సిరిపాలుఁడు

(ఇది కల్పితగాథ. ఇందలి సిరిపాలుఁడు, లక్ష్మీసుతుఁడు కల్పితవ్యక్తులు. బుద్ధాదులు చారిత్రకపురుషులు. జేతవనము సైతము యథార్థమైనదే.)


పూవుందీవలనర్తనంబు వెలయన్ పుష్పాసవాలోలభృం
గీవారంబుల రమ్యగీతు లొలయన్ కీర్తింపఁగా నొప్పు శ్రీ
శ్రావస్తీనగరీంద్రమందు నొక యారామంబు నిష్కామసే
వావృత్తిన్ సిరిపాలుఁ డవ్వనరమం బాలించు నశ్రాంతమున్.

కోసలదేశమందుఁ గల కోమటులందున శ్రేష్ఠుఁడైన ల
క్ష్మీసుతనామకుండయిన శ్రేష్ఠికిఁ జెందిన తోఁట యద్ది స్వా
ర్థాశయవర్జితుండును వనావనదక్షుఁ డటంచు వాణిజుం
డా సిరిపాలు నేర్పరచె నవ్వనికిం దగు తోఁటమాలిగన్.

శ్రీవిస్తారము మంజిమాతిశయమున్ శిల్పాభిరమ్యంబు నై,
మావుల్క్రోవులయందు వల్లరు లెగం బ్రాఁకంగ నేర్పడ్డ వ
ల్లీవేశ్మంబులయందుఁ బెన్దుటుములై లీల న్వినోదించు ప
త్త్రీవారంబుల గానవాణి కిరవై దీప్తిల్లు నవ్వాటియున్.

ప్రావృట్కాలమునందున
నా వనదేవత హలిప్రియార్జునకేత
క్యావిష్కృతకౌసుమభూ
షావళులం దాల్చి యెసఁగు సాలంకృతయై.

సువిమలచంద్రికావసనశోభితగాత్రము తోడ ఫుల్లకై
రవసమలంకృతంబయి విరాజిలు క్రొవ్వెద తోడ కార్తిక
ప్రవిమలరాత్రులందుఁ గనుపట్టును తద్వనలక్ష్మి భూషణౌ
ఘవిలసితాంగియై ప్రియునిఁ గాంచఁగ వేచెడు కాంతపోలికన్.

బంతులు చేమంతులు నా
సాంతము విరిసిన ప్రియంగుశాబరతరువుల్
స్వాంతము నలరించును హే
మంతమునందా రుచిరసుమాటవి యందున్.

మల్లెలు హల్లకంబులు సుమంజులవంజులచంపకంబులున్
మొల్లెలుఁ గొల్లలై విరిసి భూరమణీమణి కొప్పునందు భా
సిల్లెడు భూషణంబు లటు చెల్వు వహించుచు నుండఁ జైత్రమం
దుల్లసిలుం దదీయవన ముర్వరఁ జెందిన నందనంబటుల్.

మరువకముల్ చంపకముల్
దిరిసెనముల్ కేసరములు తెలిమల్లియలున్
ధరియించి నిదాఘంబున
సురుచిరమై ప్రియకర మగు సుమవన మెంతేన్.

ఆయా ఋతువులయందున
నాయత్తంబైన విరుల ననుదినమున్ మో
దాయతి సెట్టికి నర్పణ
సేయును సిరిపాలుఁ డతులసేవారతుఁడై.

ఆ సుమరాజముల్ వణిజుఁ డాదరమొప్పఁగ హావభావహే
లాసముదంచితల్, సురవిలాసవతీసమచారుతాంచితల్,
భాసురగాత్రలైన ప్రియభామలకుం గయిసేసి తన్ముఖా
వాసిసుహాసశీధురసపానమదోత్కటుఁడై సుఖించెడిన్.

అది వైశాఖమునందుఁ జందురుఁడు పూర్ణాకారముం బూని స
ర్వదిశాభ్యంతరసీమలందు సుధల న్వర్షించు భద్రాహ మా
సుదినంబే యగు శాక్యసింహుని కిలన్ సుజ్ఞానము న్జన్మమున్
పదిలంబై సమకూడినట్టి యతిభవ్యంబైన సందర్భమున్.

ఆదినమందుఁ బుష్పవనమందునఁ బూచిన గంధిలంపు పు
ష్పాదుల మార్దవం బుడుగనట్టులఁ బుట్టికయందుఁ బెట్టికొం
చాదరమొప్ప శ్రేష్ఠి కవి యర్పణసేయఁగఁ దోఁటమాలి ప్రా
సాదపథానుగామి యయి చయ్యన వీథులు దాఁటి పోవుచున్.

జేతవనసమీపంబునఁ జిత్రముగను
తీవ్రకలకలం బొదవెడు తీరు దోఁప
సంభ్రమాశ్చర్యకలితుఁడై సత్వరంబ
అరయ నద్దానిఁ జనె నాతఁ డాస్థతోడ.

ఆవిధిఁ జని కనె నాతఁడు
భావుకము దురంతజన్మపరిభావుకమున్
పావన జీవన పథసం
భావుకమును నైనయట్టి పరమోత్సవమున్.

నడయాడు వేవెల్గు వడువున నుడివోని
         తేజంబుతో నడతెంచువాఁడు
సురలోక గురువట్లు సుందరాలికమందు
         దివ్యతేజంబు నర్తించువాఁడు
అమృతాంశు రుచివోలె నక్షియుగ్మమునందు
         కారుణ్యదృష్టి జాల్వారువాఁడు
సన్న్యాసి యయ్యును స్మరమూర్తి చందాన
         సొగియించు దేహంపుసొగసువాఁడు

కింశుకారుణోజ్జ్వలకషాయాంశుకుండు
నవతరాష్టాంగమార్గనిర్ణాయకుండు
శాక్యసంతతికలశాబ్ధిచంద్రముండు
కాననయ్యెను బుద్ధుండు వాని కచట.

అతులితదానశౌండుఁడు మహాత్ముఁడు వైశ్యుఁ డనాథపిండదుం
డతులితభక్తి జేతవనమందునఁ గట్టిన యాశ్రమంబునం
బ్రథమముగా తథాగతుఁడు పాదము మోపు మహామహంబు నాఁ
డతులితభక్తిమై శ్రమణకాదులు సల్పుచునుండి రచ్చటన్.

శాక్యసింహుఁడు చనుదెంచు సరణులందు
రంగవల్లిక లెన్నియో వ్రాసినారు
పేశలంబగు సుమములఁ బేర్చినారు
మంచితోరణంబు లలంకరించినారు.

శారిపుత్రుఁ డానందుండు సంజయుండు
మున్నుగాఁగల శ్రమణకముఖ్యు లెల్ల
శాక్యసింహుని వెన్నంటి సాగుచుండ్రి
హరిని వెన్నంటి చను నారదాదులట్లు.

అమృతాంశూజ్జ్వలదివ్యతేజమున హృద్యంబైన సిద్ధార్థవ
క్త్రమహోదర్శనమత్తచిత్తుఁడయి ఛేకంబట్లు తొల్లింటి కా
ర్యములెల్ల న్మది విస్మరించి చనె నుద్యానాధిపాలుండు గౌ
తమమౌనీశ్వరు వెంటనంటి యట జేతారామముం జేరఁగన్.

స్వాగత మొసంగి యచ్చట శాక్యమునికి
గంధకుటి* తన్నివాసంబుగా నొనర్చి
మెండుగా సల్పిరి యనాథపిండికాది
భిక్షుకోత్తము లర్చనల్ ప్రియముమీర.

ఆ మహోత్సవ మ్మరయంగ నటకు వచ్చి
యున్న పామరుల్ గుమిగూడి యోలిగట్టి
మస్తకోపరివిన్యస్తహస్తు లగుచు
శాక్యసింహుని గొలువంగ సాగిరంత.

తల్లులు దండ్రులు న్మఱియుఁ దాతలు పేదలు దీనులాఢ్యులున్
పిల్లలు వృద్ధు లందఱును వీరును వారను భేదమింత లే
కెల్లరు పూవుటెత్తులిడి యెంతయు భక్తిని బుద్ధదేవపా
దోల్లసితాబ్జముల్ గొలిచి రుల్లసితాంతరు లౌచు నంతటన్.

శరణముఁ జొచ్చిరి బుద్ధుని ‘బుద్ధం శరణం గచ్ఛామి’ యటంచున్
శరణముఁ జొచ్చిరి ధర్మము ‘ధర్మం శరణం గచ్ఛామి’ యటంచున్
శరణముఁ జొచ్చిరి సంఘము ‘సంఘం శరణం గచ్ఛామి’ యటంచున్.

ఉప్పెనవోలె వెల్లువగు నుత్కటభక్తిరసాబ్ధివీచులం
దప్పుడె దోఁగుచుం బులక లంగమునం దిగురొత్త సంభ్రమం
బొప్పఁగఁ దోఁటమాలియు నిజోపవనస్ఫుటపుష్పసంతతుల్
దొప్పలఁబోలు దోసిళులఁ దోరముగాఁ గొని కొల్చె స్వామినిన్.

పున్నాగములు కొన్ని మూర్ధంబునందు
కాంచనంబులు కొన్ని కంఠంబునందు
మల్లెపూవులు కొన్ని యుల్లంబునందు
హల్లకంబులు కొన్ని హస్తంబులందు
పంకజంబులు కొన్ని పాదంబులందు
అర్పించి, ప్రీతి సాష్టాంగనతి సేసి
సేవించె సుగతునిన్ సిరిపాలుఁ డంత.

అట్లు సేవించు నాతని నమ్మునీంద్రుఁ
డతులకారుణ్యరసదృష్టి నరసి యనియె,
వత్స! యష్టాంగమార్గానువర్తనంబు
త్రిశరణంబులు నీకు మేలొసఁగుగాత!

అని పల్కియు సిద్ధార్థుఁడు
తన చరణంబుల కడఁ గల తరుణసుమంబుల్
గొని సిరిపాలుని దోసిట
నునిచి యతని వీడ్కొలిపె యథోచితరీతిన్.

ఆ సుమంబుల లెక్కింప నక్కజముగ
అష్టసంఖ్యాకము లగుచు నమరుచుండె;
గురుని యష్టాంగసరణుల గుర్తుసేయ
నొనరిన ప్రతీకలో యన నొఱపుమీరి.

ఆ యష్టసుమంబులనే
యా యుద్యానంపు మాలి యమరిచి పుటిలో
నీయఁగ లక్ష్మీసుతునకుఁ
బోయెను ప్రొద్దయ్యె ననుచుఁ బొనరిన భీతిన్.

వచ్చిన మాలి వైశ్యకులవల్లభుఁ డుల్లమునందు వెల్లువై
హెచ్చినయట్టి క్రోధరస మీక్షణయుగ్మమునందు నెఱ్ఱనై
చొచ్చిన యట్టులం గనలు చూపులఁ జూచుచుఁ బల్కె నోరి! నీ
వెచ్చటనుంటి వింతవఱ కెవ్వరి కొల్వును గొల్చుచుంటివో?

జాగు చేసితివింత పుష్పములు దేఁగ,
ఎన్నివిరులున్న నవ్వని నున్న విరుల
సూటి గావందుచే వేచి చూచుచుంటి,
నీదురాకకై నే నుదయాదినుండి.

ఆ సుమంబులతో మత్ప్రియాంగనలను
నందముగఁ గయిసేయక యన్య మేమి
సేయ నందుచే నే నింత సేపు దారు
లెల్లఁ బరికించుచున్ విసువెత్తి యుంటి.

సుమసమలంకృతంబు లగు సుందరగాత్రములూని భారతీ
హిమగిరినందనా హరిహృదీశ్వరు లట్లు రహించుచున్నత
త్కమలముఖీముఖాంబకవికాసిమనోహరవీక్షణంబె నా
కమరును దేవతాసునయనాంచితమంగళవీక్షణాభమై.

ఆ విధి కిమ్మెయి భంగము
గావించిన నీదు విధము గాదు క్షమార్హం
బోవనపాలక! పొనరక
పోవునె దుష్కృతికి ఫలము భువిలో నెపుడున్?

వనపాలాధమ! నీ తె
చ్చిన పుష్పంబుల నిట నిడి చెచ్చెర నాకుం
గనుమఱుగై మఱలుము, నీ
వనపాలక వృత్తివలనఁ బాయుము రేపే!

అనుచుం గ్రోధావిలుఁడై
గొణగొణ జడివలె నుడివెడు కోమటికిం ద
ద్వనపాలకుఁ డిట్లనియెన్
వినయాన్విత సౌమ్యవచనవిన్యాసముతోన్.

స్వామీ! సద్యస్సంఫు
ల్లామోదిసుమంబులఁ బుటియం దిడుకొని నే
నీ మిహిరోదయవేళనె
నేమంబున మిముఁ గనఁ బయనించితిఁ గడఁకన్.

అట్లు పయనించు చుండంగ నధ్వమందు
నావహిల్లె నొకానొక యద్భుతంబు;
జన్మరాహిత్యకరము,సంసారదుఃఖ
దూరక, మపూర్వవిజ్ఞానసార మద్ది.

రాగమ్ము భోగమ్ముఁ ద్యాగమ్ము నొనరించి
         వెతను బాపెడు దారి వెదకె నెవఁడు
సత్యమ్ము శీలమ్ము శాంతమ్ములే పర
         మార్థమ్ము లను సత్య మరసె నెవఁడు
త్యాగమ్ము బ్రహ్మచర్యమ్ము తపమ్ము ము
         క్తిప్రదమ్ములని బోధించు నెవఁడు
చిత్తసంయమనమ్ము జీవకారుణ్యమ్ము
         సుగుణమ్ము లని యమ్మఁజూచు నెవఁడు

అమ్మహాత్ముండు శుద్ధోదనాత్మజుండు
తొట్టతొలిగను శ్రావస్తిపట్టణమున
జేతవనమందున విడిదిసేయునట్టి
యుత్సవము గూర్చె నాకు నేత్రోత్సవంబు.

నడయాడెడు రవి వడువున
నడరెడు శౌద్ధోదనివదనాబ్జమహోఽధీ
నుఁడనై యాతని వెంటనె
నడచితిఁ బెంపుడు మృగంబు నలువున నేనున్.

అట్లు జేతవనంబున నమ్మహాత్ము
నాదుపుటిలోన నున్నట్టి ననలనెల్ల
నర్పణము సేసి గొల్చితి నందుచేతఁ
దడవు చాలయ్యె, క్షమియింపఁ దగుదు నేను.

అలరులు గుప్పి గుప్పి శిలలందున దేవుఁడు గల్గునంచు ని
చ్చలు నొనరింతు రర్చనము సర్వు, లదెంత యథార్థమో కనం
గలమె? సమక్షమందు ననఘాకృతి నూని చరించు దైవ మీ
యలఘునికిం దథాగతుని కర్పణసేయఁగరాదొ యవ్విరుల్?

అందుచేత దైవాంశతో నవని నున్న
బుద్ధదేవుని కర్పించి పూవులెల్ల
జాగుసేసి వచ్చితి నాదు సాహసంబు
స్వామి! మన్నింపుమయ్య కృపాళు వగుచు.

ఐనను నష్టమై యొనర వన్ని సుమంబులు; పద్మకోమలం
బైన స్వపాణిచేత గురుఁ డాదరమొప్పఁగ నిచ్చినట్టి యీ
సూనములం గ్రహింపుడు, యశోధరవల్లభపాదరేణుస
మ్మానితపావనాసమసుమావళు లివ్వి, యనన్యలబ్ధముల్.

మారజిత్తుని యష్టాంగమార్గమునకుఁ
దగు ప్రతీకలో యన నెన్మి దగుచు వెలసె
వీనిఁ గొనుఁడయ్య, కిన్కను విడువుఁడయ్య!
పడయుఁడయ్య శాంతిని బుద్ధపథమునందు!

అని వనపాలకుండొసఁగు నవ్విరులన్ వణిజుండు బిట్టుగా
గొణఁగుచు నాస్థలేక నిజకోమలహస్తములందు నెట్టులో
కొనియెను గాని, యాక్షణమె క్రొత్తమెఱుంగెదొ వానియాత్మలో
నొనరినయట్టు లయ్యెఁ, దను వూనె సముత్కటరోమహర్షమున్.

అవిరతంబుగఁ బ్రియురాండ్ర యాస్యసార
సంబులే తోఁచు వాని డెందంబునందు
బుద్ధదేవుని పావనమూర్తిశతమె
కానవచ్చెను, విచ్చెను వాని కనులు.

వర్షించెఁ దదీక్షణముల్
హర్షాశ్రుపరంపరల, నవాభ్యుదితమనో
హర్షము ప్రియాజనసుఖో
త్కర్షముకంటెను శతాధికంబయి తోఁచెన్.

సిరిపాలుండొసఁగిన యా
విరులన్ లక్ష్మీసుతుండు వీక్షణములకున్
మఱిమఱి హత్తుకొనెన్ లోఁ
దరమిడి నెలకొన్న భక్తితాత్పర్యమునన్.

ఆ మఱునాటినుండియును నాతఁడు జేతవనంబునందునన్
స్వామికిఁ దోఁటనుండి సిరిపాలుఁడు దెచ్చిన పూలరాశితో
నేమముతో బదార్చనము నిష్ఠురభక్తియుతాంతరంగుఁడుం
గామవివర్జితుండు నయి కన్పడెఁ జేయుచు వేకువందునన్.

(*అనాథపిండికుఁడు జేతుఁడను సామంతుని నుండి విలిచిన జేతవనములోఁ గల గంధకుటి యను కుటీరములో బుద్ధుఁడు నివసించేవాఁడని బౌద్ధగాథలు తెల్పుచున్నవి. భక్తు లందఱు తెచ్చిన పుష్పముల సుగంధముచేత గంధయుతమైనందున ఆ కుటీరమునకు గంధకుటి యను పేరు వచ్చినదని చరిత్ర తెల్పుచున్నది. – రచయిత. )