వంశీవనము (హాలుని గాథాసప్తశతి నుండి కొన్ని పద్యములు)

పసు-వఇణో రోసారుణ-పడిమా-సంకంత-గోరి-ముహ-అందం
గహిఅగ్ఘ- పంకఅం విఅ సంఝా-సలిలంజలిం ణమహ

పశుపతే రోషారుణ-ప్రతిమా-సంక్రాంత-గౌరీ-ముఖ-చంద్రం
గృహీతార్ఘ-పంకజమివ సంధ్యా-సలిలాంజలిం నమత

సందెజపమ్మును జేయగ
కెందామర దోసిలి గల ఘృణిదర్పణమం
దందపు టెఱ్ఱని శశిముఖి
గందోయిని గను పశుపతి కంజలు లిత్తున్
… 1-01

The water in His lotus hands
for the evening prayers
reflects the moon like face of His consort
red with anger in the dusky glow
My obeisance to Lord Siva

పరిచయము

ప్రాచీన భారతీయ సాహిత్యములోని పురాణ, ఇతిహాస, కావ్యములలో నాయకీనాయకులు ఎక్కువగా రాముడు, కృష్ణుడు, శివుడి లాటి దైవాలు లేకపోతే దుష్యంతుడు, వత్సరాజు, పురూరవుని వంటి రాజులు. సంస్కృత నాటకాలలో అక్కడక్కడ భటులు, చెలికత్తెలు బోటి సామాన్య పాత్రలు కనిపిస్తాయి. కాని వీళ్లు రంగస్థలము పైన ఒకటి రెండు పంక్తులను చెప్పి నిష్క్రమించేవారే. సామాన్య ప్రజల సుఖదుఃఖాలు, ఆటపాటలు, జీవిత విధానాలు ఈ గ్రంథాలలో మనకు అరుదుగా కనబడుతాయి. రెండువేల సంవత్సరాలకు ముందు జనబాహుళ్యానికి సంస్కృతము అర్థము కాకపోయినా అదే రాజభాష, కవుల భాష, పురోహితుల భాష. ప్రజాజీవితములో వాడబడే ప్రాకృత భాషకు సాహిత్యములో ఎక్కువ ఆదరణ లేదు. కాని దీనికి భిన్నముగా బుద్ధుడు పాళీ భాషలో బోధించాడు, జైనులు ప్రాకృత భాషలో గొప్ప సాహిత్యాన్ని సృష్టించారు.


విప్రలబ్ధ – చిత్రకారుడు: వంశీ

ప్రజాజీవితము లోని దైనందిన చర్యలు, వారి గృహస్థ జీవనము, కామకలాపాలు, హాలికుల ముచ్చట్లు, బాలబాలికల అమాయకత, ఇత్యాదులను గురించిన ముక్తకాలు మధ్యదేశములోని ప్రాకృత భాషలో, దక్షిణదేశములోని తమిళ భాషలో మనకు లభిస్తాయి. ప్రాకృతము లోని ఈ పద్యసంకలనమును గాహాకోశ అంటారు. ఇదియే ప్రాకృతభాషా సంకలనములలో మొట్టమొదటిది. దీని రచయిత శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించిన హాలుడు అంటారు. సాలవాహన లేక సాలాహణ అంటే హాలుడని అనుకొంటారు. హాలుడు సుమారు క్రీ. శ. 50 కాలము నాటి వాడు. తరువాతి కాలములో ఇది నేటి గాథాసప్తశతి (సత్తసఈ) రూపమును తీసికొన్నది. ఇందులో ఏడు వందల పద్యాలు ఉన్నాయి. పరిశోధకులు మాత్రము ఇందులోని పద్యాలను హాలునితో సహా ఎందరో కవులు వ్రాసినారని భావిస్తారు. ఇవన్నీ చెవుల కింపైన మహారాష్ట్రీ ప్రాకృతములో వ్రాయబడినవి. సంస్కృత నాటకాలలో స్త్రీ పాత్రలు శౌరసేనిలో సంభాషిస్తే, మహారాష్ట్రీలో పాడుతారు. ఈ పద్యాల కాలము మొదటి శతాబ్దము నుండి మూడవ శతాబ్దము వరకు అని అనుకొనవచ్చును.

ప్రాకృతభాషలోని కొన్ని పదములు తరువాతి కన్నడ తెలుగు భాషలలో చేర్చుకొనబడినవి. ప్రాకృత మూల పద్యములను పరిశీలిస్తే ఇది అవగతమవుతుంది. తుప్ప (నేయి), వణ్ణం (వన్నె), అత్త వంటి పదములను వీటిలో గమనించ వీలగును. ఒత్తు ర-కారాన్ని పలకడము కష్టమని ప్రజలు ఆనాడు కూడ భావించారు కనుకనే ప్రాకృతములో అట్టివి లేవు. అదే విధముగా దుఃఖము వంటి పదాలను దుక్ఖము అనే పలికారు. హాలుడు బహుశా నర్మదా గోదావరి (గోల) నదుల మధ్య ఉండి ఉంటాడు. ఇతనికి నర్మదా నది (రేవా) అంటే ఎక్కువ ప్రీతి. ఈ పద్యాలలో విష్ణువుపైన పద్యాలు ఉన్నాయి, శివుడిపైన ఉన్నాయి, బుద్ధుడిపైన ఉన్నాయి. శాతవాహన సామ్రాజ్యములోని మత సామరస్యమును ఇవి తెలుపుతుంది. ఇందులో సుభాషితములు ఉన్నాయి. సంభోగ శృంగారము, విప్రలంభ శృంగారము రెండు ఉన్నాయి. భర్త దేశాంతర్గతుడైతే ఒక స్త్రీ మఱదితో సుఖిస్తుంది, మరొక స్త్రీ మఱదిని మందలిస్తుంది. ఒక యువతి పరపురుషునితో ఏ ఇసుక దిబ్బ పైననో, ఏ వెదురుపొద లోనో ఆనందించడము ఆ కాలములో సర్వసాధారణము అనిపిస్తుంది. రైతు తన బిడ్డలను ప్రేమించే విధముగానే తన పొలాన్ని కూడ ప్రేమిస్తాడు అని మనకు తెలుస్తుంది. ఇలాటివి ఎన్నో ఇందులో.

ఊద్వచ్ఛో పిఅఇ జలం జహ విరలంగులీ చిరం పహిఓ
పావాలిఆ వి తహ తహ ధారం తణుఇం పి తణుఏఇ

ఊర్ధ్వాక్షః పిబతి జలం యథా యథా విరలాంగులిశ్చిరం పథికః
ప్రపాపాలికాపి తథా తథా ధారాం తనుకామపి తనూకరోతి

జల మడుగగ పాంథుం డా
జలజాక్షియు కరములందు జలమును బోసెన్
జలధారయు తగ్గె గనులు
కలియగ ధర బడెను నీళ్లు కాలము గడిచెన్
… 2-60

The thirsty traveler
begs for water
She pours water
into the cup of his hands
He drinks
and lifts his eyes
As the eyes met
less water poured
and he lets more water down
and time ticked away!

ఈ గాథలు ముక్తకములు, అనగా ఏ పద్యానికి ఆ పద్యము స్వతంత్రముగా నిలబడుతుంది. ముందున్న పద్యముతో గాని, వెనుక వచ్చే పద్యముతో గాని దీనికి సంబంధము లేదు. “తత్ర ముక్తకేషు రసబంధాభినివేశనః కవే తదాశ్రయ మౌచిత్యం” అని ఆనందవర్ధనుడు ముక్తకములను గురించి అన్నాడు. పరస్పర నిరపేక్షములై రసాభిముఖములగునవే ముక్తకములు అని దీని అర్థము అని టీకాకారుడు అన్నాడు. “ముక్తకం సంస్కృత ప్రాకృతాపభ్రంశ నిబద్ధం” అని కూడ ఆనందవర్ధనుడు చెప్పాడు.

భిచ్ఛాఅరోఁ పేచ్ఛఇ ణాహి-మండలం సావి తస్స ముహ-అందం
తం చటుఅం అ కరంకం దోహ్ణ వి కాఆ విలుంపంతి

భిక్షాచారః ప్రేక్షతే నాభి-మండలం సాపి తస్య ముఖ-చంద్రం
తచ్చటుకం చ కరంకం ద్వయోరపి కాకా విలుంపంతి

బిచ్చము నడిగిన వాడో
యచ్చెరువున నామె నాభి నవలోకించన్
మెచ్చెను శశిముఖ మామెయు
నచ్చటి కాకులు భుజించె నా భోజనమున్
… 2-61

He came to beg
and began to appreciate
her waist
She came to offer
and began to appreciate
his moon like face
The nearby crows ate
the food from the bowl and the plate!

(The beggar is the husband in disguise and his wife promptly identified him as her husband.)