సత్య మొహంతితో ముఖాముఖి – 2: సాహిత్యంలో సాంస్కృతిక దురతిశయం

ప్రతి భాషా సాంప్రదాయంలో ప్రత్యక్షప్రభావాల పైనే గనక సాహిత్యచరిత్రలు తమ దృష్టిని కేంద్రీకరించినట్లయితే ఏ విధంగా సాంస్కృతిక విస్తృతి, ప్రసార సంపర్కాల పట్ల మన దృక్పథం వక్రీకృతమవుతుందో మీకు సోదాహరణంగా వివరిస్తాను. కొన్ని సంవత్సరాల క్రితం, బలరాం దాస్ 16వ శతాబ్దంలో రచించిన లక్ష్మీ పురాణంలో ఏయే క్రొత్త అంశాలను ఆవిష్కరిస్తున్నాడు అని తెలుసుకొనే ప్రయత్నంలో భాగంగా ఆయన చాలా నూతనమైన విషయాలను ప్రస్తావించాడని కనుగొన్నాను, ముఖ్యంగా భౌతిక శ్రమకు ఇవ్వవలసిన మర్యాద గురించి — రోజువారి శ్రమ, గృహాల్లో పడే దైనందిన శ్రమ సహితంగా. 12వ శతాబ్దం కర్నాటకలో ఉద్యమంగా ఆవిర్భవించిన వీరశైవ మతంలో కూడా ఈ విషయం యొక్క ప్రతిధ్వనిని వినవచ్చని నాకనిపించింది. ఈ విషయంగా నేను పాఠ్యపరమైన ఉదాహరణలను ఇంకా కనుగొనలేనప్పటికి, ఒక సంకుచిత దృష్టితో వ్రాసిన సాహిత్య చరిత్ర కేవలం బలరాం దాస్ యొక్క పూర్వాపరాలను ఒడియా మాట్లాడే ప్రదేశాల్లోను లేదా సంస్కృతి లోను వెతికేలా చేస్తుంది. కాని, వీరశైవం చాలా జనాదరణ కలిగిన ఒక ప్రజా ఉద్యమం. దాని ప్రభావం అది పుట్టిన క్షేత్రాన్ని దాటి జన బాహుళ్యంలో విస్తృతంగా కనిపిస్తుంది. సంచార కవులు, సన్యాసులు వీరశైవ భావాలను వివిధ భాషా క్షేత్రాలల్లో బహుళ ప్రాచుర్యం కలిగించారు. ఇటువంటి సందర్భంలో, లక్ష్మీ పురాణానికి చెందిన మూలాలు కేవలం ఒడియా సంప్రదాయంలోనే లభ్యం అవుతాయి అనుకోవడం అజ్ఞానమే అవుతుంది. దైనందిన శ్రమ అన్న అంశం యొక్క క్రొత్తదనం ఆధారంగా నేను సూచించదలచుకున్నదేమంటే — ఇది ఒక సూచన మాత్రమే — వీరశైవ భావజాలాన్ని బలరాం దాస్ తన ఊహలతో కలిపి అభివృద్ధి చేసిఉండవచ్చును అని. ఈ రెండు భావజాలాలకు మధ్య ఒక గాఢమైన సాంస్కృతిక సంబంధం ఉండే అవకాశం ఉంది. ఐతే ఈ సూచనను ఇంకా చాలా నిశితంగా పరిశీలించవలసి ఉంది. వీలైతే ఈ ఉభయ భాషల సంప్రదాయాలు తెలిసిన పండితులు ఒక సంపూర్ణమైన సిద్ధాంత గ్రంథాన్నే వ్రాయవచ్చు. ఐతే, నేను నా దృష్టిని కేవలం ఒడియా సాహిత్యానికి, సంస్కృతికి పరిమితం చేసినట్లయితే ఈ సంబంధాన్ని గురించిన ఆలోచన నాకు అసలు తట్టేదే కాదు.

మనకు సంక్లిష్టమైన, ఇంకా నిర్దుష్టమైన సాంస్కృతిక సంపర్కవినిమయాల నమూనా ఒకటి కావాలి. ఇటువంటి నమూనాను సాహితీ పాఠాలను తులనాత్మకంగా చదివే ప్రక్రియ పాక్షికంగా నైనా ఉత్పత్తి చేయగలదు. “భారతీయ సాహిత్యం” రూపురేఖలను సాంప్రదాయికంగా నిర్వచింపబడ్డ సాహిత్య చరిత్రలో లభ్యమయ్యే ఒక ఘనమైన ఇతివృత్తంగా కన్నా సాంస్కృతిక సరిహద్దుల మధ్య జరిగే వినిమయాల్లో చాలా స్పష్టంగా చూడవచ్చును. కలోనియలిజం, మోడర్నిటి, అండ్ లిటరేచర్ సంకలనం ద్వారా ఇటువంటి సంకుచితత్వాన్ని, స్వాతిశయాన్ని అధిగమించి ఒక విమర్శనాత్మక మరియు తులనాత్మక అధ్యయనానికి తోడ్పడాలని మా ఆశయం. ఇది ఒక చిన్న అడుగేమీ కాదు. జాతీయవాదాలతో ముడిపడి వ్రాయబడ్డ చరిత్రల సంకుచిత ధోరణికి ప్రతిక్రియగా యూరప్ లోని కంపారటివ్ లిటరేచర్ అధ్యయన శాఖలు రూపొందాయి. 1870ల్లో హ్యూగొ మెట్జల్ (Hugo Meltzl) మొట్టమొదటగా ‘జర్నల్ ఆఫ్ కంపారటివ్ లిటరేచర్’ను ప్రారంభించడం జరిగింది. ఆయన ఉద్దేశ్యంలో ఇలాంటి జర్నల్ ప్రతి దేశం/జాతి తనకు తానే గొప్ప అనుకొనే వైఖరిని సరిదిద్దగలదు అని. ఆయన ఈ ధోరణిని ఒక ‘జాతీయ విధి’గా గుర్తించాడు. ఇది 19వ శతాబ్దంలో చాలా జనసమ్మతమైన వైఖరి. చెప్పనక్కరలేకుండానే, ఆరోగ్యకరమైన సాంస్కృతిక స్వాభిమానం, సహచర వాత్సల్యం, పొరుగుల పట్ల ప్రేమ, అభిమానం లాంటి మంచి లక్షణాలు అలవడడానికి ఒక జాతి మరొక జాతి కన్నా మెరుగైనది, ఘనమైనది అన్న అభిప్రాయం కలిగి ఉండడం అవసరం లేదు. స్వాతిశయం లేదా దురహంకారం లాంటివి అనారోగ్యకర సంస్కృతికి చిహ్నాలు. వీటిని ఒకరి సంస్కృతి, జాతి పట్ల గల యదార్థమైన అభిమానంతో కలిపి చూడటం మంచిది కాదు.

ఆనాటి ఆధిపత్యం కలిగిన సాహితీ సంప్రదాయాలకు మెట్జల్ ఆరంభించిన ప్రతిజాతీయవాద దృక్పథం ఒక విరుగుడే అని చెప్పాలి. కాకపోతే ఆయన అధ్యయన శాఖకున్న తులనాత్మక వైఖరి, 20వ శతాబ్దంలో వలసవాద వ్యతిరేకవాదాలు, స్త్రీవాదం, సామ్యవాదం పెల్లుబికినప్పటికి కూడా, యూరప్ కేంద్రంగా ఉన్న మూలాల నుండి చాలా దూరం వెళ్ళలేదనే చెప్పాలి. ప్రపంచ సాహిత్యం గురించిన క్రొత్త వాదనల ఆరంభం అక్కడే ఉంది. నా ఉద్దేశ్యంలో భారతీయ సాహిత్యాన్ని అధ్యయనం చేసే విధ్యార్థులు ఒక నిజమైన సమవాద ప్రేరితమైన విశ్వసాహిత్యం అన్న ఆదర్శాన్ని సాధించడానికి తోడ్పడగలరు. కాకపోతే, ఈ భావన విస్తారమైన పాఠ్య మరియు సాంస్కృతిక వివరణ, వ్యాఖ్యానాల నుండి, చరిత్రలోని సంస్కృతిని గురించిన అనుభావిక జ్ఞానం (empirical knowledge) నుండి ఉద్భవించాలి. అంతేకాని సాహిత్యం గురించిన ఆదర్శవాద ఊహల నుండి లేదా సాహిత్య చరిత్రల్లో లభించే స్వప్రశంసాత్మకమైన, ఏకసాంప్రదాయికమైన ఇతివృత్తాలనుండి జన్మించకూడదు.

ఐతే, సాహిత్యం పట్ల దురతిశయపూరితమైన దృక్పథానికి ఇంకొక ముఖ్యమైన తలంపు కూడా ఉందని అంగీకరిస్తారా? అంటే, ఈ దృక్పథం ప్రకారం సాహిత్యాన్ని అధ్యయనం చేయడం అంటే ఒక కట్టడి చేయవలసిన ఏకభాషాత్మకమైన అభ్యాసం. ‘ఛ మన’ను తెలుగు, హింది, బంగాలీ ల్లో చదివే వివిధ ప్రాంతాలకు చెందిన పాఠకులు కేవలం తమ పఠనం ద్వారానే ఏకభాషాత్వాన్ని, భాషాదురహంకారాన్ని ఎదుర్కోగలరు. మనం చెప్పగలిగిందేమంటే, దురతిశయ మరియు దురతిశయ వ్యతిరేక ధోరణుల మధ్య ఉన్నటువంటి విభజన రేఖ చాలా వరకు — ఉదాహరణకు ప్రేంచంద్ యొక్క రియలిజంను తీసుకుంటే కనుక, మనం ఆయన నవలలను ఏ సమూహంలో ఉంచుతాము అన్న విషయం పైన ఆధారపడి ఉంటుంది. అంటే, ఆయన రియలిస్టు నవలలను, కథలను కేవలం ప్రాదేశిక సమూహాల్లోనే (హిందీ ఆధునిక ప్రామాణిక సాహిత్యంలో) కాకుండా ప్రత్యేకించి వేరే సాహితీ సంప్రదాయాల్లో సైతం ఉంచాలా అన్నది ప్రశ్న. ఈ పోలిక ఆధారంగా ఛ మన పట్ల ఉన్న దురతిశయ, దురతిశయ వ్యతిరేక పద్ధతుల విభజన రేఖ దేని మీద ఆధార పడి ఉందని మీరనుకుంటున్నారు? అంటే, ఈ రియలిస్టు నవల ఒడియా సాంస్కృతిక ఉద్యమాల స్వాభిమానంలో భాగమా లేదా ఒక తులనాత్మక ఇంకా అంతర్ప్రాదేశిక పఠన పద్ధతిలోని భాగంగా చూడాలా? దక్షిణాసియా సాహిత్యంలో ఏక భాషాత్మకంగా సాగే హిందీ, ఒడియా ఇంకా ఇతర దేశీయ భాషల సాహిత్యాధ్యయనం పట్ల చేయవలసిన విమర్శ తరువాతి తర్కబద్ధమైన అడుగులా కనిపిస్తుంది.

మీరన్నదానితో నేను పూర్తిగా అంగీకరిస్తాను. ప్రస్తుతం మనకు ఏకీకృతంగా అందుబాటులో ఉన్న ఈ దురభిమానపూరితమైన నమూనా నుండి బయటపడాలంటే మనం నిర్ణయాత్మకంగా, ఏకసాంస్కృతిక బద్ధమైన ప్రాంతీయతత్వం నుంచే కాకుండా, ఏకభాషత్వాన్ని దాటి ముందుకు సాగాలి. మనకు ఒక భారతీయ భాషను నేర్చుకుంటూనే, ఆంగ్లాన్నో, ఫ్రెంచినో నేర్చుకోవడం పెద్ద సమస్య కానప్పుడు, ఇంకొకటో రెండో ప్రాదేశిక భాషలను నేర్చుకొనటం చాలా ఉపయోగకరమే అవుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా తులనాత్మక భారతీయ సాహిత్య అధ్యయనాన్ని ప్రతిపాదించే పండితులు చేసే సూచన ఇదే. మన రచయితలు ఎప్పుడు ఒకరి రచనలను ఇంకొకరు చదువుతూనే ఉన్నారు, అనువాదాలే అయినప్పటికిని. కాని ఇటీవలి దశాబ్దాల గురించి మాట్లాడితే, మన విమర్శకులు ఇంత అనునయాన్ని ఎప్పుడు ప్రదర్శించలేదు. మనలో చాలా మంది ఆంగ్లంతో పాటు మరొక్క భాషకు మాత్రం పరిమితం అవుతాము. అంతే. కొందరు సంస్కృతాన్ని నేర్చుకుంటారనుకోండి.

బహుభాషాత్వం, ఇంకా వివిధ భాషల మధ్య సంవాదాలు ముందుకాలం నాటి భారత దేశంలో అతి సాధారణంగా కనిపించే విషయాలు అన్న గుర్తింపు మనకు కొంత వినయం నేర్పించగలదు. మచ్చుకు ఒక ఉదాహరణను ఇస్తాను. నేను ఇటీవల సారళదాస్ రచించిన బిచిత్ర రామాయణం పైన పని చేయడం మొదలు పెట్టాను. ఇది ఒడియా సాహిత్యంలోని ఆదికావ్యం. 15వ శతాబ్దపు ముందరి దశాబ్దాల్లో రచింపబడ్డది. సబాల్టర్న్ దృక్పథంతో కథనం నడిచే మనోహరమైన రామాయణ రచన ఇది. ఈ రచనలో సీత యొక్క పాత్ర కథకుడికి గురుత్వ కేంద్రంగా నిలుస్తుంది. ఇపుడు, ఈ గొప్ప కావ్యం గురించి పూర్తి సాధికారతతో సచ్చిదానంద మిశ్ర వ్రాసిన ఉపోద్ఘాతంలో ఈ కావ్యానికి 17వ శతాబ్దికి పూర్వమే ఒక తెలుగు అనువాదం ఉందని, అనంతరం మరి నాలుగు అనువాదాలు వెలువడ్డాయని చెప్పారు. ఉత్తరాంధ్ర మరియు దక్షిణ ఒడిషాల సాహితీ సాంస్కృతుల మధ్య గాఢమైన బాంధవ్యాలున్నయన్న మాట సర్వవిదితమే. కాని బిచిత్ర రామాయణానికి ఐదు తెలుగు అనువాదాలున్నాయన్న విషయం ఆంధ్ర ఒడిష సరిహద్దుల మధ్య ద్విభాషా సంస్కృతి ఎంత డోలాయమానంగా ఉండేదో ధ్రువపరుస్తుంది. ఈ సంస్కృతి ఢిల్లీ సాహిత్య అకాడెమి నుంచి వచ్చే ప్రదానాలపై ఆధారపడి లేదని గమనించాలి. ఆ అనువాదాలు వెలువడడానికి కారణం అప్పటికే ఆసక్తి కలిగినటువంటి పాఠక వర్గం ఇరు భాషల్లోను ఉండడం. వీరు భాషలమధ్య ఉన్న ఎల్లలను చాలా ప్రాముఖ్యమైనవిగా ఎప్పుడూ గుర్తించలేదు. అలా కాని పక్షంలో కూడా, సాహితీ వినిమయాలకు, సాంస్కృతిక సంవాదాలకు ఈ హద్దులు ఎప్పుడూ అంతరాయంగా నిలువ లేదు. వెల్చేరు నారాయణ రావు పలు సందర్భాల్లో సూచించినట్లుగా, విశ్వవిద్యాలయాల్లో కలోనియల్ పాలన సమయంలో ఆంగ్ల పాఠ్య ప్రణాళికలను పరిచయం చేసిన తరువాత ప్రాంతీయ భాషల ప్రాముఖ్యం, విలువ తగ్గిపోయాయి. ఆంగ్లము, సంస్కృతము (మన ఘన చరిత్ర!) ఆధునిక ప్రాంతీయ సంప్రదాయాలను పక్కకు నెట్టివేశాయి. ఆ కారణం చేతనే సంకుచితత్వంతో పాటు మీరు గుర్తించిన ఏకభాషాత్వం కలోనియల్ సమయాలకు ముందు ఆయపట్టుగా ఉన్నటువంటి అంతర్ప్రాంతీయ సాంస్కృతిక వినిమయాల స్థానాన్ని ఆక్రమించాయని ఆయన వాదిస్తారు.

వివిధ భాషల మధ్య ఉన్న సాహితీ సమూహాలను ఆవిష్కరించడం లోని అంతరార్థం కేవలం, అనంతమూర్తి తమ 2000 నాటి ఉపన్యాసంలో సూచించినట్లుగా, ఒకరి పై ఒకరు చూపిన ప్రభావాలను గుర్తించడం కోసమే కాదు. భాషా ప్రయోగ రీతుల్లో, కథన పద్ధతుల్లో కనిపించే పోలికలు, భేదాలు, ఇంకా భావజాల దృక్పథాల మధ్య ఉండే విభేదాలను తెలుసుకోవాలి అనేది మన ఉద్దేశ్యంగా ఉండాలి. అనంతమూర్తి దృష్టి సేనాపతి ‘ఛ మన,’ టాగూర్ ‘గోరా’ మధ్య ఉన్న అంతరాలను చూపడంపై కేంద్రీకృతమైంది. ఏ విధంగా నైతే ఈ రెండు నవలలు తమ భాషా ప్రయోగ రీతులను, నుడికారాలను, ముఖ్యంగా ‘శుద్ధ’ ప్రయోగాల మీద దైనందిన ప్రయోగాలను ఎలా వైవిధ్యభరితంగా ప్రదర్శిస్తారో తన ప్రేక్షకులు గమనించాలని ఆయన ఉద్దేశ్యం. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. కాని తులనాత్మక పాఠ్య విశ్లేషణ చేయడానికి, ముఖ్యంగా ప్రాంతాల సాహితీ సంప్రదాయాల మధ్య, ఈ ఉదాహరణ ఒక మార్గం చూపుతుంది. ఈ విధమైన తులనాత్మక అధ్యయనాలు చేయడానికి నిశితమైన పాఠ్య విశ్లేషణలు చాలా అవసరం.