ద్వితీయ కళత్రం

సింహాద్రి ఎక్స్‌ప్రెస్ తునిలో ఆగింది, యధాప్రకారం లేటుగా వచ్చి. ఏ కలకత్తా అంత దూరం నుంచి వచ్చే బండి లేటంటే ఏదో అర్ధం చేసుకొవచ్చు కానీ విశాఖపట్నం నుండి వచ్చేదీ లేటే? ఏవిటో ఈ ఇండియన్ రైల్వేస్ అంతా అయోమయం. డి.వి. లూ ఉరఫ్ దామెర్ల వెంకటేశ్వర్లు ప్లాట్‌ఫామ్ మీదకి దిగేడు. రూల్ ప్రకారం పది నిముషాలు హాల్టు కానీ ఈ బండి కదిలేసరికి ఒక మహాయుగం గడుస్తుంది ఒక్కే స్టేషన్ లోనూ. లేట్ ఎందుకవ్వదూ?

అలా గాలి పీల్చి, ఓ టీ తాగి బండి కదిలే లోపు వెనక్కొచ్చేడు డి.వి. లూ. వచ్చేసరికి తన సీట్లో ఓ పదీ పన్నెండేళ్ళ పిల్ల, ఆ పాప నాన్న కాబోలు కూర్చునున్నారు. లూని చూసి ఒక మొహమాటం నవ్వు నవ్వి – “ఇదిగో ఇక్కడకే. కొవ్వూరు రాగానే దిగిపోతాం,” అని సంజాయిషీ ఇచ్చేడు పెద్దాయన.

“ఫర్లేదు కూర్చోండి. మనం అందరం సర్దుకోవచ్చు,” అని ఓ మూలకి ఒదిగి కూర్చున్నాడు తను చదివే ఇంజినీరింగ్ కాలేజీలో ఫ్రెండ్స్ అందరూ అలా ముద్దుగా పిల్చుకునే మిస్టర్ లూ.

“ఎక్కడిదాకా బాబూ?” బండి కదిలేక పెద్దాయన మొదలెట్టేడు.

“రాజమండ్రీ,” చెప్పేడు లూ.

“చూడబోతే వైజాగ్ నుంచి వస్తున్నట్టున్నావు, ఏం చేస్తూ ఉంటావ్?” ఈయనకివన్నీ ఎందుకో?

“చదూకుంటున్నానండి,”

“కెమికల్ ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం.” మళ్ళీ ఏమిటి ఎక్కడ అని ఎలాగా అడుగుతాడు కనక ముందే చెప్పేశాడు. విన్నాడో లేదో గానీ, “ఈ బండి పిఠాపురంలో ఎంతసేపు ఆగుతుందో?” అన్నాడు పక్కనున్న పాపతో.

“ఫర్లేదు నాన్నా. ఐదూ పది నిముషాలు ఆగినా ఆయన వచ్చేస్తారు.” పాప అనడం విన్నాడు లూ.

పిఠాపురంలో బండి ఆగ్గానే పెద్దాయన పరిగెట్టుకుంటూ గుమ్మం దగ్గిరకెళ్ళేడు ఎవర్నో రిసీవ్ చేసుకోవాలేమో. రెండు నిముషాల్లో ఇంకో పెద్దాయన్ని వెంటబెట్టుకొచ్చేడు.

“కూర్చోండి, ఈ కుర్రాడు రాజమండ్రీ దాకానే, మనం మనం సర్దుకోవచ్చు,” అని ఆయనకి చోటు చూపించేడు.

వచ్చినాయన మొహమ్మీద విభూది రేఖలూ చేతిలో పంచాంగం, సరంజామా అది తెచ్చాడు. ఎవరో సిద్ధాంతి కాబోలు. బండి కదుల్తూనే ఇద్దరూ కబుర్లలో పడ్డారు. లూ కిటికీలోంచి చూస్తూ ఓ చెవి ఇటు పారేసి వింటున్నాడు. సిద్ధాంతి వచ్చేక సీట్ల మార్పిడీ, సర్దుబాట్లలో ఇప్పుడు లూ కి ఎదురుగా కూర్చున్న పాప వచ్చే పోయే వాళ్ళకేసి చూస్తోంది; అప్పుడప్పుడూ కిటికీ లోంచీను.

“ఇప్పుడు పాపకి పన్నిండేళ్ళా?” సిద్దాంతిగారు అడుగుతున్నాడు.

“అవును. ఇదిగో జాతక చక్రం తెచ్చాను. కొవ్వూర్లో దిగేలోపల చూసెయ్యగలరా? నేను ఎప్పుడో చూశాననుకోండి, మీరు చూడ్డం వేరూ, తండ్రిగా నేను చూడ్డం వేరూ” తండ్రి అడుగుతున్నాడు. ఈయనా సిద్ధాంతే కాబోలు.

“ఈ బండి ఎలాగా లేట్ అవుతుంది; దీన్ని సామర్లకోటలో తొక్కేసి ఏ కోణార్క, ఈస్టుకోస్టు లాంటి పెద్ద బండినో పంపించారనుకోండి, మనకే మంచిది.” జాతకం అందుకుంటూ చెప్పేరు సిద్ధాంతి.

లూకి అప్పటికే బోరు కొట్టడం మొదలైంది ఈ జాతకాలతో. ఇరవై నిముషాలు గడిచేక సిద్ధాంతి గారు నోరు విప్పేడు.

“ఇప్పుడు ఏలినాటి శని నాలుగో సంవత్సరం జరుగుతోంది. ఈ పాటికి పాపకి ఏదో ఏక్సిడెంట్ అయ్యుండాలే?” సిద్ధాంతి అన్నాడు. లూ పాప కేసి చురుగ్గా చూశాడు ఏదైనా కాలో చెయ్యో విరిగిందేమో అని. అటువంటిదేమీ కనబళ్ళేదు.

“లేదే? ఏలినాటి శని నిజమే గానీ పాపది తులా లగ్నం కదా?” సాలోచనగా అన్నాడు తండ్రి.

ఏదో అనబోయి మళ్ళీ జాతకం చూడ్డం మొదలుపెట్టాడు సిద్ధాంతి గారు. సామర్లకోట వచ్చింది. పెద్దాయన కాఫీ ఇప్పించేడు సిద్ధాంతి గారికి. ఎక్కే దిగే జనాల్ని పట్టించుకోకుండా వీళ్ళిద్దరూ పాప జాతకంలో లీనమై ఉన్నారు. పాప కొంచెం చిరాకుగా ఉన్నట్టు గమనించేడు లూ. బండి కదిలి అనపర్తి వచ్చేసరికి సిద్ధాంతి గారు కాయితాలు మూసేసి చెప్పడం మొదలు పెట్టేరు.

“నేను చూడ్డం అయిపోయింది. మీ పాపకి పంథొమ్మిదో ఏట పెళ్ళౌతుంది. కానీ ద్వితీయ కళత్రం గేరంటీ.”

ఒక్కసారి పక్కలో బాంబు పడ్డట్టూ అదిరిపడ్డాడు తండ్రి. పాపకి అర్ధం అయిందో లేదో కానీ లూ వీళ్లకేసి చూసేడు. ఆ చూపులకి ఏదైనా మహాత్యం ఉంటే సిద్ధాంతి భస్మం అయిపోయి ఉండేవాడు.

“నేను చూశానండీ, ఎక్కడా నాకు అలా అనిపించలేదే?” తండ్రి అడుగుతున్నాడు ఏదో పెద్ద ఆపద ఆల్రెడీ పాప మీద పడిపోయినట్టూ. గొంతుకలో మునుపున్న జీవం ఇప్పుడు లేదు.

“మీరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటులో పనిచేస్తూ కాలక్షేపానికి చూస్తారు జాతకాలు. నేనైతే పొద్దున్నించి సాయంకాలం దాకా ఇదే పని. ఇరవయ్యో ఏట మీ పాపకి ఈ మహాదశ ప్రారంభం అవుతోంది. ఇది మొదలయ్యే లోపుల పెళ్ళి జరిగి తీరుతుంది. కానీ ఆ మహాదశ మొదలౌగానే రెండేళ్ళలో ద్వితీయ కళత్రం స్పష్టంగా కనిపిస్తూంటే!”

తండ్రి కాస్త ముందుకు జరిగి సిద్దాంతిగారు చూపించిన జాతకంలో మహాదశా అదీ చూస్తున్నాడు. మళ్ళీ ఇద్దరూ ఈ మహాదశలో ఏం జరుగుతుందీ, ఎలా, ఎక్కడ జరుగుతుందీ, అలా ఇంతకు ముందు ఎవరికైనా జరిగిందా అనేవి వాదించుకుంటూన్నారు.

బండి అనపర్తి వదిలి మెల్లిగా కదల్డం ప్రారంభించింది. లూ పాపకేసి చూసేడు. ముడుచుకుపోయి ఏమి మాట్లాడాలో మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలీనట్టు వాడిపోయి ఉంది. జాలి వేసింది లూకి.