ఊహాతీతం

శివయ్య ఎన్నికలలో నిలబడ్డ రోజుని తెలుగు ప్రజల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజని కొందరంటే, మీడియా కాకిలా అరుస్తోందని ఇంకొందరన్నారు. శివయ్యని మహాత్మాగాంధీతో పోల్చి సత్యసంధుడన్నవారు కొందరయితే, అతనికి బకాసురుడనే నామధేయాన్నిచ్చింది వేరెవరోకాదు – అప్పటికే ఎన్నికైన ప్రజాప్రతినిధులు. శివయ్యని ముందు దూదిపింజకింద తీసేసిన మీడియా అతనికి ఇంటర్వ్యూలని ప్రసాదించడంతో అతని పేరు ప్రజల నోళ్లల్లో నానడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అతని పట్ల టీవీ యాంకర్లు ప్రదర్శించిన వ్యంగ్యధోరణి అతణ్ణి ప్రజలకి దగ్గరగా చేర్చిందనే చెప్పుకోవచ్చు. ఏ ఇంటర్వ్యూలోనయినా గానీ ఒకటీ రెండు పదాల తేడాతో అతణ్ణి అందరూ అడిగిన మొదటి ప్రశ్న — ‘నన్ను గెలిపించండి, నేను ఇన్నివేల కోట్ల రూపాయలని వెనకేసుకుంటాను,’ అని చెప్పడానికి సిగ్గులేదా? అని. అతను ఇచ్చిన సమాధానం (ఒకటీ రెండు పదాల తేడాతోనే):

“ఇప్పటిదాకా ఎన్నుకోబడ్డవాళ్లెవరినీ ఎంత వెనకేసుకున్నారని మీరడగలేదు, వాళ్లు చెప్పలేదు. ఎన్నికయిన తరువాత వెనకేసుకున్నారంటూ వాళ్ల స్థిర, చరాస్తుల వివరాలని ఋజువులతో మీరు ప్రచురించినా వాళ్లకి చీమ కుట్టినట్టుగా కూడా లేదు. వాళ్లు గనులని కొల్లగొట్టినా, చందనపు అడవులని స్వాహా చేసినా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత అలాంటి ఉద్దండులని విజయవంతంగా న్యాయస్థానంలో విచారణ జరిపి వాళ్లని శిక్షించిన దాఖలాలేం లేవు. ఒకానొక కాలంలో రాజకీయ నాయకులు లంచాలు తింటూ పట్టుపడ్డారని ఆడియో రికార్డింగ్ వినిపించగానే పార్టీల అధిష్ఠానాలు వాళ్లను పదవుల్లోంచి తొలగించేవి. ఈనాడు విడియోలు చూపించినా కూడా అణువంతయినా సిగ్గులేకుండా ఆ విడియోలు తీసినవాళ్ల ఎజెండా ఏమిటోనన్న ప్రశ్నని లేవదీసి, ఇన్వెస్టిగేషన్ అంటూ ప్రభుత్వపు సంస్థలనన్నింటినీ వాళ్ల మీదకి ఉసిగొల్పి, వాళ్లని కోర్టుల చుట్టూ తిప్పించడమే కాక, వాళ్ల ఇళ్ల మీద దుండగుల చేత దాడులు చేయించినా, మీ మీడియావాళ్లే కాక ప్రజలు కూడా ‘కాలంతీరు’ అంటూ ఎవరి పనులు వాళ్లు చేసుకుంటున్నారు. రెండు మూడు రోజుల తరువాత మీ మీడియావాళ్లకి మరో హాట్ టాపిక్ దొరుకుతుంది – అది రాజకీయాల గూర్చే కానక్ఖర్లేదు, సినిమా తారల పెళ్లి గూర్చో లేక విడాకులగూర్చో కూడా కావచ్చు. అందుకే, సిగ్గు ఉండకూడనిచోట అది దారికి అడ్డంరాకూడదని తెలుసుకున్నాను.”

మీడియాలో చర్చ మొదటగా శివయ్య మీదే జరిగింది. అతడు ఎక్కణ్ణించి వచ్చాడనీ, అతని వెనక రాజకీయ హస్తాలు హస్తినలో గానీ బస్తీలోనే గానీ ఉన్నాయేమోనని ఆరాలు తీశారు. అతని పూర్తిపేరు సాంబశివరావనీ, అతను 1947 ఆగస్టు 15న పుట్టాడనీ, డాక్టరుగా అమెరికా వెళ్లిన తరువాత గొప్ప మందుని కనిపెట్టడంతో బోల్డంత డబ్బు చేసుకుని ముఫ్ఫయ్యేళ్లు నిండకుండానే మిలియనీరయ్యాడనీ, ఆ తరువాత ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ అయి, వై2కె సమయంలో కొత్తగా మొదలవుతున్న టెక్నాలజీ కంపెనీలల్లో ఇన్వెస్ట్‌ చేసి బిలియనీర్ అయ్యాడనీ, అయితే, అప్పటిదాకా మీడియాకి దూరంగా వుండడం వల్ల అతని గూర్చి అంత పెద్దగా ఎవరికీ తెలియలేదనీ తెలిసింది. వాళ్లకి అంతు పట్టని విషయమల్లా, అప్పటి దాకా రాజకీయాల్లో వేలు పెట్టినట్లు ఎక్కడా దాఖలాల్లేని మనిషి ఇంత హఠాత్తుగా ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి పదవికి పోటీ ఎందుకు చేస్తున్నాడన్నది.

శివయ్యకి ఒక పార్టీని తయారు చెయ్యడానికి పెద్దగా శ్రమ పడవలసిన అవసరం లేకపోయింది. అతన్ని ఎలా కాంటాక్ట్ చెయ్యాలో మీడియా ద్వారా తెలుసుకుని అతనికి డబ్బులు ఎదురిచ్చల్లా కొందరు అతని పార్టీలో చేరిపోయారు.

“ఇంతమంది మీ పార్టీ వైపుకు రావడానికి కారణం – మీరు వాళ్లకి ఎంత కొల్లగొట్టుకోవచ్చో చెప్పివుంటారు. కాదా?” అని నిలదీశాడో యాంకరుడు.

“తాటిచెట్టు ఎందుకు ఎక్కావంటే కల్లు తాగడానికి అని చెప్పడానికి నేనేమీ భయపడను,” అన్నాడు శివయ్య.

నోట మాటరాని ఆ యాంకరుడు “బ్రేక్” అని అన్నాడు.

“ఎంతడబ్బు వెనకేసుకుందామనుకుంటున్నారో చెప్పడంలో నిజాయితీ వుంది గానీ ఆ డబ్బు తీసుకోవడం లోనే నీతి లేదు,” అన్నాడు యాంకరుడు.

“చట్టాలు చేసినది నీతిని నిలబెట్టడానికే అయితే ఈనాడు ఇంతగా అవినీతి సంఘంలో నాటుకొని పోయేదే గాదు. ఈనాటి ప్రజాప్రతినిధులని అడగడానికి భయపడే ప్రశ్నలని నాకు సంధించడంలోనే మీకు నీతి ఏ మాత్రం వున్నదో తెలుస్తూనే వున్నది గదా!” అన్నాడు శివయ్య.

మళ్లీ “బ్రేక్” అన్నాడు యాంకరుడు.

శివయ్య పార్టీ అభ్యర్థులు ప్రతి నియోజకవర్గం లోనూ తమ తమ టార్గెట్లు ఎన్ని కోట్లో నిర్భయంగా చెప్పారు. అంతేకాక వాళ్ల ప్రత్యర్థులకి సవాళ్లు విసిరారు కూడా – వాళ్లు ఎన్ని పదుల, వందల, లేక వేల కోట్ల పరిమితులకి కట్టుబడి వుంటారో చెప్పమని, అదే తామయితే అణాపైసలతో సహా లెఖ్ఖ చెబుతామనీను.

శివయ్య పార్టీ కొత్తది కాబట్టి అప్పటికే దశాబ్దాల చరిత్ర వున్న రాజకీయ పార్టీలన్నీ కుమ్మక్కై ఆ సవాళ్లకి జవాబులు చెప్పకూడదని నిర్ణయించుకున్నాయి. వాళ్ల నిర్ణయాలకి కారణం, అలాంటి సవాళ్లు విసిరింది తామెంత అవినీతిపరులో నిర్ధారించడానికి శివయ్య వేసిన ఎత్తు కావచ్చనీ, సవాళ్లని తాము స్వీకరించగానే శివయ్య తన పనయిందని పెద్దగా నవ్వేసి ఈల వేసి గోల చేస్తాడేమోననీను. అలాగని ఎన్నికలలో గెలవడానికి వాళ్లు తమ ప్రయత్నాలనేమీ ఆపలేదు; హాజ్‌ కోసం ఉచితంగా మక్కాకి టిక్కెట్లిప్పిస్తామని ఒక పార్టీ అంటే, కేదార్‌నాథ్, బదరీనాథ్ యాత్రలకి టిక్కెట్లిప్పిస్తామని మరొకపార్టీ, జెరూసలానికి పంపిస్తామని వేరొక పార్టీ, నాస్తికులకి అంతరిక్ష యాత్రలకి టిక్కెట్లిప్పిస్తామని ఇంకొక పార్టీ వాగ్దానాలు చేశాయి.

“గెలిస్తే మీరేం చేద్దామనుకుంటున్నారు?” అనడిగిందో యాంకరి.

“ప్రజల కోసం – అని మీరనలేదు. నేను ఇప్పుడు ఏమయినా చెప్పినా, మీరు మీ వాగ్దానానికి కట్టుపడివుంటారని మేమెందుకు నమ్మాలి? అని ఎదురుప్రశ్న వేస్తారు. అందుకని, వాళ్లు చేసేదానికీ, నేను చేసేదానికీ పెద్ద తేడా ఉండదనుకోండి. కాకపోతే, నేను చవగ్గా చేసి పెడతానంతే,” అన్నాడు శివయ్య.

“సవారీ కోసం పోటీపడే భోగందాన్లా మాట్లాడుతున్నారు,” అన్నదా యాంకరి నిరసనగా.

“పాపం రాజకీయాలతో పోల్చి పొట్టకూటి కోసం భోగంవాళ్లు పడే తిప్పలని ఎందుకు తల్లీ కించపరుస్తావు?” తిరిగి ప్రశ్నించాడు శివయ్య.

“వాళ్లు రకరకాల వాగ్దానాలు చేస్తున్నారు కదా! ఉదాహరణకి మక్కాకీ, జెరూసలంకీ, అంతరిక్షయాత్రలకీ టిక్కెట్లిప్పిస్తామంటున్నారు!” అన్నదా యాంకరి మాటమారుస్తూ.

“అవి జరిగేవి కాదని మీకు తెలుసు. అయినా మీరు వాళ్లని ప్రశ్నించరు. ఎన్నికల్లో వాగ్దానాలు నీటి మూటల వంటివని ఈ మధ్య జరిగిన ఏ ఎన్నికలు చూసినా తెలుస్తుంది.”

“అవే కాక, పరిశ్రమలు స్థాపిస్తామనీ, కాలువలు తవ్విస్తామనీ, డాముల్ని కట్టిస్తామనీ, వేతనాలు సవరిస్తామనీ, ప్రతికుటుంబానికీ జీవనోపాధిని చూపిస్తామనీ…”

“మీరు చెప్పినవాటిల్లో మొదటి మూడింటికీ కొంత ప్రయత్నం జరుగుతుంది ఎన్నికల్లో మా పార్టీ గెలిచినా, గెలవకపోయినా. గాలి వీస్తూనే వుంటుంది. నీరు పారుతూనే వుంటుంది. అయితే, గాలీ, నీరూ లాగా కాక, వాటివల్ల లాభాలు సామాన్య ప్రజలకంటే ఆ పరిశ్రమల కాంట్రాక్టుల లబ్ధిదార్లకే ఎక్కువ అన్న విషయం నాకంటే మీకే ఎక్కువ తెలుసు. వేతనాల సవరణ ముసలెద్దు నడకలాగా మెల్లగా అప్పుడప్పుడూ జరుగుతూంటుంది. ప్రతీ కుటుంబానికీ జీవనోపాధిని చూపించడమనేది ఇప్పటిదాకా జరగలేదు, ఇకముందు జరుగుతుందనడానికి దాఖాలూ లేవు,” అన్నాడు శివయ్య.

శివయ్య పార్టీతో పోటీ పడుతున్నవాళ్లు శివయ్య గూర్చి మాట్లాడకూడదని ఎంత పట్టుదలతో వున్నా మీడియా వాళ్లని వేధించి, వాళ్ల దగ్గరినుంచి జవాబులని రాబట్టేదాకా వదల్లేదు.

“అమెరికా దుష్ప్రభావం ఆ శివయ్య మీద ఎంత వున్నదో తెలియట్లేదా? మన భారతదేశం ఎంత గొప్పది? నీతీ, నిజాయితీ, సత్యం, ధర్మం అన్నింటికీ మనదేశం పుట్టినిల్లు అని గుండెలు చరుచుకుంటూ గొప్పలు చెప్పుకోవాల్సింది పోయి – మన పరుచూరి బ్రదర్స్ రాసినట్టు ‘పొగడరా నీతల్లి భూమిభారతినీ’ అని అనవలసింది పోయి, నేను అవినీతిపరుణ్ణి అంటూ రొమ్ములు గుద్దుకునే పాశ్చాత్యుని గూర్చి అడిగే ప్రశ్నలకి జవాబు చెప్పాల్సి రావడం ఈనాడు తెలుగు ప్రజలు చేసుకున్న ఖర్మ వల్ల కాక మరెందువల్లో మాకు ఏమాత్రం తట్టడం లేదు,” అన్నారు వాళ్లు.

“గెలిచిన తరువాత వాళ్లు ఒక్కొక్కళ్లూ ఎంత వెనకేసుకుంటున్నారో లెక్క చూపిస్తామని చెబుతున్నారు గదా, వాళ్ల వెబ్‌సైట్స్‌లో పెడతామంటున్నారు గదా, అది ఈనాడు జరుగుతున్న దానికంటే నయం కాదా?” అనడిగాడు వెన్నుపూస వున్న ఓ యాంకరుడు.

“అంటే, నేను ప్రజల డబ్బుని చెప్పకుండా వెనకేసుకుంటున్ననేగా దానర్థం?” అని ఆ నాయకుడు రెచ్చిపోయేసరికి యాంకరుడి వెన్నుపూస కాస్తా వెన్నపూసగా రూపాంతరం చెందింది. అయితే, టీవీలో ఎంతసేపు మొహాన్ని చూపిస్తే అంత మంచిదని గుర్తుకొచ్చిన ఆ నాయకుడు, “అంత ధైర్యంగా వాళ్లే చూపిస్తున్నప్పుడు మన యాంటీ కరప్షన్ బ్యూరోలూ, సీబీఐలూ, ఇన్‌కం టాక్స్‌వాళ్లూ చేతులకి గాజులేసుకుని కూర్చోరు,” అంటూ మాటమార్చాడు.

“వందల్లోనూ, వేలల్లోనూ తమది కాని డబ్బుని తీసుకునేవాళ్లు చేసేది దొంగతనం. లక్షల్లో, కోట్లల్లో డబ్బులు చేతులు మారితే దాన్ని దొరతనమంటారు. దొరతనాన్ని విచారణ జరపడానికి పవిత్రభారతదేశంలో న్యాయస్థానాలు ఇంకా పుట్టలేదు,” అన్నాడు శివయ్య. కోటిరూపాయలకే అమ్ముడుపోయే న్యాయాధిపతుల గూర్చి ప్రజలు వినేవున్నారు గనుక వాళ్లకా జవాబు సమంజసం గానే అనిపించింది.

“ఇన్ని వేల కోట్ల రూపాయలని వెనక వేసుకుంటాను అని బాహాటంగా చెప్పగలిగే ధైర్యం మీకెలా వచ్చింది?”

“ఇంతకు ముందు వున్న ప్రభుత్వపు నాయకులు ఎనిమిదేళ్లల్లో వెనకేసినంత డబ్బుని ఇప్పుడున్న ప్రభుత్వపు నాయకులు నాలుగేళ్లలోనే లాగేశారు. ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఐదుశాతం తనదంటే, తరువాతి వారు పదిశాతం తమదన్నారు. ఇది అందరికీ తెలిసిన సత్యం. ఈ ప్రభుత్వాలకి ప్రజలు చూపిన ఆదరణే నాకీ ధైర్యాన్నిచ్చింది.”