సత్య మొహంతితో ముఖాముఖి – 1: సాహిత్యంలో వాస్తవికవాదం

 
సేనాపతి వాస్తవికత్వపు పోకడను వర్ణన ప్రధానమైనదిగా (descriptive) కాక, విశ్లేషణ పూరితమైనదిగా (analytical) చూడాలని మీరు పాఠకులను ప్రోత్సహించారు. ఐతే, మీరు ప్రతిపాదించిన ఈ పద్ధతి రెండు రకాల ప్రభావాలు కలిగి ఉన్నట్లుగా అనిపిస్తుంది. మొదటగా, విశ్లేషణ పూరిత వాస్తవికవాదం మనం పరంపరగా అందుకొన్న వాస్తవిక ధోరణుల పట్ల ఉన్న అసంతుష్టికి ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ఈ విషయంగా పాల్ సాయర్, మొహాపాత్ర, వెల్చేరు నారాయణరావు లాంటి వారి రచనల్లో మనకు ఉదాహరణలు కనిపిస్తాయి. వాస్తవికత చాలమంది విమర్శకులకు ప్రస్తుతం ఉన్న వాదాల మీద కలిగిన హేతుపూరితమైన అసంతృప్తిని సూచిస్తుంది. చూడబోతే, వీరందరూ వాస్తవికతను వీడకపోయినప్పటికీ, దీనిని గురించి క్రొత్తగా మునుపెన్నడు లేనట్లుగా వ్రాస్తున్నారు. రెండవది, ఆఫ్రికా నుండి, ఇండియా నుండి వెలువడుతున్న దేశీయ నవలలను ఇక యూరోపియను చట్రాలకు బిగించనవసరం లేని కారణంగా, విశ్లేషణాపూరితమైన వాస్తవికవాదం నవలావిశ్లేషణ పద్ధతులలో సమూలమైన మార్పులను తీసుకురాగలిగింది.

వర్ణన ప్రధాన వాస్తవికవాదానికి, విశ్లేషణాపూరిత వాస్తవికవాదానికి మధ్య ఉన్న అంతరం యొక్క అంతరార్థం మీకు లూకాచ్ (Georgy Lukacs) సహజత్వపు, వాస్తవికత్వపు నవలల మధ్య చూపిన భేదంలో ప్రతిధ్వనిస్తుంది. లూకాచ్ వాదం ప్రకారం సహజత్వాన్ని ప్రతిబింబించే నవలల్లో కొన్ని కేవలం వర్ణన ప్రధానమైనవి కాగా, మరి కొన్నింటిలో, ఉదాహరణకు బాల్జాక్ వ్రాసిన నవలల్లో, అంతర్లీనంగా ఉన్న సామాజిక, చారిత్రక నేపథ్యాల ధోరణులకు వివరణలు సైతం కనిపిస్తాయి. ఈ రెండవ పద్ధతిలో వ్రాయబడ్డ నవలలు వాస్తవికత్వాన్ని ఇంకా గాఢంగా ఎత్తి చూపుతాయి. వివరణ ప్రధానమైన ఈ నవలలు సంస్కృతిలో భాగంగా పైకి కనిపించే వాటినే కాకుండా, అంతర్హేతుకంగా పని చేసే వివిధ శక్తుల నిమిత్తకారణాలను కూడా తమ వివరణల్లో పొందుపరుస్తాయి.

లూకాచ్ ఈ అంతరాన్ని ఆయన చేసిన నవలావిశ్లేషణలకు సంతృప్తికరంగా వర్తింపజేయలేక పోయినప్పటికి, ఆయన చూపిన ఈ భేదం చాలా విలువైనది. నిజానికి ఆయన అభిరుచులే ఆయనను పరిమితం చేశాయి. ఆయన యూరొప్‌కి చెందిన కొందరు ఆధునిక రచయితల రచనల పైన చేసిన ప్రతిస్పందనలు తప్పుదోవ పట్టించే విధంగా ఉంటాయి. కాని, మన పరిధిలో, మన ప్రయోజనార్థం లూకాచ్ నవలల మధ్య చూపిన ఈ అంతరాన్ని గుర్తించడం చాల ముఖ్యం. ఈ గుర్తింపు ద్వారా ఈ నవల లోని జ్ఞానసంపదని, రచనాప్రక్రియలకు చెందిన వృత్తాంత స్వరూప సృజన స్థాయిలను, మనం సరిగా అర్థం చేసుకోగలం.

మన సాహిత్యానికి తిరిగి వస్తే, సేనాపతి సృజించిన కథకుడు ఒక ముఖ్యమైన సాహితీ సృష్టి అని నేను, నాతో పాటుగా మరికొందరము, వాదించాము. సేనాపతి తన సృజన కోసం మౌఖికమైన సాంప్రదాయాల పైన, ఇతర సాంఘిక, సాంస్కృతిక ఆచారాల పైన ఆధార పడ్డాడు. అందువల్ల, కేవలం కథన ప్రక్రియ ద్వారా ప్రతిబింబత్వంతో సాధ్యంకాని లోతైన వాస్తవికతను మరింత గాఢంగా ఆయన సృష్టించగలిగాడు. ప్రతిబింబత్వం కేవలం దృశ్యమానమైన సమాజ పరిస్ఠితులను విశ్వాసపాత్రంగా వర్ణించగలుగుతుంది. అంతే. కాని, సేనాపతి సృష్టించిన కథకుడు పాఠకుడిని ఒక క్రియారూపక సహభాగిగా మారేందుకు ప్రేరేపిస్తాడు. అందులో పాఠకుడి పాత్ర కథనాన్ని ఊరికే తెలుసుకోవడానికే పరిమితం కాదు. పాఠకుడు సామాజిక దృక్పథాలతో సమ్మిళితంగా ఉన్న నిర్హేతుక పక్షపాత వైఖరులను కూడా తెలుసుకో గలుగుతాడు.

ఇదే అభిప్రాయాన్ని పాల్ సాయర్ జార్జి ఎలియట్‌ను, సేనాపతిని పోల్చుతున్న సందర్భంలో వెలిబుచ్చాడు. హిమాంశు మొహాపాత్ర సైతం ఇదే భావనను ఛ మన ను గోదాన్‌తో పోలుస్తూ చేశాడు. ఉల్కా అంజారియా 2006 E.P.W వ్యాసం (శ్రీ లాల్ శుక్లాను, సేనాపతిని పోలుస్తూ), జెన్నిఫర్ వార్గాస్ వ్రాసిన తులనాత్మక వ్యాసం కూడా ఈ కోవకు చెందినవే. నారాయణ రావు రచనల్లో, తిలోత్తమ మిశ్ర బారువాను, సేనాపతిని పోల్చుతూ చేసిన రచనలో కూడా ఇవే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. నా దృష్టిలో ఈ E.P.W సంకలనం ద్వారా వెలువడ్డ ప్రతి వ్యాసం కూడా ఒక బహుళవర్ష ప్రణాళికను ప్రేరేపిస్తుంది. సాహిత్యంలో వర్ణన ప్రధానమైన వాస్తవికతకు, విశ్లేషణ ప్రధానమైన వాస్తవికతకు మధ్య ఉన్న అంతరాలను విస్తారంగా శోధిస్తూ అవి భారత దేశ పరిస్థితులకు ఎలా వర్తిస్తాయో అని సిద్ధాంత గ్రంథాలు వ్రాయవచ్చును. దీని వలన, భారతీయ చారిత్రాత్మక నేపథ్యంలో వాస్తవికత్వపు ధోరణులను గురించి మరింత కూలంకషంగా తెలుసుకొనగలిగే అవకాశం లభిస్తుంది. ఇంతకు పూర్వమే ప్రస్తావించిన కుంకుమ్ సంగారి 1980ల్లో రూష్దీని, మార్కెజ్‌ని పోల్చుతూ వ్రాసిన వ్యాసం, లేదా ఒడియా ఆదివాసి కవి భీమ బోయి, స్వామి వివేకానందల గురించి ముక్తి లాఖి మంఘారం చేసిన తులనాత్మక విశ్లేషణ సైతం ఈ కోవ లోకి చెందినవే అని చెప్పవచ్చు.

మీరు విశ్లేషణ పూరిత వాస్తవికవాదం గురించి చేసిన రెండవ సూచన ఇంకోసారి చూద్దాం. 19 వ శతాబ్దపు భారత దేశంలో వాస్తవిక సాహిత్య పద్ధతిని అధీన (subaltern) దృష్టికోణం నుండి వలసవాద వ్యతిరేక చైతన్యాన్ని సాధించడానికై అప్పుడప్పుడు ఉపయోగించేవారని మీ వాదం. దీని ద్వారా మీరు మొత్తంగా వాదపు ప్రాథమిక కేంద్రాన్నే మారుస్తున్నారు, అంటే యూరోపియన్ సాహితీ విమర్శకు ప్రధానమైన నిష్పాక్షిక దృక్పథం, సామాజిక సంఘర్షణ, బూర్జువా వర్గాల ఆవిర్భావం, ఇంకా బూర్జువా విశ్వదృక్పథం వంటి వాటి నుండి దృష్టిని వాస్తవికవాద కథన ధోరణుల్లో అంతర్లీనంగా ఉండే కథకుడి స్వరం, భావం, చూపు, వ్యంగ్యభరితమైన వ్యాఖ్యానం, కథనం లోని నిలుపుదలలు, మౌనాలు, వెల్లడులు లాంటి వాటికి మార్చుతున్నారు. వాస్తవికత అంటే, కనీసం ఒక స్థాయిలో, కేవలం ఒడియా, అసామీ, పాలా సంప్రదాయాల్లో వ్యక్తమయ్యే ప్రదర్శన స్వరానికీ, సంస్కృత, ఆధునిక ‘బెంగాలి బాబు-వ్యతిరేకి’ విమర్శకుడికీ మధ్య జరిగే ఘర్షణగా చెప్పవచ్చా? ఈ విధమైన విశ్లేషణ మనలను ఎక్కడికి తీసుకొని వెళ్తుంది, ఏమి చూసేలా చేస్తుంది?

నా వాదాన్ని వాస్తవిక నవలలన్నింటికి వర్తించకూడదు. ఎందుచేతనంటే, ఇంకా ఎంతో సాహిత్య, చారిత్రక ప్రధానమైన పరిశోధన జరగవలసి ఉంది. ఐతే, విశేషంగా ఈ విశ్లేషణ ద్వారా మనం అధీన దృక్కోణం (sub-altern perspective) గురించి చాలా తెలుసుకోవచ్చు. ఈ చర్చ మనలను సాధారణంగా అధీన ఆలోచనా సరళి, విచారాల పట్ల నిర్మాణ క్రమవాదులు వినిపించే సంశయవాదాల నుండి విముక్తి కలిగిస్తుంది. కొన్ని సందర్భాలల్లో అధీన దృక్కోణాన్ని బలమైన వేరే దృక్పథాలు ముంచేస్తాయి అని చెప్పటం సరైన విషయమే అయినా, చారిత్రక, సామాజిక సందర్భాలను అధిగమించి అతిగా సాధారణీకరింపబడిన ఏ ఒక్క అభిప్రాయం కూడా పూర్తిగా సరైనది కాదు.

అనుభవ పూర్వకంగా మనం తెలుసుకోలేని విషయాలెన్నో ఉన్నాయి. కేవలం ఈ ఒక్క కారణం వల్లనే ఆధీన దృక్కోణంపై సంశయ పడకూడదు. అధీన దృక్కోణాన్ని గురించిన ఏ ప్రశ్నయినా కూడా సంపూర్తి గానూ, ప్రాథమికం గానూ, సైద్ధాంతికమైనదే అయివుండదు. అటువంటి జ్ఞానాన్ని పొందాలి అనుకుంటే మనకు ఆత్మార్థకమైన, సందర్భోచితమైన సైద్ధాంతిక సాధనాలు కావలసి ఉంటుంది. చరిత్రకారులు, ఇతర సామాజిక శాస్త్రజ్ఞులు చేసే కృషి ఇక్కడ బాగా పనికి వస్తుంది. మీరు సూచించిన విమర్శకులు చేసే సాహితీ విశ్లేషణ కూడా ఒక యుక్తమైన అంశమే. థామ్సన్ వ్రాసిన Moral economy of the crowdలో (1971), లేదా జేమ్స్ స్కాట్ (James Scott) వ్రాసిన Weapons of the weakలో, ఇటువంటి సంశయవాదం మచ్చుకైనా కనిపించదు. హాబ్స్‌బామ్ (Eric Hobsbawm) సంశయ వాదాన్ని యదార్థమైన పరిశోధనా సందర్భాల్లో, భావజాలపరమైన పక్షపాత వైఖరుల్లో, ఇంకా సైద్ధాంతిక పద్ధతిలో ప్రకటిస్తూ ఎంత జాగరూకతతో, ఆత్మార్థక దృష్టితో ‘గ్రాస్ రూట్స్’ చరిత్రను నిర్మిస్తాడో గమనించండి.

కేవలం ఉత్తర నిర్మాణక్రమవాదం చేత ప్రభావితం కాబడ్డ పక్షాల్లో కనిపించే మితిమీరిన దుస్సందేహ విధానం ఒక్కటే కాదు పరిశోధకులుగా మనకు ఉపలబ్ధంగా ఉన్నది. మంచి ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి. ఈ సందర్భాల్ల్లోనే, సాహితీ విమర్శకులు ఉపయోగకరమైన వ్యాఖ్యానాలు చేయవచ్చు. అధీన వ్యక్తి అన్నవాడు మాట్లాడలేడు, అతడు చెప్పింది మనం అర్థం చేసుకోలేము అని వాదించే ముందు — ఉదాహరణకు, మౌఖికమైన, అభినయ ప్రదర్శన ప్రధానమైన సంప్రదాయాల నుండి వెలువడిన — ఏ విధమైన సాహితీ పద్ధతులు మనకు దేశీయ సాహిత్యాల్లో నిబిడీకృతంగా ఇమిడి ఉన్న విమర్శను చూపిస్తాయి అని విమర్శకులు అడిగితే బావుంటుంది. అసమియా రచయిత హేమచంద్ర బరూవాతో సేనాపతిని జతచేసి చదివినట్లైతే, తిలోత్తమ మిశ్ర చూపినట్లుగా, ఈ రకమైన విశ్లేషణకు ఆస్కారం ఉంటుంది. (ఈ మౌఖిక సంప్రదాయాన్ని, నవలల్లో కథన ప్రక్రియ మీద విశ్లేషణను ఖండాంతరాలకు వర్తింప జేస్తే, సేనాపతి వ్రాసిన నవలను, ఉదాహరణకు ఆమోస్ టుటుఒలా (Amos Tutuola) 1952లో యోరుబా జానపద గాథలపై ఆధారపడి వెలువరించిన The Palm-Wine Drinkardతో పోల్చవచ్చును.)

మీరు చెప్పిన దాన్ని పునఃపరిశీలిస్తే గనుక, వాస్తవికవాద నవలకు నిష్పాక్షిక సామాజిక వాస్తవికత్వం ముఖ్యం కాదు అని తెలియజేసే ఉద్దేశమేమీ నాకు లేదని స్పష్టం అవుతుంది. సాహిత్యంలో నిష్పాక్షిక వాస్తవికత్వాన్ని ప్రతిబింబించడం ప్రకృతికి అద్దం పట్టి అతి సూక్ష్మమైన విషయాలను వర్ణించడం ద్వారా సాధ్యపడదు అనే నేను చెప్పడం. మనం చర్చిస్తున్న ప్రతి నవల, ప్రతిబింబత్వం ఏ విధంగా జ్ఞానమీమాంసక ప్రాధాన్యం కలిగి వుంటుందో చూపగలగాలి. భారత దేశానికి, ఆఫ్రికాకి చెందిన నవలలు ఆధారపడే జానపద గాథా పద్ధతులను విశ్లేషించే సమయంలో ఈ విషయాలని దృష్టిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం.

ఇప్పుడు అనువాదం గురించి కొంచెం మాట్లాడుకుందాం, ముఖ్యంగా మీరు సహానువాదకులతో కలిసి చేసిన ఛ మన ఆఠ గుంట అనువాద ప్రక్రియ గురించి. మీ నలుగురు అనువాదం చేస్తున్న క్రమంలో ఎప్పుడైనా అనువాద ప్రక్రియ స్తంభించిన సందర్భాలున్నాయా? ప్రత్యేకించి, ఉద్దేశపూర్వకంగా, అన్యాపదేశమైన విషయాలను సూచించేదిగా నిర్మించిన పాఠ్యాన్ని ఆంగ్లంలోకి అనువదించే క్రమంలో మీ అనువాదం ఆగిన సందర్భాలున్నాయా? మీరు ఈ నవల యొక్క మౌఖిక, ప్రదర్శనాత్మక, సాంకేతిక భాగాలను, మరీ ముఖ్యంగా కథకుడు ప్రదర్శించే వ్యంగ్య ప్రవృత్తి, వ్యక్తావ్యక్త సంశయాత్మక ధోరణి, లేదా సున్నితంగా తీర్పులు చేయటాన్ని తిరస్కరించడం వంటివి అనువదించేటప్పుడు మీరు ఏ పద్ధతులను అవలంబించారు? మీ ఉపోద్ఘాతంలో అనువాదపు మేరని గురించిన కొన్ని సూచనలు కనబడతాయి. ఉదాహరణకు, ఉపోద్ఘాతంలో మీరు గ్రామంలో చెరువు దగ్గర స్త్రీల సంవాదాల్లో లాల్ బిహారి డే ప్రాచ్యవాద భావాలను వ్యంగ్యంగా చిత్రీకరించే విధానాన్ని వర్ణిస్తారు. ఈ రకమైన అనువాద ప్రక్రియ మీకు మీ సహానువాదకులకు 19వ శతాబ్దపు భారతీయ వాస్తవిక నవల ఒక ఘనీభవించిన ఉపరితలంలా కాక వివిధ భాషలకు చెంది అప్పటికే అనువదింపబడ్డ సాహిత్యపు ఒక పొరలా అనిపించిందా?

అవును. మీరు ఊహించినట్లుగానే మా అనువాద ప్రక్రియ చాల సార్లు స్తంభించింది. ఈ పని చాల కష్టమనే చెప్పాలి. సేనాపతి భాష విభిన్న స్థాయిలలో కథనాన్ని వ్యక్తం చేస్తుంది. చిన్నకారు రైతులు ఉపయోగించే నుడికారాల నుండి ఉన్నతకులాలు వాడే సంస్కృతీకరించబడ్డ ఒడియా భాష, పారశీక ప్రభావితమైన పద సరళి నుండి ఆంగ్ల సంస్కృత భాషల (ఆధిపత్యం కలిగినవిగా) ప్రత్యక్ష ప్రతిధ్వనులు, ఇంకా చెప్పాలంటే అనాపేక్షితంగా వచ్చే సాదాసీదా కథన పద్ధతి నుండి నిశితమైన వ్యంగ్య ధోరణి వరకు, ఇవన్నీ ఆంగ్లీకరించడానికి గాను భాషను చాలా వరకు చదును పరచవలసి ఉంటుంది. (ఇంతకు పూర్వం జరిగిన హిందీ అనువాదం చాలా బాగుందని విన్నాను. అలాగే తెలుగు అనువాదం గురించి కూడా విన్నాను. కొందరు బెంగాలీ పాఠకులు బాంగ్లా అనువాదం మూల భాషా ధ్వనిని కోల్పోయిందన్న అసంతృప్తిని వ్యక్తపరిచారు. బాంగ్లాలో సంస్కృతీకరించబడిన ‘సాధు’ నుడికారాన్ని మిగతా నుడికారాలన్నింటికన్నా ఎక్కువ విలువైనదిగా భావిస్తారు. ఇది ఒక కారణం కావచ్చు.)