వాన ముసురు

చలెక్కిన గాలి
దండెం మీది బట్టలని
తప తపలాడిస్తోంది.

నల్ల మబ్బుల కమాన్లు
బెజవాడ కొండని మీటి
సంగీతాన్ని
వాన చినుకులని
కురిపిస్తున్నాయి.

అప్పుడప్పుడూ
మెరుపులొచ్చి
ఊరంతా
వెండి వెల్ల వేసి
తుడిపేస్తున్నాయి.

బుగ్గలు పూరించి
గాలి
తలుపులని
చెట్ల తలలని
పొయ్యి మంటని
ఊదుతోంది.

ఊగుతోన్న
తేనీటి పొగల్లోంచి
సన్నగా వణుకుతోంది
టీ కప్పు మీద
ఆకు పచ్చ
కొండ.

[ఈ కవిత ఇటీవల ప్రచురించబడిన అడవిదారిలో గాలిపాట కవితా సంకలనం లోనిది – సం.]