు, ఎంత విరివిగా వాడతారు అనే వాటిని పరిశీలిస్తే ఏ భాగం ఏ వ్యక్తి రాసిందో చెప్పటానికి కొంత అవకాశం వుంటుందని కొన్ని సూక్ష్మమైన ఊహలు చేశారు. కాని ఇలాంటి పద్ధతి తెలుగు సాహిత్యంలో సాంప్రదాయకమైన ఛందస్సులు వాడే పద్యాల శైలిలో అనుసరించడానికి వీలయినదేనా అన్న ప్రశ్న కొన్ని ఇబ్బందులు పెడుతుంది. భాసుడి కర్తృత్వం గురించి కూడా కొందరు పరిశోధకులు ఆధునిక పద్ధతుల్ని ఉపయోగించి[4] చూశారు.

నా ప్రశ్నల్లా ఈ పని ఇంకా ఎన్నాళ్ళు చేస్తాం? ఇంతకన్న సాహిత్యంలో వేసుకోవలసిన ముఖ్యమైన ప్రశ్నలు లేవా? ఈ సాహిత్య చరిత్రల సంప్రదాయం మనకు పాశ్చాత్యుల నుంచి వచ్చిన క్రమంలో కొన్ని కొత్త ఊహలు కూడా మనలో ప్రవేశించాయి. అందులో ఒకటి ‘గ్రంథచౌర్యం’ అన్న మాట. విలువ లేని వస్తువును ఎవరూ దొంగిలించరు. చౌర్యం అన్న మాట వాడే ముందు ఏది దొంగిలించబడినదో అది ఒక విలువ కట్టదగిన వస్తువు (commodity) అయివుండాలి. ఆధునిక వ్యాపార వ్యవస్థలో నిత్య జీవితంలో వుండే చాలా వస్తువులు ఇలానే ఏర్పడుతున్నాయి. వస్తుతహా భావాలకు విలువ ఉన్నప్పుడు భావ చౌర్యం అనే ఊహ, అదేవిధంగా సంగీతంలో స్వరచౌర్యం అనే భావం ఏర్పడతాయి. సాహిత్యంలో గ్రంథ చౌర్యం అనే భావం ఏర్పడింది అంటే గ్రంథాన్ని ఒక విలువగా, అంటే కొనుక్కునే వస్తువుగా మార్చాం అన్న మాట. తెలుగు సాహిత్యంలో గ్రంథచౌర్యం అనే ఊహ ఎప్పుడు ఏర్పడింది, ఎంత వెనక్కి దీన్ని వర్తింప చేయవచ్చు? అని ప్రశ్న అడిగితే చాలా సమస్యలు స్పష్టపడతాయి. నన్నయ, తిక్కన, ఎర్రన, వీళ్ళ కాలం నాటికి గ్రంథచౌర్యం అనే ఊహ లేదు. తెలుగులో మొదటిసారిగా పెద్దన ‘మనుచరిత్ర‘లో గ్రంథచౌర్యం అనే ఊహకి ఆధారమైన పద్యం — భరమై తోఁచు కుటుంబరక్షణకుగాఁబ్రాల్మాలి చింతన్నిరం… — కనిపిస్తుంది.

ఇదే కాలంలో ఉన్న అన్నమయ్య కూడా తన పాటల లాంటివే రాస్తున్న వాళ్ళని ‘ఛాయాపహారులు,’ అని తీవ్రంగా నిందిస్తాడు.

వెర్రులాల మీకు వేడుక గలితేను
అర్రు వంచి తడుకల్లంగ రాదా?
……
ఉమిసిన తమ్మలో నొక కొంత కప్రము
సంకూర్చి చవిగొని చప్పరింపనేల
అమరంగ ఛాయాపహారము చేసుక
తమ మాట గూర్చితే దైవము నగడా

ఇది ఇలా వుండగా, సంకుసాల నృసింహకవి వ్రాసినదని చెప్పబడుతున్న ఒక పద్యం కృష్ణదేవరాయలు కుమార్తె మోహనాంగి కొనుక్కున్నదని, ఆ పద్యం తన తండ్రితో చదరంగం ఆడుతున్న సందర్భంలో ఒక ఏనుగుకి, ఒక గుర్రానికి ఇరుక్కున్న తన బంటుని కాపాడుకోలేక చదివిందని ఒక కథ ఉంది. పద్యాలు కొనుక్కోవడం మీద ఇలాంటి కథలు చాటు సంప్రదాయంలో మరి కొన్ని ఉన్నాయి. ఇంతకూ చెప్తున్నదేమిటంటే అటు పెద్దన, ఇటు అన్నమయ్య, చాటు సంప్రదాయంలోని కవుల పద్యాలు, భావాలు వస్తువులుగా తయారయిన వాతావరణంలో ఉన్నారు. చారిత్రకంగా తిరుపతి గుళ్ళో అన్నమయ్య డబ్బు సంపాదించుకుంటున్నాడు[5]; సరిగ్గా అలాగే రాయల ఆస్థానంలో పెద్దన రాజపోషణ పొందుతున్నాడు. ఈ సందర్భాలలోనే ‘గ్రంథచౌర్యం’ అనే ఊహకి చోటు వుంది. దీన్ని అన్ని కాలాల్లోను, అందరికీ వర్తింపజేయడం సాధ్యం కాదు.

కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధానులు తన యింటి గోడ గురించి పొరుగువాడితో వ్యాజ్యం తెచ్చినప్పుడు గిరీశం, ‘యీగోడ స్పష్టంగా మీదాన్లాగే కనపడుతూంది,’ అని ‘యీగోడ మీదయినట్టు జల్లీల్తెగబొడిచి సాక్ష్యంకూడా పలగ్గలను,’ (ద్వితీయాంకము, 3వ స్థలము; కన్యాశుల్కం, 2వ కూర్పు, 1909) అంటాడు. తెలుగులో ఈ కాలపు కర్తృత్వపు విమర్శనలలో పోలికలున్న పద్యాలని చూపించి మొదటిది మూలం, రెండవది చౌర్యం అని చెప్పే వాదనలు చూస్తుంటే గిరీశం మాటలు గుర్తు రాక మానవు. భావాలు ఆస్తులుగా పరిగణింపబడని కాలంలోని పద్యాలు ఎవరివో నిక్కచ్చిగా చెప్పటానికి వీలులేని పరిస్థితిలో, తెలుగు సాహిత్యంలో ఈ చర్చల వల్ల ప్రయోజనం లేదు. తెనాలి రామలింగడు ఎందుకు తయారయ్యాడు? ఏ పరిస్థితుల్లో చాటు సంప్రదాయం ఈ కవిని సృష్టించుకుంది? అన్న విషయాలు ప్రధానం కానీ, తెనాలి రామలింగడు ఫలానా పుస్తకం వ్రాశాడా లేదా అన్నది కాదు[6]. శృంగార తిలకం లాంటి పుస్తకాలను కచ్చితంగా ఒక కాలానికి, ఒక కవికి వర్తింప చేయడం ఒక కాలానికి చెందిన అలవాటు, అంతే. అది సర్వకాలసర్వావస్థలలో వర్తింపచెయ్యదగిన ‘వాస్తవం’ కాదు. వాటి ఆధారంగా నన్నెచోడుడు అంత పాత కాలం వాడు కాదు, ఇంకా తరువాతి కాలం వాడు అని నిర్ధారించబోవటం సరయిన పద్ధతి కాదు. ఇక, కుమారసంభవం రామకృష్ణకవి కూటసృష్టి అని కొర్లపాటి శ్రీరామమూర్తి చేసిన వాదనలు ఎందరో సహేతుకంగా తిరస్కరించిన తరువాత కూడా మరొకసారి వాటిని తప్పని రుజువు చేయనవసరం లేదు.

చివరిగా ఈ చర్చల్లా వెళ్ళి రామకృష్ణకవికి అపనింద అంటగట్టటం వరకు వచ్చింది. ఆయన మహా పండితుడు, తన కాలంలో తెలుగుదేశంలో తనంతటివాడు లేడు అనదగినంత గొప్ప పండితుడు. అంతకన్నా మించి కాలికి బలపం కట్టుకుని తిరిగి మారుమూల గ్రంథాలయాలన్ని వెదికి పుస్తకాలని గుర్తించి మన ప్రపంచానికి అందించినవాడు. ఆయన లేకపోతే నాట్యశాస్త్రానికి అభినవగుప్తుడు రాసిన వ్యాఖ్యానం దొరికేది కాదు (ఆయన గుర్తించిన తరువాత దానిని గురించిన మరికొన్ని ప్రతులు దొరికిన మాట నిజమే. కానీ అభినవగుప్తుని వ్యాఖ్యానాన్ని పరిష్కరించి మొదట ప్రచురించినవాడాయన.) బరోడాలో ఆయనకు ఉన్న గౌరవం మనం ఎఱిగినదే. తెలుగులో ఎన్నో పాత పుస్తకాలు ఆయన వల్ల పైకి వచ్చాయి. ఇంతా చేస్తే ఆయన ఒక హైస్కూలు పండితుడిగా, చిన్న జీతంతో బతికాడు. తోటి పండితుల గుర్తింపు, ప్రభుత్వాల పోషణ, విశ్వవిద్యాలయాల ఆదరణ ఆయనకేమీ లభించలేదు. ఆయనకు కృతజ్ఞతలు చెప్పడం మానేసి ఆయనను నిందించడం అన్యాయం.

నిజంగా చెప్పాలంటే కుమారసంభవం ఎవరు రాశారు అన్నది ప్రశ్న కాదు. ఆ పుస్తకం ఏమిటి చేస్తుంది? ఆ పుస్తకంలో ఉన్న అర్థం ఏమిటి? భాషలో, ఊహల్లో, వస్తునిర్మాణంలో ఆ పుస్తకం చూపించే ప్రపంచం ఎలాంటిది? ఆ ప్రపంచాన్ని గురించి తెలుగు సాహిత్యంలో ఎలా మాట్లాడాలి? దానివల్ల మనకు బోధపడే విషయాలేమిటి? ఆ పుస్తకం ఎవరైనా ఎందుకు చదవాలి? ఎందుకు వినాలి? ఎందుకు ఆలోచించాలి? చర్చలు వాటి మీద కేంద్రీకరించి కాల, కర్తృత్వ వివరాలు వదిలేయడం మంచిది.


గ్రంథసూచి

  1. నే. కృష్ణమూర్తి; వ్యాసరచనల సూచి; ఆ.ప్ర. సాహిత్య అకాడమి, 1977.
  2. Thomas M. Curley; Samuel Johnson, the Ossian Fraud, and the Celtic Revival in Great Britain and Ireland; 2009.
  3. మొదలి నాగభూషణ శర్మ, ఏటుకూరి ప్రసాద్ (సంపాదకులు); కన్యాశుల్కం – నూరేళ్ళ సమాలోచనం; viSaalaaMdhra; 1999.
  4. AAE Van der Geer; The Bhasa Problem – A statistical research into its solution; PhD Rijksuniversiteit Leiden; 1998.
  5. Velcheru Narayana Rao, David Shulman; God on the Hill: Temple poems from Tirupati, Oxford University Press; 2005.
  6. Velcheru Narayana Rao, David Shulman; A Poem at the right moment: Remembered verses from premodern south India, University of California Press; 1998.