కథాంతం

ఇప్పటివరకు ఎన్నో ఆరంభాలు, మరెన్నో ముగింపులు. జీవితంలో దిశ మారినప్పుడల్లా వినిపించిన వీడ్కోళ్ళు. నా కోసం, నా నుంచి కారిన కన్నీటి బొట్లు. ఐతే, ఇది ఆఖరి ముగింపు. ఈ అంకానికిదే చివరి వాక్యం. ఈ క్షణం మాత్రమే వివర్ణమైన జీవిత శిశిరంలో రాలుతున్న ఆఖరి ఆకు.

ఆఖరికిది ఎలా ఉండబోతోందో? కాంచన వృక్షాలు కనిపిస్తాయా? గడచిన జీవితమంతా సినిమా రీలులా కళ్ళముందర తిరుగుతుందా? చీకటిలో నుంచి ఒక చల్లటి వెలుగులోకి ప్రయాణించినట్టుగా ఉంటుందా? లేదా, మిగతావాటిలాగే ఇది కూడా చీకటిలో నుంచి చీకటిలోకి ప్రయాణంలాగా మిగిలిపోతుందా?

ఆనందం కోసం, ఆరోగ్యం కోసం, అర్థం పర్థం లేని కారణాల కోసం ఇప్పటి వరకు ఎన్నో మైళ్ళు నడిచాను. కాని, ఇది నేను నడవబోయే చివరి మైలు. నిజంగా ఇది ఒక మైలే ఉంటుందా? ఏమో. చాలా కాలమైపోయింది ఈ ఊరు వచ్చి. దారి గుర్తుంది గాని దూరం గుర్తులేదు. ఐనా, ఇది ఎంత మాత్రం ఊరు గనక మైళ్ళ కొద్దీ దూరాలుండటానికి.

రిచ్చా కట్టమంటారేటి బాబూ! ఎక్కడి కెల్లాల?

ఏట్లోకి. బాగా కోపం వచ్చినప్పుడు అమ్మ అనే మాట. ఇప్పుడదే నిజమయింది. పాకీజాలో కబ్రస్తాన్‌కి పల్లకీలో వెళ్ళినట్టు, ఈ చివరాఖరి ప్రయాణానికి రిక్షా కూడా ఎందుకు? ఇంకా ఇక్కడ, రిక్షాలు తొక్కేవాళ్ళు, రిక్షాలు ఎక్కేవాళ్ళు ఉన్నారన్న మాట. కాని, ఎందుకనో కథలు, నాటకాల్లో ఎక్కడా రిక్షావాలా కనబడటం లేదు. ఒకప్పుడు కార్మిక పక్షపాతం ప్రకటించటానికి అనువుగా, అతి సులువుగా దొరికిన వస్తువు రిక్షావాలా. ఇప్పుడంతా ఎవరెవరో కనిపిస్తారు. దేవుళ్ళు మారినట్టే, దీనులు కూడా మారిపోతారు కాబోలు.

ఏమిటో, రిక్షావాళ్ళు కూడా ఒకరినొకరు గురూ అని పిలిచేసుకుంటున్నారు, టీచరంటే బొత్తిగా గౌరవం లేకుండా పోయింది — అప్పట్లో కాలేజీ ప్రిన్సిపాలుగారి ఆవేదన. ఆయన పేరున్న రిక్షావాడెవరైనా కనిపిస్తాడేమోనని చాలా వెతికాను కనిపించిన ప్రతి రిక్షావాడినీ పేరడుగుతూ.

ఎవరైనా ఎదురౌతారా, నా పేరు తెలిసినవాళ్ళు? ఇన్నాళ్ళ తరువాత, ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళెవరుంటారిక్కడ? నేను మరిచిపోలేని ఊరు, నన్ను మరిచిపోకుండా ఉంటుందా? ఏమో.

మిమ్మల్నెక్కడో చూసినట్టుందే. మీరు ఫలానా వారి అబ్బాయే కదూ! ఎక్కడుంటున్నారిప్పుడు? నాన్నగారు బాగున్నారా?

బాబూ, నాన్నగారిని రోజూ ఎలా పిలుస్తారో, అదే పేరుతో ఆయన చెవి దగ్గర నోరు పెట్టి గట్టిగా మూడు సార్లు పిలవండి. నాన్నగారూ… నాన్నగారూ… నాన్నగారూ…

ఆయన దగ్గరికే వెళుతున్నాను. మళ్ళీకలుద్దాం.

అదేమిటీ, మాట పూర్తి చెయ్యకుండానే వెళ్ళిపోతున్నారు? గుర్తుపట్టారా, అసలు? ఇదిగో మిమ్మల్నే…

నడక వేగం కొంత పెంచితే మంచిది ఇటువంటి శ్రేయోభిలాషి ఎవడూ మరొకసారి పలకరించకుండా.

నువ్వొట్టి జనద్వేషివి, ఎవరు కనిపిస్తారో, ఎవరిని పలకరించాల్సి వస్తుందో అన్నట్టు ఎప్పుడూ తల వంచుకుని వెళుతూ ఉంటావు. ఎదురుగా నేను కూర్చున్నా ఒక మాటా మంతీ ఉండదు. లేదు జానకీ, అది నిజం కాదు. నాకు ఎవరి మీద, దేని మీద ద్వేషం లేదు – మనుషులతోనే కాదు పూలతో, చెట్లతో, పక్షులతో కూడా మాట్లాడతాను. మమ్మీ! డాడీ మాటలలాగే ఉంటాయి. ఆయన మాట్లాడకపోవటమే బెటరు. నువ్వెందుకు కదిలిస్తావు? ఏం చేస్తాంరా, కట్టుకున్నాక తప్పుతుందా, ఏ కొర నోములు నోచానో…

విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభుః
భూతకృద్ భూతభృద్ భావో భూతాత్మా భూత భావనః

గుడికి లౌడ్‌స్పీకర్ వచ్చింది. ఒకప్పుడు, ప్రశాంతంగా, ధ్యానంలో మునిగినట్టు కనిపించిన గుడి హోరెత్తిస్తోంది. లోపల ఎలా ఉంటుందో! చూసి చాలా రోజులైపోయింది కదా, అది కూడా మారిపోయి ఉంటుంది. పోనీ ఒకసారి లోపలికి వెళ్ళి చూస్తే? ఈ మిగిలిన కొద్దిపాటి అడుగుల్లో రెండు గుడిలో వేస్తే తప్పేముంది? వెయ్యొచ్చు గాని, కొద్ది క్షణాల్లో ఎటూ ఈ వ్యవహారమంతా తేలిపోతుంది. ఇంతోటి దానికి తినబోతూ రుచెందుకు?

పోనీ ప్రసాదమైనా తిని వస్తే? జీవితం కూడా ఒక పూజ లాంటిదే. కాకపోతే, ఇందులో ప్రసాదం ముందే దొరుకుతుంది. బాల్య యౌవనాలే దాని ప్రసాదాలు. అవి అనుభవించాక, అంత నిష్టగానూ పూజ కొనసాగించాలి. పూజ ముగించినట్టుగానే ముగించాలి — తెలుగు మేష్టారు ఎప్పుడో చెప్పిన ఉపదేశం. పూజని జీవితంలో ఒక భాగంగా ఎప్పుడూ భావించలేదు. ఇక జీవితాన్ని పూజలా ఎలా సాగిస్తాను? అందువల్ల, ఇప్పుడు చేస్తున్న పని ఏదో పూజ మధ్యలో లేచిపోయినట్టుగా అనుకోవటమూ సరికాదు. అసలు వ్రతమే లేనిది, వ్రతభంగం ఎక్కడుంటుంది.

మరో రెండడుగులు వేస్తే హిందీ మేష్టారి ఇల్లు. మంచి ఒడ్డూ, పొడుగూ ఉన్న ఆజానుబాహువు మేష్టారు. ఇంకా ఉండి ఉంటారా? అప్పటికే ఏభై వస్తూ ఉండాలి. ఇంకా ఎక్కడుంటారు. మీ వాడి పరీక్ష చెట్టెక్కిందండీ, తెలివితేటలున్నాయి గాని, శ్రద్ధ లేదు. ఇలా ఒకసారి కాదు. మానేసే దాకా ఇంతే. ఎందుకు చదివినట్టో, ఎప్పుడూ రుచించని ఆ హిందీ. ఆ ఇంటికి ట్యూషన్‌కి వెళ్ళటం, అరడజను ఆడపిల్లల సంతానంతో అక్కడ జరిగే సందడి చూడటం ఒక సరదా. ఇంటి వెచ్చాలు కూడా తన దగ్గర తాళం వేసి పెట్టుకునే జాగ్రత్తపరుడు మేష్టారు. నాన్నా, అమ్మ కొత్త సబ్బు బిళ్ళ అడిగి తీసుకు రమ్మంది.

అంత చిన్న పరీక్ష ఎలా తప్పావురా? నాన్నగారూ, జీవితంలో ఎదురైన వైఫల్యాల్లో అది మొదటిదీ కాదు, చివరిదీ కాదు. ఐతే, మీరు చూడలేదు గాని, నేను సాధించిన విజయాలు కూడా కొన్ని ఉన్నాయి. విజయాల వల్లనే కదా, నేను ఒంటరినయింది. అలాగని వదిలిపెట్టిందేదీ లేదు. అనుభవించవలసినవన్నీ అనుభవించాను. ఎవరికీ అన్యాయం చెయ్యలేదు నాన్నగారూ! అన్ని బాధ్యతలూ పూర్తి చేశాను. నేనేమీ చిన్నవాడిని కాదు కదా. చూడండి ఒక పన్ను కూడా కదులుతోదప్పుడే.

దంతంబుల్ పడనప్పుడే, తనువుయందారూఢి యున్నప్పుడే,
కాంతా సంఘము రోయనప్పుడే, జరా క్రాంతంబు కానప్పుడే…

వెళ్ళిపోవటం మంచిది. ఎప్పుడో దీనంగా, హీనంగా బ్రతిమాలి చేతులు జోడించేకన్నా, ఇప్పుడే ఎదురు వెళ్ళి దృఢ చిత్తంతో కౌగలించుకోవటమే మంచిది.

రైలు పట్టాలు వచ్చాయంటే ఇంక దగ్గరికి వచ్చేసినట్టే. ఎందుకు వెళతార్రా, అటు వైపుకి? వెళ్ళద్దు, పిల్లలతో కలిసి పట్టాలు దాటొద్దని నీకెన్నిసార్లు చెప్పాను? ఇదే చివరిసారమ్మా ఈ పట్టాలు దాటటం. పోనీలే, ఏ పవన్‌గాడి లాగానో పదో క్లాసు ప్రేమలోనే అలిగి, పట్టాల మీద అలకపానుపు పరచలేదు కదా నేను. ఎంతగా ఏడ్చారు శర్మగారు ఆ రోజు! ఊరుకోండి శర్మగారూ, ఊరుకోండి. రుణం తీరింది వెళ్ళిపోయాడు. అందుకే వెధవ రుణం ఉంచుకోకూడదు. వచ్చి తీర్చుకుని, కడుపుకోత మిగిల్చి వెళ్ళిపోతారు.

వెనక ఎవరైనా వస్తున్నారేమో ఒకసారి తిరిగి చూస్తే మంచిది. వెళ్ళిపోయేటప్పుడు ఎవరూ వెంట రారన్నది తెలిసిన మాటే గాని, వెళ్ళేవరకైనా ఎవరైనా తోడుంటారో లేదో అన్నదే అసలు ప్రశ్న. ఒకసారి మా ఊరు చూసి వస్తాను. ఎందుకూ? అసలు నీ చిన్నప్పుడెప్పుడో మీ నాన్నగారు ఆ ఊళ్ళో పనిచేసినంత మాత్రాన, అది మీ ఊరెలా అయిందో నా కెప్పటికీ అర్థం కాదు. ఏదో రకంగా ఇంత దూరం వచ్చి హాయిగా బతుకుతున్నాం. ఇప్పుడేం మునిగిందని అక్కడిదాకా పోయి చూడటం. మునిగిపోయాక వచ్చి చూస్తారా? ఏమో.

ఎంత బాగుంది ఏరు! అమ్మలా నిండుగా, దయగా పారుతోంది. చిన్నప్పుడు చాలాసార్లు వచ్చినా, ఎప్పుడూ ఒడ్డున నిలబడి చూడటమే. ఈత వచ్చిన మిత్రులు కొంతమంది లోపలికి వెళ్ళి స్నానాలు చేసేవాళ్ళు. మాతృగర్భంలోకి ప్రవేశించినట్టు ఈ రోజు దీనిలోకి మొదటిసారిగా ప్రవేస్తాను. చల్లటి నీళ్ళు నెమ్మదిగా పాదాలు తాకుతున్నాయి.

అకాల మృత్యుహరణం. సర్వవ్యాధి నివారణం. సమస్త పాపహరణం. శ్రీ… పాదోదకం పావనం… దోసిట్లో తీసుకున్న నీళ్ళు మిగిలిన క్షణాల్లా నెమ్మదిగా జారిపోతున్నాయి. మూసిన కను రెప్పల వెనుక ప్రపంచం మాయమయింది. అంతా ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉంది. దూరంగా ఎక్కడిదా పిలుపు. నన్నెవరన్నా పిలుస్తున్నారా? లేక అది నా భ్రమా?