చిన్నారి – దేవత

అదాటుగా కమ్మిన మబ్బులు
ఆకాశాన్ని దాచేశాయి
ఒకే దిక్కుగా ఈదురుగాలులు
ప్రపంచమంతా వీచాయి
పిల్లి దొర్లించిన గాజుకుండలా
భూగోళం దొర్లింది
ఉలిక్కిపడింది మానవజాతి

స్వరం – వైరముత్తు; సంగీతం – ఇళయవన్

అప్పుడే జరిగిందది
ఆకాశంలో ఓ మెరుపుతీగ
మెరిసి పెరిగి వెలుతురయ్యింది
వెలుతురు విరిసి
రెక్కలు తొడిగిన దేవతైంది
సాచిన రెక్కలనాడిస్తూ
ఆ దేవత అన్నది

త్వరలో పగులనుంది భూగోళం
నా రెక్కలపై ఎక్కినవారికి
మరో గ్రహానికి ప్రయాణం
రెండే రెండు షరతులు
ఏడుగురు మాత్రమే ఎక్కవచ్చు
మీకు నచ్చిన ఒక వస్తువు మాత్రం
వెంట తెచ్చుకోవచ్చు

కండలు తిరిగిన కుర్రాడొకడు
ఎక్కాడు మొరటుగా రెక్కలు నలిగేట్టు
వాడి చేతిలో చిట్లిన గాజు
చనిపోయిన తన ప్రేయసి పెట్టిన
తొలిముద్దు జ్ఞాపకపు ముక్క

గ్రహాంతరం వెల్తున్న మా అన్న
కలకాలం వర్ధిల్లాలి
ఆవేశపు తమ్ముళ్ళ నినాదాల మధ్య
రెక్కలెక్కాడు ఓ రాజకీయనాయకుడు
కొత్త బంగారు కడియం తీసి పడేసి
పాత చేతివాచీ పెట్టుకున్నాడు
గడియారపు నాడిలో కొట్టుకుంటుంది
సీక్రెట్ ఎకౌంటు స్విస్ బేంక్ నంబరు

ఇంకా బతికే ఉండి తన బాధను
పదేపదే దగ్గుతూ పదిమందికీ
పంచుకుంటున్న రోగి ఒకడు
జనాల తొక్కిసలాటలో ఒక పక్కగా
రెక్కపైకి నెట్టుకొచ్చాడు
భద్రంగా చేతులో మందు సీసా
అడుగున మిగిలిన అర ఔన్సు ఆయుష్షు

సానుభూతి అలపై తేలుకుంటూ వచ్చి
రెక్కలెక్కాడు ఒక కవి
భుజాన సంచీలో
అచ్చుతప్పులతో అచ్చేసుకున్న
తన మొదటి కవిత

సున్నితంగా తాకిన చేతిస్పర్శకు
విడిపోయి దారి చూపిన జనసముద్రం
ఆరాధనల ఎర్రతివాచీపై తేలుతూ
రెక్కలు చేరిందొక శీమాటి
జారిన కొంగును కాదు సుతారంగా
చెరిగిన కురులను సవరించుకుంది
ఆమె హ్యాండ్‌బ్యాగ్‌లో
అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డు

నలగని ఖాకీ దుస్తుల్లో
నలిగిపోయిన ఓ ఆడ పోలీసు
లాఠీతో లాలనగా దారి చేసుకుని
ఝామ్మని రెక్కల పైకి దూకింది
లాఠీ విసిరేసి – ఒక
వేణువు అందుకుంది

ఒకరు
ఇంక ఒకే ఒకరు
అన్నది దేవత

గుంపులో నుంచి
పరికిణీ వేసుకున్న ఒక పసిపాప
మనసూ, మేనూ
రెండూ పసిడి మొగ్గలే
తన బుజ్జి కుక్కపిల్లతో
రెక్కలపైకి దూకింది

అన్నది దేవత
కుక్కపిల్ల
వస్తువు కాదు – ప్రాణం
దానిని దింపేయ్
అయితే కుక్కపిల్లను ఉండనీ
నేను దిగిపోతాను
అన్నది చిన్నారి

దేవత తనువెల్లా చలించింది
మానవత ఆ దేవతను వణికించింది
గగురుపాటులో చెల్లాచెదురుగా
పడిపోయారు రెక్కలెక్కినవారు
ఆకాశంలోకి ఎగిరిపోయింది ఆ దేవత
చిన్నారినీ, ఆమె పెంపుడు కుక్కపిల్లనీ
తన వెంట తీసుకొని


(మూలం: తమిళ కవి, కవిరారాజు వైరముత్తు, పెయ్యెన పెయ్యుం మళై (కురవమనగా కురిసే వర్షం) కవితా సంపుటి నుంచి సిఱుమియుం తేవదైయుం అన్న కవిత.)