భారతీయ పుస్తక చరిత్ర: 2. రాత పుట్టుక, పరిణామం – భారతీయ లిపులు

భారతీయ సంస్కృతిలో అక్షరం

“అక్షరాణాం అ-కారో ఽస్మి ద్వంద్వః సామాసికస్య చ
అహం ఏవాక్షయః కాలో ధాతాహం విశ్వతో-ముఖః”

— భగవద్గీత, 10.33

“శ్రోత్రోపలబ్ధిర్ బుద్ధినిర్గ్రాహ్యః ప్రయోగేణాభిజ్వలిత ఆకాశదేశః శబ్దః”
— పతంజలి, మహాభాష్యం, నిర్ణయసంగ్రహం 1.87

“లిపిష్వేవాక్షరబుద్ధిర్ అబుద్ధానాం”
— మహాభాష్య ప్రదీప వ్యాఖ్యానాని 1.21


పాశ్చాత్య ప్రపంచంలో రాత పరిణామక్రమం ఐదు దశలుగా జరిగిందని ఇంతకు ముందు వ్యాసంలో చూశాం. చిత్రలిపులతో మొదలయి, పూర్తి స్థాయి ధ్వన్యలిపుల (అక్షరసమామ్నాయం) దిశగా అక్కడ లిపులు, రాత పరిణామం సాగింది. కానీ, భారత ఉపఖండంలో ఇందుకు పూర్తి విరుద్ధంగా, ముందుగా ధ్వనిశాస్త్రం అభివృద్ధి చెందింది. ఇక్కడ అక్షర సమామ్నాయం (అక్షరమాల) పూర్తిగా ధ్వనిరూపకంగా క్రీ,పూ 700 నాటికే ఏర్పడింది. ఆ తరువాతే దానికి లిపితో అనుసంధానం జరిగింది. పాణినికి చాలా పూర్వమే అక్షర సమామ్నాయం ప్రసక్తి వేదాంగాలైన ప్రాతిశాఖ్యలలో కనిపిస్తుంది. ఋగ్వేద ప్రాతిశాఖ్యలోనూ, కృష్ణ యజుర్వేదానికి చెందిన తైత్తిరీయ ప్రాతిశాఖ్య, శుక్ల యజుర్వేదానికి చెందిన వాజసనేయి ప్రాతిశాఖ్యలోనూ భారతీయుల ధ్వనిశాస్త్రానికి పునాదులు ఉన్నాయి. ప్రాచీన భారత సంస్కృతిలో అక్షరం అంటే ధ్వనిరూపకమేగానీ, దృశ్యరూపకం కాదు. అందుకే, నాగేశ భట్టుడు మహాభాష్య ప్రదీప వ్యాఖ్యానాని అన్న గ్రంథంలో “లిపిశ్వేవాక్షరబుద్ధిర్ అబుద్ధానాం” (పామరులు అక్షరం అంటే లిపి అని పొరబాటు పడతారు) అంటాడు. పతంజలి, తన మహాభాష్యంలో, అకాశరూపకమైన శబ్దం (భాషాభివ్యక్తి) పలికేవాడి మాట రూపంలో వ్యక్తీకరించబడి, శ్రోత బుద్ధి చేత గ్రహించబడుతుంది, అని తీర్మానించాడు. పతంజలి, కాత్యాయనులిద్దరూ కూడా అష్టాధ్యాయిలో శివసూత్రాలలో మొదటి సూత్రం అ, ఐ, ఉణ్ అనే శబ్దాలు, ఆ స్వరాల అన్ని రకాల ఉచ్చారణలకీ సాధారణ శబ్దస్వరూపాలే అంటారు (generic phonetic shape). దీనినే పతంజలి, “అవర్ణాకృతిర్ ఉపదిష్టా స్వరమ్ అవర్ణకులం గ్రహీష్యతి, తథేవర్ణాకృతిః తథోవర్ణాకృతిః” (శివసూత్రాలలోని అకారం అకార ఉచ్చారణలన్నిటిని సూత్రీకరించే శబ్ద స్వరూపం, మహాభాష్యం 1:87, నిర్ణయసంగ్రహం) అంటాడు. ఇంతే కాకుండా, ప్రాచీన వైయాకరుణులు, భాష విషయంలో వాడిన ‘ఆకృతి,’ రూపం,’ ‘సరూపం,’ ‘అదర్శనం,’ వంటి పదాలు కూడా ధ్వనిరూపకాలు గానే వాడారు కానీ, దృశ్యరూపకాలుగా కాదు. పాణిని, పతంజలి, కాత్యాయనుడు — వీరంతా కూడా దృశ్యరూపకమైన వర్ణనలతో శబ్దరూపాలని వివరిస్తారు. ఉదాహరణకి, రూపం అంటే శబ్దరూపం, సరూపం అంటే ఒకేరకమైన శబ్దాలు, ఆకృతి అంటే అక్షరం యొక్క శబ్దచిత్రం. పాణిని, వ్యాకరణ వస్తువు లుప్తం అవడాన్ని ‘అదర్శనం’ (deletion) అని వ్యవహరించాడు. ఈ వాడుకలన్నీ శబ్ద-దృశ్యాలే తప్పించి, వీటీకి రాతకి ఎటువంటి సంబంధం లేదు.

ఉతత్వః పశ్యన్ నదదర్శ వాచం ఉతత్వః శృణ్వన్ నశృణేత్యేవామ్ (కొందరు మాటను – వేదవాక్కును – చూచీ చూడరు, కొందరు వినీ వినరు) (10-71-4); అక్షరేణా మిమతేసప్తవాణీ (1-164-24); తతోవా అష్టాక్షరా గాయత్ర్యభవ దేవాదేశక్షరాత్రిష్టుప్ (ఇది ఐతిరేయ బ్రాహ్మణంలో అక్షర ప్రస్తావన.)

ఋగ్వేదంలో ఈ శ్లోకాలని చూపించి, తిరుమల రామచంద్ర తన లిపి-పుట్టుపూర్వోత్తరాలులో, అక్షరమాల ప్రస్తావన వేదకాలం నుంచే కాబట్టి, అప్పటినుండే లిపి ఉందని వాదించారు. అయితే, వేదంలో గానీ, అష్టాధ్యాయిలో గానీ అక్షరం అంటే అది ధ్వనిరూపకమే గానీ లిపిరూపకం కాదు.

వేదాంగాలైన శిక్ష, ఛందస్సు, నిరుక్తము; వ్యాకరణాలలో శిక్ష, ప్రాతిశాఖ్యలు, ప్రత్యేకంగా ధ్వనిశాస్త్రానికి సంబంధించిన ఉపాంగాలు. ఋగ్వేదంలో ప్రాతిశాఖ్య, తైత్తిరీయ ప్రాతిశాఖ్యలోని ముఖ్యమైన భాగాలు పాణినికి ముందునాటివి. పాణినికి వీటి గురించి బాగాతెలుసు. వేదోచ్చారణకి సంబంధించిన సూక్ష్మమైన, ప్రత్యేకమైన సూత్రాలు, విశ్లేషణ వీటిల్లో ఉంటుంది. వేదాలను మౌఖికంగానే కల్పించి, మౌఖిక రూపం లోనే వాటి అస్తిత్వాన్ని ఉంచబట్టి, క్రీ.పూ. 700 నాటికే ధ్వనిశాస్త్రం భారత సంస్కృతిలో అభివృద్ధి చెందింది. శబ్ద స్వరూపాలని అధ్యయనం చెయ్యడానికి అవసరమైన శాస్త్రీయ విశ్లేషణ పరికరాలన్నీ కూడా అప్పటికే ఏర్పడ్డాయి. క్రీ.పూ ఏడవ శతాబ్ది నాటికి వేదభాషకి, వ్యవహారికమైన, సాహిత్యపరమైన సంస్కృతానికి, ఇతర దేశభాషలకి మధ్య ఉచ్చారణలో ఎంతో వైవిధ్యం ఏర్పడింది. అందువల్ల, వేదోచ్చారణలో తప్పులు దొర్లడం, కొన్ని శబ్దాల ఉచ్చారణ పూర్తిగా లుప్తమై పోవడంతో వేదోచ్చారణని ప్రమాణీకరించవలసి వచ్చింది. క్రీ.పూ 100 దరిదాపుల్లో వచ్చిన మహాభాష్యం మొదటి అధ్యాయం లోనే ధ్వనిశాస్త్రాన్ని శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చెయ్యడం, వేదోచ్చారణలో లోపాలు రాకుండా, వేదోచ్చారణ పరిరక్షించడానికే అని చెప్పవచ్చును. సరైన ఉచ్చారణని నేర్పడం కోసం వర్ణం, స్వరం, మాత్ర, బలం, సామం, సంతానం, అని ఆరు రకాలుగా ధ్వనిని అధ్యయనం చేసేవారని తైత్తిరీయోపనిషత్తు ద్వారా మనకి తెలుస్తోంది. స్వరాలు, వ్యంజనాలని వేరుగా గుర్తించడం, వ్యంజనాలని స్పర్శ, అంతస్థాలు, ఊష్మాలని మూడు రకాలుగా వర్గీకరించడం ఆనాటి నుండీ ఉంది.

స్థూలంగా, పాశ్చాత్య ప్రపంచంలో రాత పుట్టుక ఒక మార్గంలో జరిగింది; బొమ్మని, భాషని కలుపుకోవడానికి వారికి ‘అక్షరాలు’ అవసరమయ్యాయి. అందుకే, ఎద్దు బొమ్మ కాలక్రమంలో ఆ పదంలోని మొదటి శబ్దం ‘ఏ’ని సూచిస్తూ, కాలక్రమంలో, ఆ చిత్రమే మార్పులకి లోనవుతూ, అది వస్తు ప్రపంచంతో సంబంధాన్ని పూర్తిగా తెంచుకొని, ఒక ధ్వని-సమూహానికి దృశ్య చిహ్నంగా మారింది. అందుకే, లాటిన్ వర్ణమాలాక్రమం (ఎ, ఎ తరువాత బి, బి తరువాత సి) ధ్వనిశాస్త్ర వర్గీకరణ కాదు. అయితే, వారి చిత్రలిపుల నుంచి పాశ్చాత్య అక్షర సమామ్నాయం ఎలా వచ్చింది అనేదీ ఇప్పటికీ తేలని ప్రశ్న. ఏమయినప్పటీకీ, ఈనాటి పాశ్చాత్య అక్షరమాల ‘పిక్చర్ – ప్రిన్సిపల్స్’ నుండి వచ్చిందని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు.

కాని, భారత సంస్కృతిలో రాత పుట్టుక వేరే విధంగా జరిగింది. ఇక్కడ అక్షర సమామ్నాయం (అక్షరమాల) పూర్తిగా ధ్వనిరూపకంగా ఏర్పడిన తరువాతే దానికి లిపితో అనుసంధానం జరిగింది. ముఖ్యంగా, అజంత రూపాలుగా లిఖితాక్షరాలు రాయడం, దానివల్ల గుణింతాల అవసరం భారతీయ భాషాలిపులకి ప్రత్యేకం. అందుకే, ధ్వన్యాక్షరాలని లిఖితరూపం లోకి తేవడంలో ఇక్కడ కొన్ని ప్రత్యేక సమస్యలు వచ్చాయి. అయితే, ఈ రెంటి సంస్కృతులలో రాత పరిణామంలో వచ్చిన ఈ తేడాలని సమగ్రంగా అర్థం చేసుకోకపోవడం వల్ల, రాత చరిత్ర అధ్యయనంలో ఎన్నో అనవసరమైన వివాదాలు తలెత్తున్నాయి. రాత చరిత్రని మిగిలిన ఎన్నో చారిత్రక అంశాలతో కలిపివేసి చూస్తున్నాం. ఉదాహరణకి, సింధు నాగరికతకి, ఆర్య-ద్రవిడ సిద్ధాంతాలకి మధ్య సంబంధాలు; వైదిక సంస్కృతి ఎప్పుడు వచ్చింది; ఉత్తరాది-దక్షిణాది భాషలు, సంస్కృతుల మధ్య తేడాలు; ఇవన్నీ కూడా భారత సంస్కృతిలో రాత చరిత్రని అధ్యయనం చెయ్యడంలో భాగమైపోయాయి. కానీ, ఈ వ్యాసంలో ప్రతిపాదిస్తున్నట్టుగా భారత సంస్కృతిలో మౌఖికమైన, పూర్తిగా శబ్ధపరమైన అక్షర సమామ్నాయం అభివృద్ధి చెందాకే దానికి లిపితో సంపర్కం జరిగిందనే అవగాహనతో ఇక్కడి రాత చరిత్రని పరిశీలిస్తే చాలా ప్రశ్నలకి సమాధానాలు కొత్తగా వెతకవచ్చు. అంతే కాకుండా, ఈ రకంగా చూస్తే సింధు నాగరికతలో దొరికిన లిఖిత సంజ్ఞలు అక్షర లిపులా, కాదా అనే వివాదం ఒకరకంగా పూర్తిగా అనవసరం. నిజానికి, విట్జెల్ (Michael Witzel), ఫార్మర్ (Steven Farmer) ప్రతిపాదించినట్టుగా ఆ సంజ్ఞలు భాషని రాయడానికి ఉపయోగించిన లిపి వ్యవస్థ కాదనుకున్నా, భారత సంస్కృతిలో రాత చరిత్రకి వచ్చిన నష్టం ఏమీ ఉండదు. పైగా, మన లిపులలో సంయుక్తాక్షరాలు, గుణింతాలు మొదలైన వాటి పుట్టుకని సులువుగా తార్కికంగా అర్థం చేసుకోవచ్చు.

ప్రాచీన భారత సంస్కృతి ప్రధానంగా మౌఖిక సంప్రదాయం అనేది నిర్వివాదాంశం. ఋగ్వేదం నుండి ఉపనిషత్తులు, సూత్రాల కాలం వరకు (~ క్రీ.పూ. 1200-500) పాణిని వ్యాకరణంతో సహా, అన్నీ మౌఖిక పుస్తకాలే (oral texts). అశోకుని కాలానికి ముందు రాత గురించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం మనకు కనబడుతున్న దాఖలాలతో క్రీ.పూ. మూడవ శతాబ్దంలో అశోకుని శాసనాలతోనే రాత ప్రారంభమయ్యింది. భారత ఉపఖండంలో శబ్దోచ్చారణకున్న ప్రాధాన్యత, ఉచ్చారణ ఆశువుగా నేర్చుకోవడానికి ఏర్పరచిన కఠినమయిన నియమాలు, మరింక ఏ ప్రాంతం లోను కనపడవు. ఈ పరిస్థితి భారత ఉపఖండానికి ప్రత్యేకం. ఈ నేపథ్యం లోంచే బలమైన ధ్వనిశాస్త్రం అభివృద్ధి చెందింది. అయితే, వేద వాఙ్మయం ఒక్క అక్షరం కూడా పొల్లు పోకుండా దాని ఉచ్చారణని యథాతథంగా ఈనాటికీ పరిరక్షించుకుందనే నమ్మకం పూర్తిగా నిజం కాదు.

క్రీ.పూ 700 నాటికి, ప్రాచుర్యంలో ఉన్న సంస్కృతానికి, వేద సంస్కృతానికి మధ్య ఎంతో తేడా వచ్చింది. అప్పటికే వేదోచ్చారణలో ఎన్నో మార్పులు వచ్చాయి. వేదోచ్చారణని పరిరక్షించడానికి, అది నష్టపోకుండా భద్రపరచడానికి అప్పటినుండీ ఎన్నో రకాల ప్రయత్నాలు జరిగాయి. ఇటువంటి ప్రయత్నమే పాణిని అష్టాధ్యాయి విషయం లోనూ జరిగింది. అష్టాధ్యాయి కూడా మౌఖిక రచనే. అది మౌఖికం గానే ఎన్నో శతాబ్దాల పాటు ప్రాచుర్యంలో ఉంది. ఆ ప్రక్రియలో, అష్టాధ్యాయిని అర్థం చేసుకోవడం లోనూ, వ్యాఖ్యానించడం లోనూ ఎన్నో వైవిధ్యాలు, వైరుధ్యాలు వచ్చాయి. అష్టాధ్యాయికున్న వ్యాఖ్యానాలు, వార్త్తికలని చారిత్రకంగా పరిశీలిస్తే మౌఖిక పుస్తకాల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. రాత ప్రాచుర్యం లోకి వచ్చాక కూడా, అది — మౌఖిక సంప్రదాయమే ప్రబలంగా ఉండి — అప్రధానమైన పాత్రనే పోషించింది. ఇదే సమయంలో బౌద్ధం ప్రాబల్యం లోకి రావడంతో హిందూ/వైదిక సంప్రదాయానికి, బౌద్ధానికి మధ్య ఘర్షణ మొదలైంది. ఈ సంఘర్షణలో మౌఖిక, లిఖిత సంప్రదాయాలు కూడా తమ వంతు పాత్రని పోషించాయి. బౌద్ధ సంప్రదాయం రాయడానికి ప్రాధాన్యత నిచ్చింది. హిందూ/వైదిక సంప్రదాయం మౌఖిక పద్ధతులనే బలంగా నమ్ముకుని, రాత పట్ల విముఖతని ప్రదర్శించింది. వేదాన్ని రాసినవాడు నరకానికి పోతాడనే నమ్మకం ప్రచారం లోకి వచ్చింది. పతంజలి, కాత్యాయనుడు మొదలైన పండితులు కూడా వైదిక సంప్రదాయానికి కొమ్ము కాసి, భాషలో ధ్వనిశాస్త్రానికే ప్రాధాన్యం ఇచ్చారు. మాధవ్ దేశ్‌పాండే మాటల్లో చెప్పాలంటే:

“The fact of writing known to us from other sources, is in the deep background, unacknowledged and perhaps unappreciated while orality is in the foreground of this educational setup”.

వాయువ్య ప్రాంతాలకీ ఉత్తర/తూర్పు ప్రాంతాలకి మధ్య రాత మూలంగా వచ్చిన ఒత్తిడి


ప్రాచీన భారతావని

వాయువ్య ప్రాంతాలైన గాంధార, పంజాబు, సింధు ప్రాంతాలలో పశ్చిమానికి చెందిన గ్రీకుల, పర్షియన్ సంస్కృతుల ప్రభావం ఎక్కువగా ఉండేది. కోసల, మగధ ప్రాంతాలలో బౌద్ధుల, హిందూ/వైదిక సంస్కృతుల ప్రభావం ఉండేది. భారతీయ సంస్కృతి రాత పరిణామంలో ఇదొక ముఖ్యమైన చారిత్రక అంశం. వాయువ్య ప్రాంతాలలో పర్షియన్ల సంపర్కంతో అభివృద్ధి చెందిన ఖరోష్టి లిపి, గ్రీకుల ద్వారా వచ్చిన అరమయాక్ లిపి, మౌర్యుల కాలంలో మగధ, కోసల ప్రాంతాలలో అభివృద్ధి చెందిన బ్రాహ్మీ లిపి — అతి ముఖ్యమైన లిపులు. బ్రాహ్మీ లిపి నుంచే ఈనాటి భారతీయ భాషల లిపులన్నీ వచ్చాయి. ఖరోష్టి, అరమయాక్ లిపులు లిపి వాయువ్య ప్రాంతానికి మాత్రం పరిమితమై కాలక్రమంలో మరుగున పడిపోయాయి.

అలెక్జాండర్ దండయాత్ర (~ క్రీ.పూ 326) తరువాత (క్రీ.పూ. 305) మౌర్యులు గాంధార (ఆఫ్ఘనిస్తాన్) ప్రాంతాన్ని తమ ఆధీనం లోకి తెచ్చుకున్నారు. ఆ తరువాత (~ క్రీ.పూ. 150) ఈ ప్రాంతాన్ని మౌర్యుల నుండి బాహ్లిక (బాక్ట్రియా) పాలకులైన గ్రీకులు ఆక్రమించుకున్నారు. దాంతో గాంధార, పంజాబు, సింధు, ముఖ్యంగా బాహ్లిక (బాక్ట్రియా) ప్రాంతాల్లో సాంస్కృతికంగా కూడా గ్రీకుల ప్రభావం పెరిగింది. మిలిటరీ పదాలైన, ఖలీన (గుర్రపు కళ్ళెము, గ్రీకు: khalinos), కేణిక (గుడారము, skẽnḗ), పరిస్తోమ (ఏనుగు మీద పరిచే ఎర్ర కంబళి, perístrōma), సురుంగ (సొరంగము, Surinx); అలాగే రాతకు సంబంధించిన మేల (సిరా), కలమ (కలము, గ్రీకు kalamos నుండి, రెల్లు కాడల నుండి చేసినది) పదాలు వచ్చాయి. గ్రీకులు కొందరు బౌద్ధ మతాన్ని — మౌర్యులపై దండయాత్రల్లో ముఖ్యుడైన మెనాండ్రోస్ (Menandros) తరువాత మిళిందుడయ్యాడు — కొందరు వైష్ణవ మతాన్ని (ఉదా: గ్రీకు రాయబారి హీలియోడరస్, Heliodoros) అవలంబించారు.