కోళ్ల మంగారం మరికొందరు

“రాజులమీద, రాచకుటుంబాలమీద, తెగబలిసినవారిమీదా మాత్రమే రష్యాలో సాహిత్యసృష్టి జరుగుతున్నవేళ నికోలాయ్ గోగోల్ అనే ఆసామి ఒక పేద గుమాస్తా చలికోటు మీద ఒక కథ వ్రాశాడు. సామాన్యులు కూడా కథా వస్తువులు కాగలరని రష్యా రచయితలకు అంతవరకూ తెలీదు. అందువల్లే యావత్ రష్యన్ సారస్వతం కూడా గోగోల్ గ్రేట్‌కోట్‌ నుండే పుట్టిందని డాస్టోవిస్కి అప్పట్లో ప్రకటించారు. దినపత్రికల్లో మహానుభావుల జీవితాలమీదా ఛలోక్తులమీదా, చమత్కారాలమీదా, గొప్పవారి జీవితాలమీదా రకరకాల ఆర్టికల్స్ రావడం రివాజు. అట్టి దినపత్రికల్లో తోపుడుబళ్లవాళ్ల మీదా, ఫుట్‌పాత్ నివాసులమీదా, జోక్స్ పుస్తకాలు వ్రాసే వాళ్లమీదా వ్రాయడం జర్నలిస్టుల సామాజిక దృష్టిలో వచ్చిన మార్పుకు సంకేతం” అని ‘కోళ్లమంగారం మరికొందరు’ పుస్తకానికి వ్రాసిన ముందుమాటలో ప్రసిద్ధ పాత్రికేయులు శ్రీ పతంజలి వ్రాశారు.

శ్రీ కందుకూరి రమేష్ బాబు సామాన్యుల జీవితాలను ఇష్టంగా రికార్డ్ చేస్తున్నారు. వారి బతుకులను తన కెమెరాతో బొమ్మలు తీస్తున్నారు.వారి జీవితాలను గానం చెయ్యడమే తనకు సంతృప్తినిస్తుందని చెబుతున్నారు. జర్నలిజంలో పుష్కరకాలం పైగా ఉన్నారు.సామాన్యుల జీవిత పరిచయాలే వీరికి వృత్తీ, వ్యాపకం. ఇప్పటి వరకు పన్నెండు పుస్తకాలు రచించి, ప్రచురించారు. తాను రచించిన కథనాలను మిత్రుల సహాయంతో ‘సామాన్యశాస్త్రం‘ పేరిట ప్రచురించి పాఠకుల సౌలభ్యంకోసం తక్కువ ధరకు (Rs.10) అందించడం వీరి ప్రత్యేకత. వీరి పుస్తకాల్లో ‘కోళ్ల మంగారం మరికొందరు‘ సుప్రసిద్ధం. ఈ పుస్తకం ఈమాట గ్రంథాలయంలో ఉంచడానికి అనుమతి నిచ్చిన రమేష్ బాబు గారికి నా కృతజ్ఞతలు. ఇందులోని సామాన్యుల జీవితాలు ఒక్కసారి చదవండి. ఈ పుస్తకం ప్రత్యేకత మీకే బోధపడుతుంది.

ప్రస్తుతం రమేష్‌బాబు ‘నమస్తే తెలంగాణ’ ఆది వారం ఎడిషన్ బతుకమ్మ కు ఎడిటర్ గా పని చేస్తున్నారు. భార్య సుమబాల,కుమార్తె సెలవు తో హైదరాబాదులో నివాసం. మనదేశంలోని సామాన్యతను అసామాన్యంగా తన ఛాయచిత్రాల ద్వారా ప్రదర్శిస్తున్న ప్రసిద్ధ ఫోటోగ్రాఫర్ రఘురాయ్‌పై ‘సత్యం, శివం, సుందరం’ అనే పుస్తకం వ్రాస్తున్నారు.