వెల్చేరు నారాయణ రావు: కొన్ని పరిశోధనా గ్రంథాల పరిచయం

1. A Poem at the Right Moment


ఎ పోయెమ్ ఎట్ ది రైట్ మూమెంట్ (1998)
వెల్చేరు నారాయణ రావు, డేవిడ్ షూల్మన్

పాశ్చాత్యులకి “రచన, దాని ప్రచారం” గురించి కొన్ని నిర్దిష్టమైన భావాలు గత నాలుగైదు వందల ఏళ్లుగా బలపడ్డాయి. ముఖ్యంగా, (అ) ఒక రచన వుంటే దాన్ని ఒకరు, లేదా కలిసి పనిచేసిన కొందరు, రచయితలు రాసి వుండాలి. (ఆ) ఒకే వస్తువు గురించిన రెండు భిన్న రచనలు వుంటే వాటిలో ఒకటి మాతృక, రెండవది దాని పుత్రిక ఐవుండాలి. (ఇ) కాలం ఏకముఖం, సరళం కనుక ప్రతి రచనకీ అది మొదలైన లేదా పూర్తయిన సంవత్సరం, వీలైతే తేదీ కూడ నిర్ణయించొచ్చు. (ఈ) ఒకసారి గ్రంధస్థమైన రచన స్థిరం, దానికి ఆ తర్వాత మార్పుండదు. అలాగే, విక్టోరియన్ భావాలుగా ఇంగ్లండ్ లో మొదలై ప్రపంచ దేశాలకి పాకిన వాటిలో ముఖ్యమైంది శృంగారం ఏహ్యమని, నాగరిక సంఘంలో రచనలు శృంగారాన్ని తాకరాదనేది.

మిగిలిన వాళ్లలాగే గత నూరూ నూట యాభై ఏళ్లలో భారతీయ ‘విద్యావంతులు’ ఈ భావాల్ని దిట్టంగా వంటపట్టించుకుని అనేకానేక వ్యక్తినిష్టమైన ప్రశ్నలు వెయ్యటం మొదలు పెట్టారు. మన సాహిత్యం గురించి కుతూహలం కలిగిన పాశ్చాత్యులు ఇదే చేశారు. రచనల గురించిన పాశ్చాత్య భావాలు ఆమూలాగ్రంగా నిస్సంశయంగా భారతీయ సాహిత్యం అంతటికీ సమంగా వర్తిస్తాయనే నమ్మకమే ఈ అనర్థాలన్నిటికీ మూలకారణమన్నది ఈ A poem at the Right Moment అన్న గ్రంథం వెలువరించే ఒక ముఖ్యమైన సిద్ధాంతం. భారతీయ సాహిత్య ప్రపంచం, అందునా దక్షిణభారతీయ సాహిత్యప్రపంచం దాని నియమాల ప్రకారం అది నడుస్తుంది. దాని సూత్రాలు దానికున్నాయి కాని అవి పాశ్చాత్యులు నిర్ణయించినవి కావు, చాలా పార్శ్వాల్లో వాటికి విముఖాలు. అలాగే, ఈ సాహిత్యం అంతా ఏకసూత్ర బద్ధమైంది కాదు. స్థూలంగా చూస్తే పుస్తకరూపంలో వున్న సాహిత్యానికి, మౌఖికప్రచారంలో వున్న సాహిత్యానికి చాలా మౌలికమైన భేదాలున్నాయి. మౌఖికసాహిత్యంలో ఒకభాగమైన చాటుసాహిత్యానిది మిగిలిన భాగాల్తో భిన్నమైన ఒకమార్గం. చాటుసాహిత్యానికి ఒక వ్యవస్థ వుంది. ఆ వ్యవస్థకి ఒక నిర్మాణం వుంది. ముందుగా ఇది గుర్తించి ఆ నిర్మాణదృష్టితో చూస్తే పైపైకి సమస్యల్లా కనిపించేవన్నీ మాయమౌతాయి. చాటుసాహిత్యపు అంతరంగ విన్యాసం సుందరం, సుమధురంగా దర్శనమిస్తుంది.

వ్యాసపు పూర్తిపాఠం పుస్తకం.నెట్ లో లభ్యం. ఈ పుస్తకం గురించిన సమీక్ష ఈమాటలో.

2. SrinAtha: The Poet Who Made Gods and Kings


ది పొయెట్ హూ మేడ్ గాడ్స్ అండ్ కింగ్స్
వెల్చేరు నారాయణ రావు, డేవిడ్ షూల్మన్ (2012)

ఒక సంప్రదాయ కవి గురించి, అందునా ఒక తెలుగు కవి గురించి, అంతర్జాతీయ పాఠకులకు, ముఖ్యంగా సాహిత్యపరిశోధక పాఠకులకు కుతూహలం కలిగించి ఆ కవి గురించిన మరిన్ని పరిశోధనలు జరిగేలా ప్రోత్సహించే గ్రంథం రాయటం, దాన్ని ప్రచురించే సాహసానికి ప్రఖ్యాత ప్రచురణకర్తల్ని సుముఖుల్ని చేయటం అసామాన్య విషయాలు. ఇలాటి బృహత్కార్యానికి సాహసించి సాధించిన నారాయణ రావు, షుల్మన్ ద్వయం అభినందనీయం. తెలుగు గురించి వారికి కొంతైనా అవగాహన ఇప్పుడిప్పుడే కలుగుతున్నదంటే దానికి కారణం నారాయణ రావు గారి కృషే. ఐతే ఇంకా ఈ దశలో సుదీర్ఘప్రయాణం సాగాల్సి వుందని ఇలాటి ఉదంతాలు తట్టిచెప్తాయి. కాని ఆయన ఇన్నేళ్ల అవిరళకృషి కొంతవరకు ఫలించింది అనటానికి ఇదిలా పుస్తకరూపంలో రావటమే సాక్ష్యం.

మనకు ఇద్దరు శ్రీనాథులున్నారు – శృంగార నైషథం మొదలైన గ్రంథాలు రాసిన పుస్తక శ్రీనాథుడు ఒకరైతే చాటు పద్యాలలో కనిపించే చాటు శ్రీనాథుడు మరొకరు. శ్రీనాథ సాహిత్యం మీద పరిశోధనలు చేసిన చాలా మంది పెద్దలు ఈ రెండు రూపాల్నీ కలగలిపేసి, వారిద్దరూ ఒకరే అని భ్రమించటంతో శ్రీనాథుడి మీద జరిగిన చాలా పరిశోధనలు ఈ రెండు పార్శ్వాల్ని సమన్వయం చేయటానికి చేసిన వ్యర్థ ప్రయత్నాలుగానే మిగిలిపోయాయి. చాటు శ్రీనాథుడి ప్రసక్తి కొంత చివర్లో వచ్చినా ఈ గ్రంథం పుస్తక శ్రీనాథుడి గురించి, గ్రంథస్థమైన ఆయన ప్రతిభాపాటవాల గురించి. దీనివల్ల ముందుగా శ్రీనాథుడి గురించి ప్రచారంలో ఉన్న కొన్ని అపోహలు తొలిగిపోతాయి. ఉదాహరణకి, శ్రీనాథుడి చివరిదశ చాలా దయనీయంగా గడిచిందనేది. చాటు సంప్రదాయపు శ్రీనాథుడు చివరిదశలో అన్నీ పోగొట్టుకుని దుర్భరజీవితాన్ని భరిస్తూఅమరపురికి ప్రయాణించాడు. కాని భౌతిక శ్రీనాథుడి అనుభవం ఇందుకు చాలా భిన్నంగా వుండివుండాలని ఈ పరిశోధకుల అభిప్రాయం. ఎందుకంటే ఆయన గ్రంథాల ఆధారంగా చూస్తే వయసు పైబడిన నాటి శ్రీనాథుడు కవిగా గుర్తింపు పొందటంలో మంచి ఉచ్ఛస్థితికి చేరుకున్నాడు. అంతేకాదు, అప్పటివరకు లేని ఒక తెలుగు రాజ్యం సరిహద్దుల్ని తన సాహితీవిజయపరంపరల్తో భౌగోళికంగా కూడ చూపించాడు. ఇది ముందుముందు కృష్ణదేవరాయలికి ఒక నమూనాగా పనికొచ్చింది.

వ్యాసపు పూర్తిపాఠం పుస్తకం.నెట్ లో లభ్యం.

3. Symbols of Substance


సింబల్స్ ఆఫ్ సబ్‌స్టన్స్ (1993)
వెల్చేరు నారాయణ రావు, డేవిడ్ షూల్మన్,
సంజయ్ సుబ్రహ్మణ్యం

పాశ్చాత్యులు భారత భూభాగపు చరిత్ర కోసం భారతీయ గ్రంథాల్లో వెదికినప్పుడు వాళ్లకి ఎన్నో సంకటాలు ఎదురయినయ్. దీనికి ముఖ్యకారణం అప్పటికి వాళ్లకు అలవాటయిన చారిత్రక ప్రమాణాలకు భారతీయ గ్రంథాలు లొంగకపోవటమే. దాంతో భారతీయ గ్రంథాల్లో వున్న విషయాల్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాక వాళ్లు చాలా తికమక పడ్డారు. చివరికి వాళ్లు చేసిన నిర్ణయం ఏమిటంటే భారతీయ రచయితలంతా కల్పన తప్ప నిజం రాసేవాళ్లు కాదని, ఇతర దేశాల నుంచి వచ్చి భారత దేశ పరిస్థితుల గురించి రాసిన వారి రాతలే భారతీయ చరిత్ర నిర్మాణానికి పునాదులు కావాలని. భారతీయ రచయిత రాసింది ఏదైనా ఒక విదేశీయుడి రాతలతో ఏకీభవిస్తే తప్ప అనుమానాస్పదం అయింది. ఈ ఆలోచనా ధోరణి ప్రభావం ఎంత పాదుకుపోయిందంటే, నూన్యెజ్ అనే పోర్చుగీసు వ్యాపారి స్వయంగా కృష్ణరాయల్ని చూసి అతనితో మాట్లాడానని రాయబట్టి సరిపోయింది కాని లేకుంటే చారిత్రక పరిశోధకుల దృష్టిలో కృష్ణరాయలు కూడ ఒక పుక్కిటిపురాణంగానే మిగిలిపోయేవాడు.

కృష్ణరాయలు అస్తమించాక తెలుగు సాహిత్యవనం విరగబూసింది నాయకరాజుల కాలంలో, ఇప్పటి తమిళనాడు ప్రాంతంలో. ఐతే పాశ్చాత్యుల భావజాలాన్ని, విక్టోరియన్ శృంగారవ్యతిరేక విలువల్ని బాగా వంట పట్టించుకున్న మన మేధావులు పదిహేడవ శతాబ్ది తొలినుంచి పందొమ్మిదో శతాబ్ది చివరివరకు వచ్చిన మూడు వందల ఏళ్ల తెలుగు సాహిత్యాన్నంతటినీ ఒక్క మూట కింద కట్టి “క్షీణయుగం” అనే ఒక ముద్ర వేసి చెత్తకుండీలో పారేశారు. అప్పుడు వచ్చిన కొన్ని గ్రంథాల్ని ban చేయించారు. దాన్ని గురించి మాట్లాడటమే పరువు తక్కువ పని కింద భావించి వదిలేశారు.

ఈ ఆలోచనా ప్రవాహానికి ఎదురీదటం సామాన్యమైన విషయం కాదు. ఐతే ఆ పని చేశారు నారాయణ రావు, షూల్మన్, సుబ్రహ్మణ్యం. ఆ పరిశోధనల నుంచి తయారయిందే Symbols of Substance అన్న ఈ గ్రంథం. 1992లో ప్రచురితమైన ఈ పుస్తకం దక్షిణ భారత చరిత్ర గురించిన అంతర్జాతీయ పరిశోధనల్ని ఒక ఊపు ఊపింది. సాహిత్యగ్రంథాల్లో ఉన్న అన్ని విషయాలు సర్వత్రా అనుమానాస్పదాలు కావని, సరిగా పరిశీలించి విశ్లేషిస్తే సమాజస్వరూపాన్ని వాటినుంచీ గ్రహించవచ్చనీ నిరూపించింది. ఈ జటిలమైన శోధనకి ఈ రచయితలు ఆనాటి తెలుగు, సంస్కృత, తమిళ, పోర్చుగీస్, ఆంగ్ల, ఫ్రెంచ్ రాతల్ని ఆపోశన పట్టి చేసిన కొన్నేళ్ల కఠోర పరిశోధనల్ని నిగ్గుదీసి ఈ గ్రంథంలో పొందుపరిచారు. విప్లవాత్మకమైన భావాల్ని ప్రతిపాదించారు.

వ్యాసపు పూర్తిపాఠం పుస్తకం.నెట్ లో; ముందుమాట ఈ సంచికలో.

4. Girls for Sale

“కన్యాశుల్కం” గురజాడ అప్పారావు గారి అద్భుతసృష్టి. తెలుగు సాహిత్య విమర్శా రంగంలో ఈ రచనకి వెచ్చించినన్ని పేజీలు గాని, దీనిపై రాసినంత మంది కవి/విమర్శకులు గాని, దీనిమీద జరిగినంత (ఉ)పరిశోధన గాని, దీనికి కలిగినంత గుర్తింపు గాని ఇంక ఏ తెలుగు రచనకీ దక్కలేదు. కొందర్ని గిరీశం పాత్ర, ఆ పాత్ర భావాలు, భాష గిలిగింతలు పెడితే, మరికొందర్ని నాటకంలో వాడిన అచ్చమైన వాడుకభాష తబ్బిబ్బు చేసింది.


గర్ల్స్ ఫర్ సేల్ ( 2007)
వెల్చేరు నారాయణ రావు

ఇంతచేసీ, అసలీ “కన్యాశుల్కం” నాటకం ఏం చెప్తున్నది? దీన్లో చిత్రితమైన సమాజ స్వరూపం ఎలాటిది? ఈ నాటకం లోని భావాలు ఆ నాటి సమాజానికి, అప్పటి కన్యాశుల్క సమస్యకి పరిమితం కాకుండా ఈనాటి పరిస్థితులకి ఏమైనా వర్తిస్తాయా? లాటి మౌలికమైన ప్రశ్నలకి మాత్రం తార్కికంగా వివరించబడ్డ స్పష్టమైన సమాధానాలు దొరకవు. 1999 లో ప్రచురితమైన “కన్యాశుల్కం: నూరేళ్ల సమాలోచనం” అన్న 933 పేజీల భారీగ్రంథం చూస్తే కన్యాశుల్క నాటకాన్ని అర్థం చేసుకోవటంలో ఎంతమంది పెద్దలు ఎన్ని విధాలుగా ఎంతెంత గందరగోళానికి లోనయ్యారో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

నారాయణ రావు గారి Girls for sale గురజాడ రెండవ ముద్రణ కన్యాశుల్కానికి ఆంగ్లానువాదం. అనువాదంతో పాటు లోతైన పరిశీలనల్ని, ప్రపంచసాహిత్యంలో ఈ రచనకి ఉన్న ప్రత్యేకస్థానాన్ని తార్కికంగా, విపులంగా వివరిస్తూ ఒక పెద్ద వ్యాసం కూడ జతకూర్చారు. ఈ పుస్తకం 2007 లో వచ్చినప్పుడు ఇండియాలోని కొందరు సమీక్షకులు అనువాదంలో లోపాల్ని వెదకటంలో చాలా విశేషమైన కృషి చేశారు. కొందరు Girls for sale అనేది “కన్యాశుల్కం” అన్న పదానికి సరైన అనువాదం కాదన్నారు, మరికొందరు మూలంలో వున్న వాడుకభాష మెరుపులు అనువాదంలో రాలేదన్నారు. ఈ రంధ్రాన్వేషణలో తిరిగి తిరిగి అలిసిపోయి వారెవరూ ధ్యాసగా వ్యాసం చదివే ఓపిక చేసుకోలేకపోయారు, నాకు తెలిసినంతవరకు.

నామట్టుకు నాకు ఈ పుస్తకానికి ఆయువుపట్టు అనువాదం తర్వాత వున్న సుదీర్ఘమైన విశ్లేషణా వ్యాసం. నారాయణ రావు గారి విశ్లేషణ ప్రకారం అప్పారావు గారి దృష్టి భిన్నమైంది. ఆయన ఈ నాటకంలో చిత్రించిన సమాజం కుళ్లిపోయింది కాదు, చక్కగా హాయిగా వున్నది. అంతేకాదు, ‘ఆధునిక’మైంది కూడ. ఈ ఆధునికత వలససంస్కృతి వల్ల కలిగిన ఆధునికత కాదు, అంతకుముందు ఎప్పటినుంచో వస్తూ వున్న ఆధునికత. ఇందులో మనుషులు సంప్రదాయాల భారంతో కుంగిపోతున్నవారు కారు, మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా, తమకు ఏం కావాలో దాన్ని ఎలా సాధించుకోవాలో స్పష్టంగా తెలుసుకుని ఆచరిస్తున్న వాళ్లు.