భారతీయ పుస్తక చరిత్ర: 2. రాత పుట్టుక, పరిణామం – భారతీయ లిపులు


ఫార్మర్ ప్రతిపాదన 2

ఫార్మర్, విట్జెల్ ప్రతిపాదన, భారత చరిత్ర అధ్యయనంలో అది పెద్ద వివాదానికి దారితీసింది. ఈ వ్యాసంలో వారు సింధు నాగరికతను నిరక్షర సమాజం (illiterate society) అన్నారు. వారు వాడిన ‘ఇల్లిటరేట్’ అన్న మాట భారత జాతీయవాదులని చాలా కలవరపరిచింది. ఇంటర్నెట్‌లో దీనిపై ఎన్నో గొడవలు జరిగాయి. ఇప్పటికీ, వారానికొకరు సింధులోయ లిపిని పరిష్కరించామని ప్రకటిస్తుంటారు, వీరిలో ఔత్సాహికులే ఎక్కువ. బహుశా, వారు నిర్లిఖిత (non-literate) అనే పదం వాడి వుంటే ఇంత గొడవ జరగకపోయేదేమో. ఈ వివాదంతో, ఎలాగో ఒకలా మాకూ రాత ఉంది, మా సంస్కృతిలోనూ రాత వ్యవస్థలు ఉన్నాయి, అవి వేరే సంస్కృతుల సంపర్కం ద్వారా రాలేదు అని నిరూపించటానికి కొంతమంది ఔత్సాహిక పరిశోధకులు తిమ్మిని బమ్మి చెయ్యడానికి కూడా వెనుకాడలేదు.

దురదృష్టవశాత్తూ, మన యూనివర్శిటీలనూ, బయటా పనిచేసే పరిశోధకులకీ ఇప్పటీకీ సులభంగా దొరికే సమాచారం స్వతంత్రం రాక పూర్వం వలసపాలన కాలంలో అచ్చయిన పుస్తకాలే. వాటిపై వచ్చిన కొన్ని వివాదస్పదమైన వ్యాసాలు చదివి, చాలా మంది ఔత్సాహికులు చాలా మంది, రాతే సర్వస్వం అనీ, అది ఎంత పురాతనమైతే మన సంస్కృతి అంత గొప్పది అనే భ్రమలో వాదిస్తున్నారు. పాశ్చాత్య పరిశోధకులు కూడా వారి సంస్కృతులు ఎలా అభివృద్ధి చెందాయో, అదొక్కటే సరైన మార్గం అని, అవే మార్పులు ఇక్కడా ఉండాలనే విధంగానే చూస్తారు. ఉదాహరణకి, ఫార్మర్ వాడిన “ఇల్లిటరేట్” అనే పదం ఎంతో వివాదానికి దారితీసింది.


ఫార్మర్ ప్రతిపాదన 3

ఫార్మర్, విట్జెల్ వ్యాసంతో రేగిన అనవసరమైన వివాదం వల్ల తెలుస్తున్నది మనం నిర్లిఖత (non-literate) సమాజాల అధ్యయనాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామని. ఇది చాలా దురదృష్టకరం. ఉదాహరణకి, ఇటువంటి సమాజాలలో జ్ఞాపక శక్తిని పెంపొందించుకోడానికి ఎటువంటి సాధనాలు ఉండేవి, చంధస్సు, క్లుప్తంగా గుర్తుంచుకోడానికి వీలుగా లయబద్ధంగా పద్యాలు, శ్లోకాల అల్లిక పద్ధతులు ఎలా ఉండేవి, ఈ సమాజాలలో వ్యాఖ్యాత, కథలు/సాహిత్యాన్ని చెప్పేవారి పాత్ర ఎలా ఉండేది మొదలైన విషయాలు అధ్యయనం చెయ్యడానికి కొత్త దారులు వేసుకునేవాళ్లం. మనది కూడా అనాదిగా ‘లిఖిత’ సమాజమే అనే ఏకపక్ష వాదన మూలంగా ఒక గొప్ప అవకాశాన్ని పోగొట్టుకుంటున్నాం అని అనిపించక మానదు.

ముగింపు

బ్రాహ్మీ లిపి అశోకుడి కాలం నుండే ప్రాచుర్యం లోకి వచ్చింది అని అనుకున్నా, అప్పటి వరకూ యావద్భారత సంస్కృతి పూర్తిగా మౌఖికం గానే అభివృద్ధి చెందిందా అనేది ముఖ్యమైన ప్రశ్న. అంటే, క్రీ.పూ. 300 వరకూ, అప్పటికే ఎంతో కాలం నుంచీ ఈజిప్టు, చైనా, మెసపటేమియాలతో సంపర్కం ఉన్నప్పటికీ, ఎందువల్ల రాత ఈ ప్రాంతం లోకి ప్రవేశించలేదు? మౌర్యులకి పూర్వంకూడా ఇక్కడ ఎన్నో చిన్న రాజ్యాలు ఉండేవి. సంక్లిష్టమైన రాజ్యవ్యవహారాలు, చంధస్సు, గణితం, సాహిత్యం ఇవన్నీ కూడా మౌఖిక మాథ్యమం ద్వారా సాధ్యమా అనేది చాలామందిని తొలిచే ప్రశ్న. ఈ ప్రశ్నలకి సమాధానాలు వెతుకుతూ, గత ముప్పై సంవత్సరాలుగా, రిచర్డ్ సాలమన్, మాధవ్ దేశ్‌పాండే, మైఖేల్ విట్జెల్, స్టీవెన్ ఫార్మర్ మొదలైన పరిశోధకుల ప్రతిపాదనలని సమీక్షిస్తూ, మా ప్రతిపాదనలు కూడా ఈ వ్యాసంలో చేశాం.

మౌఖిక-లిఖిత సంప్రదాయాలు ఈ సంస్కృతిలో ఒక ప్రత్యేకమైన రీతిలో ఒకదాన్నొకటి ప్రభావితం చేసుకున్నాయని ఈ వ్యాసంలో ప్రదర్శించాం. భౌగోళిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక, సాంకేతిక శక్తులు ఏ విధంగా రాత పరిణామాన్ని నిర్దేశించాయో ఈ వ్యాసంలో చర్చించాం:

 1. అశోకుడికి ముందు ఎటువంటి రాత ఆనవాళ్ళు ఇక్కడ లేవు.
 2. వాయువ్య ప్రాంతమైన గాంధార ప్రాంతాల్లో, పాశ్చాత్య/పర్షియన్ ప్రభావం వల్ల అరమయాక్, ఖరోష్టి లిపులు మౌర్యులకి ముందే, పాణిని కాలానికే ఉండేవి. ఖరోష్టి లిపి ప్రత్యేకంగా అక్కడి ప్రాంతీయ భాషలని రాయడానికి అభివృద్ధి చెందిందని చెప్పవచ్చును.
 3. పాణిని కాలం నాటికే, వేదాల్లో ఉచ్చారణ దోషాలు ప్రవేశించడం, కొన్ని వేద పాఠాల ఉచ్చారణ పూర్తిగా కోల్పోవడం జరిగింది. ఈ ప్రక్రియ పతంజలి/కాత్యాయనుల కాలం వరకూ కొనసాగింది. ఈ కాలంలోనే, వేదాలని, మిగిలిన వాఙ్మయాన్ని స్థిరపరుచుకుని, ప్రామాణీకరించుకునే ప్రయత్నాలు చాలా పట్టుదలగా జరిగాయి.
 4. రాత తాకిడిని తట్టుకోడానికి వైదిక సంప్రదాయం మరింతగా మౌఖిక-సంప్రదాయాలని బలపరచుకునే ప్రయత్నం చేసింది.
 5. తూర్పు ప్రాంతాలైన విదేహ, కోసల, మగధ ప్రాంతాల్లో ఇందుకు భిన్నంగా బౌద్ధం ప్రాచుర్యం లోకి వచ్చింది. వైదికమతంకన్నా, బౌద్ధ మతంలో ముందుగా లిఖిత గ్రంథాలు వచ్చాయి.
 6. అయితే, వైదిక సంప్రదాయం పూర్తిగా రాతని నిరాకరించలేదు. ఏదో రకంగా రాయడం ఎక్కడో ఒక నేపథ్యంలో, మౌఖిక సంప్రదాయానికి ఒక తోడుగా, ఉపకరణంగా ఉండేదని తెలుస్తుంది. వేదాలని మాత్రం, వాటికున్న ఉచ్చారణ ప్రాధాన్యత దృష్ట్యా, రాయడానికి ఒప్పుకోలేదు.
 7. భారతావనిలో ధ్వనిరూపకమైన అక్షర సమామ్నాయం క్రీ.పూ 700 నాటికే ఏర్పడింది. ధ్వనిశాస్త్రం శాస్త్రీయంగా అభివృద్ధి చెందింది. ఉచ్చారణలో ఎంతో ఆధునికత ఉండేది. ఈ కారణాల వల్లనూ, ఉదాత్త, అనుదాత్త స్వరాలని, ఒక్కో అక్షరానికి ఉండే ఎన్నో రకాల ఉచ్చారణని రాయడానికి సౌలభ్యం లేకపోవడం వల్లనూ, రాత ఆలస్యంగా పుంజుకున్నది.
 8. బ్రాహ్మీ లిపి అశోకుడి కాలంలో శాసనాలు రాయడానికి ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన లిపి – బహుశా, అరమయాక్, ఖరోష్టి లిపులు బ్రాహ్మీ రూపకల్పనని ప్రభావితం చేసి ఉండవచ్చు.
 9. భారత లిపులలో హల్లులని కూడా అజంతాలుగా రాయడం వల్ల, మనకి గుణింతాలు, సంయుక్తాక్షరాలు అవసరమయాయి. ఇవి లేకుండా హలంతాలుగా రాయడం కొన్ని చోట్ల జరిగింది కానీ అవి ప్రయోగాలు గానే మిగిలిపోయాయి.

ఈ కారణాల వల్ల రాతతో భారతీయ సంస్కృతికి ఉన్న అనుబంధం, మెసపటేమియా, ఈజిప్టు, చైనా సంస్కృతుల కంటే చాలా విభిన్నమైనది. రాతని, ముందు మత, సాంస్కృతిక, సాహిత్య వ్యవహారాలలో నిర్లక్ష్యం చేసినా, రోజువారీ రాజ్య వ్యవహారాలలో, వ్యాపార లావాదేవీల కోసం వాడి ఉంటారని కొంతమంది అభిప్రాయం. కానీ, దీనికి కూడా ఎలాంటి ఋజువులు మనకి ఈనాడు దొరకడం లేదు. “సాంస్కృతిక వ్యవహారాల లాగానే, భారతీయులు వారి అద్వితీయమైన జ్ఞాపకశక్తి తోనే వ్యాపార వ్యవహారాలు కూడా నడిపించేవారని అనుకోవడమే ఉత్తమం,” అంటాడు రిచర్డ్ సాలమన్.

సింధు నాగరికత ద్వారా కానీ, వైదిక సంస్కృతి ద్వారా కానీ మనం పాండిత్యానికి అక్షరాస్యత అవసరం లేదు అని కచ్చితంగా చెప్పవచ్చును. ముద్రా మాధ్యమం విరివిగా రాకముందు, మన కవులు, పండితులు రాసేవారు కాదు. వారికి రాయడానికి లేఖకులు ఉండేవారు. ఈ సంస్కృతిలో నిరక్షరకుక్షి, పొట్ట పొడిచినా అక్షరం ముక్కలేదు అనే నానుళ్ళకి అర్థం – చూచి చదవటం రాదని కాదు. అక్షరం అంటే ధ్వనిరూపకమే, ధ్వని కడుపు లోంచి వస్తుంది కాబట్టి ఆ వ్యక్తికి చదువు రాదనే అర్థంలో ఈ సామెతలు పుట్టాయి. ఈ వ్యాసంలో చూపినట్టుగా, సాంస్కృతిక, సామాజిక, నాగరికతా వికాసానికి రాత అవసరం లేదు. రాత లేకపోవడం మూలంగా ఒక సంస్కృతి ఏ విధం గానూ తక్కువైపోదు. ఇది మనం అర్థం చేసుకోగలిగితే, సింధు నాగరికతని గానీ, పాణిని/వైదిక సంప్రదాయాన్ని గానీ వేరే విధంగా పరిశీలించే అవకాశం ఉంది. ఈ వ్యాసంలో ప్రతిపాదించినట్టుగా, ఇక్కడ పాశ్చాత్య సంస్కృతికి భిన్నంగా, శబ్ధరూపకం గానే అక్షర సమామ్నాయం ముందు నుంచీ ఉండేదని, దానికి లిఖిత రూపం చాలా కాలం వరకూ అవసరం లేకపోయిందనే మార్గంలో చూస్తే — మనకి సింధు నాగరికత లిపిని సంస్కృతానికి గానీ, బ్రాహ్మీ లిపికి గానీ, ద్రావిడ లిపులకి గానీ కలపవలసిన అవసరం లేదు. ఫార్మర్ ప్రతిపాదించినట్టుగా అది అసలు లిపి కాదనుకున్నా వచ్చే నష్టం కూడా ఏమీ లేదు.

శాసనాలతో ప్రారంభం అయి, మౌఖిక సంప్రదాయానికి వెనుకగా ప్రారంభమైన లిఖిత సంస్కృతి, సాహిత్యం రాయడంతో గ్రంథ సంస్కృతిగా పరిణతి చెందింది. మహాభారతం,రామాయణం రాత రూపం లోకి రావడం చాలా పెద్ద మార్పు. ఎప్పుడైతే రాయడం అనే సాంకేతిక పరిజ్ఞానం సాహిత్యాన్ని, మిగిలిన సమాచార వ్యవస్థలనీ ప్రభావితం చేసిందో అప్పుడు లిఖిత సంస్కృతి ఈ మౌఖిక సమాజం నేపథ్యం లోంచి తప్పుకుని, సమాజాన్ని ప్రభావితం చేసే ప్రధానమైన శక్తిగా మారింది. ఈ మార్పు మన సంస్కృతిలో ఎన్నో ఒత్తిడులకి కారణం అయ్యింది – ఇక్కడ కొత్త వృత్తులు వచ్చాయి, కొత్త సమాజాలు ఏర్పడ్డాయి, కొత్త అధికార కేంద్రీకరణలు జరిగాయి.

గ్రంథ సంస్కృతి సామాజిక, సాంస్కృతిక చరిత్రని తరువాతి భాగంలో చూద్దాం.

(ఇంకా ఉంది.)


గ్రంథసూచి

 1. తిరుమల రామచంద్ర; మన లిపి పుట్టు పూర్వోత్తరాలు; హైదరాబాద్; విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్; 1990
 2. మల్లంపల్లి సోమశేఖరశర్మ; తెలుగు లిపి; తెలుగు విజ్ఞాన సర్వస్వము; సం. 3-4 – చరిత్ర, సంస్కృతి; తెలుగు భాషాసమితి; మద్రాసు, 1959-60
 3. Bühler, Georg (1898); On the origin of the Indian Brahma alphabet (2nd ed.); Strassburg: Karl J. Trübner; 1898
 4. Deshpande, Madhav M.; Ancient Indian Phonetics, in E. F. K. Koerner & R. E. Asher, ed., Concise History of the Language Sciences: From the Sumerians to the Cognitivists, Elsevier, Oxford, New York, Tokyo, pp. 72-77; 1995
 5. Deshpande, Madhav M; From Orality to Writing: Transmission and Interpretation of Panini’s astadhyayi in The International Symposium:The Book; Éditeur Bibliotheque de Bucarest; Bucarest; 2011; ISSN 2068 – 9756; pp. 57-100
 6. Falk, Harry; Schrift im alten Indien; Tübingen; Gunter Narr Verlag, 1993
 7. Farmer, Steve; Sproat, Richard and Witzel, Michael; The Collapse of the Indus-Script Thesis: The Myth of a Literate Harappan Civilization; in: Electronic Journal of Vedic Studies 11-2, 2004, pp. 19-57
 8. Glass, Andrew. A Preliminary Study of Kharoṣṭhī Manuscript Paleography.
  MA Thesis. University of Washington, 2000
 9. Glass, Andrew: in Yahoo discussion group
 10. Hinüber, Oskar von; Der Beginn der Schrift und frühe Schriftlichkeit in Indien; Abhandlung der Akademie der Wissenschaften und Literatur, Mainz, nr.11; Wiesbaden, 1989
 11. Joshi S.D. and Roodbergen J.A.D; Patañjali’s Vyākaraṇa-Mahābhāṣya, Paspaśāhnika, with introduction, text, translation and notes; Publications of the Centre of Advanced Study in Sanskrit, class C, no. 15; University of Pune, Pune; 1986. (see esp. the discussion in page 40-42.)
 12. Mahadevan, Iravatham; Early Tamil Epigraphy: From the Earliest Times to the Sixth Century A.D.;Harvard Oriental Series 62; Cambridge; 2003
 13. Mahadevan, Iravatham; What do we know about Indus Script? Neti Neti (‘Not this Nor That’); Presidential AddressSection V; Proceedings of the Indian History Congress, Forty Ninth Session, Karnataka University, Dharwad; 1988
 14. P.V. Parabrahma Sastry, N.S. Ramachandra Murthy; Telugu script:Origin and evolution (3rd c. BC – 16th c. AD); Hyderabad; Andhra Pradesh Government Oriental Manuscripts Library & Research Institute; 2009
 15. Parpola, Asko; Deciphering the Indus Script; Cambridge: Cambridge University Press; 1994
 16. Pollock, Sheldon; The Language of the Gods in the World of Men: Sanskrit, Culture and Power in Premodern India; Berkeley: University of California Press, 2006
 17. Rath, Saraju (Ed); Aspects of Manuscript Culture in South India; Brill; Leiden; 2012
 18. Ritti, Srinivas H.; “The Telugu Kannada Script: Its connotation and development; in:Researches in Archeology, History & Culture in the New Millennium, Dr. P.V. Parabrahma Sastry Felicitation Volume, Volume-II, Delhi; Sharada Prakashan; 2004; Pages: 136-146
 19. Salomon, Richard; On the Origin of the Early Indian Scripts; in: Journal of the American Oriental Society, Volume 115 No. 2; 1995; pp. 271-279
 20. Salomon, Richard ; Indian Epigraphy: a guide to the study of inscriptions in Sanskrit, Prakrit, and the other Indo-Aryan languages; Oxford University Press, New York; 1998
 21. Scharfe, Hartmut; A new perspective on Panini; in Indologica Taurenensia, 35, 2009, pp. 1-270
 22. Witzel, Michael; Gandhāra and the formation of the Vedic and Zoroastrian canons; in:The International Symposium:The Book; Éditeur Bibliotheque de Bucarest; Bucarest; 2011; ISSN 2068 – 9756; pp. 490-532
 23. Witzel, Michael; The Development of the Vedic Canon and its Schools: The Social and Political Milieu; in: Inside the Texts, Beyond the Texts. New Approaches to the Study of the Vedas (M. WITZEL, ed.); Harvard Oriental Series, Opera Minora, vol. 2; Cambridge;1997, pp. 257-345