ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్.

శాస్త్రీయ సంగీతం గురుముఖంగా నేర్చుకోకుండా అద్భుతంగా పాడేవారు అరుదుగా కనిపిస్తారు. అలాంటి వారిలో ప్రముఖంగా చెప్పుకోవలసిన వ్యక్తి శ్రీ ప్రతివాది భయంకర శ్రీనివాసాచార్యులు. సంగీత ప్రియుల హృదయాల్లో ‘పిబిఎస్‌’గా స్థిరపడ్డ ప్రముఖ సినీ సంగీత నేపథ్యగాయకుడు ఈ సంవత్సరం ఏప్రిల్ 14 తారీకున, తన 82వ ఏట కాలం చేశారు. శ్రీనివాస్ ఇంటి పేరు ప్రతివాది భయంకర కావచ్చు గాని ఆయన ఒక అజాతశత్రువు. ఒక వ్యక్తి సౌజన్యాన్ని, సౌహార్దాన్ని, సౌశీల్యాన్ని ఏకగ్రీవంగా అందరు మెచ్చుకోవడం అరుదే. గాయకుడిగా పిబిఎస్ విశిష్టతను గుర్తు చేసుకోవటం కోసమే ఈ నివాళి వ్యాసం!


పి. బి. శ్రీనివాస్ (1930-2013)

తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో 22 సెప్టెంబర్, 1930లో జన్మించిన పిబిఎస్ చిన్ననాటి జీవితం, చదువు కాకినాడలో జరిగింది. కాలేజీ పూర్తయిన తరువాత లా చదువు కోసం చెన్నై రావటం, సినిమాల్లో పాటలు పాడటం జరిగాయి. ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి జీవితంలో సినిమా పాటల ఘట్టం విశిష్టమైనది అయినా, పిబిఎస్ సాహిత్య రంగంలో సలిపిన కృషి కూడా ఘనమైనదే. ఈ వ్యాసంలో పిబిఎస్ పాడిన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం పాటల ప్రస్తావనే కాకుండా హిందీ పాటలను గురించి కూడా అక్కడక్కడ ముచ్చటించటం జరిగింది. (పాఠకుల సౌలభ్యం కోసం అక్కడక్కడా ఇతరభాషల పాటల సాహిత్యాన్ని, అర్థాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాం.) పిబిఎస్ సుదీర్ఘ సినీ జీవిత ప్రయాణంలో ఎన్నో ఘట్టాలున్నా, వాటన్నిటినీ ఇక్కడ పొందుపరచటం సాధ్యం కాదు కాబట్టి, ఈ విశిష్ట వ్యక్తి పాడిన కొన్ని పాటలను పాఠకులకు గుర్తు చెయ్యటం మా ముఖ్యోద్దేశం.

తెలుగు పాటలు

సాలూరి రాజేశ్వర రావు సంగీత దర్శకత్వంలో భీష్మ అన్న సినిమా 1960 దశాబ్దంలో విడుదల అయ్యింది. ఈ సినిమాలో అప్పటి ప్రముఖ సినీ తారలైన అంజలీ దేవి, కాంతారావులు నటించగా మనసులోని కోరిక, తెలుసు నీకు ప్రేమిక అన్న యుగళ గీతాన్ని అప్పటి నేపథ్య గాయకులైన సుశీల, పిబిఎస్ లచే పాడించారు. గీత రచన ఆరుద్ర. ఈ పాటని కల్యాణి రాగంలో బాణీ కట్టారు సాలూరి. కల్యాణి రాగాన్ని పరిచయం చేస్తూ ఈమాటలో గతంలో వచ్చిన రెండు వ్యాసాల్లో ఈ పాట ప్రసక్తి ఉంది. అతి లలితంగా వినటానికి ఈ పాట హాయిగా ఉన్నా, ఈ పాట పాడాలని ప్రయత్నిస్తే అంత తొందరగా పట్టుబడే పాట కాదు అన్న విషయం తెలిసిపోతుంది. పాట మొదలవుతూనే సుశీల గొంతులో పలికే ఆలాపన ఒక ఎత్తు. పిబిఎస్ గొంతులో వినిపించే ‘పడతి చేతి మహిమ వలన…’ అన్న మొదటి చరణం నుంచి పాట చివర దాకా సుశీల, పిబిఎస్‌ల యుగళ గాత్రం మరొక ఎత్తు.

మనసు లోని కోరిక తెలుసు నీకు- భీష్మ శ్రీ రఘురాం జయ రఘురాం – శాంతి నివాసం మనసు మనసు కలిసే – రంగుల రాట్నం

ఈ పాట ఒక ఉదాహరణగా చెప్పటానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది, భారతీయ సినీసంగీత ప్రపంచంలో మకుటాయమానంగా వెలిగిపోతున్న హిందీ సినీగీతాలకు ఆ రోజుల్లో నౌషాద్, శంకర్ – జైకిషన్, మదన్ మోహన్, ఎస్. డి. బర్మన్, సి. రామచంద్ర, వంటి హేమాహేమీలు బాణీలు కట్టారు. హిందీ భాష రాక పోయినా ఈ బాణీలు దేశంలో అన్ని ప్రాంతాలవారు పాడుకొనే రోజులవి. అలాంటి తరుణంలో, సాలూరి రాజేశ్వర రావు హిందీ బాణీలంత కమ్మగా తెలుగులో బాణీలు కట్టారు. అందుకు ఒక మంచి ఉదాహరణ ఈ పాట. ఇక రెండవ కారణం, ఎంతో మంది సంగీత దర్శకుల బాణీలు తన గొంతులో వినిపించిన పిబిఎస్‌కి ఒక గొప్ప ప్రశంస సంగీతదర్శకుల వద్ద నుంచి వచ్చేది — పాటకి బాణీ కట్టిన దర్శకుని అంచనాలకి మించి పాడతాడు అని. ఇది రెండవ కారణం. అప్పటికే ఘంటసాల వంటి అతి ప్రతిభావంతులైన గాయకులు ఉన్నా, సాలూరి రాజేశ్వర రావు ఈ పాటకి సుశీలకి తోడుగా పిబిఎస్‌ని ఎన్నుకోవటంలో పాటకి రావలసిన వైవిధ్యం పిబిఎస్ తేగలడనే నమ్మకం ఒక్కటే కారణంలా అనిపిస్తుంది.

1960 దశాబ్దంలోనే, శాంతినివాసం అన్న సాంఘిక చిత్రం విడుదలయ్యింది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు అమర గాయకుడు ఘంటసాల. ఈ సినిమా మొదట్లోనే హంసధ్వని రాగంలో శ్రీరామచంద్ర అన్న శ్లోకము, ఆ వెంటనే శ్రీరఘురాం జయ రఘురాం అన్న యుగళ గీతం అదే రాగంలో నడుస్తాయి. ఈ శ్లోకాన్ని ఆలపించినవారు పిబిఎస్. ఆ తరవాత వచ్చే యుగళ గీతం కూడా సుశీల, పిబిఎస్ లచే పాడించారు ఘంటసాల. ఘంటసాల తాను స్వయంగా ఈ చిత్రానికి సంగీత దర్శకుడై ఉండి కూడా పిబిఎస్ చేత ఈ సినిమాలో పాడించటంలో ఆయన మీద ఉన్న నమ్మకం ఎలాంటిదో తెలుస్తుంది.

ఎంతో కాలం శాస్రీయ సంగీతం నేర్చున్న వారు కూడా పాడలేని పాటలు అతి సునాయాసంగా పి. బి. శ్రీనివాస్ పాడటం వింటూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. బి. ఎన్. రెడ్డి దర్శకత్వం – సాలూరి సంగీత దర్శకత్వంలో వచ్చిన ఒక మంచి సినిమా రంగుల రాట్నం. ఈ సినిమాలో మనసు మనసు కలిసే వేళా అనే పాట పిబిఎస్ పాడిన పాటలలో ఒక కలికి తురాయి. ఈ పాట బాణీ పట్‌దీప్ రాగంలో కట్టబడింది. హిందూస్తానీ రాగ ప్రధానంగా బాణీలు కట్టిన సినీ గీతాల్లో అరుదుగా వినిపించే ఒక రాగం పట్‌దీప్.

పాటలో శ్రావ్యత

పిబిఎస్ పాటల్లోని శ్రావ్యత గురించి ప్రస్తావించే ముందు సంగీతంలోని కొన్ని ప్రాథమిక విషయాలు గుర్తుకి తెచ్చుకోవాలి. పాటలు పాడేవారికి ఉండవలసిన ఒక ముఖ్యగుణం శ్రుతి నిర్ణయం – పాట పాడుతున్నంత సేపు శ్రుతి తప్పకపోటం. అంటే పాట శ్రుతి శుద్ధంగా ఉండాలన్నమాట! ఒక్కొక్క గాయనీ – గాయకుల సమర్థత బట్టి శ్రుతి నిర్ణయం జరుగుతుంది. సాధారణంగా గాయనీమణుల శ్రుతి తక్కువ గాను, గాయకుల శ్రుతి కొంచెం హెచ్చు స్థాయిలోనూ ఉంటుంది. ఇందులో మళ్ళీ కర్నాటక గాయకుల శ్రుతి స్థాయి హిందూస్తానీ గాయకుల శ్రుతి స్థాయి కన్నా కొంచెం తక్కువగా ఉంటుంది. ఈ శ్రుతి స్థాయిల్లో మినహాయింపులు లేకపోలేదు. పిబిఎస్ గొంతు లలితంగా పలికే శ్రుతి స్థాయి 1. వెస్ట్రన్ భాషలో చెప్పాలంటే C స్కేల్. ఘంటసాల, బాలమురళి కృష్ట్ణ వంటి గాయకుల శ్రుతి స్థాయిలు C స్కేల్‌తో మొదలయ్యినా తారస్థాయిలో షడ్జమం దాటి, మ, ప స్వరాల వరకు కష్టపడకుండా సులభంగా చేరగలరు. కొంతవరకు ఘంటసాల కొన్ని పాటల్లో పై శ్రుతిలో పాడుతున్నప్పుడు, గొంతులో లాలిత్యం లోపించి గాయకుడు శ్రమపడుతున్నాడని తెలిసిపోతుంది. ఇక, శ్రుతి 1లో మొదలయ్యి తారస్థాయిలో గాంధారం దాకా లలితంగా పాడటం పిబిఎస్ నేర్పు. గాంధారం దాటి మధ్యమం, పంచమం దగ్గరకి వచ్చేసరికి పిబిఎస్ గాత్రంలో మార్దవం లోపిస్తుంది. అయితే, తను శ్రమ పడకుండా పాడగలిగే స్థాయిల్లో పిబిఎస్ మరెవరూ చూపలేని లాలిత్యన్ని తన పాటల్లో చూపించారు. అందుకే, ఆయన పాటల్లోని లాలిత్యాన్ని మరొకరు తీసుకురాగలగటం కష్టం!

ఏమి రామ కథ శబరి! శబరి! అది ఒక ఇదిలే – ప్రేమించి చూడు అదిగో మనప్రేమ – ఉషాపరిణయం చిన్నారి చేతులా – అన్నాతమ్ముడు

పిబిఎస్ పాడిన ఎన్నో తెలుగు సినిమా పాటలలో కొంత విలక్షణంగా వినిపించే పాటలు 1960లో వచ్చిన ఒక సినిమాలో ఉన్నాయి. ఆ సినిమా పేరు భక్త శబరి. ఆ సినిమా సంగీత దర్శకుడు పాలగుమ్మి విశ్వనాథం. ఈ సినిమా సంగీత దర్శకుడిగా పెండ్యాల నాగేశ్వర రావు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఈ సినిమాలో రాగ మాలికగా సాగే పాట ఏమి రామ కథ శబరి! శబరి! పిబిఎస్ ఒకసారి, మరోసారి పి. సుశీల పాడారు. ఈ బాణీలు సినిమాలో ప్రవేశపెట్టక ముందు రేడియో కోసం పాలగుమ్మి రూపొందించారు. పాటల్లో లలిత సంగీతం అంటే ఎలా ఉండాలో నిర్వచనం చెప్పిన అతి కొద్ది మంది మహామహులలో పాలగుమ్మి విశ్వనాథం గారు ఒకరు. ఈ పాట జాగ్రత్తగా వినండి. ఎంత లలితంగా సాగుతుందో ఈ పాట. దేవులపల్లి కృష్ణశాస్త్రి (పాలగుమ్మి పద్మరాజు ఉచిత సలహాతో) గొప్ప పాటలు రాసిన ఈ సినిమాకి జీవకథ రామకథ. అయితే ఈ జీవ కథలో రససుధ ఈ పాట.

రావే రావే బాలా – కులగోత్రాలు గో గో గో గో గోంగూర

ఇప్పుడు కొన్ని తమాషా పాటలు చూద్దాం! పిబిఎస్ తెలుగు సినిమా పాటల్లో హాస్యరసం ముఖ్యంగా ఉన్న పాటలు ఎక్కువగానే పాడారు. సరదా పాటలు కాబట్టి వీటిని తేలికగా పాడవచ్చు అనుకొనేరు, అలా పాడటం నవ్వులాట కాదు! కులగోత్రాలు అన్న సినిమాలో సాలూరి సంగీత దర్శకత్వంలో, కొసరాజు రచనకు, పిబియస్ జమునా రాణితో కలిసి ‘రావే రావే బాలా, హల్లో మైడియర్ లీలా’ పాడారు. ఈ పాటకి జనాదరణ బాగా లభించింది. పాశ్చాత్య సంగీత పోకడలు కనిపించే ఈ పాట గమ్మతైన సాహిత్యంతో, అంతకన్నా గమ్మతైన సంగీతంతో, సాగుతూ శ్రోతలకు హుషారు కలిగిస్తుంది. విచ్చలవిడి శృంగారాన్ని సమర్ధించే ప్రియుడి కోరికలని, పచ్చి పచ్చి లవ్ చూపావంటే, పిచ్చాస్పత్రిలో వేస్తారు అన్న ప్రేయసి సమాధానం హాస్యరసాన్ని కురిపిస్తూ గమ్మత్తుగా సాగుతుంది. ఇలాంటి మరొక పాట ఇద్దరు మిత్రులు అన్న సినిమా కోసం సాలూరి బాణీ కట్టి పిబిఎస్, సుశీలల యుగళగీతంగా పాడించారు, చక్కని చుక్క సరసకు రావే ఒక్క సారి నవ్విన చాలే అని సాగే పాట. అలాగే తెలుగుదేశమంతా మారుమ్రోగి పోయిన మరో హాస్య గీతం (ఆరుద్ర రచన, అశ్వత్థామ సంగీతం) దేవాంతకుడు చిత్రంలోని గో గో గో గో గోంగూర, జై జై జై ఆంధ్ర అన్నది.