లెక్కల పాఠం

ఒక ఒకటి ఒకటీ…
పది ఒకట్లు పదీ…
ఎక్కాలు మొదలు ఎమ్మే దాటి పోయినా
లెక్కల పాఠం ప్రతి దానికీ
పది తలలు
అయినా అది గంట కొట్టంగానే
నీ క్లాస్ రూం లోకి చులాగ్గా వచ్చేస్తుంది
ముందు గుమ్మం లోంచి
ముని వేషంలో.

రాగానే జాగ్రత్తగా వినమని
బుజ్జగిస్తున్నట్టుగా మొదలౌతుంది గానీ
గంట గడుస్తున్న కొద్దీ గాభరా పెంచుకుంటూ
చివరి పది నిముషాల్లో
అటు బోర్డుకీ ఇటు క్లాసు మొహానికీ
సుద్ద పులిమేసి
ఆఖరి నిముషంలో
మర్నాడు పొద్దున మళ్ళీ పాఠం వేళకి
తొంభై తొమ్మిది లెక్కలు చేయాలనీ
అందరికన్నా ముందర అన్నీ చేసేసిన వాళ్ళకు
నూరో సమస్య బోనస్ అనీ
ఆశ బెడుతూ కేవలం అసుర బలంతో
అమాంతం నిన్ను అపహరించుకు పోతుంది
తన హోం వర్క్ లంక లోకి.

నువ్వు జుట్టు పీక్కుంటూ
నిద్ర పోకుండా నిన్ను నువ్వు గిల్లుకుంటూ
ఆవులింత కూడా రాకుండా
అన్ని జాగ్రత్తలూ తీసుకుని
రాత్రికి రాత్రి
తొం… భై.. తొమ్మిదో…
ది కూడా చేసేసి
తొంగి చూస్తావు మానిటర్ లోకి
ఇదుగో వచ్చేసింది ఈమెయిల్లో
నూరో సమస్య:

“నీవంటి విద్యార్థిని ఇదే చూడటం
నేను నిన్ను పెళ్ళాడక తప్పదు
అంటే, నువ్వు నన్ను పెళ్లి చేసుకోక తప్పదు,
అదే సరి — అది నెససరీ — కాదంటావూ
ఇంత బాగా లెక్కలు చెయగలవాళ్ళకు
ఇతరులతో కడగళ్ళు తప్పవు
ఇప్పటిదాకా నలభై యాభై
చేయగలిగిన వాళ్ళనే చూశాను
వాళ్ళందరినీ పెళ్లి చేసుకున్నాను
వాళ్ళూ నన్ను కావాలనే కట్టుకున్నారు
వాళ్ళందరికన్నా నిన్ను మిన్నగా చూస్తాను
నీ గడువు నువ్వు తీసుకో వచ్చు… కానీ
నువ్వొప్పుకునేదాకా వదలను
అంటే – లెక్కలొచ్చిన పిల్లవు
ఒప్పుకుంటే నువ్వే నన్నొదలవ్.”

నువ్వు ఏడుస్తావు, ఎక్కిళ్ళు పెట్టేస్తావు
మొత్తుకుంటావు, నెత్తీ నోరూ కొట్టుకుంటావు
ఈ బలవంతాలూ బలాత్కారాలూ ఏవిటని
గుక్క తిప్పుకోకుండా గుండెలు బాదుకుంటావు
లెక్కల పాఠం నిజ స్వరూపం చూసి
బితుక్కుమని బిక్కచచ్చిపోతావు
లెక్కల పాఠానికివన్నీ ఎక్కవు

ఫెర్మా చివరి థీరం
నూరు పేజీల నిడివి ప్రూఫ్ కింద
నిన్ను కూచోబెట్టి
నువ్వు టీచరులకు తప్ప ఇతర
ఖేచర భూచర వనచర జీ
వనచరుల కెవరికీ కనపడకుండా
–మొన్నటి దాకా కనపడకుండా పోయిన దాంతో సహా —
రామానుజన్ నోట్ పుస్తకాలతో
నిన్నాపాదమస్తకం కప్పేసి
అంతటితో ఆగకుండా
మూడు కరాలరీలను కాపలా బెట్టి
మధ్య మధ్యలో వచ్చి చూస్తూ ఉంటుంది.

ఇహ, ఇప్పుడు – కేస్ వన్:
అన్నం నీళ్లూ లేకుండా నువ్వు అలాగే ఉండి పోయి
సిద్ధాంతం తర్వాత సిద్ధాంతం అలవాటుగా చదివేసి
ఒకవేళ నీకప్పటికే పెళ్ళయి ఉంటే
వాణ్ణెవాణ్ణో వాడి ఖర్మకు కారడువుల్లో వదిలేసి
లెక్కల పాఠంతో కాపరానికి సిద్ధమన్నావనుకో
అప్పుడు
విశ్వనాథ సత్యనారాయణా
ఆయన ఏకలవ్య శిష్యులూ కన్నీళ్ళు కార్చినా
ఎంతయినా కవులు గదా గద్యంగా నైనా
నీ వైవాహిక జీవితం తిరగ రాస్తారు

కేస్ టు:
ఉహూ! నిప్పుల్లో దూకి చావనైనా చస్తాను గానీ
ఇహ ఈ రాకాసి రావణ
లెక్కల పాఠం దరిదాపులకు రానన్నావా
విశ్వనాథ సత్యనారాయణా
ఆయన ఏకలవ్య శిష్యులూ సంతోషిస్తారేమో గానీ
మా కాలేజీ కమిటీ వాళ్ళు మాత్రం
నా జీతం సగానికి సగం విరగ్గోస్తారు!