వెల్చేరు నారాయణ రావు: కొన్ని పరిశోధనా గ్రంథాల పరిచయం

అప్పారావు గారు చిత్రించిన ‘కన్యాశుల్కం’లో ఈ రెండురకాల ఆధునికతల మధ్య సంఘర్షణని చూస్తాం. వలససంస్కృతి ఆధునికతకి ప్రతినిథిగా సౌజన్యారావు పంతులు నిలబడితే, పరిణామ ఆధునికతని మధురవాణిలో స్పష్టంగా చూస్తాం. అవసరాన్ని బట్టి అటూ ఇటూ దూకే గోడమీది పిల్లిగా గిరీశం నిలబడతాడు. దాదాపుగా మిగిలిన అన్ని పాత్రలు కూడ ఆ సంధికాలానికి అనుగుణంగా పరిణమిస్తున్నవే, జీవనప్రయాణం చేస్తున్నవే. వలససంస్కృతి మీద ఇలాటి ఎదురుదాడి చేసిన రచయితలు ఆ కాలంలో అప్పారావు గారు తప్ప మరొకరు లేరు. భారతదేశంలోనే కాదు, ప్రపంచసాహిత్యంలో ఎక్కడా ఇలా జరగలేదని నారాయణ రావు గారి సిద్ధాంతం. ఇలా ఎన్నో కొత్తకోణాల్ని ఆవిష్కరించి, నారాయణ రావు గారీ గ్రంథంలో కన్యాశుల్కం మీద ఆసక్తికరమైన, ఆలోచనాకారకమైన వివేచనని చేశారు.

వ్యాసపు పూర్తిపాఠం పుస్తకం.నెట్ లో లభ్యం. ఈమాటలో వేలూరి వేంకటేశ్వర రావు సమీక్ష.

5. The Sound of Kiss

తెలుగు సాహిత్యంలో పింగళి సూరనది ప్రత్యేకస్థానం. పదహారో శతాబ్దం చివరిభాగంలో విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత నివసించిన ఈ కవి ఎన్నో విషయాల్లో అద్వితీయుడు. చిన్నతనంలోనే తొలి తెలుగు ద్వ్యర్థికావ్యం ‘రాఘవ పాండవీయం’ రాశాడు. తర్వాత వచ్చిన అనేక అనేకార్థ కావ్యాల్లా కాకుండా వ్యాఖ్యానాల అవసరం లేకుండా అర్థం చేసుకోగలిగే కావ్యం ఇది. ఈ కావ్యం తర్వాత వచ్చింది ‘కళాపూర్ణోదయం’. మూడోదీ చివరిదీ ‘ప్రభావతీ ప్రద్యుమ్నం.’


ది సౌండ్ ఆఫ్ కిస్ (2002)
వెల్చేరు నారాయణ రావు, డేవిడ్ షూల్మన్

కళాపూర్ణోదయం కథ సూరన సొంతంగా అల్లింది. కావ్యప్రపంచానికి, భౌతికప్రపంచానికి ఒక అద్భుతమైన సంబంధాన్ని సిద్ధాంతీకరించింది. కథనపరంగా కూడ కళాపూర్ణోదయం మార్గం చాలా కొత్తది. అదివరకెప్పుడూ అంతటి సంక్లిష్టత, ఏకసూత్రత, ఉత్కంఠభరితమైన కథనం భారతీయ సాహిత్యంలో రాలేదు. చివరికి సంప్రదాయ తెలుగు రచనల్లో లెక్కలేని లోపాల్ని చూసిన కట్టమంచి రామలింగారెడ్డి వంటి వారికి కూడ ఎంతగానో నచ్చిన ఏకైక కావ్యం కళాపూర్ణోదయం. పాశ్చాత్య సాహిత్యంలో గొప్ప లక్షణాలనుకున్నవి ఇందులో పుష్కలంగా వుండటం దీనికో ముఖ్య కారణం. ఈ పార్శ్వాన్ని కూలంకషంగా పరిశోధించిన నారాయణ రావు, షుల్మన్, కళాపూర్ణోదయాన్ని దక్షిణాసియాలో వచ్చిన తొలి నవలగా నిరూపిస్తారీ సూరన కళాపూర్ణోదయానికి ఆంగ్లానువాదం The sound of the kiss అన్న గ్రంథంలో. ఒక నవలకుండవలసిన లక్షణాలు స్పష్టంగా ఇందులో ఉన్నట్టు చూపిస్తారు. నారాయణ రావు గారి మిగిలిన రచనలమల్లేనే దీన్లో కూడ లోతైన విశ్లేషణలతో, అనిదంపూర్వమైన ఆలోచనల్తో కూడిన ఒక పరిశోధనా వ్యాసాన్ని జతచేశారు.

వ్యాసపు పూర్తిపాఠం పుస్తకం.నెట్ లో లభ్యం.

6. తెలుగులో కవితా విప్లవాల స్వరూపం


తెలుగులో కవితా విప్లవాల స్వరూపం
వెల్చేరు నారాయణ రావు (1978)

1974 లో నారాయణ రావు గారు ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పి.ఎచ్.డి. పట్టా కోసం రాసిన సిద్ధాంత వ్యాసాన్ని పొడిగించి 1978 లో పుస్తకరూపంలో ప్రచురించారు. అదే ఈ “తెలుగులో కవితావిప్లవాల స్వరూపం“. ఆ తర్వాత మరో రెండు ముద్రణలు అయ్యాయి. చివరిది 2009లో. ఎన్నో కోణాల్లో విప్లవాత్మకమైన రచన ఇది. అంతకు ముందు అలవాటుగా ఆచారంగా వస్తున్న సిద్ధాంత వ్యాసాల గ్రాంధిక భాషని తోసిపుచ్చి సరళమైన భాషలో రాయటమే కాదు, మరీ ముఖ్యంగా వాడే ప్రతి పదానికి స్పష్టమైన, నిర్ద్వంద్వమైన నిర్వచనాన్ని వాడారు. అంటే, వాడుక మాటలకి కవిత్వంలో వేరే అర్థాలు ఎలా ఉంటాయో అలాగే సాహిత్య విమర్శలో కూడ విమర్శకి సంబంధించిన విస్పష్టమైన అర్థాలు ఉండాలని ప్రతిపాదించి, ఆచరించి చూపారు. కనుక ఈ గ్రంథంలో మాటలు మామూలుగానే అనిపించినా వాటి అర్థాలు మాత్రం వాడుక అర్థాలు కావని వేరే సాంకేతికార్థాలు ఉన్నాయని మనం గ్రహించాలి. అలా గ్రహించి చదివితే తెలుగు కవిత్వం గురించిన విప్లవాత్మక ప్రతిపాదనలు ఎన్నో కనిపిస్తాయిక్కడ.

వ్యాసపు పూర్తిపాఠం పుస్తకం.నెట్ లో లభ్యం.

7. God on the Hill

వెల్చేరు నారాయణరావు, డేవిడ్ షుల్మన్ ద్వయం ఇటీవల వెలువరించిన మరోగ్రంథం God on the Hill: Temple Poems on Tirupati. దీన్లో పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య జీవన, సాహిత్యాల విశ్లేషణ, ఎంచి కూర్చిన 91 పదాలకు ఆంగ్లానువాదాలు వున్నాయి. ఇదివరకు వీరే When God is a customer అనే గ్రంథంలో అన్నమయ్య కృతుల్ని కొన్నిటిని అనువదించారు గాని అక్కడ ప్రాధాన్యత క్షేత్రయ్యది. ఇప్పుడు అన్నమయ్య కవిత్వం మీద ప్రత్యేక దృష్టి సారించారు.


గాడ్ ఆన్ ది హిల్: టెంపుల్ పోయెమ్స్(2004)
వెల్చేరు నారాయణ రావు, డేవిడ్ షూల్మన్

అన్నమయ్య పదాల్లో ఇప్పుడు మనకు దొరుకుతున్నవి కొన్ని వేలున్నాయి (ఆయన రాసినవి పదమూడు వేలని వాళ్ళ మనవడు చిన తిరుమలయ్య చెప్పినా అవన్నీ ఇప్పుడు దొరకటం లేదుట). వాటి నుంచి 91 ఎంచుకోవటం చాలా క్లిష్టమైన సమస్యే. ఆయన భావనా పరంపరలోని వివిధ అంశాలను స్పృశించే పదాలను ఎన్నుకోవటానికి మంచి ప్రయత్నం జరిగింది ఈ గ్రంథంలో. మూలాలు తెలియక పోయినా చక్కగా చదివి ఆనందించగలిగే అనువాదాలు అందించారు.

ఈ గ్రంథంలో అన్నమయ్య గురించిన అనేకమైన సందేహాలకు సమాధానాలు ఇవ్వటానికి ప్రయత్నాలు జరిగాయి. ఇది కూలంకష పరిశోధన అనను కాని ఇదివరకు అన్నమయ్య గురించి ఎవరూ వివరంగా చెప్పని ఎన్నో విషయాలను ఒకచోట చేర్చి అన్నమయ్య పుట్టిపెరిగి సాహిత్యసృష్టి చేసిన వాతావరణాన్ని పాఠకులకు పరిచయం చెయ్యటానికి లోతైన ప్రయత్నం జరిగిందిక్కడ. దీనికి ఆ ఏడుకొండలవాడి తోడ్పాటు కూడ బాగా వున్నట్టుంది – ఈ పుస్తకాన్ని ఆయనకే అంకితం ఇచ్చారు!

పూర్తి సమీక్ష ఈమాటలో; ఒక ఆంగ్ల సమీక్ష వెబ్‌లో.

8. Textures of Time


భారతీయ చరిత్ర రచన: శైలీలక్షణం(2004)

భారతీయులకు వలస పాలనకు ముందు చారిత్రక స్పృహ లేదు అనే మాట అబద్ధం. వారు చరిత్ర వ్రాసుకున్న పద్ధతి ఎంతో ప్రత్యేకమైనది. పాశ్చాత్య పరిశీలనకు కొరుకుడు పడనిది. భారతీయుల చరిత్ర రచనను ఎలా అర్థం చేసుకోవాలి అన్న ప్రశ్నకు సమాధానమే ఈ పుస్తకం. చారిత్రక పరిశోధనలను ఒక మలుపు తిప్పిన పుస్తకం అనడంలో అతిశయోక్తి లేదు. Textures of Time: Writing History in South India 1600-1800 (2001) పుస్తకానికి ఊహ ఎలా వచ్చింది, వ్రాయడం ఎలా జరిగింది, సంజయ్ సుబ్రహ్మణ్యం ఈ సంచికలో వ్రాసిన లేఖలో చదవండి. ఫిలిప్ వాగనర్ తన లేఖలో ఈ పుస్తకం ఎందుకు గొప్పదో వివరిస్తాడు. ఈ సంచికలో ఈ పుస్తకం మొదటి అధ్యాయం, చివరి అధ్యాయం అనువాదాలు కూడా ఇవ్వబడినాయి.

షెల్డన్ పోలాక్ వ్రాసిన విమర్శాత్మక సమీక్ష (హిస్టరీ అండ్ థియరీ, సంపుటి 46, అక్టోబర్ 2007) పిడిఎఫ్, అదే సంచికలో వెల్చేరు, షూల్మన్, సుబ్రహ్మణ్యం ఇచ్చిన వివరణాత్మక సమాధానం పిడిఎఫ్. ఈ రెండు వ్యాసాలు అసోసియేషన్ ఆఫ్ ఏషియన్ స్టడీస్ వార్షిక సమావేశాలలో భాగంగా 2006లో ఈ పుస్తకంపై జరిగిన ప్రత్యేక చర్చ నుండి వచ్చినవి. ఇదే చర్చలో భాగంగా రమ మంతెన వ్యాసం, క్రిస్ చేకూరి వ్యాసం కూడా ఈ సంచికలో పొందుపరచబడినాయి.

వెల్చేరు నారాయణ రావు ఇతర గ్రంథాలు


సిలబల్స్ ఆఫ్ స్కై (1995)
(సంపా.) డేవిడ్ షూల్మన్

వెల్చేరు నారాయణ రావు గౌరవార్థం 1995లో, డేవిడ్ షూల్మన్ సంపాదకత్వంలో Syllables of Sky: Studies in South Indian Civilization in Honour of Velcheru Narayana Rao అన్న వ్యాస సంకలనాన్ని విడుదల చేశారు. వేలూరి వేంకటేశ్వర రావు వ్రాసిన ఈ పుస్తక పరిచయం తెలుసా ఆర్కైవులనుంచి. ఈ సంకలనం గురించిన సంగ్రహ సమీక్ష వెబ్‌లో.

ఇంకా: Siva’s Warriors: The Basava purana of Palkuriki Somanatha (1990); When God is a Customer: Telugu Courtesan Songs by Kshetrayya and Others (1994); Classical Telugu Poetry: An Anthology (2002) review. How Urvashi was won (2009) పుస్తకం నుంచి రెండవ అంకం పిడిఎఫ్‌గా; Dolls wedding and other stories (2012) చాసో కథల అనువాదం; వెల్చేరు నారాయణరావు రచనల పూర్తి జాబితా.

[పుస్తకం.నెట్ – పూర్ణిమ తమ్మిరెడ్డి, సౌమ్య బాలకృష్ణలకు కృతజ్ఞతలు – సం.]