అయినా సరే…

అకారణంగా
అకాలంగా
అన్నీ నీచుట్టూ తిరుగుతుంటాయి

అవసరం అన్నీ నేర్పుతుంది
ఇప్పుడు నీకు యుద్ధం అవసరం

లోకం కత్తులబోను
ఒడిసి పట్టుకొ
పూలబాట

ఆకాశం మసకేయొచ్చు
ఖగోళం కన్ను ముయ్యదుగా
విఫలం
సఫలతకి పురిటినొప్పి

రేపటి సూర్యుడు
నీలో ఎక్కడో దాగి ఉంటాడు
నాకు తెలుసు
నీ కుదురులేని క్షణాలు
నిద్రలేని రాత్రులు
నీ దిక్కులేని బతుకు

అయినా సరే…
లేమి నీ బలిమి.