పలుకుబడి: ఋతువులు, కాలాలు

చిన్నప్పుడు మనమంతా ఋతువులు ఆరు అని మన పాఠ్యపుస్తకాలలో చదువుకున్నాం. రెండేసి నెలల చొప్పున వసంతం, గ్రీష్మం, వర్షం, శరత్తు, హేమంతం, శిశిరం అని సంవత్సరకాలాన్ని ఆరు ఋతువులుగా విభజించవచ్చని మనమంతా కంఠతా పట్టేశాం. అలంకారశాస్త్రం నిర్దేశించిన అష్టాదశ వర్ణనల్లో ఋతువర్ణన ప్రథానమైనది కాబట్టి మన తెలుగు కావ్యాలలో కూడా సాంప్రదాయికంగా ఈ ఆరు ఋతువుల వర్ణనే కనిపిస్తుంది. అయితే, భారతీయ దేశంలో — ముఖ్యంగా దక్షిణ భారతంలో — ప్రధానంగా మనకు అనుభవమయ్యేవి ఎండకాలం, వానకాలం, చలికాలం అన్న మూడు కాలాలు మాత్రమే.

నిజానికి వేదవాఙ్మయంలో ప్రాచీనమైన ఋగ్వేదంలో ఆరు ఋతువుల ప్రస్తావన లేదు. ఋగ్వేదంలోని పదవ మండలంలోని పురుషసూక్తంలో ఋతువులపేర్లు కనిపించే ఈ శ్లోకం చూడండి:

యత్ పురుషేణ హవిషా, దేవా యజ్ఞమతన్వత ।
వసంతో అస్యాసీద్ ఆజ్యం గ్రీష్మ ఇధ్మః శరద్ హవిః ॥ (ఋగ్వేదం 10.90.6)

పురుషుడే హవిస్సుగా దేవతలు చేసే సమస్త సృష్టి అనే యజ్ఞంలో వసంతం ఆజ్యం అయితే, గ్రీష్మం ఇంధనం, శరత్తు హవి.

వసంతం, గ్రీష్మం, శరత్తు ఈ మూడు ఋతువుల పేర్లు తప్ప ఋగ్వేదంలో ఇతర ఋతువుల ప్రస్తావన కనిపించదు. భారతదేశానికి అతిముఖ్యమైన వర్షఋతువును ప్రత్యేకంగా పేర్కొనకపోవడం ఆశ్చర్యకరమైన విషయమే. ఇతర ఇండో-యూరోపియన్ భాషలలో, సమాజాలలో Spring, Summer, Autumn/Winter మాత్రమే ప్రధానమైన ఋతువులు. భారతీయ సమాజంలా వారికి వర్ష ఋతువు ప్రత్యేక ఋతువు కాదు. యూరేసియాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు సంవత్సరం పొడుగునా దాదాపు సమానంగా కురిస్తే, మరికొన్ని ప్రాంతాల్లో వసంతంలోనే మెండుగా వర్షాలు కురుస్తాయి. అమెరికాలోని మా అట్లాంటా నగరంలో కూడా సంవత్సరం పొడుగునా వర్షాలు కురిసినా, అత్యధిక వర్షపాతం మాత్రం వసంతమాసంగా పరిగణించే ఎప్రిల్ నెలలోనే నమోదవుతుంది.

ఉష్ణ మండల ప్రాంతానికి చెందిన భారతదేశానికి మూడువైపులా సముద్రము, ఒకవైపు హిమాలయాలు ఉండే ప్రత్యేక నైసర్గిక స్వరూపం వల్ల భారతదేశంలో వర్షాలు పూర్తిగా ఋతుపవనాల మీదే ఆధారపడి ఉంటాయి. అందుకే సంవత్సరంలో ఋతుపవనాల ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయి కాబట్టి అది ఒక ప్రత్యేక ఋతువుగా/కాలంగా గుర్తిస్తాము.


భారతదేశ ఋతుపవనాలు

ఈ మధ్య ఒక తెలుగు రచయిత ఋతుపవన కాలం, వర్షఋతు కాలం విభిన్నమైనవనీ, ఋతుపవన మేఘానికి, వర్షఋతు మేఘానికి తేడా ఉంటుందని వివరించడానికి ప్రయత్నించాడు. కానీ, భారతదేశంలో ఋతుపవన కాలం, వర్షకాలం అంటూ వేర్వేరు కాలాలు ఉన్నాయని చెప్పడానికి శాస్త్రం ఒప్పుకోదు. అయితే, మనదేశంలో రెండు వేర్వేరుకాలాల్లో, రెండు వేర్వేరు దిశలనుండి వీచే ఋతుపవనాలు ఉన్నాయి. ఎండకాలంలో దక్షిణ పీఠభూమి వేడెక్కినప్పుడు, సముద్రం చల్లగా ఉండడం మూలాన నైరుతి దిశనుండి ఉత్తర దిశగా వీచే గాలులు వర్షాన్ని మోసుకొస్తాయి. అలాగే, చలికాలంలో భూమి చల్లబడి, సముద్రం వేడిగా ఉండడం వల్ల పీడన వ్యత్యాసం ఏర్పడి ఈశాన్య దిశనుండి దక్షిణ దిశగా ఋతుపవనాలు డిసెంబర్, జనవరి మాసాల్లో వీస్తాయి. ఈ ఈశాన్య ఋతుపవనాలు భారతదేశంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో భూమి మీదుగానే పయనిస్తాయి కాబట్టి వీటివల్ల ఆ ప్రాంతాల్లో వర్షం సంభవించదు. అయితే, బంగాళాఖాతం మీదుగా వీచే ఈశాన్య ఋతుపవనాలు మాత్రం కోస్తా జిల్లాల్లోనూ, తమిళనాడులోనూ కొంత వర్షాన్ని కురిపిస్తాయి.

ఋగ్వేదంలో వర్ష ఋతువును ప్రతేక ఋతువుగా పేర్కొనక పోయినా, ఏడవ మండలంలోని మండూక సూక్తంలో వర్షాలు కురిసే కాలాన్ని ఒక ప్రత్యేక కాలవిభాగంగా పరిగణిస్తున్నట్టు అనిపిస్తుంది.

సంవత్సరం శశయానా బ్రాహ్మణా వ్రతచారిణః ।
వాచం పర్జన్యజిన్వితాం ప్ర మండూకా అవాదిషుః ॥ 7-103-1

వ్రతచారులగు బ్రాహ్మణ వర్గము సంవత్సరం కాలం పిదప మౌనాన్ని వీడినట్టు పర్జన్యుని గర్జన స్ఫూర్తితో మండూక గణం తమ గళాలను విప్పుతున్నాయి.

బ్రాహ్మణాసో అతిరాత్రే న సోమే సరో న పూర్ణమ్ అభితో వదన్తః ।
సంవత్సరస్య తద్ అహః పరి ష్ఠ యన్ మణ్డూకాః ప్రావృషీణమ్ బభూవ ॥ 7-103-07

సంవత్సర కాలం అతిరాత్ర యజ్ఞము పూర్తిచేసి సోమరస భాండము చుట్టూ చేరే బ్రాహ్మణులవలే, వర్షం రాకతో పూర్ణ సరోవరమునకు నాలుగు వైపులా చేరి మండూకములు శబ్దములను చేస్తూ చెలరేగుతున్నవి.

ఈ మండూక సూక్తము, ఏడవమండలంలోని చిట్టచివరి రెండు సూక్తాలలో ఒకటి. ఋగ్వేదపు చివరి దశలలో దీనిని ఈ వేదసంహితానికి జతచేసి ఉంటారని కొంతమంది పందితుల ఊహ. ఋగ్వేద ఆర్యులు ఋతుపవనాల ఆధారంగా బ్రతికే భారతీయ సమాజానికి అనుకూలంగా తమ జీవిత విధానాన్ని మార్చుకున్నట్టుగా ఈ మండూక సూక్తం మనకు తెలియజేస్తుందని గౌతమ వజ్రాచార్య ఒక పరిశోధన పత్రంలో వాదించారు. (Gautama V. Vajracharya The Adaptation of Monsoonal Culture by Rgvedic Aryans: A Further Study of the Frog Hymn.).

కృష్ణ యజుర్వేదంలో కనిపించే ఈ కింది శ్లోకంలో పంచభూతాలవలే సంవత్సరంలో ఋతువులు కూడా అయిదు అన్న వివరణ కనిపిస్తుంది.

పంచ వా ఋతవః సంవత్సరస్
ఋతుష్వేవ సంవత్సరే ప్రతితిష్ఠంతి । (యజుర్వేద 7.3.8)

కృష్ణ యజుర్వేదానికే సంబంధించిన తైత్తిరీయ బ్రాహ్మణంలో అయిదు ఋతువుల వివరాలతో సంవత్సరాన్ని పక్షితో పోల్చుతూ చేసిన ఈ అందమైన వర్ణన చూడండి:

తస్య తే వసంతః శిరః; గ్రీష్మో దక్షిణః పక్షః ।
వర్షాః పుచ్ఛం; శరద్ ఉత్తరః పక్షః; హేమంతో మధ్యం ॥ (తై. బ్రా. 3.10.4.1)

సంవత్సరమనే పక్షికి వసంతం శిరస్సు అయితే, గ్రీష్మం కుడి రెక్క;
వర్షం తోక; శరత్తు ఎడమ రెక్క; హేమంతం మధ్యభాగం.

అంటే, ఋగ్వేదలోని మూడు ఋతువులకు వర్ష ఋతువు, హేమంత ఋతువు ఈ కాలానికి జతచేయబడ్డాయి. ఆరు ఋతువుల ప్రస్తావన మనకు తెలిసినంతవరకూ తైత్తిరీయ సంహితంలో (తైత్తిరీయ సంహితం, తైత్తిరీయ బ్రాహ్మణం తరువాతి కాలంలో వెలువడింది) మొదటిసారి కనిపిస్తుంది.

మధుశ్చ మాధవశ్చ వాసంతికావృతూ శుక్రశ్చ శుచిశ్చ గ్రైష్మావృతూ
నభశ్చ నభస్యశ్చ వార్షికావృతూ ఇషశ్చోర్జశ్చ శారదావృతూ
సహశ్చ సహస్యశ్చ హైమంతికావృతూ తపశ్చ తపస్యశ్చ శైశిరావృతూ (తైత్తిరీయ సంహత 4-4-11)

మధు మాధవ మాసాలు వసంత ఋతువు. శుక్రము శుచి మాసాలు గ్రీష్మర్తువు. నభము, నభస్యము, వర్షర్తువు, ఇషము, ఊర్జము శరదృతువు. సహము, సహస్యము హైమంతిక ఋతువు. తపము, తపస్యము శైశిర ఋతువు.

అంటే మనం ఇప్పుడు చెప్పుకొనే చైత్రం, వైశాఖం అన్న 12 మాసాల పేర్లు అప్పటికింకా ప్రాచుర్యంలోకి రాలేదు. వాటికి మారుగా, మధు, మాధవ, శుక్ర, శుచి, ఇషము, ఊర్జ, సహ, సహస్య, తప, తపస్య అన్న పేర్లు ఇక్కడ కనిపిస్తాయి.

మనం ఇప్పుడు వాడే చైత్రం, వైశాఖం అన్న పేర్లు నక్షత్రాలకు సంబంధించినవి. నక్షత్రాల ఆధారంగా చంద్రుని గమనాన్ని పరిశీలిస్తే చంద్రుడు ఒక నక్షత్ర కూటమి నుండి బయలు దేరి మళ్ళీ అదే నక్షత్ర కూటమిని చేరుకోవడానికి దాదాపు 27రోజులు పడుతుందని తెలుస్తుంది. దీన్ని నాక్షత్రిక మాసం (Sidereal month) అంటారు. ఈ 27 రోజుల్లో చంద్రుడు దాటే ఒక్కొక్క నక్షత్రకూటమికి ఒక్కో పేరు చొప్పున అశ్వని, భరణి మొదలైన 27 నక్షత్రాల పేర్లు ఏర్పాటు చేసారు. ఆపైన, ప్రతి మాసంలో నిండు పున్నమ నాడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రపు వృద్ధిరూపమే ఆ మాసానికి పేరుగా ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ రకంగా చిత్త నక్షత్రంలో పౌర్ణమి వస్తే ఆ మాసం చైత్ర మాసంగా పిలిచారు; అలాగే, విశాఖ నక్షత్రంలో పౌర్ణమి వస్తే ఆ మాసం వైశాఖంగా పిలువబడింది. మనకు తెలిసిన పన్నెండు మాసాల పేర్లకు, నక్షత్రాల పేర్లకు ఉన్న సంబంధాన్ని ఈ కింది పట్టిక వివరిస్తుంది:

మాసం పౌర్ణమి రోజున నక్షత్రం
చైత్రము చిత్తా నక్షత్రం
వైశాఖము విశాఖ నక్షత్రం
జ్యేష్ఠము జ్యేష్ఠ నక్షత్రం
ఆషాఢము పూర్వాషాఢ నక్షత్రం
శ్రావణము శ్రవణం నక్షత్రం
భాద్రపదము పూర్వాభాద్ర నక్షత్రం
ఆశ్వయుజము అశ్వని నక్షత్రం
కార్తీకము కృత్తిక నక్షత్రం
మార్గశిరము మృగశిర నక్షత్రం
పుష్యము పుష్యమి నక్షత్రం
మాఘము మఘ నక్షత్రం
ఫాల్గుణము ఉత్తరఫల్గుణి (ఉత్తర) నక్షత్రం

ఇదే విధంగా సూర్యునికి సంబంధించిన సంవత్సర కాలాన్ని 27 భాగాలుగా విభజన చేసి వాటిని కార్తెలు అని అన్నారు. ఒక్కో నక్షత్ర కూటమిలో సూర్యుడు దాదాపు 2 వారాల పాటు ఉంటాడు కాబట్టి ఒక్కో కార్తె సుమారుగా 13 రోజులు ఉంటుంది. అశ్వని కార్తె మొదలు రేవతీ కార్తె వరకూ సాగే ఈ కార్తెల విభజన వ్యవసాయదారులకు చాలా ఉపయోగకరం.