వదిన

అందరికీ నమస్కారం.

నేను భాస్కర్. బాచ్చా నా ముద్దు పేరు. ఇండియా గణ తంత్ర రాజ్యంగా మారినప్పుడు పుట్టిన వాడిని. పి.యు.సి. పరీక్షలో మూడో పార్ట్ మాత్రం పాసు కావాల్సి ఉంది. వచ్చే నెల మూడో సారి ఆ పరీక్ష రాయబోతున్నాను.

మా నాన్నగారు లేరు. నా చిన్న వయసులోనే ఆయన పోయారు. ముగ్గురు అన్నయ్యలు. బాంబేలో పెద్దన్నయ్య, కడలూరులో రెండో అన్నయ్య. ఇక్కడ మద్రాసులో నా మూడో అన్నయ్య శశిధర్. వాడితోనే నేను ఉంటున్నాను. అమ్మ మూడు చోట్లలోనూ మారి మారి కాలక్షేపం చేస్తూ ఉంటుంది. ముగ్గురు కొడుకులూ బాగానే చూసుకుంటారు. అమ్మకి ఒకే చోట ఉంటే విసుగు వచ్చేస్తుంది. లేదా ఇంకో కొడుకును చూడాలన్న బెంగ పట్టుకుంటుంది.

శశిధర్‌కి పోయిన ఏడాదే పెళ్లి అయ్యింది. వాడికి ముప్ఫై మొన్ననే నిండింది కానీ ముందు జుట్టు అప్పటికే ఊడి పోయి బట్టతల వచ్చేసింది. ఎప్పుడూ సీరియస్‌గాగా ఉంటాడు. బాంక్‌లో ఉద్యోగం. నెలకి పది రోజులైనా ఓవర్ టైం ఉంటుంది. అది కాక కోపరేటివ్ సొసైటీ, ఆఫీసు క్యాంటీన్ వీటిల్లో డైరక్టర్. అదీ చాలదన్నట్లు యూనియన్ కమెటీ మెంబర్. రోజూ ఇంటికి వచ్చేటప్పుడు ఒక్కోసారి రాత్రి ఎనిమిది తొమ్మిది కూడా అవుతుంది.

మా అమ్మ పేరు మీద ఒక టాక్సీ ఒకటి నడుస్తోంది. తొమ్మిది గంటలకి ఇంటికి వచ్చిన తర్వాత శశిధర్ భోజనం ముగించుకుని, బనియన్, లుంగీతో వీధి దీపం వెలుగులో డ్రైవరుతో గొడవ పడుతూ ఉంటాడు. గొడవలు లేని రోజుల్లో సుముఖంగా మాట్లాడుతూ ఉంటాడు. పదిన్నర, పదకొండు గంటలకి ఇంట్లోకి వచ్చి రాగానే గుర్రు పెట్టి నిద్ర పోతాడు. అన్నీ కలిపి నెలకి వెయ్యి రూపాయలకి పైనే సంపాదిస్తున్నాడు.

ఇకమీద వచ్చే కధలో మా వదినది ముఖ్యమైన పాత్ర. అయినా కూడా ఆమె పేరు నేను చెప్పదలచు కోలేదు. నేను మా వదిన పేరు చెప్పిన తర్వాత, అదే పేరుతో మీకు ఎవరైనా అమ్మాయి మీకు ముందే తెలిసి ఉండి, ఆమె రూపం మీ మనసులో పాతుకు పోకుండా ఉండాలనే, మీ మేలు కోసమే నేను వదిన పేరు చెప్పకుండా వదిలేస్తున్నాను. కవి సుబ్రమణ్య భారతి ఈ రోజు బ్రతికి ఉంటే మా వదిన భుజాన్ని తప్పకుండా తట్టి ఉండేవారు. భేష్! భేష్! అని ఉత్సాహంతో నోరారా పొగిడి ఉండేవారు. అలాంటి కొత్త తరం అమ్మాయి తను. తండ్రికి ఒకే కూతురు. తల్లి లేదు. తండ్రి రైల్వే నుంచి రిటైర్ అయ్యి, నుంగంబాక్కంలో సొంత ఇంట్లో శేష జీవితం గడుపుతున్నారు. బి.ఎస్‌సి. చదివిన కూతురుకి వెంటనే పెళ్లి చేసేశారు.

వదిన కూడా పెళ్ళైన మరుసటి వారమే తనకంటూ స్వంతం అయిన మెరూన్ లెదర్ సూట్ కేసుతో, సంసారానికి కావాల్సిన సామాన్లతో మాంబళంలో ఉన్న మా ఇంటికి కుడి కాలు ముందు పెట్టి వచ్చేసింది. కోడలి తెలివితేటలనీ, సామర్థ్యాన్ని ఒక్క నెలలోనే గ్రహించుకున్న మా అమ్మ కడలూరులో ఉన్న కొడుకును చూడడానికి బైలుదేరి వెళ్లి పోయింది.

ఇక్కడ నా గురించి కొంచం చెప్పడం అనివార్యం అవుతోంది. ఇరవై ఏళ్ళకి నేను కాస్త పెద్దవాడిలాగానే ఉంటాను. మా కాలేజీలో లెక్చరర్లు నన్ను “ఏరా మామా!” అనే పిలుస్తారు. వెంటనే మీరు పులిహోర బాచ్చా అని నాకు పేరు పెట్టకండి. నేను పులిహోర బాచ్చాని కాను. దద్ధోజనం బాచ్చానే. అలా అని మరీ అమాయకపు దద్ధోజనం కాదు. ఆవాలు, పచ్చి మిరపకాయ, కరివేపాకు అన్నీ వేసి తాలింపు పెట్టి, మామిడి, అల్లం ముక్కలు కలిపిన రుచికరమైన పెరుగన్నం.

మా వదిన నాకన్నా ఒకటో రెండో ఏళ్ళు పెద్దది అయి ఉంటుంది, అంతే, ఆమెను నేను ఇప్పుడు వర్ణించబోవడం లేదు. ఇంతకు ముందే సుబ్రమణ్య భారతిని సాక్ష్యానికి పిలిచింది మీకు గుర్తుకు ఉండే ఉంటుంది.

మా వదినా, నేను పొద్దున్న తొమ్మిది గంటల నుంచి, రాత్రి తొమ్మిది దాకా ఒకే ఇంట్లో వంటరిగా, అంటే వేరు ఎవరూ లేని ఏకాంతంలో ఉండే వాతావరణం. మా అమ్మ తెలివి లేని దద్దమ్మ కాదు. ఆమెకి నా గురించి బాగానే తెలుసు. దానికన్నా ఎక్కువగానే మా వదిన గురించి ఒక్క నెలలోనే తెలుసుకొని ఉంటుంది. అందుకే ధైర్యంగా కడలూరికి బైలు దేరి వెళ్లి పోయింది.

శశిధర్‌కి డబ్బు మీద వ్యామోహం ఎక్కువ. రూపాయి నోట్ల రంగుల్లో తప్ప వేరే దేనిలోనూ తేడా చూడని వాడు. వాడు ఎప్పటిలాగే తన రోజులు గడిపేస్తుండేవాడు. అలా గడుపుతూ డబ్బు సంపాదనలో మునిగి తేలుతూ ఉండే వాడు.

మొదటి రెండు నెలలూ వదిన తన గదిలోనే ఉండేది. నేను వాకిటి అరుగు మీద కూర్చుని కాలం గడిపే వాడిని. ఆ సుదీర్ఘపు పగటి వేళలను నేను ఇంట్లోనే గడపాల్సి వచ్చేది. నాతో కూడా చదువుకున్న వాళ్ళంతా సుబ్బరంగా చదువు ముగించి, పై చదువులు చదువుతున్నారు. నా చేతిలో కానీ కూడా ఉండేది కాదు. కాలేజీలో చదువుకునే రోజుల్లో అయినా చేతిలో రూపాయో అర్థో ఉండేది. ఇప్పుడు ఇంట్లోనే ఉండి చదువుకోవడం వల్ల దానికీ దారి లేకుండా పోయింది.

మధ్యాహ్నం మూడు గంటలకి వదిన వాకిటి వైపు వచ్చి, “కాఫీ తాగడానికి రా,” అని పిలుస్తుంది. నేను లోపలికి వెళ్లి వెండి గ్లాసులో తను ఇచ్చిన కాఫీని గబా గబా రెండు గుక్కల్లో తాగేసి తిరిగి కూడా చూడకుండా మళ్ళీ వాకిట్లోకి వచ్చేసే వాడిని. ఒకసారి అలా వస్తున్నప్పుడు తను అడిగింది.

“అది కాఫీయా? ఆముదమా?”

“నో. నో. ఇట్ ఈస్ ఆల్ రైట్” అన్నాను నేను.

“విచ్ ఈస్?” అనడిగింది తను.

నేను నవ్వేశాను. ఆ నవ్వులు, మాటలు మా ఇద్దరి మద్యా ఉన్న అడ్డు గోడను మెల్లిగా తొలగించాయి. తరువాత మేమిద్దరం మామూలుగానే మాట్లాడుకోసాగాం. నేను పాసు కావాల్సిన సబ్జెక్ట్ లో కెమిస్ట్రీ కూడా ఒకటి అని తెలిసినప్పుడు తను ఎక్కువ శ్రద్ధ చూపించింది. ఆమె మెయిన్ సబ్జెక్ట్ కెమిస్ట్రీలోనే, ఫస్ట్ క్లాసులో పాసయ్యింది. ఒక రోజు మాటల మద్యలో తనకి మీఠా పాన్ అంటే చాలా ఇష్టం అని చెప్పింది. ఆ రోజు మొదలు తను భోజనం చేసిన తర్వాత పక్కనే ఉన్న పాన్ దుకాణం నుంచి స్పెషల్ బీడా కట్టించి తెచ్చి ఇచ్చే వాడిని.

పగలంతా ఏం చేయాలో తోచక, పొద్దు గడపడం కోసం మేమిద్దరం క్యారమ్స్ ఆడటం ప్రారంబించాము. ఆ తర్వాత క్యారం బోర్డు బోర్ కొడుతోందనీ, చెస్ ఆడదామని వదిన అన్నది. నాకు చెస్ ఆడటం తెలియదు కాబట్టి తనే నేర్పించింది.

తను తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు, వారానికోసారి శని వారం రోజు ఇంగ్లీషు సినిమా చూడటం అలవాటు అట. మా అన్నయ్య సినిమాకి వెళ్ళనే వెళ్ళడు. ఏడాదికి ఒకసారో రెండు సార్లో వెళ్ళినా ఏ చిరంజీవి సినిమాకో వెళ్తాడు. అందు వల్ల నేను, మా వదిన కలిసి కొన్ని సార్లు శని వారాలు ఇంగ్లీషు సినిమాకి వెళ్ళడం అలవాటయ్యింది. చాలా మటుకు అన్నయ్య ఆదివారాల్లో కూడా ఇంట్లో ఉండడు. ఆఫీసులో చాల మందితో అతనికి స్నేహం ఉండడం, వాళ్ళ అవసరం కొద్దో, గొప్ప కొద్దో పెళ్ళిళ్ళు, చావు అంటూ ఎక్కడికైనా వెళ్లి పోయే వాడు. అందరికన్నా ఎక్కువగానే స్నేహితులని కలవడం అతనికి అలవాటు. రోజుకి భార్యతో పది నిమిషాలు మాట్లాడితే ఎక్కువ. మా వదినకో గలగలమంటూ మాట్లాడే స్వభావం. ఒక రోజు వదిన నన్ను అడిగింది.

“అవునూ, కోపరేటివ్ సొసైటీ లోనూ, క్యాంటీన్ లోనూ డైరక్టర్ కదా మీ అన్నయ్య. ఏదో కొంచం ఆదాయం అందులో నుంచి వస్తోంది. యూనియన్ కమిటీలో మెంబర్‌గా ఉండటం దేనికీ?”

“యూనియన్ కమిటీలో మెంబరుగా ఉండటం వల్లనే మిగిలిన దాంట్లో డైరక్టర్ అయ్యే చాన్సు దొరికింది.” ఊరికే అనకూడదు కానీ, మా అన్నయ్య ఎం. పి.గా ఉండాల్సిన వాడు.

“ఈ వయస్సులో సంపాదించాల్సిందే. కాదనను నేను. కానీ మరీ ఇలానా? దానికి ఒక వేళా పాళా ఉండక్కర్లేదా? ఈ వయస్సులోనే కదా అనుభవించడం కుదురుతుంది? వయసై పోయిన తరువాత ఎన్ని అనుకున్నా ఏం లాభం?” వదిన కొన్ని సార్లు తన దిగులును నాతో పంచుకునేది.

“వదినా! అనుభవించడానికి వయసెక్కడ? మా చుట్టాలల్లో జరిగిన కధ చెప్పనా? మా పెదనాన్న ఇప్పుడు మైలాపూరులో ఉన్నారు. అడ్వకేటు. అమోఘమైన ప్రాక్టీసు. అది గాక ఇంకా ఎన్నో విధాలుగా డబ్బు సంపాదించే వారు. ఉన్నట్టుండి ఒక రోజు, నలబై ఎనిమిదో ఏడు నడుస్తుండగా కోర్టుకు వెళ్ళడం మానేశారు. జడ్జ్ పదవి దొరకలేదన్న కోపం అని కొంత మంది అన్నారు. నలుగురు జడ్జీలు సంపాదించే డబ్బుని ఆయన ఒక్కరే సంపాదించే వారు. అది కారణమయి ఉండదు. ఎందుకో వద్దనిపించింది. అంతే మానేశారు. కానీ వడ్డీలు, బాడుగ, డివిడెండ్ అంటూ డబ్బు సంపాదనకి కొరత లేదు. ఇప్పుడు రోజుకి ఎనిమిది గంటలు తాగుడు. ఇంకో ఎనిమిది గంటలు పేకాట, మూడో ఎనిమిది గంటలు ఇంకా ఏదో. ఐదేళ్లుగా ఇష్టం వచ్చినట్లు రంగేళీ రాజాలా జీవితాన్ని గడుపుతున్నారు. ఎందుకు చెప్ప వచ్చానంటే. యాభై ఏళ్ల వయసులోనూ అనుభవించ వచ్చు.”

“ఏమోయ్, ఇదెక్కడి కథ, నేనెప్పుడూ వినలేదే? మీ పెదనాన్న గారా? మైలాపూరులో ఉంటారా. సంబంధం మాట్లాడేటప్పుడు అత్తయ్య నాతో ఏమీ చెప్పినట్లు లేదే?”

“మేమూ ఆయన గురించి చెప్పుకోవడం లేదు. ఆయన కూడా దాన్ని లెక్క చేయరు. నేను కాలేజీలో చదువుతున్న రోజుల్లో నెలకోసారో, రెండు సార్లో ఆయన ఇంటికి వెళ్లి చూసి వచ్చే వాడిని. నమస్కారం చేసినప్పుడు, ఐదో, పదో చేతిలో పెట్టేవారు. ఫెయిల్ అయిన తరువాత వెళ్ళడం మానేశాను. ‘చదవడానికి యోగ్యత లేదు. డబ్బు కావాల్సి వచ్చిందా నీకు దున్నపోతా,’ అన్నారు ఒకసారి. దున్నపోతా అని ఆయన అన్నది ఇప్పుడు కూడా నా చెవుల్లో గింగురుమంటుంటుంది.”