గద్యములో పద్యములు

పరిచయము

ఇటీవల భారతదేశానికి వెళ్లినప్పుడు అందరి ఇళ్లల్లో విధిగా పెట్టిన తిరుమల తిరుపతి దేవస్థానమువారి భక్తి చానల్ కార్యక్రమాలను చూడడము జరిగినది. అప్పుడు రెండు మూడు మారులు శ్రీనివాస గద్యమును నేను విన్నాను. ఎన్నోమారులు ఆ స్తోత్రమును వినియున్నను, ఈ మారు అందులో వినబడిన కొన్ని లయాన్విత వాక్యములు నన్ను ఆకర్షించినాయి. అవి పద్యములు కాకున్నా, అందులో పద్యాల నిర్మాణసూత్రాలు దాగి ఉన్నట్లు నాకు తోచినది. తరువాత ఆ గద్యమును నిశితముగా పరిశీలించిన పిదప అందులో కొన్ని తాళవృత్తములకు సరిపోయే అమరికలను కనుగొన్నాను. వాటితో నిర్మించిన కొన్ని వృత్తములను మీకు ఈ వ్యాసములో పరిచయము చేయబోతున్నాను.

గద్యము, వచనము

కావ్యములలో మనము చదివే భాగములను రెండు విధములుగా విభజించవచ్చును: గద్యము లేక వచనము, పద్యము. తెలుగులో పూర్తిగా పద్య కావ్యములు అరుదు. అలా వ్రాసినప్పుడు అందులో వచనము లేదని కవులు గర్వముగా చెప్పుకొన్నారు, ఉదా: తిక్కన వ్రాసిన నిర్వచనోత్తర రామాయణము. వచనములు, పద్యములు రెండు ఉండే కావ్యములను చంపూకావ్యములు అంటారు. ఆశ్వాసాంతములో వచ్చే వచనములను గద్యములని, మిగిలిన వాటిని వచనములని పిలుచుట వాడుక. ఇట్టి కావ్యములలో మనము చదివే వచనములు ప్రాసానుప్రాసలతో, అలంకారాలతో ఒక లయతో, ఒక తూగుతో ఉంటాయి.

యాదృచ్ఛికముగా భాగవతమునుండి ఒక వచనమును గ్రహించినాను. అది బలరాముని తీర్థయాత్రలను గుఱించి వ్రాసేటప్పుడు పోతన తన భాగవతములో ఒక వచనములో (దశమస్కంధము, ఉత్తరభాగము – 953) ఇలా వర్ణించినాడు:

అచ్చోటు వాసి వృషభాద్రినెక్కి, హరిక్షేత్రంబు ద్రొక్కి, మధురాపురంబున కరిగి, సేతుబంధనంబు మెట్టి, యచటం బదివేల పాఁడి మొదవుల భూసురుల కిచ్చి, రామేశ్వరుం దర్శించి, తామ్రపర్ణికిం జని, మలయాచలం బెక్కి, యగస్త్యునింగని నమస్కరించి, దక్షిణ సముద్రంబు దర్శించి, కన్యాఖ్య దుర్గాదేవి నుపాసించి, పంచాప్పరంబను తీర్థంబున నాప్లవనం బాచరించి, గోకర్ణంబున నిందుమౌళిని దర్శించి, ద్వీపవతియైన కామదేవిని వీక్షించి, తాపిం బయోష్ణిని దర్శించి, నిర్వింధ్యంబు గడచి, దండకావనంబున కరిగి, మాహిష్మతీపురంబున వసియించి, మనుతీర్థం బాడి, క్రమ్మఱం ప్రభాతీర్థంబునకు వచ్చి యచ్చటి బ్రాహ్మణజనంబులవలన బాండవధార్తరాష్ట్రుల భండనంబునందు సకలరాజలోకంబు పరలోకగతులగుటయు, వాయునందనసుయోధనులు గదాయుద్ధసన్నద్ధులై యుండుటయు నెఱింగి వారల వారించు తలంపున నచటికిం జని –

ఈ వచనము, ‘నేను అంగడికి వెళ్లి పుస్తకము కొన్నాను’ లాటి వచనము కాదు. ఇట్టి వచనములను చదువుతుంటే మనము ఒక పారవశ్యమునకు లోనవుతాము. సంస్కృతములో కూడ ఏవో కాదంబరి వంటి పుస్తకములు తప్ప పూర్తిగా వచన కావ్యములు ఎక్కువగా లేవు. భగవంతుని ధ్యానించు స్తోత్రములను గద్యములుగా శ్రీరామానుజాచార్యులు వ్రాసినారు; శ్రీరంగనాథ గద్యము, శ్రీశరణాగతి గద్యము, శ్రీవైకుంఠ గద్యము. శ్రీశైల శ్రీరంగాచార్యులు పందొమ్మిదవ శతాబ్దములో శ్రీనివాసగద్యమనే ఒక స్తోత్రమును తిరుమలాధీశుడైన శ్రీవేంకటేశ్వరస్వామి పైన వ్రాసినారు. ఆ గద్యమునే నేడు కూడ స్వామివారి ఆలయమునందు తిరుప్పావడసేవ సమయములో రాగయుక్తముగా పాడుతారు.

గద్యవచనములలోని తెఱగులు

లాక్షణికుడైన వామనుడు గద్యమును మూడు విధములుగా విభజించాడు – అవి వృత్తగంధి, చూర్ణము, ఉత్కళిక. పేరుకు తగ్గట్లు వృత్తగంధి అంటే పద్యముల నడకను కలిగి వ్రాయబడినది. అదే విధముగా పొడి పొడి మాటలతో వ్రాయబడినది చూర్ణము. పెద్ద పెద్ద సమాసాలతో ఆడంబరమైన పదాలతో వ్రాయబడినది ఉత్కళిక. వీటికి తోడుగా సమాసరహితముగా ఉండే వచనమును ముక్తకము అని విశ్వనాథకవి పేర్కొన్నాడు. పైన ఉదహరించిన పోతనకవి వచనము చూర్ణము అని చెప్పవచ్చును. చూర్ణికలలో ప్రసిద్ధమైనది యొకటి మొల్లరామాయణములో వంది చేసిన రావణస్తుతి (యుద్ధకాండ, 3.29) ‘జయజయ కైకసీగర్భసముద్ర సంపూర్ణసుధాకరా’ అనే పదములతో ఆరంభమై ‘జయీభవ దిగ్విజయీభవ’తో ముగుస్తుంది.

వృత్తగంధి వచనములను గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసములో చదువ వీలగును. అందులోని వచనములో ఒక భాగము –

కొంత తడవుండి యంతట

కం.  కలరవశుకీ శిఖాశ్వళ
      కలహంసరథాంగ భృంగ – కహ్వ బలాకా
      కలకంఠి శారికాముఖ
      కలకల కలరవ నితాంత – కమనీయంబై

వి.   మధూకమాలూర మహీరణాసహా
      మండూకపర్ణి మధుశిగ్రు మాలతీ
      మధూళికా మన్మథ మాతులుంగ
      మాకంద సమ్మార్జున మాధవీలతా

తే.   కీరసహకార సహకార – నారికేళ
      పూగ ఘనసార ఘనసార – భూజమధ్య
      కుముదవనజాత వనజాత – కుందబృంద
      గళిత సుమధూళి సుమధూళి – కలితమైన … (512)

ఇందులో మొదటిది కందము, రెండవది వంశస్థ, లలిత, ఉపేంద్రవజ్ర, ఇందువంశ పాదాలతో నొక విషమవృత్తము, మూడవది తేటగీతి.

అనంతుని ఛందములో ఛందఃప్రస్తావన చేయుటకు ముందే వచనములను గుఱించిన పద్యము (ఛందోదర్పణము, 2.2) ఇలాగున్నది –

కం.  కనుగొన పాదరహితమై
      పనుపడి హరిగద్దెవోలె – బహుముఖరచనం-
      బున మెఱయు గద్య మది దాఁ
      దెనుఁగు కృతుల వచనమనఁగ – దీపించుఁ గడున్

అట్టి వచనమునకు ఒక ఉదాహరణమును కూడ తఱువాత యిచ్చాడు.

అప్పకవి గద్యపద్యములను ఇలా వివరించాడు (అప్పకవీయము, 4.23) –

మ.  ధర సాహిత్యము గద్యపద్యములనం – దా రెండు భేదంబులై
      పరఁగున్ గద్యమునందుఁ బాదనియతుల్ – భావింపఁగా లేవు వా-
      క్స్ఫురణంబై విలసిల్లఁగా నుడువ నొ-ప్పున్ గావ్య మెంతేనియున్
      మరుతండ్రీ మఱి దీనికే వచననా-మంబయ్యె నాంధ్రంబునన్

తఱువాత ఒక ఉదాహరణమును కూడ ఇచ్చాడు.

పొత్తపి వేంకటరమణకవి లక్షణశిరోమణిలో గద్యలక్షణములను వివరించిన విధము –

మఱియు నందు గద్యయు నైదు భేదమ్ముల విహరించునవి యెయ్యని యంటేని – గద్యయు, బిరుదగద్యయు, చూర్ణికయు, వచనంబును, విన్నపంబు నన గద్యభేదమ్ము లైదును ప్రమోదమ్మున వివిధ విధమ్ముల నొందించునందు గద్యక్రమం బెటువలెగద్యయు నంటేని – కరణశబ్దయుక్తంబై యొప్పు, నందు బిరుదగద్య సంబోధనాంత పదబంధురంబై వర్తిల్లు, నందు చూర్ణిక లేకవచన ద్వివచన బహువచన సందర్భంబులుగ విభక్త్యానుశాసనిక సమాసాదిత కల్పనానల్పజల్పితంబై వెలయు, నందు వచనంబులు బహుప్రకార రచనానిచయ ప్రాచుర్యమ్ములై సంచరించు, నందు విన్నపంబులెన్నఁ దిన్ననై ఋజుమార్గంబుల ననుగమించు, నీ పంచవిధమ్ములు మితరహితమ్ములై స్వేచ్ఛాకల్పనా గౌరవమ్ముల కొలందుల విలసిల్లు. (3.421)

ప్రసిద్ధి కెక్కిన తెలుగు వచనములు సింహగిరి వచనములు, తాళ్లపాక పెదతిరుమలాచార్యుల వేంకటేశ్వర వచనములు, సభాపతి వచనములు, శఠగోపయతి విన్నపములు.