నాకు నచ్చిన పద్యం: దాశరథి మించుకాగడా

ఉ.   దొంతరలైన మబ్బులకు త్రోవలు చూపెడి మించుకాగడా
      చెంత మనోజ్ఞ కావ్యము రచించు కవిన్ నను జూచి భావనా
      సంతతి నాగసర్పముల చాడ్పున వచ్చి నటించుచుండ వా
      యింతును రుద్రవీణ నటియింతును పశ్చిమ దిక్తటమ్ములన్

సిసలైన కవిత్వం, అది ఏ రూపంలో ఉన్నా సరే, దేశకాలాలను విడిచి ఉండలేదు. కాలంతో పాటు తనని తాను పునస్సృజించుకుంటూనే ఉంటుంది. అందుకే నవనవోన్మేషశాలిని అయిన ప్రతిభ కవిత్వానికి ఆయువుపట్టు. ఈ పునస్సృజన అనేది అనేక రకాలుగా జరగవచ్చు. భాషలో, భావంలో, రచనా ప్రక్రియలో, శైలిలో, దృక్పథంలో – ఇలా ఎన్నెన్నో మార్గాలలో కొత్తదనం విచ్చుకుంటుంది. పైపద్యంలో రచనా ప్రక్రియ పాతదే – ఛందోబద్ధ పద్యం. కానీ భాష కొత్తది, భావం ఇంకా కొత్తది, శైలి మరింత కొత్తది, దృక్పథం అన్నిటికన్నా కొత్తది! ఆ కొత్తదనమే యీ కవిత్వానికి జవమూ జీవమూను. ఇది అచ్చమైన ఆధునిక పద్యం. పద్యానికి యీ కొత్త ఊపిరి నిచ్చిన కవి, దాశరథిగా ప్రసిద్ధి చెందిన దాశరథి కృష్ణమాచార్యులు.

అతని పద్యం ఒక ఫిరంగి!

ఈ పద్యంలో అర్థం కానిది చాలా తక్కువ. నిజానికి అర్థపు లోతుల్లోకి వెళ్ళకుండా పద్యాన్ని రెండుసార్లు చదివితేనే అందులోని విద్యుత్తేదో హృదయాన్ని జివ్వుమనిపించక మానదు. అసలు ఏ పద్యాన్నయినా సరే, అర్థం జోలికి పోకుండా ముందు ఒకటికి రెండు సార్లు ఎలుగెత్తి చదువుకోవాలి. అందులోని నాదాన్నీ, దాని గమన వేగాన్నీ పూర్తిగా హృద్గతం చేసుకున్నాక, ఆపైన దాని అర్థం గురించి ఆలోచన కొనసాగించాలి.

ఈ కవి ఒక మనోజ్ఞ కావ్యాన్ని రచిస్తున్నాడు. ఎక్కడ? దొంతరలైన మబ్బులకు త్రోవలు చూపే మించుకాగడా చెంత. ‘మించుకాగడా’ కొత్త పదం, కొత్త పోలిక. మించు అంటే మెఱుపు. చీకటిలో దారి చూపించేది కాగడా. ఈ మెఱుపు కాగడా మబ్బులకు తోవలు చూపిస్తున్నదట! అలాంటి కాగడా చెంత కూర్చుని కావ్యాన్ని రచిస్తున్నాడు కవి. అప్పుడతని దగ్గరకు భావపరంపరలు వచ్చి చేరాయి. అవి నాగుపాముల్లాంటి భావాలు! బుసకొడుతూ నాట్యం చేస్తున్నాయి. అలా ఆ భావనాభుజంగాలు తనను చేరేసరికి కవిలో ఆవేశం పెల్లుబికింది. రుద్రవీణ వాయిస్తూ పడమటి దిక్కు చివళ్ళ నాట్యం చేస్తానంటున్నాడు. ఇదీ యీ పద్యం తాలూకు వాచ్యార్థం. వాచ్యార్థమంటే సాధారణంగా పైకి కనిపించే అర్థం. కవిత్వం ఎప్పుడూ సాధారణ అర్థంతో ఆగిపోదు. అసాధారణమైన మరో అర్థమేదో స్ఫురింపజేస్తూనే ఉంటుంది.

ప్రతీ కవీ సాధారణంగా ఎక్కడో అక్కడ తన కవిత్వ తత్త్వాన్ని గురించీ, లక్షణాల గురించీ చెప్పుకుంటూనే ఉంటాడు. ఇది మనకి నన్నయ్య దగ్గరనుండీ కనిపిస్తుంది. ఈ పద్యంలో దాశరథి చేసిన పని కూడా అదే. అయితే ఆ పని పూర్తిగా ధ్వని మార్గంలో, అంటే కవితాత్మకంగా చేశాడు. దాన్ని వివరిస్తే అది కాస్తా పల్చబడిపోతుంది. బహుశా వివరించాల్సిన అవసరమే లేదేమో. అయినా నా సహజ వాక్‌చాపల్యం ఊరుకోనివ్వదు కాబట్టి, నాకు తోచిన చిన్నపాటి వ్యాఖ్య చేయడానికి పూనుకుంటున్నాను. సహృదయ పాఠకులు నన్ను మన్నింతురు గాక!

లోకమంతా మబ్బులు కమ్మినట్లు అంధకారబంధురమైపోతే, మెఱుపుకాగడాలా దారి చూపించే వెలుగేదో కవిత్వంలో ఉంటుంది. అది మామూలు వెలుగు కాదు, విద్యుచ్ఛక్తి. ఆ శక్తిని పదాలలో పద్యాలలో నింపాలని కవి తాపత్రయం. అలాంటి విద్యుత్కవిత్వంతో, చీకట్లో మగ్గుతున్న లోకానికి షాక్ ట్రీట్‌మెంట్ ఇవ్వాలి. పదునైన పదాలు దొరికేసరికి కవి అంతశ్చేతనలో నిద్రాణమైన భావలు ఒక్కసారిగా ఉరికురికి పడుతున్నాయి. నాగుపాముల్లా పడగవిప్పి నాట్యం చేస్తున్నాయి. అవి మామూలు నాగుపాములు కాదు. సాక్షాత్తూ ఆ నాగభూషణుని ఆభరణాలు. ఆ భావోద్వేగానికి కవి హృదయం సంచలించింది. ఆతడు స్వయంగా రుద్రుడైపోయాడు. రుద్రవీణ వాయించాడు. పశ్చిమ దిశాంతాలలో తాండవం చేశాడు. అతనిప్పుడు సాక్షాత్తూ లయకారుడు. ఆతని కవిత్వం లయకారుని ప్రళయనర్తనం. ఆ విలయంలోంచి కొత్త సృష్టి చేయాలని కవి ఆకాంక్ష. ప్రస్తుతానికి మాత్రం అతనిది రుద్రుని అవతారం. అతను మ్రోయించే రుద్రవీణ మూర్ఛనలు అతని కవిత్వంలో ప్రతిధ్వనిస్తాయి.

నిజానికి ఆ ప్రతిధ్వనులు దాశరథి కవిత్వమంతటా వినిపిస్తూ ఉంటాయి. అతని పద్యాలన్నిటా కొత్త విద్యుత్తేదో ప్రవహిస్తూ ఉంటుంది. “ఈ కొరగాని లోకమున కిప్పుడె నిప్పురగిల్చి కాల్చి, నాలో కదలాడు నూహలకు రూపమొసంగి పునస్సృజింతు,” అన్న కవి మరొకడు లేడు. రాజాస్థానాల, జమీందారీల, బంగారు పంజరాలలో హాయిగా జీవించిన కవిపండిత లోకం, ముక్కలైన పంజరాల నుండి బయటకి వచ్చి, అప్పుడప్పుడే అడవి లాంటి ప్రపంచాన్ని చూస్తున్న రోజులవి. అథోజగత్తుల వ్యథార్థ జీవితాలు కళ్ళెదుట కరాళనృత్యం చేస్తున్న కాలమది. అలాంటి కాలంలో పుట్టిన కవి దాశరథి. తాను చూసిన, అనుభవించిన, కటిక నిజాలు అతని గుండెల్ని మండించాయి. ఆ మంటల వేడిమే అతని పద్యాలలో అగ్నిధారగా కురిసింది, రుద్రవీణగా మ్రోగింది. అలాంటి అతని కవిత్వ స్వరూపాన్ని చక్కగా ధ్వనింపజేసే కవిత ‘మూర్ఛన’. అందులోని మొట్టమొదటి పద్యమే పై పద్యం.

నాకు దాశరథి బాగా నచ్చడానికి ముఖ్యకారణం, అతను ఛందోబద్ధమైన పద్యానికి కొత్త బలం చేకూర్చడం. అప్పటి దాకా ఎక్కువగా శృంగారాన్ని ఒలికించిన పద్యం నుండి అంగారాన్ని కూడా కురిపించిన కవి దాశరథి. దాశరథిలా, పద్యాన్ని యుద్ధరంగంలో జవనాశ్వంలా పరిగెత్తించిన కవి ఆధునిక కాలంలో మరొకడు లేడంటే అతిశయోక్తి కాదు. పద్యం ఫ్యూడల్ వ్యవస్థకి ప్రతినిధి అనే బూజుపట్టిన భావాలను సవాలు చేస్తున్నట్టుగా, అభ్యుదయ భావాల ఇనుపగుళ్ళని పేల్చే మరఫిరంగిలా పద్యాన్ని మలచిన కవి అతడు. అతని పద్యాలు చదువుతూంటే ఇప్పటికీ రక్తం ఉరకలెత్తుతుంది. నరాలు నాగసర్పాల చాడ్పున నృత్యం చేస్తాయి! అతని కవిత్వాన్ని గురించి శ్రీ కోవెల సుప్రసన్నాచార్యులన్న యీ మాట ప్రత్యక్షరసత్యం – “దాశరథి కవిత్వం తెలుగువాళ్లకు ప్రాణాగ్ని జ్వాల.”