దానవోద్రేక స్తంభకుడు

[పోతన భాగవతం అంటే తెలుగు వాడు చేసుకున్న అదృష్టం. అంత కన్నా చెప్పడం అనవసరం. ఉదాహరణకి మొట్టమొదటి భాగవత పద్యం చూడండి.

శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవో
ద్రేకస్తంభకుఁ గేళి లోల విలసదృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్.

మొత్తం భాగవత సారం అంతా ఈ పద్యంలోని ఆరు దళాల్లో ఉన్నాయని పోతన భాగవతం పుస్తకంగా తీసుకొచ్చిన ముఖ్య సంపాదకులు జంధ్యాల పాపయ్య శాస్త్రిగారు రాశారు. పద్యమే కాదు గద్యం కూడా అంతే మధురం. ఇప్పుడు రాసిన కధలో (దీన్ని కధ అనొచ్చా?) పోతన పద్యాలు గుప్పించి, తెలుగు భాష ఎంత మధురంగా వాడాడో చెప్పడానికి ప్రయత్నం చేశాను- ఇది చదివాక, ఎవరికైనా పోతన రాసిన మూల భాగవతం చదవాలనిపిస్తే అంత కంటే కావాల్సింది ఇంకేమీ లేదు. చివరగా, హిరణ్యకశిపుడు తన చావుకి తానే ఎలా ముహుర్తం పెట్టుకున్నాడో అనే భావన భైరవభట్ల కామేశ్వర రావుగారు వారి ‘తెలుగు పద్యం’ బ్లాగులో రాసినది. వారికి ధన్యవాదములు.]


లంకలో రావణ రహస్య సమాలోచన మందిరం:

అందరూ రావణుడి కోసం ఎదురు చూస్తున్నారు. వాతావరణం ఉల్లాసంగా ఉంది. రావణుడు ఎప్పుడొచ్చేదీ ఖఛ్చితంగా తెలియడం వల్ల, అంతకు ముందే చేరుకున్నారు అందరూ. సమయపాలన లేకపోతే పడే శిక్ష అందరూ ఎరిగిందే. అప్పటిదాకా జయించిన దేశాలూ, ఎవరెంత గొప్పవాళ్ళో జబ్బలు చరుచుకుంటూ చెప్పుకుంటున్నారు. విభీషణుడు అన్నీ వింటూ చిరునవ్వుతో కూర్చొని ఉన్నాడు. ఇంద్రజిత్తూ, కుంభకర్ణుల నవ్వులు వినిపిస్తున్నాయి. ఖర, దూషణాదూలూ, దేవాంతక, నరాంతకులూ అతికాయ, అక్షయ కుమారులు వినోదంగా చూస్తున్నారు. కొన్ని రోజుల క్రిందటనే జరిగిన యుద్ధంలో ఎవరు ఎవర్ని గెల్చారు, శత్రువు ఎలా నీరుకారిపోయేడూ చెప్పుకుంటూ, రాబోయే రోజుల్లో యుద్ధం లేకుండా విశ్రాంతి కోసం ఎదురు చూస్తున్నట్టే వున్నారు.

అప్పుడే తెరిచిన ద్వారంలోంచి ఠీవిగా రావణుడు నడుచుకుంటూ వచ్చేడు. జయ జయ ధ్వానాలు మిన్ను ముడుతుండగా, సింహాసనం అధిరోహించి చుట్టూ పరికించి చూశాడు. అందరూ వచ్చినట్టేనా? మారీచుడు లేడు. సరే చూద్దాం మామ సంగతి తర్వాత అనుకొని, నోరు విప్పేడు. “మనం యముడినీ, ఇంద్రాదులనీ జయించేం, కుబేరుడిని తరిమికొట్టి లంకని వశం చేసుకున్నాం, పుష్పకంలో ఎక్కడికైనా వెళ్ళగలం. మనలి చూస్తే ప్రపంచం వణుకుతోంది. కానీ మనం అన్నీ జయించలేదు ఇంకా అని మీకు తెలుసు. కొంచెం విశ్రాంతి తీసుకున్నాక మనం దండెత్త వలసిన ప్రదేశాలు చెప్పండి నాకు. ఇప్పుడే మనం నిర్ణయించుకుంటే, కొన్ని రోజులాగి బయల్దేరుదాం.”

సేనానాయకుడు ప్రహస్థుడు లేచి చెప్పేడు వెంటనే, “రాక్షసేశ్వరా, మన బలగాలు కొంచెం అలసి ఉన్నాయి కానీ అదేం పెద్ద సమస్య కాదు. స్వర్గం, ఇంద్రలోకం, యమలోకం మనం జయించాం కాబట్టి ఇప్పుడు కిందిలోకాల వైపు దృష్టి మరలిస్తే బాగుంటుంది. ఆ పై నీ ఇష్ఠ్టం మరి.”

రావణుడు తలపంకించేడు. మేఘనాథుడు అన్నాడు, “అయితే సుతలంలో బలి చక్రవర్తి ఉన్నాడని విన్నాము, అక్కడ మొదలు పెడితే బాగుంటుందేమో?”

విభీషణుడు అందుకున్నాడు వెంఠనే. “అన్నా సుతలం వైపు వెళ్ళవద్దు అక్కడ బలి మహారాజు ఉండడం నిజమే కానీ ద్వారంలో చతుర్భుజ రూపుడైన మహా విష్ణువు సర్వవేళలా ఆయన్ని కాపాడుతూ ఉంటాడు.”

“ఏమిటీ? బలి చక్రవర్తిని జయించడం చేతకాక ఆయనకున్న సమస్తాన్నీ దేబిరించి పుచ్చుకున్న పిరికిపందేనా? అలాంటివాడు చతుర్భుజుడైనా, అష్ఠభుజుడైనా ఈ దశకంఠుడి ముందు నిలవగలడా?” ఖరుడు అడిగేడు. రావణుడి ఛాతీ ఉప్పొంగింది, ఖరుడి మాటలకి.

విభీషణుడు అన్నాడు, “నాయనా, ఒక విషయం మర్చిపోతున్నారు మీరు. మనం అందరం రాక్షసులమై పుట్టడం, మన కర్మల వల్లనే కానీ ఎవరి తప్పూ కాదు. మనల్ని మనం జయించడం నేర్చుకుంటే, మనకీ జరా మరణాల బాధ తప్పుతుంది. అప్పుడు మనం కూడ బలి అంతటి వాళ్ళం అవ్వగలం. ఇందులో విష్ణువు ప్రసక్తి లేదు. ఆయనకి మనమీద పగ ఎప్పుడూ లేదు, కానీ మనమే ఆయన్ని, ఆయన భక్తులైన మహర్షుల్నీ రెచ్చగొడుతున్నాం. ఆయన లోక రక్షైకా రంభకుడు. అది గుర్తుంచుకుంటే మంచిది.”

ఇంద్రజిత్తు వెంటనే కోపంగా చెప్పేడు, “తండ్రీ ఈ విభీషణుడు దేవతల పక్షపాతి. ఈయన్ని నమ్మకండి. ఇంద్రుణ్ణి గెల్చిన నేనూ, యముణ్ణి గెల్చిన మీరూ ఉండగా మనకి ఎవరెదురు చెప్పగలరు? లౌక్యంతో బలి మహరాజుని వంచన చేసి ఆయన ద్వార పాలకుడైన విష్ణుడేపాటి? మనం ముందు సుతలం మీదకే దండెత్తి పోదాం.”

రావణుడు సాలోచనగా అన్నాడు, “విభీషణా, విష్ణువే కనక బలి ద్వారం దగ్గిర ఉన్నాడంటే మనకి రెండు విధాలా మంచిది. ఎందుకంటే మొదట విష్ణువుని జయించవచ్చు, రెండవది, నా దగ్గిర పరమశివుడిచ్చిన ఖడ్గం చంద్రహాసం ఉంది. దానితో ఇద్దరి పనీ ఒకేసారి అయిపోతుంది కదా? మనం మేఘనాధుడు చెప్పినట్టే చేద్దాం.”

“అన్నా నేను చెప్పవల్సింది చెప్పేను, తర్వాత మీ ఇష్ఠం. ఇంక శెలవు, వెళ్దామా?”

జయ జయ ధ్వానాల మధ్య సభ చాలించి ఇళ్ళకు వెళ్ళేరు అందరూ.


సరిగ్గా నిర్ణయించిన రోజున రాక్షస సేనతో రావణుడు సుతలం మీదకి దండెత్తడానికి బయల్దేరేడు. విభీషణుడూ, కుంభకర్ణుడూ లంకలో ఉండి రక్షించే భారం తీసుకున్నారు. పుష్పకం సుతలంలో ఆగగానే, ప్రహస్తుణ్ణి పిల్చి చెప్పేడు రావణుడు, “ప్రహస్థా, నా మాటగా చెప్పు బలితో — బలి మహరాజా, నేను దశకంఠుడైన రావణుణ్ణి. లంక మా రాజ్యం. ఇంద్రుణ్ణీ, యముణ్ణీ జయించి నేను ఇప్పుడు మిగతా లోకాలని జయించడానికి పూనుకున్నాను. మీరు నాతో యుద్ధం చేసినా సరే లొంగిపోయినా సరే.”

ఈ మాట పట్టుకుని ప్రహస్థుడు ద్వారం వద్దకి నడిచేడు. ద్వారం ముందు ఎవరో కాపలా ఉన్నట్టు ఉంది. సరిగ్గా దగ్గిరకొచ్చేసరికి, ద్వారపాలకుడు ప్రహస్థుడిని చూసి చిరునవ్వు నవ్వేడు. ఆ నవ్వు ఎలా ఉంది అంటే, అమృతం దొరికాక కాక్షసులు జగన్మోహిని చూసి మతి పోగొట్టుకున్నట్టూ, ప్రహస్థుడికి ఒళ్ళు తెలీకుండా పోయింది. అదో మైకం కప్పేసరికి తూలుకుంటూ వెనక్కి రావణుడి దగ్గిరకి వచ్చేడు. రావణుడి ఏమి జరిగిందో అర్ధం కాలేదు. ప్రహస్థుణ్ణి గుచ్చి గుచ్చి అడిగేక ఇలా చెప్పేడు,

“రావణా, బలి సంగతి నాకు తెలియదు కానీ, ద్వారపాలకుడు నవ్వే ముగ్ధ మనోహరమైన నవ్వు చూసిరా. వెళ్ళు వెంటనే. ఆ నవ్వు చూడ్డానికి ఎన్ని జన్మలైనా ఎత్తవచ్చు.” అలా అంటూ ఒంట్లో బలం అంతా పోయినట్టూ పుష్పకంలో కూలబడ్డాడు.

అలా మత్తులో పడిపోయిన ప్రహస్థుడిని వదిలేసి రావణుడు సుతలం ద్వారం దగ్గిరకి నడిచేడు. ద్వారం దగ్గిర ప్రహస్థుడు చెప్పిన పాలకుడూ లేడు, వాడి నవ్వూ లేదు. కోపంగా నడుచుకుంటూ ఖడ్గం మీద చేయి ఉంచి లోపలకి నడిచేడు. లోపల బలి మహారాజ పీఠం మీద ఆశీనుడై ఉన్నాడు.

“ఎవరు నాయనా నువ్వు ఇలా వచ్చేవు?” అడిగేడు బలి చక్రవర్తి.

“నేను దశకంఠుడైన రావణుణ్ణి. కుబేరుణ్ణీ, అష్ట దిక్పాలకుల్నీ, ఇంద్రలోకం, స్వర్గం, యమలోకం జయించాక మర్త్య లోకాలు జయించడానికి బయల్దేరేను. మొదట సుతలం మీదకి వచ్చేను. మీరు నాతో యుద్ధం చేసినా సరే, ఓటమి ఒప్పుకున్నా సరే,” దర్పం మాటల్లో వలికిస్తూ చెప్పేడు రావణుడు.

“బయట ద్వార పాలకుణ్ణి దాటి ఎలా వచ్చేవు లోపలకి?” చిరునవ్వు నవ్వుతూ అడిగేడు బలి.

“అక్కడ ఎవరూ లేరే? ద్వారం కాపలాకి కూడా ఎవరూ లేనీ మీరో రాజూ, మీకో రాజ్యమూనా?” తిరస్కారంగా నవ్వేడు రావణుడు.

బలి సాలోచనగా తల పంకించేడు, “సరే, రావణా. నేను యుద్ధాలు మానేసి చాలాకాలం అయింది. త్రిలోకాలూ నేను వామనుడికి దానమిచ్చాను కొంతకాలం క్రితం. ఆయనే నన్ను ఇక్కడ సుతలంలో కూర్చోబెట్టేడు. అందువల్ల ఆయన్ని అడిగి యుద్ధం మాట చూడాలి.”

“ఏమిటీ? మిమ్మల్ని దేబిరించిన వాడికి త్రిలోకాలూ ఇచ్చి మీరు ఆయనికి ఊడిగం చేయడం కూడానా? ఎంత సిగ్గు చేటు!” పైకే అనేశాడు రావణుడు. మళ్ళీ బలి చిరునవ్వే సమాధానం అయింది.

“అసలు దానం అలా అడగడానికి ఆయనికి సిగ్గు లేకపోతే, ఇవ్వడానికి మీకు ఉండద్దా?”

“రావణా, నేను ఎవరికి దానం ఇచ్చానో, నేనెవర్నో నీకు తెలుసా?” బలి మొహం ఎర్రబడింది.

“ఆ ఎవడో మాయల మారి చిన్న కుర్రవాడి వేషంలొ వస్తే మిమ్మల్ని నమ్ముకున్న రాక్షసులందర్నీ నట్టేట ముంచేరు మీరు. ఎవరికి తెలియదీ రహస్యం?”

“అడగడానికి వచ్చినవాడు ఎవరనుకుంటున్నావ్?” ఈ సారి బలి మొహంలో కొంచెం కోపం కనిపించింది.

“….”

“సాక్షాత్తూ మహా విష్ణువు చేయి సాచి అడితే లేదనగలనా? అదీగాక ఆయన అడిగింది మూడడుగులు మాత్రం.”

“అయినా తప్పు ఇచ్చిన మీది కాదు, ఇస్తున్నప్పుడు వద్దని చెప్పడానికి ఎవరూ లేకపోబట్టే కదా?”

“అదేం మాట రావణా, శుక్రాచార్యులు చెప్పనే చెప్పారు ముందు ఇవ్వొద్దనీ, అబద్ధం ఆడినా తప్పులేదనీ –

వారిజాక్షులందు, వైవాహికములందు
బ్రాణవిత్త మానభంగమందు
జకిల గోకులాగ్ర జన్మ రక్షణమందు
బొంకవచ్చు నఘము నొంద డధిప

“మరి?”