కతికితే అతకదు

“ఒరే నాన్నా,

ఈ ఉత్తరంతో బాటు నేను మొన్న ఫోనులో చెప్పిన అమ్మాయి ఫోటో, వివరాలు పంపిస్తున్నాను. వీళ్ళది అనకాపల్లె. నీ స్నేహితుడు నారాయణ అనకాపల్లె లోనే ఉన్నాడు కదా? అతనికి బాగా తెల్సిన కుటుంబమే. అమ్మాయి నాన్నగారు శ్రోత్రీయులూ, అనేక భాషలూ చదువుకున్నవారు. దానికితోడు ఆయన విద్యుత్ శాఖలో ఇంజినీర్ గా రిటైర్ అయ్యేరు. సంస్కృతం మంచినీళ్ళ ప్రాయంగా మాట్లాడతారుట. నువ్వు అక్కడ్నుంచి అమ్మాయితో మాట్లాడ్డానికి ఫోన్ చేస్తావని అని చెప్పాము. ఒప్పుకున్నారు. ఫోన్ చేస్తే ఒళ్ళు దగ్గిరపెట్టుకుని మాట్లాడు.

ఇంకో విషయం. ఇది నీకు పంపిచే పద్దెనిమిదో ఫోటో. ఇదే ఆఖరు. నీకు ఈ అమ్మాయి కూడా నచ్చకపోతే నీ ఖర్మ. నేను నీకు ఇంక సంబంధాలు చూసేది లేదు. నీకు సిగ్గు లేకపోయినా ఎక్కే గుమ్మం దిగే గుమ్మంతో నాకు విసుగెత్తిపోతోంది.

అక్కడ అమెరికాలో నీ ఉద్యోగం అదీ బాగుందని తలుస్తాను. అమ్మ నీకు ఆశీర్వచనాలు చెప్పమంది.

ఇట్లు

నాన్న
వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు”

ఉత్తరం చదివి రామం నవ్వుకున్నాడు. ఫోటోలో అమ్మాయ్ నవ్వుతోంది. ఉత్తరం చేత్తో పట్టుకుని నడిచేడు అపార్టుమెంట్ లోకి. రాత్రి భోజనం అయ్యేక ముందు ఇంటికి ఫోన్ చేసి చెప్పేడు, ఉత్తరం వచ్చిన సంగతీ, తను ఆ రోజే ఫోన్ చేస్తున్నట్టూ. చివర్లో ఫోన్ పెట్టేసే ముందు రామం చెప్పేడు, మే నెలకి అక్కడికి వద్దామనుకుంటున్నాను. ఇప్పుడు టిక్కెట్ బుక్ చేసుకుంటే చవగ్గా దొరకొచ్చు అని. ఫోన్ పెట్టేసేటప్పుడు దీక్షితులు హెచ్చరించేడు రామాన్ని. “మాట్లాడేటప్పుడు జాగ్రత్త. అమ్మాయి నాన్న గారు పిచ్చి పిచ్చి వేషాలు వినే టైప్ కాదు” అనీ.

తర్వాత తీరిగ్గా రామం కాయితం మీద రాసేడు తాను అడగవల్సిన ప్రశ్నలూ అవీ. 1) వంట వచ్చా? ఛ, ఛ. మొదట్లోనే వంట గురించి అడగడం బాగుండదు. కొట్టేసి మళ్ళీ మొదలెట్టేడు. 1) మీ పేరు? ఏడిసినట్టుంది. తనకి పేరు తెల్సీ అడగడం ఏం బావుంటుంది? (కొట్టేసి మళ్ళీ,) 1) మీరు ఏమి చేస్తున్నారు ఇప్పుడు? ఏదో గుర్తొచ్చినట్టూ నాన్న పంపిన కాయితం ఫోటో చూసేడు. వైజాగులో భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసెల్స్లో ఇంజనీర్గా పనిచేస్తోంది అని రాశారు గదా? హతోస్మి. ఒక అరగంట కుస్తీ పట్టి మొత్తానికి ఒక లిస్టు తయారు చేసేడు రామం. కుదురుగా కూచుని ఫోన్ చేయడం మొదలెట్టేడు. అటువైపు ఎవరో చిన్న పిల్లవాడెత్తాడు.

“ఎవరు కావాలి?” దబాయింపుగా అడిగేడు.

“నా పేరు రామం. బాబు, మీ అక్క ఇంట్లో ఉందా?”

“ఏ అక్క, పెద్దక్కా చిన్నక్కా?”

గతుక్కుమన్నాడు రామం. ఇద్దరమ్మాయిలున్నారా? “సీతక్క బాబూ.”

“ఉంది. మావయ్యా, సీతత్త కోసం ఎవరో రామం ఫోన్ చేస్తున్నాడు.” అరిచేడు పిల్ల రాక్షసుడు.

“సీత అత్తా?” కళ్ళు తిరిగేయ్ రామానికి. ఇంతలోనే ఒక ఆడ కంఠం వినబడింది.

“హల్లో ఎవరు కావాలండీ?”

“నమస్తే. నా పేరు రామం. నేను అమెరికా నుంచి మాట్లాడుతున్నాను. మా నాన్న గారు మీ ఫోటో పంపించేరు. మీతో కాసేపు మాట్లాడటం కుదురుతుందా?” గౌరవంగా అడిగేడు.

తెరలు తెరలుగా నవ్వు. “హల్లో” అన్నాడు రామం.

“ఆ హలో! మరే, మీరు మాట్లాడవల్సింది నీతతో. సీత కాదు. పిలుస్తానుండండి.”

కళ్ళు తిరిగేయి రామానికి. మళ్ళీ ఒకసారి ఉత్తరంలో రాసిన పేరు చూసేడు. నీత బదులు సీత అని రాసినట్టుంది. ఒళ్ళు దగ్గిర పెట్టుకుని కూర్చున్నాడు రామం. నీత ఫోన్ ఎత్తాక కలగా పులగంగా తను ఎక్కడ చదువుకుందీ, ఆ కాలేజీలో తనకి తెల్సిన వాళ్ళు ఉన్నారా అలా అలా పనికిరాని చెత్త మాట్లాడి, మొత్తమ్మీద తను మే నెలలో వస్తున్నట్టూ అప్పుడు కలుసుకోవడం వీలైతే చూద్దాం అనడంతో మాట్లాడ్డం పూర్తయింది. ఫోన్ పెట్టేసేటప్పుడు అడిగేడు,

“మొదట ఫోన్ ఎత్తిన కుర్రాడు మీ తమ్ముడా?”

“లేదు మా పక్కింటి అబ్బాయి,” వచ్చింది సమాధానం.

ముక్కస్య ముక్కార్ధంగా మాట్లాడినట్టనిపించింది రామానికి. కొంచెం అశాంతిగా అనిపించింది కాదూ?


మరో వారం గడిచేక మళ్ళీ ఫోన్ చేసేడు రామం నీతకి. ఈ సారి మొదట్లోనే నీత నాన్న శాస్త్రి గారు ఎత్తేరు ఫోన్.

“నమస్కారం. నా పేరు రామం, మీ డాటర్ నీత ఫోటో మా ఫాదర్ పంపించేరు. క్రితం వారం…”

“చూడు నాయనా, మొత్తం అంతా తెలుగులోనే మాట్లాడూ, లేకపోతే ఇంగ్లీషులోనే మాట్లాడు. మాకూ ఇంగ్లీషు వచ్చు. ఈ కలగాపులగం బాషవల్లే మన తెలుగు నాశనం ఐపోతోంది.” మృదువుగానే అన్నా చురుక్కున తగిలింది రామానికి.

“సరే నండి. ఒకసారి నీతతో మాట్లాడ్డం కుదురుతుందా?”

“ఆ, కుదురుతుంది. నీతా, నిన్ను రామం పిలుస్తున్నాడు.”

నీత ఫోన్ తీసుకున్నాక అడిగేడు రామం “బిజీగా ఉన్నారా? ఇప్పుడు మాట్లాడటం కుదురుతుందా?”

“లేదు చెప్పండి.”

“నాకు గ్రీన్ కార్డ్ రావడానికి అప్లై చేస్తున్నాను. పెళ్ళి అయితే ఆలుమగలిద్దరికీ ఒకేసారి గ్రీన్ కార్డ్ ఇస్తారు. మీకు అమెరికా రావడానికి అభ్యంతరం ఏమైనా ఉందా? అదే… మనకి ఒకరినొకరం నచ్చితేనే లెండి. అసలు అడుగుతున్నాను.”

“ఓ, ఇంకా అంత దూరం ఆలోచించలేదు మేము.”

“మీ రెలెటివ్స్ ఎవరైనా అమెరికాలో ఉన్నారా?”

“మా బావ ఉన్నాడు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. ఈ మధ్యనే చేరేడు”

“నేనంత తెలివి గలవాడ్ని కాదండోయ్” సరదాగా అన్నాడు రామం

“మరి మీరు అమెరికా ఎలా వెళ్ళేరు?”

“ఏదో గాలి వాటం. ఎమ్మెస్సీ అయ్యేక ఖాళీగా కూర్చోడం ఎందుకని హైద్రాబాదులో శాప్ కోర్సులో జేరాను. అక్కడే చిన్న ఉద్యోగం వచ్చింది. అలాగలాగ గాలికి తేల్తూ ఇక్కడకి కొట్టుకొచ్చేను.”

“ఓ, మీరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అన్నమాటా?”

“మునుపు ఇలాగే అనేవారు. ఇప్పుడు ఇంజినీర్ అనేది తీసేసి శాప్ ప్రొఫెషనల్ అంటున్నారు.”

“అక్కడే అమెరికాలో సెటిల్ అవుతారా? సాధారణంగా ఎప్పుడు ఇండియా వస్తూ ఉంటారు?”

“సెటిల్ అవుదామనే అనుకుంటున్నాను. మూడు నాలుగేళ్ళకో సారి వస్తూ ఉంటాను.”

“ఎంతకాలం నుండీ ఉన్నారు అక్కడ?”

“నేనిక్కడకి వచ్చి ఆరేళ్ళు అవుతోందండి.”

“…”

తర్వాత ఏమి మాట్లాడలో తోచలేదు రామానికి. మళ్ళీ తర్వాత చేస్తాను అని ఫోన్ పెట్టేశాడు.

అయితే ఫోన్ పెట్టేశాక ఇంకో సారి మళ్ళీ ఫోన్ చెయ్యడం అనవసరం అనిపించకపోలేదు. రామం తర్వాత ఆఫీస్ ప్రోజక్ట్‌లో బిజీ అయ్యేడు. ఎంతగా అంటే రాత్రి ఏ పదింటికో రావడం రెండు మెతుకులు తిని మళ్ళీ పొద్దున్నే ఆరింటికి బయల్దేరడంతో అసలు తీరిక లేకుండా పోయింది. నాలుగు వారాల సెలవు కావాలంటే ఏడాదికి పదిరోజుల సెలవులున్న దేశంలో ఎలాగ కుదురుతుంది గాడిద చాకిరీ చేయకపోతే?