పలుకుబడి: శషసలతో శషభిషలు

శ-, ష-, స- అక్షరాలు మూడు ప్రత్యేక వర్ణాలుగా పలు భారతీయ భాషలలో కనిపించినా, ఈ అక్షరాల ఉచ్చారణ విషయంలో అన్ని భాషలవారిలోనూ కొంత అయోమయం కనిపిస్తుంది. సంస్కృత భాష ఆధారంగా తయారైన వివిధ వర్ణమాలలలో వీటిని మూడు ప్రత్యేక అక్షరాలుగా పేర్కొన్నా, ఇవి మూడు విభిన్న ధ్వనులుగా ఏ దేశభాషలోనూ స్థిరత్వం పొందలేదు. భారతదేశంలో ఈ మూడు ధ్వనుల చరిత్ర గురించి నాకు తెలిసిన కొన్ని అంశాలు ఈ విభాగంలో చర్చిస్తాను.

ముందుగా భాషలో ఉచ్చారణ యొక్క ప్రాముఖ్యాన్ని తెలిపే ఈ చాటుశ్లోకాన్ని చూడండి:

యద్యపి బహునాధీషే తథాపి పఠపుత్ర వ్యాకరణం
స్వజనః శ్వజనః మాభూత్ సకలం శకలం సకృత్ శకృత్

భావం: నాయనా నీవు శాస్త్రాలు, వేదాలు నేర్వకున్నా మానె కానీ, వ్యాకరణం నేర్చుకో! ఎందుకంటే స్వజన (మన వాళ్ళు) అన్న శబ్దాన్ని శ్వజన (కుక్కలు) అనకుండా , సకలం (సర్వం) అన్న శబ్దాన్ని శకలం (ముక్క/లు) అని పలకకుండా, సకృత్ (మంచి పని) అన్న శబ్దాన్ని శకృత్ (మలం) అని పలకకుండా ఉండడానికి అది ఉపయోగపడుతుంది — అని ఒక తండ్రి తన కుమారునికి చెబుతున్నాడు.

సంస్కృతంలో స్పష్టమైన ఉచ్చారణకు వ్యాకరణపఠనం ఎంత ముఖ్యమో అని చెప్పటానికి ఈ చాటువు శ్లోకాన్ని మనకు వినిపిస్తారు. అయితే, ఈ శ్లోకంలో తప్పుడు ఉచ్చారణలకు తండ్రి ఇచ్చిన ఉదాహరణలు జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తాయి. ఈ శ్లోకాన్ని బట్టి, ఆ నాటికే శ-కార, స-కారాల మధ్య అయోమయం ఉండేదని మనం ఊహించవచ్చు. అదీ కాక, ఈ శ్లోకం మైథిలి ప్రాకృత ప్రాంతమో, మాగధి ప్రాంతంలోనో చెప్పి ఉండాలి. ఎందుకంటే మైథిలి, మాగధి వంటి తూర్పు ప్రాకృతాలలోనే స- కారాన్ని శ- కారంగా పలకడం తొలినుండి కనిపిస్తోంది. తండ్రి చెప్పిన ఉదాహరణలన్నీ స-కారాన్ని శ-కారంగా పలికితే అర్థం ఎంత దారుణంగా మారిపోతుందో వివరించేవే కాబట్టి ఈ శ్లోకం ఆ తూర్పు ప్రాంతాలకు సంబంధించిందేనని మనం ఊహించవచ్చు.

సంస్కృత వ్యాకరణాల ప్రకారం శ-, ష-, స- ల ఉచ్చారణ

పాణినికన్న పూర్వమే ధ్వనిశాస్త్రం ఎంతో శాస్త్రీయంగా అభివృద్ధి చెందిందని మనకు తెలుసు. ప్రతి వేదసంహితానికి అనుబంధంగా ఆ వేదమంత్రాలలోని ధ్వనులను ఎలా ఉచ్చరించాలో తెలిపే విభాగాలు ఉండేవి. ఈ విభాగాలను ప్రాతిశాఖ్యలు అనేవారు. పాణినికన్న ప్రాచీనమైన ఋగ్వేద ప్రాతిశాఖ్య, తైత్తిరీయ ప్రాతిశాఖ్యలలోనే ఇప్పుడు మనకు వర్ణమాలలలో కనిపించే అక్షర సమామ్నాయం, అక్షరాల ఉచ్చారణను బట్టి వాటిని వివిధ వర్గాలుగా విభజించడం కనిపిస్తాయి. తెలుగులో వర్ణనిర్మాణం గురించి నేను ఇదివరలో రాసిన వ్యాసం పొద్దు పత్రికలో రెండు భాగాలుగా ప్రచురించారు (మొదటిభాగం, రెండవభాగం). అయితే, ఆ వ్యాసాలలో శ-, ష-, స- ల ఉచ్చారణ గురించి విపులంగా చర్చించలేదు.

తైత్తిరీయ ప్రాతిశాఖ్యలోని హల్లులను స్పర్శాలు (stops), ఊష్మాలు (fricatives), అంతస్థాలు (semi-vowels, approximants) అని మూడు ప్రధాన భాగాలుగా పరిగణించారు. స్పర్శాలను వాటి ఉచ్చారణ స్థానాలను బట్టి మరల అయిదు వర్గాలుగా విభజించారు. అవి వరుసగా, క-వర్గం, చ-వర్గం, ట-వర్గం, త-వర్గం, ప-వర్గం. ప్రతి ధ్వని ఉచ్చారణను ఉచ్చారణ స్థానం, ఉచ్చరించే కరణం (కదిలే వక్త్రాగం) నిర్దేశిస్తాయి. ఈ స్థాన, కరణాలను శాస్త్రీయంగా వివరించే సూత్రాలు తైత్తిరీయ ప్రాతిశాఖ్యలో ఉన్నాయి. ఆ సూత్రాలను స్థూలంగా పరిశీలిద్దాం.

క-వర్గం:

హనూమూలే జిహ్వామూలేన కవర్గే స్పర్శయతి (2.35)

స్థానం: కంఠమూలం/హనుమూలం
కరణం: జిహ్వమూల

తాత్పర్యం: క-వర్గానికి సంబంధించిన క, ఖ, గ, ఘ, ఙ మొదలైన స్పర్శాలను పలకడానికి నాలిక మొదలును (జిహ్వమూలాన్ని) కంఠమూలానికి ఆనించి పలకాలి.

చ-వర్గం:

తాలౌ జిహ్వామధ్యేన చవర్గే (2.36)

స్థానం: కఠిన తాలువు (అంగిలి)
కరణం: జిహ్వ మధ్యం

తాత్పర్యం: చ-వర్గానికి సంబంధించిన చ, ఛ, జ, ఝ, ఞ మొదలైన స్పర్శాలను పలకడానికి నాలిక మధ్య భాగాన్ని అంగులికి తాకేట్టుగా పైకి లేపి ఉచ్చరించాలి. అయితే, తెలుగులో ఈ హల్లులను నిజంగా జిహ్వ మధ్యభాగం ఉపయోగించి స్పర్శాలుగా పలకడం అరుదు. చ, జ లను తాలవ్యాచ్చుల ముందు తాలవ్య స్పర్శోష్మాలుగా (palatal affricates), మిగిలిన అచ్చుల ముందు వీటిని దంత్య స్పర్శోష్మాలుగా (ౘ, ౙలు) గా పలుకుతారు.

ట-వర్గం:

జిహ్వాగ్రేణ ప్రతివేష్ట్య మూర్ధని టవర్గే (2.37)

స్థానం: మూర్ధన్యం
కరణం: నాలిక కొస (జిహ్వాగ్రం)

తాత్పర్యం: ట-వర్గానికి సంబంధించిన ట, ఠ, డ, ఢ, ణ మొదలైన స్పర్శాలను పలకడానికి నాలిక కొసను మూర్ధన్యానికి తాకేట్టుగా వెనకకు లేపి ఉచ్చరించాలి.

త-వర్గం:

జిహ్వాగ్రేణ తవర్గే దంతమూలేషు (2.38)

స్థానం: దంతమూలం
కరణం: నాలిక కొస (జిహ్వాగ్రం)

తాత్పర్యం: త-వర్గానికి సంబంధించిన త, థ, ద, ధ, న మొదలైన స్పర్శాలను పలకడానికి నాలిక కొసను పైదంతాలకు తాకేట్టుగా ఉంచి ఉచ్చరిస్తే త-వర్గ ధ్వనులు ఉద్భవిస్తాయి.

ప-వర్గం:

ఓష్ఠాభ్యాం పవర్గే (2.39)

స్థానం: పెదవులు
కరణం: పెదవులు

తాత్పర్యం: పై పెదవికి కింది పెదవి తాకేట్టుగా ఉంచి, ఆపై గాలిని విడిస్తే ప-వర్గ ధ్వనులైన ప, ఫ, బ, భ, మలు ఉద్భవిస్తాయి.

ఉష్మ ధ్వనులు

అయితే, ఈ ప్రాతిశాఖ్యలో స్పర్శాలను వివరించినట్టుగా, శ-, ష-, స-ల ధ్వనులను విడివిడిగా వివరించలేదు. ఈ వర్ణాలను ఊష్మ ధ్వనులుగా పేర్కొని, ఊష్మశబ్దాలకన్నింటికి కలిపి ఒకే ఒక సూత్రం చెప్పారు:

స్పర్శస్థానేషూష్మాణ ఆనుపూర్వ్యేణ
కరణమధ్యం తు వివృతం
(2.44-45)

ఊష్మ ధ్వనులు ఆయా స్థానాలో పలికే స్పర్శ ధ్వనులనే అనుసరిస్తాయి. అయితే, స్పర్శ వర్ణాల ఉచ్చారణలో లాగా కరణం, స్థానాన్ని పూర్తిగా తాకకుండా, ఊష్మ వర్ణాల ఉచ్చారణలో స్థాన కరణాల మధ్య కొంత ఎడం (వివృతం) వదలి ఉచ్చరించాలని ఈ సూత్రం వివరిస్తోంది. ఈ సూత్రాన్ని విస్తరించుకొని శ-, ష-, స- కారాల ఉచ్చారణను మనం ఈ విధంగా వివరించవచ్చు.

శ-కారం తాలవ్య ధ్వని. చ-వర్గంలో వివరించినట్లు ఈ తాలవ్య ధ్వనులను పలకడానికి జిహ్వమధ్యం అంగులిని తాకేట్టుగా పైకి లేపి ఉచ్చరించాలి. జిహ్వమధ్యం పైకి వెడుతుంది కాబట్టి ఆ సమయంలో జిహ్వాగ్రం (నాలిక కొన) కింది పళ్ళకు సమీపంగా వెళుతుంది. శ-కారం ఊష్మ వర్ణం కాబట్టి, ఇది తాలువును తాకదు.

అయితే, కొంతమంది సంస్కృత, తెలుగు పండితులు తప్ప ఈ మధ్యకాలంలో తెలుగులో ఈ వర్ణాన్ని ఎవ్వరూ నిజంగా జిహ్వ మధ్యభాగాన్ని ఉపయోగించి పలకడం లేదు. నాలిక కొసను ఉపయోగించి పలకడం వల్ల ఇది ష- కారంగానో, లేదా స-కారంగానో వినబడుతుంది. కొంతమంది దీన్ని దంత్య స-కారంతో విభేదించడానికి ఇంగ్లీష్ పదాలలో వినిపించే æ ధ్వనిని జత చేసి పలుకడం చాలా సాధారణంగా వినిపిస్తుంది. ఉదాహరణకు: శాపము అన్న పదాన్ని సాæపము అని, శారద అన్న పదాన్ని సాæరద అని, పిశాచము అన్న పదాన్ని పిసాæచము అని పలకడం కద్దు.

ష-కారం మూర్ధన్య ధ్వని. మిగిలిన మూర్ధన్య ధ్వనులైన ట, ఠ, డ, ఢ, ణలు పలికినట్టుగానే నాలిక కొసను మూర్ధన్యం వైపు వెనక్కి మడిచి పలకాలి. కానీ, ఇది ఊష్మ శబ్దం కాబట్టి మూర్ధన్యాన్ని తాకదు.

స-కారం దంత్య ధ్వని. పై పంటికి గాని, కింది పంటికి సమీపంగా నాలిక కోసను తీసుకువెళ్లి ఉచ్చరిస్తే పలికే ధ్వని. ఊష్మ శబ్దం కాబట్టి దంతాలను పూర్తిగా తాకదు.

ప్రాకృత భాషల్లో శ-ష-సలు

ముందుగా చెప్పినట్లు భారతదేశంలోని ఏ ప్రాకృత భాషలోనూ ఈ మూడు అక్షరాలు ప్రత్యేక ధ్వనులుగా స్థిరపడలేదు. అయితే, , దార్దిక భాషలయిన పశాయి (పైశాచి), కునార్, కోహిస్థాని వంటి భాషలలో ఇప్పటికీ ఈ మూడు ఊష్మ ధ్వనులను విభిన్న వర్ణాలుగా ఉచ్చరించడం విశేషం.

ముందుగా చెప్పినట్టు భారతదేశంలో తూర్పు ప్రాకృతాలైన మాగధి, మైథిలి భాషలలో స- కారం శ- కారంతో విలీనం అయ్యింది. పశ్చిమ వాయవ్య భాషలలో శ- కారం తాలవ్యాచ్చుల ముందు ష-కారంతో, మిగిలిన చోట్ల స- కారంతో విలీనం అయ్యింది. వాయవ్య భాషాలలో, ఆధునిక మరాఠీలోనూ తాలవ్యాచ్చుల (ఇ-, ఎ-) ముందు ష-కారం, మిగిలిన చోట స-కారం వినిపించడం కద్దు. సిమ్లా > షిమ్లా; దేశ > దేస్.

శౌరసేని వంటి ఉత్తరాది భాషలలోనూ, మధ్య, దక్షిణాది ప్రాకృత భాషలలో అన్ని ఊష్మ వర్ణాలు స-కారంతో విలీనం చెందాయి.