పలుకుబడి – కాలమానము II

అన్నీ మనవేదాల్లోనే ఉన్నాయిష!

నవంబర్ సంచికలోని పలుకుబడి వ్యాసంపై వ్యాఖ్యానిస్తూ లైలా, భారతీయ ‘కల్పం’ గురించి, స్విస్ దేశానికి చెందిన పర్మెజానీ సంస్థ తయారుచేసే ‘కల్ప’ చేతిగడియారాల గురించి ప్రస్తావించారు. లైలాగారు చెప్పినట్టు బ్రహ్మ జీవితంలో ఒక రోజుకు (ఒక పగలుకు) కల్పం అని పేరు. ఆ సమయం మానవ కాలమానం ప్రకారం సుమారు 43 కోట్ల 20 లక్షల సంవత్సరాలని భారతీయుల నమ్మకం. అయితే, వేదకాలం నుంచి మనకు సెకండులో ఒక కోటివంతు (10-7 సెకండ్లు) కాలం నుండి 40 లక్షల కోట్ల సంవత్సరాల (1022 సెకండ్లు) దాకా లెక్క పెట్టగలిగే కాలమానం ఉండేదని చెప్పే వెబ్‌సైట్లు ఇంటర్నెట్టులో కోకొల్లలు. అలాగే, వేదాలలో (సూర్య)కాంతి వేగాన్ని కూడా విలువకట్టి చెప్పారని, అది నేటి శాస్త్రవేత్తలు ఆధునిక పద్ధతులను ఉపయోగించి కనిపెట్టిన విలువకు ఉరమరగా సరిపోతుందనీ గర్వంగా చెప్పుకోవడం కూడా కొన్ని సైట్లలో కనిపిస్తుంది. అయితే, ఇందులోని సత్యాసత్యాల గురించి కాస్తా విచారిద్దాం.

చాంద్రమానం, సౌరమానం, సౌర-చాంద్రమానం

ఒక అమావాస్య నుంచి మరుసటి అమావాస్య దాకా ఉన్న ‘నెల’ రోజులను ప్రమాణంగా తీసుకొని కాలాన్ని కొలవడం అనాదిగా మానవునికి తెలుసని ఇంతకు ముందు విడతలో చర్చించాం కదా! అమావాస్య నుండి అమావాస్య దాకా సుమారు ముప్ఫై రోజుల కొకసారి చంద్రకళలు పునరావృత్తమౌతాయని దాదాపు అన్ని నాగరికతలకు తెలుసు. ఈ రకంగా పౌర్ణమి, అమావాస్యల ఆధారంగా కాలాన్ని కొలవడాన్ని చాంద్రమానం (lunar) అంటారు.

ఇదే విధంగా క్రమం తప్పకుండా వచ్చే చెట్లు చిగురించే కాలాన్ని, ఆకురాలే కాలాన్ని గమనించడం నేర్చుకున్నాడు మానవుడు. వ్యవసాయం అభివృద్ధి చెందిన నాగరికతలలో వర్షాలు ఎప్పుడు పడతాయో, ఎండాకాలం ఎప్పుడు వస్తుందో తెలియడం ముఖ్యం. ఈజిప్టులోని నైలునదికి దాదాపు 360-370 రోజులకొక సారి వరదలు వచ్చేవట. సూర్యుని ఎండ తీక్షణతలోనూ, రాత్రి-పగళ్ళ కాలపరిమాణంలోనూ ఇదే 360 రోజుల క్రమంలో మార్పులు వచ్చేవని వారు గమనించారు. ఈ మార్పుల ననుసరించి కాలాలు, ఋతువులు 360 రోజుల్లో పునరావృత్తమవుతాయని అనుకునేవారు. ఈ రకంగా సూర్యుని గతిమీద ఆధారపడిన కాలమానాన్ని సౌరమానం (solar) అంటారు.

నాగరికతలు వెలసిన తొలిరోజుల్లలోనే, తేలికగా గమనించగలిగే చాంద్రమానాన్ని, వ్యవసాయానికి అవసరమైన సౌరమానాన్ని అనుసంధానం చేసే సౌర-చాంద్రమానాలు (lunisolar) కూడా కొన్ని తయారయ్యాయి. ముప్ఫై రోజుల నెల లెక్కను బట్టి ఒక సౌరసంవత్సరం దాదాపు 12 చాంద్రమాసాలకు సమానమై ఉంటుందని వారు ఊహించారు. అయితే, ఒక్కో చాంద్రమాసం నిజానికి దాదాపు 29½ రోజులు; కాబట్టి 12 చాంద్రమాసాలు 354 రోజులకు సమానం. కానీ, సుమారు సౌరసంవత్సరంలో 365¼ రోజులు. అంటే ఈ రెండు పద్ధతుల కొలతలలో సంవత్సరానికి దాదాపు 11-12 రోజుల తేడా. ఈ రకమైన తేడాను వారు ఆ రోజుల్లోనే పసికట్టారు. ఈ వ్యత్యాసాన్ని అధిగమించడానికి రెండున్నర సంవత్సరాలకొకసారి అధికమాసం అని 13వ నెలను జతచేసేవారు. ఈ రకమైన అధికమాసపు పద్ధతి బాబిలోనియన్, ఈజిప్టు నాగరికతలలోనూ, యూదు, గ్రీకు, భారతదేశాలలో కనిపిస్తుంది. వ్యవసాయంతో పాటు ఈ పద్ధతి తూర్పు ఆసియాలో అభివృద్ధి చెంది మిగితా ప్రాంతాలకు పాకిందని కొంతమంది చరిత్రకారులు ఊహిస్తే, మరికొంతమంది ఎవరికివారే విడివిడిగా ఈ పద్ధతిని కనుక్కొన్నారని వాదిస్తారు. ప్రకృతిసిద్ధమైన విషయం గురించి భిన్నమైన నాగరికతలు ఒకరికొకరు తెలియకుండా, ఒకేరకమైన సిద్ధాంతాన్ని తయారుచేయడం అంత అసాధ్యమేమీ కాదని వీరి వాదన.

వేదాలలో కాలమానం

యస్యాగ్నిహోత్రం అదార్శం అపౌర్ణమాసం
అచాతుర్మాస్యం అనాగ్రాయణం అతిథివర్జితంచ
అహుతం అవైశ్వదేవం అవిధినాహుతం
ఆసప్తమాంస్ తస్య లోకాన్ హినస్తి (మాండుక్యోపనిషత్తు 1. 2.3)

ఎవరైతే నిత్యాగ్నిహోత్రముతోపాటు పౌర్ణమికి, మాసానికి, చతుర్మాసానికి, ఆగ్ర అయనానికి తగిన క్రతువులు చేయరో […] వారు సప్తలోకాలలో తమ గతిని నాశనము చేసుకొందురు.

కాలానుగుణంగా క్రతువులు చెయ్యాలని శాసించే వారికి ఆ కాలగమనం గురించి స్థూలంగానైనా అవగాహన ఉండేదని మనం ఊహించవచ్చు. వేదాలలో అతిప్రాచీనమైన ఋగ్వేదం లోని శ్లోకాల ద్వారా వారికి అప్పటికే కచ్చితంగా చంద్రగమనం గురించి, సూర్యగమనం గురించి స్పష్టమైన అవగాహన ఉండేదని, క్రమం తప్పకుండా వచ్చే ఋతువుల గురించి, అధికమాసం గురించే కాక, సంవత్సరానికి రెండు సార్లు వచ్చే విషువత్తుల (equinox) గురించి, అయనాల (solstice) గురించి కూడా తెలుసునని మనం గ్రహించవచ్చు.

ఋగ్వేదంలో ఋత(ము) అంటే క్రమము, సత్యము, ధర్మము; అనృతము అంటే క్రమం తప్పినది, అసత్యమైనది అన్న అర్థాలున్నాయి. ఋగ్వేదంలో ‘ఋత’ అన్న పదం చాలా ప్రచురంగా కనిపిస్తుంది. ఇది ఇండో-యూరోపియన్ మూల ధాతువు *హర్-త్- నుండి వచ్చిందని భాషావేత్తల ఊహ. గ్రీక్ దేవత పేరైన Arete, Harmony మొ., దీనికి సోదర పదాలు (cognates). విషువత్తు (equinox) రోజున భూమిపైన రాత్రిభాగం, పగటిభాగం సమానంగా ఉంటాయి. విషు- అంటే రెండు వైపులా (సమానంగా). విషువత్- అంటే సమానమైన భాగాలు కలది. రాత్రి, పగలు సమాన భాగాలుగా గల రోజును విషువత్తు అంటారు.

ఋగ్వేదంలో ఆయా కాలాలలో నిర్వహించవలసిన క్రతువులను వివరించే శ్లోకాల ద్వారా ఆనాటి కాలమానం యొక్క వివరాలను అంచనా వేయవచ్చు. ఉదాహరణకు, ఋగ్వేదంలోని ఏడవ మండలంలో 103వ సూక్తంలోని 7-9 శ్లోకాలలో సంవత్సరం చివర బ్రాహ్మణులు జరిపే సోమ-అతిరాత్ర యజ్ఞాన్ని వివరిస్తూ, 12 మాసాలను (ఋతువులను) చక్కగా కాపాడిన ఋత్విక్కులు సోమరసం తాగుతూ ఈ యజ్ఞాన్ని వేడుకగా నిర్వహిస్తారని వర్ణిస్తారు.

బ్రాహ్మణాసో అతిరాత్రే న సోమే సరో న పూర్ణం అభితో వదంతః
సంవత్సరస్య తదహః పరిష్ఠ యన్ మండూకాః ప్రావృషీణం బభూవ
బ్రాహ్మణాసః సోమినో వాచం అక్రత బ్రహ్మ కృణ్వంతః పరివత్సరీణం
అధ్వర్యవో ఘర్మిణః సిష్విదానా ఆవిర్ భవంతి గుహ్యా న కే చిత్
దేవహితిం జుగుపుర్ ద్వాదశస్య ఋతుం నరో న ప్ర మినంత్యేతే
సంవత్సరే ప్రావృష్యాగతాయాం తప్తా ఘర్మా అశ్నువతే విసర్గం
(ఋగ్వేదం 7.103.7-7.103.9)

సంవత్సరానికి 12 మాసాలన్నది దైవనిర్ణయమని, వాటిని చక్కగా నిర్వర్తించినందుకు బ్రాహ్మణులు జరుపుకొనే విజయోత్సవమే సోమ-అతిరాత్ర యజ్ఞమని ఈ శ్లోకాల ద్వారా మనకు తెలుస్తున్నది.

ఋగ్వేదంలోని మొదటి మండలం 25వ సూక్తంలోని 8వ శ్లోకం వరుణుని గురించి చెబుతూ:

వేద మాసో ధృతవ్రతో ద్వాదశ ప్రజావతః
వేదా య ఉపజాయతే (1.25.8)

వరుణ దేవునికి పన్నెండు మాసాల గురించి బాగా తెలుసు; (ఇవి కాక) ఇంకొక మాసం గురించి కూడా తెలుసు.

ఇక్కడ ఇంకొకమాసం అంటే అధికమాసం గురించే ప్రస్తావిస్తున్నారని అనుకోవాలి. యజుర్వేదంలోని 1.4.14 శ్లోకంలో ఈ అధికమాసాల గురించి విపులంగా వివరిస్తూ, ఇది ప్రతి అయిదు సంవత్సరాలకు రెండు సార్లు వస్తుందని చెబుతుంది.

ఋగ్వేదంలోనే కాలామానాన్ని చాలా గుహ్యంగా వర్ణించే ఈ కింది శ్లోకాలను గమనించండి:

ద్వాదశారం నహి తజ్జరాయ వర్వర్తి చక్రం పరి ద్యామృతస్య ।
ఆ పుత్రా అగ్నే మిథునాసో అత్ర సప్త శతాని వింశతిశ్చ తస్థుః ॥ 1.164.11
పంచపాదం పితరం ద్వాదశాకృతిం దివ ఆహుః పరే అర్ధే పురీషిణం ।
అథేమే అన్య ఉపరే విచక్షణం సప్తచక్రే షళర ఆహురర్పితం ॥ 1.164.12

అగ్నీ, ముసలితనం లేకుండా స్వర్గం చుట్టూ నీ చక్రం ద్వాదశ అరములతో (spoke – బండికంటియాకు) సదా తిరుగుతూ ఉన్నది. నీ 720 జంట కవలల పుత్రులు కూడా కనిపిస్తున్నారు. వారు అయిదు పాదాలు కలిగి, పన్నెండు ఆకృతులు కలిగిన పితరుడిగా నిన్ను భావిస్తున్నారు. మరికొంతమంది నిన్ను ఆరు ఆరములతో, సప్త చక్రాలు కలిగిన విచక్షణునిగా పరిగణిస్తున్నారు.

ఇక్కడ అగ్నిని సూర్యుడినిగా భావించి సంబోధించే శ్లోకాలు ఇవి: అతని పుత్రులు 720 జంట కవలలు – 360 పగళ్ళు, 360 రాత్రులు; అంటే వారు ఆ రోజుల్లో సంవత్సరాన్ని 360 రోజులుగా భావించారని అనుకోవచ్చు. అయిదు పాదాలు అయిదు ఋతువులు. పన్నెండు ఆకృతులు పన్నెండు నెలలు. మరి కొంతమంది ఆరు ఋతువులు కలిగి ఏడు రోజుల వారానికి ప్రతీకగా నిన్ను సప్తచక్రాలు ఉన్నవాడిగా పరిగణిస్తున్నారు.