సత్య మొహంతితో ముఖాముఖి – 2: సాహిత్యంలో సాంస్కృతిక దురతిశయం

[ముఖాముఖీ 2011 అక్టోబర్, నవంబర్ మాసాల్లో రష్మి దూబే భట్నాగర్, రాజేందర్ కౌర్ సంయుక్తంగా నిర్వహించారు. రష్మి దూబే భట్నాగర్ పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయం లోని హ్యూమానిటీస్ సెంటర్‌లో ప్రస్తుతం విజిటింగ్ ఫెలోగా ఉన్నారు. రాజేందర్ కౌర్ సౌత్ ఏషియన్ లిటరరీ అసోసియేషన్ (SALA) యొక్క అధ్యక్షురాలు, విలియం పాటర్సన్ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.]

ఈ ముఖాముఖీ మొదటి భాగం.కలోనియలిజం, మోడర్నిటి, అండ్ లిటరేచర్ లోని అత్యధిక శాతం వ్యాసాల విశ్లేషణలు తులనాత్మకమైనవి. మీరు మీ ఉపోద్ఘాతంలో భారతీయ సాహిత్యాన్ని — వివిధ భాషల్లోంచి, ప్రాంతాల్లోంచి జనితమైన సాహిత్యాలను — తులనాత్మకంగా పరిశీలించడం ద్వారా మనలను ప్రాంతీయ సంకుచిత తత్వాల బారి నుండి, సాంస్కృతిక దురతిశయం నుండి తప్పించుకోగలమని వ్రాశారు. దీన్ని గురించి ఇంకొంచెం మాట్లాడగలరా?

సాంస్కృతిక దురతిశయం (Cultural chauvinism) సాహిత్యాధ్యయనపరులకు విషం లాంటిది. నా ఉద్దేశ్యంలో కొన్ని రకాల దురహంకార భావనలు బ్రిటీషు పాలనా సమయంలో సాంస్కృతిక అనుకరణలో భాగంగా ఉత్పన్నమైనవి. ఎలా అంటే, మన సంస్కృతిని వలస పాలకులు అప్రతిష్ట పాలు చేస్తున్నారు అన్న భావనకు ప్రతిక్రియగా ఈ దురహంకారం పుట్టింది. చిత్రమైన విషయం ఏమిటంటే ఈ ప్రతిక్రియాత్మక స్పందనకు (యూరప్ సంస్కృతిలా నా సంస్కృతి కూడా గొప్పది) ప్రేరణ 19వ శతాబ్దపు యూరప్ లో అత్యంత హేయమనిపించే స్వవర్గ స్వజాతి వ్యామోహం, ఇంకా జాతి వివక్ష ధోరణులు (మేము సాంస్కృతికంగా ఇతరులైన బర్బరులు, మ్లేచ్చులు కంటే ఉన్నతమైన వారము; మా పొరుగున ఉన్నప్పటికిని మాకన్నా తక్కువ సభ్యత, శిష్టత కలిగిన వారి భాషలు మా సంస్కృతీకరించబడ్డ ఆర్యభాషల కన్నాతక్కువ విలువ కలిగినవి) మొదలైనవి.

ఈ సందర్భంలో ఫ్రెంచి కులీన వర్గీయుడైన గొబినొ (Arthur Gobineau) ప్రతిపాదించిన జాతి వివక్ష సిద్ధాంతాల గురించి, జాతీయ సాహిత్య సంప్రదాయాలపై మాథ్యూ ఆర్నల్డ్ (Mathew Arnold) వెలిబుచ్చిన అబిప్రాయాల (కెల్టిక్ సాహిత్యంపై వ్రాసిన వ్యాసాలు) వైఖరి గురించి ఆలోచించండి. ఈ చర్చలో ఇంకా సందర్భోచితమైనవి 18వ శతాబ్దపు ఇంగ్లండులో ఆంగ్లాన్ని ప్రమాణీకరించాలంటూ జరిగిన వాదనలు. జాతి వివక్ష భావాలతో దురహంకారులు ప్రామాణికాబద్ధం కాని భాషా సిద్ధాంతాలను మానవ పరిణామ శాస్త్రాలతో ముడిపెట్టి ఆధిక్యతను చాటుకొనడం మీకు తెలిసిందే. ఒక శతాబ్దం తరువాత ఈ భావాలను కొందరు దురభిమాన సైద్ధాంతికులు భారతదేశంలో ప్రవేశపెట్టారు. చరిత్రకారులు ఈ అభిప్రాయాలను యూరోపియను సందర్భాల్లో (ఫ్రెంచితనం, ఆంగ్లతనం) విమర్శనాత్మకంగా పరిశీలించడం జరిగింది. కాని ఈ భావనలు భారతదేశంలో చూపిన ప్రభావం మీద ఇప్పటిదాకా పరిశోధన జరగలేదనే చెప్పాలి. 19వ, 20వ శతాబ్దాల్లో కుల వర్గ (Communalist sentiments) భావనలు అస్తిత్వ వాదాలుగా (Identity theories) రూపాంతరం చెంది బలపడడం, సాంస్కృతిక దురహంకారం అభివృద్ది చెందిన క్రమంలోనే, అని జోయ చటర్జి అనే చరిత్రకారిణి ఇటీవల వాదించారు. అందుచేత, ఈ విధమైన దురహంకారానికి హిందూ మత అగ్రకులాలకు చెందినటువంటి క్రొత్త జమీందారుల స్వవర్గ ప్రయోజనాభిలాష మూలం అని చెప్పాలి. 1968 నాటికే బ్రూంఫీల్డ్ అనే చరిత్రకారుడు చాలా ఆలోచనతో ఈ వర్గాల వైఖరి గురించి వ్రాశాడు. అభ్యుదయ భావాలు కలిగిన విమర్శకులు, చరిత్రకారులు ఈ విషయంపై ఇంకా చాలా పరిశోధన చేయవలసి ఉంది.

చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే, ఇదే దురహంకారం సాహిత్యాన్ని వక్రదృష్టితో ఒక ఆయుధంలాగా వాడుకోడానికి పనికి వచ్చింది. అంటే, మా సాహిత్య చరిత్ర మీ దాని కన్నా ప్రాచీనమైనది, ఫలానా గొప్ప రచయిత మా సాహిత్య సాంప్రదాయానికి చెందిన వాడు, ఇలా. ఈ భావజాలం ప్రస్తుతం ప్రశంసించబడుతున్న సాహితీ సంప్రదాయాలకు చెందిన పాఠకులకు సైతం మంచిది కాదు. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, భారతదేశ స్వాతంత్ర్యం తరువాత ఏదో ఒక రకమైన దురహంకారపు పోకడ దేశీయ సాహిత్యాధ్యయనాల్లో ప్రతి ఒక్కరికి సహజసిద్ధంగా ఉపలబ్ధమైన వైఖరిగా కనిపిస్తుంది. సాహిత్యం అధ్యయనం చేయడానికి బదులుగా మనం అసహ్యమైన సైద్ధాంతిక ప్రణాళికలో పాల్గొంటాము. పూర్తి శ్రద్ధతో చేయవలసిన విశ్లేషణ, వ్యాఖ్యానాల స్థానంలో రచయితల పై గుడ్డి ఆరాధ్యభావాన్ని ప్రోత్సహిస్తాము. సాహిత్య విమర్శ అన్నది వివిధ సాంప్రదాయాల మధ్య ఆధిపత్యం కోసం జరిపే పోటీ అన్న అపోహ, స్వీయ భాషా సంప్రదాయాల పట్ల ఉద్దేశ్యపూర్వకమైన సంకుచితత్వాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ దురతిశయ భావజాలం సాంప్రదాయిక సంస్కృత, యూరోపియను సాహిత్య సంప్రదాయాలను గుర్తించి వాటిలో సామ్యం చూసుకోగలదు. కానీ భారతదేశంలో ఇతర భాషలలో వచ్చిన నూతన సాహిత్య పద్ధతులను పూర్తిగా విస్మరిస్తుంది. ఒక రకంగా ఈ భావజాలం మనడానికి ఇటువంటి అజ్ఞానం ఎంతో అవసరం! మొదటి నుండీ ఢిల్లీ సాహిత్య అకాడెమి ద్వార ప్రచురితమైన దేశీయ సాహిత్య చరిత్రలు, ఏక విషయక రచనలు ఈ విషయాన్ని చాలా చక్కగా ధ్రువపరుస్తాయి. నేను సూచిస్తున్న దృక్పథం నుండి ఈ ధోరణులను విశ్లేషించడానికి చాలా సిద్ధాంత గ్రంథాల అవసరం ఉంటుంది.

మన దురతిశయపు సాంస్కృతిక, సైద్ధాంతిక మూలాల గురించి మాట్లాడటానికి సరి అయిన, సమర్థనీయమైన నైతిక పరిభాష ఇంకా మనకు లేదు. అందువల్ల దురతిశయపు పోకడలను సమావేశాల్లో ఎదుర్కొన్నప్పుడు చేసేదేమీ లేక కనుబొమలు ఎగురవేయడమో లేదా ఒకరినొకరు చూసుకోవడమో చేస్తాము. అయితే కొందరు సాహిత్యకారులు ఎంతో ధైర్యంగా ప్రయత్నించక పోలేదు. కర్నాడ్ (Girish Karnad) 2001 ‘ది హిందు’కు వ్రాసిన వ్యాసంగాని, లేదా 2009లో ‘ది బుక్ రివ్యూ’లో ప్రచురితమైన టగొరోలెట్రి (Tagorolatry) అన్న ఆయన వ్యాసం చూడండి. కర్నాడ్ సూచించినట్లుగా, ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న ‘భారతీయ సాహిత్యం’ అన్నదాంట్లో ప్రామాణికమైన రచయితలు ఎవరు అని. ఇంకా ప్రధానంగా, ఈ ఎన్నికలో సంపాదకుల బాధ్యత ఏమిటి అని.

మరొక ముఖ్య విషయం ఏమిటంటే, స్వాతిశయం, దురభిమాన దృక్పథాలు ఇంత ప్రభావవంతంగా ఉన్న సందర్భాల్లో భారతీయ సాహిత్యానికి చెందిన ఏ రచననైనా ఏ విధంగా విమర్శనాత్మకంగా, వ్యాఖ్యానాత్మకంగా పరిగణించాలి అన్నది చాలా జటిలమైన ప్రశ్న. డికెన్స్‌ను ఆంగ్ల సంస్కృతి యొక్క ఘనతను తెలుసుకోవడానికై మాత్రమే చదివితే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. లేదా, మరాఠీ సంస్కృతిని తెలుసుకోవడానికి తుకారాంను, ఒడియా సాహిత్య చరిత్రకున్న ఘనతను తెలుసుకోవడానికి సారళదాసు 15వ శతాబ్దంలో సబాల్టర్న్ దృక్కోణం నుండి వ్రాసిన రామాయణ మహాభారతాలను చదివినట్టుగా ఉంటుంది. ఇలాంటి ప్రయత్నాలు యదార్థమైన పరిశోధనలను తప్పుదోవ పట్టిస్తాయి. ఎందుచేతనంటే, ఇవి మనల్ని మధ్య, పూర్వాధునిక యుగాల (Medieval and Early Modern) స్వరూప స్వభావాలని నిర్దేశించిన సమ్మిళిత సాంస్కృతిక శక్తులను అధ్యయనం చేయకుండా నివారిస్తాయి. ఉదాహరణకు నాథ యోగులు, సంచార కవులు ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి తిరిగిన వైనం ఒక కొత్త రకపు చరిత్రను వ్రాయటానికి తావిస్తుంది. తుకారాంను, సారళదాసును కేవలం సాహితీ చరిత్రల పరిమితులలో చదవటం వల్ల వారి రచనల్లో కనిపించే కల్పనాత్మకశక్తిని కత్తిరించినట్లే అవుతుంది. వారి పాటల్లో, కావ్యాల్లో ఆధిపత్యాన్ని విమర్శించే ధోరణిని మన దృష్టి నుండి తప్పించినట్లే అవుతుంది. కాని, మన ఆధునిక స్వాతిశయ ధోరణి సాహిత్యాధ్యయనపరులను ఇంకే విధంగానూ సాహిత్యాన్ని చదవనియ్యదు. ఇదేవిధంగా సాహిత్య చరిత్రను వ్రాయాలని శాసిస్తుంది.

కలోనియలిజం, మోడర్నిటి, అండ్ లిటరేచర్ సంకలనానికి వ్రాసిన ఉపొద్ఘాతంలో నా వాదన సాహిత్య చరిత్రలు తక్కువ ప్రాముఖ్యం కలిగినవి అని కాదు. కాని పాఠ్య వివరణలు, వ్యాఖ్యానాలు, మరీ ముఖ్యంగా, వివిధ ప్రాంతాలకు చెందిన సాహిత్యాల మధ్య తులనాత్మక పరిశోధనలు ఈ దురతిశయాన్ని ఎదుర్కోవడానికి సహాయపడతాయి. అందువల్ల తులనాత్మక పరిశోధనలు ఇప్పుడెంతో అవసరం. స్వాతంత్ర్యం వచ్చి అరవై సంవత్సరాలైంది. ఇక ముందైనా మనం ఈ జాతీయ, ప్రాదేశిక సాహిత్య చరిత్రల నుండి దృష్టి మరల్చి, పాఠ్యాలపైన ప్రత్యక్షంగా దృష్టి సారిస్తే చాల మంచిది. ముఖ్యంగా తులనాత్మక ప్రస్తావనలపై దృష్టి కేంద్రీకరించాలి. అనంతమూర్తి (U. R. Anantamurty) అభిప్రాయపడినట్లుగా మనకు ప్రస్తుతం కావలసింది ఆధునిక భారతీయ సాహిత్యం పట్ల సూక్ష్మమైన, నిశితమైన వ్యాఖ్యానాలతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన రచనా సమూహాల విశ్లేషణలు. ఇప్పటికే భారతీయ సాహిత్యంపై జరిగిన కొన్ని మంచి రచనలు, ఉదాహరణకు ఏజాజ్ అహ్మద్ (Aijaz Ahmad), శిశిర్ కుమార్ దాస్ (Sisir Kumar Das), అమీయ దేవ్ (Amiya Kumar Dev), అయ్యప్ప పణిక్కర్ (Ayyappa Paniker) వంటి వారివి, ఈ రకమైన తులనాత్మక పరిశోధనల అవసరాన్ని సూచిస్తాయి. మన సామాజిక-సాంస్కృతిక ఉద్యమాల స్వరూపాలను నిర్వచించే పాఠ్యసమూహాలపై దృష్టి సారించాలంటూ పణిక్కర్ చేసిన ప్రతిపాదన నాకు చాలా నచ్చిన సూచన.

(కవితా పంజాబి (kavita Panjabi) సంకలితం చేసిన పాలిటిక్స్ అండ్ పొయెటిక్స్ ఆఫ్ సూఫిజం అండ్ భక్తి ఇన్ సౌత్ ఏషియా ఒక ఉదాహరణ. ఈ పుస్తకం ఇటీవలే ప్రచురించబడింది. నేను కేవలం సూచీపట్టిక మాత్రమే చూసినప్పటికిని, పుస్తకం చాలా ఆకర్షణీయంగా కనిపించింది.) అమీయ దేవ్ ప్రతిపాదించిన ‘లిటరరీ హిస్టరీ ఫ్రమ్ బిలో’ — బ్రిటిషు మార్క్సిస్టు చరిత్రకారుల ప్రణాళికను ప్రతిధ్వనిస్తూ కాబోలు — చాల విలువైనది. కాని ముందుగా మనం వివిధ భాషా సాంప్రదాయాల నుండి వెలువడ్డ రచనల మధ్య తులనాత్మక విశ్లేషణలను ఉత్పత్తి చేయాలన్న సంకుచిత నమూనా నుండి బయట పడాలి. ఒక విస్తారమైన, యోగ్యమైన సాహిత్య చరిత్రను వ్రాయగలగాలి అంటే మనం కృత్రిమమైన సాహిత్య భేదాలని అధిగమించాలి. అదే కాకుండా, సాంప్రదాయికంగా సాహిత్య చరిత్ర భాషా సంప్రదాయాల మధ్య నిర్మించే గోడను కూడా పడదోయాలి.

ప్రతి భాషా సాంప్రదాయంలో ప్రత్యక్షప్రభావాల పైనే గనక సాహిత్యచరిత్రలు తమ దృష్టిని కేంద్రీకరించినట్లయితే ఏ విధంగా సాంస్కృతిక విస్తృతి, ప్రసార సంపర్కాల పట్ల మన దృక్పథం వక్రీకృతమవుతుందో మీకు సోదాహరణంగా వివరిస్తాను. కొన్ని సంవత్సరాల క్రితం, బలరాం దాస్ 16వ శతాబ్దంలో రచించిన లక్ష్మీ పురాణంలో ఏయే క్రొత్త అంశాలను ఆవిష్కరిస్తున్నాడు అని తెలుసుకొనే ప్రయత్నంలో భాగంగా ఆయన చాలా నూతనమైన విషయాలను ప్రస్తావించాడని కనుగొన్నాను, ముఖ్యంగా భౌతిక శ్రమకు ఇవ్వవలసిన మర్యాద గురించి — రోజువారి శ్రమ, గృహాల్లో పడే దైనందిన శ్రమ సహితంగా. 12వ శతాబ్దం కర్నాటకలో ఉద్యమంగా ఆవిర్భవించిన వీరశైవ మతంలో కూడా ఈ విషయం యొక్క ప్రతిధ్వనిని వినవచ్చని నాకనిపించింది. ఈ విషయంగా నేను పాఠ్యపరమైన ఉదాహరణలను ఇంకా కనుగొనలేనప్పటికి, ఒక సంకుచిత దృష్టితో వ్రాసిన సాహిత్య చరిత్ర కేవలం బలరాం దాస్ యొక్క పూర్వాపరాలను ఒడియా మాట్లాడే ప్రదేశాల్లోను లేదా సంస్కృతి లోను వెతికేలా చేస్తుంది. కాని, వీరశైవం చాలా జనాదరణ కలిగిన ఒక ప్రజా ఉద్యమం. దాని ప్రభావం అది పుట్టిన క్షేత్రాన్ని దాటి జన బాహుళ్యంలో విస్తృతంగా కనిపిస్తుంది. సంచార కవులు, సన్యాసులు వీరశైవ భావాలను వివిధ భాషా క్షేత్రాలల్లో బహుళ ప్రాచుర్యం కలిగించారు. ఇటువంటి సందర్భంలో, లక్ష్మీ పురాణానికి చెందిన మూలాలు కేవలం ఒడియా సంప్రదాయంలోనే లభ్యం అవుతాయి అనుకోవడం అజ్ఞానమే అవుతుంది. దైనందిన శ్రమ అన్న అంశం యొక్క క్రొత్తదనం ఆధారంగా నేను సూచించదలచుకున్నదేమంటే — ఇది ఒక సూచన మాత్రమే — వీరశైవ భావజాలాన్ని బలరాం దాస్ తన ఊహలతో కలిపి అభివృద్ధి చేసిఉండవచ్చును అని. ఈ రెండు భావజాలాలకు మధ్య ఒక గాఢమైన సాంస్కృతిక సంబంధం ఉండే అవకాశం ఉంది. ఐతే ఈ సూచనను ఇంకా చాలా నిశితంగా పరిశీలించవలసి ఉంది. వీలైతే ఈ ఉభయ భాషల సంప్రదాయాలు తెలిసిన పండితులు ఒక సంపూర్ణమైన సిద్ధాంత గ్రంథాన్నే వ్రాయవచ్చు. ఐతే, నేను నా దృష్టిని కేవలం ఒడియా సాహిత్యానికి, సంస్కృతికి పరిమితం చేసినట్లయితే ఈ సంబంధాన్ని గురించిన ఆలోచన నాకు అసలు తట్టేదే కాదు.

మనకు సంక్లిష్టమైన, ఇంకా నిర్దుష్టమైన సాంస్కృతిక సంపర్కవినిమయాల నమూనా ఒకటి కావాలి. ఇటువంటి నమూనాను సాహితీ పాఠాలను తులనాత్మకంగా చదివే ప్రక్రియ పాక్షికంగా నైనా ఉత్పత్తి చేయగలదు. “భారతీయ సాహిత్యం” రూపురేఖలను సాంప్రదాయికంగా నిర్వచింపబడ్డ సాహిత్య చరిత్రలో లభ్యమయ్యే ఒక ఘనమైన ఇతివృత్తంగా కన్నా సాంస్కృతిక సరిహద్దుల మధ్య జరిగే వినిమయాల్లో చాలా స్పష్టంగా చూడవచ్చును. కలోనియలిజం, మోడర్నిటి, అండ్ లిటరేచర్ సంకలనం ద్వారా ఇటువంటి సంకుచితత్వాన్ని, స్వాతిశయాన్ని అధిగమించి ఒక విమర్శనాత్మక మరియు తులనాత్మక అధ్యయనానికి తోడ్పడాలని మా ఆశయం. ఇది ఒక చిన్న అడుగేమీ కాదు. జాతీయవాదాలతో ముడిపడి వ్రాయబడ్డ చరిత్రల సంకుచిత ధోరణికి ప్రతిక్రియగా యూరప్ లోని కంపారటివ్ లిటరేచర్ అధ్యయన శాఖలు రూపొందాయి. 1870ల్లో హ్యూగొ మెట్జల్ (Hugo Meltzl) మొట్టమొదటగా ‘జర్నల్ ఆఫ్ కంపారటివ్ లిటరేచర్’ను ప్రారంభించడం జరిగింది. ఆయన ఉద్దేశ్యంలో ఇలాంటి జర్నల్ ప్రతి దేశం/జాతి తనకు తానే గొప్ప అనుకొనే వైఖరిని సరిదిద్దగలదు అని. ఆయన ఈ ధోరణిని ఒక ‘జాతీయ విధి’గా గుర్తించాడు. ఇది 19వ శతాబ్దంలో చాలా జనసమ్మతమైన వైఖరి. చెప్పనక్కరలేకుండానే, ఆరోగ్యకరమైన సాంస్కృతిక స్వాభిమానం, సహచర వాత్సల్యం, పొరుగుల పట్ల ప్రేమ, అభిమానం లాంటి మంచి లక్షణాలు అలవడడానికి ఒక జాతి మరొక జాతి కన్నా మెరుగైనది, ఘనమైనది అన్న అభిప్రాయం కలిగి ఉండడం అవసరం లేదు. స్వాతిశయం లేదా దురహంకారం లాంటివి అనారోగ్యకర సంస్కృతికి చిహ్నాలు. వీటిని ఒకరి సంస్కృతి, జాతి పట్ల గల యదార్థమైన అభిమానంతో కలిపి చూడటం మంచిది కాదు.

ఆనాటి ఆధిపత్యం కలిగిన సాహితీ సంప్రదాయాలకు మెట్జల్ ఆరంభించిన ప్రతిజాతీయవాద దృక్పథం ఒక విరుగుడే అని చెప్పాలి. కాకపోతే ఆయన అధ్యయన శాఖకున్న తులనాత్మక వైఖరి, 20వ శతాబ్దంలో వలసవాద వ్యతిరేకవాదాలు, స్త్రీవాదం, సామ్యవాదం పెల్లుబికినప్పటికి కూడా, యూరప్ కేంద్రంగా ఉన్న మూలాల నుండి చాలా దూరం వెళ్ళలేదనే చెప్పాలి. ప్రపంచ సాహిత్యం గురించిన క్రొత్త వాదనల ఆరంభం అక్కడే ఉంది. నా ఉద్దేశ్యంలో భారతీయ సాహిత్యాన్ని అధ్యయనం చేసే విధ్యార్థులు ఒక నిజమైన సమవాద ప్రేరితమైన విశ్వసాహిత్యం అన్న ఆదర్శాన్ని సాధించడానికి తోడ్పడగలరు. కాకపోతే, ఈ భావన విస్తారమైన పాఠ్య మరియు సాంస్కృతిక వివరణ, వ్యాఖ్యానాల నుండి, చరిత్రలోని సంస్కృతిని గురించిన అనుభావిక జ్ఞానం (empirical knowledge) నుండి ఉద్భవించాలి. అంతేకాని సాహిత్యం గురించిన ఆదర్శవాద ఊహల నుండి లేదా సాహిత్య చరిత్రల్లో లభించే స్వప్రశంసాత్మకమైన, ఏకసాంప్రదాయికమైన ఇతివృత్తాలనుండి జన్మించకూడదు.

ఐతే, సాహిత్యం పట్ల దురతిశయపూరితమైన దృక్పథానికి ఇంకొక ముఖ్యమైన తలంపు కూడా ఉందని అంగీకరిస్తారా? అంటే, ఈ దృక్పథం ప్రకారం సాహిత్యాన్ని అధ్యయనం చేయడం అంటే ఒక కట్టడి చేయవలసిన ఏకభాషాత్మకమైన అభ్యాసం. ‘ఛ మన’ను తెలుగు, హింది, బంగాలీ ల్లో చదివే వివిధ ప్రాంతాలకు చెందిన పాఠకులు కేవలం తమ పఠనం ద్వారానే ఏకభాషాత్వాన్ని, భాషాదురహంకారాన్ని ఎదుర్కోగలరు. మనం చెప్పగలిగిందేమంటే, దురతిశయ మరియు దురతిశయ వ్యతిరేక ధోరణుల మధ్య ఉన్నటువంటి విభజన రేఖ చాలా వరకు — ఉదాహరణకు ప్రేంచంద్ యొక్క రియలిజంను తీసుకుంటే కనుక, మనం ఆయన నవలలను ఏ సమూహంలో ఉంచుతాము అన్న విషయం పైన ఆధారపడి ఉంటుంది. అంటే, ఆయన రియలిస్టు నవలలను, కథలను కేవలం ప్రాదేశిక సమూహాల్లోనే (హిందీ ఆధునిక ప్రామాణిక సాహిత్యంలో) కాకుండా ప్రత్యేకించి వేరే సాహితీ సంప్రదాయాల్లో సైతం ఉంచాలా అన్నది ప్రశ్న. ఈ పోలిక ఆధారంగా ఛ మన పట్ల ఉన్న దురతిశయ, దురతిశయ వ్యతిరేక పద్ధతుల విభజన రేఖ దేని మీద ఆధార పడి ఉందని మీరనుకుంటున్నారు? అంటే, ఈ రియలిస్టు నవల ఒడియా సాంస్కృతిక ఉద్యమాల స్వాభిమానంలో భాగమా లేదా ఒక తులనాత్మక ఇంకా అంతర్ప్రాదేశిక పఠన పద్ధతిలోని భాగంగా చూడాలా? దక్షిణాసియా సాహిత్యంలో ఏక భాషాత్మకంగా సాగే హిందీ, ఒడియా ఇంకా ఇతర దేశీయ భాషల సాహిత్యాధ్యయనం పట్ల చేయవలసిన విమర్శ తరువాతి తర్కబద్ధమైన అడుగులా కనిపిస్తుంది.

మీరన్నదానితో నేను పూర్తిగా అంగీకరిస్తాను. ప్రస్తుతం మనకు ఏకీకృతంగా అందుబాటులో ఉన్న ఈ దురభిమానపూరితమైన నమూనా నుండి బయటపడాలంటే మనం నిర్ణయాత్మకంగా, ఏకసాంస్కృతిక బద్ధమైన ప్రాంతీయతత్వం నుంచే కాకుండా, ఏకభాషత్వాన్ని దాటి ముందుకు సాగాలి. మనకు ఒక భారతీయ భాషను నేర్చుకుంటూనే, ఆంగ్లాన్నో, ఫ్రెంచినో నేర్చుకోవడం పెద్ద సమస్య కానప్పుడు, ఇంకొకటో రెండో ప్రాదేశిక భాషలను నేర్చుకొనటం చాలా ఉపయోగకరమే అవుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా తులనాత్మక భారతీయ సాహిత్య అధ్యయనాన్ని ప్రతిపాదించే పండితులు చేసే సూచన ఇదే. మన రచయితలు ఎప్పుడు ఒకరి రచనలను ఇంకొకరు చదువుతూనే ఉన్నారు, అనువాదాలే అయినప్పటికిని. కాని ఇటీవలి దశాబ్దాల గురించి మాట్లాడితే, మన విమర్శకులు ఇంత అనునయాన్ని ఎప్పుడు ప్రదర్శించలేదు. మనలో చాలా మంది ఆంగ్లంతో పాటు మరొక్క భాషకు మాత్రం పరిమితం అవుతాము. అంతే. కొందరు సంస్కృతాన్ని నేర్చుకుంటారనుకోండి.

బహుభాషాత్వం, ఇంకా వివిధ భాషల మధ్య సంవాదాలు ముందుకాలం నాటి భారత దేశంలో అతి సాధారణంగా కనిపించే విషయాలు అన్న గుర్తింపు మనకు కొంత వినయం నేర్పించగలదు. మచ్చుకు ఒక ఉదాహరణను ఇస్తాను. నేను ఇటీవల సారళదాస్ రచించిన బిచిత్ర రామాయణం పైన పని చేయడం మొదలు పెట్టాను. ఇది ఒడియా సాహిత్యంలోని ఆదికావ్యం. 15వ శతాబ్దపు ముందరి దశాబ్దాల్లో రచింపబడ్డది. సబాల్టర్న్ దృక్పథంతో కథనం నడిచే మనోహరమైన రామాయణ రచన ఇది. ఈ రచనలో సీత యొక్క పాత్ర కథకుడికి గురుత్వ కేంద్రంగా నిలుస్తుంది. ఇపుడు, ఈ గొప్ప కావ్యం గురించి పూర్తి సాధికారతతో సచ్చిదానంద మిశ్ర వ్రాసిన ఉపోద్ఘాతంలో ఈ కావ్యానికి 17వ శతాబ్దికి పూర్వమే ఒక తెలుగు అనువాదం ఉందని, అనంతరం మరి నాలుగు అనువాదాలు వెలువడ్డాయని చెప్పారు. ఉత్తరాంధ్ర మరియు దక్షిణ ఒడిషాల సాహితీ సాంస్కృతుల మధ్య గాఢమైన బాంధవ్యాలున్నయన్న మాట సర్వవిదితమే. కాని బిచిత్ర రామాయణానికి ఐదు తెలుగు అనువాదాలున్నాయన్న విషయం ఆంధ్ర ఒడిష సరిహద్దుల మధ్య ద్విభాషా సంస్కృతి ఎంత డోలాయమానంగా ఉండేదో ధ్రువపరుస్తుంది. ఈ సంస్కృతి ఢిల్లీ సాహిత్య అకాడెమి నుంచి వచ్చే ప్రదానాలపై ఆధారపడి లేదని గమనించాలి. ఆ అనువాదాలు వెలువడడానికి కారణం అప్పటికే ఆసక్తి కలిగినటువంటి పాఠక వర్గం ఇరు భాషల్లోను ఉండడం. వీరు భాషలమధ్య ఉన్న ఎల్లలను చాలా ప్రాముఖ్యమైనవిగా ఎప్పుడూ గుర్తించలేదు. అలా కాని పక్షంలో కూడా, సాహితీ వినిమయాలకు, సాంస్కృతిక సంవాదాలకు ఈ హద్దులు ఎప్పుడూ అంతరాయంగా నిలువ లేదు. వెల్చేరు నారాయణ రావు పలు సందర్భాల్లో సూచించినట్లుగా, విశ్వవిద్యాలయాల్లో కలోనియల్ పాలన సమయంలో ఆంగ్ల పాఠ్య ప్రణాళికలను పరిచయం చేసిన తరువాత ప్రాంతీయ భాషల ప్రాముఖ్యం, విలువ తగ్గిపోయాయి. ఆంగ్లము, సంస్కృతము (మన ఘన చరిత్ర!) ఆధునిక ప్రాంతీయ సంప్రదాయాలను పక్కకు నెట్టివేశాయి. ఆ కారణం చేతనే సంకుచితత్వంతో పాటు మీరు గుర్తించిన ఏకభాషాత్వం కలోనియల్ సమయాలకు ముందు ఆయపట్టుగా ఉన్నటువంటి అంతర్ప్రాంతీయ సాంస్కృతిక వినిమయాల స్థానాన్ని ఆక్రమించాయని ఆయన వాదిస్తారు.

వివిధ భాషల మధ్య ఉన్న సాహితీ సమూహాలను ఆవిష్కరించడం లోని అంతరార్థం కేవలం, అనంతమూర్తి తమ 2000 నాటి ఉపన్యాసంలో సూచించినట్లుగా, ఒకరి పై ఒకరు చూపిన ప్రభావాలను గుర్తించడం కోసమే కాదు. భాషా ప్రయోగ రీతుల్లో, కథన పద్ధతుల్లో కనిపించే పోలికలు, భేదాలు, ఇంకా భావజాల దృక్పథాల మధ్య ఉండే విభేదాలను తెలుసుకోవాలి అనేది మన ఉద్దేశ్యంగా ఉండాలి. అనంతమూర్తి దృష్టి సేనాపతి ‘ఛ మన,’ టాగూర్ ‘గోరా’ మధ్య ఉన్న అంతరాలను చూపడంపై కేంద్రీకృతమైంది. ఏ విధంగా నైతే ఈ రెండు నవలలు తమ భాషా ప్రయోగ రీతులను, నుడికారాలను, ముఖ్యంగా ‘శుద్ధ’ ప్రయోగాల మీద దైనందిన ప్రయోగాలను ఎలా వైవిధ్యభరితంగా ప్రదర్శిస్తారో తన ప్రేక్షకులు గమనించాలని ఆయన ఉద్దేశ్యం. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. కాని తులనాత్మక పాఠ్య విశ్లేషణ చేయడానికి, ముఖ్యంగా ప్రాంతాల సాహితీ సంప్రదాయాల మధ్య, ఈ ఉదాహరణ ఒక మార్గం చూపుతుంది. ఈ విధమైన తులనాత్మక అధ్యయనాలు చేయడానికి నిశితమైన పాఠ్య విశ్లేషణలు చాలా అవసరం.

జాతి వివక్షవాదాలపై ఆధారపడి ప్రతిపాదింపబడ్డ యూరోపీయ భావనలను (సాహిత్య చరిత్ర పై) విమర్శించిన సందర్భంలో మీరు మాథ్యు ఆర్నల్డ్ ను ప్రస్తావించడం ఒక ఆసక్తికరమైన విషయం. విశ్వసాహిత్యాన్ని ఏర్పరచడానికి మీరు అనంత మూర్తితో తులనాత్మకంగా సాహిత్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా నిజమైన సమసమాజ నిర్మాణం జరగవచ్చను అని ఇచ్చిన పిలుపులోని నైతిక ఆదేశం ఆర్నల్డ్ సాహితీ విమర్శనకు ఆపాదించిన ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని గుర్తుకు తెస్తుంది.

సాహిత్యాధ్యయనం అవలంబించే వివిధ శాస్త్రీయ పద్ధతుల యొక్క నైతిక అంతర్భావాలను చర్చించడానికి నేఎప్పుడూ అయిష్టతను వ్యక్తపరచలేదు. కాకపోతే సాహిత్యాన్ని అధ్యయనం చేయడం అంటే కేవలం ఇదే కాదు. మన జీవితాల్లోని వివిధ క్షేత్రాల్లో చేసుకొనే నిర్ణయాలు నైతిక విచారణలపై ఆధారపడి ఉంటాయి — అంటే ఏ ఏ రచనలపై దృష్టి సారించాలో, ఎక్కడ సమయాన్ని, శక్తిని అర్పించాల్సి ఉంటుందో అన్న విషయాల గురించి కూడా. ఐతే, నా ఉద్దేశ్యంలో ఆర్నల్డ్ ప్రతిపాదించిన జాతీయ సాహిత్య సంప్రదాయం అన్న భావన అప్పట్లో జనబాహుళ్యంలో ఉన్న వివక్షవాద, జాతీయవాదాలచే పరిమితం కాబడినప్పటికిని, శిక్షణా పద్ధతిలో సాహిత్యానికి ఉండవలసిన పాత్రను గురించి నాకెలాంటి అభ్యంతరమూ లేదు. సాహిత్యం ఆ పాత్రను చాలా సమర్థనీయంగా పోషిస్తుంది. విమర్శకుల వ్రాతలు — సాధారణ పాఠకులు, పత్రికా సమీక్షకులు, మేధావులు చేసేవి — ఈ చర్చలను చాలా ప్రయోజనకరంగా మార్చగలవు. మాథ్యు ఆర్నల్డ్ భావజాలపు కళ్ళగంతలను తొలగించికొని, ఈ చర్చను సఫలీకృతంగా సాధింపబడేలా చేయాలంటే, మనకు కావలసింది ఒక ప్రజాతంత్రమైన సాహితీ విమర్శ. ఆక్సిజన్ కొరవడిన సాహితీ సభల ఇరుకు గదుల నుంచి, ఉదాహరణకు, ఈ చర్చలను బయటకు తెచ్చి కాఫీ హౌసుల్లోను, కమ్యూనిటి హాళ్ళల్లోను, ఇంకా గ్రామాల్లోని కూడళ్ళల్లోకి పునఃపరిచయం చేయాలి. శతాబ్దాలుగా జగన్నాథ్ దాస్ రచించిన ఒడియా భాగవతం నలుగురు కూడే స్థానాల్లో చదవబడి చర్చించబడ్డది. ఈ స్థలాలను ఒడియాలో ‘భాగవత తుంగీలు’గా వ్యవహరించేవారు. భారత దేశంలోని ఇతర ప్రదేశాల్లో కూడా ఇలాంటి వ్యవస్థలు చాలా ఉన్నాయి. పాలా, రాంలీల వంటి బహుళ ప్రచారం పొందిన ప్రదర్శనా సంప్రదాయాలకు సైతం ఇటువంటి కార్యరంగాలున్నాయి. ఈ కార్య స్థలాల్లో విమర్శనాత్మకమైన ఊహలు రూపందుకుంటాయి. ఈ విమర్శనా స్థానాలు — రాంలీల నుండి యూనివర్సిటి ఆఫ్ పిట్స్‌బర్గ్ లేదా ముంబై లో జరిగే సాహిత్య గోష్టి — ఒకదానితో ఒకటి, ఏ అధికార క్రమాన్ని పాటించకుండా, సంబంధించినవిగా ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచించండి! ఒక భాగవతమో లేదా రామచరితమానసమో ప్రజాబాహుళ్యంలో చదవబడగా లేనిది, గోదాన్ లేదా సంస్కార లాంటి నవలలను కూడా అదే రీతిలో ఎందుకు చర్చించి విమర్శంచకూడదు. సాహిత్య విమర్శ సార్వజనిక విద్యలో ఒక ప్రముఖ పాత్ర వహించే రోజు తప్పకుండా రావచ్చు. ఇటువంటి విద్య పౌలో ఫ్రైరె (Paulo Freire) లాంటి వారు ప్రతిపాదించిన సాధికారతతో కూడిన విద్య అవుతుంది. ప్రజాతంత్రపరమైన సాహిత్య చర్చ సాంస్కృతిక వలస వాదాన్నుంచి మనలను విముక్తులను చేయడమే కాకుండా, స్వతంత్ర ఆలోచనా సరళిని పెంపొందిస్తుంది.

భారత ఉపఖండంలోని సంచార కవులు ప్రజాదరణ కలిగిన మౌఖిక కథాగానాల ద్వారా, ప్రదర్శనల ద్వారా నిర్మించిన రాజకీయ, సామాజిక స్థానాల మూల్యాంకనానికి, ఇంకా సాహితీ రచనల చారిత్రక స్థితిగతులను నిర్ణయించడానికి కావలసిన అనుభరపూర్వకమైన జ్ఞానానికి మధ్య ఘర్షణ ఉందని మీరనుకోరా?

మధ్య యుగంలో, పూర్వాధునిక యుగంలో ప్రజాదరణ కలిగిన కవులు, సంచార యోగులు కేవలం కథలు గానం చేయటమే కాకుండా, చాలా శక్తివంతమైన భావాలను ఉపఖండమంతా వ్యాప్తి చెందేలా చేశారు. సూఫీలు కూడా ఇదే పని చేశారు. ఈ కవులు, సాధువులు సంచారం చేస్తూనే వారు తిరిగిన స్థలాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి విశ్లేషించేవారు. వివిధ క్షేత్రాల ఉపసంస్కృతుల నుండి స్వీకరింపబడ్డ వారి పాటల్లోను, కథల్లోను స్పష్టమైన రీతిలో, క్రొత్త భావాలను ఆవిష్కరిస్తూ, క్రొత్త సిద్ధాంతాలను పరీక్షిస్తూ సంచరించేవారు. మీరు కబీరును తీసుకోండి. ఆయన ప్రజాబాహుళ్యం యొక్క కల్పనలో ఏ విధంగా ఉన్నారో చూడండి. ఇప్పటికి గ్రామాల్లో ఎందరో కేవలం ఆయన కవిత్వాన్ని చదవటమే గాక, ఆయన వ్రాసిన ఆధిభౌతిక తత్వపు బాణిని అనుసరించి కవిత్వాన్ని వ్రాసేవారు చాలా మంది ఉన్నారు. విమర్శ మరియు సాహిత్యం సాధారణ ప్రజానీకపు దైనందిన జీవితాల్లో ఏ విధంగా సహజీవనం సాగిస్తాయో మీరే చూస్తారు. నా ఉద్దేశ్యంలో షబ్నం వీర్మని (Shabnam Virmani) కబీరు పై తీసిన చిత్రాల్లో ఈ విషయాలనే చూపించారు. ఈ చిత్రాల నుండి వెలువడే అంతఃస్సూచనల ప్రాముఖ్యాన్ని కనుక మనం గుర్తిస్తే విశ్వవిద్యాలయాల్లో కబీర్ వంటి వారికి సాంప్రదాయికంగా ఉన్న ప్రామాణికత్వపు పరిధులనుంచి (Academic canon) దాటించగలము. ప్రజా సాంస్కృతిక క్షేత్రాల్లో ఉన్న సజీవతను చూడగలుగుతాం.

విశ్వవిద్యాలయాల శిక్షణాక్రమంలో భాగంగా బోధించే విశ్వసాహిత్యం ఒక ఉపయుక్త వస్తువుగానే చూడబడుతోంది. మీరు చెప్తున్న విశ్వసాహిత్యానికి ఆ గతి పట్టకుండా ఎలా చేయాలి?

“విశ్వసాహిత్యం” అన్న పదం, నేను ఉపయోగించే పద్ధతి, గమనిస్తే, విమర్శ ద్వారా సాధింపబడే ఒక గమ్యం, ఒక అంతఃసాంస్కృతిక సంవాదం. ఇది ఒక ప్రామాణికమైన గ్రంథాల సూచిని సూచించదు. ‘వెల్ట్‌లిటెరాటుర్‘ (Weltliteratur) అన్న పదాన్ని గయ్‌థ (Goethe) మొదటిసారిగా ఉపయోగించినప్పుడు ఆయన దాన్ని ఒక రచనల పట్టికగా కాక, విమర్శకులు, సాధారణ పాఠకులు చైతన్యంతో, ఆలోచనతో జీవించగలిగే ఒక బహుత్వవాద సాంస్కృతిక స్థానంగా కల్పన చేశారు. దేశాంతర, సాంస్కృతికాంతర అనువాదాల, ఇంకా విమర్శల ద్వారా జరిగే సంపర్కాలు ఈ స్థానం యొక్క స్వరూప స్వభావాలను ఏర్పరుస్తాయి. శాకుంతలాన్ని చదివి గయ్‌థ ఎంతగా ప్రభావితమయ్యారో గుర్తుకు తెచ్చుకోండి. ఆయన 1791లో కాళిదాసు పై నాలుగు పంక్తుల పద్యాన్ని కూడా వ్రాశారు. ఐతే, గయ్‌థ సహజంగా విశ్వసాహిత్యాన్ని ప్రతిపాదిస్తూ ఇతర సంస్కృతుల పట్ల సహనము, ఆసక్తి లాంటి మంచి లక్షణాలను ప్రోత్సహించారు. ఇదే కాకుండా రచయితలు, విమర్శకులు పరస్పరం ఒకరి రచనను ఇంకొకరి రచనతో పోల్చుకొనడాన్ని, ఇంకా ఒకరినొకరు దేశ సరిహద్దుల పరిమితులను అధిగమించి అర్థం చేసుకొనడాన్ని ప్రశంసించారు. మన విశ్వవిద్యాలయాలు ఈ లక్షణాలను పెంపొందించడానికి కృషి చేయవచ్చును. ఐతే, విద్యార్థులందరు చదవగల ఒక ప్రామాణికమైన విశ్వసాహిత్య సంకలనాన్ని తయారుచేయడం వల్ల ఈ పని సాధ్యం అవుతుంది అని నేను అనుకోను. మనం ఇంతకు ముందే చర్చించినట్లుగా, రచనల సముదాయాలతో ఆరంభించడం ఒక మెరుగైన పద్ధతి. తులనాత్మక విశ్లేషణ ద్వారా అంతఃసాంస్కృతిక సంవాదాన్ని, ఆలోచనని ప్రేరేపించగల అవకాశం లభిస్తుంది. ఇది కష్టమయిందే అయినా, అత్యావశ్యకమైనది మరియు అత్యంత ప్రయోజనకారి కూడా. పాఠకులు తాము పెరిగిన వాతావరణం మొదలైన సాంస్కృతిక కారకాల వల్ల చదివే అలవాట్లను అలవర్చుకుంటారు. ఈ అలవాట్లను మార్చగలగటం మన ఎదుట ఉన్న ప్రధాన సమస్య.

చిన్నదే అయినా మీకొక ముఖ్యమైన సూచన చేస్తాను. బలంగా నాటుకున్న ఈ అలవాట్లను మార్చడంలో భాగంగా విమర్శకులు తమ రచనలు, మాట్లాడే పద్ధతులను సరళతరం చేయాలి, ముఖ్యంగా పారిభాషిక పదజాలాన్ని పూర్తిగా విసర్జిస్తూ, రివాజుగా వస్తున్న ఈ పద్ధతులను మార్చుకున్న పక్షంలో మన భావాలు సాధారణ పాఠకులను సులభంగా చేరడమే కాకుండా మన అభిప్రాయాలు మరింత నిశితంగా మారే అవకాశం ఉంటుంది. మనం సాధారణ పాఠకుల పశ్నలకు, విమర్శనాత్మక వ్యాఖ్యానాలకు, ఇంకా కల్పనాత్మక పునర్నిర్మాణాలకు సమాధానం చెప్పవలసి ఉంటుంది. భాషలో ఇటువంటి మార్పు చాలా అవసరం. ముఖ్యంగా మార్గ, దేశి సంప్రదాయాల పేరుతో సాహిత్యాన్ని రెండు తరగతులుగా విభజించకుండా, ఒకదానితో ఇంకొకదానికి సంబంధం ఏర్పడేలాగా, విమర్శకు తావున్న ప్రజాతాంత్రిక స్థానాన్ని ఏర్పాటు చేయాలన్నది మన ఉద్దేశ్యమైన పక్షంలో ఈ మార్పులు అత్యావశ్యకం. ఒక క్షణం శిక్షణా పద్ధతులకున్న ఆస్కారాలను గమనించండి. తరగతి గదుల్లోని విద్యార్థులు పాలా నౌటంకి ప్రదర్శనకారులుగాను, ప్రేక్షకులుగాను తమ సంస్కృతి భాషలకు చెందని రచనలకు హాస్యంతో, సాదర ఆహ్వాన భావంతో స్పందిస్తుంటారు. తప్పొప్పుల భయం లేకుండా పాఠ్యాల అంతఃస్సూచనలను కొత్త మార్గాల్లో ముందుకు తీసుకువెళ్తారు. కార్నెల్ విశ్వవిద్యాలయంలో నా ‘ఆధునిక భారతీయ నవల’ అన్న కోర్సులోని ఒక విద్యార్థి ఛ మన గురించి, “ఈ వ్యక్తి కచ్చితంగా స్టీవెన్ కొబెయ్‌ర్‌లా (Stephen Colbert) ఉన్నాడు, ఒకటే తేడా ఈయన 19వ శతాబ్దపు భారతీయుడు.” అని అన్నప్పుడు నాకెంతో ఆనందం కలిగింది.

కలోనియలిజం, మోడెర్నిటి అండ్ లిటరేచర్ లో ప్రత్యామ్నాయ ఆధునికతలు అన్నది ఒక ప్రధానమైన అంశం. మీరు ఈ విషయంగా లక్ష్మీపురాణాన్ని దృష్టిలో ఉంచుకొని విశ్లేషించారు కూడా. మన ఈ విశ్వసాహిత్యం ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్రత్యామ్నాయ ఆధునికతల ప్రాముఖ్యం ఏమిటి?

ఇటీవల ప్రత్యామ్నాయ ఆధునికతలపై జరిగిన పరిశోధన బహుళ ఆధునికతలు, తొలినాటి ఆధునికతలు అన్న అంశాలపై ఏర్పాటయిన సమావేశాల్లోంచి, వాటినుండి వెలువడ్డ ప్రచురణల నుంచి ఉత్పన్నమైనది. వీటినుంచి నేను చాలా నేర్చుకున్నాను. ష్ముయేల్ ఐసెన్స్టాడ్ (Shmuel Eisenstadt) వంటి సామాజిక శాస్త్రవేత్తల పరిశోధనలు, తరువాత షెల్డన్ పొలాక్ (Sheldon Pollock) లాంటి ప్రాముఖ్యం కలిగినవారి రచనలు ఈ ప్రాజెక్ట్ జయప్రదంగా కొనసాగటానికి గల ఉద్దీపక కారణాలు.

పోస్ట్ కలోనియల్ అధ్యయనాల్లో దిలిప్ గాఉంకర్ (Dilip Gaonkar), దిపేష్ చక్రవర్తి (Dipesh Chakravarty) ఈ అంశాన్ని మరింత ముందుకు తీసుకొచ్చారు. ఈ విషయాన్ని ఉద్దేశిస్తూ చార్ల్స్ టేలర్ (Charles Taylor) కూడా విలువయిన రచనలు చేశారు. ఇండియలో బనారస్ హిందు యూనివర్సిటికి చెందిన సంజయ్ కుమార్, అర్చన కుమార్ (ఇరువురు ఇంగ్లీష్ విభాగానికి చెందిన వారే), రాజ్ కుమార్ (హింది) ఈ అంశంపై పెద్ద స్థాయి సమావేశాలు గత కొన్ని సంవత్సరాలుగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం చైనాకు చెందిన స్కాలర్స్, చైనా స్కాలర్ కమల్ షీల్ (Kamal Sheel) లాంటి వారితో కలిసి కొత్త సమావేశాలను ఏర్పాటు చేయబోతున్నారు. మనకు తెలిసిన ఆధునికత యొక్క స్వరూప స్వభావాలు యూరప్‌లో పెట్టుబడిదారీ ఆవిర్భావం తదితర కారణాలతో ముడిపడిఉంది. ఐతే ప్రపంచానికి తెలిసిన ఆధునికత ఇదొక్కటే కాదు. ఈ విధమైన ప్ర్రొజెక్ట్ లో ఉత్తేజపరచే విషయం ఏమిటంటే ఇపుడు విస్తారమైన చారిత్రక మరియు సాంస్కృతిక పరిశోధన వల్ల పెట్టుబడిదారు పాత్ర లేకుండానే మనం ఆధునికత యొక్క ఆవిర్భావం గురించి మాట్లాడ వచ్చు.

మౌలికంగా ఈ ప్రాజెక్ట్ ఇంటర్-డిసిప్లినరి విధానాలను అనుసరించినప్పటికి, సాహిత్యాధ్యయనం ఈ పరిశోధనకు ప్రత్యేక తోడ్పాటు ఇవ్వగలదని గతంలో నేను కొన్ని వ్యాసాల్లో వాదించాను. మనం సాంప్రదాయికంగా ‘ప్రి-మోడర్న్’ అని చెప్పుకొనే సమయంలో, సమాజంలో ఆధిపత్యం లేని వర్గాల సంస్కృతి, ఆలోచనల సాక్ష్యాలు ఆ కాలంలో వెలువడ్డ రచనల్లో లభిస్తాయి. సమాజంలో ప్రత్యామ్నాయంగా లభ్యమయ్యే విలువలు మనం కేవలం సామాజిక, ఆర్థిక మూలాలను పరిశీలించడం వల్ల కనిపించక పోవచ్చును. ప్రత్యామ్నాయ ఆధునికత అన్న అద్దం లోంచి చూచినట్లయితే, సాహితీ రచనలు క్రొత్త చారిత్రక భాండాగారాలను (Historic Archives) తెరుస్తాయి. మనకు తెలుసు అనుకున్న చరిత్ర పైన ఆసక్తికరమైన దృక్పథాలను ఆవిష్కరింపబడతాయి. ఐతే, సాహిత్యం అనుకున్న ఆసక్తికరమైన రచనా సామగ్రి కూడా ఈ మార్పులకనుగుణంగా పరిణామం చెందుతుంది. ఇందులో సంస్కృతంలోని మహా పురాణాలతో పాటుగా, కథకళి జానపద ప్రదర్శనలు, మౌఖికంగా ప్రసరింపబడే తుకారాం మరాఠి సామెతలు, 19వ శతాబ్దపు భోజ్ పురి వివాహ గీతాలు (స్త్రీల పాటలు) మొదలైనవన్నింటిని చేర్చవచ్చు.

ప్రత్యామ్నాయ ఆధునికతలపై ఇటీవల కనిపిస్తున్న ఆసక్తి ప్రపంచ సాహిత్యం అన్న మన ఊహను అర్థం చేసుకొవడానికి తోడ్పడుతుందా? నా ఉద్దేశ్యంలో తప్పకుండా తోడ్పడుతుంది. కాని, ఈ ప్రాజెక్ట్ సాధ్యాసాధ్యాలు చాలా వరకు ఎంత మంది సాహిత్యాద్యయన కారులు ఈ విషయంపై ఆసక్తి చూపుతారు, ఎందరు తమ డిసిప్లిన్ యొక్క ఆక్షేపణలను అధిగమించి ఇతర సంస్కృతి సంప్రదాయల మధ్య పని చేస్తారు అన్న విషయంపై ఆధారపడి ఉంటుంది. భారతీయ ఆధునికత వలస పాలనతో మొదలుకాబడలేదని, దాని మూలాలు మన చరిత్ర, సంస్కృతిలోనే నిబిడమై ఉన్నాయన్న ప్రతిపాదనను పరిశీలించాలని వివిధ రంగాల్లో పని చేసే అధ్యయనకారులకు నా అభ్యర్థన. ఆధునికతకు విభిన్నమైన భాగాలున్నాయనుకుంటే ఈ భాగాలను విడగొట్టి వాటిని ఊహాత్మకంగా క్రొత్త సామాజిక, సాంస్కృతిక సందర్భాల మధ్య పునఃపరిశీలించవచ్చును. ఇదే విషయాన్ని ‘కలోనియలిజం, మోడెర్నిటి అండ్ లిటరేచర్’కు వ్రాసిన ఉపోద్ఘాతంలో నేను సూచించాను. విమర్శకులు కొత్త భావజాలాల విలువలను, సాంస్కృతిక స్వరూపాల ఆవిర్భావాన్ని నిశిత పాఠ్య విశ్లేషణ ద్వారా పరిశోధించవచ్చు. చరిత్రకారులు, సామాజిక మరియు మానవీయ శాస్త్రజ్ఞులు సాంస్కృతిక భావజాలం పైన, సామాజిక వ్యవస్థల పైన చేసే పరిశోధనలను ఈ విశ్లేషణ ప్రభావితం చేయవచ్చును.

సాంస్కృతిక, నైతిక దృక్పథవాదంకు (Cultural and Moral Relativism) ప్రతిగా మీరు చేసిన వాదన, మీరు ప్రతిపాదించిన అంతర్-సాంస్కృతిక శిక్షణ (Cross Cultural Learning) (ఇది కేవలం ఒక మర్యాద పూర్వకమైన సంభాషణ కాదు. ఇది భిన్నత్వంతో నిజాయితీగా వ్యవహారం నెరపడం అవుతుంది) మాకెంతో స్ఫూర్తిదాయకమైంది. భిన్న సంస్కృతులపై వ్యాఖ్యాన వివరణలిచ్చే వ్యక్తి విభేదించడానికి లేదా తన అభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి వెనుకంజ వేయడు. చూస్తుంటే, ఈ విధానంతో జతగూడే సంఘర్షణలతో, గడబిడలతో సాహచర్యం తప్పేటట్టు లేదు.

అవును. మీరనుకొనే ‘ఉదాసీనపు సహిష్ణుత’ను అధిగమించి వెళ్ళగలగడం మన ఎదుట ఉన్న సవాలు. స్వజాతీయ, స్వకులీన భావజాలాల వల్ల కలిగే నష్టాల గురించి మనకు ఇప్పటికే అవగాహన ఉంది. కాని, దృక్పథవాదం అన్నది ఇటువంటి భావాల ప్రతిబింబమే. ఈ వాదాన్ని విమర్శించే చాలా మేధావులు వాదించినట్లుగా, ఈ సిద్ధాంతం ఉపయోగించే తర్కం ఉదాసీనతను ఉత్పన్నం చేస్తుంది. మనం స్వజాతి కేంద్రిత దృక్పథాల నుండి, మరియు విపరీతమైన సాంస్కృతిక దృక్పథవాదం నుండి దాటి వెళ్ళాలి. తారతమ్య విచక్షణ చేసే ప్రయత్నంలో భాగంగా మన అంచనాల్లో తప్పటడుగు వేసే అవకాశం ఎంతైనా ఉన్నది అన్న అపాయాన్ని ఎదుర్కోగలగాలి. మన అభిప్రాయాలను పునఃపరిశీలన చేసి తప్పు ఎక్కడ జరిగిందో అని తెలుసుకొని దాన్ని సరిచేసుకోగలగాలి. కొన్ని సార్లు మన సైద్ధాంతిక నిబద్ధత మన విచక్షణా శక్తిని పరిమితం చేసినప్పటికిని, పరిష్కారం అన్ని వేళలా సిద్ధాంత స్థాయిలోనే లభించదు అని గుర్తించాలి.

ఇటువంటి సందర్భాల్లో ఒక సంక్లిష్టమైన, నమ్రమైన, కేవలం సాధారణ అనుభవంపై ఆధారపడే పాజిటివిజం లాంటి దృక్పధాలతో సంబంధం లేని వస్తుగత దృక్పథాన్ని సాధించగలగడం మన విచారణ యొక్క ఆశయంగా ఉండాలి. తాత్విక వాస్తవికవాదంలో నాకు ఆకర్షకంగా కనిపించే విషయం ఇదే. వస్తుగత తత్వం ఒక పునర్విచారణకు నిలిచే ఆశయంగా ఉండాలి. ప్రస్తుతం సర్వోత్తమమైన మన దైనందిన నమ్మకాల్లో సైతం సరిచేయబడేవి ఉంటాయి అన్న గుర్తింపు మనలో, సంస్కృతిని అధ్యయనం చేసే విద్యార్థులుగా, కావలసిన నమ్రతను పెంపొందిస్తుంది. యూరోపియను సామ్రాజ్యపు నీడ నుంచి బయట పడటానికి ప్రస్తుత సమయంలో మంచి అవకాశం ఉంది. ఇతర సంస్కృతులపై పనిచేస్తూ వాటి నుండి నేర్చుకొనడానికి మంచి అవకాశాలున్నయి. ఈ సమస్య నుండి తప్పించుకొని ఒక సాధారణీకరించబడ్డ సంశయవాదాన్ని మనం సమర్థించవచ్చు– ‘ఇతర సంస్కృతులను మనం ఎట్లా అర్థం చేసుకోగలం?’ ‘ఎవరైనా దేన్నైనా ఎలా తెలుసుకోగలరు?’ నా ఉద్దేశ్యంలో ఈ ప్రశ్నలు కేవలం నైరూప్య (abstract) స్థాయిలో అంకురిస్తే మాత్రం అవి యదార్థమైనవి కావు. సంశయపూరితమైన ప్రశ్నలు సరైన బౌద్ధిక (intellectual) సందర్భాల్లో కనుక ఉదయిస్తే, అవి ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుచేతనంటే, ప్రశ్నలను సందర్భానుసారంగా చూసినప్పుడు మన తప్పుల యొక్క మూలాలను, కారణాలను ఇంకా క్షుణ్ణంగా తెలుసుకొనే అవకాశంతో పాటు వాటిని సరిచేసుకొనే ఆస్కారం ఉంటుంది.

వస్తుగత దృక్పథం ద్వారా చేకూరే జ్ఞాన నిర్దేశం మనకు లభించినట్లయితే (దాని అనుబంధ తలంపు అయిన ‘తప్పు’తో పాటు), రియలిజం అన్న సాహితీ విమర్శనాత్మక భావన మునుపటి ఉపయోగాన్ని (పాఠ్య వ్యాఖ్యానం చేయటం కోసమై) కోల్పోతుంది. సాహితీ వాస్తవికవాదం అన్నది ఒక అస్పష్టమైన పదం. కొన్నిసార్లు ఈ పదం సాంప్రదాయిక పద్ధతులను సూచిస్తే, మరి కొన్ని సార్లు విశ్లేషణ పటిమను గాఢత్వాన్ని సూచిస్తుంది. సంకలనాల్లోను, పత్రికల పరిధిలోను ఈ పదం వాడబడుతుంది గనుక, దీని వాడుక ఇప్పుడే మరుగవుతుంది అనుకోవడం పొరపాటే అవుతుంది. కాని, వర్ణనాత్మక వాస్తవికతకి, విశ్లేషణ ప్రధానమైన వాస్తవికతకి ఉన్న అంతరం ప్రయోజనకరమైనదిగా అనిపించిన పక్షంలో మనం ఈ పదాన్ని ఇంకా నిశితంగా, దాని అర్థాన్ని స్పష్టీకరించిన తరువాతే వాడవలసి ఉంటుంది. విశ్లేషణ ప్రధానమైన వాస్తవికవాదం యొక్క ప్రయోజనం ఏమిటంటే రియలిజాన్ని ఇదే పద్ధతిలో స్పష్టీకరిస్తుంది. ఈ ప్రక్రియ విమర్శకులను చరిత్రకారులతో, తత్వవేత్తలతో, సామాజిక శాస్త్రవేత్తలతో పాలు పంచుకొనే అవకాశం కలిగిస్తుంది. విశ్లేషణ ప్రధానమైన రియలిజం ప్రతిబింబత్వాన్ని దాటి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అది మనలను, పాఠకులుగా, విమర్శకులుగా, సాహిత్యం శైలి, పద్ధతి, సంప్రదాయం మొదైలనవాటి ద్వారా చేసే జ్ఞానమీమాంసక ప్రక్రియలను చూడమని ప్రేరేపిస్తుంది. ఈ తలంపు వెనుక సాహిత్యాన్ని జ్ఞానపర (Cognitivist) దృక్పథంతో చూడలన్న ఉద్దేశ్యం ఉంది. ఈ ఉద్దేశ్యం సాహితీ విమర్శకుల్లో విరివిగా ఉన్న సంశయవాదాలకు చాల భిన్నంగా ఉంటుంది.

నేను ఊహించే “విశ్వసాహిత్యం” ఒక రియలిస్టు మరియు కాగ్నిటివిస్టు ప్రణాళిక. కేవలం ప్రామాణికంగా ఎన్నుకోబడ్డ ప్రముఖమైన రచనల పట్టిక కాదు. ఈ ప్రణాళిక, గయ్‌థ సూచించినట్టుగా, ఇతర సంస్కృతులతో, సాహిత్యాలతో అనుసంధానాలను ఏర్పరుస్తుంది. ఇదే కాకుండా, మన చారిత్రక, సాంస్కృతిక స్థితిని అర్థం చేసుకోవడానికి కూడా తోడ్పడుతుంది. అనువాదాలు ఈ ప్రణాళిక సఫలీకృతం కావడానికి దోహదపడగలవు. కాని, మౌలికంగా చెప్పాలంటే ఇది ఒక వివరణ-వ్యాఖ్యాన ప్రధానమైన ప్రక్రియ. ఎందుకంటే, దీనికి కావలసింది అంతర్భాషాత్మకంగా మరియు అంతర్జాతీయంగా సాగే తులనాత్మక వ్యాఖ్యానాలు, ఇంతకు ముందే భారతీయ సాహిత్యం గురించి చర్చిస్తున్నప్పుడు చెప్పినట్లుగా. నా ఉద్దేశ్యంలో “విశ్వసాహిత్యం” పైన జరిగే ఏ పరిశోధనైనా అది ఇంటార్‌డిసిప్లీనరి గానే ఉండాలి. విభిన్న సంస్కృతుల మధ్య కేంద్రీకృతమయ్యే “విశ్వసాహిత్యం” గాఢంగా ఇమిడి ఉన్న నిర్హేతుక అభిప్రాయాలనుంచి మనలను విముక్తుల్ని చేయడంతో పాటు క్రొత్త అలోచనా మార్గాలను తెరుస్తుంది. నేను “విశ్వ సాహిత్యాన్ని” కొటేషన్సులో ఉంచడానికిగల కారణం, ఇది ఒక మంచి నినాదంలా పనిచేస్తుందని. అంటే, ఈ నినాదం ఇంకా ఊహించని రాబోయే భవిష్యత్తును సూచిస్తూంది కాబట్టి. ఆ భవిష్యత్తును మన సామాజిక, రాజకీయ ఆదర్శాలు, కేవలం సాహితీ ఆదర్శాలే కాకుండా, సాకారం చేస్తాయి. మంచి నినాదాలు — అంటే “మరో ప్రపంచం సంభవమే!”, “మేము 99%” లాంటివి — మనకు దిక్సూచిల్లాగా పనిచేస్తాయి.

రచయిత భరణి కొల్లిపర గురించి: ధీరూభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో అసిస్టంట్ ప్రొఫెసర్ గా సాహిత్యం, తత్త్వశాస్త్రము, రాజనీతిశాస్త్రము బోధిస్తున్నారు. హైదరాబాద్ లోని English and Foreign Languages University నుండి ఈయన ఆంగ్ల సాహిత్యంలో 2011లో డాక్టరేటు పట్టాను పొందారు. ...