తులనాత్మక నేపథ్యంలో తెలుగు సాహిత్య వికాసం

కవి జీవితాలు, కవుల చరిత్రలు వచ్చిన రోజుల్లో కూడా సాహిత్య పఠనం, పరిశీలన జరగక పోలేదు. కందుకూరి వీరేశలింగం కవుల చరిత్ర రాసినా తెలుగు సాహిత్య స్వరూపాన్ని తెలపటానికి రాజమహేంద్రవరం నుంచి తంజావూరి వరకూ తిరిగి శ్రమించారన్నది మరిచిపోకూడదు. తెలుగులో వచ్చిన అన్ని సాహిత్య చరిత్రలూ విలువైన సమాచారాన్నే అందజేశాయి. పింగళి లక్ష్మీకాంతం లాంటి వారు బోధన, పరిశోధన ఇచ్చిన అవకాశాల వల్ల మరింత వివేచన జరిపి క్రమపద్ధతిలో సాహిత్యచరిత్రను అందజేయ గలిగారు. ఆంధ్ర సాహిత్యాన్ని గూర్చి ఎంత చెప్పినా అది సమగ్రం కాకపోయినా దొరికిన సామగ్రినంతటినీ అందంగా చెప్పగలిగారు ఆరుద్ర. విషయాలను పోగుచేయడమే గాని విశ్లేషణ తక్కువని ఆయన రచనను అంచనా వేసినవారు లేకపోలేదు. తెలుగులో కవితా విప్లవాల స్వరూపాన్ని విశదపరచటం ద్వారా వెల్చేరు నారాయణరావు సాహిత్యాన్ని కొత్తగా చూడటాన్ని పరిచయం చేశారు. సాహిత్య చరిత్రను రాయటం కన్న ప్రక్రియావికాసాన్ని పరిశీలించటం ఉత్తమమని జి. వి. సుబ్రహ్మణ్యం సూచించారు. విద్యార్థులను మాత్రమే దృష్టిలో ఉంచుకొని రాసిన సాహిత్య చరిత్రలు సమీక్షాగ్రంథాలుగా మిగిలిపోయాయి.

అన్ని రకాల సాహిత్యచరిత్రల్లోనూ అడపాదడపా తులనాత్మక పరిశీలన జరగకపోలేదు. తెలుగు సాహిత్య వికాసాన్ని పరిశీలించ బూనుకున్న వారు సంస్కృత సాహిత్య నేపథ్యాన్ని, ప్రభావాలను గమనించకుండా ముందుకు పోవడం సాధ్యం కాదు. తెలుగు సాహిత్య చరిత్రకారులందరూ కొద్దో గొప్పో సంస్కృత పరిచయం సంపాదించుకున్న వారే. దీనివల్ల కొన్ని లాభాలు, మరికొన్ని నష్టాలు ఏర్పడ్డాయి. తెలుగులో మార్గ సాహిత్య ప్రక్రియలు సంస్కృతం నమునాలోనే వచ్చినా దేశి సాహిత్య ప్రక్రియలు విశిష్ట ప్రణాళికతో వెలువడ్డాయి. దీన్ని సరిగ్గా గమనించక పోవటం వల్ల భాష, ఛందస్సు మొదలైన వాటి విశ్లేషణలో లాగే సాహిత్య వికాస పరిశీలనలో కూడా కొన్ని కొరతలు ఏర్పడ్డాయి. తెలుగు సాహిత్య స్వరూపాన్ని తెలియజెప్పాలనుకున్న వారు శిష్ట సాహిత్యానికి, లిఖిత సాహిత్యానికి మాత్రమే పెద్దపీట వేసి మౌఖిక సాహిత్యాన్ని, పద సాహిత్యాన్ని, యక్షగాన సాహిత్యాన్ని పెద్దగా పట్టించుకోకపోవటం లోపమే. ప్రపంచ సాహిత్యంలో తెలుగు ప్రతిభను నిలబెట్టాలంటే పండిత సాహిత్యం ఎంత ముఖ్యమో మౌఖిక సాహిత్యం (నోటినుంచి నోటికి ప్రసారమయ్యేది), పద సాహిత్యం (పాడటానికి కల్పించింది), యక్షగాన సాహిత్యం (అభినయంతో బాటు ఇతర కళలతో ఏర్పడ్డ దేశీయ సమాహార కళ) కూడా అంతే ముఖ్యం.

తెలుగు సాహిత్యాన్ని అటు సంస్కృతంతో, ఇటు దక్షిణ దేశీయ భాషలతో పోల్చి చూపుతూ సమగ్ర దృష్టితో వెలువడిన రచనలు చాలా తక్కువ. నిజానికి పాళీ ప్రాకృతాలు, అపభ్రంశం, ఇతర భారతీయ భాషల పరిచయమూ అవసరమే. ఒకే ఒక్క ఉదాహరణాన్ని ఇక్కడ చెప్పుకోవాలి.

నన్నయ్య కాలం నుండి విశ్వనాథ సత్యనారాయణ కాలం వరకు వెలువడిన సాహిత్యాన్ని మనం స్థూలంగా పద్యసాహిత్యమని చెప్తున్నాం కాని దాని స్వరూపాన్ని బట్టి చంపూ మాధ్యమమనాలి. తెలుగులో మహాకావ్యరచనకు తెలుగువాళ్ళు ఎంపిక చేసుకున్న ముఖ్యమైన మాధ్యమాలు చంపూ, ద్విపద అన్నవి. ఈ రెండిట్లో ద్విపద దేశీయ ఛందోమాధ్యమం. చంపూ అన్నది వివిధ పద్యాలను ఉపయోగిస్తూ అక్కడక్కడా గద్యభాగాన్ని కూడా చేరిస్తే ఒక విశిష్ట మాధ్యమం అవుతుంది. దండి లక్షణం చెప్పేటప్పుడు పద్య గద్యాలు కలిపి రాస్తే చంపూ అవుతుందని చెప్పినా ఆ పద్యాలు వివిధ ఛందోరీతులకు సంబంధించినవని అర్థం చేసుకోవాలి. పంప, పొన్న, రన్న లాంటి కన్నడ మహాకవులు చంపూ మాధ్యమాన్ని వాడారు. కన్నడంలో 10-11 శతాబ్దులనాటి సాహిత్యాన్ని చంపూయుగమనే అంటారు. కన్నడలో దాని ప్రాచుర్యాన్ని గమనించిన ఆర్. ఎస్. ముగళి లాంటి సాహిత్య చరిత్రకారులు ‘చంపూ’ అనే పదం కన్నడమని, కన్నడం నుంచే చంపూ మాధ్యమం సంస్కృతానికి వెళ్ళిందని అభిప్రాయపడ్డారు ఆర్. ఎస్. ముగళి. చంపూ గురించి మొదటి లక్షణం చెప్పిన దండి కూడా దక్షిణదేశం వాడే అనే అభిప్రాయం ఉంది కాబట్టి చంపూ మాధ్యమాన్ని దాక్షిణాత్యులే సృష్టించారని అభిప్రాయపడటం సహజమే.

అయితే ఆర్. ఎస్. ముగళి అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తూ సంస్కృత పండితులు కె. కృష్ణమూర్తి చంపూ మాధ్యమం ప్రాకృతంలో సా. శ. నాలుగు, అయిదు శతాబ్దాల నుంచే ఉన్న విషయాన్ని బయటపెట్టారు. ఈ విషయాన్ని ఆయన దండి కావ్యాదర్శం కన్నడ అనువాదానికి పీఠిక రాస్తూ ఈ విషయం ప్రస్తావించారు. దండి కావ్యాదర్శానికి పదో శతాబ్దిలోనే రత్నశ్రీజ్ఞాన అనే సింహళ పండితుడు గొప్ప వ్యాఖ్యానాన్ని రాశాడు. ఆ వ్యాఖనంలో ఆర్యశూరుని ‘జాతకమాల’ చంపూ కావ్యానికి ఉదాహరణమని రత్నశ్రీ జ్ఞానుడే. ఇలాంటి విషయాలను తెలుసుకోకుండా చంపూకావ్యాలను గురించి నిర్ణయాలు చేయడం మంచిది కాదని కె. కృష్ణమూర్తి సూచించారు.

తెలుగులో సంస్కృత ప్రాకృతాలు, దక్షిణ దేశీయ సాహిత్యాలు తెలిసి రాయగలిగిన వారు చాలా కొద్ది మంది ఉండేవారు. అలా అమూల్యమైన రచనల్ని చేసిన వారిలో కోరాడ రామకృష్ణయ్య ఒకరు. తిక్కన భారతాన్ని సంస్కృతంతో పోల్చి చూపినా, ద్రావిడ భాషల సామాన్య లక్షణాలను పరిచయం చేసినా, దక్షిణదేశ భాషా సారస్వతాలలో దేశిని గురించి రాసినా ఆయన అధికారవాణిలో చెప్పగలిగారు. ముఖ్యంగా దేశి ఛందస్సులను గురించి, ప్రక్రియలను గురించి ఆయన రాసినవి నిర్దుష్టంగా, లోతుగా, అలోచనల్ని ప్రేరేపించే విధంగా ఉండటానికి కారణం వివిధ భాషల పరిచయమే. అలాంటి వారి రచనల్ని పరిశీలించినప్పుడు మన సాహిత్య చరిత్రకారుల రచనల్లో లోపాలు దృష్టికి వస్తాయి. సంస్కృత ప్రాకృత మర్యాదలతో బాటు దాక్షిణాత్య భాషా సాహిత్య లక్షణాలు కూడా తెలిసి రాసిన వారిలో రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ, తిరుమల రామచంద్ర, రావూరి దొరస్వామి శర్మ, తిమ్మావజ్ఝల కోదండరామయ్య లాంటివారున్నారు. కాని వీరంతా కొన్ని విషయాల మీద మాత్రమే దృష్టి ఉంచి రాయటం వల్ల మనకు మొత్తం తెలుగు సాహిత్యాన్ని గూర్చిన అవగాహన కలగటం లేదు.

తెలుగు సాహిత్యాన్ని గురించి రాసిన వారెవ్వరూ జానపద సాహిత్యాన్ని పట్టించుకోకపోవటం వల్ల అపచారమే జరిగింది. సాహిత్యం సప్తగోదావరిలా ఉంటుంది కాని ఒక వాహినిగా ప్రవహించదు. కవిత్రయం, శ్రీనాథుడు, ప్రబంధకవులు, దక్షిణాంధ్ర వాఙ్మయం, ఆధునిక సాహిత్యం అనే పేర్లతో తెలుగు సాహిత్యాన్ని చెప్పేస్తే చాలనుకునేవారు మనలో చాలామంది ఉన్నారు. ఏ సాహిత్యాన్నయినా మొదలు పెట్టాల్సింది మౌఖిక సాహిత్యంతో. కాలనిర్ణయం చేయటం అసాధ్యమైనా తెలుగులో మౌఖిక సాహిత్యం గాథాసప్తశతి కాలం నుంచే ఉండి ఉండాలని తిరుమల రామచంద్ర ఉదాహరణలతో సహా నిరూపించారు. గాథా సప్తశతిలో పొలం పాటలను గురించి, పెళ్ళిపాటలను గురించి ప్రస్తావన ఉంది. అవి తెలుగు పాటలు కావడానికి అవకాశం ఉంది. గాథాసప్తశతి మాట ఎలా ఉన్నా తెలుగులో దొరికిన మొదటి పద్యశాసనం పండరంగని అద్దంకి శాసనం కాబట్టి దానిలోని తరువోజ ఛందస్సు కూడా పరిశీలనార్హమే. తరువోజ అచ్చమైన తెలుగు దేశి ఛందస్సు. తరువోజల్ని రోకటి పాటల్లో వాడుతారని ఆలంకారికులు చెప్పారు. అంతే కాదు, సంస్కృతంలోనూ, కన్నడంలోనూ లేని విధంగా యతిమైత్రి (సంస్కృతంలో యతి విరామమే కాని మైత్రి కాదు), ద్వితీయాక్షర ప్రాస (సంస్కృతంలో ప్రాస శబ్దాలంకారం మాత్రమే) అద్దంకి శాసనంలో ఉన్నాయి. కన్నడంలో ప్రాస ఉంది కాని యతి లేదు. తమిళంలో యతిప్రాసలను పోలినవి ఉన్నాయి కాని తెలుగులో లాగా లేవు. ఇవన్నీ కాక అద్దంకి శాసనంలోనే పద్యమూ, గద్యమూ రెండూ ఉన్నాయి కాబట్టి అప్పటికే గద్యపద్యాలను కలిపి రాసే సంప్రదాయమూ తెలుగులో ఉందని ఊహించవచ్చు. అంతేకాక రోకటిపాటల వంటి మౌఖిక సాహిత్యం తొమ్మిదవ శతాబ్ది నాటికే ఉందని ఊహించవచ్చు.

తెలుగులో లిఖిత సాహిత్యంతో బాటు అత్యంత విస్తృతంగా వెలువడిన జానపద సాహిత్యాన్ని, శతకం, ఉదాహరణం, దండకం, యక్షగానం లాంటి విశిష్ట ప్రక్రియల్ని, పాల్కురికి సోమనాథుడు, కొరవి గోపరాజు, కేతన, వినుకొండ వల్లభరాయడు, అన్నమయ్య, వేమన లాంటి కవుల్ని పెద్దగా పట్టింకోకపోవటం సాహిత్య చరిత్రలో ఒక లోపమని చెప్పుకోవాలి. రాజకీయాలు, సంఘం, మతం, తాత్విక ధృక్పథాలు మొదలైన వాటిలో మనిషి తన స్థానం వెతుక్కొనే అవకాశం గురించి ప్రస్తుతం విశ్లేషణ ఎక్కువగా జరుగుతోంది.

అవకాశమన్నది కేవలం స్థలావకాశం మాత్రమే కాక సాహిత్యంతో సహా అన్ని రంగాలలోని అవకాశానికీ వర్తిస్తుంది. నిరవకాశాలైన విధులు సావకాశాలైన విధుల్ని బాధిస్తాయని వ్యాకరణ శాస్త్రవేత్తలు చెప్పటం — నిరవకాశాహి విధయః సావకాశాన్ విధీన్ బాధన్తే — సాహిత్యానికీ వర్తిస్తుంది. ఒక కాలానికి నిరవకాశంగా మారిన సంస్కృత సాహిత్యం సావకాశం కల తెలుగును బాధించిందా అన్న విషయం పరిశీలించదగ్గదే. దీని మాట ఎలా ఉన్నా తెలుగువారు తమ సాహిత్యావకాశాన్ని ఏర్పరచుకొనేటప్పుడు కేవలం సంస్కృతం మీదనే ఆధారపడలేదని, ఇరుగు పొరుగు బాషలను కూడా గమనించారని తెలుసుకొని సాహిత్యవికాసాన్ని పరిశీలించాలన్నది ముఖ్యం.

(ఇంకా ఉంది.)


ఆధార గ్రంథాలు

  1. ఆరుద్ర, సమగ్రాంధ్ర సాహిత్యం, ప్రజాశక్తి బుక్ హౌస్, విజయవాడ,1989.
  2. కోరాడ రామకృష్ణయ్య, ఆంధ్ర భారత కవితావిమర్శనము, మద్రాసు, 1981.
  3. కోరాడ రామకృష్ణయ్య, దక్షిణదేశభాషాసారస్వతములు-దేశి, మద్రాసు, 1970.
  4. తిరుమల రామచంద్ర, గాథాసప్తశతిలో తెలుగు పదాలు, ప్రాకృత అకాడెమీ, హైదరాబాదు, 1978.
  5. ఆర్వీయస్ సుందరం, తెలుగు సాహిత్యములో దేశికవిత, నెల్లూరు, 1970.
  6. ఆర్వీయస్ సుందరం, దక్షిణ భారతీయ సాహిత్య, మైసూరు, 2002.
  7. ఆర్వీయస్ సుందరం, కన్నడ సాహిత్య చరిత్ర, ఆం.ప్ర.సాహిత్య అకాడెమి, హైదరాబాదు,1977.
  8. ఆర్. ఎస్. ముగళి, కన్నడసాహిత్య చరిత్రె, (19వ ప్ర.), గీతా బుక్ హౌస్, మైసూరు, 1993.
రాళ్ళపల్లి సుందరం

రచయిత రాళ్ళపల్లి సుందరం గురించి: రాయటం మొదలుపెట్టి సుమారు 50 ఏళ్ళు, రాసింది తెలుగు,కన్నడం ,ఇంగ్లీషుల్లో 90 పుస్తకాలు, పెక్కు పరిచయాలు, దేశవిదేశ యాత్రలు, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో తెలుగు బోధన  ...